8, మే 2026, శుక్రవారం

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు

రేయి బవలు వెల్గు రేడు నీదు

మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు

జీవన పయనాన నావయతడు.1

 సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట సత్యము

             కాలప్రభావమ్ము కలిపెనపుడు

 సాప్తపదీనంపు సౌభాగ్య రేఖచే

        సంసారసుఖములు సాగుచుండె

 పచ్చని తలబ్రాలు పారవశ్యత తల

          మీద బోయంగ సమ్మోద మలరె

 వేదమంత్రార్ధముల్ వేవేల ఫలియించ

               అర్థశతాబ్దంబు సార్థకమయె

తే.గీ. భావికాలాన మీకిల భద్రమస్తు!

        సుఖము సౌఖ్యాలు మీయింట శోభలలరు

        రాము కరుణార్ద్ర దృక్కులన్ రహిని వెలిగి 

        ఆయురారోగ్యభాగ్యాల నలరుగాత! 

7, మే 2026, గురువారం

బోసుదంపతులకు ఆశీస్సులు. 6.05.2026.

 జీ.బోసు గారి 49వ వత్సర వివాహ మహోత్సవము.

          శీర్షిక.. మూడుముళ్ళు.

సీ. జీవితమంతయున్ కష్టసుఖాలలో

       ముంచితేల్చుచునుండు మూడుముళ్ళు

     సాగరంబుగబోల్చు సంసారమునకెల్ల

            మూలభూతంబైనవి మూడుముళ్ళు

     మధురమంజులమైన మహిత ప్రేమకునిల

                 మోదమానంబవి మూడుముళ్ళు

     ధర్మ రక్షణజేసి తనవంశ వృద్ధికై

                మురిపాన వేసెడు మూడుముళ్ళు

     గృహస్త ధర్మాన కీర్తినార్జింపగా

                మూలసూత్రాలవి మూడుముళ్ళు

     పూర్ణత్వమునునిచ్చి భూతిని గూర్చెడు

                  పొగరైన బంధాలె మూడుముళ్ళు

      సంఘాన గౌరవ సౌభాగ్యములనెల్ల

                ముద్దుగా బంచెడు మూడుముళ్ళు

      పతికిసర్వస్వమౌ భార్య హేమలతనాన్

                 ముగుదకు నవశోభ మూడుముళ్ళు

     బ్రహ్మయ్య కూర్చిన పావిత్ర్య సూత్రాలు

                  విడదీయలేనట్టి వింతముడులు

       బోసు విష్ణువు రూపు పుణ్యంపు లత లక్ష్మి

                  సార సంసారంబు జరిపినారు

      ఏడుజన్మలబంధ మీమూడు ముళ్ళకు

               మధురమ ధురమౌచు మంజులమయె

       రమణేంద్ర హారికల్ రమ్యానుభూతికిన్

                  సాక్షులీ సంసారసాగరాన 

      నాల్గు పదులమీద నవసంఖ్య గతియించె

      రాముకరుణవలన రమ్యచరిత

      భావికాలమందు పరిపూర్ణ శోభతో

      మనుడు దంపతులిల మహినిసుఖత!

1, ఏప్రిల్ 2026, బుధవారం

పెనుమర్తి శేఖర్ పదవీవిరమణ.

 పెనుమర్తి శేఖర్ పదవీవిరమణ. 30.05.2026.


శ్రీలగురియించు చిన్మయ చేతనంబు

నాల్గువేదాల వారాశి నలువరాణి

అత్తగారైన శ్రీదేవి యవనరతము

"శేఖరు"కుటుంబ మున్బ్రోచు శ్రేయమలర.1.

       పెనుమర్తివంశ విభవా!

       అనువర్తిగ పెద్దవారి యాశయములనే

       కనుసైగనందికొనుచును

       ఘనకీర్తి వహించి  నావు కార్యాచరణా!.2. 

రామాంజనేయ శర్మయు

రామామణి నీదు తల్లి రాధారాణీ

ధీమంతుడవంచనగను

ప్రేమోదారతలొసంగి పెరిగితివయ్యా!.3.

       కోర్టువారు టైపు కోరిన తడవుగా

       క్షణములోనజేయ ఘనముగాను 

       నరిసిరెడ్డిగారి నవ్యంపుసూచనల్

       వృద్ధిపథము జూపె వేగనీకు. 4.

ఇట్టి ప్రజ్ఞనిన్ను నేయస్వొగాజేయ

జీవితాన ముదము చిగురుదొడిగె

సంఘమందు మిగుల సౌమనస్యముతోడ

గౌరవంబుపెరిగి ఖ్యాతిహెచ్చె.5.

        ఇంతదనుక నీవు హృదయపూర్వక

        మైన సేవజేసి మన్ననంది

        నావు భావికాల నవ్యానుభూతికై

        పదవివదలెనిన్ను పరమప్రేమ.6.

శేషజీవనమ్ము శేషాద్రి వాసునిన్

రమ్యకరుణతోడ రామమణియు

మీకుటుంబమంత మేల్మిసంతోషముల్

ఆయుషంబులంది హాయిమనుడు!7.

24, మార్చి 2026, మంగళవారం

మరపురాని ఘటన. సిరి. 24.03.26.

 పశువులకు కూడ అంత ప్రేమాభిమానాలా?

ది 24.‌03.26 న మా అబ్బాయి చి. అరుణ్ కిరణ్ పెంచుతున్న ఆవుకు నా సేవలు గాని దానికి కేటాయించిన సమయంకాని చాల తక్కువే. అంటే నేను మా వాడింటికి వెళ్ళినపుడు మాత్రమే దానిని దగ్గరకు తీసికొని ప్రేమతో గంగడోలు, మెడ, వీపు, కాళ్ళు నిమిరి దానిని అక్కునజేర్చుకునేవాడిని. 22.03.26 నుండి 24 వతేదీ వరకు అచటనే ఉండి 24 న నేను అచటినుండి మల్కాజ్గిరి బయల్దేరుతుండగా క్రిందికి కొడుకు కోడలు కూడ వచ్చారు. సరే వెళ్లిరండని అంగీకారం తెలిపారు. కాని నా కాశ్చర్యం కలిగించింది , మనసు కదిలించింది ఈ రోజు జరిగిన సంఘటన.

    మా అబ్బాయి పెంచుతున్న ఆవు పేరు ‘‘సిరి’’.  వారు దానిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతున్నారు కుటుంబం అంతా. వారు బయటకు వెళ్ళేటప్పుడు సిరికి బై బై చెప్పటం మరల వారింటికి రాగానే సంతోషంతో ఉండటం మామూలే. ఎందుకంటే వారు ప్రతిరోజు దానికి ‘‘ నందినీ ధేనువునకు రఘుమహారాజు అవ్యాజమైన ప్రేమానురాగాలు, భక్తి శ్రద్ధలతో పూజించి గౌరవించినట్లు ’’ చూస్తారు. కనుక వారి పట్ల అది ప్రేమను కోపాన్ని (గారాబంగా) బాధను చూపించటం సహజం. కాని ఆ ‘‘సిరి’’ నాపై కూడ ఎంత ప్రేమ పెంచుకున్నదో ఈరోజు నాకర్ధమైనది. సూట్ కేసులు బాగులు వగైరాలు ఆటోలో పెట్టబోతూ నేను ‘‘సిరి’’వంకచూచి ‘‘బైబై సిరి’’ అన్నాను. అది సమాధానంగా మూగభాషలో ఏమీ చెప్పలేక  అమ్మ బయటకు వెళుతుంటే చంటిపాప వెళ్లవద్దని ఏడ్చినట్లు కన్నీరు కార్చింది. ఈ ఘటన నా భార్య, కొడుకు కోడలు చూచారు. అది అంతే పిచ్చిది. మేము బయటకు వెళ్లేటప్పుడు కూడ అలానే ఉంటుంది అన్నారు. నిజమే మిమ్ములను అనునిత్యం చూస్తుంది. నేను నెలకో రెండు నెలలకో వచ్చిపోయేవాడిని కదా! సంపూర్ణంగా ప్రతిరోజు దాని బాగోగులు, చూడటంలేదుకదా! మరి నామీద అంత ప్రేమతోకూడిన పిచ్చి ఎందుకో నాకర్ధం కాలేదు. మామూలుగా ఉండకు కన్నీరు కార్చడమేమిటి? అవి దు:ఖాశ్రువులా? ఆనందబాష్పాలా?  ఏది యేమైనా గోజాతి శ్రీకృష్ణపరమాత్ముని మధుర వేణుగాన సుధారసము గ్రోలుట వలనగాని, పరమాత్ముని కరస్పర్శ వలనగాని అనిర్వచనీయమైన జ్ఞానసంపద కలిగియున్నవి. మాట లేకపోయినను సర్వము వాటికి కరతలామలకమే. 

