28, జనవరి 2017, శనివారం

తెలిసి తెలియక...

 తెలిసి తెలియక చేసే పనుల వలన కొన్ని అనర్ధాలు , కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.పాతది పోతే కాని కొత్తది రాదు. నా టాబ్ లో ఉన్న తెలుగు సాఫ్ట్ వేర్ ఎలాగో పోయింది. అందు వలన వెంటనే క్రొత్త సాఫ్ట్ వేర్ నేర్చుకోవాలి అనే పట్టుదలతో ఇలా వ్రాస్తున్నాను.

18, జనవరి 2017, బుధవారం

గంగా సంగమ క్షేత్రం.

              గంగా సంగమ క్షేత్రం.(పాట)
  గంగా సంగమ క్షేత్రం, అది సందర్శనకు పాత్రం.
  1.మకరరాశిలో రవియే చేరగ, మాన్యోదధియే వెనుకకు బాఱును
     పర్వదినంగా ఖ్యాతినందుచు, పారును గంగా ప్రవాహమచట
                                                           గంగా సంగమ క్షేత్రం!!
  2.కపిలమునీంద్రుని కఠోరశాపం, సగరపుత్రుల సమయజేయగ
     అలలతాకిడి మెలమెల్లంగ, అదుపుననుంచి యటుచేరంగ
                                                           గంగా...
  3.భగీరథుండల భక్తిని వీడక, భర్గుని ధ్యానము సేయంగ
      నాకము వీడి జూటముజేరి, నవ్వుల నురుగులు పారంగ
                                                             గంగా...
  4.అరువదివేల భస్మరాసులకు, నానందంగా నమరత్వంబును
     చేర్చికూర్చినది చిర్నగవులతో, చిన్మయరూపిణి శివగంగా
                                                             గంగా....

  5.సంద్రముజేరిన గంగా, మంద్రస్వరాలు వినిపింపంగా
     ఆనందంబును నారోగ్యంబును, సకలసుఖంబులు కలిగింపంగా
                                                               గంగా....

   6.నాగలోకమున నాట్యంజేయుచు, నవజీవనియై తిరుగంగ
     నాగలోకమే నాకలోకమై, పరవశించి తా వెలుగంగ
                                                             గంగా.....
   7.నాకమునుండి నాగము వఱకు, పాపసంచయం తొలగిస్తు
     పుణ్యరాసులను పంచుతు తాను, పవిత్ర నదిగా పరిఢవిల్లెను
                                                              గంగా......
   8.భంగములెన్నో చూచినగాని, భవుని కరుణచే భద్రంగా
      ఈ క్షేత్రంలో సంద్రంజేరెను, సమ్మోదంగా సలలిత గంగా
                                                                గంగా....
  9.ఇంద్రియజయమును పొందినవారు,సామాన్యులు మరి శిష్ఠజనంబులు
    ఇష్టముతోడ పరిపరి మునుగును, ఈశునిప్రేయసిగంగామాయీ
                                                                 గంగా....
 10.కోటిజన్మల కల్మష హరణం, కోరగ గంగా శరణం
       క్రుంకిన జీవన్ముక్తి, కలుగును భక్త్యనురక్తి.
          !!గంగా సంగమ క్షేత్రం, అది సద్గుణపాళికి
          సాథుసంతతికి సంబరమిచ్చెడు క్షేత్రం.!!

   

2, డిసెంబర్ 2016, శుక్రవారం

సాహితీ స్రష్ట "సుచంద్ర"

