22, అక్టోబర్ 2021, శుక్రవారం

శ్రీయశస్వినీ

 శీర్షిక... శ్రీయశస్వినీ..పద్య దశకము.

మాతవు జీవకోటికిల మాతవు నీవు సురాసురాళికి 

న్మాతవు సార వాజ్ఞ్మయ సమాశ్రిత వేదవిశాల రాశికిన్

మాతవు సర్వలోకమహిమాన్విత శక్తుల మూలశక్తికిన్

మాత!దయాంబురాశి!కనుమా మము ప్రేమను శ్రీయశస్వినీ!-1

మానవ జన్మమందు పరమార్ధమెఱుంగుచు ముక్తిమార్గముం

గానగ దైవతత్త్వపు వికాసము శోధనజేయగా సదా

మానితవైఖరిన్ గరిమ మౌనవిచార విభూతులెన్నియో

దానముజేసినావు వరదాయిని! శాంభవి! శ్రీయశస్వినీ!-2

కనులకు కానరానివగు  కర్మల డుల్చి త్వదీయ నామముల్

మననము సేయగల్గు పరమాద్భుత నిశ్చలభక్తితత్త్వముల్

వినయ గుణంబులాదిగను వేగిరమిమ్ము దయాంతరంగవై

యనయము సంస్తుతింతునిను నాశ్రితవత్సల శ్రీయశస్వినీ!-3

వీచెడు వాయువీవె ధర వెల్గులనీనెడు కాంతివీవెగా

కాచుచు భారమెంచకను కాయము నిల్పెడు పృధ్వినీవెగా

భూచర ఖేచరాదులకు పూర్ణజలంబిడు వృత్రమీవెగా

గోచరమౌ ప్రభావయుతగోళము నీవట శ్రీయశస్వినీ!-4

వేలకొలందిదేవతలు విస్తృతభక్తి నిరంతరాయమున్

మూలవిరాట్టువంచు కడు మోదముతోడుత సంస్తుతింపగా

హేలగవారిగాచితివి శ్రీకర దివ్య విభావ మూర్తివై

జాలిదలంచి సన్మతిని సద్గతినీయవె శ్రీయశస్వినీ!-5

దనుజులు గూడతప్పరసి తావక పాదయుగంబునంటగా

వినయ సమార్చితంబయిన విజ్ఞతకెంతయు సంతసించుచున్

ఘనమగు సద్దయామయిగ కాచితివమ్మరొ మాతృప్రేమతో

ననయము రక్షసేయగదె యాత్మవినోదిని!శ్రీయశస్వినీ!-6

నిన్ను గనంగ గోరినను నేర్పగు మార్గము భక్తితత్త్వమే

చెన్నగు సేవలం జరిపి చిన్మయరూపు హృదంతరాళమున్

మన్ననగల్గురీతిగను మౌన విలాసపు రాగవర్తన

న్నన్నులమిన్నరో!కలుషహారిణి!శారద!శ్రీయశస్వినీ!-7

తీయని పల్కుబల్కగను తేనియలూరెడు పాటబాడగా

మాయను మీరియోచనలు మంగళమౌనటు లూహసేయగా

కాయము సార్ధకంబుగ సుకార్యము లెన్నియొ నిర్వహింపగా

మాయమ శారదాంబ! కనుమా శరణంటిని శ్రీయశస్వినీ!-8

నాదు మనంబు పీఠముగ నైష్ఠిక తత్త్వవిచారభావనే

నీదగు మంగళాకృతిగ నిల్పుచు నిర్మలభావసూనముల్

పాదయుగంపుబూజకయి భక్తిని నుంతు వినమ్రబుద్ధితో

వేదవినోదినీ!నిగమవేదిని! భారతి!శ్రీయశస్వినీ!-9

పంకములోనజిక్కి భవబంధములంబడి మోరకుండనై

సంకటముల్ దగుల్కొన నశక్తుడ నౌచును నిన్నువేడితిన్

శాంకరి!కావుమా సతము సత్కృపజూపి దయాంబురాశివై

కింకర భావమున్వదల గీష్పతిభామిని! శ్రీయశస్వినీ!-10


14, అక్టోబర్ 2021, గురువారం

మంగళహారతులు..