    గోమాత సర్వదేవతల నివాసస్థానము.ప్రతి యింట ఒక గోవు ఉండాలి. దానిని ప్రేమతో పెంచాలి. జీవితాలు ధన్యం చేసుకోవాలి. 25.03.26 న నా 78వ పుట్టినరోజు. ఇది పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్నరపుటుగాదినాడు ‘‘ అన్నమయ్య కళావాహిని’’ లో నా ప్రయమైన సోదరుడు , అష్టావధాన శేఖరుడు ‘‘సురభి శంకరశర్మ’’ గారిచే నిర్వహించబడిన అవధానంలో డా. శోభారాజ్ గారిచే సన్మానం జరిగింది. విశేషం పరాభవనామ సంవత్నరంలోనే గౌరవ సన్మానం జరిగింది. ఇది ఆపరమాత్ముని అనుగ్రహంగా భావిస్తాను. గడచిన సంవత్నరాలు నాకెన్నో సన్మానాలు. అవమానాలు ప్రసాదించినై. అవి అన్నియు పూర్వపు లెక్కలు సరిచేయుటకే సుమా! ఏదియేమైనను మానవజన్మ ఉత్కృష్టమైనది. దానిని సార్ధకం చేసుకొనుటకు , మానసిక ప్రకాశము , ప్రశాంతత కొరకు భగవంతుని నమ్మికొలుచుట ఏకైక మార్గము.మా ‘‘సిరి’’ కంటినుండి వచ్చిన నీరు నేను ‘‘ఆనందబాష్పాలుగా భావిస్తాను. ‘‘రేపు నీ పుట్టినరోజు కదా! ఆనందంగా జరుపుకో’’ అని సంతోషం వ్యక్తం చేసి ఉంటుందికదా! ఔనౌను. నూటికి రెండువందల పాళ్లు అంతే. 

నా భావాలను మీకిబ్బంది అయినా పంచుకొన్నందులకు ధన్యవాదములు. సర్వే జనా: సుఖినోభవంతు!!!


 


19, మార్చి 2026, గురువారం

శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం

డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం 

 వేంకటేశుని పాదాలు వినయగరిమ

 అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ 

 వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి

 జ్ఞాన శోభాంచితసురాజ్ఞి! నతులుతల్లి! 

 దశావధానం. అవధాని  సురభి శంకర శర్మగారు. అన్నమయ్య పురం . పరాభవ ఉగాది 

సంచాలకులు. ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డిగారు .  

1. నిషిద్ధాక్షరి ...వాడపల్లి బాలకృష్ణ మూర్తి గారు. 

అంశం.. నూత్న సంవత్సరం, నూత్న వధువు. 

కం . మ (హ )ది (న )లో పూ (ద )తం (న)బౌచున్ 

       (స )ము ద(0బ )మ్ము (చ )గా (చే )సా (ద )గ (ద )గ (త )నిల పూ (త )జ్య (మ )0బౌచున్ .

కం . మదిలో పూతంబౌచున్ ., ముదమ్ముగా సాగగ నిల పూజ్యంబౌచున్ .

       ఇది నవ వర్షంబిక మా., హృదయంబుల వెల్గవలయు హేలా గతిగా . 

2. న్యస్తాక్షరి. పి . కమల సుధారాణి.గారు .

    సరస్వతీ స్తుతి. శార్దూలం లో . 1వ . పా . 1వ అక్షరం ..నీ 

   2.వ .పా .4 వ . అక్షరం . దు ., 3.వ . పా . 2వ .అక్షరం . వా ., 4 వ పా.  3వ అక్షరం . ణీ 

శా .  నీవే తల్లివి తండ్రియున్ గురువునై నిత్యానురాగమ్మునై 

      భావంబందున భవ్య భావముల శబ్దస్ఫూర్తి దీపింపగా 

   నీ వా త్సల్యము  జూప పద్య గతులన్ నిన్ జేర సేవించెదన్ 

  శ్రీ వాణీ  నను బ్రోవరమ్ము సతమున్ చిచ్ఛక్తి సచ్ఛిక్తివై . 

3. దత్తపది. పొన్నెకంటి సూర్యనారాయణ రావు .

ట్రంపు , మోడీ , పుతిన్ , కిమ్ . పదాలుపయోగించి  శార్దూలం  , భారతార్ధంలో . 

శా . ఒమ్మిన్జేయక చూచు కౌరవులు మి మ్మోడిం చుటే ధ్యేయమై   

      నమ్మం బిల్చియు చం పు తిన్నగను విన్నాణంబు జూపించుచున్ 

     సమ్మోదంబగునెట్లు సంధి మనకున్ చ ట్రంపు బంధాలతో 

    కిమ్మీ రాంతక భీమసేన! వినుమా! కీడెంచి మేలెంచుమా !

4. సమస్య. టి . భ్రమరాంబ గారు . 

కోకిల  కూయుచుండగను కూయుచునుండెను కాకులన్నియున్ .

ప్రా కట వృద్ధిరాగములు భారతమందున వచ్చె మోడి తో

కేకలు వేసి కొందఱిట కీడుదలంప ప్రధాన మంత్రిపై 

మైకము గమ్మి వాగెదరు మాన్యతఁ దప్పియు దుష్టబుద్ధితోన్ 

కోకిల ...  

5. వర్ణన. డా . జిల్లెళ్ల వరప్రసాద్. వసంతాగమనం 

చం . ముసిరెను గండుతుమ్మెదలు మోద మెలర్ప రసాలశాఖికల్ 

       విసరెను పిల్ల వాయువులు వీనుల విందొనరించె కోయిలల్ 

       కసరెడబాసి భూజనులు కాంతురు నీదు మనోహరాకృతిన్ 

      కొసరుచునున్న సత్కవుల కోర్కెలు దీర్చ వసంత రమ్మికన్ . 

6. మీమాట నా పాట . డి . అంజన్  కుమార్ .  అంశం . భావ కాలుష్య నివారణ . 

    అన్నమయ్య అన్నమయ్య తెలుగుజాతి ఖ్యాతివయ్య 

    అన్నమయ్య అన్నమయ్య పదకవితల    ధాతవయ్య

  నీ పాటల సప్త గిరులు ఎదిగి ఎదిగి పొంగెనయా 

నీ మాటల భక్త జనులు ఒదిగి ఒదిగి సాగెనయా 

వేంకట విభునకు ప్రియమై అలమేల్మంగకు జయమై 

పావన తిరుమల పదమై నీ కృతులే శృతులై .. అన్నమయ్య...


