22, ఏప్రిల్ 2015, బుధవారం

త్రాగి త్రాగించాలి.

  త్రాగి త్రాగించాలి . పలికి పలికించాలి .( సూర్య శ్రీరామమ్ )

 'పిబరే రామ రసమ్:"   అన్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి  వారు .వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం వ్రాసి దానిని అమృత కలశం గా చేసి అపురూపంగా అందరికి అందకుండా చేశారు.ఆ అమృతం ఆస్వాదిమ్చాలంటే సంస్కృత పాండిత్యం కావాలి మరి ఆ భాష రాని వారి స్థితి ఏమిటి . అమృతం వారికి అవసరం లేదా . దీనికి సమాధానంగా ఎందరో మహానుభావులు తెలుగులో పద్య, గద్య, చంపు , కీర్తన , అను అనేక రీతులలో మకరందాన్ని వారనుభవించి సామాన్యులకును అనుభవింప జేశారు . అమృతం ఎవరు  త్రాగితే ఆ రుచి వారికే తెలుస్తుంది . అందుకే నేను ముందు త్రాగి , నా శిష్యులచే , సాహితీ మిత్రులచే , హితులచే , సన్నిహితులచే  రామామృతం త్రాగిమ్చాలని , ఆశించాను . అమృత భాండమును వంచి కొన్ని బిందువులను త్రాగి , జీర్ణించుకొని , తెలుగు పలుకులలో , కొంత తేట పరచి , పంచి , ఆనందించాలనే నా తపన . తిక్కన గారు  " మధుర పదార్ధాన్ని , ఒంటరిగా తినరాదు, త్రాగరాదు. అడవులలో ఒంటరిగా నడువరాడు " అని చెప్పారు . అందుకే నేను మహర్షి పదములను , పాదములను  ఆశ్రయించి , అనుకరించి , అనుసరించి , నా జన్మ ధన్యమగునట్లు చేసుకొంటున్నాను . అందుకు కరదీపికలుగా  , మాన్యులు , డా, యం. కృష్ణమాచార్యులు గారు, డా. గోలి వెంకట రామయ్య గారు వ్రాసిన అనువాద గ్రంధము ఉన్నది  . వారికి నా కృతఙ్ఞతలు . వారి ఆశీస్సులతో కొన్ని తెలుగు పలుకులు పలికి , మాతృభాషాభిమానాన్ని చాటుకుందామని అనుకొంటున్నాను .  " బాణోచ్చిస్టం  జగత్ సర్వమ్ " అన్నారు పెద్దలు . ఈ రామ రసాన్ని (క్లాసులలో ) గ్లాసులలో పోసి అందరికి అందించాలని నా కోరిక.
   తొలి తెలుగు తొక్కు పలుకులను నాచే ముందుగ పలికించిన నా తలిదండ్రులకు  ఈ గ్రంధమును అంకితము చేయుచున్నాను . తరువాత నా పలుకులను సాహితీ ములుకులుగా ,, తీర్చి దిద్దిన ప్రతి ఒక్క గురుదేవునకు సాష్టాంగనమస్కారములు చేయుచున్నాను .
                        బుధజన విధేయుడు . పొన్నెకంటి .

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

ప్రపంచ మాతృ భాషా దినోత్సవం , 21.02. 2015




ప్రపంచ మాతృ భాషా దినోత్సవం , 21.02. 2015
తుర్క యామ్జాల్ లోని  జ్ఞానోదయా విద్యా నికేతన్ , వార్షికోత్సవము సందర్భముగా  వ్రాసి చదివిన పద్యాలు . 
                                                              తెలు(గు వాడు 
1. సీ . తిక్కన్న కవితలో తియ్యని మధుధార 
                                తనివిదీరని భంగి త్రావుచుండ
          పోతన్న భక్తిలో పూర్ణ త్వమున్బొన్ది 
                                   సతతంబు హరి సేవ సల్పుచుండ
           పొన్నగంటి వారి చెన్నైన తెను(గులో 
                                     అచ్చ తెను(గు కావ్య మలరుచుండ
          శ్రీనాధు సీసాల శేషంబు నుంచక 
                                    గుట గుట త్రాగంగ కోరుచుండ 
     తే . గీ. తెల్గు వానికి లోటేమి తెల్పుమయ్య 
               తిక్కనార్యుని, శ్రీనాధు తీరులన్ని 
               పొన్నగంటితో కలగల్పి పొదివి పొదివి 
               ముద్దు మురిపాల తెలు(గున మురియగలరు. 
సీ.  గళ మెత్తి, కలమెత్తి గంభీర భావాలు 
                          పదిమంది నెదిరించి పల్కువాడు!
     నమ్మిన సత్యంబు నవనిదులిచ్చినా 
                          వదలని ధీరుండు వజ్ర సముడు!
      ధర్మ పాలనమందు దారిద్ర్యమొచ్చినా 
                          హ్లాదాన జీవంబు నందువాడు! 
తే.గీ. వాడి గల్గిన పలుకుల వరలువాడు 
        ఒంటి పోరుకు నెదురొడ్డి ఓర్చువాడు 
        మిన్ను మన్నును లీలగా మెదపువాడు 
       తెలుపవలెనా! యింకను తెలు(గు వాని! . 
తెగీ.  దేశ దేశములందున ధిషణ జూపి 
        తనదియైనట్టి శైలిన తనరుచుండి 
        తెలు(గు వెలుగులు  విశ్వాన తేట పరచి 
        కీర్తి కాంతను చేబట్టు మూర్తి యితడు! .    


