పద్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పద్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, సెప్టెంబర్ 2019, సోమవారం

గణపతి కి మంగళహారతి.

                          గణపతి కి మంగళహారతి.
   అంబాసుతునకు లంబోదరునకు మంగళమనరే మానినులారా!
   ఆదిపూజ్యుడై యఖిలజగముల హర్షమునింపే యమలమూర్తికి
   విశ్వమునందలి విఘ్నములన్నీ వేడినడుల్చే విఘ్నరాజుకి. "అంబా"
   తల్లిపార్వతి ముఖపద్మంబును వికసనజేసే విష్ణునేత్రునకు
   నెమలివాహనుని నేర్పున గెల్వబుద్ధిబలమునుజూపినవానికి."" .
   గరిక పూజకె ఘనమనితలచి వరములనిచ్చే వక్రతుండునకు
   కుడుములుండ్రాళ్ళు కోరిభుజించి ముదమునుజెందే మోదక
                 ప్రియునకు......."అంబాసుతునకు."

       ఫేస్ బుక్ లో.వృక్షము.ఛాయ..పై స్పందన.

   ఒంటరినన్నభావనయె యోనరుడా యిసుమంతయేనియున్
   కంటికికానరాదెపుడు కమ్మనిపండ్లకునాలవాలమై
   యుంటను సర్వజీవులకు నూర్జితసేవలజేయుచుండుటన్
   మింటిప్రమాణమైయెదిగి మించిన పచ్చదనంబు పంచుటన్.
                              సౌందర్యమంటె ఇది.
  సౌందర్యభరితాలు స్వామి కన్నులుజూడ
                    జగముల కాపాడు జనకుడగుట
  సౌందర్యభరితాలు స్వామి పాదంబులు
                      పతితోద్ధరణులకు భవ్యుడగుట
  సౌందర్యభరితాలు స్వామి హస్తంబులు
                     వరములగురియించు వరదుడగుట
  సౌందర్యభరితాలు స్వామి పల్కులు జూడ
                      అమృతపు సోనలై యలరుకతన
  సౌందర్యభరితాలు స్వామి నవ్వులు జూడ
                      మురిపాల పువ్వులై విరియుకతన
  సౌందర్యభరితాలు స్వామి చేష్టలు జూడ
                      ధర్మంబు కాపాడు తపనవలన
  సౌందర్యభరితాలు స్వామి పుట్టుకలెల్ల
                       భక్తుల రక్షించు బాధ్యుడగుట
  సౌందర్యభరితాలు స్వామి కల్పనలెల్ల
                        సృష్టించి చేపట్టు చేవవలన
    పూర్ణ సౌందర్యమూర్తి  సమ్మోహనుండు
    శ్రీ హరి యొకడె చూడంగ చిత్తమందు
    ధ్యాన మగ్నులు కారండి ధన్యులార!
    అసలు సౌందర్యమన్నను నతనియంశ.

     సీ: పక్షుల కిలకిలల్ పసిపాప నవ్వులు
                         పాడిపంటలసౌరు పల్లెటూళ్ళు
          శిల్పాలు చిత్రాలు చిన్నారి నడకలు
                          కొండలు గుట్టలు కోనలెల్ల
         పచ్చని వృక్షాలు పరువంపు కన్నెలు
                          ప్రకృతియందాలు పాఱునదులు
         అందమై కనిపించి ఆనందమిచ్చుగా
                          మానవాళికెపుడు మనసులోన
 తే.గీ: శాశ్వతంబులు గావవి సంతతంబు
          భ్రమనుగల్పించి యూరించి బాధపెట్టు
          ఒక్క పరమాత్మ భావనన్నొడిసిపట్ట
          అందెయగుపించు సౌందర్యమద్భుతముగ.
             

14, జులై 2019, ఆదివారం

రామాయణం కుడ్య చిత్రాలు

ధర్మవరం.రామాయణ కుడ్యచిత్రాలు.