        



14, మార్చి 2026, శనివారం

పరాభవ వసంతం ,2026.

 పరాభవ వసంతం,2026. భ్రష్టులకు పరాభవవసంతం  వరిష్ఠులకు వన్నెచిన్నెల వసంతం . 8.03.2026.

     అందరికి ఉగాది శుభాకాంక్షలు.

సీ. వాసంత లక్ష్మి ఆ వ్యత్యాసమెరుగును ,

  భక్తవరిష్ఠులు భ్రష్టులకును 

ప్రకృతి  కాంతామణి పరికించు తేడాను

        సుజన హృత్కమలంబు, శుంఠ మనసు 

కాల శాసనుడు తా గనునెంతొ  భేదంబు 

        సౌమ్యుల దుష్టుల చర్యలందు 

సృష్టి కర్తెరుగును శీలంపు మూలంబు 

      రక్కసి జాతికి లలితులకును 

తే . పంచిపెట్టు పరాభవాల్  భ్రస్టులకును 

వన్నెచిన్నెల వైభవాల్  పండితులకు 

నూత్న వత్సరంబ!తవ వినూత్న శోభ 

ఎవరికెయ్యది ప్రాప్తంబొ ఈప్సితాన .1 

సీ . కోకిల గానముల్ కోపంబు తెప్పించు 

     కూళల కక్కటా !ఘోరమగును 

గంధబంధురమైన కమ్మని కుసుమాలు 

         వెగటుగాదోచును వెఱ్ఱులఁకును 

వాసంతి లక్ష్మిగా వచ్చిన యిల్లాలి 

      కాలదన్నును మృగంబువోలె 

పెరనారి పొందుకై పెర పెరలాడెడు 

   కామాంధులకునెల్ల కలతమిగులఁ 

తే. దుర్మదాంధుల కుట్రల దునిమివేసి 

జ్ఞానబోధను జేయంగ కదలివచ్చె 

వాసిగాంచు  పరాభవ వత్సరంబు. 

పండితాళికి కవనంపు పండువనగ. 2.

సీ . ఏ పాపమెరుగని ఎందరి ఉసురులో 

  పొట్ట బెట్టుకొనెడి  పోరుసల్పి 

ఆధిపత్యంబదే అంతిమ లక్ష్య మై

       ఆసురి చర్యల హర్షమంది 

పాఠశాలల పైన ప్రాజ్ఞుల పైనను 

   బాంబుల వర్షంబు వడగజేసి 

పాప కూపంబునబడు భ్రస్టులకునెల్ల 

   రయముగా తగిన పరాభవమ్ము 

ఆ . కలుగజేసి మంచి కాపాడ వాసంత 

లక్ష్మి వగుచు దయను రమ్ము రమ్ము !

దీనజనుల పాలి  దేవతవీవమ్మ 

కోటి నతులతోడ కొలుతు నిన్ను .3 

ఆ. క్రొత్త వత్సరంబ ! కోర్కెలు పండగ 

గౌరవాదరముల గోరు ప్రజలు 

అధిక భాగమీవు ఆదాయములజూపి  

అంతకన్న మిగుల ఆయువిమ్ము.4.

తే. నీ పరాభవ నామంబు నిఖిల జగతి 

తలచుకొన్న గుండె లయనుదప్పిపోవు 

వాదు నీకేల సద్గౌరవాలనిమ్ము 

అంజలింతురు సర్వులు హారతిచ్చి.5.

 


16, ఫిబ్రవరి 2026, సోమవారం

కోకిల ..కాకి.

 రసజజభర....11.


కోకిల..కాకి.

కాకిరంగును బోలియున్నను, కావుకావని బల్కవే

నాకె కమ్మని కంఠముందని నాట్యమాడెదు గర్వమున్

సోకులాడివి మాయలాడివి, చోర విద్యను ప్రజ్ఞవే

నాకు నచ్చవు పొమ్ముపొమ్మిక, నంగనాచివి కోయిలా! 1

మావి కొమ్మను నక్కినక్కి అ, మ్మావి జొంపము మెక్కుచున్

భావికాల వసంతమందున, పంచమస్వర కీర్తనల్

భావుకాళికి గుండెపండగ, పాట పాడెదవెంతయున్

పోవె నీవగు మాయలెల్లను, ముందు మాకెఱుకాయలే.2

కాకిపెట్టిన రెండుగ్రుడ్లను, కాల ద్రోయుచు కూళవై

సోకులాడిగ నీదు గ్రుడ్లను, సుందరంబుగ నుంచుటల్

మాకు తెల్లమె నీ కథల్ పలు, మాయలెందుకె కోయిలా!.

కాకి పిచ్చిది కాకపోయిన, కట్టె దెబ్బలు నీకగున్.3

మావి కొమ్మలు పూచుకాలమె, మంచి కాలము మీకగున్

ఠీవిగా గళమెత్తి పాడగ, టింగురంగని యాడగన్

భావి సూచనలీయగా తగు, భద్రమెల్లను గూర్పగా

నావి నావని పల్కరాదను జ్ఞాన మిచ్చును కాకియే.4. 

నీవు తిండిని గన్న వేరొక నేస్త మున్గనవెప్పుడున్

ఆవురావురటంచు మెక్కెదు, హ్లాది వౌచును స్వార్ధమున్

నావి నీవను భేదమొల్లక, నాల్గు దిక్కుల కాకులన్

ప్రోవుజేయుచు నారగించును, బుద్ధి మంతపు కాకియే.5

పంచమంబున నీవు కూయగ, బాలలందరు హేళనన్

ఎంచి రాగము మించిపాడగ, ఎక్కువైనవి నీహొయల్

పొంచియుండియు రాగ రీతులు, ముద్దు లొల్కగ మార్చుటల్ 

కొంచెమైనను ధర్మమా యిది, కోయిలా వనగాయకా. 6








17, జనవరి 2026, శనివారం

కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా.



 కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా.


ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మనం నిరంతరం మృత్యుదేవత కాలపాశం ప్రక్కనే తిరుగుతాము. విధి నియమానుసారం మాత్రమే దాని కౌగిలి చేరతాము. 

నేను (పొన్నెకంటి సూర్యనారాయణరావు) ప్రతిరోజు వాకింగ్ కు సఫిల్ గూడ పార్కుకు ఉదయం 7గం.లకు వెళతాను. అలాగే ఈరోజు కూడ బయల్దేరాను. ఆనందబాగ్ చౌరాస్తా చేరబోతుండగా నా ఎడమకాలి బూటుకి మాంజా, కాలపాశమల్లె  చుట్టుకొని ‘‘ నీవెక్కడికిరా వెళ్లేది?’’అని బెదిరించింది. కొంత స్పర్శ , భగవత్ కృప వలన అది మాంజాగా గుర్తించి ఏ కొంచెం ముక్కో తెగి నా కాలికి చుట్టి ఉంటుందని భ్రమపడి బండిని చౌరాస్తాలో ప్రక్కకు తీసి స్టాండ్ వేసి మాంజాని లాగటం ప్రారంభించాను.  దీనిని  ఇక్కడే వదిలితే మరెవరి గొంతుకైనా చుట్టుకొని ప్రాణాలు తీయవచ్చు, అలా జరగకూడదని పట్టుదలతో మొత్తం లాగి చుట్టచుట్టి , ఇది పార్కులోని నా మిత్రులందరికి చూపి, విషయం చెప్పాను.     నాకు వెంటనే భారతంలోని దుశ్శాసనుడు స్ఫురణకు వచ్చాడు. వాడికి నాకు కొద్ది తేడా. దుశ్శాసనునకు ద్రోవది వలువలు పూర్తిగా రాలేదు, ఆ శ్రీకృష్ణుని దయవలన , నాకు అదే కృష్ణుని దయవలన మాంజా మొత్తం వచ్చింది.  నాకు చుట్టిన మాంజా కాలసర్పం 1000మీ ఎంతో సహనంతో తొలగించి దానిని చుట్టి నాబండిలో పెట్టుకున్నాను. ట్రాఫిక్ ఆగలేదు. నేను అక్కడెందుకు నిలబడ్డానో ఎవరికి తెలియదు. అందరు విచిత్రంగా చూస్తూ బండ్లు తోలుతున్నారు. బండి ఆపి ఏమైనది ? అని అడిగిన నాధుడు లేడు. ఉ.9 దాటితే కనీసం పోలీస్ వారైనా ఉండిఉంటే నాబాధను అర్ధం చేసుకునేవారు. ఉ.7 గం.లకు వారుకూడ లేరు. 

