15, జులై 2019, సోమవారం

డా. సర్వా సీతారామ చిదంబర శాస్త్రి

సుహృన్మితృలు డా. సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారికి, (డా.రామడుగు వేంకటేశ్వర శర్మ గారి సహాధ్యాయుడినైన) పొన్నెకంటి సూర్యనారాయణ రావు అనిర్వచనీయ ప్రేమాభిమానాలతో వ్రాయునది....
.
    మీరు గురుభావనతో నన్ను "మీ పదవీ విరమణ" సందర్భంగా ఆహ్వానించారు. కాని అప్పటికే స్థిరీకరింపబడిన నా వ్యక్తిగత కార్యక్రమాల వలన రాలేకపోయినందులకు చాలా బాధపడుచున్నాను. కనీసమీ సమాచారము మీకు తెలియపరచుటకును చరవాణి కాని, అంతర్జాల చిరునామా కాని లభించలేదు.
      ఈరోజు మీరు పంపిన "శ్రీ గాయత్రీ మాతృద్విశతి" అందినది. చదివాను.ప్రతి పద్యమత్యంత భక్తి భావప్రపూరితము, సుశబ్దశోభితమై మనోరంజకముగానున్నది. అమ్మ గాయత్రీ దేవి కరుణకు పాత్రులైన మీరు ధన్యులు.

         అమ్మ గాయత్రి కరుణను నందినారు
         పూర్వజన్మంపుపున్నెంబు ప్రోగుగాగ
         కవన పాండిత్యసద్గుణ భువన రవిగ
         శుభముకలుగుత మీకెప్డు సూరివర్య!

         గాయత్రీజప ఫలితము
         వేయేలవచింపలేము విశ్వంబందున్
         మాయామేయజగంబున
         కాయంబదియుండుదనుక కైమోడ్పెతగున్.
                       శుభం భూయాత్!
                   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                             ది.22.12.2017.
          

భద్రాచలం, హేమాచలం.8.01.18.

భద్రాచల యాత్ర.