 ది.26.02.2018. యశ్వంత్ పూర్ నుండి కాచిగూడ యక్స్ ప్రెస్ లో ప్రయాణం. అది బయల్దేరవలసిన సమయానికన్నా(మధ్యాహ్నం2.30,) 1గం. ముందే స్టేషన్ కు చేరాము. రైలు బయల్దేరగా స్టేషన్ లు వరుసగా వెనుకకు వెళ్ళిపోతున్నాయి మాకు వీడ్కోలు పల్కుతు. క్రాసింగ్ కారణం కాబోలు ధర్మవరంలో రైలు ఎక్కువసేపు ఆగింది. చూపులు పరిసరాలను నిశితంగా వెదుకసాగాయి. ఆశ్చర్యంగా కొన్ని కుడ్యచిత్రాలు దూరంగా కనబడ్డాయి. మరి మనం పరిశీలించకుండ ఉండగలమా? గుడ్లుపెద్దవి చేసి చూస్తే గుట్టు బయటపడింది అది రామాయణమని. ఇక మనసు పులకించి కోతిగంతులు వేస్తు ఛందోశాఖలనాశ్రయించి చిత్రభావాలను , చరితమూలపురుషులను నెమరువేసుకొంటు మధురఫల రసాల నాస్వాదించింది. వాటిఫలితమే ఈ పద్యాలు. మీకు కూడ.

    తే.గీ.  ధర్మ వరమును రైలులో దాటుచుండ
              రామసత్కధా పరిపూర్ణ రమ్య కుడ్య
              చిత్రజాలంబు జూచితి చేష్టలుడిగి.
              ధన్యమైనవి కన్నులు తలపులపుడు.

  ఉ. ధర్మమె మారురూపమయి ధర్మమె నిత్యము సాధనంబుగా
       కర్మలనాచరింప ఘన కంటకదూషిత కాననంబులన్
       నిర్మల చిత్తుడైదిరిగి నీతివిదూరుల నేలగూల్చి ఆ
       మర్మము విప్పిజెప్పు పరమాత్ముని శ్రీరఘురాముజూచితిన్.

  ఉ. లంకను జేరనీయనని లంఖిణి భీషణ క్రూరరక్కసై
       బింకముతోడదేహమటు పెంచుచుదూకుచు మ్రింగబోవ ని
       శ్శంకత సూక్ష్మరూపియయి చక్కగ నాస్యములోనికేగి ఆ
       వంకనె వచ్చినట్టిఘనవానర ముఖ్యుని నేనుగాంచితిన్.
   
  తే.గీ. రాముచెంతనె సీతయు రమ్యగుణుడు
          లక్ష్మణుండట భాసిల్లె లక్షణముగ
          ధర్మ వరజన పుణ్యంపు మర్మమేమొ
          నిర్మలంబౌచు సత్కీర్తి నింగినంటె.
       
   తే.గీ.ధర్మబద్ధంపు మనుగడ ధైర్యమిచ్చు
           అర్థ మెక్కువయగుట యనర్ధమగును
           కామమనునది భార్యతో క్షేమమగును
           మూడుత్రోవలు నరునకు మోక్షమిడును.

                శ్రీరామకటాక్షసిద్ధిరస్తు!
 ఇలా అణువణువు రామమయం కావాలని ఆశిస్తు....
                                       మీ "సూర్యశ్రీరామం" (పొన్నెకంటి)
         

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి.

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!విఘ్నవారణా!

     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

 2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.


 వందే గణనాయకమ్.


1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!


2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....


3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....


4. మాతపితలను సేవించు మార్గమొకటె

    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....


5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

    పూజలందుచు భక్తుల మోదమలర

    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...


6. గరికపూజకె ముదమంది దురితములను

    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...


7. మోదకంబుల నర్పింప మోదమంది

    వెనుకముందులుజూడక మనుజులకును

    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...


8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

    వినయశీలంబె సర్వత్ర విజయమంచు

    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...


9. సర్వ గణనాయకత్వంపు సాధనాన

    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...


10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!
                                 ##

9, మే 2019, గురువారం

..శంకరాచార్యులు. ఆది శంకరుల జయంతి ది. 9.05.19. .

శంకరాచార్యుల వారు.
   సీ:   కాలడిగ్రామాన ఘనకీర్తి వెలయింప
                    ప్రభవించి తిరిగిన భర్గుడతడు
         ఉసిరిక దానంబు నువిదచే బొందుటం
           గుందిన సదయార్ద్ర గుణయుతుండు
         శ్రీలక్ష్మి ప్రార్ధింప చెలువార కనకధా
                     రాస్తవమొనరించు లక్షణుండు 
        అద్వైతమున్నిల్ప యన్నిమతంబుల
                          వారినెదిర్చిన భవ్యుడతడు
   ఆ.వె: ధర్మ రక్షణంబె ధర్మంబు మనకంచు
            దారి చూపిన జడదారియతడు
            భరతమాతబిడ్డ పావనచరితుండు
            శంకరార్యు మదిని సన్నుతింతు!