గాలిపటం ఉన్నతస్థానానికి వెళ్ళటానికి, పిల్లల ఆనందానికి  మాంజానే కారణం. అది కారణాంతరాల వలన తెగిపోతే మనుషుల కంఠాలను చుట్టి కాలసర్పమై ప్రాణాలను తీయుటకు, తీరని దు:ఖానికి  అదే కారణం.  

తప్పెవరిది? గాలిపటాలు ఎగరేసే పిల్లలదా? కంఠాలను ఖండించగల మాంజాదా? బండి నడిపే వారిదా? పోలీసువారెంత చెప్పినా పెడచెవిని బెట్టి మా ఆనందమే మాది అనే అలసత కలిగిన గాలిపటాలు ఎగరేసే వారిదా?

గాలిపటాలు ఎగరేసే పిల్లలకు ప్రోత్సాహమిచ్చే పెద్దలు తెగిన గాలి పటం మాంజాను అలానే వదలివేయకుండా తిరిగి దానిని పూర్తిగా సేకరించి భద్ర పరచుకోవాలి. అపుడు బజార్లలో గాలిలో వదలివేయబడదు. లేదా వ్రేలాడుతున్న దారాలు ఎవరైనా చూస్తే బాధ్యతగా తొలగించాలి. ఈ విషయాలలో ప్రభుత్వం మరికొంత కఠినంగా ఉండటం ఎంతో అవసరం. మాంజాల సర్పాలనుండి ప్రజలను కాపాడుకుందాం. శుభం భూయాత్. 

                                  మీ పొన్నెకంటి సూర్యనారాయణరావు.

                                                 మల్కాజ్గిరి. భాగ్యనగరం,

2, డిసెంబర్ 2025, మంగళవారం

తెలుగు కవులు

పద్యాల శీర్షిక : తెలుగు కవులు 

కవి పేరు     :  పొన్నెకంటి సూర్యనారాయణ రావు 

నివాసం      : మల్కాజ్గిరి, భాగ్యనగరం 

చరవాణి       : 9866675770

పద్యాలు :

1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే

    సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా

    భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ‌, సం

    పూజిత దివ్యభవ్యమయి మోదముగూర్చె జగద్థితంబుగన్. 

2. శేముషి మీరె భారతము సింహపురిన్ కవి తిక్కయజ్వచే

    నా మహిమాన్వితంపు పదునైదు సుపర్వపు పాత్రలన్నియున్

    ఆమని వేళ కేకి గణమద్భుత నాట్య విశేష వైఖరిన్

    కోమలమై చనెన్ తెనుగు  కోర్కెలు పండగ వాడవాడలన్.

3. నన్నయ మార్గమున్ సరస నాటకరీతుల తిక్కనార్యునిన్

    చెన్నుగ నొక్కరీతి గని శ్రీ హరివంశపు సాహితీ సుధల్

    పన్నుగ శేషభారతము భావ రసాంచిత నూత్న వైఖరిన్

    మన్నన శంభుదాస వరమై మన తెల్గది వెల్గె దివ్యమై.

4. పోతన భక్తి తత్త్వమున పుస్తకపాణి ముఖావలోకియై

    ‘‘మాతరొ! బాష్పముల్ వలదు, మన్నన గూర్తు కవిత్వకన్నెకున్

    చేతము రంజిలన్ వినుమ! చిన్మయ రూపిణి! ’’యంచు బల్కెగా

    బ్రాతిగ నిచ్చె గౌరవము పచ్చని తెన్గుకు శాశ్వతంబుగన్

  హామీ పత్రము : ఈ పద్యములు స్వయముగా నా చేత వ్రాయబడినవని హామీ ఇచ్చుచున్నాను 



24, జులై 2025, గురువారం

మండలి.

 గాంధేయవాది. పల్లెవాడలో జననం. 1972న అవనిగడ్డ లో ఎన్నికైన ఏకైక శాసనసభ్యుడు.  1974లో విద్యామంత్రి. అంతర్జాతీయ తెలుగు కేంద్రం ను 

మం.వెం.కృ.రావు తెలుగు కేంద్రంగా మార్చారు. దివిసీమగాంధి. ప్రథమ 

ప్రపంచ తె.సభల అధ్యక్షులు. మండలి వెంకట కృష్ణారావు. 


పల్లెవాడను పల్లె ప్రభవించి వెల్గిన

          మండలివంశాబ్ధి మండనుండు

చదువు సంధ్యలయందు సామర్ధ్యముంజూపి

           సత్కీర్తి గన్నట్టి సౌమ్యుడితడు

అవనిగడ్డ పరిధి నాత్మీయుడైవెల్గి

           శాసనసభ్యుడై చనినవాడు

విద్యల మంత్రిగా విలువైన సేవలన్

           ఆంధ్రులకొసగిన నార్యుడతడు

దివిసీమగాంధిగా తేజరిల్లినవాడు

           కృష్ణరావాఖ్య వాజ్ఞ్నిపుణుడతడు

     

    పుణ్యభారతమాతకు ముద్దుబిడ్డ

    శాంతిదాంతులుపాటించు సారయశుడు

    కీర్తిశేషులు పేదల కార్తిహరులు

    ఐదుపదిసేతు వారికి నహరహంబు.

    

12, జూన్ 2025, గురువారం

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే

    సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా

    భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ‌, సం

    పూజిత దివ్యభవ్యమయి మోదముగూర్చె జగద్థితంబుగన్. 

2. శేముషి మీరె భారతము సింహపురిన్ కవి తిక్కయజ్వచే

    నా మహిమాన్వితంపు పదునైదు సుపర్వపు పాత్రలన్నియున్

    ఆమని వేళ కేకి గణమద్భుత నాట్య విశేష వైఖరిన్

    కోమలమై చనెన్ తెనుగు  కోర్కెలు పండగ వాడవాడలన్.

3. నన్నయ మార్గమున్ సరస నాటకరీతుల తిక్కనార్యునిన్

    చెన్నుగ నొక్కరీతి గని శ్రీ హరివంశపు సాహితీ సుధల్

    పన్నుగ శేషభారతము భావ రసాంచిత నూత్న వైఖరిన్

    మన్నన శంభుదాస వరమై మన తెల్గది వెల్గె దివ్యమై.

4. పోతన భక్తి తత్త్వమున పుస్తకపాణి ముఖావలోకియై

    ‘‘మాతరొ! బాష్పముల్ వలదు, మన్నన గూర్తు కవిత్వకన్నెకున్

    చేతము రంజిలన్ వినుమ! చిన్మయ రూపిణి! ’’యంచు బల్కెగా

    బ్రాతిగ నిచ్చె గౌరవము పచ్చని తెన్గుకు శాశ్వతంబుగన్

   ఆతరిసార్వభౌముని మహత్తర సీసవిలాసదీధితుల్.


