పండుగలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పండుగలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2018, ఆదివారం

సంక్రాంతి శోభ. అనుబంధాలు, కవితాభారతికి పద్యాలు.

గోదాకల్యాణ మహోత్సవము. గుంటూరులో మా తమ్ముని ఇంట్లో  కొడుకులు,కోడళ్ళు, మనుమలు ,మనుమరాళ్ళతో సంక్రాంతి సంబరాలకు శ్రీకారం. బంధుత్వాలు బలపడేటందుకు  ముఖ్య కారణం అనురాగం, ఆప్యాయతలు. కలసినప్పుడు చిరునవ్వు తో నోరారా పలుకరించుకోవడం. అవి పెరగటానికి ఒక్కసారైనా అందరు కలసి కష్టసుఖాలు పంచుకుంటు ఆత్మీయతలను పెంచుకుంటు పంచుకుంటేనే ఆనందం దక్కుతుంది. అందునా మనం తెలుగు వారం కనుక తెలుగు పండుగలను సంప్రదాయబద్ధంగా చేసుకుంటే భావితరాల మన పిల్లలకు మార్గదర్శకులమౌతాము. ప్రతి భారతీయ సంప్రదాయం వెనుక మన సంస్కృతి రహస్యం దాగిఉంది.
    భోగి....నువ్వులనూనెతో, నలుగుపిండితో స్నానం పాపహరం, ఆరోగ్యప్రదం. భోగిమంటలో పాతవస్తువులను కాల్చటం స్వచ్ఛ భారత్ అయితే పాత పాతకపు ఆలోచనలను కాల్చి నిర్మల ప్రేమమయ భావనా సంపదను ఉత్తరాయణ పుణ్యకాలంలో పంచుకోవడం పరమ వరముగా భావించవలసిన స్వచ్ఛభక్తి భారత్.
 ఈరోజు తో ధనుర్మాసం పూర్తి అయి 30పాసురములసేవతో మధుర భక్తి తో  శ్రీకృష్ణుని జేరిన ఆండాళ్ తల్లి పరమపూజ్యురాలు. అందు వలననే గోదాదేవి కల్యాణం చేస్తే మన జీవితాలు మంగళప్రదమౌతాయనే ఆ కల్యాణం చేస్తారు. ఆ కల్యాణం చేస్తు మా తమ్ముని కుటుంబం ధన్యమైనది.
  సూర్యడు మకరరాశిలో ప్రవేశం వలన ...మకరసంక్రాంతి.
      భూమినుండి సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి జరుగుతు పోతు ఉన్న కారణంగా సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం. ఎంత పుణ్యకాలమంటే "ఉత్తరాయణం వచ్చింది ఉరిపెట్టుకొని చావండి" అనే నానుడి వచ్చింది. అంటే అర్థం అందరిని చావమనికాదు. అంతప్రశస్తమైనదని అర్థం చేసుకోవాలి. పూర్వీకుల చమత్కారాలు కూడ ఆథ్యాత్మిక పరంగా ఉండేవి.
   భూమాత కరుణ వలన రైతులకు చక్కని పంటలు ఇంటికి వచ్చి ఆ ఇల్లు, కళకళలాడుతూ ఉంటుంది. మన దేశంలో రైతుకి సిరిసంపదలు వస్తే అందరికి వచ్చినట్లే. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు "జై జవాన్ జై కిసాన్"అన్నారు.
ప్రతి తెలుగిల్లు కూతుళ్ళు అల్లుళ్ళతో, కొడుకు కోడళ్ళతో , మనమలు మనుమరాళ్ళతో ఆ ఇల్లు కిటకిటలాడుతు ఆనందం పొంగిపొరలుతుంది.
    బొమ్మలకొలువు ప్రత్యేకత సంతరించుకుని ముత్తైదువుల ఆశీస్సులతో  చిన్నపిల్లలు భోగిపండ్లు కొంచెంగోలచేస్తు పోయించుకుంటారు. దానితో వారిపైగల దృష్టి దోషం తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు.
    మూడవరోజు కనుమ..  మనకు పంటలను ప్రసాదించే బసవన్నల దగ్గరనుండి ప్రతి జంతువు పక్షిజాతులు మనకు ఆరాధ్యాలే..అందువలననే ఆరోజు పశువులనలంకరించి ఆరాధిస్తారు. ఇందులో ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉంటాడనే ఆథ్యాత్మికత దాగిఉంది.
             అందరికి శుభాకాంక్షలు. మన సంప్రదాయాలను కాపాడుకుందాం..
భోగిశుభాకాంక్షలు. 
  సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రమణము.  సంక్రాంతి
  నుండే ఉత్తరాయణ పుణ్యకాలం. ఇది 3రోజుల పండుగ. మొదటిరోజు భోగి,రెండవ రోజు మకరసంక్రాంతి,మూడవరోజు కనుము. భోగిపండుగ
ఎలాచేసుకుంటారు....ఉదయాన్నే లేచి భోగిమంటలు వేయడం, ముగ్గుల్లో గొబ్బెమ్మలం పెట్టడం, సాయంకాలం పిల్లలకు భోగిపళ్ళు పోయడం. భోగి కుండలు అమర్చుకోవడం. ఇలా ఎన్నో రకరకాలు చేసుకుంటాం. ఇవే విషయాలు చిన్న కవితలో చూద్దాం. 

