కావ్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కావ్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2019, సోమవారం

ముందు మాట

                                                                 ముందు మాట

            సంగీతమపి  సాహిత్యమ్  సరస్వత్యా: స్తన ద్వయమ్, ఏక మాపాత మధురం అన్య దాలోచనామృతమ్ . అట్టి ఆలోచనామృత కావ్య సృష్టి కి నన్ను ప్రేరేచిన సాహితీ ప్రియులు, మాన్యులు పట్వర్ధన్ గారికి  హార్దిక             ధన్యవాదములు . ముఖ పుస్తకము ద్వారా పరిచయమైన వారు నాకు స్వయముగా ఫోన్ చేసి అందరును ఒక్కొక్క  ప్రబంధము వ్రాయ సంకల్పించిరి , మీరును తప్పక ఒక ప్రబంధము వ్రాయ వలసినదని చనువుగా , స్నేహ శీలియై ఆదేశించిరి . అంతే నాకేమనుటకు  తోచక , సాధ్యా సాద్యాలాలోచింపక అంగీకరించితిని.  దాని ఫలితమే  ఈ  !! బుఱ్ఱ కథ నాజరు చరితము !! . 
            దృఢ సంకల్పమున్నచో  భగవంతుడు సానుకూల పరిస్థితులు కల్పించునని  నా ప్రగాఢ విశ్వాసము . దానిని రెండవపర్యాయము  భగవంతుడు రుజువు చేసెను  . నా ధృఢసంకల్పబీజము వృక్షమగుటకెందరో పాదుచేసి, నీరు పోసి, ఎరువు వేసి అద్వితీయ ఫలముల నందించారు . అందు బీజము వేసినది మాన్యులు పట్వర్ధన్ గారు. తదభివృధి కి  శ్రీయుతులు  కిరణ్ ప్రభ, జొన్నలగడ్డ జయరామ శర్మ, అంగడాల వెంకట రమణ, షేక్ బాపూజీ గారలు కారకులైరి .
         పద్మశ్రీ షేక్ నాజారు గారి చరితే వ్రాయ వలెనని సంకల్పించుటకు కారణము , మేమిరువురము అంతే వాసులము. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ  అను నట్లు నా జన్మ భూమి ఋణము దీర్చుకొనుటకు వారి చరిత్ర వ్రాయుటే యుచితమనిపించింది . ఉదధిని ఉద్ధరిణె లో బంధించినట్లైనది, నాజారు గారిని ప్రబంధములో బంధించుట . కారణము ప్రబంధము 300 పద్యములు దాటరాదనుటయే . ప్రబంధ లక్షణములకనుగుణముగా వ్రాసినను రస స్థాయి సహృదయ పాఠకుల మనస్సులను రంజింప జేసిన నాడే దాని సార్ధకత. రచయితకు ధన్యత !
ఇందు గల గుణములు నా గురు దేవుల ఆశీ: ప్రసాదములు , దోషములు నా యజ్ఞాన దుష్ఫలములు. బుధులు క్షీర నీర న్యాయ విదులు. కనుక క్షీరమునే గ్రహింప మనవి . దోషములు సూచించిన సవరించుకోగలను.
                                                                                      మీ బుధజన విధేయుడు.
                                                                               పొన్నెకంటి సూర్యనారాయణ రావు . 
               

బుఱ్ఱకథాపితామహ నాజరు.కథ. ముందు మాట - విషయ సూచిక - షష్ట్యంతములు.

                                            నాజరు కావ్యము.

"ముఖ పుస్తక "కవిపండితులందరు తలా ఒక కావ్యం వ్రాయాలని ప్రకటన ఇచ్చాము. అందరు తలకొకటి వ్రాస్తున్నారు మీరు కూడ ఒక కావ్యం వ్రాయండి "అని (అదేదో చాలా చిన్న పని , అలవోకగా నేను చేయగలిగిన పని అయినట్లు) చాలా ప్రేమపూర్వకముగా నాకు ఫోన్ చేసి చెప్పారు మాన్యులు, సుకవితా విశారదులు, ప్రొఫెసర్ గారైన పట్వర్థన్ గారు. నేను ఆ ఆనందంలో నా స్థాయి మరచి "(తగరు పర్వతమును ఢీకొన యత్నించిన రీతి) ఆత్మవిశ్వాసంతో దేనినైనా సాధింప నగును. అని తలచి తలయూచాను సరేనంటు. రెండు రోజులు ఏమి వ్రాద్దామా ?అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఒక మెఱుపు ఆలోచన వచ్చింది. అదే నా జన్మస్థలమే తన జన్మ స్థలముగాగల ప్రపంచ ప్రముఖ బుఱ్ఱకథాకళాకారుడు, బుఱ్ఱకథా పితామహుడైన పద్మశ్రీ షేక్ నాజర్ గారి జీవిత చరిత్ర ను పంచాశ్వాసాల కావ్యంగా వ్రాయపూనుకొన్నాను. పూర్తి సమాచారం లేక చింతపడుచున్న తరుణంలో నడిసంద్రంలో నావలాగా యూట్యూబ్ లో మాన్యులు టాక్ షో నిర్వాహకులు, బహుకళాభిజ్ఞులైన కిరణ్ ప్రభగారి "బుఱ్ఱకథ నాజర్ "గురించి కొంత సమాచారం, డా. అంగడాల వెంకట రమణమూర్తి గారి పరిశోధనా గ్రంథం "పింజారి" వలన పూర్తి సమాచారం నా అదృష్టం వలన లభించింది. వారా చరిత్రలో వ్రాసిన విషయాలలో శత సహస్రాంశము కూడ నేను వ్రాయలేకపోయాను. సముద్రములోని నీటిని, చాపిన అరచేతిలోనికి తీసికొని నట్లయినది. దొరికిన వరకే అదృష్టం ."చేసికొన్నవారికి చేసికొన్నంత మహదేవ " ఆకావ్యము లోని మంచిచెడుల ఫలితాలు ఈ నెల(అక్టోబరు 13న ) రాబోతున్నాయి. కావ్యం వ్రాయుటే ఘనముగా భావించిన నాకు బహుమానంతో సంబంధం లేదు. వ్రాసిన 29మంది కవులలో నేను కూడ ఒకడినిగా పాలు పంచుకొనగల్గుటే అపురూపం. సాహితీ సింధువులో నేనొక బిందువును. అందుకే ఈ ఆనందాన్ని అందరితో పంచుకొంటున్నాను, శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మ పాదరేణువు సాక్షిగా..... నాకీ విషయంలో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా సహాయపడిన నాజర్ గారి ద్వితీయ కుమారుడు , అద్వితీయ కళాసాహిత్యకారుడు , కళావారసుడు ,అయిన శ్రీ షేక్ బాబూజీ గారికి, పరోక్షంగా సహాయపడిన కిరణ్ ప్రభగారికి , డా. అంగడాల వెంకట రమణగారికి హార్దిక ధన్యవాదాలు. నాకు కలుగబోయే గౌరవములో వీరందరు భాగస్వాములే. నేను ప్రతిరోజు వ్రాసిన పద్యములను నిర్దుష్టము , సారవంతము చేయుచు సాయపడిన నా యనుంగు సోదరుడు జొన్నలగడ్డ జయరామ శర్మకు , అంగడాల వారిని పరిచయం చేసిన యువకవి ముష్టి కృష్ణకిశోర్ కు నా ధన్యవాదాలు. అందరికి దసరా శుభాకాంక్షలు.



       

బుఱ్ఱకథ నాజరు చరితము . కథా సంగ్రహము .

             శ్రీరస్తు!               శ్రీ గురుభ్యో నమః .                 శుభమస్తు! 
                   నామము: " బుఱ్ఱ కథ నాజరు చరితము."
                   రచయిత : పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                   ఫోన్. నం. 9866675770.
                                  బుఱ్ఱకథ  నాజరు  చరితము . కథా సంగ్రహము . 