20, జనవరి 2015, మంగళవారం

బాల భావన శతకం. గురించి

బాల భావన  శతకం. గురించి                                                                                                             రామకృష్ణా రావు గారు జగమెరిగిన చిత్రకవి, విచిత్ర కవి. వారి భావనలు మధుర మనోహరాలు సుకుమారాలు , సమాజ చైతన్య స్పోరకాలు. వారు నన్ను సోదరునిగా భావించి తాను వ్రాసిన  బాల భావనలు అను శతకానికి అభిప్రాయం వ్రాయమనుట  చాలా సంతోషంగా ఉన్నది.. బాల బాలికలు మనకు అన్ని భావాలు  పైకి చెప్పరు కాని  చాల సున్నితం గ ఆలోచిస్తారు. రావు గారు వారిలో( పిల్లల్లో )  దూరి వారి  స్థాయిలో , శైలిలో చెప్పిన పద్యాలు ఆణి ముత్యాలు. నేటి సమాజానికి ఏది కావాలో అదే చెప్పారు. 4 వ పద్యంలో . ముద్దు చేసి మాకు హద్దులు నేర్పరు-----. హద్దు మీర మమ్ము గ్రుద్దుదురయ.--- హద్దు లెల్ల నేర్ప శ్రద్ధ గా నేర్వమా ----పెద్దలారజ్ఞాన వృద్దు లార . . అంటూ  ఆడుతూ పాడుతూ ఆట వెలదులలొ చెప్పారు . మొక్క అయి వంగనిది మ్రానై వంగునా అనే ప్రాచీన సూక్తి యిందులో దాగి ఉన్నది. ముద్దు హద్దు మీర రాదనే విషయం నిత్య సత్యం.    
           7 వ పద్యం లో .  పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి -----పలుకునటుల జేయ పలుక గలము ---పద్యమొక్కటైన పలుక నేర్ప రదేల.  అంటారు. నేటి భాషామతల్లి అందున తెలుగు భాష ఈ విషయం లో ఏటికి ఎదురీదుతున్నది. వీలయినంత వరకు పిల్లలకు తెలుగు పలుకుబడి బడి లోనే కాక యింటిలో కూడా నేర్పాలి. ముఖ్యంగా అమ్మే యీపని చేయాలి. ఆనాడే భారత మాతృ.హృదయం సంతోషిస్తుంది .అమ్మఒక శతకం చదివితే పిల్లలకు చెప్పినట్లే . ఎంత సమాజ స్పృహ . ఇది అందరికి రావాలని కవి గారి తపన. 
           9.వ పద్యం లో . మాకు నచ్చు విద్య మమ్మన్దుకొనీక------మీకు నచ్చుదాని మాకు పులుమ -----మాకు రాక పోవు మాదోషమా యిది . ------- నిజమే మనకు నచ్చిన పనిని చాల సులువు గ చేస్తాము . నచ్చని పని కేవలం పరుల కొరకే . ఈనాడు  చాల మంది విద్యార్ధులు పడుతున్న పట్లే యివి. వారికీ స్వేఛ్చ యివ్వాలని కవి సూచన బాలల పట్ల సద్భావన . 
          ఇలా ఎన్నో సుకుమార సుందర భావాలతో సమ సమాజ నిర్మాణానికి , దేశ సమైక్యతకు పునాది రాళ్ళు అయిన బాలలకు , మంచి సూచనలతో శతకం వ్రాసిన  రామ కృష్ణారావు గారు మిక్కిలి అభినంద నీయులు. 
                                           సారస్వత సహోదరుడు. పొన్నకంటి సూర్య నారాయణ రావు.  భాగ్యనగరం. .  