                1. మంగళ గౌరికి మంగళ హారతి. 

మంగళమనరే మాధవుసోదరి, మాయాభేదిని మంత్రనిధే

నీ పాదాంజలి నిష్ఠను సలుప, సర్వపాపములు సమసిపోవును..మంగళ..

భవ్య నామము భక్తిని దలచ, భవబంధములే సమసిపోవును

సతతము కరుణతో సాకుము తల్లీ!, సాగిలి మ్రొక్కెద సారసాక్షిరో! ..మంగళ..

భవుని దేహమున సగమై నిలచి భవ్య తేజమై వెలిగెడు తల్లీ

మూడు జగముల మోదము నింపగ. కన్న తల్లిగా కాచెడు గౌరీ!..మంగళమనరే.

మంగళగౌరిగ మహిళలందరు మనసున నిలిపే మాన్యరూపిణీ

మాంగల్యంబుల రక్ష సేయుమ! మాతృప్రేమను మాపై జూపుమ!..మంగళ మనరే.

                      2. శ్రీమహాలక్ష్మి కి మంగళహారతి.

మంగళం జయమంగళం,  శ్రీమహాలక్ష్మి కి శుభ మంగళం

చంద్రసోదరి శౌరి రాణీ, కమలవాసిని కమలనేత్రా!

క్షీరసాగర కన్యకా, మమ క్షేమ  దాయక భావుకా...మంగళం.

దీనజన పరిపోషకా, దేవతాఖిల సంసేవితా...

పేదసాదల పెన్నిధీ, ఘనప్రేమ భాసురధీనిధీ..మంగళం.

భక్తగణ చింతామణీ, భవము డుల్చెడు భానిధీ.

శివము సుఖముల  ప్రేమ తత్త్వపు  సకలభాగ్యద శ్రీనిధీ...మంగళం. 

సారసాక్షులు సభక్తికముగ  శ్రావణమాసపు శుక్రవారమున 

నిను సేవింపగ సర్వసంపదలు నిరతము గల్గును...మంగళం..

  3. గణపతి కి మంగళహారతి.  

   
   అంబాసుతునకు లంబోదరునకు మంగళమనరే మానినులారా!


   ఆదిపూజ్యుడై యఖిలజగముల హర్షమునింపే యమలమూర్తికి
   విశ్వమునందలి విఘ్నములన్నీ వేడిన డుల్చే విఘ్నరాజుకి. "అంబా"


   తల్లిపార్వతి ముఖపద్మంబును వికసనజేసే విష్ణునేత్రునకు
   నెమలివాహనుని నేర్పున గెల్వబుద్ధిబలమునుజూపినవానికి."అంబా"


   గరిక పూజకె ఘనమనితలచి వరములనిచ్చే వక్రతుండునకు
   కుడుములుండ్రాళ్ళు కోరిభుజించి ముదమునుజెందే మోదక ప్రియునకు.

   అంబాసుతునకు...

     

9, జనవరి 2021, శనివారం

విశ్వంజీ పద్యం.

  విశ్వగురుపీఠాధిపతి భగవాన్శ్రీ శ్రీశ్రీవిశ్వయోగి విశ్వంజీ మహరాజ్ పద్యాలతోరణం సామాజిక శతకపద్యహేల   కు..చక్కని..ప్రేరణాత్మక సందేశం ఆశీస్సులనందించారు. ఇది.ప్రతి ఒక్కరికి ప్రేరణ.

   సీ: పద్యాలతోరణ పండిత కవులెల్ల

              విశ్వంజిదీవనన్ వెల్గుగాత!

        సాంఘిక పరమైన సంస్కృతి రక్షింప

        శతక సాహిత్యాల సౌరువెలయు

         విశ్వభా‌రతియొక  విజ్ఞానసారమై 

         అణువణువు మహిని హర్షమొదవు

         యోగిపుంగవుల మహోదాత్త కామమనన్

          కవులహృత్కమలాలు క్రాలుగాత!

