22, నవంబర్ 2019, శుక్రవారం

తృతీయాశ్వాసము. 4.04.2018

                                 తృతీయాశ్వాసము .

  1. కం: శ్రీపూర్ణచంద్ర నామా!
             మా పాలిటి దివ్య శక్తి మముగావగదే
            పాపాల ద్రుంచి కరుణను
            గోపాలుని రీతి సతము కూరిమి గనుమా!

                                నాజరు కుటుంబ పోషణ.

2. సీ:   బట్టలు గుట్టుచు బ్రతుకును నీడ్చుచు
                             అవమాన భారంబు  నతిగమించి
           పెదనాన్న కొడుకుతో ప్రియమార కలియుచు
                             సంక్రాంతి పర్వాల సంచరించి
           సంగీత విద్యయే సాధనంబనియెంచి
                             ధాన్య సేకరణంబు తగనొనర్చి
           "బ్యారను" పనులేవి భారంబు గావంచు
                             విసుగు లేకయె బొగ్గు వేయుచుండి.
 తే.గీ :  తండ్రిపోయి కుటుంబ బాధ్యతలు పడగ
            చెల్లి పెండిలిసేసి యాశీర్వదించి
            కటిక దారిద్ర్య బాధలం గడపుచున్న 
            మేరునగమౌచు "నాజరు"మెరసెనపుడు.
 3. ఉ : బట్టలుగుట్టుచున్ స్వరము పద్ధతి తప్పని  ధీవిశేషతన్
           పట్టునుజారకుండ కడు ప్రాజ్ఞులు మెచ్చెడు రీతి బాడగా
           గట్టిగ చప్పటించినను గాంచని "నాజరు"తో ననెన్ "ఇదా?
           ఇట్టిదికాదు నీ భవిత యిమ్ముగ మార్తునునేనటంచు దా
           దిట్టతనంబునం బలికె ధీవరుడై "బసవా"ఖ్యుడయ్యెడన్.
 4. ఉ: "నీవుగ నేర్పగావలయు నిర్మలమూర్తిగ గానవిద్యలన్
           భావితరాలు చెప్పుకొనుభాతి స్వరాళి వికాసమూలముల్
           పావని సాక్షిగా నెలకు బత్తెమునిత్తుమ"టంచు బల్కెగా.
           దైవము మారువేషమున దగ్గర జేరుటనంగ నిట్టిదే!

                                సంగీతోపాధ్యాయునిగ బాధ్యతలు.

 5. ఆ.వె : ఉన్నయూరి యందె యుత్తమ సంగీత
               పాఠములను జెప్పు పదవివచ్చె
               ప్రథమ గురువనంగ "బసవయ్యగారింట"
               కాలుమోపి మిగులఖ్యాతినొందె.
 6. సీ : కమలగర్భుని రాణి కచ్ఛపీనాదంబు
                            సరిగమ రూపాన సాగెనెచట?
           నలువరాణి మొలక నవ్వుల సవ్వడుల్
                           జంట స్వరములౌచు జారెనెచట?
           శ్రీలక్ష్మి కోడలి చిన్నారి పలుకులు
                           చిలుకల పలుకులై చెలగెనెచట? 
            వేదమే నిలయమై విజ్ఞాన దీపమై
                           కాంతి పుంజంబులు క్రాలెనెచట? 
  తే.గీ :  అట్టి పుణ్యస్థలియె కలహంస వాహి
            ని యరుణారుణ చరణ వినిర్మలమగు
            "కొమ్మినేని"వారివిమల  కూర్మి గృహము
            భావి సంగీత మేథకు తావియయ్యె.
  7. ఆ.వె."కొమ్మినేని"వారి కూరిమి గురువుగా
            స్థానమందినట్టి సౌమ్యుడైన
            "నాజరాఖ్యు"కళలు నైజంబు గూర్చియు
            పలికిరిట్లు ప్రజలు పరవశించి.
 8. మ : ఎవరో గానసుథాకరుండట! భళీ!యింపారు భావాలతో
            నవచైతన్యవిలాస రూపుడట! సన్మానార్హ తేజుండటే!
            కవనంబున్ మరి నృత్యముంగఱపు సంస్కారాభిలాషుండటే! 
            అవనిన్నాజరె గుర్వనంగదగు నాహా! యెంత సౌభాగ్యమో!
9. తే.గీ: వీధిభాగవతములట, వీరతాళ్ళ
            పాటలట, ఎఱుకలసింగి బాణియంట
            కృష్ణచెంచుల రమణుల నృత్యమంట,
            నాట్యసంగీతయుగళమె "నాజరంట".
10. తే.గీ:అట్టి గురువుల యొద్దనె యమిత భక్తి
           నేర్చుకొనినట్టి విద్యయే నేర్పుదెచ్చు
           భావికాలాన గుర్తింపు పఱగజేయు
           ననుచు "నాజరు" కడజేరి రభ్యసింప.
11. కం: సంగీత చక్రవర్తిగ
            రంగంబును నేలునట్లు రసమయజగతిన్
            సాంగోపాంగత నేర్పెడు
            చెంగావి పటంపు ధారి శ్రీ నాజరెగా.

12.వ: సంగీతోపాధ్యాయునిగా "కొమ్మినేని బసవాఖ్యు" కుటుంబ సభ్యులందఱకున్ సరిగమలు నేర్పుచుండ "నాజరు" నకుం బ్రత్యేక గుర్తింపు వచ్చి గ్రామ గ్రామేతర విద్యార్థులు "కోరిన ధనమిత్తుము, మాకును సంగీతము నేర్పవలసినద"ని కోరుటయుం నాజరు తన్నాటకంబులను వేయుట, వేయించుట, సంగీతపాఠంబులం జెప్పుటలో క్షణము తీరికలేక యుండె. "దామరపల్లి" లో నలుగురు, "ఫణిదరం"కరణముగారి కుమార్తె యొకతె శిష్యులైరి. ఉదయము "పొన్నెకల్లు"లో సంగీత పాఠంబులు చెప్పి, భోజనానంతరము  "దామరపల్లి" లో మరి కొందరకు  చెప్పి, అల్పాహారానంతరంబు  "ఫణిదరముం" జేరి ఒక శిష్యురాలికి  జెప్పి, ఆ రాత్రికచటనే యుండి, ఉదయకార్యక్రమముల యనంతరంబు మరల ఆమెకు పాఠంబు జెప్పి, "దామరపల్లి" వచ్చి పాఠంబులు పూర్తిజేసి, భోజనానంతరంబు  స్వగృహముం జేరుట నాజరునకు నిత్యకృత్యమైనయది.     

                                            నాజరు వివాహము.

 13. చం: సరిగమ లిచ్చుచుండె తగు సంపదలన్ ఘనకీర్తి మాన్యతల్
              జరుపగ పాడియౌ నిపుడు చక్కగ పెండిలియంచు బంధువుల్
              పరిపరి యోచనల్ సలిపి పాయని కూరిమి నిర్ణయించి-రా
              సరియగు మామకూతురని సభ్యులు "నాజరు" కున్ ముదంబునన్.
14.సీ : శిష్యులు ముఖ్యులు స్నేహితులందఱు
                             నాజరు పెండ్లికై నగదుగూర్ప
           గ్రామకరణమైన గంభీరహృదయుండు 
                              "మాధవరాయుండు"మానితముగ
          "శ్రేయంపు తలబ్రాల చీరయు; ద్విశతము
                              ధనమును నిచ్చెను దర్పమలర
           ఆటగుఱ్ఱము, బ్యాండు, హంగుల మేళాలు
                              పెండ్లి సందడి తోడ పేరుమ్రోగ
 తే.గీ : మామకూతురు "కాశింబి"మధుర హృదయ
           పొన్నెకంటి కి కోడలై పుట్టియుంట
            ముద్దులొలుకుచు కుడికాలు మోపెనంత
           లక్ష్మి నారాయణునిజేరు లక్షణముగ.
15. సీ : అత్తగారింటికి నరణపుటల్లుడై
                           "కోండ్రుపాడందు"న కుదురుకొనగ
            మరదలే భార్యయై సరసనజేరంగ
                            మనసుపరవశించె మధురగరిమ
            పంచబాణుడు తన పౌరుషముంజూప
                           పగటి ప్రొద్దు గడుప భారమయ్యె
           రాత్రులందున యనురాగభోగములకై
                            అంతరంగంబున నాత్రమొదవ
 తే.గీ : గువ్వజంటను రీతిగా కూడియుండి
          సకల సుఖములనందగా సాటివారు
          సారసంసారమంచును సహృదయముగ
          దీవనలనీయ "నాజరు" ధీరుడాయె.