తే.గీ: భౌద్ధ మతమది యలమెను భారతాన
 గురువు లెందరో వాదాల నెరపుచుండ
 మొండి ఘటముల మార్చ ప్రచండులైన
 శంకరాచార్య గొల్తు సచ్ఛాస్త్రధుర్యు!

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

తిరుపతి యాత్ర పద్యాలు. 22.09.2016.

            తిరుమల  శ్రీవేంకటేశ దర్శనమ్.(22.09.3016)

 1.  కంటిని వేంకటేశు ఘన కాంక్షలుదీరగ తన్మయత్వముం
      గంటిని సప్తశైలముల కంజదళాక్షు మహోన్నతత్త్వముం
      గంటిని శ్రీనివాసునల క్రన్ననభక్తులుజేరి మ్రొక్కగం
      గంటిని దివ్యమంగళుని కన్ను లపండువుగాగచేఱువై.
 2.  వింటిని వేయినామములు వీనులవిందుగ పర్వతాగ్రమున్
      వింటిని దేవదేవుకడు వేడుకబాడెడు కీర్తనావళిన్
      వింటిని సత్కథావళులు వేలకువేలుగ నెల్లవారిచేన్
      వింటిని వేదమంత్రముల విశ్వవికాసుని దివ్యలీలలన్.
 3.  ధన్యములాయె చక్షువులు తామరసాక్షుని దర్శనంబునన్
      ధన్యములాయె శ్రోత్రములుదంచితరీతిని కీర్తనాళిచేన్
      ధన్యములాయె హస్తములు తత్పదసేవనుజేయుటన్సదా
      ధన్యపు జీవితంబగును దైవ వినిర్మల నామచింతనన్.

                 వెల్లూరు  శ్రీలక్ష్మీదేవి దర్శనమ్.


 4. శ్రీహరి పాదపద్మముల చిర్నగవుల్మెరయంగ నొత్తుచుం

     దేహములోనిదేవియయి దివ్యమనోహర లక్ష్మి రూపమై
     ఊహకునెన్నరానివిధమున్ తన భక్తజనాళికిన్ సదా
     దాహముదీర్చునట్లుగను దానిలబంచును రత్నరాసులన్.
 5. శ్రీపుర వాసియైబరగి చిన్మయ రూపిగ ఖ్యాతినందియున్
     బాపురె భక్తకోటికిల బంగరు తల్లిగ భద్రవల్లిగా
     ప్రాపునుజేరినన్మరియు పాయనిగూర్మిని జింతజేసినం
     బాపములెల్లడుల్చి నిరపాయముగూర్చుదయాంతరంగయై.
 6. అందిన నీదుపాదరజమా కమలాక్షుని హృన్మనోబ్జరా
     గేందిర!సుందరీమణి! మదీయ శుభాంచిత పుణ్యశాలినై
     బొందెదనమ్మ సౌఖ్యముల మోదముతోడుత విష్ణుపత్నిరో!
     సందియమందనేలనిను చాలగగొల్చిన మోక్షమబ్బదే?

                  కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 7. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము
     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!మూషికాధిపా!
     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!
 8. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్
     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్
     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా
     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!
 9. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో
     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో
     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ
     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.

10. ఉంచితి నాదుభావనల నూహకు గల్గిన నంతమాత్రముం

       గాంచనగర్భురాణి నను గ్రన్నన గాచి రసాంచితంబుగ
       న్నంచితరీతిబల్కుమని నాజ్ఞయొసంగిన దానిమీరకం
       బంచితి నార్యులార!యిక బ్రాజ్ఞతతో గుణదోషమెంచుడీ!
     


   



   
   

   
   
   
     

      

10, సెప్టెంబర్ 2016, శనివారం

వందే గణనాయకమ్.2

   వందే గణనాయకమ్.

1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు
    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు
    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద
    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!

2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు
    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు
    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....

3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు
    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు
    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....

4. మాతపితలను సేవించు మార్గమొకటె
    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి
    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....

5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను
    పూజలందుచు భక్తుల మోదమలర
    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...

6. గరికపూజకె ముదమంది దురితములను
    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!
    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...

7. మోదకంబుల నర్పింప మోదమంది
    వెనుకముందులుజూడక మనుజులకును
    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...

8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి
    వినయశీలంబె సర్వత్ర విజయమంచు
    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...

9. సర్వగణములధిపతిగ సాధనాన
    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!
    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...

10.పంటలన్నియు సతతంబు పాడుసేయు
     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి
     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.
     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!