    తే.గీ.సార రసయుత సద్గ్రంధ సరళిబెరిగి

             దుష్టభావాల మూలాల తొలచివైచి

             తుష్టి యొనరించి పద్యాల తోరణాన

             వెల్లివిరియును శుభముల జల్లుకురిసి.

           

21, నవంబర్ 2020, శనివారం

ఆడువారి మాటలు

ఆ. వె.  ఆడు వారి మాట కర్ధాలె వేరుగా

           విసుగు నసుగులోనె ప్రేమయుండు

           ప్రేమపంటపండ విసురులు తప్పవు

           తెలిసి మసలుకొనగ తీయనగును.

15, నవంబర్ 2020, ఆదివారం

కాలేజి పద్యం.

 చం .కొలచెల వారు దీవనల కూర్మిని బంచ, గురూత్తముల్ సదా
         సలలిత పాండితీవిభవ సారము నింపగ,నస్మదాదులే
         యలుపది లేకద్రావి దగ మేదిని పంచుచు పేరునిల్పుటన్
         తలపుల వారి నెల్లరను దైవసమానుల గొల్వరండహో! 

12, నవంబర్ 2020, గురువారం

కరోనా కాషన్స్.

                  కరోన కాషన్స్...మీ పొన్నెకంటి.

     ఆ.వె: బయటికేగునపుడు భద్రతకొరకునై

             "మాస్కు" మరువవలదు మాన్యతముడ!

             "శానిటైజు" నీకు సహజ కవచమౌను

             తెలిసి మెలగుమోయి తెలివితోడ!...1

     ఆ.వె:  తులసి టీలు నీకు తుమ్ములు రానీవు

              అల్లముగల నిమ్మ హాయిగూర్చు

              ఉదయమందు ద్రావ నుత్తేజముంగూర్చు

             తెలిసి మెలగుమోయి తెలివితోడ!...2

    ఆ.వె:  చల్లనైన వాని సరియని తినవద్దు

              వేడి వంటకాలె వాడుమోయి

              శీతలాన క్రిములు చెలరేగి పెరుగును

              తెలిసి మెలగుమోయి తెలివితోడ!...3

   ఆ.వె:  బంధుజనము జూడ పర్మిషనడుగుము

             ఓకె యన్న పిదప దూకుమచట

             ప్రేమకన్నముందు ప్రిన్సిపల్ ముఖ్యంబు.

             తెలిసి మెలగుమోయి తెలివితోడ...4

    ఆ.వె: బయటి నుండి వచ్చి పరవలేదనుచును

            అన్ని తాక వలదు హాని కలుగు

            సబ్బు నీట కడుగు చక్కగ చేతులు

            తెలిసి మెలగుమోయి తెలివితోడ!...5

  ఆ.వె:  మాస్కుతాకవలదు మధ్యను ప్రక్కలన్

            దానినిండ క్రిములు దాగియుండు

            చెవుల త్రాడు పట్టి చిన్నగ తీయుమ

            తెలిసి మెలగుమోయి తెలివితోడ! ...6

  ఆ.వె:  చెక్క యాలకులును చిరువుల్లి పాయలు

            పసుపు అల్లమెపుడు వాడుమోయి

            వంటయిల్లె మనకు వైద్యశాలౌనురా

            తెలిసి మెలగుమోయి తెలివితోడ!...7

  ఆ.వె:  ఈ కరోన మనల నేమిచేయదనకు

            శబ్దమేమిలేక ఛాతిజేరి

            శ్వాసకోశ శక్తి సరగున జెరచును

             తెలిసి మెలగుమోయి తెలివితోడ!...8

   ఆ.వె:  రోజు రోజు నీవు రుగ్మతనెదిరింప

             ఆత్మశక్తి పెంచుటవసరంబు

             నిత్యకృత్యమనగ నేర్పుగ బెంచుట

             తెలిసి మెలగుమోయి తెలివితోడ!...9

   ఆ.వె:  అన్ని రుగ్మతలకు  నాత్మవిశ్వాసంబె

             ముఖ్యమైన మందు మోదమంద

             దైవభక్తితోడ తావచ్చి చేరును

             తెలిసి మెలగుమోయి తెలివితోడ!...10.