సాహిత్యం అంటేనే హిత సహితం అని అర్థం. హితం ఎవరికి అని ప్రశ్న వేస్తే ..సర్వ జనాళికని చెప్పాలి. సాహిత్య ఆలోచనా లోచనం కలవారు ఒక్కొకరు ఒక్కొక రచనా పద్ధతిని అనుసరిస్తారు. ఛందోబద్ధ పద్య నిర్మాణం, స్వచ్ఛ, స్వేచ్ఛ ,  విశాల భావ వ్యక్తీకరణకనుకూలంగా ఉండే లలిత లలిత భావ నిర్భర పద జాలంతో మనోహర భావనా సాహితీ సామ్రాజ్యము నేర్పరచుకొని తద్ద్వారా రసిక జనులనాకర్షిస్తు, కవిలోక తల్లజునిగా పేరుగాంచుట ఒక వరం. అట్టి భగవద్దత్త వర ప్రసాది కీ.శే.(నమ్మ శక్యం కావటం లేదు.) "సుచంద్ర". సుసర్ల చంద్రశేఖర శాస్త్రి.(వచనమైతే భావ ప్రకటనకు ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుంది అని వారు భావించేవారు.)వీరు ఖమ్మం జిల్లా కవులు, మొదలగు గ్రంథాలు, శతాధిక కవితలు, మనోహర వ్యాస విన్యాసాలు ప్రచురించిన కవిచంద్ర "సుచంద్ర".కవితామృతం, సేవించటం, సేవింపజేయటం అలవాటైతే చెప్పేదేముంది? ఆలోకమే వేరు. వేరొకరు తట్టి లేపాల్సిందే.అక్షరం ఉన్నంత కాలం అక్షరాలలో దాగి ఆయన ఉంటారు. కవికి, కవితకి మరణం లేదు.

           ఈయనకున్న లక్షణం తాను భావనా ప్రపంచంలో తేలటమే కాక కవితను, కవులను ప్రోత్సహించి, తనకు కావలసిన విషయాన్ని రాబట్టుకోవడంలో దిట్ట.

          నేను ధూళిపూడి లో పనిచేస్తున్న రోజులలో రక్తసంబంధీకమైన కుటుంబంగా మారింది "సుసర్ణ" వారి కుటుంబం. వారికి గ్రామదేవత తాళ్లమ్మ ఆరాధ్య దేవత, పర దేవత. నేను పాఠశాలలో కొలువు నుండి విరమించబోయే ముందే ఒక నిర్ణయం తీసికొన్నాను. అదే "ధూళిపూడి పూర్వా పర్వాలు.

              నన్ను "సుసర్ల" సోదరులందరు ఆప్యాయతానురాగాలతో, సొంత బావగారి వలెనే ఆదరించి గౌరవిస్తారు, వయోభేదం లేకుండా. ఒక రోజు "సుచంద్ర" గారి నుండి ఒక కోరిక. "బావగారు! నాకు మన గ్రామదేవత తాళ్లమ్మ ను స్తుతిస్తు శతకం కావాలి"అని. దానిని సుగ్రీవాజ్ఞగా భావించి 25 రోజులలో 108 పద్యాలు వ్రాసి చూపించాను. బావగారి కళ్లలో నేను ఆనాడు చూచిన ఆనందానికి అవధులు లేవు. "శహభాష్ బావగారు"అన్న పదం దశ దిశల ప్రతిధ్వనించింది. ఆనాటి నుండి కలిసినప్పుడెల్ల "బావగారు! ఏమైనా వ్రాస్తున్నారా? అనేదే ప్రథమ ప్రశ్న అయింది. ఆ ప్రోత్సాహం నాకొక మహత్తర శక్తిని, భావనా పటిమను ఇచ్చేది. ఏది యేమైనా బావగారు అని అనగనే .....తరువాత పదమైన ఏమైనా వ్రాస్తున్నారా? అని ఆయన అనక పోయినా నాకలా వినిపించేది. దాని ఫలితమే  "వాల్మీకి రామాయణము"నకు నా(తెలుగు సేత అయిన) "సూర్య శ్రీరామ"మేమో!!!

   2016 జూన్ లో జరిగిన ధూళిపూడి శతవసంత శోభలో పాల్గొని పూర్వ విద్యార్థిగా, అపూర్వ భావనిర్భర కవిగా ,విజృంభించారు, ఆరోగ్యం సహకరించకపోయినా.

       ఈ సాహితీ సింధువును  ఇంకా యెంతో తరచ వచ్చు. కాని ఒకే సారి నా వలన కావటం లేదు.
        అశ్రుతర్పణాలతో....అంజలులు సమర్పిస్తు......