                   వర్షాధారిత ప్రాంతమగు "గుంటూరు" జిల్లాలోని "పొన్నెకల్లు" గ్రామములో అన్ని  కులములతో బాటు దూదేకుల మహమ్మదీయకులమునకు జెందిన "షేక్ మస్తాన్",అతని అన్న "నాజర్" కుటుంబములుండెడివి. మస్తాను చెక్కభజన, నాజర్ షెహనాయి కళాకారులు. నాజర్ గొప్ప కళాకారుడిగా సుప్రసిద్ధుడు. దురదృష్టవశాత్తు ఒక కుమారుడు కలిగిన తదుపరి నాజరు మరణించెను. ఆ సమయముననే 5.02.1920 న మస్తాన్ కు  కుమారుడు కలిగెను. తన అన్నగారంత గొప్ప కళాకారుడు కావలెనని కుమారునకు "నాజర్ వలి" అని పేరుపెట్టిరి. మస్తాన్ కుటుంబమంతయు కూలికి వెళ్ళినగాని జరుగుబాటులేనిస్థితి. వారు  కుమారుని  ఐదవ సంవత్సరమున   ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బంపిరి.   నాజర్ చిన్న నాటినుండి సమయస్ఫూర్తిగను, ఆశువుగను పాటలల్లి మధురముగ పాడెడువాడు.  పాఠశాలలో చిన్నచిన్న నాటకములలో వేషములు వేసెడువాడు. ఇతని పెదనాన్న వారసత్వముగా వచ్చిన స్వరజ్ఞానమును, అభినయకౌశలమును ఇతని ''కనకధార''నాటక పాత్ర ద్వారా గమనించినహార్మోనియముకళాకారుడు"ఖాదర్ఖాన్"సంగీతమునేర్పించుటకు"తెనాలి"దగ్గఱ"పెదరావూరు"లోని"బాలరత్నసభ"లోచేర్పించెను. 2సంవత్సరముల తదుపరి  ఖాదర్ ఖాన్, నాజరును   సంగీతవిద్యలో పైస్థాయి కొఱకు "నరసరావుపేట"లో "మురుగుళ్ల  సీతారామయ్య"  గారి దగ్గఱ చేర్పించెను.
         సీతారామయ్యగారు నాజర్ కు  సంగీతము మాత్రమే నేర్పుచు భోజనసదుపాయములకువేశ్యావీధులలోవారములనుచేయించెను.అచటనేర్చినసంగీతపరిజ్ఞానమే"పద్మశ్రీ"పురస్కారముపొందుటకు,"బుఱ్ఱకథాపితామహుడగుటకు, వాగ్గేయకారుడగుటకు" తగు స్థాయిని  కల్పించినది. 
       "నరసరావుపేట" నుండి పొన్నెకల్లు వచ్చిన తరువాత తండ్రి మరణము వలన కుటుంబ బాధ్యతలు  నెరవేర్చుటకు కూలిపని,దర్జీపనిచేసెడివాడు. చెల్లిపెళ్ళికి తనకునాటక, పాటలపోటీలలో వచ్చిన మొత్తము బంగారు, వెండి  బహుమతులనమ్మెను. దర్జీపని చేయుచు దర్జాగా పాటలుపాడుచుండగా చూచిన "కొమ్మినేనిబసవయ్యగారి" సహాయముతో సంగీతోపాధ్యాయునిగా మారెను. ఆయనచే సంగీతపుఓనమాలు, సరిగమలు  కుటుంబమంతయు  నేర్చుకొనినది.     బసవయ్యగారి కుమారుడే చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగములు చేసి స్వరచక్రవర్తిగా, సంగీత దర్శకునిగా  వెలిగిన "చక్రవర్తి." ఆ సమయములోనే కమ్యూనిస్టు వారు తమ సిద్ధాంతముల ప్రచారముకొరకు ప్రజానాట్యమండలి స్థాపించి పాటలపోటీ పెట్టి గాయకులను ఎంచి, శిక్షణ నిచ్చి రు. 32లు   నెలసరి జీతమిచ్చి పోషించిరి. సమాజ చైతన్యము కొఱకు బుఱ్ఱకథ నేర్పిరి.   నాజరు జన్మతః కళాకారుడు కనుక గొప్పప్రజ్ఞ సంపాదించెను.  బాగుగా కథలు చెప్పుచున్న సమయములో ప్రభుత్వము కమ్యూనిస్ట్పార్టీని, నాజరు బుఱ్ఱకథలను నిషేధించినది. పోలీసులు దాడులు చేయుట వలన కొంతకాలము జైలుజీవితము గడపెను. మొదటి భార్య అనారోగ్యము కారణముగా ద్వితీయ  వివాహము చేసికొనెను. దురదృష్టవశాత్తు నిండుగర్భిణి యయిన రెండవభార్య బావిలోపడి మరణించెను. తృతీయ  వివాహముగా తన మరదలిని చేసికొనగ  ఆమెకు ఐదుగురు కుమార్తెలు, యిద్దరు కుమారులు కలిగిరి.
       కొంత కాలమునకు కమ్యూనిస్టు పార్టీపై , నాజర్ బుఱ్ఱకథల పై నిషేధమెత్తివేసిరి . అప్పటినుండి మరల కథలు చెప్పుచు కొత్తకథలు వ్రాసిరి. బెంగాల్చరిత్ర, పలనాటియుద్ధము, అల్లూరిసీతారామరాజు, బొబ్బిలియుద్ధము మొదలగునవి స్వీయరచనలు. అగ్గిరాముడు, నిలువుదోపిడి, మున్నగు చిత్రాలలో నటించిరి. మహానటులు బళ్లారిరాఘవ, గోవిందరాజుల సుబ్బారావు, నందమూరి తారకరామారావు, భానుమతి వంటి వారి ప్రశంసలందుకొనిరి.  "భీమవరము"లో పెక్కురు పండితుల,సంగీతవేత్తల సమక్షములో గండపెండేరసన్మానము, ''బుఱ్ఱకథాపితామహ'' బిరుదము, ఢిల్లీలో "పద్మశ్రీ"  వంటి సత్కారము  పొందిరి. వంతలు తరచుగా మారుచున్న కారణముగా  భార్యను , చిన్న కుమారుని వంతలుగా పెట్టుకొని కథలుచెప్పిరి.  వీరిని గురించి  పరిశోధనావ్యాసము వ్రాయుటకు "శ్రీ అంగడాల వెంకటరమణమూర్తిగారు" స్వయముగా నాజరు గారిని కలసికొని జీవితచరిత్రను, అనుభవాలను సేకరించిరి. 
          జీవిత చరమాంకములోను మంచములో కూర్చొని " జాతి జీవితం - కళా పరిణామం " అను  గ్రంథమును తన కుమార్తెచేత వ్రాయించుచు దానిని నిర్దుష్టము జేయుచు 11-02-1997 అర్ధరాత్రి 12 గంటలకు స్వర్గస్తులైరి. నాజరుమహాశయుని కంఠవీణాతంత్రులు మూగబోయినవి.  స్వరము సరస్వతీ పాదమంజీర సవ్వడులలో లీనమైనది. యుగకర్తగా వెలసిన నాజరు మృతజీవుడు.    

                               ఆశ్వాసముల సంఖ్య. 5.    
                                                           
                               ఃః  విషయ సూచిక  ఃః
                               ఃః ప్రథమాశ్వాసము ఃః

  1. నాయక( నాజరు ) వర్ణనము.
  2. మస్తాన్, నాజరుల కుటుంబ పరిస్థితులు.
  3. సూర్యాస్తమయ వర్ణనము.
  4. నాజరు జననము.
  5.బాల్యము - విద్యాభ్యాసము.
  6. నాటక ప్రదర్శనము - ఖాదర్ ఖాన్ చేయూత.

                  ఃః  ద్వితీయాశ్వాసము  ఃః

  1. బాలరత్న సభలో సంగీత విద్యాభ్యాసము.
  2. రేపల్లెలో నాటక ప్రదర్శనము.
  3. మురుగుళ్ళ వారి శిష్యరికము. 
  4. వారములు చేసికొని విద్యనభ్యసించుట.
  5. పొన్నుకల్లు (బంగారు కొండ)వర్ణన, ఘనత. 
  6.విద్యాభ్యాసానంతరము పొన్నెకల్లు జేరుట.
  7. కూలి పనులకు వెళ్ళుట, దర్జీగా పని చేయుట. 
  8. నాజరునకు పితృ వియోగము.
  9. బహుమతులమ్మి చెల్లి పెండ్లి చేయుట.
 10. కొమ్మినేని బసవయ్యగారి పరిచయ భాగ్యము. 

                       ఃఃతృతీయాశ్వాసముఃః

  1. నాజరు కుటుంబ పోషణము. 
  2. సంగీతోపాధ్యాయునిగా బాధ్యతలు.
  3. నాజరు వివాహము.
  4. భారతీయ ధార్మిక వైవాహిక జీవనము.
  5. గ్రామస్థులకు నాటకములు నేర్పుట. 
  6. తుళ్ళూరులో పాటల పోటీ - విజయము. 
  7. ప్రప్రథమముగా ఈమనిలో బుఱ్ఱకథ.
  8. నాస్తికత్వ ప్రభావము. 
  9. నాజరు ఆర్య సమాజము నవలంబించుట. 
10. నాజరు ప్రథాన కథకుడగుట. 

                      ఃఃచతుర్ధాశ్వాసము ఃః

  1. నాజరు దళము రాష్ట్రపరిధి కి ఎన్నికగుట. 
  2. నాజరు "మాభూమి"కి ప్రథమ బహుమతి.
  3. నాజరు ద్వితీయ వివాహము చేసికొనుట. 
  4. నాజరు కవిగా మారుట.
  5. "బెంగాలు" వరదలను గురించి బుఱ్ఱకథ వ్రాయుట. 
  6. నాజరును "పుచ్చలపల్లి సుందరయ్య"మెచ్చుకొనుట. 
  7. గూడవల్లి రామబ్రహ్మము గారి పరిచయము.
  8. నాజరును "ఆంధ్ర అమర్ షేక్"గా పొగడుట. 
  9. కమ్యునిష్టులను, నాజరు బుఱ్ఱకథలను నిషేధించుట. 
10. నాజరునకు మోతడక ఆసామి చే చెంపదెబ్బ. 
11. ఆసామి క్షమాపణ.
12. నాజరు రెండవ భార్య మరణించుట. 
13. నాజరు కొండలలోదాగుట. 
14. ఒక కాంగ్రెస్ కార్యకర్త భీకర శపధము. 
15. నాజరును విడుదల చేయుట. 

                          ఃఃపంచమాశ్వాసము ఃః

  1. కమ్యూనిస్టులపై, నాజరు బుఱ్ఱకథలపై నిషేధము.
  2. నాజరు పల్నాటికథను బుఱ్ఱకథగ వ్రాయుట. 
  3. నాజరు బుఱ్ఱకథకు ప్రాచుర్యము పెరుగుట. 
  4.ఆకాశవాణిలో నాజరు బుఱ్ఱకథ.
  5. నాజరు చిత్రరంగ ప్రవేశము. 
  6. నాజరునకు వెన్నుపోటు పొడిచిన వంత.
  7. నాజరునకు భార్య ప్రోత్సాహము.
  8. నాజరును కలికితురాయి, బుఱ్ఱకథా సామ్రాట్.
  9. వర్షర్తు వర్ణన. 
10. గృహ నిర్మాణము.
11. నాజరు బొబ్బిలి కథ వ్రాయుట. 
12. పూలరథముపై ఊరేగింపు, గండపెండేరము, బుఱ్ఱకథా పితామహ.
13. నాజరునకు పద్మశ్రీ.
14. బాపూజీ, తండ్రి బుఱ్ఱకథావారసత్వము నిలుపుట. 
15. నాజరు గ్రంథరచన.
16. పొన్నెకల్లు లో నాజరు శిలా విగ్రహము.
                                           
                                      ఇష్టదేవతా స్తుతి

    ఉ: శ్రీహరి కోడలా! సుజన సేవిత ! వేద విహార రూపిణీ !
         వాహనమైన హంసగుణ వారసు జేయుమ నన్ను నిచ్చలున్
         దేహము మానసంబులను దిన్నగ జూడు కృపావలోకనన్
         సాహసినై చరించెదను  జక్కగ  నీ పదమంటి యుంటచే -  1
   ఉ : నాలుకవేదిక న్నిలిచి   నాట్యముజేయుచు రమ్యభావముల్
          వేలకువేలనిచ్చి శరవేగమె  పద్య ప్రబంధరాజమున్
          మేలుగ గూర్చుమంచు వరమిచ్చిన వాణి పదాలజంటపై    
          ఫాలమునుంచి మ్రొక్కెదను పాయని భక్తిని జీవితాంతమున్ - 2
    ఉ : దివ్య మనోహరంబయి సుదీపితవాఙ్మయ పూర్ఱసారమై    
          నవ్య పదాంచితంబయి మనంబుల హత్తుకొనంగజాలు-మేల్
          కావ్య మశేష ధీవరుల కంఠము లందున మారుమ్రోగగా
          భవ్య రసజ్ఞ రూపయయి పల్కగ జేయుమ రాగభారతీ ! -  3
    ఉ : ధర్మమె మారురూపమయి ధర్మమె నిత్యము  సాధనమ్ముగా
          కర్మల నాచరింప ఘన కంటకదూషిత కాననంబుల
          న్నిర్మలచిత్తుడై దిరిగి నీతివిదూరుల నేలగూల్చి- యా
          మర్మము విప్పిజెప్పు పరమాత్ముని శ్రీరఘురాము గొల్చెదన్ - 4
    ఉ : లంకను జేరనీయనని లంకిణి భీకర క్రూరవ‌ృత్తిమై
          బింకముతోడ దేహమటు బెంచుచు దూకుచు మ్రింగబోవ - ని
          శ్శంకత సూక్ష్మరూపియయి చక్కగ నాస్యము లోనికేగి - యా
          వంకనె వచ్చినట్టి ఘన వానరవీరు  నమస్కరించెదన్ - 5
    ఉ : బావిని నీవుగా వెలసి భక్త జనాళి హృదంతరమ్ములన్ 
          దావుల నింపినావుగద! ధన్యత గూర్చుచు కాణిపాకము
          న్బ్రోవర శ్రీగణాధిపుడ ! మోదకహస్తుడ ! విఘ్నవారణా !
          భావన జేతు నిన్సతము పార్వతి పుత్రుడ ! యేకదంతుడా - 6
   ఉ : శ్రీపురవాసియై బరఁగి చిన్మయ రూపగ కీర్తినందియున్ 
          బాపురె భక్తకోటికిల బంగరుతల్లిగ భద్రవల్లిగా 
          ప్రాపున జేరినన్ మరియు పాయనిగూర్మిని  చింతజేసిన
          న్బాపములెల్ల ద్రుంచి నిరపాయము గూర్చెడి లక్ష్మిగొల్చెదన్  - 7 