     భోగిమంటలు వేసుకుందాం, భోగి పండగ చేసుకుందాం!

     పనికిరాని చెత్తనంతా, పాత మాస్కుల కుప్పనంతా
     పెరుగుతున్న క్రూరక్రిములను, పెచ్చరిల్లే వేరియంట్లను!!భోగిమంటలు!!
     మంగళ స్నానాల్ మంచిగ చేసి, క్రొత్త బట్టలు ధారణచేసి
     గుమ్మడిపూల  గొబ్బిదేవతల పూజలు చేస్తు ముందుకు పోదాం
     స్వాగతమిద్దాం సరదా భోగికి, సందడిచేద్దాం రారండోయ్ రారండోయ్!!భోగి!!
     రేగు పండ్లతో  దిష్టినితీస్తు తోయజాక్షులు
     దీవనలిత్తురు.!భోగిమంటలు
      పెద్దలు పిన్నలై దీవనలందిరి ఆనందంతో...
     భోగి కుండల మోహనకాంతులు పూర్ణకుంభపు పుణ్యరాసులై
     జీవన విధిలో సుఖములీనగా...భోగిమంటలు!!

                        మకర సంక్రాంతి.

  ఈరోజే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన మకర సంక్రాంతి. 
   విశేషాలు కవితలో

   రైతు ఆశల పంట ఫలములు, ఇంట నిండుగ నిండగా
   గుండె నిండిన సంబరాలె, గుర్తులై చిరునవ్వులు చిందగా
   వచ్చిన మార్పే వరాల పండగ, సంబరాల సంక్రాంతి
   గోమయపు ముద్దలే గోపికలై విరియగా, కన్నెలు పూజించు 
                                          క్రాంతి సంక్రాంతి.
   క్రొత్త అల్లుళ్ళు,నవ వధువులేకమై,ఇంటింట చేసెడు ఆనందహేల
   సూర్యున కిష్టమౌ క్రొత్తబియ్యపు పొంగళ్ళు, అమృతమధురిమలలీల
   బంధుగణముల బహుముఖపాండిత్య,చమత్కారాల గోల
   హరిదాసు గానాల ఆనంద భక్తితో పరవశమమందుచు
    ధాన్యాల దానాల ధర్మంపు భావాలు.
    బొమ్మల కొలువున అమ్మల ఆశలు,పిల్లలకెంతో ప్రేమదీవనలు
    భోగిపళ్ళతో లోగిళ్ళన్నీ, ముద్దుగుమ్మల సంబరాలతో
    ఆనందాలే హరివిల్లై నిండుగ నిండే పండగ సంక్రాంతి.

     మరి కనుమ నాడో!!