  హైదరాబాద్ నుండి మణుగూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 8.01.2018న,రా.11.30కు మా బావగారు శేషగిరిరావు గారు, చెల్లి ఉదయ, ఇందిర,నేను బయలదేరి ఉ.7.30కి మణుగూరు చేరాము. 9.01.18న స్టేషన్ నుండి బయలుదేరి అల్పాహారం తరువాత ఆటోలో  "మల్లూరు" " హేమాచల నృసింహస్వామి" దర్శనానికి వెళ్ళాము. (మణుగూరునుండి మల్లూరు 50.కి.మీ.మల్లూరు వెళ్ళేటప్పుడు వీలుచేసుకొని అరటి,జామ మొ.లగు పండ్లు తీసికొని వెళితే వానరాల ఆకలి కొంతవరకు తీర్చవచ్చును)అచట ఆర్చికి కుడివైపున మెట్ల ప్రక్కన కొద్ది దూరంలో స్వయం భవునిగా వెలసిన హనుమ గుడి చెంత  కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలు చేయడానికి (స్వల్పరుసుముతో)చక్కని ఏర్పాట్లు చేశారు. ఎంతో అభినందనీయులు. అచటికి వచ్చే నీరు పరమ పవిత్రము, స్వచ్ఛము, అవ్యక్త మూలికాసంస్పర్శిత రోగ నిర్మూలనము,అమృతతుల్యము,సమతులోష్ణము,సజీవగంగావతరణము. ఆ స్నానానంతరము మనజన్మ పునీతమైన అనుభూతి కలుగుతుంది. నేను కూడ అచట స్నానం చేయగలగటం మహద్భాగ్యమే. అక్కడనుండి షుమారు 50సోపానాలు (మెట్లు)దాటితే నరసింహ దర్శనం లభిస్తుంది. స్వామి స్వయం భువుగా చెబుతారు.   
               ఈ స్వామిని దర్శించిన మహమ్మదీయ చక్రవర్తి కొండ, ఆలయము అర్థచంద్రాకృతిలో ఉండుటవలన తమదైవ చిహ్నమని భావించి భక్తి తో కొంత బంగారాన్ని కానుకగా సమర్పించారట. తదుపరి ఆబంగారమును అమ్మి వచ్చిన ధనమును బ్యాంకు లో వేసి వచ్చే వడ్డీ తో అర్చకులు మొ.లగు వారు మనుగడ సాగిస్తున్నారట. ఆ కారణముననే ఆ స్వామి"హేమాచల నృసింహస్వామి" పిలవబడుతున్నాడట.                                               ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఏమిటంటే స్వామికి కంఠం క్రింద భాగమంతా శిల కాక మానవశరీరంలాగా ఉంటుంది. నొక్కి చూస్తే చర్మం లోనికి వెళ్ళి కొద్దిసేపటి పూర్వపుస్థితికి వస్తుంది. పూర్వం త్రవ్వకాల కారణంగా స్వామి నాభి(బొడ్డు)దగ్గర గాయం యేర్పడి అచట రక్తము కారుచున్న కారణంగా అచట చందనం ఉంచుతారు. స్వామి నిజరూపదర్శనం శుక్ర,శని,ఆదివారాలు (మ.12.వరకు) ఉంటుంది. స్వామి వారి నాభిదగ్గర ఉండే చందనాన్ని పాలలో కలుపుకొని త్రాగితే పెండ్లి కాని వారికి వివాహము, సంతాన హీనులకు సంతానము తప్పక కలుగుతుందను నమ్మకం ఇటీవలి కాలంలో ఎక్కువమందికి కలుగుతున్నది. ఈవిషయాన్ని ఫలితం పొందినవారివలన, ఆటోలవారివలన కూడ వినటం జరిగింది. నమ్మకం,ఆత్మ విశ్వాసం ఎన్ని సమస్యలనైనా తీర్చగలవు.ఎంత ఉన్నతినైనా కలిగించగలవు.
         9వతేది మధ్యాహ్నం మణుగూరునుండి బయల్దేరి 2.30.లకు భద్రాచలం లోని "అంబా అన్నసత్రం"లో భోజనంచేసి దగ్గరున్న గదిలో విశ్రాంతి తీసికొని ఆటోలో బయల్దేరి "జటాయువు గుడి,(జటాయువు కాలు తెగిపడినచోటు)(సమీప పొలంలో రెక్క తెగిపడినదని సమాచారం) దుమ్ముగూడెంగ్రామదేవత, సీతారాములపర్ణశాల"(భద్రాచలంనుండి 30.కి.మీ.)చూచి వచ్చాము.
     10వ తేది. ఉ.8.00లకు మేము భద్రాచల రామదర్శనం చేసుకొని, శేషగిరిరావు గారి దంపతులు చేయించుకొనిన       కల్యాణమును కనులారా చూచుకొని, అన్నసత్రములో రామప్రసాదమును స్వీకరించి విశ్రాంతి తరువాత గోదావరి స్నానం ముగించి గదికి చేరాము. సాయంత్రం7.గం. లకు బస్సు లో కొత్తగూడెం చేరి అచట సికింద్రాబాద్ మణుగూరు ఎక్స్ప్రెస్ లో రాత్రి.10.45కి ఎక్కి 11వ తేది ఉ.6.గం.లకు ఇండ్లకు చేరాము.

 కం.హేమాచల నరసింహుని
      నేమానవుడేనిభక్తి నీమముతోడన్
      సేమంబుగోరిమ్రొక్కిన
      కామంబులుదీరితాను కాంచునుసుఖముల్.
కం. మల్లూరు నారసింహుని
      యుల్లంబునవెల్లువెత్తు యుత్సాహమునన్
      కల్లా కపటములెరుగక
      చల్లంగనుమ్రొక్కినాము సౌమ్యతదనరన్.

 కం.ప్రాతఃస్మరణముజేయుచు
      పూతాత్ములభంగిభద్రు ముంగిటవాలన్
      సీతారాముల కరుణయె
      చేతంబులురంజిలంగ చేరెను మాకున్.

14, జులై 2019, ఆదివారం

ఉన్న దానిలోనే దానం.

ఉన్నదానిలోనే అన్నదానం.

       సూళ్ళూరుపేటకు షుమారు 60కి.మీ దూరంలో"మల్లాం" గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీవల్లీ,దేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ప్రాచీనమైనది. అందు మనోహర శిల్పసౌందర్యం చూపరులను కట్టి పడేస్తుంది.
       ఆలయనిర్వహణాధికారులు భక్తులు దైవదర్శనం చేసుకొనేసమయంలోనే "అయ్యా అందరు స్వామివారి ప్రసాదం తీసుకొనివెళ్ళండి" అని చెప్పటం వారి అన్నదానవ్రతానికి నిదర్శనం. ప్రస్తుతం అన్నదానం మంగళ,ఆదివారాలలో జరుగుతుంది. దాతలు అధికంగా విరాళాలిస్తూ ఉంటే ప్రతిరోజు అన్నదానం నిరతాన్న దానంగా మారుతుంది.