                                   పూర్వకవి స్తుతి
    కం : రామాయణంబు వ్రాసిన 
            శ్రీమంతుడు భక్తవరుడు శ్రీవాల్మీకిన్
           ప్రేమాదరములు పొంగగ 
            నా మానస మందిరాన నయముగ గొల్తున్ - 8
    ఉ : రాజమహేంద్రపట్టణము రంజిలు రీతిని సంచరించి - వి 
           భ్రాజిత పాండితీ గరిమ భారతమాంధ్రి రచించెనౌర ! సం                   
           పూజిత "నన్నయార్యు" మది మ్రొక్కుదు కోరుదు నాశిషంబులన్ 
           జాజులు విచ్చినట్లు విరజాజులు పూచినయట్లు నెమ్మదిన్ - 9
ఆ.వె : తెలుగు పలుకుబడిని తేనెలు గురియించి 
           పాత్ర పోషణమున ప్రజ్ఞ జూపి 
           నాటకీయశిల్ప నవ్యతజూపిన 
          "తిక్కయజ్వ"కవి నుతింతు నేను -10
    ఉ : భారత శేషముం దనదు  భాగ్యముగా బరిపూర్తిజేసి - మేల్ 
           వారసుడయ్యె "నెఱ్ఱన" నవారిత ధీరత  పండితాళికిన్
           భూరి యశంబుగన్న కవిపూజ్యుడు పుణ్యుడు ధన్యుడాతడే 
           చేరి నమస్కరింతుకడు శ్రేయము గూర్పగ నండనుండఁగన్ - 11
  కం: భాగవత పుణ్య గాథను 
          రాగ సుధాభరిత దివ్య  రసములతోడన్ 
          సాగగ జేసిన "పోతన 
          యోగికి" జెల్లింతు నతుల నున్నతభక్తిన్ - 12

                             గురుస్తుతి

ఆ.వె : బాల్యమందు తనదు బడిలోన జేర్పించి
           ఓనమాలు నాకు నొడిని నేర్పి 
          పెద్దజేసినట్టి పెన్నిధి రూపమౌ 
          "కొండ కృష్ణమూర్తి"  గొల్తునెపుడు - 13
 తే.గీ : ఆంధ్రవ్యాసు ‘‘ననంతరామా’’ ఖ్య గురుని
           శ్రేష్ఠు శ్రీవత్సగోత్రు సుశీలు సౌమ్య 
           కావ్యవారాశి నీదిన ఘనుని మదిని 
           దలఁతు నాదు పుట్టుక చరితార్థమంద - 14
ఆ.వె : మందహాసముననె వందల భావాలు 
          పొందుపఱచి సభల విందుజేయు 
          ప్రథితు "బేతవోలు" బ్రార్ధింతు మదిలోన 
          మరువలేను నేను మాన్యచరితు - 15
        
                   మిత్ర ప్రోత్సాహము 

    సీ : ఎవ్వాడు  పందొమ్మిదేండ్లకు నొజ్జయై 
                             సంస్థలో శిష్యుల సానబట్టె 
          ఎవ్వాడు  రూపాన నెంతలే యనిపించి 
                           కావ్యరంగమునందు గలముబట్టె 
          ఎవ్వాడు  కీర్తిని నెవ్వేళ బొందుచు 
                          స్థానిక హృదయాల స్థానమందె
          ఎవ్వాడు  వినయంబు నేనాడు విడువక 
                          పెద్దలదృష్ఠిలో బెద్దయయ్యె 
           ఎవ్వాడు శతకంబు నిట్టె వ్రాసియు చూపె
                           పద్యతోరణమున ప్రతిన బట్టి
   తే.గీ: అట్టి "జయరామ శర్మ"యే యాదరాన 
           "సూర్యనారాయణా !"నీవె సుకృతివగుచు 
            కావ్యరచనకు బూనుము ఖ్యాతిగలుగు 
            నంచుబలికెను గూర్మితో నన్ను జేరి - 16
     కం: మిత్రుని కోర్కెనుదీర్పగ
            నాత్రముగా బూనుకొంటి నంచిత రీతిన్ 
            చిత్ర విచిత్రపుగవితల 
            శ్రోత్రములకు విందుగూర్ప సురుచిర ఫణితిన్ -17

                              కృతిపతి స్వప్నదర్శనము

  18:వ: నవరసభావానుబంధబంధురంబుగా నొక్కప్రబంధంబు నిర్మింపందలంచి, డోలాయమానమానసుండనై మహాప్రబంధంబునకుం దగిన పుణ్యశ్లోకుండును, సర్వకళాకోవిదుండును, ధీశాలియును, మహోదాత్తుండెవరొకో యని మథనపడుచున్న సమయంబున  నా పితృదేవులు పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరావు పూజ్యపాదులు స్వప్నంబు నందు గానుపించి ప్రేమానురాగ పురస్సరపుత్రగాత్రపరిష్వంగంబు గావించి "నాయనా!నీవువంశవిఖ్యాతినిబెంచ  సంస్కృతాంధ్రమ్ములు నేర్చిన సూరివి. మా తండ్రిగారయిన "సూర్యనారాయణ" నామాంకితుడవు. సుగుణశీలివి. ప్రబంధరచనా, పఠనాసక్తుండవు. పొన్నెకంటి వంశ బుధమండలిమండితుండవు. మన గ్రామవాసియై బుఱ్ఱకథాపితామహునిగ,నవయుగవాగ్గేయకారుండుగ, నవసమాజచైతన్యకారకుండుగ,మహోద్దండపండితమండలిచేమన్ననలంది,గండపెండేర ఘనసత్కారంబు లంబొంది,ప్రభుత్వముత్కృష్ఠకళాకారులకిచ్చు"పద్మశ్రీ"   బిరుదాంచితుండై వాసిగాంచిన "షేక్ నాజర్" చరిత్రను ప్రబంధంబుగా వ్రాసి నాకంకితమిమ్మని కోరగా  అమందానంద కందళిత హృదయారవిందుడనై  జనకుని యాదేశము సిద్ధింపజేయ సంసిద్ధుండనై వారి చరణారవిందములకుం బ్రణమిల్లి ప్రబంధ రచనకు శ్రీ కారంబు జుట్టబోవుచున్నాడను.

                                     : కృతిపతి వంశావతార వర్ణన, ప్రశంస :   

సీ :   పొన్నెకల్లనియెడి పున్నెంపు గ్రామంబు 
                                   గుంటూరు జిల్లాను గొప్పజేసె 
        ఆంగ్లేయ పాలనన్నౌదల దాల్చని 
                                   చురుకైన ధీయుత శూరులున్న
        నల్లరేగడి నేల నాణెంపు భూమిలో 
                                   పంటలేయవి యైన ఫలములీన 
        సత్కళామూర్తులు సాహితీ స్ఫూర్తులు 
                                   సత్కవులచ్చోట జననమొంద 
తే .గీ :  సిరుల నిలయమౌ నద్దాని చేవజూచి 
            స్పర్థ  యున్నను తమకది వ్యర్థ మనుచు 
            సాటి గ్రామాలు తలవంచి సాగిపోయె 
            నిజము గ్రహియింపజాలిన నేస్తులగుట .
సీ :  కరిణీకమన్  వృత్తి గౌరవమింపార 
                           సాగించుచుండెడు సాధుమతులు 
       బేహారముంజేసి ప్రియమార నార్జించు 
                           బిడియంపు వైశ్యుల వింతగతులు 
      వ్యవసాయ మొక్కటే వారి జీవనమని 
                           కష్టించి పండించు కర్షకాళి 
     రుగ్మతల్ వచ్చినన్ రోజుకూలికినేగు 
                           నిరుపేద వర్గాల నిమ్నగతులం
  తే. గీ :  గాంచగలమయ్య యప్పొన్నెకల్లు నగరి
              బ్రాహ్మణోత్తమ, బేహార వర్గములను 
              కూర్మి రెడ్లను, పింజారి కులమువారి 
              వృత్తి ధర్మంబె  దైవమై వెలుగువారి . - 19. 
ఆ.వె  :  సిరులు యశము గల్గు "శ్రీవత్స" గోత్రజుల్ 
             పొన్నెకల్లు లోన మిన్నలైరి 
             వారి యింటిపేరు వాసిగ మారెను 
             "పొన్నెకంటి" యనగ బుడమియందు .- 20. 
ఆ.వె :   పొన్నెకంటివంశ పూర్ణాబ్ధి చంద్రుండు 
            "రామసామి" వెలసి రాణకెక్కె 
            సుతులు వెలుగు జూచె "సూర్యనారాయణ,
            రామనాథమనగ రాగమతులు .- 21. 
తే.గీ :  "సూర్యనారాయణాఖ్యు"ని సుతులిరువురు 
           "మాధవుండును పూర్ణయ్య" మనిరి కూర్మి 
          పూర్ణచంద్రుని  యిల్లాలు పుణ్యవతిగ 
          వఱలె " ననసూయ"పేరిట వసుధయందు .- 22. 
తే.గీ:   పుణ్య దంపతులిరువురు మోదమొంద 
          "నరసవిలి సూర్యదేవుని" వరమువలన  
           "సూర్యనారాయణాఖ్యుండు" సూనుడాయె 
          "సూరి" పేరున సజ్జన స్తుత్యుడాయె .- 23. 
          ధుర్యుండాతం"డరుణుడు"
కం :   "సూర్యేందిర"లకు బంటగ
          కార్యజ్ఞుండైన సుతుడు క్రన్నన బుట్టెన్ 
           మర్యాదాంచిత  యశుండు మాన్యుండతడే .- 24. 
తే.గీ.   సూర్యనారాయణ సుకవి సోదరుండు 
          "పాండురంగ విఠలుడను " పరమ లౌకి 
           కుండు గ్రామకరణముగ గొలువుఁ జేసి 
          కోర్కెమీరగ విశ్రాంతి గొనుచునుండె .- 25. 
కం :  "కైలాస"నామధేయుడు 
         లాలితముగ బుత్రుడయ్యె "లక్ష్మీపతికిన్"
         ఆలంబమనగ నిల్చెను 
          కాలోచితమైనరీతి గారవమొప్పన్ . - 26. 