3, నవంబర్ 2016, గురువారం

తెలిస్తే ఆవగింజ , తెలియకపోతే పెద్ద గుమ్మడి.

            తెలిస్తే ఆవగింజ , తెలియకపోతే పెద్ద గుమ్మడి.  

  మానవుని మేథస్సునకు ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి. ఏపని అయినా మనకు మనముగా స్వయముగా చేసుకుంటేనే ఆనందం. ఉదాహరణకు భోజనం ...మనం భోజనం చేస్తేనే రుచి తెలుస్తుంది, కడుపు నిండుతుంది. ఎవరో చేస్తే మన కడుపు నిండదు కదా! ఒకరు ఇంతకుముందు చేసినవే మనం చేస్తున్నాము. ఏదిఅయినా అనుభవైక వేద్యం కావాలి. ఆనాడే మనకు మహదానందం.
       సుఖం మనం సృష్టించుకొంటేనే వస్తుంది. సింహం అంతటిది కూడ వేటాడక పోతే నోట్లోకి ఆహారం రాదు.
      ఈనాడు మనకు తరచూ ప్రయాణాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది చేయటానికి రకరకాలైన మార్గాలున్నాయి. 1.సొంతకారు.2. ఆటోలు.3. స్కూటీలు, హీరోహోండా వగైరాలు. కాని ఈనాడు పోటీ ప్రపంచంలోకి ఓలా, ఊబర్, లాంటి అద్దె కార్లు ఎన్నో అవతరించాయి. అవి మనం బుక్ చేసుకొంటే (ఆన్ లైన్ లో) చాల తక్కువ ఖర్చులో , ఏ.సీలో కూర్చుని హాయిగా గమ్యాన్ని చేరుకో వచ్చును. (మనం సొంత బండి మీద వెళ్లేదానికన్నా క్షేమంగా, సౌఖ్యవంతముగా ఉంటుంది.) ఈపని చేయటానికి ఎంతో పరిజ్ఞానం అక్కరలేదు. కావాల్సిన సామాను. 1.ఒక టచ్ ఫోన్, ఇంటర్నెట్ ఉన్నది.2. కొంచెం ఆంగ్ల పరిజ్ఞానం .(షుమారు 7వ తరగతి వరకు),3.కొంచెం చూపు 4.కొంచెం ముందు చూపు.5.వినకిడి శక్తి.6. క్రొత్త విషయాలు తెలిసికోవాలనే ఆసక్తి.(ఇది చాలా చాలా ముఖ్యం). కాని దురదృష్టమేమిటంటే ఇది చేయగలిగిన శక్తి కలవారు కూడ ,నిర్లిప్తతతో ముందుకు రావటం లేదు. ఆటోల సంగతి అతి దారుణం.....మీటర్ వెయ్యడు. వేసిన మీటర్ రేస్ గుర్రం స్పీడులో పోయేటట్లు చేస్తాడు. విసుక్కుంటాడు. మనం ఏదైనా మరచిపోతే ఇంతే సంగతులు. (ఆటోవాలాలు అందరు అలాంటివారు కాదు. వారిలోను కొందరు నిజాయతీపరులు ఇప్పటికి ఉన్నారు.)ఊబర్ లో ప్రయాణించేటప్పుడు మనం ఎటు వెళుతున్నామో మ్యాప్ చూపుతుంది.
      నా అనుభవం పంచుకొంటాను.
       మా ఇంటినుండి సిటిలో ఎక్కడి వెళ్లాలన్నా చక్కగా ఊబర్ లో బుక్ చేసుకొంటాము. ప్రయాణం కొంచెం ఆలస్యమైనా పరవాలేదనుకొంటే షేర్ బుకింగ్, లేకుంటే మామూలు బుకింగ్. నేనీరోజు స్వయంగా మౌలాలి, (పెన్షన్ ఆఫీసుకి ,లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు)వెళ్లి వచ్చాను. నాకు పోను రాను 160 రూ. అయినవి. అదే ఆటో అయితే 150+150=300.అవుతవి. న్యూ నాగోల్ నుండి మౌలాలి రైల్వే క్వార్టర్స్ వరకు.
 
