పరాభవ వసంతం,2026. భ్రష్టులకు పరాభవవసంతం వరిష్ఠులకు వన్నెచిన్నెల వసంతం . 8.03.2026.
సీ. వాసంత లక్ష్మి ఆ వ్యత్యాసమెరుగును ,
భక్తవరిష్ఠులు భ్రష్టులకును
ప్రకృతి కాంతామణి పరికించు తేడాను
సుజన హృత్కమలంబు, శుంఠ మనసు
కాల శాసనుడు తా గనునెంతొ భేదంబు
సౌమ్యుల దుష్టుల చర్యలందు
సృష్టి కర్తెరుగును శీలంపు మూలంబు
రక్కసి జాతికి లలితులకును
తే . పంచిపెట్టు పరాభవాల్ భ్రస్టులకును
వన్నెచిన్నెల వైభవాల్ పండితులకు
నూత్న వత్సరంబ!తవ వినూత్న శోభ
ఎవరికెయ్యది ప్రాప్తంబొ ఈప్సితాన .1
సీ . కోకిల గానముల్ కోపంబు తెప్పించు
కూళల కక్కటా !ఘోరమగును
గంధబంధురమైన కమ్మని కుసుమాలు
వెగటుగాదోచును వెఱ్ఱులఁకును
వాసంతి లక్ష్మిగా వచ్చిన యిల్లాలి
కాలదన్నును మృగంబువోలె
పెరనారి పొందుకై పెర పెరలాడెడు
కామాంధులకునెల్ల కలతమిగులఁ
తే. దుర్మదాంధుల కుట్రల దునిమివేసి
జ్ఞానబోధను జేయంగ కదలివచ్చె
వాసిగాంచు పరాభవ వత్సరంబు.
పండితాళికి కవనంపు పండువనగ. 2.
సీ . ఏ పాపమెరుగని ఎందరి ఉసురులో
పొట్ట బెట్టుకొనెడి పోరుసల్పి
ఆధిపత్యంబదే అంతిమ లక్ష్య మై
ఆసురి చర్యల హర్షమంది
పాఠశాలల పైన ప్రాజ్ఞుల పైనను
బాంబుల వర్షంబు వడగజేసి
పాప కూపంబునబడు భ్రస్టులకునెల్ల
రయముగా తగిన పరాభవమ్ము
ఆ . కలుగజేసి మంచి కాపాడ వాసంత
లక్ష్మి వగుచు దయను రమ్ము రమ్ము !
దీనజనుల పాలి దేవతవీవమ్మ
కోటి నతులతోడ కొలుతు నిన్ను .3
ఆ. క్రొత్త వత్సరంబ ! కోర్కెలు పండగ
గౌరవాదరముల గోరు ప్రజలు
అధిక భాగమీవు ఆదాయములజూపి
అంతకన్న మిగుల ఆయువిమ్ము.4.
తే. నీ పరాభవ నామంబు నిఖిల జగతి
తలచుకొన్న గుండె లయనుదప్పిపోవు
వాదు నీకేల సద్గౌరవాలనిమ్ము
అంజలింతురు సర్వులు హారతిచ్చి.5.