                           అభయహస్త పద్యం.

             కోవిడు టీకా క్షేమం

             బేవిధ మైనట్టి బాధ వేధింపదుగా

             చేవను బెంచును తనువును

             తావక భయమెల్ల వీడు,  తరుణీమణిరో!

                     రోగముతో జచ్చె పో కరోనా తుదకున్ 

    

             మూగుట లేదిట జనములు

             బాగుగ ధరియించుచుండ్రి బహువిధ చిక్కాల్

             ఏగతియని మానసికపు

             రోగముతో జచ్చె పో కరోనా తుదకున్.

                             ప్రక్కనే ఉన్న క్రూరమృగం...కరోనా.

         సీ: కంటికి కనబడ దింటికిచేరువౌ

                    కారోన దెయ్యంబు కరుణమాని

              బంధువులందఱి బహుదూరమంచును

                      దానితప్పుకొనగ దయనుమాలి

              తనకౌగిలందున  దాచగా యత్నించు

                           కపట పేమనుజూపి కన్నుగీటి

              దాని వగలగని దరిజేర మోక్షంబె

                       తెలివితోడ బ్రతుకు తెలుగువాడ!

              ఒకసారి వచ్చినన్ ఇకరాదు నాకంచు

                           బరవాస వద్దురా భద్రముండు

       తే.గీ: నేటి దుస్థితి జూడంగ నీచమాయె

               మాస్కు పెట్టిన నెగతాళి మాటలాయె

               అట్టి శుంఠలమాటల మట్టుబెట్టి

              జ్ఞానవంతుల మాదిరి చనుడు జనులు!

                          మీపొన్నెకంటి. 9.4.21.



20, అక్టోబర్ 2020, మంగళవారం

నవరాత్రులలో... గాయత్రీ దేవి.

                      1.  గాయత్రీ దేవిగా ఈనాడు దుర్గాదేవి.. స్తుతి.

        శా:  కారుణ్యామృత చింతనావృత విధిన్ గాయత్రి చిద్రూపివై

             సారాసారవిచార మంత్ర నిధివై సౌందర్యవారాశివై

             ఘోరాజ్ఞానపుటంధకార జగతిన్ కూర్మిన్విదారించుచున్

             శ్రీరంజిల్లెడు వెల్గులిమ్ము సతమున్ క్షేమంకరీ!యీశ్వరీ!

               2. శరన్నవరాత్రుల లో.  దుర్గామాత, అన్నపూర్ణ గా...

    శా: ఆహారంబును జీవకోటి కిడి యాహ్లాదంబు గల్పించుచున్

         మోహాంధత్వముబారద్రోలి కరుణన్ ముద్దార దీపించునా

         సౌహార్దాది మహోన్నతంపు గుణియౌ శాకంబరీదేవి సు

        స్నేహానందవరాన్నపూర్ణ మనలన్ చిద్రూపియై కాచుతన్. 

               3. వాణిగా ..దుర్గాదేవి.   శ్రీవాణ్యై నమః

తే.గీ: పలుకుపలుకున మధువులు చిలుకజేయ

        జ్ఞానశక్తియు విజ్ఞాన శక్తులీన 

        వేదశాస్త్రాల సారాలు వెలికిదీయ

        వాణి కరుణించి నా జిహ్వ వరలుగాత!

శా: భావావేశ విలాస సంపదలు సంప్రాప్తంబులై యుండుటల్

     ప్రావీణ్యంబున సత్కళావిజయముల్ పండించి మెప్పించుటల్

     తావుల్జిమ్మెడు కావ్యసంపుటులు సద్ధర్మార్ధ వేదాంతముల్

     నీవాల్లభ్యముగాదె వాణి! జగతిన్నేజ్ఞానికైనన్ సదా!