     స్వర్ణ దానంబు లిచ్చును స్వర్గ సుఖము
     వస్త్ర దానంబు ప్రఖ్యాతి వరలజేయు
     భూమిదానంబు వలనను పొందుయశము
     అన్నదానంబు సర్వంబు నమరజేయు.

 మంగళ,ఆదివారాలలో భక్తులు షుమారు200మందివస్తారు. ఆరోజును దృష్టిలో పెట్టుకొని అన్నదాతలు తగిన ద్రవ్యం చెల్లిస్తారు. అన్నము, ఇతరపదార్థములన్నీ సిద్ధమై భక్తులు క్యూలో నిల్చినను వెంటనే భోజనము వడ్డించరు. ఆరోజునకు ద్రవ్యముదానమిచ్చిన దంపతులువచ్చి అన్నమున్న గిన్నెకు (అన్నపూర్ణాదేవికి )హారతిచ్చి అగరువత్తులు వెలిగించి ధ్యానించి వారు ప్రారంభించిన తదుపరే క్యూ లోని వారికి పెడతారు. సాధారణంగా ఈరోజుల్లో ఇలాంటి స్థలాలలో తిని అన్నదానానికి ద్రవ్యం ఇవ్వనివారెవ్వరు ఉండుటలేదు. కారణం "మనం తినే అన్నం ఎవరో ఇచ్చినదే"అనే స్పృహ తప్పక ఉంటుంది. "అన్నం పరబ్రహ్మ స్వరూపం" ఒక్క పదార్థం కూడ వృథాచేయకూడదు. తింటేమనం తినాలి లేకుంటే పేదలకు పంచాలి. మనం తినటానికి తక్కువ ప్రాథాన్యమిచ్చి పేదలు తినటానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

           దాన గుణమది యుత్కృష్ట ధర్మమెపుడు
           మనము తిన్నది యెంతైన మట్టిపాలు
           పరులకిడునది శక్తి మై భక్తి తోడ
           నధికతరమైన ఫలితంబునందజేయు.

మనమీనాడు ఏదేవాలయానికి వెళ్ళినా అన్నదానం జరుగుతున్నది. అది నిరంతరాయంగా జరగటానికి మనం చేతనయినంత సాయం చేద్దామా? కాదనెందుకంటారు మరి చేయికలపండి...

మాలకొండయ్య గారి ఆత్మీయత.

అనుబంధం,ఆత్మీయత.

       కొన్ని అనుబంధాలు ఈ జన్మవి కావేమో అనిపిస్తాయి. అంతగా వారు ఏకమౌతారు. ఆత్మీయత అంటే "తననుతానెంత ప్రేమిస్తాడో ఎదుటివానిని కూడ అంతే ప్రేమగా చూడటం." ఈ రెండు కలగలిసి సనాతన సంప్రదాయ గౌరవమర్యాదలకు ఆలవాలమై, సాహితీ ధురంధరుడై, జ్ఞానవయోవృద్ధుడై, విద్యాదానశీలుడై, నా దక్కిన శమంతకమణే శ్రీ ద్రోణాదుల మాలకొండయ్య గారు. (81సం.లు)
       2013వ సంవత్సరములో " భువనేశ్వర్, కాశీ యాత్రలో సహ యాత్రికుడు. సహజంగా సద్గుణశోభితుడు . అలాంటి వ్యక్తి కనబడగనే ఉప్పొంగిపోతాడు, మమేకమై కష్టసుఖాలలో పాలుపంచుకోవాలనుకుంటాడు. తాను సాహితీప్రియుడు కనుక కవిపండితులనభిమానిస్తాడు. ఆనాడు "కాశీయాత్రావిశేషాలను" నేను వ్రాసి గ్రంథస్థం చేయటాని ముఖ్యకారకుడాయనే. ఏమి మాట్లాడినా చివరకు "మాష్టారూ! దానిని ప్రింట్ చేయించుటకు ముందుగా కొంత డబ్బు ఇవ్వమంటారా?" అని అడిగేవారు. తాను పొందిన ఆనందాన్ని అందరకు పంచాలని ఆయన తపన. ఆధ్యాత్మికత భావనలు నిరంతరం సమాజశ్రేయస్సునే కాంక్షిస్తు ఉంటాయి. కనీసం పది రోజులకొకసారైనా నాకు ఫోన్ చేసి "ఎలా ఉన్నారు మీరు, మేడం గారు?"అని మనసారా పలకరించడం ఆయన మంచి మనసునకు నిదర్శనం.  మనస్సు నిరంతరం మాధవపాదాక్రాంతమై యుంటుంది.  భాగవతంలో పోతనగారు  

 "  మందారమకరంద మాధుర్యమునదేలు               
              మధుపంబువోవునే మదనములకు
  నిర్మల మందాకినీవీచికలదూగు
               రాయంచచనునే తరంగిణులకు
..........................
    అంబుజోదర దివ్యపాదారవింద
    చింతనామృతపానవిశేష మత్త
    చిత్తమేరీతినతరంబు జేరనేర్చు
    వినుతగుణశీలమాటలువేయునేల......అంటారు.

