10, జూన్ 2025, మంగళవారం

ప్రొఫెసర్ మాధవీలతారెడ్డి.

సీ.  శిలల బరువు వాని శ్రేష్ఠత్వముంగూర్చి

    శోధన సల్పిన సుదతి యెవరు?

    పదునేడు వత్సరాల్ ప్రాజెక్టు చీనాబు

    నిర్మాణ బాధ్యతల్ నెఱపెనెవరు?

    వెంకటరెడ్డికిన్ విమలాన్నపూర్ణకున్

    గుర్తింపు తెచ్చిన కూతురెవరు?

    మైదుకూరున బుట్టి మహిళామణిగ వెల్గు

    బంగారు పతకాల ప్రాజ్ఞి యెవరు?

    బెంగళూర్ సంస్థలో ప్రియమైన ప్రొఫెసరై

    మాన్యతన్ ఉన్నట్టి మహిళ యెవరు?

     మహిళా జియోటెక్ గ మానిత ముకుటమ్ము

    ధరియించి వెల్గిన తరుణి యెవరు?

    అర్ధచంద్రాకృతిన్ ఆశ్చర్యముంగొల్పు

    వారధి నిర్మాణ వనిత యెవరు?

    కాశ్మీర ప్రజలకు కలలపంటగ వచ్చి

    చీనాబు దాటించు చిన్నదెవరు?

తే.గీ. ఎవ్వరెవ్వరో యన్న నే నెఱుక పఱతు

        మోది కనుగొన్న జీయాల్జి ముద్దుబిడ్డ

        విశ్వవిఖ్యాతి బెంచిన వీరనారి

        భరతమాతౄణముం దీర్చు పసిడికొండ

        ‘‘మాధవీలతా రెడ్డి’’ యన్ మాన్యచరిత.

    

    


23, మే 2025, శుక్రవారం

కారముల సీసమాలిక.కవితాచమత్కృతి.