                       షష్ఠ్యంతములు 
కం :  శ్రీమంతుడైన వానికి 
          రామార్పిత మానసునకు రాజిత మతికిన్ 
         ధీమంత వినయశీలికి 
         ప్రేమాస్పద పూర్ణరూప పితృదేవునకున్ .- 27.  
కం :   కాలోచిత సద్భాషికి  
         సాలోచన తత్పరునకు  సజ్జననుతికిన్ 
         శూలాయుధు నామంబున  
         లీలం జరియించు  విస్ఫులింగంబునకున్ .- 28. 
కం.    అలిమేలుమంగసుతునకు 
          సలలితభావోన్నతుండు సంపూర్ణునకు
          న్నిలలో ఖ్యాతిని గాంచిన    
          తెలుగును ప్రేమించునట్టి  తేజోనిధికిన్.- 29.
కం :    సునిశితునకు సుగుణ మణికి 
          జనతతి హృదయానువర్తి చాతుర్యునకున్ 
          మనముల గెలిచిన  వానికి
          ఘన చరితను గలిగినట్టి  గంభీరునకున్ .- 30.  
                                     
                             
        
            
     
                                      
          
     
        

                   
       
       
     
     

22, నవంబర్ 2019, శుక్రవారం

నాజరుచరితము. ప్రథమ,ద్వితీయ. ఆశ్వాసాలు.


                                 

   ముఖ పుస్తక కవిపండితులందరు తలా ఒక కావ్యం వ్రాయాలని ప్రకటన ఇచ్చాము. అందరు తలకొకటి వ్రాస్తున్నారు మీరు కూడ ఒక కావ్యం వ్రాయండి "అని (అదేదో చాలా చిన్న పని , అలవోకగా నేను చేయగలిగిన పని అయినట్లు) చాలా ప్రేమపూర్వకముగా నాకు ఫోన్ చేసి చెప్పారు మాన్యులు, సుకవితా విశారదులు, ప్రొఫెసర్ గారైన పట్వర్థన్ గారు. నేను ఆ ఆనందంలో నా స్థాయి మరచి "(తగరు పర్వతమును ఢీకొన యత్నించిన రీతి) ఆత్మవిశ్వాసంతో దేనినైనా సాధింప నగును. అని తలచి తలయూచాను సరేనంటు. రెండు రోజులు ఏమి వ్రాద్దామా ?అని జుట్టు పీక్కుంటున్న తరుణంలో ఒక మెఱుపు ఆలోచన వచ్చింది. అదే నా జన్మస్థలమే తన జన్మ స్థలముగాగల ప్రపంచ ప్రముఖ బుఱ్ఱకథాకళాకారుడు, బుఱ్ఱకథా పితామహుడైన పద్మశ్రీ షేక్ నాజర్ గారి జీవిత చరిత్ర ను పంచాశ్వాసాల కావ్యంగా వ్రాయపూనుకొన్నాను. పూర్తి సమాచారం లేక చింతపడుచున్న తరుణంలో నడిసంద్రంలో నావలాగా యూట్యూబ్ లో మాన్యులు టాక్ షో నిర్వాహకులు, బహుకళాభిజ్ఞులైన కిరణ్ ప్రభగారి "బుఱ్ఱకథ నాజర్ "గురించి కొంత సమాచారం, డా. అంగడాల వెంకట రమణమూర్తి గారి పరిశోధనా గ్రంథం "పింజారి" వలన పూర్తి సమాచారం నా అదృష్టం వలన లభించింది. వారా చరిత్రలో వ్రాసిన విషయాలలో శత సహస్రాంశము కూడ నేను వ్రాయలేకపోయాను. సముద్రములోని నీటిని, చాపిన అరచేతిలోనికి తీసికొని నట్లయినది. దొరికిన వరకే అదృష్టం ."చేసికొన్నవారికి చేసికొన్నంత మహదేవ " ఆకావ్యము లోని మంచిచెడుల ఫలితాలు ఈ నెల(అక్టోబరు 13న ) రాబోతున్నాయి. కావ్యం వ్రాయుటే ఘనముగా భావించిన నాకు బహుమానంతో సంబంధం లేదు. వ్రాసిన 29మంది కవులలో నేను కూడ ఒకడినిగా పాలు పంచుకొనగల్గుటే అపురూపం. సాహితీ సింధువులో నేనొక బిందువును. అందుకే ఈ ఆనందాన్ని అందరితో పంచుకొంటున్నాను, శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మ పాదరేణువు సాక్షిగా..... నాకీ విషయంలో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా సహాయపడిన నాజర్ గారి ద్వితీయ కుమారుడు , అద్వితీయ కళాసాహిత్యకారుడు , కళావారసుడు ,అయిన శ్రీ షేక్ బాబూజీ గారికి, పరోక్షంగా సహాయపడిన కిరణ్ ప్రభగారికి , డా. అంగడాల వెంకట రమణగారికి హార్దిక ధన్యవాదాలు. నాకు కలుగబోయే గౌరవములో వీరందరు భాగస్వాములే. నేను ప్రతిరోజు వ్రాసిన పద్యములను నిర్దుష్టము , సారవంతము చేయుచు సాయపడిన నా యనుంగు సోదరుడు జొన్నలగడ్డ జయరామ శర్మకు , అంగడాల వారిని పరిచయం చేసిన యువకవి ముష్టి కృష్ణకిశోర్ కు నా ధన్యవాదాలు. అందరికి దసరా శుభాకాంక్షలు.

ప్రథమమాశ్వాసము:

                                నాయక(నాజరు)వర్ణన.
 వ : అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్పంబూనిన "బుఱ్ఱకథ నాజరుచరిత"మను మహా ప్రబంధంబునకు గథానాయకుండెట్టివాడనిన

  1. ఉ : శ్రీసతి దూరమై చనిన సిద్ధము నేనని లౌకికంబుగా
            ‘‘దాసుడనమ్మనీకు వరదానము జేయుమ నల్వరాణిరో!
            కాసుల నేను గోరన’’ని కామితము న్వెలిబుచ్చినట్టి సం
            వాసిత నాయకుండపర వామనమూర్తియె పొన్నెకంటిలోన్.
 2.చం: సురుచిర సుందరంబయిన సూక్ష్మపదంబుల మేళవింపుతో
           సరియగు రాగ తాళముల చక్కని చిక్కని భావనాళిచే
           మురిపెము గూర్చి పండితుల మోదము నందెడు కల్పనాళిచే
           నరవరుడై వెలుంగు ఘన నాయకవీరు నుతింపశక్యమే!
 3.సీ : బెంగాలు కరువుచే పెను బాధలందిన
                       కర్మజీవుల గూర్చి కథను వ్రాసి
          బుఱ్ఱకథగ మార్చి భువి నాల్గుచెఱగులన్
                        ధీరతంజెప్పిన ధీ విశాలి
          "బళ్ళారిరాఘవే" బహు ప్రేమ కొండాడ
                         జన్మ ధన్యంబైన చరితుడతడు
            పట్టుబట్టుటె కాని పరమాత్మ చెప్పినన్
                         పట్టువీడని యట్టి పంతగాడు
   తే.గీ:  కళనె దైవంబుగా నెంచి కామితార్థ
            ములను సాధింప జాలిన పుణ్యజీవి
            సార యశుడసమాన ప్రసాదగుణుడు
            నవ్య సద్భావ పరిమళ నాయకుండు.
  4. ఉ : శ్రీ తనయింట నొల్లనని జెప్పక జెప్పుచు శీతకన్నుతో
            యాతనబెట్టిన న్నగుచు నాగ్రహమందక మాతృప్రేమతో
           "నా తలరాత యిద్దియని" "నాజరు" పల్కులరాణికిన్ సదా
             జోతలువెట్టుచున్ సతము చూపెను శ్రద్ధను జీవితాంతమున్.
  5. చం: క్షణమది వమ్ముసేయకయె కాలము సద్వినియోగపర్చుచున్
             గుణగణ శోభలం గుసుమ కోమల మానస ధీ విశేషతన్
             మణివలె వెల్గినట్టి జన మాన్యుడు"నాజరు"పండితాళికిన్
             రణమున గెల్వరాని రఘురాముడొ యేమొ యనంగ దోచెడిన్.

              మస్తాన్, నాజరుల కుటుంబ స్థితి గతులు.