     పశువుల పూజకు ప్రాధాన్యంగా, త్యాగజీవులకు నిస్స్వార్ధంగా
     మనస్ఫూర్తిగా గౌరవమిచ్చే, సంప్రదాయపు పండుగ కనుమ
     గంగిరెద్దుల ఘన విన్యాసాలు, తెలుపును మనకు క్రమశిక్షణను
     దారము ఆధారంగా నింగికి యెగసే పతంగులన్నీ
     తెలుపును మనకు లక్ష్యసాధనను
     కోడిపందెముల సంప్రదాయములు,తెలుపును మనదౌ పౌరుషాగ్నిని
     కనుమా!కనుమను క్రాంతి దాతగా, మనుమా భావి సుఖప్రదాతగా!!

సంక్రాంతి కవితాభారతి. 28.12.22.
సీ:  గృహముల ముంగిళ్ళ కేరింతసందళ్ళ
            మోహనాంగులు దీర్చు మ్రుగ్గులలర
      కపిల గోదుగ్ధముల్ కమ్మగ ద్రావుచు
            లీల గెంతులిడెడు లేగలలర
      పాడిపంటలునిండి పరవశంబందిన
             కర్షకునేత్రాల కాంతులలర
       హరిదాసు బృందాల " హారిలోహారం"చు
             భక్తి మీరినహోరు  రక్తిదనర
  తే.గీ: కోడిపందాల పౌరుషాల్ , కోడెగిత్త
          బండ లాగుళ్ళ సంబరాల్ పండుగనగ
          వచ్చె సంక్రాంతి మాలక్ష్మి వైభవాన
          భారతీయత పండిన పడతివోలె
          పిన్నపెద్దల డెందాల ప్రేమ నింప.

    భోగి శుభాకాంక్షలు.

  సీ:  పాడైన వస్తువుల్ పనికిమాలిన చెత్త
                    లోగిళ్ళ దహియింప భోగియనిరి
          కన్యకామణులెల్ల ఘనరంగవల్లుల
                     లోగిళ్ళ రచియింప భోగియనిరి
          పరుష సంభాషణల్ పాపచింతలెదల
                     లోగిళ్ళ గాల్చుట భోగియనిరి
          కుంకుళ్ళరసముతో కూర్మికేశాఘముల్
                      పోగొట్ట ఘనమైన భోగియనిరి
          గోమయపరికల్ప గొబ్బిళ్ళ సొబగులే
                       భూమినిండినవేళ భోగియనిరి
   తే.గీ:ఇట్టి భోగాల నందు మహేంద్రరూపి
          భారతీయుడొకండె సూ వేరులేడు
          సంప్రదాయంపు సంపదల్ సవ్యరీతి
          భద్రపరచిన మనకీర్తి భద్రమగును.

    సీ: ఉత్తరాయణమందు నుత్తమ కార్యాలు
                    పుణ్యమిచ్చుననిరి మునులునాడు
           మంచిగుమ్మడిపండు మహదాన మిచ్చిన
                    సత్ఫలంబులనిరి సకలమునులు
           పోయిన నరులకు  పుత్రతర్పణమున
                     నరకముండదనిరి నైష్ఠికాళి
           మకరసంక్రమణంబు మహనీయ కాలమై
                      పుణ్యప్రదమనిరి మునులునాడు
     ఆ.వె: మకరరాశియందు మాన్యుండు రవిజేర
              ఉత్తరాయణమయి చిత్తమలరు
              జీవనంబు మిగుల జేగీయమానమై
              శుభములందు నరుడు శోభనముగ.
     ఆ.వె. రేగి పండ్లు బోయ రేగిన జుత్తుతో 
              పాపలెల్ల విరియు పర్వ మిదియె 
              పాప దృష్టి తొలగి పదివేల కాలాలు 
              బ్రతుక గోరు క్రాంతి పధము లివియె.

                           కనుము.శుభాకాంక్షలు.
                             