      కనుక అందరు తప్పక చైతన్యవంతులు కావాలి. ఏదైన తెలియక ముందు గుమ్మడికాయ, తెలిసిన తరువాత ఆవగింజే......డబ్బు తక్కువ సుఖమెక్కువ.
         దీనిని వేరెవరైనా కూడ బుక్ చేసిపెట్టవచ్చు.    చేయూతనివ్వండి..

           క్రొత్తవిషయాలు నేర్చుకోవటం తప్పుగాదు. అపకారం కలిగించేవి, మన సంస్క్రతీ సంప్రదాయాలకు గొడ్డలిపెట్టుగా ఉండేవి నేర్చుకోవడం, ఆచరించడం తప్పు. జై భారత్!!!!!  

24, అక్టోబర్ 2016, సోమవారం

ఆడబోయిన తీర్థము

                  కోదండ రాముని దర్శనం.ది.22.10.2016.

   ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్లు,కోరకనే దేవుడు వరమిచ్చినట్లు.....

  "కంటి మొంటిిమిట్ట కనులార యీనాడు
   రాముకరుణ ఝటితి మేము పొంది
   పొత్తమదియ నేడు పూర్ణత్వమొందకే
   రాముపాదమంటె రమ్యముగను.

   రామనామమనగ రసరమ్య భావంబు
   భద్రమిడును నదియె భావియందు
   జిహ్వత్రుప్పుడుల్ల శ్రీరాము చరితము
   చెప్పి పాడుచుండ సేమమగును.

 ఒంటి మిట్ట యందు నొనరంగ కరుణతో
భక్త జనులగావ ప్రభవమంది
దరినిజేరువారు ధన్యత్వమందగ
రక్షసేయువాడె రామ ప్రభువు.


    పలికించరామచంద్రుడె
    పలికితి నేనార్య చిలుక పలుకులవోలెన్
    వెలలేనిసిరుల నిచ్చును
    కలలోననుమరువకండి కల్యాణవిభున్.