  6. సీ :  రెక్కాడినంగాని డొక్కాడదనియెడు
                               కూలి కుటుంబమై జాలిగొలుపు
              ఉన్నత విద్యల నూసెత్తగా రాని
                                యసమర్థ యాత్రయై యడలుబ్రతుకు
              సజ్జగింజల దెచ్చి సలసల గ్రాగెడు
                                నీటిలో నుడికించు నిమ్నజాతి
              కూలి లేకున్ననా కుండలో "చల్ల"నే
                                యమృత సమమ్ముగా నందుకొనును
   తే.గీ.   ఇదియె నాజరు మస్తాన్ల ఇండ్లతీరు
              పొన్నెకల్లు న జన్మించి పోరులేక
              కళల వారసులౌచును కలసియుండి
              జీవనంబుల గడపిరి చిత్తమలర.
  7. రుచిర వృత్తము.( జభసజగా...9వ.అ.యతి )
                                విశేష వీరకథల విస్ఫులింగమై
                               జగాన బుఱ్ఱకథను జంకులేకయే
                               కవిత్వ తత్త్వమెఱిగి గజ్జకట్ట-నీ
                                కె చెల్లు!"నాజరు" ఘనకీర్తి పాత్రుడా!
   8. మ: గృహమందెంతయొ లేమి సాగినను సంగీతమ్మునే ధ్యాసగా
             మహదౌన్నత్య విధానమున్ సలుపు శ్రీమంతుండు మేధావియున్       
             సహనం బెన్నడు వీడనట్టి వర ధీశాలుండు తానొక్కడే
             అహమున్గెల్చిన"నాజరాహ్వయుడు"రాగాతీత శుభ్రాత్ముడౌ.
  9.సీ :  "నాజరు మస్తాన్లు"నవ్యరీతులతోడ
                                    సంగీత విద్యలో సమములైరి
              ఒక్కొక్క ముఖముగా నొక్కొక్క వాణిగా
                                   సోదరు లిర్వురు పాదుకొనిరి
             "చెక్క భజన"కు ప్రసిద్ధుడై "మస్తాను"
                                    మాన్యుండె కాదుసమ్మాన్యుడయ్యె 
             "షెహనాయి"వాదనన్ బహు మేథనడరిన
                                    "నాజరు"కొంగ్రొత్త నడలునడిచె
   తే.గీ. :  ఇట్టి సంగీత పాండిత్య ముట్టిపడెడు
               అన్నదమ్ములు ప్రేమగ నహరహమ్ము
               కలసియుండిరి యొకచోట కాపురాన
               "పొన్నెకల్లు"న నద్భుతామోఘ రీతి.
  10. తే.గీ : అన్నదమ్ములు సంతోషమందుచుండ
                 వీరి గాన విజ్ఞానైక విభవములకు
                 శివుని కన్నుగుట్టినదేమొ చేరబిలువ
                అతిథి యయె "నాజర"దె రజతాద్రికకట!
 వ.  అత్తఱి దుఃఖసాగరంబున మునిగియున్న మస్తాను కుటుంబావస్థను గాంచలేని రవి పశ్చిమాద్రికింజనియె.

                        సూర్యాస్తమయ వర్ణన.

  11. సీ :  తన కాంతిరేఖలన్ ధరణీ జనులకెల్ల
                                        వెల్గుల బంచెడు వే వెలుంగు
               చిఱు వేడి బ్రసరించి చేతనత్వముబెంచు
                                         ప్రత్యక్ష దైవమౌ భాస్కరుండు
                మధ్యాహ్నబింబమై మరికొంత  తైక్ష్ణ్యం పు 
                                        చేవ చూపించు  రోచిష్ణుమూర్తి
                సంధ్యాసతీ ఫాలచారు కుంకుమయౌచు
                                         అందాలు చిందునహస్కరుండు
     తే.గీ :  సృష్టి నియమమున్  దలదాల్చి స్వేచ్ఛ నుడిగి 
                తూర్పుగొండకు చరచరా దూరమగుచు
                మౌన ముద్రను బాటించి మ్లానుడగుచు
                బశ్చిమాద్రికి గతిలేక పాఱిపోయె.
 12. తే.గీ : తోడబుట్టువు గోల్పోయి దుఃఖితుండు
                 ఒంటివాడయ్యు భరియించెనోర్మి తోడ
                 కాలవశమున దినసరి కూలియగుచు
                 షేకు మస్తాను సాగించె జీవనంబు.

వ: భారతీయుల కర్మసిద్ధాంతమైన పునర్జన్మ ననుసరించి మృతింజెందిన "నాజరు" తన ప్రియ సోదర గర్భసంజాతునిగా రాదలంచి సూర్యోదయంబు పగిది "మస్తాను"గా నుదయాద్రిని ఉదయించెను.
                         
                          నాజరు జననము.

  13. సీ :  జీవిత లక్ష్యమ్ము చేరుకోవలెనంచు
                                  మమతానురాగముల్ మహినిజేరి
               సంగీత నాదముల్ సాహితీ భేదముల్
                                   నిత్యాధ్యయనమౌచు నేర్పుమీర
               అనితర సాధ్యమౌ వ్యాసంగముంజేసి
                                   యర్థాంతరమ్ముగా నమరులైన
               నరులు పునర్జన్మ వరలుదు రనియెడు
                                    విశ్వాసమున సాగు విపుల జగము
     తే.గీ :   ఘనతగాంచిన"షెహనాయి"కౌశలుండు
                "షేకునాజర"నియెడు నా శ్రేష్ఠతముడు
                 సోదరుని యింట బుట్టెను సుకృతియనగ
                 సర్వ సత్కళాభానుని సామ్యుడగుచు. 
 14. తే.గీ : మాన్యు జేయును వట్టి సామాన్యునైన
                 ధనికు నొనరించు హీను నిర్ధనునినైన
                 ఆటలాడించి చూచు గెల్పోటములను
                 కాల మహిమంబు నెవ్వరు కానగలరు?
 15. తే.గీ :  ఖేద మొనగూర్చు దైవమే మోదమిచ్చు
                  నటుల "మస్తాను"గృహమున నడుగుమోపె
                  శిశువు రూపాన నాజరే చిత్రముగను
                  పూర్తిచేయంగ లక్ష్యముం బుట్టెనతడు.
 16. తే.గీ :  అన్నరూపంబు మరువకయున్నకతన
                 కంటి ముందట మెదలెడు కన్నకొడుకె
                 అతని పేరును నిలబెట్టునంచుదలచి
                 నామకరణంబు జేయించె "నాజరనుచు"
  17. కం :   దూదేకు కులమువారిని
                  భేదంబుగ జూచి ప్రజలు పింజారులనెన్
                  ఏదో కానిమ్మంచును
                 ఆదారినె బోవుచుండి రందఱు క్రమమున్.
 18.ఉ : ఏకుట వృత్తిగాగలిగి యింపుగ పింజను పింజనమ్ముతో
             దాకుచు దాని నంతటిని దర్పత తల్పము సేయుటంజుమీ
             ఆ కులమున్ సదా పిలచిరట్టుల తత్ప్రజలాదరింపగా
             బ్రాకట రీతి వారు ఘనులై వెలుగొందిరి వృత్తి విద్యలోన్.
 19.తే.గీ: పొట్టకూటికి నొక వృత్తి పూర్ణఫలము
               కలుగజేయదులెమ్మను కారణాన
               కూలి పనులను సాగించె  కులములేక
               సభ్యులెల్లరు పొలము నాసామికడను.
 20. ఉ : రెక్కలు ముక్కలై చనిన రేపటికుండదు రూకయొక్కటిన్
              దక్కిననాడె దక్కునని దైవముపై పెను భారముంచి  యే
              దిక్కునకేని యేగుచును దిండికి జాలిన సొమ్ముగోరుచున్
              చక్కని కాపురంబటుల సల్పెను షేకు కుటుంబమంతయున్.
 21.ఉత్సాహ వృత్తము: 
                    పుట్టె చిన్న నాజరయ్య ముద్దు లొలుకు మోముతో
                     షేకు వంశ కీర్తి బెంచ సిరుల పంట దొరలగా
                     తల్లి దండ్రి బంధు తతులు తన్మయంబు జెందగా
                     చందమామ వోలె వరలె సాటివారు మెచ్చగా.
       
         
                            నాజరు బాల్యము - విద్యాభ్యాసము.


 22. ఉ : పంచ శరద్వయస్సుననె బాలుని విద్యల నేర్వబంపుటల్
              మంచిదటంచు దెల్పిరట మాన్యులు కావున తల్లి దండ్రులే
              కొంచెము జాగుసేయకయె కూర్మిని బంపిరి పాఠశాలకున్
              సంచిత కర్మలం గలుగు చక్కని యూహలు ప్రోద్బలంబులౌ.
 23. తే.గీ :  పేద విద్యార్థి గణముల పెన్నిధియగు
                  ప్రాథమిక పాఠశాల యొప్పారెనొకటి
                  పొన్నెకంటికి బుణ్యంబు పుచ్చెననగ
                  అందు జేర్చిరి కొమరుని హ్లాదమొదవ.
 24. తే.గీ :  రుసుము జెల్లింప మనకడ రూకలేదు
                 ఇతర సంస్థల జేర్పించు గతియులేదు
                 ప్రభుతదౌ యీ బడియెమన భాగ్యమనుచు
                 ముదము జెందెను మస్తాను హృదయమందు.
 25. సీ : వయసున బిన్నయై వంకలు జెప్పక
                              పాఠశాలకునేగు పట్టుదలగ
              సాటివారిండ్లకు సహవాసమని యేగి
                              కాలయాపన లేదు క్షణముగూడ
              తోటి విద్యార్థికి తోడుగా నుండును
                              పఠన పాఠనముల పజ్జజేరి
               ఆశుకవితలల్లి యలవోక బాణీల
                               వినిపించు ప్రజలెల్ల విస్తుపోవ
   ఆ.వె : ఆతడెవడొ కాదు హంసవాహినియైన
             వాణి దయను భావి వఱలగల్గు
             విమల షేకు కులము వేగుచుక్కనదగు
              నాజరనెడువాడు నయగుణుండు.
 26. సీ : ఏరీతి బాడిన నింపైన రాగమై
                             శ్రవణ పర్వంబయి  సాగిపోవు
             ఏరీతి బల్కిన నెంతయో చతురమై
                            సమయోచితంబౌచు సరసమగును
            ఏరీతి చిందైన  నేర్చిన నటనమై
                            సత్కళారూపంపు సౌరునింపు
            ఏరీతి నడచిన నెల్లరు ముగ్ధులై
                             ప్రేమను బంచగా పిలుతురతని
     తే.గీ : ఆతడాతడె నాజరాహ్వయుడు నాటి
              బాలమేధావి యయ్యె నప్పాఠశాల
               కీర్తి కాంతకు బ్రియమైన మూర్తి గాగ
              ప్రజల తలలోని నాల్కయై పరిఢవిల్లి.
 27. పంచచామరము : 
                                  అనేక రీతి గీతులే  మహాద్భుతంబులై సదా
                                  జనాళి మెచ్చగన్ స్వరాళి శారదాంబ పల్కగా
                                  మనంబు లెల్ల నుల్లసిల్లి మంగళమ్ము దెల్పగా
                                  దినంబు లట్లు దొర్లసాగె దేవతా ప్రసాదమై.

      వ : ఈరీతిగానున్న నత్తరుణంబున నాజరొకనాడు పాఠశాల నుండి వచ్చి

 28. సీ : "అమ్మా! బడిముగిసె న్నాకలి రోకలై
                                 కడుపు దంచుచునుండె- కాళ్ళు గడిగి
              తిన్ తడిలేకయె, తినవలె సజ్జలు
                                  జొన్నల దేదైన నన్నమిపుడ
               నగ, తల్లి "బీబాబి""నాయన! నీతండ్రి
                                   కూలికి బోలేదు కూడులేదు
               సజ్జజొన్నలులేవు సల్లనుతాగియే
                                  సదువుకో నీవంచు సాగనంపె"
    తే.గీ : కన్నకొడుకటులడిగిన నన్నమిడక
             "సల్ల"బోసిన ఘనమైన చరిత నాది
             ఏమి సేయగ నెంచెనో ఈశ్వరుండు
             తెలియగా రాదదేరికి దెలివియున్న.
 29. ఆ.వె : అమ్మ పలుకు వినగ నాశువు రూపమై
                 కమ్మనైన పాట కదలిరాగ
                 పాఠశాలకపుడు పరువెత్తి పరువెత్తి
                 తనదు గళము విప్పె తన్మయముగ.
 30. తే.గీ : "సజ్జ జొన్నలు లేవులే సల్లదాగి
                  సదువుకోవయ్య నాయనా! సల్లగుండు"
                  మనెడు దానిని రాగాన నాలపించి
                 "నాజరం"దరి తలలోన నాల్కయయ్యె.