            సీ:  భారతదేశాన పాడిపంటలసిరుల్
                     బసవదేవుని కృపను వరలుచుండు
            భారతీయుల జాతిపౌరుషంబును దెల్ప
                      కుక్కుటంబులబెంచు కూర్మిదెల్పు
             సర్వపాపవిదారి చల్లని గోమాతృ
                        సేవయె దెల్పును శ్రీపథమ్ము
              సకలజీవులప్రేమ సౌభాగ్యదమ్మని 
                         కరుణజూపుటె మన కనుము కనుమ
     తే.గీ: ప్రకృతి సర్వంబు ప్రేమైక భావనమున
              పరిఢవిల్లిన తోడగు పరమశివుడు
              విజయపథమిచ్చి కాచును నిజముగాను
              భారతీయత లోనున్న పారమిదియె.
                     




16, సెప్టెంబర్ 2015, బుధవారం

వినాయక చవితి శుభాకాంక్షలు.

    విఘ్న దేవునికి .విన్నపము ,  శుభాకాంక్షలు .

    విఘ్నంబు లెన్ని గల్గిన
    దఘ్నంబు జేసి రయమున దయతో గాచున్
    విఘ్నాధి పతిన్ , భక్తుల
    నిఘ్నున్ గోరుదు శ్రేయము నే నందరకున్  .
 వినాయక చతుర్థి శుభాకాంక్షాలు/ 17.09. 15. 

గణనాధుని సేవ.  గుణమణులకు త్రోవ.
                     సూర్య శ్రీ..27.08.25.
గణనాధుపాదసేవను
గుణమణులైవిద్య లంది కోవిదులగుచున్
అణువణువు భక్తి పూర్ణత
ప్రణవాంకితతత్త్వమందు ప్రజలిద్ధరలోన్.1
గరిక పూజకె ముదమందు ఘనముగాను
మోదకంబుల నర్పింప మ్రొక్కు దీర్చు
నాల్గు గుంజిళ్ళు దీసిన నైష్టికముగ
కరుణ జూపించు దైవంబు గణపతయ్య! 2
ఎట్టి కార్యంబు ఘనత చేపట్టుచున్న
చిట్టి గణపతి సేవను చేయవలయు
ఈశుడైనను తుదకు రమేశుడైన
కార్యసాఫల్యమందగ ఖచ్చితముగ.3
మట్టి గణపతి నీనాడు పట్టుబట్టి
తెచ్చి పూజించి సద్భక్తి తిరిగి పంప
పంచభూతమ్ములానంద పరవశమయి
దీవనాళిని పంచు దేదీప్యముగను.4.
అంబ ముఖపద్మ వికసితహర్షరవిగ
ఖ్యాతిగాంచిన గణపయ్య కరుణకొఱకు
సతము ప్రార్ధింతు మది నిండ శ్రద్ధతోడ
రండు గళము గల్పుడు భక్తి   రక్తిదనర!5

18, ఆగస్టు 2014, సోమవారం

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి

కంజ దళాక్షుని , కన్జాతముల బోలు ఈ చిన్ని పాదముద్రలు మధురా నాధుని , మధుర మనోహర 
మనోజ్ఞ , మంజుల, మాననీయ సౌందర్య విలసితాలు . చిన్ని కృష్ణుని చిరునవ్వులు చిద్విలాసపు 
భువనైక మోహనాలు, అమాయకత్వపు అద్వితీయ నటనా సౌందర్య సారస్యానికి సమగ్ర స్వరూపాలు .ఆ మురళీ నాధుని జన్మాష్టమి సకల భువనములకు పుణ్యా స్టమి. శ్రీ కృష్ణ కృపా కటాక్ష వీక్షణ మహత్ భాగ్యం సర్వులకు కలగాలని మనాసా ఆసిస్తూ. మా యింటికి వచ్చిన జాడలు మీకు చుపిస్తూ .