‘‘ శ్రీకార’’మనజెల్లు చెన్నగు  నారంభ‌‌,మునకన్ని పనులందు మోదమంద.1

‘‘ఓంకార’’మునుజెప్ప నుచ్ఛ్వాస నిశ్శ్వాస, క్రమబద్ధమునుజేయ గాంచుశక్తి.2

ఆరాధ్య దైవమే ‘‘ఆకార’’రూపాన, గాంచుటె భక్తుల కామితంబు.3

‘‘సాకార’’సౌందర్య సౌజన్య మూర్తిగా, ప్రార్ధింత్రు భక్తులు రామభద్రు.4

ఆధ్యాత్మికంబుగా నంతరంగముపండ, కలలతలపు ‘‘నిరాకార’’మందె.5

‘‘సత్కార’’మనగను సంగీత సాహిత్య, సర్వకళాభిజ్ఞ సంజ్ఞయగును.6

‘‘మమకార’’మనగను మాతృగర్భము నుండి,ప్రేమబంధమ్మైన ప్రేగుగాదె?.7

మదిలో ‘‘నహంకార’’మలినమ్మునిండిన,ప్రేమబాంధవ్యాలు బెదిరిపోవు.8

పెద్దల దర్శింప ప్రియమైన భావనన్, కైమోడ్పునిడ‘‘నమస్కార’’మగును.9

ఘనకార్యమును జేయ గౌరవాదరముల, కాంచనంబిడ ‘‘పురస్కార’’మగును.10

సజ్జన వర్తనన్ సంఘమున్జూచిన, ‘‘సంస్కార’’మనవచ్చు సంబరాన.11

‘‘వషట్కారంబు’’ హైందవ ఋత్విక్కు , పల్కెడి సచ్ఛబ్ద వాచకంబు.12

అందము మగవాని కతివకు గల్గించి, కనువిందిడున‘దలంకార’’మగును.13

సంఘసేవకునిగా సామాన్యులకునుండ, ‘‘నుపకార’’మయ్యదే ఉత్తమంబు.14

ఆత్మావలోకనన్ ‘‘అపకార’’భావంబు, చేరనీకుండుటే శ్రీకరంబు.15

‘‘ఛీత్కార’’మనగను చేష్టలు చెడుగైన, భ్రష్టరూపంబగు ఫలితమగును.16 

‘‘ఫూత్కార’’మునుజెప్ప పొగరైన ఫణిరాజు, తనుజేర బెదిరించు తత్త్వమగును.17 

‘‘గుణకారము’’ గణిత కోణాన హెచ్చింపు, మార్గమై సంఘాన మాన్యమయ్యె.18

పేదల కష్టాలు పెదరాయుడెప్పుడు, కాంచకున్నను‘‘తృణీకార’’మగును.19

ఎండుమిర్చియు దప్ప నే దినుసులులేని, ఘనమైన పొడి‘‘గొడ్డుకార’’మగును.20

సంకష్టములబెట్ట సహియింపనోపని, కార్యముంగన ‘‘ప్రతీకార’’మగును.21

పెద్దలు చెప్పిన ప్రియమైన సూక్తులన్, కాదన బహు ‘‘తిరస్కార’’మగును.22

భవ్యమందిర శోభ దివ్యమై కాపాడ, ‘‘ప్రాకార’’మందురు ప్రాజ్ఞులిలను.23

కదనరంగములను కాలు శవములను, కనలేని స్థితియె‘‘వికార’’మగును.24

‘‘ప్రకారంబు’’నిన్ ఏవేళ పూజింతు, మన్న మనసు నిల్పు మనియె హరుడు.25

గజరాజు క్రోధాన కానలు కంపింప, ‘‘ఘీంకార’’ముంజేయు కేకపగిది.26

‘‘నుడికార’’మనగ మనోజ్ఞ విశాలమౌ, భావజాలంబది బయలుజేయు.27

‘‘అంధకారం’’బన నజ్ఞాన పూర్ణమౌ, మానవ మానస మందిరమ్ము.28

‘‘ధిక్కార’’మనజెల్లు ధీవర రాజాజ్ఞ, పాటిసేయనియట్టి మేటితనము.29

ఇంతుల మనములావంతైన , తెలియక కౌగిలించిన ‘‘బలాత్కార’’మగును.30

కొక్కురోకోయని కొమరుసామిరథంబు,కంఠంబు సాచి"క్రేంకార"మిచ్చు.31.

టంకారంబుసురుల ఠావులుదప్పింప"ధనుష్టంకార"ప్రధానమయ్యె.32

"వెటకారము"నుజెప్పవెంగలిజేసి జనంబులసరసతనవ్వులాట.33

"హుంకార"మనజెల్లు హుమ్మును బెదిరింపు పశువులు క్రూరులు పైకిరాగ.34

        ఎన్నికారాలు మదిలోన నెఱిగియున్న

        పండితుండు ‘‘చమత్కార’’ పద్యములనె(35)

        గోష్ఠిలోపల సరదాగ కోరుచుండు

        సహజ సద్గుణమయ్యది సరసులార!

        కనుడిదే "సూర్యశ్రీ"మనస్కార కవిత.(36)


కవితాచమత్కృతి ఉత్పలమాలిక


కారమదెక్కువైన మృదుగాత్రము సైతము పొక్కిపోయి- ఘీం

కారపు రావము ల్వెలసి కన్నుల వెంటను నీరుగారు- సం

స్కారయుతంపు సారతర గౌరవ సత్కవితాచమత్కృతుల్

వేరుగజెప్పనేల సుకవీ!రస నిర్భరమై మనోజ్ఞమౌ.

ఏరసమందు జెప్పినను నింపునుసొంపు ముదంబుగూర్చునా

తారలమధ్య వెల్గెడు సుధాకరు చల్లని వెన్నెలంబలెన్

ధీరుని మానసాంబుధిని తీరుగ దాగెడి మౌక్తికంబునాన్

మేరుసుపర్వతంబునకు మించిన సైనికు సాహసంబనన్

కీరము తెన్గు నేర్పబడి కేవలపద్యమె బాడు తీరుగన్

క్రూరపుసింగమున్ జెలిమి కోరల నెంచు శకుంతలాత్మజు

న్నారసి కణ్వుడే మిగుల హాసమునందెడి వైభవంబనన్

భారతభారతీ పరమపావన పాదరజంపు తాకిడిన్

మీరిన బుద్ధివైభవపు మేలగు సత్కవి కావ్యమోయనన్

క్షీరసముద్రముం గసిగ జిల్క ద్వితీయఫలంబు కైవడిన్

కోరిన కోర్కెలందుకొను గోపిక మానస హాసమోయనన్

సారథి శౌరిగాగ కడు శౌర్యము జూపు నరావతారునాన్

దారిని జూపుచున్ పరమధర్మము నాదను ధర్మజుంబలెన్

కీరితికాంత సత్కృపయె గేహమునిండిన గేస్తుమాదిరిన్

హారముమధ్యవెల్గు మణియట్టుల కాంతి విలాసరూపమై

నూరువిధంబులం దనరు నూత్న చమత్కృతి శాశ్వతంబునై.