           అట్టి గుణశీలుని 24.01.2018 న కలుసుకునే అవకాశం దొరికింది. వారి స్వగ్రామమైన కావలి సమీపంలోని " ఎడ్లూరిపాడు" వెళ్ళాము. మా ఆనందానికవధులు లేవు. మాకు బ్రహ్మ రథం పట్టారు. ఆయన సహజంగా రామభక్తుడు. ఇల్లంతా రామమయం. నా ఆరాధ్యదైవం రాముడే. నేను తెనుగు జేసిన " సూర్యశ్రీరామం" తన డాక్టరు గారిచే గ్రంథముగా తయారుచేయించి తెప్పించుకొని మరీ చదివారు. భోజనాలకుముందు కాసేపు పద్యపఠనం. సాహితీసమరాంగణ సార్వభౌముని "ఆముక్తమాల్యద"నుండి. విష్ణుచిత్తుని అతిథి సేవాఘట్టం. "నాస్తి శాకబహుళా". ఎంతమధురమనోహర ఘట్టం. "అభ్యాగతః స్వయం విష్ణుః" మాలకొండయ్యగారి దృష్టిలో నేను విష్ణువును. భోజనానంతరం మాదంపతులకు, నా సోదరుడు కాళీజగన్నాథ్ కు బట్టలు పెట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
          మన జీవితంలో ఎందరో కలుస్తారు. వారందరు ఆత్మీయులు కాలేరు. ఆరాధ్యులు కాలేరు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

   తే.గీ.జీవితంబున వెలిగెడి చెలిమికలిమి
          సర్వ సౌభాగ్య భోగముల్ సంతరించు
          స్నేహదీపంబు వెలిగింప చిత్తమందు
          హ్లాదమిచ్చును నిలువెల్ల హాయి గూర్చు.

    తే.గీ.మాలకొండయ్య నెయ్యంబు మరువలేను
           ఉన్నతంబైన సుగుణమహోన్నతుండు
           పుస్తకంబుల పారాడు పురుగనంగ
           సార్థకంబౌను సామెత చక్కగాను.

    

నేలపట్టు...పక్షులు.

నేలపట్టు. ప్రకృతి నాస్వాదిస్తు కొన్ని చిత్రాలు. ఇతర దేశాలనుండి పక్షులు ఇచటి చెరువు దగ్గరకు వలసవస్తుండేవట. ఇది ఒకరైతు పొలమట. దీనిని ఆనాడు బ్రటీషువారు గమనించి ఆభూమిని ప్రభుత్వం స్వాధీన పరచుకొని వాటి అభివృద్ధికి మరికొన్ని వనరులు కలిగించినదట. అవి ఈప్రాంతానికి వచ్చి చక్కని అనువైన ఆహారాన్ని పొంది సంతానాభివృద్ది చేసుకుని సంతాన సమేతంగా స్వస్థానాలకు చేరుతాయట. ఇచట వాటిని మరింత దగ్గరగా చూచేందుకు "బైనాక్లర్స్" ఇస్తారు. దానిద్వారా ఆ పక్షులను చూస్తే వాటి కూనలతో సహా కనిపించి మైమరపిస్తాయి. మనం ఎన్ని చిత్రాలు తీసినా అసంతృప్తే. మామూలు కెమెరా తో తీసిన చిత్రాలు కొంతకాలానికి కనుమరుగౌతాయి. మన కన్నులనే కెమేరాతో తీసినవి మనం బ్రతికి ఉన్నంతవరకు ఉంటాయి. మధురానుభూతిని కలిగిస్తుంటాయి.

 ప్రకృతి జీవుల కెయ్యడ ప్రాణమగును,   
 ప్రేమ పెంచుచు పంచుచు ప్రియముగూర్చి,                                           
 మధురభావాల నిలయమై మానవాళి,  
 మనసుదోచును సతతంబు మాన్యమగును.