 
ఈ రోజెంతో సుదినము. కడప జిల్లాలోని ఒంటిమిట్ట "కోదండరాముని" దర్శన మహాభాగ్యం లభించినది. నేను శ్రీకారంచుట్టిన "సూర్యశ్రీరామం" ( వాల్మీకి రామాయణమునకు స్వేచ్ఛ ఆంధ్రానువాదమును ఉత్తర రామాయణము 3౦ సర్గలు)శ్రీరామ పాదపద్మములచెంత నుంచి , శ్రీవారి ఆశీస్సులు పొంది, అచటి మహోన్నత సాహితీవేత్త,పండిత వర్యులైన శ్రీమాన్ వీణ రాఘవాచార్యుల వారి పరిచయము,ప్రసంగము, ఆశీస్సులతో పులకితమగుట. వారు ఇచట "వాల్మీకి రామాయణమును తెనిగించిన వాసుదాసు గారు, పోతన గార్ల ప్రస్తావన తీసికొని వచ్చి మీరును అటువంటి మహోన్నత కార్యము చేయుచున్నారు కావున ధన్యులని మనసార దీవించుట, త్వరలోనే మిగిలిన భాగమును పూర్తిజేసి స్వామి వారికి సమర్పించి ఇచట నొక సభ ఏర్పాటు నకు ప్రోత్సహించుట నాకు వరము. వారు కొంత తడవు మనకట్టుబాట్లు, మంచి అలవాట్లను గూర్చి ప్రసంగించిరి. వారి ప్రసంగమును, సుమధుర మనోహర సంఘటనను వీడియో రూపముగా భద్రపరచుట జరిగినది.
        ఈ ప్రయత్నములో నా సహాథ్యాయి, "రామాయణ కథా సారము" పరిశోథక గ్రంథకర్త అయిన శ్రీయుతులు తూములూరు దక్షిణామూర్తి గారు నాకు వాల్మీకి రామాయణ మూల గ్రంథముల నిచ్చి వ్రాయ బ్రోత్సహించుట మరువలేను. నా  సహధర్మచారిణి ఇందిరాదేవి వ్రాతప్రతిని కంప్యూటర్ అను యంత్రములో అక్షర బద్ధము చేయుటలోను, నా సహాథ్యాపకుడు జొన్నలగడ్డ జయరామ శర్మ ,విషయమును నిర్దుష్టము చేయుటలోను నిరంతరము శ్రమించున్నారని వారికి తెలుపగా వారమితానందము పొందిరి.
          "ఆడబోయిన తీర్థమెదురొచ్చినట్లు, కోరకనే దేవుడు వర మొసగినట్లు,తెలవారు జాము కల నిజమైనట్లు, 21వ తేదీన నా సోదరీమణి, చరవాణిలో "రేపు ఒంటిమిట్టకు వెళదాము అన్నయ్యా"
అని పిలవటం నిజంగా అమితానందాన్ని కలిగించింది. మధుర మనోహర అనూహ్య సంఘటన."
       ఈ తీర్థయాత్రలోనే పురాతన దేవాలయాలను కొన్నిటిని దర్శించాము. 21న ఒంటిమిట్ట కోదండ రామస్వామి,నందలూరు సౌమ్యనాథుడు,తాళ్లపాక అన్నమయ్య, అత్తిరాల పరశురామాలయము, దేవుని కడప, దర్గా చూచాము.22న పెన్నా నదీ తటమున ఉన్న, రెండవ కాశీగా ప్రసిద్ధి నందిన పుష్పగిరి నిలయుడైన లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి, సంతాన మల్లికార్జున స్వామిని,పోతులూరి వీరబ్రహ్ర్మేంద్ర స్వామి, మహానందీశుని ఆలయాలు దర్శించుట జరిగినది.
      త్వరలో ఒక్కొక్క క్షేత్ర ప్రాశస్త్యము, చూచిన నా అనుభూతి వ్రాస్తాను.

20, అక్టోబర్ 2016, గురువారం

ఎంత దయో దాసుల పై 21.10.2016

మనము జీవితములో అనుకున్నవి , అనుకోనివి , జరుగుతూ ఉంటాయి, ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు జరిగేవరకు తెలియదు. సూర్య శ్రీరామాయణం పూర్తి అయినతరువాత ఒంటి మిట్ట వెళ్లి స్వామి దర్శనం చేసికొని వ్రాసిన సూర్య శ్రీరామాయణం రాముని పాదాల చెంత ఉంచి తీసికొని వద్దామని అనుకొన్నాను . కాని  నా మీద దయతో ముందే అనుగ్రహించి రప్పించుకొంటున్నాడు స్వామి ఒంటి మిట్టకి. రామా నీకెంత దయో దాసులపై .... 
   ఈరోజు రాత్రికి బయలుదేరి 22.10.2016 న ఉదయం  స్వామిని దర్శించుకొని అచటి అర్చకాచార్యుల సలహాతో నేను 2014 న ప్రారంభించిన సూర్యశ్రీరామం వ్రాత ప్రతి వారికి చూపి దానిని స్వామి పాదాలచెంత కొంత తడవుంచి అచట ఈ సంఘటన వీడియో తీయించుకొని రావాలని సంకల్పం.
      ఒంటిమిట్ట కోదండరాముడు " ఏరా నాయనా! నా కథ తెలుగులో వ్రాస్తున్నావటగా , ఏదీ ఎలా ఉందో నేనే స్వయంగా చూస్తానిలా రారా! , పూర్తి అయిన తరువాత అప్పుడు మరల చూస్తాలే, నీ పాండిత్యమేపాటిదో చూడాలని, నిన్ను ఆశీర్వదించాలని కుతూహలంగా ఉండి ముందు రమ్మన్నానంతే, భయపడకు! " అని పిలిచినట్లున్నది.

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...