5. రాయల కాలమున్ కవులు రమ్యరసాంచిత కావ్యజాలముల్

    వ్రాయగ తెల్గు భారతికి వజ్రకిరీటము వచ్చి చేరుటన్

    పాయని సంతసంబునను పౌరులు పద్యపరీమళంబులన్

    హాయిగ బీల్చి సద్యశము నందుచు  వెల్గెను విశ్వశాంతికై.

                                          సూర్యశ్రీ

                     (పొన్నెకంటి సూర్యనారాయణ రావు.)

                       మల్కాజిగిరి. ఫోన్. 9866675770.

                                      భాగ్యనగరం. 

    

    

10, జూన్ 2025, మంగళవారం

ప్రొఫెసర్ మాధవీలతారెడ్డి.

సీ.  శిలల బరువు వాని శ్రేష్ఠత్వముంగూర్చి

    శోధన సల్పిన సుదతి యెవరు?

    పదునేడు వత్సరాల్ ప్రాజెక్టు చీనాబు

    నిర్మాణ బాధ్యతల్ నెఱపెనెవరు?

    వెంకటరెడ్డికిన్ విమలాన్నపూర్ణకున్

    గుర్తింపు తెచ్చిన కూతురెవరు?

    మైదుకూరున బుట్టి మహిళామణిగ వెల్గు

    బంగారు పతకాల ప్రాజ్ఞి యెవరు?

    బెంగళూర్ సంస్థలో ప్రియమైన ప్రొఫెసరై

    మాన్యతన్ ఉన్నట్టి మహిళ యెవరు?

     మహిళా జియోటెక్ గ మానిత ముకుటమ్ము

    ధరియించి వెల్గిన తరుణి యెవరు?

    అర్ధచంద్రాకృతిన్ ఆశ్చర్యముంగొల్పు

    వారధి నిర్మాణ వనిత యెవరు?

    కాశ్మీర ప్రజలకు కలలపంటగ వచ్చి

    చీనాబు దాటించు చిన్నదెవరు?

తే.గీ. ఎవ్వరెవ్వరో యన్న నే నెఱుక పఱతు

        మోది కనుగొన్న జీయాల్జి ముద్దుబిడ్డ

        విశ్వవిఖ్యాతి బెంచిన వీరనారి

        భరతమాతౄణముం దీర్చు పసిడికొండ

        ‘‘మాధవీలతా రెడ్డి’’ యన్ మాన్యచరిత.

    

    


23, మే 2025, శుక్రవారం

కారముల సీసమాలిక.కవితాచమత్కృతి.

‘‘ శ్రీకార’’మనజెల్లు చెన్నగు  నారంభ‌‌,మునకన్ని పనులందు మోదమంద.1

‘‘ఓంకార’’మునుజెప్ప నుచ్ఛ్వాస నిశ్శ్వాస, క్రమబద్ధమునుజేయ గాంచుశక్తి.2

ఆరాధ్య దైవమే ‘‘ఆకార’’రూపాన, గాంచుటె భక్తుల కామితంబు.3

‘‘సాకార’’సౌందర్య సౌజన్య మూర్తిగా, ప్రార్ధింత్రు భక్తులు రామభద్రు.4

ఆధ్యాత్మికంబుగా నంతరంగముపండ, కలలతలపు ‘‘నిరాకార’’మందె.5

‘‘సత్కార’’మనగను సంగీత సాహిత్య, సర్వకళాభిజ్ఞ సంజ్ఞయగును.6

‘‘మమకార’’మనగను మాతృగర్భము నుండి,ప్రేమబంధమ్మైన ప్రేగుగాదె?.7

మదిలో ‘‘నహంకార’’మలినమ్మునిండిన,ప్రేమబాంధవ్యాలు బెదిరిపోవు.8

పెద్దల దర్శింప ప్రియమైన భావనన్, కైమోడ్పునిడ‘‘నమస్కార’’మగును.9

ఘనకార్యమును జేయ గౌరవాదరముల, కాంచనంబిడ ‘‘పురస్కార’’మగును.10

సజ్జన వర్తనన్ సంఘమున్జూచిన, ‘‘సంస్కార’’మనవచ్చు సంబరాన.11

‘‘వషట్కారంబు’’ హైందవ ఋత్విక్కు , పల్కెడి సచ్ఛబ్ద వాచకంబు.12

అందము మగవాని కతివకు గల్గించి, కనువిందిడున‘దలంకార’’మగును.13

సంఘసేవకునిగా సామాన్యులకునుండ, ‘‘నుపకార’’మయ్యదే ఉత్తమంబు.14

ఆత్మావలోకనన్ ‘‘అపకార’’భావంబు, చేరనీకుండుటే శ్రీకరంబు.15

‘‘ఛీత్కార’’మనగను చేష్టలు చెడుగైన, భ్రష్టరూపంబగు ఫలితమగును.16 

‘‘ఫూత్కార’’మునుజెప్ప పొగరైన ఫణిరాజు, తనుజేర బెదిరించు తత్త్వమగును.17 

‘‘గుణకారము’’ గణిత కోణాన హెచ్చింపు, మార్గమై సంఘాన మాన్యమయ్యె.18

పేదల కష్టాలు పెదరాయుడెప్పుడు, కాంచకున్నను‘‘తృణీకార’’మగును.19

ఎండుమిర్చియు దప్ప నే దినుసులులేని, ఘనమైన పొడి‘‘గొడ్డుకార’’మగును.20

సంకష్టములబెట్ట సహియింపనోపని, కార్యముంగన ‘‘ప్రతీకార’’మగును.21

పెద్దలు చెప్పిన ప్రియమైన సూక్తులన్, కాదన బహు ‘‘తిరస్కార’’మగును.22

భవ్యమందిర శోభ దివ్యమై కాపాడ, ‘‘ప్రాకార’’మందురు ప్రాజ్ఞులిలను.23

కదనరంగములను కాలు శవములను, కనలేని స్థితియె‘‘వికార’’మగును.24

‘‘ప్రకారంబు’’నిన్ ఏవేళ పూజింతు, మన్న మనసు నిల్పు మనియె హరుడు.25

గజరాజు క్రోధాన కానలు కంపింప, ‘‘ఘీంకార’’ముంజేయు కేకపగిది.26

‘‘నుడికార’’మనగ మనోజ్ఞ విశాలమౌ, భావజాలంబది బయలుజేయు.27

‘‘అంధకారం’’బన నజ్ఞాన పూర్ణమౌ, మానవ మానస మందిరమ్ము.28

‘‘ధిక్కార’’మనజెల్లు ధీవర రాజాజ్ఞ, పాటిసేయనియట్టి మేటితనము.29

ఇంతుల మనములావంతైన , తెలియక కౌగిలించిన ‘‘బలాత్కార’’మగును.30

కొక్కురోకోయని కొమరుసామిరథంబు,కంఠంబు సాచి"క్రేంకార"మిచ్చు.31.

టంకారంబుసురుల ఠావులుదప్పింప"ధనుష్టంకార"ప్రధానమయ్యె.32

"వెటకారము"నుజెప్పవెంగలిజేసి జనంబులసరసతనవ్వులాట.33

"హుంకార"మనజెల్లు హుమ్మును బెదిరింపు పశువులు క్రూరులు పైకిరాగ.34

        ఎన్నికారాలు మదిలోన నెఱిగియున్న

        పండితుండు ‘‘చమత్కార’’ పద్యములనె(35)

        గోష్ఠిలోపల సరదాగ కోరుచుండు

        సహజ సద్గుణమయ్యది సరసులార!