                          భారతీయ ధార్మిక వైవాహిక జీవనము.

16. ఉ : భావనలెల్ల పొంగు రస భాషణ సల్పిన, చాకచక్యమున్
            తావుల బంధమై వెలుగు, తన్మయతన్ తను చుట్టుముట్టినన్
            పావన వంశ చంద్రు నిడ ప్రాగ్దిశ భానుని నిచ్చు కైవడిన్
            జీవితమెల్ల సౌఖ్యముల శ్రీనిలయంబగు భార్యయుండినన్.
17. చం : పరమపవిత్ర బంధమిది భారతజాతికి, జీవనాడియై
              స్థిరపడిపోయె నిచ్చట ప్రదీపిత మానవ సంఘమందునన్
              అరమరికల్ కనంగను మహాత్ములు సైతము  చాలరిచ్చటన్
              హరిహరి!కానరావుగద యీ  విలువల్ పరదేశమందునన్.

18.వ : అత్తగారింట అరణపుటల్లుండై మనుగుడుపులు దినుచు  నాటకంబులను ఆయూరి కుఱ్ఱకారునకు నేర్పుచున్న తరుణంబున.

                          గ్రామస్థులకు నాటకములను నేర్పుట.

19. సీ :" కోండ్రుపాడు"న గల కుఱ్ఱకారెల్లను
                 "నాటకమును నేర్పునాజర"నుచు
            వలసిన ధనమది కలసి తామంతయు
                       భరియించు షరతును పల్కిరంత
            రెండువందలు గొప్ప పండుగ యగునట్లు
                       ముందుగనిచ్చిరి మోదమలర
            "కనకతార"యనెడు కమనీయ దృశ్య రూ
                        పకమును పాటల పదునుబెట్టి
 తే.గీ : గ్రామ మందున వేయించ, కాంచినట్టి
          జనులు పరవశించి నిలచి చప్పటులను
          కొట్టి "ఆరువందల"నిచ్చి కోరికోరి
          మరల యాడించిరచ్చట మనసుపడుచు.
20. ఉ : నాటక దర్శకత్వమది నవ్యపరీమళముల్ వెలార్చుచున్
            మేటిగ నుండగా పరమ మిత్రులు బందుగులందఱున్ భళా!
            పోటియె లేదు నీకనుచు పూర్ణమనంబున సంస్తుతింపగా
            కోటివరాలు కోరకయె కూడినయట్లుగ నుబ్బె నాజరున్!
 21.ఆ.వె : పెద్ద నటులతోడ పేరిమి నాజరు
                నటనజేయదగిన ఘటన వచ్చె
               "కృష్ణలీల"యపుడు తృష్ణయె తీరంగ
               ఆడిపాడినారు హ్లాదమొదవ.
22. ఆ.వె : ఒక్కసారి చూచి యోహోహొ యనుచును
                పల్లె పెద్దలంత వల్లెయనుచు
                ఆరువందలిడిరి గౌరవంబొప్పగ
                "కృష్ణలీల"యాట తృష్ణ దీర్ప 
23. తే.గీ : నెలకు వందలు రెండని నిశ్చయించి
                జీతమిచ్చుచు యువకులు చేయికలిపి
                 నాటకముల నాడించిరి పూటకొకటి
                 శ్రమకు ఫలముగ ధనమది సాగి వచ్చె .
24.ఉ : జీవితమంతయున్ కడలి చిందులుద్రొక్కు తరంగరంగమే
           నావను నెక్కి తజ్జనుల నైజము తీరము జేరు కోరికే
            కావుమటంచు ప్రార్ధనలె కంజదళాక్షుని నెల్లవేళలన్
           భావిని మంచిగూర్ప భగవంతునకే యది సాధ్యమౌనుగా.
25. తే.గీ : తాను దలచిన  దొకటైన దైవమొండు
                దలచు నాజరు సతికి  నేత్రాలవ్యాధి
                తిరుగబెట్టెను నత్యంత తీవ్రముగను
                నేత్రశాలయె నిజమైన నిలయమనగ

 26. వ : ఇట్టి దుర్భర స్థితియందు భార్యకు వైద్యంబు, నాజరునకున్ బ్రహ్మచర్యంబత్యవసరంబైనది.  నూతన సంసారపు ప్రథమపాదమందే "బ్రహ్మ" బలవంతపు బ్రహ్మచర్యవ్రతంబు నాకు విధించె"నని మనంబునం గుములుచు మార్గాంతరంబు లేక  నాటకములతో కాలక్షేపంబు జేయుచున్న తఱి కొందఱు కమ్యునిష్టు మిత్రులు పొన్నెకల్లు నుండి "నాజరూ! తుళ్ళూరులో పాటలపోటీలు నిర్వహింపబడుచున్నవి. అందు  నీవు పాల్గొని ప్రథమబహుమతి పొందవలయున"ని  జాబు వ్రాయగా నాటక ప్రదర్శనకు  సంసిద్ధులగుచున్న వారితో "నేను పదిరోజులలోగా వత్తును. మీరు మీ పాత్రోచిత సంభాషణలను వల్లెవేయుడ"ని చెప్పి ఏబది రూప్యములు బయానాగా తీసికొని "తుళ్లూరు"పాటల పోటీకింజనెను.

                          "తుళ్ళూరు"లో పాటల పోటి - విజయము.

27. ఆ.వె : కమ్యునిష్టు వారు కల్పించిరిచ్చట (ఇది అనవసరము)
                పాటలందు పోటి  ప్రథమునరయ
                దోర వయసువారు "తుళ్లూరు"నందున
                 పాలుపంచుకొనగ పంపె లేఖ.
  28.ఆ.వె: "కారుమంచివారి" కమ్మని పద్యాలు...కారుమంచి పూర్తి పేరు వ్రాయాలి.
                  "మోహన, బిళహరు"ల ముద్దుగూర్చి
                   రాగబంధనముల రక్తిని గట్టించ
                   భళిర!నాజరంత ప్రథముడయ్యె.

29. వ : అంతట కొండపనేని బలరాం, వేములపల్లి శ్రీకృష్ణాఖ్యులు పొన్నెకల్లున కేతెంచి " గ్రామ
కమ్యూనిస్టు  సమితి" నేర్పఱచి, "నాజరు"నభినందించుచు "గుంటూరు"తోడ్కొని వచ్చి "తుళ్లూరు"నుండి "వేపూరి రామకోటి"ని, "తెనాలి"నుండి "ముక్కామల పురుషోత్తము"ను 
రప్పించి జానపద కళారూపంబులలో నత్యంత ప్రధానమైన"బుఱ్ఱకథ"ను, అడవిలోని ఉసిరికాయ, సముద్రములోని ఉప్పు కలిపి ఊరగాయ పచ్చడి" యనునట్లు పార్టీవారు రామకోటిని ప్రధాన కథకునిగ, నాజరును హాస్యరస పోషకునిగ, పురుషోత్తమును  రాజకీయ విశ్లేషకుని గా నభ్యాసము చేయించుచు, నెలవేతనము ముప్పది రెండు రూప్యములిచ్చుచు  అందు పదునారు రూప్యములు  వారిభోజన వసతులకు తీసికొనుచుండిరి. 