 

28, ఆగస్టు 2014, గురువారం

శారద నీరదేందు





శారద నీరదేందు ....పద్య ప్రతి పదార్ధం.  శారద = శరత్కాలమన్దలి, నీరద =మేఘము , ఇందు=చంద్రుడు , ఘనసార =కర్పూరము , పటీర =పటిక, మరాళ=హంస , మల్లికాహార =మల్లెల దండ , తుషార =నీటి తుంపర , ఫేన =నురుగు , రజత +అచల = వెండికొండ , కాశ=రెల్లుగడ్డి ,ఫణీశ =నాగేంద్రుడు , కుంద=మల్లె , మందార =తెల్ల మందార ,సుధా పయోధి = పాల సముద్రము , సిత=తెల్లని , తామరస =తామరపువ్వు , అమర వాహిని = గంగానది , వలె, శుభ ఆకారతన్= ఆకారముతో , ఒప్పు =ప్రకాశించు , నిన్ను, మదిన్ =మనసులో , ఎప్పుడు , కాన గల్గుదు , భారతీ .

 పోతనామాత్యులు అన్ని తెల్లని రంగు గలిగి వానితో సరస్వతిని పోలుస్తూ మనోహరంగా వర్నిచిన పద్య రత్నము .  

24, ఆగస్టు 2014, ఆదివారం

అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.

                           శివాయ గురవే నమః

                     అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.
         ( వైష్ణవీ మాత ను గంగాధరునిలో )

శ్లొ. వాగార్దావివ సంపృక్తౌ ,వాగర్ధః  ప్రతిపత్త యే ,
    జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

వాక్కును అర్ధము కలసి యున్న రీతి గా
పార్వతీ పరమేశ్వరులు కలసియే ఉంటారు .

అమ్మను నాన్నలో , నాన్నను అమ్మలో
చూడవచ్చు .

 నేను హిమాలయాల్లో ఉన్న వైష్ణవీ మాతను
 చూద్దామని అనుకున్నా . కాని నా శ్రేయోభిలాషులైన
 భిష గ్వర్యులు మీరామెను ప్రత్యక్షంగా నేత్రాలతో చూడటం శ్రేయస్కరం కాదని , సముద్ర మట్టానికి దాదాపు 5000 మీటర్ల  ఎత్తున ఉండటం వలన , మామూలు
 గుండెలకే ఊపిరి అందదని , మీ గుండె రిపేరు చేయ బడింది కనుక అసలు కూడదని వారించారు . నిషేధించారు .
నేత్రాలతో చూడలేనివి  ఎన్నో మనో నేత్రముతో  చూడవచ్చు కదా. అందుకని గంగాధరుని వామ భాగం
మనో నేత్రం తో చూచి , అమ్మ వైష్ణవీ దేవిని దర్శించిన మానసిక తృప్తిని ,ఆనందాన్ని , పొన్దాను పైసా ఖర్చు
లేకుండా . కళ్ళ తో చూచినవి ఎప్పటికైనా మరచే  అవకాశం లేక పోలేదు . ఇలా మనసు తో దర్శిస్తే  ఇలలో
నున్నంత  కాలం  మరువలేము . ఈ భావన చ్చన్దస్సులో  ఎలా ఉంటుందో నని ఆలోచన వచ్చి అమలు పరిచానంతే .
1. వాసవి, వైష్ణవీ సతి నవారిత భక్తిని దర్శనార్ధమై
   దోసిలి యొగ్గి కోరితిని తోయజ నేత్రుడు గంగధారినిన్
   దోసము గల్గు మీ యెడద దుస్తర పర్వత శ్రేణి మీదటన్
  మోసము చేయవచ్చనుచు మోదము తెల్పరు ఖండితంబుగాన్ .

2. చక్కని యోచనన్ సలుప సాగితి నిట్టుల మానసంబునన్
   ఎక్కడ జూచినన్ గలుగు నీశ్వరి రూపము భక్తి  నిన్డినన్ .
   మక్కువ మీర కాంచెదనుమాపతి   కాయపు వామభాగమున్
  దక్కును నాకు వైష్ణవి సు దర్శనమాత్రపు భవ్య భాగ్యముల్.

3 అమ్మకు మారు రూపమగు నాశ్రిత వత్సల తత్త్వ మెంతయున్ ,
  చెమ్మగు కన్నులం గలిగి చిత్తము మొత్తము నామె వేడినన్
  రమ్మని కౌగిలించి తనరారెడు ప్రేమను వృష్టి సేయు .. మా
  యమ్మగు వైష్ణవమ్మ నిల హార్దిక భక్తిని నంజలించెదన్.