28, నవంబర్ 2014, శుక్రవారం

తెలుగు పలుకు, ఘనతకు కారణాలు.

 తెలుగు వెలుగులోకి రావాలంటే తెలుగు వచ్చిన ప్రతివారు మౌనం విడనాడాలి . తెలుగుకు వెన్నుదన్నుగా నిలవాలి. తమ వంతు సహాయం చేయాలి .

 తెలుగు పలుకు పలికి దేశాల  వినిపించి 
 తెలుగు పద్య మనుచు తేనె లొలికి 
 తెలుగు వారి ధీర తేజంబు జూపుచు 
 వెలుగు మోయి సతము వేయి నాళ్ళు 

 
మన మాతృభాష గొప్పదనుటకు ౠ. బావగారు(సత్యనారాయణ గారు) పంపిన ఆంగ్లమునకాంధ్రానువాదం.1. క్రీ.శ. 400సం.ల.నుండి తెలుగు ఉన్నట్లు తెలుస్తున్నది. 2. తెలుగు లిపి అంతర్జాతీయ అక్షర మాలా సంఘముచేత 2012లో ఉత్తమ రెండవ లిపిగా ఎన్నుకో బడినది.(కొరియా కు 1వ స్థానం)3. తెలుగు భాషోచ్చారణ వలన 72000నాడులు స్పందిస్తాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. 4. శ్రీలంకలో ని జిప్సీ అను తెగవారు ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. 5. మయన్మార్ లో తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి.6. ఈభాష ఇటాలియన్ భాష వలె అచ్చులు చివరగా ఉండుటచే భాషాపరిషోధకుడైన "నికోలో డి కాంటి" తెలుగు ను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అన్నారు. 7. ప్రపంచ మానవజాతి విషయ సేకరణ శాస్త్రవేత్తల జాబితా ప్రకారం దేశ పరిధిలో 3వ దిగా , ప్రపంచ పరిధిలో 15 వదిగా లెక్కించారు. 8. భారతదేశంలో ని నిజాం లోని కాళేశ్వరం, రాయలసీమలో ని శ్రీశైలం, కోస్తాలో ని భీమేశ్వరంలోని మూడు శివలింగముల మధ్య వారు మాట్లాడే భాష కనుక దీనిని త్రిలింగ,తెలుగు, అని పిలువబడుతున్నది..9. తూర్పు దేశ ప్రాంతంలో అజంతంగా మాట్లాడే భాష తెలుగు.10. ఎక్కువ సామెతలు న్న భాష తెలుగు. 11.పూర్వము కూడ తెలుగు,తెనుగు,తెనుంగు అని పిలిచేవారు. 12. రవీంద్రనాధ్ఠాగూర్ కూడ దేశభాషలందు తెలుగు తీయనిదన్నారు. 13. 200 సం.ల క్రితం 400 మంది మారిషస్ కు బానిసలుగా పంపబడితే వారి వారసులలో ఒకరు ఇప్పటి ప్రధాని. 14. 40 సంస్కృత శ్లోకాలు (రామకృష్ణ విలోమకావ్యం) మొదటినుంచి చివరకు రామాయణం, చివరినుండి మొదటికి భారతం ఉంటుంది. ఇలా మరే భాషలో లేదు. 15. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళములోని ఆంధ్రమహా విష్ణువు ను భక్తి శ్రద్ధలతో ధ్యానించి వారి ఆదేశానుసారం "ఆముక్తమాల్యద"ను వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని తెలిపి ఆ భాషను ఆధికారికం చేశారు. 16. తెలుగు భాషలో మాత్రమే ఏకాక్షరి పద్యములున్నవి. .....జై తెలుగు, జైజై తెలుగు భాషాభిమానులారా! నమస్సుమాంజలులు.... పొన్నెకంటి.

19, నవంబర్ 2014, బుధవారం

అవధాన రాజధానీ ,నిషిద్ధాక్షరి, గీతం.

        ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ 

.           ఈ కార్యక్రమం మహోన్నతంగ  భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగరం లో  ద్వి సహస్రావధాని ,డా . మాడుగుల నాగ ఫణి శర్మ గారి చే నిర్వహించబడింది . పృచ్చకులసంఖ్య 250.  ఉత్తర,దక్షిణ  ప్రాంత సంస్కృత కవులు , పండిత ప్రకాండులు కళాకారులు , రాజకీయ నాయకులు  ఎందరో పాలుపంచుకొన్నారు ఎందరో మహాను భావులు . అందరికి వందనాలు .  . 
   
  దీనిలో ముఖ్యముగా 1. సమస్య . 2. దత్త పది . 3. నిషిద్ధాక్షరి 
4. వర్ణన  5 . అశువు   6. మీమాట ..నా పాట . 7. నృత్య పది . 
8. స్వర పది . 9. చిత్ర పది.అనే  అంశాలు ఉన్నాయి. 

అన్ని అంశాలు మనోహరం గ మనో రంజకం గ సాగినవి. నేను 

నిషిద్ధాక్షరి లో పాలు పంచుకొన్నాను నిషిద్ధాక్షరి అవధాని గారికి  పృచ్చకునకు మధ్యన జరిగే సాహిత్య (తో )రణం.  దీనిని 
పద్య రచన చేయగలిగిన వారు మాత్రమే ఆనందించ గలుగు తారు. 
తదన్యులు ప్రయత్న పూర్వకముగా ఆనందించగలరు . 

   సాధారణం గ అవధాని పద భాండాగారము . పదకొశమును యెదలో నిత్యం మననము చేస్తూఉంటారు  అందువలన  పై చేయి వారిదే నిస్సందేహంగా . ఇందు  పృ చ్చకుని పద, పద్య , భావ పాండిత్యము , కూడా పని చేస్తుంది . దాని వలన అవధాని గారిని కొంత వరకు యిబ్బంది పెట్ట వచ్చు . 

విషయము .     సంగీతము . రొగనిర్మూలన కారిణి . 


 కంద పద్యము .  ( పాద ప్రారంభములో యతి ఉంటుంది కనుక అవధాని గారే ప్రారమ్భిస్తారు. )

కం    (అవధాని గారు ) భో గా () ( నిషేధం) ( ఆవ  ) ( నిషేధం) ( ఆవ ) సం ( నిషేధం ) మీ ( ఆవ)రా (నిషేధం ) గా ( ఆవ) త్రం ( నిషేధం ) నం ( ఆవ)

    (ఆవ) బాగా  న (నిషేధం )ధం ( ఆవ) తె ( నిషేదం  ) జె ( ఆవ) వి ( నిషేధం) ప్ప ( ఆవ) వి (నిషే )రో ( ఆవ )
       గా (నిషేధం ) (ఆవ) సాం  ( ఆవ) యతి స్థానం కనుక వారె ప్రయోగం . ( నిషేధం ) ( ఆవ) ము (నిషే)
       ర ( ఆవ) స్థి (నిషే) ( ఆవ) (నిషే) తి ( ఆవ) గా (నిషే ) యౌ (అవధాని )

కం .భోగాయతమీ గానం , బా గాధం జెప్ప రోధసాంతరదతియౌ

 (ఈ రీతిగా రెండు పాదములు నిషేధ, నిక్షిప్తాలతో సాగినది.  మిగిలిన రెండు పాదములు ఈ విధం గ ఊహించి వ్రాయడమైనది . )

   రాగార్చితంపు దైవము , సాగున్ వైద్యంబు పగిది స్వాస్త్యము  గూర్పన్

అవధాన   రాజధాని బ్రహ్మశ్రీ నాగ ఫణి శర్మగారి చేత విజయవంతమ్ చేయబడినది. నేను నిషిద్ధాక్షరిలో పాల్గొన్నాను . చాలా  చక్కని  పద్యం  వచ్చింది . 

విషయం ..  సంగీతం .  రోగ నిరోధకం . 

కం .  భోగాయతమీ గానం 
        బాగాధం జెప్ప రోధసాంతర దతియౌ . ( ఈ రెండు పాదములు నాగఫణి గారు చెప్పినవి )
        రాగార్చితంపు దైవము , 
        సాగున్ వైద్యంబు పగిది సౌమ్యత గూర్పన్. ( ఈ రెండు పాదాలు నేను ఊహించి వ్రాసినవి )

నాగఫణిశర్మ గారిని అభినందిస్తూ వ్రాసిన గీతమ్.

పల్లవి ..  నలువ రాణి పాదమణి   , నాగఫణి  మీరు  . 
             పలుకులమ్మ పనుపున , నిల దిగిన సౌరు. 