30. ఆ.వె: అడవిలోన నుసిరి యంబుధి లవణంబు
                కారమింత సరిగ కలసినటుల
                మువురు కలసినారు ముచ్చటమీరంగ
                బుఱ్ఱకథ కళయె అపూర్వమాయె.

                               ప్రప్రథమముగా "ఈమని"లో "బుఱ్ఱకథ" .

31. ఉ : "ఈమని" గ్రామమందు కథనెంతయు గొప్పగ జెప్పిరంచు-బల్
               ప్రేమను బల్కిరందఱును, ప్రేక్షకుడొక్కడు రామకోటి యన్
               సామి, కథావిధిన్ మునిగి సంగతులే గతిదప్పజేయుటల్
               నా  మదికిన్ విశేషముగ నచ్చగలేదని వెల్లడించెగా.
32. చం : ప్రజల మనస్సులందు తన ప్రజ్ఞయు, నాంగిక హావభావముల్
              నిజముగ చాలలేదనుచు నిస్పృహ బల్కెను "రామకోటి"యే 
              "సుజనుల మానసాంబుధిని సుందర రీతిని గెల్వగల్గు నో
              యజితసుధీర!"నాజరయ!"హాయిగ జెప్పుమికన్ వడిన్ కథల్
 33. చం : కళ కళకై జనించె సహకారము జేయుట శ్రేయమౌనుగా
               గలగలలాడు పెద్దలను గౌరవవాక్కుల కాదటంచు దా
               గళమును విప్పె నాజరటు కమ్యునిజంపు నిబంధనమ్ములన్
               కలమున జాలువార్చుచును కార్మిక జీవుల పక్షమై వెసన్.

                                         నాస్తికత్వ ప్రభావము.

 34. ఆ.వె : కమ్యునిష్టు వారి కలయిక బలిమిని
                 నాస్తికత్వమెల్ల నరనరమున
                 ప్రాకి,  నాజరంత దూకి చేరిజనాళి. 
                 చింపివైచె దైవ చిత్రములను.
 35. కం : "జడలమ్మ"లేదు కనగను
               గుడిలోనిది రాతిబొమ్మె కొల్పులవేలా?
               మిడిమిడి జ్ఞానము వదలుడు
              " బడుగుల సేవించుటదియె పరమార్థమగున్."
 36. ఆ.వె: ఇట్టి భావములను గట్టిగ జెప్పంగ
                గ్రామవీథులందు కలయదిరిగి
                జ్ఞానమిడగ జూచె నాజరు బృందంబు
                నాడు జరిగెడు తిరునాళ్ళయందు.

                   నాజరు"ఆర్యసమాజ మతము"నవలంబించుట.

  37. ఉ : నాజరు బృందమంతయును నవ్యవికాస ప్రభావభావులై 
            తేజముపొందగోరుచును దేవుడులేడని గేలిసేయుచున్
            రోజులు సాగదీయుచును తమ "రూక"కు వేషము వేయుచున్ భళా!
            మోజుగ జేరిరందఱును మున్నుగ "నార్యసమాజమందునన్".
 38. ఉ : జందెమువేసినారు, పలుచక్కనిరీతుల నూతనాంశముల్
             పందెములొడ్డి నేర్చి తమ పాండితినెంతయు వృద్ధిజేయుచున్
             మందును, మాంసభక్షణము మానుచుసాత్త్విక జీవనంబుతో
             నందఱి డెందముల్ మురియ నాడిరి పాడిరి క్రొత్తపుంతలన్.
 39. తే.గీ : నాస్తికత్వాన  దిరిగెడి నాజరునకు
                    నాటకంబులు వేయుచు నటనజూప 
                 "రామకథ"యందు"కైకేయి"రమణి పాత్ర
                 తప్పలేదయ్యె నానాడు దైవలీల.
 40. ఆ.వె : "త్రిపురనేని"వారి తీక్ష్ణంపు భావాలు
                  "గోర్కి""అమ్మ"నవల కుదుపులన్ని
                  మనసునందునమర మంచి వక్తగమారి
                   కాలవశత"బుఱ్ఱకథకుడాయె."   
 41. సీ :  తర్కించుభావాలు తనలోన బెరుగగా
                             నాలోచనాశక్తి యధికమాయె
              పౌరాణికములైన పాత్రలు వేయుటన్
                       సునిశిత జ్ఞానంపు చురుకుపెరిగె
             గ్రంథాల పఠనమున్ ఘనముగ జేయుటన్
                              పండితస్థాయిని బరగజొచ్చె
              వాక్చమత్కార  వైభవమింపు సొంపార
                     నవ్వులు పూయించు నటనమబ్బె
 తే.గీ : వాణి కరుణను నాజరు పాటవంబు
         నొంది; యెట్టి కథలనైన సుందరముగ
          చెప్పసాగెను పెద్దల మెప్పు వడయ.
          "కలసివచ్చెడు కాలాన కలలుపండు".

42.వ :బుఱ్ఱకథా కథనమందు  విశేషానుభవముగల "చింతల సూర్యనారాయణ, వెంకట సుబ్బయ,  కాకుమాను సుబ్బరాయాఖ్యుల పర్యవేక్షణలో  కథాకథనము సాగుచుండె. 

                          నాజరు ప్రధాన కథకుడగుట. 

 43.తే.గీ : "సోవియటు" వీరవనితదౌ సుచరితమ్ము
               " తాడికొండ "లో నాజరు దళమువారు
                 బుఱ్ఱకథగను జెప్ప నపూర్వమనుచు
                 పొంగిపోయిరి ప్రజలెల్ల ముచ్చటగను.
 44. ఆ.వె : ‘‘వినగ దొడ్డవరపు వేంకట స్వామియే’’
                 బుఱ్ఱకథను జెప్పె పూర్వమందు
                 మరలవచ్చె నొకడు మనసులదోచంగ
                 "నాజరనెడు"వాడు నటనజూప
 45.ఆ.వె : అనుచుబల్కిరచ్చటారాధ్యభావనన్
                కన్న విన్నయంత ఘనముగాను
                ప్రథమ యత్నమందు  ప్రజ్ఞను జూపింప
                అవధి లేదు ప్రజల హ్లాదమునకు.

 46. వ : నాజరు కథను వినినవారెల్లరును  పరమానందభరితులై పొగడ, చింతల సూర్యనారాయణాఖ్యు బృందము సంగీత సాహిత్య నటనములందలి లోపంబులం దెలుప, సూక్ష్మ గ్రాహియు, నాటకానుభవంబునుం గల  నాజరు తత్ సూచనాళి ననుసరించి సమున్నతశిఖరముల నధిరోహింప సాగె. ఇంతదనుక కథకునకు "తంబుర"   లేదు,  పాదములకు  గజ్జెలు లేవు.  రామకోటి "శ్రుతి లయలే మాతాపితలని, శ్రుతిలేని పాట మతిలేని మాట ఒక్కటి యని,   వానినిం దెప్పింపుడ"ని  పార్టీ పెద్దలకు జెప్పి యొప్పింప, చింతల సూర్య నారాయణ గారు "రామకోటిని,  నాజరును "దావులూరు" తోడ్కొని వెళ్ళి "దొడ్డవరపు వెంకటస్వామి"వర్యుల  తొలినాటి "తంబుర" నిప్పించి, దానిని నాజరు గాత్రంబున కనుకూలంబుగా శ్రుతిచేసి  ప్రధానమైన "ధింత, ధింధింత"దరువున కనుగుణముగా తంబురపై మీటుట నాజరునకలవాటుచేసె. 