29, మార్చి 2014, శనివారం

            మధుమాస మకరందం . 31. 03. 2014 

        జయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో  

నవజీవనానికి  నాంది మధుమాసం . 
వన జీవనానికి వసంతం సుమ దరహాసం , సుమధుర హాసం , 
మానవ జీవన శైలికిది  సన్మార్గ సూచిక . 
మానస పరిణతి కిది మహనీయ రోచిక 

షడ్రుచుల యుగాది దేవతకు సాష్టాంగ ప్రణామం . 
ఏ రుచైనా ప్రకృతి మాత  ప్రసాదంగా చేద్దాం ప్రమాణం 
తీపి సుఖాలు కోరుతూ , చేదు కష్టాల పరాకాష్ట ల నధిగమించి 
గెలుపు పులుపు రసమూరిస్తే , ఉప్పు కారాల జయం ఊపందు కొంటే 
వగరు పొగరుతో జీవనం సాగించే 
మానవ రూపానికి మధు మాసం ఒక వరం . 
శుభోదయంతో సుందరి యిచ్చిన ఉగాది పచ్చడి లో 
కొంచెం చేదు  ఎక్కువైన, చిరు నవ్వులు చిందిస్తూ 
 శ్రీమతి మనసు తీపి చేయటానికి 
 ఏమోయ్, ఉగాది పచ్చడి అచ్చంగా పటిక  బెల్లం తో చేశావా అనే 
భర్తల నటనా విన్యాసం అద్భుతం వేప పూత సాక్షిగా . 
( ఉగాది రోజు మనసు బాధపెడితే సంవత్సరమంతా బాధ పడతారని ) 
చేదెక్కువైనా , తక్కువైనా , అది నింబ పుష్పాది సమ్మిశ్రితం 
ఆయురారోగ్య ప్రదాయకం . 
నవ జీవన కుసుమానికి , నవ్య పరిమళ విలసితం 
సర్వ రుచుల సమ్మేళనం తో సౌభాగ్య భోగ భాగ్యాలను 
జయ నామ ఉగాదికి పంచుకుందాం . అవకాశమిమ్మని దేవుని వేడుకొందాం ,


26, ఫిబ్రవరి 2014, బుధవారం

మహా శివ రాత్రికి . మహా దేవ స్మరణ


మహా శివ రాత్రికి . మహా దేవ స్మరణ
ఉ.    కుమ్భిని లోన జేరి తనకుం గల శక్తుల ప్రజ్జ్వలిన్చుచున్ ,
   
        దంభము జూపు బ్రహ్మకును తామర సాక్షుడు  విష్ణుదేవుకున్

       కమ్బపు మూలమున్నెరుక గాంచని భంగిమ లీల జూపు  నా

       శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో .                               1.

ఉ.    స్తంభమె  యగ్ని రూపమయి  శర్వుని కాంతులు తేజరిల్లగాన్

      సంభవ మాయెగా యరుణ శైల మనంగ  విశేష శేముషిన్

       అంబర కేశుడీ శ్వరు డనంతుడుమాపతి కాశి వాసుడా

        శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో                                 2.

ఉ.    దంభము జూపు నా దానవ మూర్ఖుల ద్రుంచి వైచు - వి

       శ్వమ్భర మూర్తి యా స్థా ణుడపారకృ పాన్తరంగుడై

       సంభరితాంతరంగముల సౌమ్యత జేరి సుఖంబు గూర్చు

       శంభుని సేవలే పరమ సద్గతులీనును శంకలేలకో .                               3.

2, నవంబర్ 2013, శనివారం

దివ్య దీపావళి శుభాకాంక్షలు

     చెడుగు చీకట్ల నిరతంబు చీల్చివేయు             3.11.2013.

     వెలుగు రేఖలు జీవన వేల్పులనగ

    మాన వాళి కి లభియించె మహితగతిని

    దివ్యదీపావళింటింట తేజమలర .1. 

    రాక్ష సంబైన పనులకు శిక్ష నునిచి 

    రమ్య ,సౌజన్య భావాలు రాణకెక్క
  
    మహిని నరకుని నరకి మాన్య సత్య 

    కంట కంబును దొలగించె వింటి చేత 2
.
 .  దీపమన్దున శ్రీలక్ష్మి దేవి యుండి

    పాప హరణంబు గావించి పరమ పుణ్య


    హేతు వగచును ప్రజలెల్ల హేల మెలగ


    వరము లిచ్చును క్రీగంటి కరుణతోడ 3.        