16, ఏప్రిల్ 2025, బుధవారం

కాకరకాయ

 కం. కాకర కరకర నమలగ., భీకరమగు చేదుగొల్పి బీభత్సంబౌ
       సాకులు జెప్పక తినినను., శ్రీకరుడై తీపిరోగి శ్రేయంబందున్.
 కం. వ్యాకరణంబయి కాకర., ప్రాకటమగు బాధగొల్పు ప్రప్రథమందున్
       తేకువ నిత్యముదిన్నను., నాకరమౌ సౌఖ్యములకు నౌరాయనగా!
 కం.అల్లుడు సరిగా నుండిన., విల్లున సంధించు శరము వేగముబోలున్
      చిల్లలుగ ప్రాకి కాకర., కొల్లలుగా సంతునీను  కూరిమితోడన్.
 కం. పిల్లల నిత్తువు ప్రేమగ., చల్లగ యజమాని కోర్కె సఫలము గాగన్
      చెల్లును నీకే యియ్యది., పొల్లుగ నేనెప్డు బల్క భో!కాకరమా!
 కం. అల్లుని జూపకయుండిన., మెల్లగ నేదైన గోడ మీదుగ దాటన్
       ఉల్లము రంజిల జూతువు., తల్లీ!నీమది చురుకది దండము నీకున్.
 కం. కాకరయు పొట్లపాదును., నేకముగానొక్కచోట నిల్పిన చేటౌ
      కాకరకు కంపు పడదని., లోకులు వచియింత్రుగాదె! లోకమునందున్.

24, ఫిబ్రవరి 2025, సోమవారం

పాంప్లెట్.

                               ఆహ్వానము.

"సూర్యశ్రీరామం"గ్రంథావిష్కరణ సభ.

వేదిక : శ్రీలలితా పరమేశ్వరీ దేవస్ధానం, 1వ ఫ్లోర్. అష్టభుజాదేవి ఆలయం ఎదురు. 

          ఆనంద్ బాగ్. హైదరాబాద్.  

                  ది. 5.03.2025. బుధవారం. సాయంత్రం. గం. 4.లకు. 

ఆవిష్కర్త : 

మాన్యులు, ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం గారు

"అవధానసుధాకర, సభాసంచాలక సార్వభౌమ", దేవీభాగవతమునకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్య అకాడమీ "భాషాసమ్మాన్" పురస్కారగ్రహీతలు.

కృతికర్త :

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

విశ్రాంతాంధ్రోపాథ్యాయులు.

అధ్యక్షులు : 

శ్రీ చింతా రామకృష్ణారావు గారు

సుప్రసిద్ధ కవిపండితులు ,  అష్టావధాని , చిత్రకవితా విశారదులు. 

ముఖ్య అతిథులు :

శ్రీ సురభి శంకర శర్మగారు.

అష్టావధాని, అభినవ భర్తృహరి, తెలుగు విశ్వవిద్యాలయపురస్కార గ్రహీత.

శ్రీ జంధ్యాల వెంకటరామ శాస్త్రి గారు.

ఆర్షసాహితీ రత్న ,మధుర వ్యాఖ్యానభారతి , ఆధ్యాత్మిక సాహితీ సుధాకర.

సూచన . కార్యక్రమానంతరం భోజన సదుపాయం కలదు. 



4, ఫిబ్రవరి 2025, మంగళవారం

అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు.

 జాతీయస్థాయి ఉగాది పద్యాల కవితల పోటి.

జాతీయ తెలుగు పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న 

శ్రీవిశ్వావసు ఉగాదిపోటీలకు ఆహ్వానం. 

అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు. 

పంపవలసిన చివరి తేది. మార్చి 30.2025.  

వాట్సప్ నం.6362973252


మాతృభాషపట్ల మమకారభావన

న్దెలుగుపలుకుబడులు తేటపఱచి

అక్షరాక్షరంపుటర్థంబులెఱిగించ

మరచిపోయెనేటి మాతృమూర్తి. 1


తెలుగు బాస నేర్వ తెరువులుకఱవని

"ఇంగిలీసు"మీద నీప్సితంబు

పెంచుకొనిరి నేటి పెరజాతిప్రేమికుల్

అదియె శాపమయ్యె నాంధ్రులకును. 2


తల్లిదండ్రు లెపుడు హల్లొ!హాయని బల్క

వందనంబు లనరు వారిసంతు

ఆవు చేనుమేయ నాత్మజగట్టునా?