 47. మ : శ్రుతికిం దంబుర చాల ముఖ్యమని దా సూచించుచున్ "రామకో
               టి"తగన్ "వేంకటసామి"వర్యు  తొలినాటిన్ వాయిదంబున్ సురా
               గ తతుల్ పల్కగ జేసి శ్రీకరమునౌ గానంబునుం గూర్పగా
              "ధితథిం ధింతత"నాదమే దరువుగా దీపించె నాడెల్లెడన్.
48. కం .  ఆ రామకోటి గురువయి
               శ్రీరాగమ్మొకటె కాదు శ్రేయము గూర్పన్
              ఏరాగ మెచట నిడ
               సింగారమొ నాజరుకు దెల్పి ఘటికుని జేసెన్.
 49. సీ . పరుల సంతోషమే పరమాద్భుతంబను
                             రామకోటి యొకండె రమ్యగుణుడు 
           చేసిన సాయంబు చెడదను మిత్రుండు
                             రామకోటియె యనురాగ ధనుడు 
           హస్యంబుతో చతురాస్యుడై డెందాల
                             లాస్యమాడించు కళాతపస్వి
           సచ్ఛీలముం గల్గి సరస సంభావ్యుడై
                              ఆదర్శమూర్తిగా నలరునతడు
 ఆ.వె. తల్లి దండ్రి గురువు దైవంబు తానెయై
            రామకోటి యొకడె రాగ సుధలు
             పంచె నాజరుకు ప్రపంచాన వేణువై
            ఏపుమీర తానె యూపిరూదె. 
        
             ( కోటి వీరయ్య గురించి  వ్రాయాలి)

  50. చం : కనుగొన వేషభాషలును కమ్మని కంఠము హావభావముల్
                అనితరసాధ్యమై చెలగు నందెలసవ్వడి "కోటి వీరయే"
                తనదగు ముద్రవైచి యల దానవ వీరుల "క్షీరసాగరం
                పు"నినదమున్నొకే "రగడ"ముచ్చటగూర్చ మహాద్భుతంబుగా.
 51. చం : గిరగిర కవ్వమే దిరుగ కేలున బట్టునుదప్పె చూడగా
               జరజర ప్రాకు యత్నమున జారుచునుండె భుజంగరాజదే
               పరుగిడి పట్టబోవు తఱి పాలసముద్రపుటెల్లలందునన్
                తిరిగెనటంచు నా "రగడ"తిన్నగ తత్కథయందు భాసిలెన్.
 52. ఆ.వె : యుద్ధఘట్టమందు నుంచిన "రగడ"లే
                కథకుదగిన గొప్పఖ్యాతిబెంచ
                ఈలవేసి జనులు గోలలుజేయుచు            
                 నీప్సితంబుదెలిపి రింతదనుక.
 53. ఆ.వె : జానపదులబాణి జారిపోనీయక 
                 మణిని పొదిగినట్లు మధుర కథన
                 మందు పొందుపఱుప సంతసంబయ్యదే
                "జనులు మెచ్చు పథమె జానపదము." 
 54. చం : పలువిధ ప్రాంతసంచరణ పార్టికిపట్టును ఖ్యాతి బెంచగా
               దలచిన ముఖ్యులెల్లరును ధర్మ విధంబున  కొంత రొక్కమున్ 
               నెలసరిగాగ నిచ్చిరల నీమము దప్పక నాజరాఖ్యుకున్.
               ప్రళయమువోలె తీవ్రమయె భార్యకు నేత్రపువ్యాధి పిమ్మటన్
55. ఉ :  నాజరు భార్యకప్పుడట నాణెపు వైద్యచికిత్స చేసినన్
              సాజపు చూపురాదనుచు, సంసరణంబును జేయరాదనన్
             తేజముదప్పె నందఱకు దీనత నామెను బుట్టినింటిలో
              బూజిత వైఖరిన్ విడిచి ముందుకు సాగెను దుఃఖమగ్నుడై.

56.వ : వైద్యులు నాజరుంగని "నీవీమెతో గాపురంబు  జేసిన వ్యాధి తీవ్రమై యనతికాలమందె  మరణించున"ను  హృదయ విదారక స్థితిని జెప్ప  ఆమె పుట్టినిల్లయిన "గారపాడు"నన్ విడచి  సంసారసుఖంబునకున్ నోచుకొనక తనపై పార్టీ యుంచిన బాధ్యతలను నిర్వహించుచున్న తఱి.

 57. కం : చిఱునవ్వు మోము వెలయుచు
              గరుణను గురియించి ప్రజలగాచెడు రాజా!
              వరపూర్ణచంద్ర నామా!
              పరమాదర మాన్యమూర్తి!భాస్కరధామా!
 58. ఉత్సాహ : 
                   పొన్నెకంటి వంశ విభవ పూర్ణచంద్రనామ! ఓ 
                   సన్నుతాంతరంగ!పరమ సరళభావ మిత్రమా! 
                   వెన్ను దట్టి సకలజనుల వెతలనెల్ల బాపగా 
                   రమ్ము రమ్ము వేగిరమ్మె  రమ్ము మమ్ముకావగా !

 వ :  ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన   పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండును,  సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన "బుఱ్ఱకథనాజరుచరిత" మందలి   తృతీయాశ్వాసంబు.  
                       
            


           
              
           




            
                          

చతుర్థాశ్వాసము.14.04.2018.

                         చతుర్థాశ్వాసము 
     
1.కం : శ్రీరఘునాథుని సేవయె
           పారము జేర్పించు నావ భక్తులకనుచున్
           తారకమంత్రంబు సతము
           పారాయణ జేయు గ్రామపాలన ధుర్యా!

2. వ : నాజరు తన భార్యను అనారోగ్యకారణంబున "గారపాడు"లో విడచి బాధాతప్త హృదయుండయ్యునుం గర్తవ్యవిముఖుండుం గాక గుండె దిటవుజేసికొని యుండ తదనంతర వృత్తాంతంబు నవధరింపుడు.

  3. కం: "జిల్లా"పరిధిని నుండగ
             నుల్లంబులు పరవశింప నున్నత విద్యల్
             కొల్లగ "నాజరు" నేర్వగ
             వెల్లువయై"రాష్ట్రపరిధి" పిలుపును పొందెన్.
 4.ఆ.వె: "గరికపాటి వారు"ఘనమైన నేతగా
              నాజరు సహజంపు నైపుణి గని
              రాష్ట్ర పరిధి నుండ రమ్మనె ప్రేమతో
             "కమ్యునిజపు"వ్యాప్తి కాంచగోరి
 5.సీ : మానవబంధాల మమతానురాగాల
                           గౌరవంబులబెంచు "కమ్యునిజము"
           ధైర్య సాహసములు  దాతృత్వముంబెంచు
                           ఘనమైన మార్గంబు "కమ్యునిజము"
           పేదలు ధనికుల భేదంబులేదంచు
                              గర్జించు వాదమ్ము "కమ్యునిజము"
            బడుగులు సైతము ప్రశ్నింపగలిగెడి
                               గళముల నాదమ్ము "కమ్యునిజము"
 తే.గీ : అట్టి లక్ష్యాల సిద్ధి చేపట్టదలచి
           నాజరును వంతలిర్వురు నవ్యరీతి
           ఊరి ప్రజలకు సత్కథల్ నూరిపోసి
           కామితార్థాల పొందిరి ఖ్యాతి గలుగ
 6.కం : "మాభూమి"నాటకంబున
           నా  భూకామందు నాజరౌచు నటింపన్
           స్వాభావిక దూరుడయిన 
           శోభాకరమై వెలింగె సురుచిరలీలన్.
7. తే.గీ : "అహమదాబాదు" రేడియో యాజమాన్య
             మపుడు జానపదులకు మహాద్భుతమన
             స్పర్థకాహ్వానమీయంగ "ప్రధమ బహుమ
             తి"ని బడసె"నాజరు దళము"ధిషణజూపి.

