1. మంగళ గౌరికి మంగళ హారతి.
మంగళమనరే మాధవుసోదరి, మంగళమూర్తికి మానితరీతిని
నీ పాదాంజలి నిష్ఠను సలుప, సర్వపాపములు సమసిపోవును..మంగళ..
భవ్య నామము భక్తిని దలచ, భవబంధములే సమసిపోవును
సతతము కరుణతో సాకుము తల్లీ!, సాగిలి మ్రొక్కెద సారసాక్షిరో! ..మంగళ..
భవుని దేహమున సగమై నిలచి భవ్య తేజమై వెలిగెడు తల్లీ
ముజ్జగములను మోదము నింపగ. కన్న తల్లిగా కాచెడు గౌరీ!..మంగళమనరే.
మంగళగౌరిగ మహిళలందరు మనసున నిలిపే మాన్యరూపిణీ
మాంగల్యంబుల రక్ష సేయుమ! మాతృప్రేమను మాపై జూపుమ!..మంగళ మనరే.
2. శ్రీమహాలక్ష్మి కి మంగళహారతి.
మంగళం జయమంగళం, శ్రీమహాలక్ష్మి కి శుభ మంగళం
చంద్రసోదరి శౌరి రాణీ, కమలవాసిని కమలనేత్రా!
క్షీరసాగర కన్యకా, మమ క్షేమ దాయక భావుకా...మంగళం.
దీనజన పరిపోషకా, దేవతాఖిల సంసేవితా...
పేదసాదల పెన్నిధీ, ఘనప్రేమ భాసురధీనిధీ..మంగళం.
భక్తగణ చింతామణీ, భవము డుల్చెడు భానిధీ.
శివము సుఖముల ప్రేమ తత్త్వపు సకలభాగ్యద శ్రీనిధీ...మంగళం.
సారసాక్షులు సభక్తికముగ శ్రావణమాసపు శుక్రవారమున
నిను సేవింపగ సర్వసంపదలు నిరతము గల్గును...మంగళం..
3. గణపతి కి మంగళహారతి.
అంబాసుతునకు లంబోదరునకు మంగళమనరే మానినులారా!
ఆదిపూజ్యుడై యఖిలజగముల హర్షమునింపే యమలమూర్తికి
విశ్వమునందలి విఘ్నములన్నీ వేడిన డుల్చే విఘ్నరాజుకి. "అంబా"
తల్లిపార్వతి ముఖపద్మంబును వికసనజేసే వేదవేద్యునకు
నెమలివాహనుని నేర్పున గెల్వబుద్ధిబలమునుజూపినవానికి."అంబా"
గరిక పూజకె ఘనమనితలచి వరములనిచ్చే వక్రతుండునకు
కుడుములుండ్రాళ్ళు కోరిభుజించి ముదమునుజెందే మోదక ప్రియునకు.
అంబాసుతునకు...
గణేశుని పాట.
గరికపూజకే ఘనమని తలచి కాంక్షలు దీర్చే కరుణామూర్తీ
సిద్ధీ బుద్ధీ వలచిన మూర్తీ! చిన్మయగుణగణ మధురస్ఫూర్తీ"
వ్యాసకవితకు ఘంటము నడపిన భాసురసత్కవివీవయ్యా
ఈశుని శక్తికి గౌరిప్రేమకు ఇంపగు రూపము నీవేనయ్యా//గ//
తల్లిదండ్రుల ప్రదక్షిణంబున కొల్లగపుణ్యము కల్గునటంచును
చేసిచూపితివి గిరగిరదిరుగుచు శ్రీహరతనయా గణాధిపా//గ
ఇద్దరు తల్లుల ముద్దుబిడ్ఢవై ఇంద్రాదులకే పూజ్యుడవైతివి
కరుణజూడుమా గజవదనా! పరమపావనా సంకటహరణా//.1
ఉండ్రాళ్ళ గణపయ్య ఉండవయ్య మా గుండెను
ప్రాణముండు దాక నిన్ను ప్రార్ధిస్తు ఉంటాము..పల్లవి.
నలుగుపిండివాడవంట నాయన శూలానతునిగి
గౌరిప్రేమ కాపాడగ గజముఖుండవైనావట//ఉం//చరణం.
తమ్ముగుర్ర గెలువగా తలిదండ్రుల జుట్టుదిరిగి
పదవిని జేపట్టినావు పంతంబున నెగ్గినావు//ఉం//
మాతాపిత సేవకన్న మహిలో గొప్పేది లేదు
అన్న సూక్తి సత్తెంబని ఆచరణను జూపినావు//ఉం//
ఆరోగ్యం కలగాలని అర్కపత్ర ఉమ్మెత్తలు
గరికపోచ కాంచన గన్నేరు తులసిజాజులన్
మామిడాకు రేగు దవన దాడిమిపత్రంబులన్
పట్టి పూజ చేయంగను పట్టుపట్టినావయా//ఉం//
ఉండ్రాళ్ళను చూచినంత ఉండలేక నీమనసు
దండిగాను భుజియింప తారానాధుండు నవ్వె
అంబశాపఫలితంబుగ అందరు నిను పూజసేయ
అపనిందలు బాసి సతము హ్లాదంబుగ నున్నవారు//ఉం//2.