4. ఎంత చేసికొన్న నంతనె ఫలమిచ్చు , నదికమంచు కోర నర్హమగునె ,
   చేయునపుడె  మనము చిత్తంబు రంజిల్ల . భక్తి తత్త్వములను పరగ వలయు. .

5. చానగు వైష్ణవిన్, పరమ సాధ్విని, అంబను , విశ్వ శక్తినిన్ ,
   మానస దర్శనంబు కడు మాన్యత, ధన్యత, సత్ఫలంబిడన్,
   నేనటు జేసితిన్ మదిని నిల్కడ యైన సభక్తి ప్రేరణన్ .
   వేనకు వేలు జోతలివె  వేడ్కను నర్పణ జేతు  మాతకున్ .
 

26, ఫిబ్రవరి 2014, బుధవారం

మహా శివ రాత్రికి . మహా దేవ స్మరణ


మహా శివ రాత్రికి . మహా దేవ స్మరణ
ఉ.    కుమ్భిని లోన జేరి తనకుం గల శక్తుల ప్రజ్జ్వలిన్చుచున్ ,
   
        దంభము జూపు బ్రహ్మకును తామర సాక్షుడు  విష్ణుదేవుకున్

       కమ్బపు మూలమున్నెరుక గాంచని భంగిమ లీల జూపు  నా

       శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో .                               1.

ఉ.    స్తంభమె  యగ్ని రూపమయి  శర్వుని కాంతులు తేజరిల్లగాన్

      సంభవ మాయెగా యరుణ శైల మనంగ  విశేష శేముషిన్

       అంబర కేశుడీ శ్వరు డనంతుడుమాపతి కాశి వాసుడా

        శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో                                 2.

ఉ.    దంభము జూపు నా దానవ మూర్ఖుల ద్రుంచి వైచు - వి

       శ్వమ్భర మూర్తి యా స్థా ణుడపారకృ పాన్తరంగుడై

       సంభరితాంతరంగముల సౌమ్యత జేరి సుఖంబు గూర్చు

       శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో .                               3.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

తాళ్ళమ్మకు తనివిదీర పాద్యం సమర్పిస్తున్న భక్తుడు

                                                                            తాళ్ళ మ్మకు తనివిదీర పాద్యం సమర్పిస్తున్న భక్తుడు                                  పాతూరి సత్యం బాబు.  12.. 02. 14. 

1. అలము  కున్నట్టి కష్టాల నలుగు చుండి 
 తల్లడిల్లుచు నుండు నా యుల్లముల కు 
   మల్లె గంధము జూపించి మరులు పంచు 
 తల్లి తాళ్ళమ్మ  నీకెపుడు దండమమ్మ. 

2. ఆడిగినంతనె  కడగండ్ల బాపు చుండి 
అమ్మకు ప్రతిగ, స్వర్గంగ చెమ్మగ కడు  
     నెమ్మది మము గాచు సతివి నీవ యందు 
 తల్లి తాళ్ళమ్మ  నీకెపుడు దండమమ్మ. 

                                                                 పుర ప్రముఖుల వినోద క్రీడ . దాడి .

                                                              పులి. మేక . ఆట 

9, నవంబర్ 2011, బుధవారం

కరావలంబనం

   చేతల్లో చేతుల్లో , నడతల్లో నడకల్లో. .ఊహల్లో వూసుల్లో,ఆటల్లో పాటల్లో,సాహిత్యాల్లో,  సౌహిత్యాల్లో ,  యిలలో ,కలలో . పరస్పర     బంధ బంధితమై ,స్వచ్చమైనదే స్నేహబంధం .
     ఆ బంధం నిరంతరం అనుబంధం కావాలి.  పరస్పర అభివృదికి పునాదిరాళ్ళు కావాలి.
  ఆనాడే మానవుడు మహనీయుడు అవుతాడు
.
                    హస్తి ముఖుని  దీవన .

            హస్తము హస్తముంగలసి హాసమునొందెడు స్నేహశీలి - ప్రా
            శస్త్యముజెందుచున్బహుళ సద్గుణ దీపిత మాననీయుడౌ 
            సుస్తవనీయుడై సుమవికాస కళావికసన్మణే  యగున్
            హస్తిముఖావతంసు దరహాస విలాసపు  దీవనాలిచేన్ .  

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...