        కనుడిదే "సూర్యశ్రీ"మనస్కార కవిత.(36)


కవితాచమత్కృతి ఉత్పలమాలిక


కారమదెక్కువైన మృదుగాత్రము సైతము పొక్కిపోయి- ఘీం

కారపు రావము ల్వెలసి కన్నుల వెంటను నీరుగారు- సం

స్కారయుతంపు సారతర గౌరవ సత్కవితాచమత్కృతుల్

వేరుగజెప్పనేల సుకవీ!రస నిర్భరమై మనోజ్ఞమౌ.

ఏరసమందు జెప్పినను నింపునుసొంపు ముదంబుగూర్చునా

తారలమధ్య వెల్గెడు సుధాకరు చల్లని వెన్నెలంబలెన్

ధీరుని మానసాంబుధిని తీరుగ దాగెడి మౌక్తికంబునాన్

మేరుసుపర్వతంబునకు మించిన సైనికు సాహసంబనన్

కీరము తెన్గు నేర్పబడి కేవలపద్యమె బాడు తీరుగన్

క్రూరపుసింగమున్ జెలిమి కోరల నెంచు శకుంతలాత్మజు

న్నారసి కణ్వుడే మిగుల హాసమునందెడి వైభవంబనన్

భారతభారతీ పరమపావన పాదరజంపు తాకిడిన్

మీరిన బుద్ధివైభవపు మేలగు సత్కవి కావ్యమోయనన్

క్షీరసముద్రముం గసిగ జిల్క ద్వితీయఫలంబు కైవడిన్

కోరిన కోర్కెలందుకొను గోపిక మానస హాసమోయనన్

సారథి శౌరిగాగ కడు శౌర్యము జూపు నరావతారునాన్

దారిని జూపుచున్ పరమధర్మము నాదను ధర్మజుంబలెన్

కీరితికాంత సత్కృపయె గేహమునిండిన గేస్తుమాదిరిన్

హారముమధ్యవెల్గు మణియట్టుల కాంతి విలాసరూపమై

నూరువిధంబులం దనరు నూత్న చమత్కృతి శాశ్వతంబునై.

16, ఏప్రిల్ 2025, బుధవారం

కాకరకాయ

 కం. కాకర కరకర నమలగ., భీకరమగు చేదుగొల్పి బీభత్సంబౌ
       సాకులు జెప్పక తినినను., శ్రీకరుడై తీపిరోగి శ్రేయంబందున్.
 కం. వ్యాకరణంబయి కాకర., ప్రాకటమగు బాధగొల్పు ప్రప్రథమందున్
       తేకువ నిత్యముదిన్నను., నాకరమౌ సౌఖ్యములకు నౌరాయనగా!
 కం.అల్లుడు సరిగా నుండిన., విల్లున సంధించు శరము వేగముబోలున్
      చిల్లలుగ ప్రాకి కాకర., కొల్లలుగా సంతునీను  కూరిమితోడన్.
 కం. పిల్లల నిత్తువు ప్రేమగ., చల్లగ యజమాని కోర్కె సఫలము గాగన్
      చెల్లును నీకే యియ్యది., పొల్లుగ నేనెప్డు బల్క భో!కాకరమా!
 కం. అల్లుని జూపకయుండిన., మెల్లగ నేదైన గోడ మీదుగ దాటన్
       ఉల్లము రంజిల జూతువు., తల్లీ!నీమది చురుకది దండము నీకున్.
 కం. కాకరయు పొట్లపాదును., నేకముగానొక్కచోట నిల్పిన చేటౌ
      కాకరకు కంపు పడదని., లోకులు వచియింత్రుగాదె! లోకమునందున్.

24, ఫిబ్రవరి 2025, సోమవారం

పాంప్లెట్.

                               ఆహ్వానము.

"సూర్యశ్రీరామం"గ్రంథావిష్కరణ సభ.

వేదిక : శ్రీలలితా పరమేశ్వరీ దేవస్ధానం, 1వ ఫ్లోర్. అష్టభుజాదేవి ఆలయం ఎదురు. 

          ఆనంద్ బాగ్. హైదరాబాద్.  

                  ది. 5.03.2025. బుధవారం. సాయంత్రం. గం. 4.లకు. 

ఆవిష్కర్త : 

మాన్యులు, ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం గారు

"అవధానసుధాకర, సభాసంచాలక సార్వభౌమ", దేవీభాగవతమునకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్య అకాడమీ "భాషాసమ్మాన్" పురస్కారగ్రహీతలు.

కృతికర్త :

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

విశ్రాంతాంధ్రోపాథ్యాయులు.

అధ్యక్షులు : 

శ్రీ చింతా రామకృష్ణారావు గారు

సుప్రసిద్ధ కవిపండితులు ,  అష్టావధాని , చిత్రకవితా విశారదులు. 

ముఖ్య అతిథులు :

శ్రీ సురభి శంకర శర్మగారు.

అష్టావధాని, అభినవ భర్తృహరి, తెలుగు విశ్వవిద్యాలయపురస్కార గ్రహీత.

శ్రీ జంధ్యాల వెంకటరామ శాస్త్రి గారు.

ఆర్షసాహితీ రత్న ,మధుర వ్యాఖ్యానభారతి , ఆధ్యాత్మిక సాహితీ సుధాకర.

సూచన . కార్యక్రమానంతరం భోజన సదుపాయం కలదు. 



4, ఫిబ్రవరి 2025, మంగళవారం

అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు.

 జాతీయస్థాయి ఉగాది పద్యాల కవితల పోటి.

జాతీయ తెలుగు పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న 

శ్రీవిశ్వావసు ఉగాదిపోటీలకు ఆహ్వానం. 

అంశము: నేటి తెలుగు భాష స్ధితిగతులు. 

పంపవలసిన చివరి తేది. మార్చి 30.2025.  

వాట్సప్ నం.6362973252


మాతృభాషపట్ల మమకారభావన

న్దెలుగుపలుకుబడులు తేటపఱచి

అక్షరాక్షరంపుటర్థంబులెఱిగించ

మరచిపోయెనేటి మాతృమూర్తి. 1


తెలుగు బాస నేర్వ తెరువులుకఱవని

"ఇంగిలీసు"మీద నీప్సితంబు

పెంచుకొనిరి నేటి పెరజాతిప్రేమికుల్

అదియె శాపమయ్యె నాంధ్రులకును. 2


తల్లిదండ్రు లెపుడు హల్లొ!హాయని బల్క

వందనంబు లనరు వారిసంతు

ఆవు చేనుమేయ నాత్మజగట్టునా?

సాజమౌను నదియె సారమగును. 3


ప్రభుతకూడ కనగ ప్రథమకారణమయ్యె

తెలుగు భాషకంత విలువనిడదు

"దేశభాషలందు తెలుగు లెస్స"నియెను

"కృష్ణరాయ"విభుడు కేలుమోడ్చి. 4


మీడియాలు కొన్ని మిడిమిడి జ్ఞానులన్

తెలుగు మాటలాడ తీసికొనుచు

రూప మొక్కటె యపురూపమటంచును

భావముంచ తెలుగు భ్రష్టుపట్టె. 5


తెలుగు సంస్కృతాల తేజంబుగ్రహియించి

ఇతరదేశవాసులిచ్ఛనేర్వ

భరతమాతసంతు పనివడి కొందరు

మాతృమూర్తి నెపుడు "మమ్మీ"గ బిల్తురే. 6


తెలుగు సంస్కృతాల తిరమైన ప్రజ్ఞతో

కావ్యనాటకాలు కవులువ్రాయ

శ్రీ వధానులెల్ల చిత్రంపువాణులై

తెలుగు పలుకు చుండు వెలుగుచుండె. 7


ప్రక్కరాష్ట్ర ప్రజల పరికించి చూడుమా

ఆంధ్రరాష్ట్ర జీవి!అసలు నిజము

వారిమాతృభాష వారికే వరమంద్రు

తెల్విదెచ్చుకొనుచు తెలుగు పలుకు. 8.