సాజమౌను నదియె సారమగును. 3


ప్రభుతకూడ కనగ ప్రథమకారణమయ్యె

తెలుగు భాషకంత విలువనిడదు

"దేశభాషలందు తెలుగు లెస్స"నియెను

"కృష్ణరాయ"విభుడు కేలుమోడ్చి. 4


మీడియాలు కొన్ని మిడిమిడి జ్ఞానులన్

తెలుగు మాటలాడ తీసికొనుచు

రూప మొక్కటె యపురూపమటంచును

భావముంచ తెలుగు భ్రష్టుపట్టె. 5


తెలుగు సంస్కృతాల తేజంబుగ్రహియించి

ఇతరదేశవాసులిచ్ఛనేర్వ

భరతమాతసంతు పనివడి కొందరు

మాతృమూర్తి నెపుడు "మమ్మీ"గ బిల్తురే. 6


తెలుగు సంస్కృతాల తిరమైన ప్రజ్ఞతో

కావ్యనాటకాలు కవులువ్రాయ

శ్రీ వధానులెల్ల చిత్రంపువాణులై

తెలుగు పలుకు చుండు వెలుగుచుండె. 7


ప్రక్కరాష్ట్ర ప్రజల పరికించి చూడుమా

ఆంధ్రరాష్ట్ర జీవి!అసలు నిజము

వారిమాతృభాష వారికే వరమంద్రు

తెల్విదెచ్చుకొనుచు తెలుగు పలుకు. 8.


ఈ పద్యములు కేవలము ఈ పోటీ కి నేను 

స్వయముగా వ్రాసినవేయని

హామీ యిచ్చుచున్నాను. 

నా చిరునామా: 

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

   "భాషా ప్రవీణ" ఎం.ఏ., తెలుగు.

మధుశ్రీ తిరుమల అపార్ట్ మెంట్. జి.ఎఫ్.4.

విమలాదేవి నగర్. మల్కాజిగిరి.

హైదరాబాదు. 50047.

ఫోన్: 9866675770.

1, జనవరి 2025, బుధవారం

 2025  ఆంగ్ల వత్సరానికి స్వాగతం.

    జరిగిందేదో జరిగిందని తలచి పాతజ్ఞాపకాలను తవ్వుకోను

    నేనాశా జీవిని .,మానసికంగా నిరంతరం శుభాన్నే కోరతాను

     ఎందుకంటే "ఎద్భావం తద్భవతి" అని , తథాస్తు దేవతలుంటారని 

     అన్నారు పెద్దలు. కనుక ఓ గతించన వత్సరమా! గతంగతః..

     నీకు వీడ్కోలు.

     ఓ నూతన వత్సరమా నీకు స్వాగతం!

         కాలాన్ని కలలపంటగా చేసి అందరికి కన్నులపంట చేయి

 కలాలను కదిపించి కవితలు కావ్యాలు వ్రాయించెయ్యి.

 సామాన్యుల జీవనయానం సంబరమంటేట్లు చేయి.

 రైతుల పంట పుష్కలంగా పండేటట్లుచేసి వారి కండ్లలో కాంతులు నింపు

 రాజకీయనాయకుల చదరంగపు కుయుక్తులకు చెక్ చెప్పు

 చిన్నారుల జీవితాలు కబంధ హస్తాలకు చిక్కనీయకు

 ప్రకృతిలో అశనిపాతాలు అతివర్షపాతాలు తగ్గించి

 కాస్తంత సుఖం కలిగించు.

 అందరికి అడిగినా అడగకపోయినా ఆరోగ్యమివ్వు. 

 భోగభాగ్యాలు వాటంతవే వస్తాయి. 

    ఈ షరతులకు ఒప్పంకుంటేనే గడపలో కాలుపెట్టు. అప్పుడే

      స్వాగతం పలుకుతాను. ....పొన్నెకంటి. 1.1.2025.

13, డిసెంబర్ 2024, శుక్రవారం

కృతజ్ఞతాంజలులు

 కృతజ్ఞతాంజలులు.

  "సూర్యశ్రీరామం" వచనరచనాలోచన నాకు గల్గించిన "శ్రీ సీతారాముల

పాదపద్మములకు మున్ముందు ప్రణామములర్పించుకొనుచున్నాను. 