8. వ :  నాజరు బృందంబు నాటకంబులను  నటించుచు, జానపద కళలయందు  జీవించుచు, నద్భుత నటనాపాటవంబుల ననేక పురస్కారంబులం  బడయుచున్నను, కమ్యునిష్టు పార్టీ సభ్యులైన యువతీ యువకులు ప్రేమానురాగంబులం గలసిమెలసియున్నను, వివాహమై సంసార సుఖంబులకున్ దూరమైన  నాజరు మానసిక, శారీరక స్థితి దుస్థితిగమారి, ‘‘పార్కిన్ సన్స్  వ్యాధి’’ ప్రారంభమైనది. తద్విషమున  డా॥సోమసుందరము గారినడుగ వారు "దీనికి పెండ్లి చేసికొనుటయే మందనిరి .  పుచ్చలపల్లి సుందరయ్య గారు" నీ భార్యను ఒప్పించిన పార్టీ పక్షాన వేరొక పెండ్లి చేయుదుమ"ని పలికిరి. దీనికి నాజరు అత్తమామ లంగీకరించలేదు. 

9.ఆ.వె. భార్య యుండి సుఖము బడయగ లేనిచో
           మనసు చెడును దారి మరలుచుండు
           దాని బాగుచేయ ధర్మపత్నికె చెల్లు
           భరతభూమి యందు త్వరితగతిని. 
10. సీ : మనసును నెంతగా మభ్యపెట్టుదమన్న
                            ఊరడిల్లదు తా మహోగ్రమగుచు
          ఆలోచనల్ నిల్పి యదుపుజేయుదమన్న
                            కల్లోలకడలిగా కట్టుబడవు
          యోగాది విద్యలనోర్పుగా జేయుట 
                            సాధ్యంబుగాదది శాంతిలేక
         సంసారమందున సంతోషమీయగా
                            భార్యయొక్కతె తోడు భర్తకెపుడు
   తే.గీ : భరతదేశంపు సద్ధర్మ పరిధి నున్న
             జీవనంబున కొంగ్రొత్త చేవగూర్ప
             పెండ్లియను నొక్క బంధమున్ ప్రియముతోడ
            నుంచిరార్యులు పదునైన యూహజేసి.
11. ఉ : వచ్చిన జబ్బు వైదొలగ "వంద"యె మందని పిల్లతండ్రికిన్
             నచ్చగజెప్పికొంచు శరణాగతి గోరుచు వియ్యమంది - మీ
             రెచ్చట బల్కరాదనుచు నిమ్ముగ రేయి ప్రయాణమై స్వతం
             త్రేచ్ఛగ నాజరాఖ్యుడు  సరే యని యా "బెజవాడ"జేరెగా!
12. ఆ.వె : "కొరిటెపాడు"లోన కోరిన పిల్లయే
               మారుమనువు కాగ తేరుకొనెను
               జన్మధన్యమనుచు సంతసమందెగా
               ప్రేమ పంటపండ రామయందు.
13. కం :  "పెదపూడి"పాఠశాలను
               సదమలమౌ శాస్త్రములను చక్కని కవితల్
               పదునగు సత్కవి "శ్రీశ్రీ"
               పదబంధములెల్ల నేర్చెబాగుగ"నాజర్".
 14. చం : చరితలు శాస్త్రకావ్యములు చక్కని యార్థిక సద్విమర్శలున్
               పెరిగెడు రాజకీయములు పెద్దల సుద్దులు గీతమాలికల్
               మరిమరి మారుమ్రోగునిట మానితమౌ "పెదపూడి"యందునన్
               ఒరపిడి బెట్ట జ్ఞానమును నోర్మిని"నాజరు"పండితుండయెన్.
 15. ఉ :  పాటలు సీసపద్యములు ప్రాసలు యాసలు కావ్యపద్ధతుల్
               మాటల యర్థభేదములు మారిన జానపదంపు సొంపులున్
               మేటి యలంకృతుల్ కవులు మెచ్చెడు భావసమున్నతాంశముల్
               నాటుకొనెన్ మదిన్ స్థిరత "నాజరు"కా "పెదపూడి"వాడలోన్.
 16. సీ : బెంగాలు వరదలే భీకరమ్ముగ సాగ
                              గ్రామగ్రామంబులే గంగగలసె
            కలకత్త వీధులు కశ్మలమ్మైపోయె
                               పులివిస్తరాకుల ప్రోగువలన
            మెతుకు కంటబడిన బ్రతుకు జీవుడనుచు
                                చెత్తకుప్పలకడ చేరిరంత
            పందులు కుక్కలు పక్షులు మానవుల్
                                దైవప్రార్ధన సల్పె దారిలేక
 తే.గీ : ఇట్టి స్థితిలోన నెవరైన నింతయేని
           ప్రేమ నందించి యార్ద్రతన్ బిలువనెంచి
          బుఱ్ఱకథ వ్రాసి బాధల పొందుపఱచి
          సాయమర్థించె నాజరు సంఘమందు.
17. ఆ.వె : విజయవాడ లోన బెంగాలు కరువునున్
                బుఱ్ఱకథగ వ్రాసి స్ఫూర్తి దనర
                అభ్యుదయ రచయితలందఱు గూడంగ
                చెప్పె కరుణరసము చిప్పిలంగ.

18. వ : "బెంగాలు కఱవు"కథ ముగింపు లో పాకిస్తాన్ సమస్యపై రాజీ కుదరక తికమకపడు గాంధీ, జిన్నాలను గురించి నాజరు "గుమ్మమందున యుద్ధరాకాసి, దేశాన కరువు పిశాచి’’ అను ఒక ప్రబోధ గీతము  వ్రాసి  గాంధీ జిన్నాలు  కలువ వలయునని,  యెలుగెత్తి చాటె. 