చరణమ్ .రాజధాని నంత రస రమ్యం జీసి  
             కళల సారమెంతెంతో కలగలుపుగ నేసి
             అసమానపుటనురాగం అందరకు పంచి 
             కవి, పండిత, చిత్రకార,గాయకాళి రప్పించి .               
                                      
                                     నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.

ప.         దిల్లి ప్రభుత కవితకున్న ప్రాముఖ్యం దలచి 
            తల్లివోలె తపన తోడ తనవద్దకు పిలచి 
             వినిపించెను వినువీధిని విమల తెలుగు కవిత 
             వ్యాపించును తరతరముల జిలుగు వెలుగు భవిత .
      
                                   నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

చ.        క్రొత్త పుంత  త్రొక్కుట క్రొత్త మీకు కాదు . 
            అవధానము , ధారణంబు  వింతేమి కాదు . 
            కుంచె వెంట కూర్చుపదము కోరుకున్న కూర్మిపధము 
            నృత్త పదము , నృత్య పదము నవ్య పధం మీకు .      
                       
                                నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

ప.       సంస్కృతంబు , రాజ భాష  సవరించిన గళము 
           ప్రకటించును స్వారస్యము మీదు పొన్ను కలము 
           కవిత మీకు బలము , రసము మాకు ఫలము 
           నవ రసాలు చిలుకుటే నవ్య వరము మాకు .

                                నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

                              
     




       





15, అక్టోబర్ 2014, బుధవారం

విశ్వ ప్రయత్నమే విజయ హేతువు .

                                విశ్వ ప్రయత్నమే  విజయ హేతువు .                                                                                      ఈ రోజు నాకు చాలా  సంతోషం గా ఉన్నది . రాధి వాళ్ళ టాబ్ నుండి తెలుగులో టైప్ చేస్తున్నాను . సాధనే సర్వతో ముఖ విజయ హేతువు . కిరణ్ పుట్టిన రోజు సందర్భం గా ఒక ఫోటో మీద వాడికి  శుభాకాంక్షలు పంపా ను . అది  వాడికి చాలా బాగా నచ్చింది . ఈ టాబ్ లో చాలా సమయం వరకు తెలుగులో టైపు చేయటానికి రాలేదు . అయినా నా ప్రయత్నం వదల లేదు . విశ్వ ప్రయత్నమే
 విజయ హేతువు . 

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామీ ఆలయ దర్శనం . ది 30.. 14

             బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామి  ఆలయ దర్శనం .ది 30.09 . 14 

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రవేశం ఒక ప్రత్యేక మైనది . తాండూరు లోని 
ద్వాదశ శివ క్షేత్రం సుప్రసిద్ధము  . ఎందుకనగా పరమ శివుని దర్శించటానికి 
భక్తులు కొంత దూరం నీటి లో నడవాలి . ఆ నీరు షుమారు రొమ్ముబంటి ఉంటాయి . ఇష్టమైన  వారు నీటిలో వెళ్ళుట , అలా వీలుకాని వారు వేరే విధం గ వెళ్ళుట జరిగి మొత్తానికి శివ దర్శనము చేసికొన వచ్చును, 
               
కాని బీదర్ లో మాత్రం తప్పక నీటిలో వెళ్లి మరల నీటిలో నుంచే రావాలి. ఆ నీరు మొలబంటి ఉన్నాయి .వయసు యెంత అయిన ఎవరికి వారికి రొమ్ము బంటే నీరు వస్తాయట . అదే నరసింహ స్వామి మాహాత్మ్యమట . కాని ఈ రోజు మాత్రం నీరు కటి బంటి  మాత్రమె ఉన్నాయి .  ఏ రకమైన యిబ్బంది లేకుండా మేమందరము  స్వామిని దర్శించుకొని వచ్చాము . చాల ఆనందం గ ఉన్నది. 101 అంటి గారి భర్త గారిని కూడా జాగ్రత గ తీసికొని వెళ్లి తీసికొని వచ్చాను. ఆయన ఉబ్బసము తో బాధ పడుతున్నారు . కాని వెళ్లి రావటం లో ఏ యిబ్బంది పడలేదు . 

బోసుదంపతులకు ఆశీస్సులు. 6.05.2026.

 జీ.బోసు గారి 49వ వత్సర వివాహ మహోత్సవము.           శీర్షిక.. మూడుముళ్ళు. సీ. జీవితమంతయున్ కష్టసుఖాలలో        ముంచితేల్చుచునుండు మూడుముళ్ళు  ...