నేను నా "సూర్యశ్రీరామం" రామాయణ వచన కావ్యమునకు మున్నుడి 

వ్రాయించుకొనుటకు స్వయముగా తమ దగ్గరకు వస్తానని చెప్పిన వేళ

శిష్యవాత్సల్యముతో "ఈ మండుటెండలలో రావలదని ,పుస్తకము పూర్తి

అయిన తరువాత రావచ్చున"ని చెప్పి నిరంతరం సాహితీసేవలో మునిగి

యుంటు నన్నాశీర్వదిస్తు, గ్రంథసమీక్షచేసి వాట్సాప్ ద్వారా పంపిన బహు

గ్రంథకర్త, బహు సన్మానములను కేంద్ర రాష్ట్రములనుండి పొందిన మాన్య

మా గురుదేవులు ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం మాష్టారు గారికి

అనేకానేక కృతజ్ఞతాభివందనములు. "నవరత్నమాలిక" పేరుతో నన్ను నా గ్రంథమును గూర్చి చక్కని చిక్కని శైలితో తొమ్మిది పద్యరత్నములను భ్రాతృ వాత్సల్యముతో వ్రాసియిచ్చిన నా ప్రియతమ సోదరులు చిత్రకవితాసమ్రాట్ శ్రీయుతులు చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదశతములు. "సూర్యా

రామం" పేరుతో నన్ను నా రామాయణమునభినందించుచు లోతైన భావాలతో

తమ యమూల్యాభిప్రాయమును వ్రాసియిచ్చిన నా సంస్కృత కళాశాల 

సహాధ్యాయి, మధురకవితా విశారదులు , నిరంతర పద్యరచనాసక్తులు 

డా. రామడుగు వేంకటేశ్వర శర్మగారికి ధన్యవాదశతములు. "సంకల్పసిద్ధుడు"

పేరుతో  నన్ను నా రామాయణము నభినందించుచు చక్కని పద్యములను 

వ్రాసియిచ్చిన నా సీనియర్ ఆంధ్రోపాధ్యాయుడు,విషయపరిశీలనలో రచనలో సహాయపడిన మిత్రుడు శ్రీ జొన్నలగడ్డ జయరామ శర్మగారికి ధన్యవాదాలు.

"మరోవాల్మీకం, సూర్యశ్రీరామం"పేరుతో తమ చక్కని చిక్కని సరససుకుమార

భావాలతో ఆంధ్రప్రభ సీనియర్ ఎడిటర్ గా అనుభవాలను రంగరించి విశ్లేషణను సుదీర్ఘంగా అందించిన మా గౌరవనీయ బావగారు"శ్రీవైయస్సారెస్"

గారికి నమోవాకములు. నా సంస్కృతకళాశాల సహాధ్యాయి , భువనవిజయ

సభలలో మంత్రితిమ్మరుగా ఖ్యాతినందిన నా సోదరుడు  నన్ను గురించి నా 

సూర్యశ్రీరామం గురించి విశ్లేషణాత్మక అభిప్రాయము నందించినందులకు 

మనసా ధన్యవాదాలు. చిరకాల సాహితీమిత్రులు ,అష్టావధాని, టి.వి. మాధ్యమంగా నిరంతరం సాహితీసేవ చేస్తూ నాకును అందు అవకాశం కల్పించిన నా సోదరుడు శ్రీ సురభి శంకరశర్మ గారు కోరగనే అభిప్రాయము

వ్రాసిపంపినందులకు ధన్యవాదాలు. 

     నా "సూర్యశ్రీరామం" ఆలోచనల నుండి అక్షరాచరణ రూపం వఱకు, గ్రంథ

రూపం వచ్చుటకు ముఖ్యకారకురాలు నా అర్ధాంగి "శ్రీమతి ఇందిర". నా పలుకులో పలుకై పదములో పదమై భావములో భావమై కథాంశమును టైపు చేయుటలో నిరంతర భాగస్వామి యై సంపూర్ణ గ్రంథనిర్మాణమునకు పూనుకొనినందులకు శుభాభినందనలు శుభాశీస్సులు.  అటులనే నా అల్లుడు

కుమార్తె, కొడుకు, కోడలు, మనుమరాండ్రు, మనుమడు సూర్యశ్రీరామం 

గ్రంథ రూపం ధరించుటకు ఎంతో ఉత్సాహ ప్రోత్సాహములనిచ్చుట ముదావహము. వారెల్లరకు నా శుభాశీస్సులు. 