19. ఉ : ఆ సభలోని నాయక మహాశయులెల్లరు ప్రేమపూర్ణులై
           "వేసములోనెగాదు మన బిడ్డడు చక్కని పాటవ్రాయగా 
             చేసె పరిశ్రమంబ"నుచు శ్రేయమెలర్పగ సంస్తుతించి రా
             వాసిగలట్టి "సుందరయ" "బాపురె!యెంతటి వృద్ధి నీదనెన్"
20. ఉ : మీసముదువ్వుచున్ తనకు మేదిని సాటి యెవండటంచు-బల్
             రోసముజూపి "గర్తపురి రుచ్యపు గోగులకూర"యంచు-తా
             హాసము జేసినట్టి ఘను "నాంధ్రసభన్"గల "సుబ్బయార్యునిన్"
             భాసిత దివ్యతేజునట ప్రార్థనజేయగ భావ్యమౌనుగా.
21. తే.గీ : ప్రముఖ చిత్ర దర్శకమణి పరమగురువు
               "గూడవల్లి వంశజుడు"తాగూర్మిబిలచి
               సేకరించిన గ్రంథాలు చేతికిచ్చి
               నాజరును వ్రాయగోరె పల్నాటి కథను.
22. కం : "బాపట్ల"పాఠశాలకు 
               నోపిక "బళ్ళారి రాఘవోత్తముడటురాన్
               దాపున నాజరు కథవిని
               బాపురె! నీవింత ఘనుడ వనుచును మెచ్చెన్.
23. తే.గీ :"యువజన సభ"లో నుండియున్  యోగ్య పీఠ
               మును వదలి "రాఘవ"నటుడపూర్వమనగ
               వచ్చి నాజరుం బొగడెగా వత్సలతను
               వఱద కథనంబు కరిగించ వారి హృదిని.
24. సీ :    తల్లి సంస్మృతి సభన్ దగునంచు "బెంగాలు
                                కథ"ను జెప్పించిన ఘనుడెవండు? 
              ధనమును బట్టలున్ దండిగ సమకూర్చి
                                    సాయమందించిన సరసుడెవడు? 
               బళ్ళారి ప్రజలకున్ ప్రళయకాలములందు
                            మసలురీతులు దెల్పు మాన్యుడెవడు?
               చక్కని రచనకు స్పందించి నాజరున్
                                    హత్తుకొనినయట్టి యాప్తుడెవడు? 
  ఆ.వె :  భవ్యచరితుడైన "బళ్ళారి రాఘవ"
             కాక యెవ్వడిలను కానబడును?
             కళల విలువ నెఱిగి ఖ్యాతిని బెంచంగ
             మరల నతడె వలయు మహిని సుమ్మి!
25. ఉ : బందరు మాన్యులెల్లరును పాయని కూరిమి సాయమిచ్చుటన్
            "నందము సుబ్బరావ"చట నవ్యముగా సరిగూర్చ శ్రద్ధమై
             యందఱు క్రొత్త"తంబుర"ను నాదరమొప్ప సభాంగణమ్మునన్
             సందడిగాగ నిచ్చిరటు సన్మతి "నాజరు"కున్ ముదంబుగన్.
 26. సీ : "ఆంధ్రా అమరషేక్"గ అబ్బాసు వినుతిచే 
                                  ఖ్యాతిగన్నట్టి సత్కళల రాజు
            "మాభూమి"నాటకమందు "కమల"పాత్ర
                                "జమున"కు నేర్పిన జాణకాడు
              బుఱ్ఱకథయను నపూర్వాయుధము చేత
                                బడుగుకథకుల సద్బంధువతడు
             ధనిక కులములకు ధర్మాలు బోధించు
                                కూలీల పాలి సద్గుణుడతండు
  తే.గీ :  నాజరనువాడు బహుముఖ నటనలోన
            నారితేరిన సత్కళా కారుడనగ
            పేరువడుటను జనులెల్ల ప్రియముతోడ
            సంతసించిరి సతతంబు సన్నుతించి.
 27. చం : ప్రజలకు పోరుబాటలకు ప్రజ్జ్వలనాలకు కమ్యునిష్టులే
               నిజమగు సంఘశక్తియని నిశ్చలతేజుడు నాజరాఖ్యుడే
               భుజబలమయ్యె నయ్యెడ యమోఘపు సాయుధ మూర్తియౌటచే
              నజితుల నడ్డుకోదలచినాంక్షల నుంచెను"కాంగిరేసు"యే.
 28. చం : గతమున"రామరాజు"కథ కళ్ళకుగట్టుటె నేరమంచనెన్
               హితమతిహీనులా పరమ హేయపుటాంగ్ల దరిద్రపాలకుల్
               పతనము చేరువౌట తన ప్రాభవ మున్నిట చూపు కోర్కెతో
               వెతలను గల్గజేయ సరివేటును వేసెను"నాజరన్న"పై.
 29. తే.గీ : ప్రజల డెందాల జెడగొట్టు పార్టి యనుచు
                 కమ్యునిజము ను ప్రభుతయే కాలరాయు
               నట్టి  చర్యగ పలు నిషేధాజ్ఞలీయ
                 బుఱ్ఱకథకుల ముందున్న భుక్తిపోయె.
 30 . ఉ : చేరెను నాజరయ్య నవజీవనయాత్రకు"పొన్నెకంటి కిన్"
             ఊరకయుండలేక పది యూళులల మెచ్చిన  నాటకంబులన్
             వారల కోర్కెమేరకును వాచకభేదములాంగికమ్ములున్
             తీరగు పాటలంగఱపి తిండికి దెచ్చెను గొంత రొక్కమున్.    

 31. వ : ఇట్లు దిరుగుచుం దన శైలిలో ఆసాముల, జీతగాండ్ర స్థితిగతులన్  బాటల రూపంబున వ్రాసి పాడుచుండె.

 32. కం: పరగడుపు పాచి కూడును
               మరి మధ్యాహ్నంబు నందు మాడినకూడున్
               కరుణకు నోచని జీవులు
               ధర నీడ్చుచునుండి రకట! ధనికుల యిండ్లన్.
  33. కం: చాలని జీతము తోడను
              కాలంబును వెళ్ళబుచ్చు కర్మము మీకా?
              చాలిక యూడిగమిట్లని
              యేలికపై తిరుగుబాటు నివ్విధి నేర్పెన్.
   34. తే.గీ:తిరుగుబాటును హక్కుగ తెలియజేసి
              జీతగాండ్రకు దగినట్టి శ్రేయమలర
              నాజరాఖ్యుండు కలిగించె నమ్మకంబు
              భావి జీవన పరిథులు బాగుపడగ.
  35. తే.గీ:కూలి జనులకు నిరతంబు కొమ్ముగాచి
             శ్రామికాళికి గూర్చంగ సంఘమొకటి
             చేతనత్వంబు గల్గించి యూతమీయ
             మండిపడిరిది విన్న ఖామందులెల్ల.
   36.  తే.గీ:"మోతడక"గ్రామ ఖామందు ముందు నిలచి
             జీతమునుజేయు దౌర్భాగ్య జీవితాలు
             దుడుకు చేష్టల హింసించు దొరల తెగువ
             పాట రూపాన సృష్టించి పాడియాడ
  37. తే.గీ: ఆగ్రహించిన యజమాని యదుపుదప్పి 
             ఛెళ్ళుమనిపించె నాజరు చెంపనపుడు 
             మానవత్వంబు నశియించి మహిషమగుచు
             నిచ్చవచ్చిన రీతిని  నిట్టులనియె. 
    38. కం: "ఏరా! కమతపు వెధవకు 
             మారాజుకు బెట్టినట్లు మవ్వపు దిండా?
             కూరాకు విలువసేయని 
             మీరా మము దిట్టిపోయ మీరిన వారల్?
   39. తే.గీ: అనగ నాజరు కోపంబు నణచుకొనుచు 
            "పరుల శక్తికి దగినంత ఫలము నిచ్చి
            మానవత్వంబు జూపుట మంచిద"నుచు
            బుద్ధి జెప్పెను పెద్దల ముందు నిలచి.
   40. కం:దొరలెల్ల గరుణ జూపిన
           దొరగారను గారవంబు తోచును మాకున్
           కొఱగాని దుష్ట చేష్టల 
           నరకంబును జూప మీరు నాయకులేనా? 
  41. కం:శిక్షింప మీరలెవ్వరు?
         రక్షింపగ లేని యట్టి రాజసమేలా?
         రాక్షస ప్రవృత్తి మానుచు 
         మా క్షేమము  సతము జూడ మాన్యత పెరుగున్.
  42. ఆ.వె: పరుల కష్టమెల్ల పరమాన్న మనురీతి
           ననుభవింప దగునె ననవరతము?
           కష్టఫలము నీయ కల్యాణగుణమౌను
           తెలిసికొనుడు  మీరు తెలివితోడ. 
43. చం: హరిజన ముఖ్యులున్ యువకులాగ్రహమందుచు "పెద్ద రెడ్డి"పై
             కొఱకొఱ జూచుచుం "బరమ క్రూరత దూషణ మీకుజెల్లునే?
             సరియగు మార్గమెంచుకొని సద్గుణభావము నింపుకొండ"నన్
             పొరబడినందు కాతడును మున్ను క్షమాపణవేడె నత్తఱిన్.
44.చం: ప్రజలకు మంచిజెప్పినను రక్షకబృందము భీతిగొల్పగన్
            గజమున కొక్కరుండిరట గండ్రతనంబున క్రూరచిత్తులై,
            విజయమునందగోరి పలు వీధుల నిక్కుచు వేగిరంబుగా
            సజలవిషాద నేత్రముల సాగెను నాజరు  భావిదీప్తికై 
45. శా : నేరంబేమియు జేయకున్న నెదియో నిందన్నిరూపించుచున్
             గారాగారము ద్రోయుచుం జెడుగులై క్రౌర్యంబునం గొట్టుచున్ 
             వీరత్వంబును జూపుచుండిరకటా!వేమార్లు "పోలీసు"లే
            " పోరాముల్ యొకదానివెంట నొకటై ప్రోగౌన"నన్ సామెతన్.
46. ఉ : కన్నులు కానరాని నిజకాంతయు గర్భిణి బావిలోపలన్
             తిన్నగ చేరలేక కడు దీనత బిందెడు నీరమందగన్
             చిన్నగ జారి మెట్లపయి చేరె మహేశుని పాదపద్మముల్
             ఎన్నగరాదు కాలమది యెప్పటి కెట్టుల నిర్ణయించునో!
47. తే.గీ : అనుచు నాజరు పరమ దుఃఖార్తుడగుచు
               భార్య మరణంబు తనదు దౌర్భాగ్య మనగ
               పొన్నెకంటి కి జేరెను ప్రొద్దుమిగుల
               అమ్మ యనురాగదేవత యండతోడ.
48 . ఉత్సాహ వృత్తము : 
  ఇంటిపేరు లేకయుంట నేమికర్మమౌనురా!
  కంటిజబ్బు కారణాన కలియలేదు భార్యతో
  నొంటరౌచు నీవు నేను నొదిగియుండ న్యాయమా?   
  జంటకొఱకు మామకూతు చనువునడుగు మనుచు దా
49. 
  వెంటబడగ తల్లి యపుడు వేగజనెను నాజ రా
  గంటలోనె గారపాడు కాదటంచు బల్కకే;
  కుంటిసాకు మామ చెప్పి కూతునీయ కాదనెన్
   పంటవలతి యాశజూప పరిణయంబుజేసెగా!
 