8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ప్రకృతి పురుషుల ఆరాధనే . వినాయక చతుర్థి. .

ప్రకృతి  పురుషుల ఆరాధనే . వినాయక చతుర్థి. .

ప్రకృతి పురుషులు వేరెవరో కాదు . ( ఆది దంపతు లైన
పార్వతీ పరమేశ్వరులు )
        శ్లో . వాగర్దా వివ  సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే , 
              జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .

ప్రకృతి, పార్వతి. పురుషుడు పరమశివుడు . ఈ సత్యాన్ని నమ్మిన వాడే మనవినాయక స్వామి. అందుకనే కుమార స్వామి కి తనకి వచ్చిన సేనా నాయకత్వఆధిపత్య పోరులో విజయం కొరకు  అతి సులువైన మార్గాన్ని తన తండ్రి అయినపరమేశ్వరుని ద్వారా తెలిసికొన్నాడు . అదే తల్లి దండ్రులకు సభక్తిక ప్రదక్షిణము.
కుమారస్వామికి తాను స్నానం చేసిన మూడు కోట్ల ఏబది లక్షల నదులలో
తన అన్నగారు ముందుగా స్నానం చేసినట్లు కనిపించాడు . దానికి కారణం
తెలియక విస్తుపోయాడు ,కుమారస్వామి. సూక్ష్మం లో మోక్షం గ తలిదండ్రులకుప్రదక్షిణం చేసి విజయం సాధించి , సర్వ సైన్యాధి పత్యాన్ని , సంపాదించాడు తెలివిగావినాయక స్వామి.  కనుక పార్వతీ పరమేశ్వరుల వంటి తలిదండ్రుల పూజ మహోన్నత మైనదనినిరూపించాడు బొజ్జ గణపతి. సమాజ శ్రేయస్సుకు  ఇంతకన్నా కావలసింది ఏముంటుంది .

     ఇక పత్రీ , పూజా ద్రవ్యాలు గురించి ఆలోచిస్తే . ఆయన కిష్టమైనది ముఖ్యం గ గరిక. దీనితో పూజిస్తే , సమస్త పూజా ద్రవ్యాలతో, పత్రులతో పూజించినట్లే .ఎక్కువ ధనం వెచ్చించకుండా సామాన్యుడుకూడాసులువుగా  పూజించే విధం గ ఏర్పాటు చేసినదే గరిక పూజ.    కాని మనం  సమస్త ఆయుర్వేద శక్తులు దాగి ఉన్న 21 పత్రాలతో పూజిస్తె ఆరోగ్య పరంగా , ఆధ్యాత్మిక పరంగా మంచిదని విజ్ఞులు చెప్పటం వలన ఆయా పత్రాలను సభక్తి కముగా సేకరించి పూజిస్తాము. ఈ విధంగా మనం నిర్మల భక్తి తో పూజ చేస్తే మన హృదయసరోవరంలోనే విహరిస్తాడుబుజ్జి  ( బొజ్జ )  గణపతి .
    ప్రతి పూజలో లౌకికము , పార లౌకికము ఉంటాయి . మట్టి తో చేసిన గణపతికి పూజ చేసి, నిమజ్జనం చేస్తే ,ప్రకృతి , ప్రకృతి లో కలసి పార లౌకికత  సిద్ధిస్తున్ది. కనుక మనమందరం అవకాశం మేరకు మృణ్మయ గణపతినేత్రికరణ శుద్ధిగా పూజ చేసి మనోభీస్టాలను సిద్ధింప జేసుకొందాము .
   శుభం భూయాత్.  సర్వే జనాః సుఖినో భవంతు .