 నా యీ గ్రంథమును అందముగా ఆకర్షణీయముగా ముద్రించిన చిరంజీవి

నరసింహ కు శుభాశీస్సులు. 


ప్రథమ ముద్రణము....క్రోధి. మార్గశీర్షము. (డిశంబరు 2024)

కాపీలు ..1000.

కాపీ రైట్స్....... చి.ల.సౌ. మాచిరాజు రాధిక. చి. పొన్నెకంటి అరుణ్ కిరణ్.

గ్రంథముల ప్రాప్తి స్ధానము.

ఫోన్. నం. 98666735. 9866675770.


విశ్వకళ్యాణ-"సూర్య-రామాయణ" జ్యోతి.


తే.గీ: శ్రీ"రమాపద్మ"ల హృదయసీమలో -న

        లంకరించు -"శ్రీ కళ్యాణ వేంకటేశ్వ

        రుండు"-దివ్య శేషాద్రి వాసుండు - శుభము

        లొసగి - "సూర్య సత్కవిచంద్రు" నోముగాక!...1

తే.గీ: రమ్యమౌ"తెలుగు కవితారామ"మైన

         భారత సనాతనార్ష సువర్ణ శిఖరి

         "గర్తపురి"ప్రాచ్యవిద్యార్థి ఘనయశుండు

         "సూర్యనారాయణార్యుడు""సుమధురకవి"...2

తే.గీ: "పొన్నెకంటి" వంశసుధాబ్ది - పూర్ణకీర్తి

         చంద్ర - "సూర్యనారాయణు" స్వర్ణ- రామ

         తారకాక్షర"దివ్యమంత్ర జపఫలము-

         భవ్య "సూర్య-రామాయణ" భక్తిసుకృతి....3

తే.గీ:  సద్గురు కరుణాపాత్రులు; సంస్కృతాంధ్ర

         పండితులు; ఆర్ద్రహృదయులు; భక్తిధనులు

        "రామకథ"ను - "శ్రీ సూర్యనారాయణ కవి"

        "తెలుగు వాల్మీకి"యై పల్కె, తీయగాను....4

తే.గీ: "ఒంటిమిట్ట" కళ్యాణమహోత్సవంపు

          మూర్తులైన - "సీతారామ" పూజ్యపాద

          పద్మ పీఠార్పితమగు - కావ్యమ్ము! భక్తి

          అక్షరసుమమ్ము! - "సూర్యరామాయణమ్ము"..5

తే.గీ:  భవ్యవేద పురాణ సద్భావఝరిగ

         సకలకవి, పండిత జనరంజకముగాను

         రమ్య "రామాయణ" సుకృతి - రచనచేయ

         ధరను- "సూర్యకవి" "కలమ్ము"- ధన్యమయ్యె..6

తే.గీ: జనని "గాయత్రి" మంత్రబీజాక్షరయుత 

         సప్తకాండ సమన్విత - స్వర్ణరమ్య

        "సూర్య - రామాయణజ్యోతి" సుకృతి - ప్రతి 

         గృహాన - "కళ్యాణ దీపమై" అలరుగాత!..7

తే.గీ: "కనకదుర్గమ్మ" "మల్లేశు కరుణసుధలు

          యాదగిరి "శ్రీనృసింహ" దృక్చందనాలు;

         "సీతరామచంద్రుల"-పెండ్లి సేసలెపుడు

          భువిని "సూర్యేందిర"ల - సదా బ్రోచుగాక!..8

  కం:  " సూర్య" సుహృదయ శ్రీకృత

         " సూర్య శ్రీరామ" రమ్య సుకృతి సుధలిలన్-

          ఆర్యజన కల్పలతలై 

         " సూర్య"ప్రభలలరుదాక - శుభములొసగెడిన్.9


           1-01-2025.               శుభంభూయాత్!

            హైదరాబాద్.           మీ ఆత్మీయ "కళ్యాణశ్రీ"

                                     జంధ్యాల వేంకటరామశాస్త్రి.

                              "ఆర్ష సాహితీ రత్న".9640321630.   



బోసుదంపతులకు ఆశీస్సులు. 6.05.2026.

 జీ.బోసు గారి 49వ వత్సర వివాహ మహోత్సవము.           శీర్షిక.. మూడుముళ్ళు. సీ. జీవితమంతయున్ కష్టసుఖాలలో        ముంచితేల్చుచునుండు మూడుముళ్ళు  ...