           నాజరు  కొండలలో దాగుట.

50. ఉ : కొందఱు పార్టి నేతలిల క్రూరముగా నొక పెద్ద రైతునే
             చిందరవందరై పడగ శీర్షముగాల్చిరి"తుళ్ళురం"దునన్
             అందిన వార్తమేరకటు లాగ్రహమందుచు గ్రామసీమకున్
             సందులదూరి వచ్చిరటు చయ్యన రక్షక బృందమంతయున్.
51 . ఉ : వారినిజూచి నాజరటు" బ్యారను "లోపల దాగియుండగా
              ఘోరతరంబుగా గడలగోడలు,కుండలు, సూర్యచంద్రులున్
              తారక లింటి కప్పులుగ దర్శనమిచ్చిన కొంపలోనికిన్
              జేరెను బృందమంతయును శీఘ్రముగా బరిశీలనార్థమై.
52 . తే.గీ : గొడ్లచావిడిలో దూరి కుళ్ళు కంపు
                పేడతట్టనుశిరము పై బెట్టుకొనుచు
               నాజరెవ్వరు కనకుండ నక్కి నక్కి
              "మోతడక"కొండ జేరెను మ్రుచ్చువోలె.
53 . ఆ.వె : పెండ్లి జరిగె నేదొ పేరుకుమాత్రమే
                సుఖము ననుభవింప శూన్యమయ్యె
                కొలది రోజులకును గుట్టుగ కొండలన్
                చేరవలసి వచ్చె చింతతోడ.
 54 . సీ :" రక్షక బృందంబు "రక్కసిచర్యగా
                           కందికంప దడులు కాల్చినారు
             క్రోధంబు దీరక కుండలు ముంతలు
                           ముక్కలు జేసిరి మూర్ఖులగుచు
             "బ్యారను" పట్టాల పరదాలు చింపుచు
                           అట్టహాసపు చిందులైరి వారు
             పచ్చడి జాడీలు పగులగొట్టుచువారు
                            "పెట్రోలు" బోసిరి పిచ్చిముదిరి
     తే.గీ : ఎంతయో భీతి వణకుచు నెదురు వచ్చు
              నాజరువలి తల్లిని జూచి  " నాయకుడెట
              దాగెనో చెప్పు, లేకున్న తప్పదెపుడు 
              ముప్ప" నుచు బల్కి సాగిరి ముందుకపుడు.
55 . కం : "మోతడక"కొండ గుహ న
               జ్ఞాతమ్ముగ వాసముండి నచ్చిన బాణిన్
               ప్రీతిగ పీడిత జనులకు
                కైతల నలవోక వ్రాసె  కవి నాజరహో!
56 . చం : జరిగిన వాస్తవంబులను జాగ్రతగా నొక "కాంగిరేసు"లో
              దిరిగిన కార్యకర్త కడు ధీరత నా "ప్రెసిడెంటు"గారికిన్
              మరిమరి జెప్పగా నతడు మందిని గూర్చుచు గోలజేయుచున్
              దొరికెను నాజరిక్కడని దూఱుచు బల్లెము గొంచు వచ్చెగా.
57. ఉ : పల్లెకు పెద్దవాడయిన "ఫాదరుబాబు"వివేచనంబుతో
             నుల్లము రంజిలం బలికి యూరికి వచ్చిన నయ్యలందఱన్
             మెల్లని శాంతివాక్యముల మేలగు సూక్తుల నచ్చజెప్పుచున్
             కల్లల నెవ్వరాడిరి "మకామిదె"నాజరుదంచు మీకటన్.
58 .తే.గీ : కొండచుట్టును సైన్యంబు కొలువుదీరి
               యున్న కతమున మిత్రుని యునికి మార్చ
              "బాబు"యత్నించి "నాజరు"పజ్జజేరి
               ప్రేమతోడను నన్నంబు పెట్టి పనిచె.
59. తే.గీ : మారువేషాన తరలెను గారపాడు
               ఊరిబయలున యానాది యువకులంత 
               తనకు సన్మిత్రు లగుటచే తన్మయముగ
               హాయినుండగ నాజరున్ హత్తుకొనిరి.
60. ఆ.వె : "గారపాడు"లోని కాంగ్రేసునాయకుల్
                వెదకుచుండిరచట వేయికనుల
                నాజరెక్కడనుచు నల్దిక్కులందున
                నరిగె "కొండవీటి"కతడు మున్నె.
61. ఉ : "తుమ్మలకుంట" ప్రక్కగను ధోవతి దోపుచు నాజరయ్యెడన్
             నెమ్మది నెమ్మదిన్ నడచి నెయ్యుడు"తాళ్ళురి రామకోటి"తా
             రమ్మని జెప్పకుండగనె రాతిరిరాతిరి దిక్కుతోచకన్
             గుమ్మము దట్టెగా తనదు కూరిమి మిత్రుని సాయమందగన్
62. మ : గుహలన్ వాసముజేయుటల్, తినగ నేకూడైన లేకుండుటల్
             అహముల్ రాత్రులు నిద్ర లేని మిషతో నారోగ్య భంగంబులున్
             కుహనా రక్షకులైన వారి పరుగుల్ గోలల్ మనశ్శాంతినిన్
             బహుదూరంబుగ జేయగా మనుగడే ప్రశ్నార్థకంబయ్యెగా!

                కాంగ్రేసు కార్యకర్త భీకర శపథము.