                నాజరు నాటక ప్రదర్శనము - ఖాదర్ ఖాన్ చేయూత.



  వ : ఇవ్విధంబుగా  గాన నటనా చతురుండైన "నాజరు" తన పాఠశాల యందున్ జిన్న జిన్న నాటకంబులలో పాల్గొనుచుండగా నచటనే జరుగబోవు "కనకతార" నాటకంబున "శ్యామల రెడ్డి"గారి ప్రోత్సాహంబునన్   బాత్రధారికాగా తన్నాటకమునకు "హార్మోనియం" కళాకారుండగు  "ఖాదర్ సాహెబ్" నాజరు బహుముఖ ప్రజ్ఞకాశ్చర్యంపడి స్వయంబుగా మస్తానును కలసి "నీ కుమారుని నాతో పంపిన నేను సంగీతము నేర్పింతు"ననుచు

 31. ఉ : పాటలు పాడుచుండె రసభంగము లేకయె నీ కుమారుడా
             బాటనె శిక్షణం  గఱుప భావి విశేష మహోన్నతుండగు
             న్నాటక చక్రవర్తి యగు నంచును"ఖాదరు"నచ్చజెప్పుచుం (అఖండయతి)
             జోటును మార్చె తాను ఘన సోదర పండితులున్న చోటికిన్.
 32. ఉ : నాజరు నాటకంబునకు నవ్య పరీమళ శోభలద్దగ
             న్నా జనులెల్ల ముగ్ధులయి హార్దిక దీవన లిచ్చుచుండగా
             రోజుకురోజుకున్ సుమధురోహలు నిండెను మానసంబునన్(అఖండయతి)
             సాజముగాదదేరికిని సద్యశమొందు ఫలంబులందగన్.
 33. ఉ : ఖాదరుఖానె స్వాంతమున  కౌతుకమొప్పగ నాజరింటికిన్
             ఆదరమొప్ప వచ్చి తన యంకిత భావము వెల్వరింపగా
             మోదముతోననెన్"మధుర మోహన గాత్రముగల్గు నీ సుతున్
            "నాద"రహస్యముల్దెలుపు నాటక సంస్థను నేను జేర్చెదన్."
 34.తే.గీ : చిన్నినాన్నను మీచెంత జేర్చుచుంటి
               చిల్లిగవ్వైన నీయంగ చేతలేదు
               భారమంతయు నీదయ్య భద్రమనుచు
               శిరము నిమురుచు కన్నులు చెమ్మగిల్ల
               దశ శరత్తులు నిండని తనయునపుడు
               పంపె మస్తాను బంగారు భవితకొఱకు.
 35. మ : "పెదరావూరు"న "బాలరత్నసభ"లో పేర్జేర్చె విద్యార్థిగా
               ఉదయం బస్తమయంబులున్ "సరిగమల్"ఉత్సాహ సంరంభతన్
               పదమంచు న్నటనాలయంబునకు నభ్యాసంబు జేయింపగా
               మదిలో నాజరు తల్చె నిట్టులని "సమ్మాన్యుండులే ఖాదరే".

 వ : ఇట్లు మస్తాను తన యనుంగుబిడ్డండును, సప్తవర్షప్రాయుండునైన "నాజరును"   ఖాదరు చేతులలో నిడుచు "అయ్యా! పూటగడచుట కష్టమైన మేము వీనికి చదువును జెప్పింప నసమర్థులము. వాని పూర్వజన్మ సుకృతము వలన స్వర జ్ఞానమబ్బినది. అది మీవంటి  పండితుల  వలన పండి సత్ఫలములిచ్చిన మాకన్న నదృష్టవంతు లెవరుండరనుచు కుమారుండు గ్రామాంతరంబున కేగుచున్నందులకు దిగులుంజెందుచు తత్ గ్రామంబును "తెనాలి"కి దగ్గఱగానున్న "పెదరావూరు" అయినందులకు గొంత మనంబును సంబాళించుకొని కుమారున కనేకానేక సూక్తులం జెప్పుచు వీడ్కొలిపెనంతట
                                     : ఆశ్వాసాంతము :
 36.మ: గరువం బింతయు లేదు నీదరిని సత్కారుణ్య పుణ్యాత్మ! నిన్
            శరణంబన్నను గాతువెప్పుడును నిశ్శంకన్ మహాభాగ!మేల్
            వరముల్గూర్తువు  పేదవారలకు శ్రీవర్థిల్ల శుభ్రాత్ముడా!
            నరనారాయణ సేవనాధిషణ! సమ్మానార్హసౌశీల్యమా!
 37. కం : ఓపొన్నెకంటి వాసా!
              శ్రీపూర్ణమనోజ్ఞకలిత శ్రీవత్సాంకా!
              ప్రాపంచిక విషయంబుల
              తాపంబులు లేనివాడ! ధాతృ సమానా!
 వ :  ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన   పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండును,  సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన "బుఱ్ఱకథనాజరుచరిత" మందలి
                             ప్రథమాశ్వాసంబు.  
                                 📖      📖        📖

                    :ద్వితీయాశ్వాసము: బుఱ్ఱకథనాజరుచరిత 


        1.కం : శ్రీ పూర్ణచంద్రనామా!

                  పాపాచరణైక కర్మభావ విరహితా!
                  మాపాలి దైవమనగను
                  కాపాడుము సంతతంబు కరుణాసింధూ!

  వ : షేకు మస్తాను తన కుమారునకు వీడ్కోలు పలికిన తదనంతరంబునం బ్రవర్తిత
    వృత్తాంతంబు నవధరింపుము.

    "బాలరత్న సభ"- సంగీతాభ్యాసము.


 2. శా : సంగీతంబును నాట్యమాది కళలన్ శాస్త్రోక్తరీతిన్ విధిన్

            సాంగోపాంగముగాగ నేర్పు కతనన్ సంసిద్ధులై ధుర్యతన్
            రంగంబందున నాఱితేర నిసువుల్ లక్ష్యంబు సిద్ధింపగా
            భంగంబందక వెల్గె తత్సభ యశంబై "పెద్దరావూరు"నన్.
 3. శా : రాగంబయ్యది యేదియో తెలియదా రమ్యత్వమాస్వాదనే
            వేగంబున్ పద మల్లుటే తెలియులే విజ్ఞాన శూన్యుండయున్
            యోగం బొక్కటె వానినంటి తిరిగెన్ యోగ్యుండుగా జేయగన్
            సాగెన్ భారతి సత్కృపాజనిత సంస్కారంబు సేమంబుగా.
 4.చం: సరిగమ లెల్ల దా గఱచి శ్రావ్య కళాగళమెత్తిపాడగా-
            మురియుచు సాటి వారొకటి "మోహన"రాగమటంచు కోరగా-
            సరియని పాడి వారలకు సమ్ముద మెంతయు గల్గజేయుచున్-
            కరమరుదౌ ప్రకాశమును గాంచెను నాజరు సాటివారిలోన్.
 5.చం : నటనను గూర్చి చెప్పగను నాతరమే! నటరాజ తత్త్వమౌ;
            పటుతర రాగపూరణము ప్రాజ్ఞులు మెచ్చెడి దివ్య గీతమౌ;
            జటిల సమస్య పైకొనిన జాగృతితో తొలగించు నైజమౌ;
            అటనట కానుపించు పరియాచకముల్ సహవాసులందునన్.
 6.ఆ.వె: "రామకృష్ణశాస్త్రి" రసమయహృదయుండు
            వారి సుతుడు "దాసు"బాలురకును
            సరస నటన మందు సంగీత మందున
            శిక్షణార్థ మొక్క శిబిరముంచె.
 7.ఉ :  పెట్టిన"బాలరత్నసభ" పేర్మిని జేరిన శిష్య కోటియున్
           గట్టిగ రాగ భేదముల కమ్మనిరీతుల నాట్య భంగిమల్
           "కొట్టిన పిండి"యౌచు గుణ కోవిదులెల్లరు మెచ్చు తీరుగా
           మెట్టిన నెట్టి చోటునను మెల్పున గెల్చిరి వారి దీవనన్.
 8.సీ :  "మోహన"రాగంబు ముద్దుగా నొకడనన్
                           గమకము లేవంచు గదుమునొకడు
           "శ్రీరాగ"మొక్కండు శిరసూచి పాడంగ
                              ప్రసృత మటంచును పరిహసించు
            "కాంభోజి" పాడంగ కంఠమెత్తగ నొండు
                          స్వరము లేవి? యటంచు సనుగునొకడు
           "గాంథార" రాగమున్ గానంబుజేయగా
                           చక్కగా లేదని వెక్కిరించు
 తే.గీ :  గురువు లొకపరి విశ్రాంతి గొనుచునున్న
           తరుణ మందున శిష్యులు తఱచి తఱచి
           రాగ భేదాల వాదాలు తీగసాగ
           స్పర్థ వర్ధిల్ల వర్తిల్లె బాల గణము.
 9.తే.గీ:నిద్దుర నటించి బాలుర నియతి జూచి
           విద్య నేర్వంగ సరియైన విధమటంచు
           ఆత్మతృప్తిగ గురువులాహ్లాదమంది
           జన్మసార్థకమైనట్లు చాటుకొనిరి.
10.తే.గీ:ఇట్లు గడచిన వచట రెండేండ్లు, క్షణము
           వమ్ముగాక సంగీత సారమ్ము పిండు
           కొనగ, నాట్యపద్ధతులెల్ల కోరినేర్వ
           దశ వసంతాల నాజరు దశయు మారె.

          "రేపల్లె"లో  నాటక ప్రదర్శనము.