 కరుణరస నిర్భర నరుని
 పరమహృదయమెయ్యెడ గన భాసుర మౌగా
 పరమాత్మ తుల్యమగుచును
 ధరవెల్గును శాశ్వతముగ ధన్యంబగుచున్.

చెట్టు చేమలు ఖేచర జీవతతిని
కావవలయును సతతంబు కరుణతోడ
 మహిత సద్గుణశోభిత మనుజుడెపుడు
పరమపూజిత దైవాంశ వరదుడగును.

రామాయణం కుడ్య చిత్రాలు

ధర్మవరం.రామాయణ కుడ్యచిత్రాలు.

 ది.26.02.2018. యశ్వంత్ పూర్ నుండి కాచిగూడ యక్స్ ప్రెస్ లో ప్రయాణం. అది బయల్దేరవలసిన సమయానికన్నా(మధ్యాహ్నం2.30,) 1గం. ముందే స్టేషన్ కు చేరాము. రైలు బయల్దేరగా స్టేషన్ లు వరుసగా వెనుకకు వెళ్ళిపోతున్నాయి మాకు వీడ్కోలు పల్కుతు. క్రాసింగ్ కారణం కాబోలు ధర్మవరంలో రైలు ఎక్కువసేపు ఆగింది. చూపులు పరిసరాలను నిశితంగా వెదుకసాగాయి. ఆశ్చర్యంగా కొన్ని కుడ్యచిత్రాలు దూరంగా కనబడ్డాయి. మరి మనం పరిశీలించకుండ ఉండగలమా? గుడ్లుపెద్దవి చేసి చూస్తే గుట్టు బయటపడింది అది రామాయణమని. ఇక మనసు పులకించి కోతిగంతులు వేస్తు ఛందోశాఖలనాశ్రయించి చిత్రభావాలను , చరితమూలపురుషులను నెమరువేసుకొంటు మధురఫల రసాల నాస్వాదించింది. వాటిఫలితమే ఈ పద్యాలు. మీకు కూడ.

    తే.గీ.  ధర్మ వరమును రైలులో దాటుచుండ
              రామసత్కధా పరిపూర్ణ రమ్య కుడ్య
              చిత్రజాలంబు జూచితి చేష్టలుడిగి.
              ధన్యమైనవి కన్నులు తలపులపుడు.

  ఉ. ధర్మమె మారురూపమయి ధర్మమె నిత్యము సాధనంబుగా
       కర్మలనాచరింప ఘన కంటకదూషిత కాననంబులన్
       నిర్మల చిత్తుడైదిరిగి నీతివిదూరుల నేలగూల్చి ఆ
       మర్మము విప్పిజెప్పు పరమాత్ముని శ్రీరఘురాముజూచితిన్.

  ఉ. లంకను జేరనీయనని లంఖిణి భీషణ క్రూరరక్కసై
       బింకముతోడదేహమటు పెంచుచుదూకుచు మ్రింగబోవ ని
       శ్శంకత సూక్ష్మరూపియయి చక్కగ నాస్యములోనికేగి ఆ
       వంకనె వచ్చినట్టిఘనవానర ముఖ్యుని నేనుగాంచితిన్.
   
  తే.గీ. రాముచెంతనె సీతయు రమ్యగుణుడు
          లక్ష్మణుండట భాసిల్లె లక్షణముగ
          ధర్మ వరజన పుణ్యంపు మర్మమేమొ
          నిర్మలంబౌచు సత్కీర్తి నింగినంటె.
       
   తే.గీ.ధర్మబద్ధంపు మనుగడ ధైర్యమిచ్చు
           అర్థ మెక్కువయగుట యనర్ధమగును
           కామమనునది భార్యతో క్షేమమగును
           మూడుత్రోవలు నరునకు మోక్షమిడును.

                శ్రీరామకటాక్షసిద్ధిరస్తు!
 ఇలా అణువణువు రామమయం కావాలని ఆశిస్తు....
                                       మీ "సూర్యశ్రీరామం" (పొన్నెకంటి)
         

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి.

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!విఘ్నవారణా!

     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

 2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.


 వందే గణనాయకమ్.


1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!


2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....


3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....


4. మాతపితలను సేవించు మార్గమొకటె

    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....


5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

    పూజలందుచు భక్తుల మోదమలర

    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...


6. గరికపూజకె ముదమంది దురితములను

    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...


7. మోదకంబుల నర్పింప మోదమంది

    వెనుకముందులుజూడక మనుజులకును

    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...


8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

    వినయశీలంబె సర్వత్ర విజయమంచు

    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...


9. సర్వ గణనాయకత్వంపు సాధనాన

    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...


10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!
                                 ##

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...