ఈ పద్యములు కేవలము ఈ పోటీ కి నేను 

స్వయముగా వ్రాసినవేయని

హామీ యిచ్చుచున్నాను. 

నా చిరునామా: 

పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

   "భాషా ప్రవీణ" ఎం.ఏ., తెలుగు.

మధుశ్రీ తిరుమల అపార్ట్ మెంట్. జి.ఎఫ్.4.

విమలాదేవి నగర్. మల్కాజిగిరి.

హైదరాబాదు. 50047.

ఫోన్: 9866675770.

1, జనవరి 2025, బుధవారం

 2025  ఆంగ్ల వత్సరానికి స్వాగతం.

    జరిగిందేదో జరిగిందని తలచి పాతజ్ఞాపకాలను తవ్వుకోను

    నేనాశా జీవిని .,మానసికంగా నిరంతరం శుభాన్నే కోరతాను

     ఎందుకంటే "ఎద్భావం తద్భవతి" అని , తథాస్తు దేవతలుంటారని 

     అన్నారు పెద్దలు. కనుక ఓ గతించన వత్సరమా! గతంగతః..

     నీకు వీడ్కోలు.

     ఓ నూతన వత్సరమా నీకు స్వాగతం!

         కాలాన్ని కలలపంటగా చేసి అందరికి కన్నులపంట చేయి

 కలాలను కదిపించి కవితలు కావ్యాలు వ్రాయించెయ్యి.

 సామాన్యుల జీవనయానం సంబరమంటేట్లు చేయి.

 రైతుల పంట పుష్కలంగా పండేటట్లుచేసి వారి కండ్లలో కాంతులు నింపు

 రాజకీయనాయకుల చదరంగపు కుయుక్తులకు చెక్ చెప్పు

 చిన్నారుల జీవితాలు కబంధ హస్తాలకు చిక్కనీయకు

 ప్రకృతిలో అశనిపాతాలు అతివర్షపాతాలు తగ్గించి

 కాస్తంత సుఖం కలిగించు.

 అందరికి అడిగినా అడగకపోయినా ఆరోగ్యమివ్వు. 

 భోగభాగ్యాలు వాటంతవే వస్తాయి. 

    ఈ షరతులకు ఒప్పంకుంటేనే గడపలో కాలుపెట్టు. అప్పుడే

      స్వాగతం పలుకుతాను. ....పొన్నెకంటి. 1.1.2025.

13, డిసెంబర్ 2024, శుక్రవారం

కృతజ్ఞతాంజలులు

 కృతజ్ఞతాంజలులు.

  "సూర్యశ్రీరామం" వచనరచనాలోచన నాకు గల్గించిన "శ్రీ సీతారాముల

పాదపద్మములకు మున్ముందు ప్రణామములర్పించుకొనుచున్నాను. 

నేను నా "సూర్యశ్రీరామం" రామాయణ వచన కావ్యమునకు మున్నుడి 

వ్రాయించుకొనుటకు స్వయముగా తమ దగ్గరకు వస్తానని చెప్పిన వేళ

శిష్యవాత్సల్యముతో "ఈ మండుటెండలలో రావలదని ,పుస్తకము పూర్తి

అయిన తరువాత రావచ్చున"ని చెప్పి నిరంతరం సాహితీసేవలో మునిగి

యుంటు నన్నాశీర్వదిస్తు, గ్రంథసమీక్షచేసి వాట్సాప్ ద్వారా పంపిన బహు

గ్రంథకర్త, బహు సన్మానములను కేంద్ర రాష్ట్రములనుండి పొందిన మాన్య

మా గురుదేవులు ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం మాష్టారు గారికి

అనేకానేక కృతజ్ఞతాభివందనములు. "నవరత్నమాలిక" పేరుతో నన్ను నా గ్రంథమును గూర్చి చక్కని చిక్కని శైలితో తొమ్మిది పద్యరత్నములను భ్రాతృ వాత్సల్యముతో వ్రాసియిచ్చిన నా ప్రియతమ సోదరులు చిత్రకవితాసమ్రాట్ శ్రీయుతులు చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదశతములు. "సూర్యా

రామం" పేరుతో నన్ను నా రామాయణమునభినందించుచు లోతైన భావాలతో

తమ యమూల్యాభిప్రాయమును వ్రాసియిచ్చిన నా సంస్కృత కళాశాల 

సహాధ్యాయి, మధురకవితా విశారదులు , నిరంతర పద్యరచనాసక్తులు 

డా. రామడుగు వేంకటేశ్వర శర్మగారికి ధన్యవాదశతములు. "సంకల్పసిద్ధుడు"

పేరుతో  నన్ను నా రామాయణము నభినందించుచు చక్కని పద్యములను 

వ్రాసియిచ్చిన నా సీనియర్ ఆంధ్రోపాధ్యాయుడు,విషయపరిశీలనలో రచనలో సహాయపడిన మిత్రుడు శ్రీ జొన్నలగడ్డ జయరామ శర్మగారికి ధన్యవాదాలు.

"మరోవాల్మీకం, సూర్యశ్రీరామం"పేరుతో తమ చక్కని చిక్కని సరససుకుమార

భావాలతో ఆంధ్రప్రభ సీనియర్ ఎడిటర్ గా అనుభవాలను రంగరించి విశ్లేషణను సుదీర్ఘంగా అందించిన మా గౌరవనీయ బావగారు"శ్రీవైయస్సారెస్"

గారికి నమోవాకములు. నా సంస్కృతకళాశాల సహాధ్యాయి , భువనవిజయ

సభలలో మంత్రితిమ్మరుగా ఖ్యాతినందిన నా సోదరుడు  నన్ను గురించి నా 

సూర్యశ్రీరామం గురించి విశ్లేషణాత్మక అభిప్రాయము నందించినందులకు 

మనసా ధన్యవాదాలు. చిరకాల సాహితీమిత్రులు ,అష్టావధాని, టి.వి. మాధ్యమంగా నిరంతరం సాహితీసేవ చేస్తూ నాకును అందు అవకాశం కల్పించిన నా సోదరుడు శ్రీ సురభి శంకరశర్మ గారు కోరగనే అభిప్రాయము

వ్రాసిపంపినందులకు ధన్యవాదాలు. 

     నా "సూర్యశ్రీరామం" ఆలోచనల నుండి అక్షరాచరణ రూపం వఱకు, గ్రంథ

రూపం వచ్చుటకు ముఖ్యకారకురాలు నా అర్ధాంగి "శ్రీమతి ఇందిర". నా పలుకులో పలుకై పదములో పదమై భావములో భావమై కథాంశమును టైపు చేయుటలో నిరంతర భాగస్వామి యై సంపూర్ణ గ్రంథనిర్మాణమునకు పూనుకొనినందులకు శుభాభినందనలు శుభాశీస్సులు.  అటులనే నా అల్లుడు

కుమార్తె, కొడుకు, కోడలు, మనుమరాండ్రు, మనుమడు సూర్యశ్రీరామం 

గ్రంథ రూపం ధరించుటకు ఎంతో ఉత్సాహ ప్రోత్సాహములనిచ్చుట ముదావహము. వారెల్లరకు నా శుభాశీస్సులు. 

 నా యీ గ్రంథమును అందముగా ఆకర్షణీయముగా ముద్రించిన చిరంజీవి

నరసింహ కు శుభాశీస్సులు. 