 : ఇట్లు  సంగీతాభినయాది విద్యలందాఱితేరుచున్న నాజరునకు "రేపల్లె"లో నొక్క నాటకంబునందభినయించు సదవకాశంబు లభియింప నక్కుమారుని కౌశలంబును స్వయంబుగా గాంచ నుత్సహించిన  ‘‘మస్తాను’’ ముందు వరుస  సుఖాసీనుడయ్యె. నాటకంబునం దన కుమారుని యభినయ సంగీత కళా ప్రదర్శనంబునకు ముగ్ధులై అందరు ప్రశంసింప, కొందఱాతని ముందు ‘‘నాజరు’’ పలువరుస సరిలేదని విమర్శింప దొడంగె. అంతట మస్తాను మరునాడు కుమారుని  బయటకు తీసికొని వెళ్ళి తన జేబులోని చెకుముకిరాయి(నిప్పుపుట్టించుటకు ఉపయోగించునది)తో ముందు పలువరుసను రుద్దనారంభించెను. ఏతద్విషయంబునుంగురించి    నాజరు స్వయంబుగా "ఆత్మకథ"యందు "మా నాన్నకు నా యందమును గూర్చి శ్రద్ధ యెక్కువని చమత్కారభరితంబుగా బేర్కొనిరి.

 11.కం : "రేపల్లె" నాటకంబున
              నో పాత్రకు బాత్రుడయ్యె నొజ్జల చలువ
              న్నాపాతమధుర మనగను
              ధీపాటవ మొప్ప పాడి తెలిపెన్బ్రజ్ఞన్.
 12.ఉ : పద్యము నాలపించు తఱి ప్రాజ్ఞులుభూరి కళాభిమానులున్
            హృద్యము లెస్స లెస్సనుచు  నృత్యము జేయుచు సంస్తుతించుచున్
            సేద్యమదెంతజేసెనొకొ శ్రీకరమై శ్రుతి రంజకంబయెన్.
            చోద్యముగాదె!బాలునకు సూక్ష్మ సుసంగతి  రాగబంధముల్.
 13. మత్తకోకిల:  ర స జ జ భ ర...11. యతి.
                         చిన్నయైనను వీని రాగము చేవగల్గియు నుండుటల్
                        ఎన్నగా మది హ్లాదమందె మహేశు దీవన లుండుటన్
                        తిన్నగా మునిపళ్ళు లేవను థికృతాత్ములె యుండినన్
                        కన్నవారలు ప్రేమతోడుత కౌగిలించకయుందురే!    

            మురుగుళ్ళ వారి శిష్యరికం.

 వ : నాజరునకుం గల సంగీత జిజ్ఞాసను గమనించిన ‘‘ఖాదరుసాహెబు’’ మరికొన్ని సంగీత కళా రహస్యముల గఱపించుటకుం దానెఱింగిన  "నరసరావుపేట"లోని  "మురుగుళ్ళసీతారామాఖ్యు’’ చెంతకుం దోడ్కొని వెళ్లి       ఆయనకు వీరియార్థిక   స్థితిగతులన్నియు వివరించె. తదనంతరంబ

 14.మ: "మురుగుళ్ళాన్వయు"చెంతజేరె పరమామోదైక సద్భక్తితో
            కరముల్ మోడిచి వేడె నాతని మనఃకామ్యమ్ము సిద్ధింపగన్
            జరుగుంబాటది లేకయే యడిగె సచ్ఛాత్రున్ ధనంబప్పుడే
            కరుణామూర్తికి మూడు రూకలిడె లెక్కన్నాజరే ముందుగా.
15.ఆ.వె :  "నరసరావుపేట"నగరి సంగీత వి
                  ద్యా విశారదుండు తగిన ప్రేమ
                  జూపి నేర్పుచుండె సులువైన మెలకువల్
                  నెలకు మూడురూప్యములకె తాను.
 16.కం : మురుగుళ్ళవారియింటను
             బరగన్ సంగీతమొండె ప్రత్యక్షమగున్
             దిరమౌ సంపదలేవియు
             నరయంగా కానరావు హంగులతోడన్.
 17. ఉ : నాజరుపోషణంబునకు నాకడ రూకలు లేకపోవుటన్
             భోజన భాజనాదులవి పుణ్య మనస్కులుదారచిత్తులై
             రోజునకొక్కరై యిడిన రూకలబాధ విముక్తిజెందుగా
             నీ జగమంతనేలు పరమేశుడె త్రోవను మాకు జూపుతన్.
 18.కం : మురుగుళ్ళవారి సతికిని
              పరమాత్ముడు చెప్పినట్లు పథమది దొరికెన్
             ధరలో యాచన జేయుచు
             పరమార్థమునందుకొఱకు ప్రార్థింపదగున్.
 19.తే.గీ:మనదు సంఘమ్ము బీదల మనగనీదు
              సాయమయ్యది కోర, కసాయిరీతి
              అణచివేయుచు దా పరిహాసమాడు
             "కళను కాపాడు; సత్కళా కారుడొకడె!"  .....ఇంతవరకు పంపాను. 21.07.22

            వారములు చేసికొని విద్యనభ్యసించుట.

19. అ. తే.గీ: సాంఘికంబగు స్థితిగతుల్ సమముగావు
                      పేదలకునిడు చేయూత పెద్దతప్పు
                      కులము కులమంచు మనసులు క్రుళ్ళిపోయె
                      కాన,   మార్గాంతరంబునుంగాంచదగును.       
         ఆ. కం: మురుగుళ్ళ రామయార్యుని 
                     కరమందిన యట్టి సుదతి కరుణామయి నాన్
                     మరిమరి నాజరు గాంచుచు
                     తిరమొప్పగ మాతృప్రేమ ధీరతజూపెన్.     


20.తే.గీ: "జోలె"యొక్కటి తగిలించ "మేలుగూర్చు

              నీకు‌ ,  నడువు నాజరటంచు"నీలవేణి
              బియ్యమున్ గొన్ని రూకలు పిడికిలించి
              వేశ్యవీధులుచూపించె వింతగొలుప.
21.చం : గురువును నాజరుం గలసి కూర్మిని వేశ్యల యిండ్ల వైపుగా
           చరచర యేగి  యొక్కటను "చల్లనితల్లిరొ మమ్ముగావవే
           కరములుమోడ్తు మీకనగ"కాంతయొకర్తుక గౌరవమ్ముగా
           హరిహరి! మీర లిట్లగుట హా!విధి యంచును రాల్చె నశ్రువుల్.
22.తే.గీ : మీకు సాయంబు జేయంగ మాకుదగును
              పొందరాదంచు మిమ్ముల బొడుతురకట!
              ఇట్టి గొడవలు లేకున్న నెంతకైన
              నూతమిత్తుము ప్రాణంబులున్న వరకు.
23.తే.గీ : అనగ భీతిల్లుచున్నట్టి యతివజూచి
             గురువు వచియించె నిట్టుల కరుణతోడ
              ‘‘సాయమందించ బూనుడు, స్వార్థపరులు
              బలుకు పలుకులు విననేల? భయమదేల’’?
24.సీ :  "మురుగుళ్ళ"చలువ సంపూర్ణ విద్యలనేర్చి
                                  బాలగంధర్వుడై పడసె కీర్తి
             గురుపత్ని దీవనన్ గూర్మి జగత్తును
                                  జదువన్ గలుగు నేర్పు సాధ్యమయ్యె
              వేశ్యల భిక్షమున్ వేయించుకొనుటచే
                                     సంఘజీవన గతిన్  సౌరుదెలిసె
               లక్ష్యశుద్ధి చెలంగ లక్షల కష్టాలు
                                    లేశమాత్రమె యన్న  లీలనెఱిగె
 తే.గీ : తండ్రి తరువాత తండ్రి యై తపనజెందు
           ఖాదరు మననంబు మోదానగ్రాలు నటుల
           తల్లిదండ్రుల జన్మలు ధన్యమనగ
           ఔర! నాజరు చరియించె నహములేక.
25. సీ : ఏరాగమొప్పుచు  నింపును గూర్చునో
                             సులువుగా గ్రహియించు సూత్రమబ్బె
            ఎటువంటి గమకమ్ము  లెంతెంత వాడుటో
                              ఆకళింపయ్యెను నేకముగను
            హావభావములను నలవోక జూపించి 
                       నవ్యత చాటుట  నైజమయ్యె
            సర్వ కళలు "మేము స్వాధీన"మంచును
                              నాజరు రూపాన నడచిరాగ
 తే.గీ :   పాదుగామారె బహుమతుల్ పడయుకొఱకు
            పెద్దవారల చెంతనుం బేర్మినంద,
            తనదు యునికిని దెలుపుచు ధైర్యమలర
            ముందు కేగెను సంఘాన ముదముతోడ.

     "పొన్నుకల్లు"(బంగారు కొండ) - ఘనత.



26. సీ : భీకర వాయువుల్ పెను మంట లేర్చిన

                              నిశ్చలంబై యుండు నిండుకొండ
             తనను ముక్కలుజేసి దారులేర్పరచిన
                               నిబ్బరమై యుండు నిండుకొండ
             గుహలో వరదరాజు కొలువుండి యుండుట
                               నియమంబు దప్పని నిలువుకొండ
             ‘‘జడలమ్మ బావి’’కి జాఱెడు గంగమ్మ
                               పులకింతకు సతమ్ము పొంగుకొండ
 ఆ.వె : పొన్నెకంటి కొండ పొగరైన మా కొండ
           కోఱమీసకట్టు కోరి దువ్వు 
           హితుల హత్తుకొన తలెత్తి రాజిల్లు బం
           గారు కొండ మల్లె సౌరుదండ.
27.తే.గీ : ‘‘పొన్నెకల్లు’’ న బుట్టిన బుణ్యుడగుట
              వాణి కరుణకు నోచిన వాగ్మి యగుట
             సరస గాన సాహిత్య విజ్ఞానమొంది
              ఘనత గన్న "నాజరి’’ ట బంగారు కొండ!
28. శా: సంగీతంబున నాట్యశాస్త్రగతులన్ సంపూర్ణధీమాన్యుగా
            నంగీకారము దెల్ప నా గురువుగారత్యంత సంతృప్తుడై
            రంగంబందున నెచ్చటైన నొకచో రంజిల్ల వేషమ్ము వే
            యంగా భావనజేసె‘‘ నాజరి’’ల బ్రహ్మానంద చేతస్కుడై. 
29.ఉ : ఇంటికి జేరె నాజరు మహేశుని సత్కృప విద్యలన్నిటిన్
      గంటను వత్తిబెట్టుకొను కౌశలమొప్పెడు సాధనంబులన్
      ఒంటరి  జీవియయ్యు కడునొద్దిక మీరగ సంచరించుచున్
      వెంటను నంటియుండి తన విజ్ఞత  బెంచిన వారి గొల్చెగా.

       విద్యాభ్యాసానంతరము పొన్నెకల్లు జేరుట.