శరన్నవరాత్రుల లో దుర్గాదేవి.

     దుర్గాదేవ్యై నమః....స్తవము.మీపొన్నెకంటి

  భర్గుని వామభాగమయి భవ్యసురార్చిత కల్పవల్లివై

  నిర్గుణ నిర్మలాత్మ కమనీయరసాంచిత స్వాదుమూర్తివై

  దుర్గగ"నింద్రకీలమున దుస్తరపాపవిదూరశక్తివై

  మార్గవివేచనన్ సలిపి మమ్ములగావుమ! తల్లిశాంభవీ!

             4.  దుర్గాదేవి లలితా త్రిపుర సుందరిగా....

 చం  లలిత మనోజ్ఞభావనలు లాలిత సత్కవితావిభూతులన్

       కలరవ గాత్రమాధురులు కమ్మని కావ్యవివేచనారుచుల్

       సలలిత భక్తి తత్త్వములు చక్కని గ్రంథవిలాసబంధముల్

       వెలయగజేయ శక్తినిడ వేడెద శ్రీలలితాంబనెప్పుడున్.

             5.  దుర్గాదేవి మహాలక్ష్మి గా...

 ఉ . పాలసముద్రరాజ సుతవై సురకోటి సుపూజితాత్మవై

     శ్రీలకునాలవాలమయి చెన్నలరారెడు విష్ణుపత్నివై

     హేలగచిద్విలాసత మహీతలమేలు కృపాంబురాశి! మా

     పాలిట మాతృవత్సలత భాసురరీతిని జూపుగావుతన్.!

స,తీ,దే,వి. ఆటవెలదిలో.. లక్ష్మీ దేవి స్తుతి. 

సరసిజాక్షి!కమల!సౌందర్యవారాశి

తీర్చు మమ్మ వెతలు తిరముగాను

దేవి! నీదు కరుణ దేదీప్యమానంబు

విష్ణు హృన్నివాసి! వేలనతులు.


నవమి రోజు..సిద్ధధాత్రి రూపం.,మహిషాసుర మర్దిని.

   అమ్మకు వందనములతో..మీపొన్నెకంటి.


  సిద్ధ ధాత్రిగ నీరూపు శ్రీలగూర్చు

  నవమి రోజున నీదివ్య జవముజూపి

  దుష్టసంహారివైనావు తోయజాక్షి

  రాజరాజేశ్వరీ!మాకు రక్షనిమ్ము!


  మహిష రూపాన మత్తిల్లి మగువయనెడు

  చుల్కనైనట్టి భావాన సుందరాంగి

  శాంభవిని గోర రణమున సమయజేసె

  అట్టి విజయ దుర్గాదేవి నాశ్రయింతు.


అందరికి విజయదశమి శుభాకాంక్షలు.

 సీ: నవవిధరూపాల నవ్యాంతరంగాల 

            మహిషునిజంపిన మాత!వీవు!

     పదునాల్గులోకాలు భయముననిండగ

           రక్షగల్పించిన రమణివీవు!

    లలితలావణ్య విలాసినే కాదంచు

             శక్తిని జూపిన చండికీవు!

    దుష్టుల దునుమాడి శిష్టుల గాపాడి

             తోషంబుగూర్చిన దుర్గవీవు!

    విజయదశమిన ఘనమైన విజయమంది

    ధర్మ వర్తనె విజయంపు మర్మమనెడు

    సూక్తి చాటిన లోకైక శోభనాంగి!

    అమ్మ నీకివె హారతులందుకొనుమ!




బోసుదంపతులకు ఆశీస్సులు. 6.05.2026.

 జీ.బోసు గారి 49వ వత్సర వివాహ మహోత్సవము.           శీర్షిక.. మూడుముళ్ళు. సీ. జీవితమంతయున్ కష్టసుఖాలలో        ముంచితేల్చుచునుండు మూడుముళ్ళు  ...