20, ఆగస్టు 2013, మంగళవారం

"అన్నా అంటే నేనున్నా "

శ్రావణ పూర్ణిమ , జంధ్యాల పూర్ణిమ ,   రక్షాబంధన్, రాఖి.                                                                                                                                      
ఈ పేర్లన్నీ  చెల్లికి మానసిక బలాన్నిచ్చే చర్యకి ప్రతి రూపాలె. సృష్టిలో
ప్రేమ పాత్ర ఎంతో  ఎవరికీ  చెప్పనక్కరలేదు . భార్యా భర్తలు, అన్నా. చెల్లెలు. అక్కా,తమ్ముడు ఇలా ఎన్నో సంబంధాలు .
దేనికదే పవిత్రమైనది. విలువైనది. ఆ విలువలు నిలబెట్టుకోవా
లంటే కొన్నిసామాజిక  ధర్మాలు పాటించాలి . అన్నా, లేక తమ్ముని క్షేమం కోరి ఒక చెల్లి ,లేక అక్క బంధనాన్ని చేతికి కట్టడమే రక్షా బంధనం . దాని ద్వారా అన్న ,చెల్లికి అభయమిస్తాడు . మనం ముందుగా రక్తం పంచుకొని పుట్టిన వారికైనా ఇలాంటి రక్షణ కల్పించ గలిగితే ఆ తరువాత" అన్నా" అని పిలిచే ఏ చెల్లి కైనా చేయ గలుగుతాము.  అందుకే ప్రతి ఆడ పిల్ల తనకు పరిచయమైన పరాయి  పెద్ద మగ పిల్లలను అన్నా అని పిలుస్తున్ది. అది మన సంప్రదాయం . దీనిని గుర్తు చేస్తుంది మహా భారతమ్.ద్రౌపది కష్టకాలంలో కృష్ణా , అన్నా అని పిలిచి తన మానాన్ని కాపాడు కొంటుంది  . సమాజంలోని సంబంధాలు బలపడాలి , విదేశీ యులకు మనం ఆదర్శం కావాలి అంటే తప్పక కొన్ని ఉత్తమ ధర్మాలను ఆచరించాలి.   "అన్నా అంటే నేనున్నా " అనే సద్భావన కలిగిస్తూ వ్యక్తిత్వం పెంచు కోవాలి . ఆనాడే మనం అన్ని విజ్ఞాన సౌధాలు ఎక్కినట్లు . ఇవి లేకుంటే అజ్ఞాన అంధకారంలో దిగజారినట్లు . కాదంటారా .  

10, ఏప్రిల్ 2013, బుధవారం

సర్వేజనాః విజయ వాసంత శుభ కామనః

                                       
            సర్వేజనాః   విజయ    వాసంత           శుభ కామనః 

11. 04. 2013
ప్రతి ఉగాది ప్రకృతి ని కను విందు చేస్తుంది 
                         తన నూతన చేతనత్వంతో ,
ఈ యుగాది విజయ నామ ధారియై , 
                         సకల జీవ రాశులకు  విజయ రహదారియై ,
మందార మకరంద సుధామయ జీవితాలలో . 
                          సుధలు చిలకాలని నాంది పలుకుతుంది .. 
విజయం వినటానికి చాల బాగుంటుంది . ,
                           కఠోర  పరీక్షల విశ్లేషణ లేకుంటే . 
విజయమా అనటానికి బలే బాగుంటుంది , 
                            అప జయాల ఊసులు లేకుంటే ,
విజయం సు వ్యసనమ్ అయితే ,
                             పరాజయలన్నీ దుర్వ్యసనాలే   . 
విజయానికి అలవాటు పడిన ప్రాణి , 
                             ప్రాణం పోయిన అపజయానికి ఒప్పుకోదు . 
వసంతం లోని ప్రతి విజయ చిహ్నమైన , 
                             చివురు వెనుక బలహీనపు పండుటాకు ఉంటుంది ... 
ప్రకృతి తన ధర్మంగా ఒక్కొక్క కాలంలో , 
                             ఒక్కొక్క దానికి ప్రతిభ,వ్యుత్పత్తి ,కాంతుల నిమ్పుతున్ది. 
వసంత ఋతు రాజు  కర్తవ్యమ్ గా చరాచర జగత్తుకు ,
                              ఈనాటి నుండి నూతన శోభలను విజయ   పరమ్పరలనన్దిస్తాడు . 
వసంత లక్ష్మీ శోభాయమాన సదృశ సహృదయులన్దరకు 
                               విజయ, ఆయు రారోగ్య ఐశ్వర్యా లను ప్రకృతి మాత ప్రసాదిస్తుంది . 
మారిన కాలం తో మనం మారి  కల కాలం ధర్మా చరణ తో ,
                                ప్రకృతి మాత పాద పద్మ రజోలేశాలను ,                                         
మన శిరస్సుల ధరిద్దాం , పునీతులమౌదామ్. 