వ : ఇట్లు నాజరు తన పదునైదవయేటనే సంగీతకళాప్రపూర్ణుండై తన గుర్వను
జ్ఞనుంబడసి  పొన్నెకల్లునకుం  దిరిగివచ్చి తననింతవానిం జేసిన "ఖాదరు"మహాశయునకుం బాదాభివందనం బాచరించి అపారాశిషంబులందుకొనిన యనంతరంబు    కుటుంబసభ్యులంగూడియుండగా తన్మాతాపితల భావోద్వేగంబులెట్టివనిన,
లెట్టివనిన..                 ఇంతవరకు పంపాను. 23.07.22

                              
30. ఉ :  అమ్మను నాన్నను న్విడిచి యన్నము వేళకు నెట్లుదింటివో?
             గుమ్మము గుమ్మమున్దిరిగి గుర్వుల సేవయు జేయుచుండి, కా
             లమ్మును వమ్ము సేయకయె రాగ సుధారస ధారలన్సదా
             నెమ్మది నిల్పుకొన్న నిను నేనిక నెచ్చటికంప "నాజరూ"
 31.ఉ : రమ్మని గుండెకద్దుకొని రాగ సమంచిత భావపూర్ణమై
             చెమ్మను గొంగుతో దుడిచి చిన్నగ ముద్దుల ముంచుచుండగా
             లెమ్మని భార్యతో బలికి లీలగ నాజరు తండ్రి ప్రేమమై   
            "అమ్మలగన్నయమ్మ పదమంటినవాడిల పండితుండ’’నెన్.
  32.ఉ: అన్నయె నీదురూపమయి హ్లాదమునీయగ నాదు గర్భమున్
              చెన్నుగ నుద్భవించెనిట క్షేమముగల్గును నీకునాకునున్
               కన్న ఫలంబులందెదను ఖ్యాతిని గాంతును సాటివారిలోన్
               తిన్నగ సాగు ‘‘నాజరు! విధేయుడవై పరమార్ఢమెంచుచున్.
  32. ఆ...కం. మురుగుళ్ల తల్లి చలువను
                       పరమాద్భుత రీతి వారవనితామణులే
                       కరమొప్ప జాలిజూపిన
                       నరహరి! యిదియేమిటనుచు నాజరు తలచెన్.
 33. శా: ఎన్నో యున్నత నాటకంబులను నే నిష్ఠంబ్రదర్శించితిన్
            నన్నున్ మన్నన జేయుచున్న నటులే నైజంబు జూపించుచున్
           "కన్నా"నాటకమందు నీవొకడవే ఖాయంబు లెమ్మంచు, తా
            మెన్నంగ న్నిటకేరు రారు కనగా నేనేమి జేతున్శివా!
34.తే.గీ: ఎన్ని విద్యలు నేర్చిన నేమి ఫలము?
              పట్టెడన్నము కఱవాయె పొట్ట నిండ
              అన్నమిడునట్టి విద్యయే మిన్నయగును.
             రూక గడియింతు నేనెట్టి పోకనైన.

       కూలి పనులకు వెళ్ళుచు, దర్జీగా పనిచేయుట.

                                      

35. ఉ : క్రొత్తగ జీవికన్ గడుప  కూలిగ మారెను నాజరంతటన్
            ప్రత్తిని దీయుటల్, మిరప పంటల మధ్యన చాళ్ళలోపలన్
            ఒత్తుగనున్న వ్యర్ధముల నొద్దిక దీయుచు, నీరువోయుటల్,
            కత్తిని చేతబట్టి ఘన కంటకము ల్దొలగించివేయుటల్.
36.ఉ:  గట్టియుపాధి కోరుచును క్రన్నన"నాజరు"వ్యూహమల్లుచున్
            బట్టలుకుట్టుటే బ్రతుకు బాటగనెంచిన   పెద్దవారలున్
            ఎట్టెటొ సమ్మతింప తనకిచ్చిన బట్టను కుట్టివేయగా
            తిట్టులె లభ్యమాయె పనితీరున శిక్షణలేక యుండుటన్
37.ఉ:  పట్టుదలన్ సుబోధకము - భారపువిద్య యదేదియైననున్
            పట్టునుబట్టి దానినటు వంతును కాంతును కీర్తిచంద్రికల్
            తిట్టిన వారలే తిరిగి దీవనలిత్తురటంచుబల్కి, తా
            ముట్టిన మట్టినైన ఘన ముత్యము జేసెను నద్భుతంబుగాన్.

వ: ఇట్లనేక విధంబుల ధనార్జనోపాయంబులన్  వెదకి, అందున్ గొంత నైపుణ్యంబు సంపాదించి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుచుండగా నొక్క దుర్దినంబున . 


                 నాజరునకు పితృ వియోగము.



38. ఉ : షోడశ వర్షముల్ ముగియ  శోకము జేరెను నాజరాఖ్యుకున్

            తోడయి తండ్రి కష్టమును దూరము జేయు ప్రయత్నమెంతయో
            కూడగ జేయుచుండ విధి క్రూరముగా బలిజేసె నక్కటా!
            మోడయె జీవితంబులిక మోసులువారవటంచు నేడ్చెగా!
39. సీ : ఎంతయేడ్చినగాని యేమేమి జేసినన్
                          అరిగిన యుసురులు తిరిగిరావు 
           భవ బంధనమ్ములు బ్రతికియున్నప్పుడే , 
                          గడపదాటిన నవి గడపదాటు
           మంచిచెడ్డలె నిల్చు మానవ జన్మాన
                           తానుజేసినయట్టి దాని వలన
           నాక సుఖంబులు నాన్నకుం గలుగంగ
                           వర్తింతు నిరతంబు వసుధయందు
 తే.గీ : తండ్రికోరిక దీర్చుటె ధర్మ పథము
          నేటినుండియు స్థైర్యంబు నింపుకొనుచు
          నడతుననియె శపథముగ నాజరపుడు
          సాధు సాధువటంచు మెచ్చంగ పరులు.

వ : పితృ మరణ సంజనిత దుర్భర దుఃఖభారము నుండి తేరుకొనజూచు నాజరువలి ఆత్మగతంబున..

40.  మందాక్రాంత : మ భ న త త గా....11. యతి. ప్రాస కలదు. 

                                   పోరాముల్ చుట్టిన నెదకు నామోదముంగాకయే, ఆ
                                   శ్రీరాముండత్తఱి రణమునుంజేసె దు:ఖార్తుడై, గం
                                   భీరత్వంబన్నదె పథము వేవేల చందంబులన్ నా       
                                   పోరాటమ్మెంతయు సలుపుదున్ ముఖ్య కర్తవ్యమౌటన్. 
41. శా : ఎన్నో తావుల గౌరవాదరములున్, ఎన్నెన్నొ మర్యాదలున్,
             చెన్నారన్ రజతంపు వస్తుతతులున్,సింగారమౌ బంగరుల్
             ఇన్నాళ్ళున్ విజయంపు కేతనములై, యీశానుకారుణ్యమై
             అన్నంబున్నను లేకపోయినను దివ్యౌన్నత్యముంజేర్చెగా.

         బంగారు, వెండి బహుమతులమ్మి

                      చెల్లి పెండ్లి చేయుట.


42  ఉ : చెల్లికి బెండ్లిచేయదగు చిత్తము దేహము సిద్ధమయ్యె, నా

             మల్లియవంటి దానికిక మాన్యుని భర్తగ నెంచగావలెన్
             మెల్లగ స్వర్ణకంకణము, మెచ్చుచు నిచ్చిన వెండికప్పులుం 
            దల్లికి దెల్పి యమ్ముటది ధర్మమటంచును నిశ్చయించెతాన్.
43. తే.గీ : వెండి బంగారు కప్పుల విక్రయించి
                బంగరుందల్లి చెల్లికి బహుమతినిడె
               భవ్య సద్గుణ రూపుని బావనపుడు
               భావి సౌభాగ్య దీప్తులు  భగిని పొంద.
44. తే.గీ : చక్కదనమున నాచెల్లి రిక్క నతక
               రించు, బావగారెటులైన రేయిరాజె.
               కలసిపోయిరి యిర్వురు కాంక్షదీర
               చందమామయు వెన్నెల చందమౌచు
45. కం :  "దర్జీ"గ మారి నాజరు
              "దర్జా"గా కంఠమెత్తి ధారాళముగన్
              పర్జన్య గర్జనంబున
              నిర్జనముగనున్న యింట నేర్పుగ బాడెన్.   

     "కొమ్మినేని బసవయ్యగారి"పరిచయ భాగ్యము .

46. ఆ.వె: "కొమ్మినేని"వారి కులమున శ్రేష్ఠుండు
               "బసవ నామధేయ" ప్రథితుడొకడు
               "నాజరు" తలరాత నయముగ నే మార్తు
                నంచు  శివునివోలె నతడువచ్చి
47.కం :  సంగీత కళను బొందియు
              నంగీలను గుట్టనేల? హాస్యాస్పదమౌ
              బంగారపు నీ భవితకు
              సింగారమె యబ్బు మాదు చిన్నికి నేర్పన్.
48. తే.గీ : చిన్నియొక్కతె గాదు మా శీలవతికి
                నా కొమరునకు సరిగ పునాదివేసి
                విద్యనేర్పంగ నీకిల విలువ బెరిగి
                సంపదాదులు గూడును స్వయముగాను. 
వ: ఇట్లు  దర్జీగా జీవిక గడుపుచున్న "నాజరు"కడకు "ఐశ్వర్యమీశ్వరా దిచ్ఛేత్." అను నానుడి ననుసరించి ఈశ్వరరూపుండైన "కొమ్మినేని బసవయ్య’’నామాఖ్యుడు  వచ్చి  మా కుటుంబ సభ్యులందఱకును సంగీతమును నేర్పుము. మాకు సంగీత సరస్వతియు, నీ కామె  అత్త గారును   లభించునని పలుకగా మహదానందభరితుండై నాజరంగీకరించి,  విజయవాడ వెళ్ళి నాలుగు "హార్మోనియమ"లను సంగీతసాధనమ్ముల దెచ్చిన యనంతరంబున....
49. ఉ : గ్రామ సహాయకాగ్ర! సమలంకృత సద్గుణ! దీనబాంధవా
             సేమము గోరుచున్ గరుణజిందగ పాలనజేయు ధీవరా!
            రామ పదారవింద మకరందమనోజ్ఞ రుచిప్రభావ భా
            వామల కీర్తి మూర్తి!జనవందిత భక్తపరాగరేణువా!
            
50.కం: శుభకర భావాతీతా!
            అభయము నిలగూర్చి మాకు నాదరమిమ్మా!
            విభవము కోరక నొసగెడి
            యభవుని తేజంబుగల్గు నాత్మీయపితా!

వ :  ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన   పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండును,  సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన "బుఱ్ఱకథనాజరుచరిత" మందలి ద్వితీయాశ్వాసము.

  
                                 📖      📖        📖

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...