63. ఉ : "తంబురమీటు వ్రేల్నఱికి తప్పక నాపగదీర్తునన్న - యా
             సంబరమేమి నిల్వకయె స్వర్గముజేర్చెను కార్యకర్త - నా
             యంబుజనాభుడే" యనియె అన్నయ "సయ్యదుబాబు," " భ్రాత " తో
             పంబిన గర్వమెప్పుడును బ్రాణముదీయును నేరికేనియున్
64. ఉ :  "నాజరు ప్రాణముల్నిలిపి నల్వురిలో బడకుండజేతు నీ
             రోజున నాదు యుక్తిమెయి లోపల వేసెద"నంచు "ఎస్సయే"
             భాజనుడైన పోలిసును బ్రక్కకు బిల్చి"యరెస్టు"జేయగా
             నా జనులందరాతనికి హైన్యము జూపిరి క్రూరచిత్తులై.   
65. చం : "మిలటరికాంపు"లో నడుగు మెల్లగబెట్టినదాది యందఱున్
              గలగల చెంతజేరి తమక్రౌర్యముజూపుచు "పల్లెటూళ్ళ లో
             నెలవులు, నాయకాగ్రణుల నీరము భోజన భాజనాదులున్
             గలయుచు నిచ్చువారెవరు? క్రన్నన జెప్పుమ"టంచు గొట్టగా
66. చం : "తెలియదు నాకు సామి! కడుదీనుల గాథల, కూలిరైతులన్
                బలముగలట్టి కాపులెటు బాధలుపెట్టుచునుందురో, సదా
               ఫలితము శూన్యమై కడకు వారల జీవికలెట్లు రాలునో!
               లలితపదాల దెల్పి నుతులందుచు నే మనుచుంటి నిత్యమున్"
 67. తే.గీ : "బుఱ్ఱకథ"లయ్యె నాకింక భోజనంబు
                 కతలు లేనట్టి రోజున వెతలె మిగులు"
                 నని "కలెక్టరు"గారికి నంజలింప 
                 కరుణ జూపిరి వారలు ఖైదులోన.

68. మత్తకోకిల: "మంచి కంఠము నీదిరా యనుమానమించుక లేదురా
                        దంచిపాడుము నాజరూ! సముదంచితంబగు రీతితోన్
                        సంచితంబుగ నీకునబ్బెను సంగతుల్ ఘన రాగముల్
                        పంచుకొందము భోజనంబ"ని పాట కోరిరి సైనికుల్.
         69.తే.గీ:  తాను నేర్చిన రాగాలు తాళ గతులు
                        గాన గంధర్వు పగిదిని ఘనముగాను
                        గురుని కరుణను బాడంగ మురిసి,  వారి
                        భోజనంబును బంచిరి భాజనముగ.
70. మ. కోకిల : "దీన నాజరు పున్నెమో  మరి దివ్యతేజుల దీవనో
                         గానవిద్యను గారవించిరి కాపలాగల సైనికుల్
                         మేను తన్మయమందగా విని మేలుమేలని బల్కుచున్!"
                         మానితంబుగ వారలందరు మాటలాడిరి ప్రేమతో

71.వ: "కల్యాణరావ"ను కలెక్టరుగారు మంగళగిరి వచ్చి కమ్యునిష్టు ఖైదీలను కాల్చక
           విడుదలచేయ వలయునని  ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల ఆజ్ఞయని తెలుపుట.
 
72 . తే.గీ :"కనగ నీసతి సూత్రాలు గట్టివనుచు"
                  చంపకుండగ దయతోడ సౌమ్యరీతి
                "గర్తపురి"లోన దించెను కాలవశత
                  మాన్య కల్యాణ రావను మహిత గుణుడు
                  బుఱ్ఱకథ లకు ప్రాణంబు పోయుమనగ!

73 .వ : ఈ రీతిగా "నాజరు" విడుదలై స్వతంత్ర జీవనమునకు బూనుకొనెను.  

                                   ఆశ్వాసాంతము
      
74 . పంచచామరము : విశేష ప్రేముడిన్  జగాన విస్తృతంపు భావమై
                                   అశేష సుప్రజాళి పావనాంతరంగమై సదా
                                   వశీకృతాత్మతేజ! దివ్య వైభవాది భాసురా!
                                   ప్రశాంత పూర్ణచంద్ర శేఖరా! విశుద్ధ శేముషీ!
75 . కం : కాలము వ్యతిరేకించిన
              వీలగు సాయమ్ముజేసి వేదన దీర్పన్
              మేలుగ నుండెడు తీరును
              పాలనలో జూపు మాన్య!పావన చరితా!

 వ :  ఇది శ్రీరామ పదారవింద మకరందపానమత్త తుందిలుండును, సుజన సంస్తుత్యమాన మానసుండును, బంధువత్సలుండును, శ్రీవత్సగోత్రజుండైన   పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరాయాఖ్య తనూజుండును,  సుజనవిధేయ సూర్యనారాయణరాయ నామధేయ ప్రణీతంబైన "బుఱ్ఱకథనాజరుచరిత" మందలి  చతుర్థాశ్వాసంబు.  
                       
            

                                                 📖   📖    📖    📖   📖
                                  
                                          
      
      
      
      
            


                              


          

           
                             

13, నవంబర్ 2019, బుధవారం

ది . 10. 11.2019. ప్రజ పద్యం. త్యాగరాయ గాన సభ . బహుమతి ప్రధాన ఉత్సవము




 ది . 10. 11.2019. ప్రజ పద్యం.

త్యాగరాయ గాన సభ . బహుమతి ప్రదానోత్సవము

 ఈ నాటి పద్యో త్సవము మధురానుభూతి కలిగించినది. పెద్దల సమక్షంలో సన్మానము. వ్రాసి కావ్యము ( బుర్రకథ నాజర్  చరిత్ర) లో  రెండు పద్యాలు చదివే అవకాశము . కానీ సమయాభావం చేత ఒక పద్యము మాత్రమే చదివాను. అది మా యూరి బంగారు కొండ వర్ణన .

 సీ . భీకర వాయువుల్  పెను మంటలొచ్చిన
                                 నిశ్చలమై యుండు నిండుకొండ
      తనను ముక్కలు జేసి దారులు పెట్టిన
                               నిబ్బరమై యుండు నియతికొండ
     గుహలో వరదరాజు కొలువుండి యుండుట
                              నియమంబు తప్పని నిలువుకొండ
    జడలమ్మ బావికి జారుడు గంగమ్మ
                             పులకింతలాకునెల్ల  పొంగుకొండ
  ఆ. వె. పొన్నెకంటి కొండ పొగరైన కొండగ
           కోర మీసకట్టు కోరి దువ్వి
          హితుల హత్తు కొనగ హేమాద్రియై నిల్చి
          కూర్మి వరములీను కొండయిదియ. 1.

మస్తాన్ కుటుంబమండలి వ్యధను ( మస్తాను అన్న, ప్రఖ్యాత షెహనాయి కళాకారుడు , నాజర్ మరణించుట)  జూచి బాధతో సూర్యుడు అస్తమించాడని భావించు  సందర్భము.

సి . తన కాంతి రేఖలన్ ధరణి ప్రాణులకెల్ల
                     వెల్గుల బంచెడు వే వెలుంగు
     చిరువేడి ప్రసరించి చేతనత్వము బెంచు
                    ప్రత్యక్ష దైవమౌ భానుడతడు
    మధ్యాన్న బింబమై మరికొంత తైక్ష్ణ్యంపు
                     చేవ చూపించు రోచిష్ణుడతడు
తే. గీ . సృష్టి నియమంబు తలదాల్చి స్వేచ్చనుడిగి
         తూర్పు కొండకు సరసరా దూరమగుచు
        మౌన ముద్రను పాటించి మాన్యుడగుచు
        పశ్చిమాద్రికి గతి నెంచి పాఱి పోయె .
                 

                   

         

                     


దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...