                          

                             । ।  సర్వే జనాః విజయో భవంతు । ।  


11, జనవరి 2013, శుక్రవారం

పల్లె సంక్రాంతి .

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు..  పల్లె సంక్రాంతి .
ఉ. ఎద్దుల పందెముల్ ఘనత కెక్కిన కుక్కుట పాద ఘట్టనల్ 
    ముద్దుగనున్న గోమయపు మోహనరూపము, రంగవల్లులున్ 
    ముద్దులుమూటగట్టు విరిబోడుల రంగుల పట్టువస్త్రముల్
  హద్దులులేని మోదములు హైదవజాతికి సంస్కృతుల్ సుమా. 
 ఆ.వె. రేగి పండ్లు బోయ రేగిన జుత్తుతో 
         పాపలెల్ల విరియు పర్వ మిదియె 
         పాప దృష్టి తొలగి పదివేల కాలాలు 
         బ్రతుక గోరు క్రాంతి పధము లివియె.
             వంగి మ్రుగ్గుపెట్టు వనితశోభ 
             హారి హారి యనెడు హరిదాసు కీర్తనల్ 
          పల్లె పట్టులందు పరిమళాలు .

13, జనవరి 2012, శుక్రవారం

మకర సంక్రాంతి

మకర సంక్రాంతి . సూర్యుడు పన్నెండు రాసులలో 
సంచారం చేస్తూ పుష్య మాసంలో మకరరాసిలో 
ప్రవేశిస్తాడు  . అందు వలన మకర సంక్రాంతిగ 
దీనిని పిలుస్తారు . ఈ రోజు నుండి ఉత్తరాయణం 
వస్తుంది . అంటే భీష్ముడు కూడా స్వచ్చంద మరణం 
కోరుకున్న రోజు . భోగి , సంక్రాంతి , కనుమగ ఈ పండుగ ప్రసిద్ధి చెందింది. చిన్నారులకు దృష్టి దోషం తగలకుండా
రేగు పండ్లు, నాణెములు , పూలు, తలపై పోసి , పెద్దలు 
శతాయుష్మన్ భవ. అని దీవిస్తారు. భోగి మంటలలో మన పాపాలన్నీ కాలి, పునీతులము అవుతామని ,మానసిక స్వచ్ఛత పొందుతామని ప్రసిద్ధి , కనుమనాడు  పశువులను అలంకరిస్తారు. అనగా  హిందూసంప్రదాయానుసారం     పశు పక్షి జాతులను కూడా ప్రేమించే మానవాతీత మనస్సు మనది.    ఈ చిత్రం లో చిరజీవులు హిమజ , మహిత, మనోజ్ఞ , ధీరజ్ లు . నిష్కల్మష మనస్సుతో . వారి వారి భావాలను పంచుకుంటున్నారు కంప్యుటర్ లో. కానీ మనోజ్ఞ మాత్రం.............
సంక్రాంతి కొఱకు ఎదురు చూస్తున్నది కాబోలు . దాని చూపులు  చూడండి. చిన్నారి హృదయం పెద్ద దేవాలయం .
సంక్రాంతి అందరకు శుభ, సుఖ సంతోషాలు తేవాలని , మనసా, వాచా , కర్మణా  కోరుకుంటున్నాను.
  

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...