ప్రథమ ముద్రణము....క్రోధి. మార్గశీర్షము. (డిశంబరు 2024)

కాపీలు ..1000.

కాపీ రైట్స్....... చి.ల.సౌ. మాచిరాజు రాధిక. చి. పొన్నెకంటి అరుణ్ కిరణ్.

గ్రంథముల ప్రాప్తి స్ధానము.

ఫోన్. నం. 98666735. 9866675770.


విశ్వకళ్యాణ-"సూర్య-రామాయణ" జ్యోతి.


తే.గీ: శ్రీ"రమాపద్మ"ల హృదయసీమలో -న

        లంకరించు -"శ్రీ కళ్యాణ వేంకటేశ్వ

        రుండు"-దివ్య శేషాద్రి వాసుండు - శుభము

        లొసగి - "సూర్య సత్కవిచంద్రు" నోముగాక!...1

తే.గీ: రమ్యమౌ"తెలుగు కవితారామ"మైన

         భారత సనాతనార్ష సువర్ణ శిఖరి

         "గర్తపురి"ప్రాచ్యవిద్యార్థి ఘనయశుండు

         "సూర్యనారాయణార్యుడు""సుమధురకవి"...2

తే.గీ: "పొన్నెకంటి" వంశసుధాబ్ది - పూర్ణకీర్తి

         చంద్ర - "సూర్యనారాయణు" స్వర్ణ- రామ

         తారకాక్షర"దివ్యమంత్ర జపఫలము-

         భవ్య "సూర్య-రామాయణ" భక్తిసుకృతి....3

తే.గీ:  సద్గురు కరుణాపాత్రులు; సంస్కృతాంధ్ర

         పండితులు; ఆర్ద్రహృదయులు; భక్తిధనులు

        "రామకథ"ను - "శ్రీ సూర్యనారాయణ కవి"

        "తెలుగు వాల్మీకి"యై పల్కె, తీయగాను....4

తే.గీ: "ఒంటిమిట్ట" కళ్యాణమహోత్సవంపు

          మూర్తులైన - "సీతారామ" పూజ్యపాద

          పద్మ పీఠార్పితమగు - కావ్యమ్ము! భక్తి

          అక్షరసుమమ్ము! - "సూర్యరామాయణమ్ము"..5

తే.గీ:  భవ్యవేద పురాణ సద్భావఝరిగ

         సకలకవి, పండిత జనరంజకముగాను

         రమ్య "రామాయణ" సుకృతి - రచనచేయ

         ధరను- "సూర్యకవి" "కలమ్ము"- ధన్యమయ్యె..6

తే.గీ: జనని "గాయత్రి" మంత్రబీజాక్షరయుత 

         సప్తకాండ సమన్విత - స్వర్ణరమ్య

        "సూర్య - రామాయణజ్యోతి" సుకృతి - ప్రతి 

         గృహాన - "కళ్యాణ దీపమై" అలరుగాత!..7

తే.గీ: "కనకదుర్గమ్మ" "మల్లేశు కరుణసుధలు

          యాదగిరి "శ్రీనృసింహ" దృక్చందనాలు;

         "సీతరామచంద్రుల"-పెండ్లి సేసలెపుడు

          భువిని "సూర్యేందిర"ల - సదా బ్రోచుగాక!..8

  కం:  " సూర్య" సుహృదయ శ్రీకృత

         " సూర్య శ్రీరామ" రమ్య సుకృతి సుధలిలన్-

          ఆర్యజన కల్పలతలై 

         " సూర్య"ప్రభలలరుదాక - శుభములొసగెడిన్.9


           1-01-2025.               శుభంభూయాత్!

            హైదరాబాద్.           మీ ఆత్మీయ "కళ్యాణశ్రీ"

                                     జంధ్యాల వేంకటరామశాస్త్రి.

                              "ఆర్ష సాహితీ రత్న".9640321630.   



4, డిసెంబర్ 2024, బుధవారం

వదలకయ్య...శతకము.

 వదలకయ్యగురువు పాదములను. ( ఆటవెలదుల శతకము)

బ్రహ్మవిష్ణుభవుల భాసురతేజంబు

మూర్తిగొన్న రూపు పుడమికాపు

గురుపదమ్మె సుమ్ము! గోప్యంబులేదురా

వదలకయ్య గురువు పాదములను.1

దైవముండు చోటు తాజూచి చూపెడు

సత్యధ‌ర్మపరుడు సౌమ్య గురుడు

సకలసుజన హితుడు సౌజన్యమూర్తిరా....వదలకయ్య2

దైవగణముల నిల తనివార పూజింప

గురువు కరుణ యొకటె తెరువుజూపు

ధరణిలోన ముఖ్యదైవంబె తానురా.....వదలకయ్యగురువు3

కాలగమన మెపుడు గమనించవలెనంచు

జ్ఞానబోధ జేసి కథలజెప్పి

మెదడు పదునుబెట్టి మేల్జూపు మేటిరా....వదలకయ్యగురువు4

జలధి పయనమందు చక్కని చుక్కాని;

చేర్చులక్ష్యములను చింతలేక

అట్టి మార్గదర్శి యాచార్యవర్యుడే........వదలకయ్యగురువు5

ప్రథమగురువు తల్లి ప్రతివ్యక్తి కెయ్యెడన్

శిరమువంచి నతులు సేయవలయు

బడిని నడుగుపెట్ట బంధమ్మె గురువగున్.....వదలకయ్యగురువు6

కాయమిచ్చి తల్లి కార్యశూరుని జేయు

జ్ఞానమిచ్చి గురువు కరుణజూపు

వారి ఋణముదీర్చు భక్తిశ్రద్ధలతోడ............వదలకయ్యగురువు7

గురువు దైవమందు గొప్పవారెవరన

దొడ్డ గురుడె యనెను తులసిదాసు

దైవమనగ నెవరొ తాదెల్పు మూర్తిరా......వదలకయ్యగురువు8

మంచిచెడులజెప్పి మానవత్త్వమునేర్పి

కులమతాలకుళ్ళు కూల్చివైచి

మదిని హత్తుకొనెడు మాన్యుండె గురువురా.....వదలకయ్యగురువు9

ఒక్కశిష్యుచేత నోటమిజెందగ

సతము కోరుచుండు సద్గురుండు

భావి జీవితంపు బంగారు దిక్సూచి..........వదలకయ్యగురువు10


ధనపుటాశలేదు దర్పంబులేదులే

వృత్తి ధర్మమనిన విసుగు లేదు

శిష్యవత్సలతను చిరునవ్వుతోజూపు.....వదలకయ్యగురువు11


శిష్యగణము లోన చేతనత్వమునింప

మదిని నమ్మినట్టి మాన్యతముడు

లోకబాంధవుండు లోతైనవ్యక్తిరా.......వదలకయ్యగురువు12


సత్త్వరజముతమము సహజాతమైనను

ప్రథమగుణమె మనకు పదిలమనుచు

శిష్యతతికి జాటు శ్రీరామచంద్రుడే.....వదలకయ్యగురువు13


గతము, నేడు, భావి కాలంబులందున

నేడు ముఖ్యమనుచు నిర్ణయించి

నిజముబల్కు గురుడు  నిర్మలాత్ముండెరా....వదలకయ్యగురువు14


శిష్యుచేతివ్రాత చీకాకుగల్పింప

అక్షరంపు సొగసులలరజూపి,

నుదుటి వ్రాత మార్చు విదితవిధాతరా.....వదలకయ్యగురువు15.


గద్యపద్యభక్తి కావ్యంబులనెగాక

దేశభక్తి సంఘ దీప్తి నెల్ల

శిష్యకోటి హృదుల చిందించుఘనుడురా....వదలకయ్యగురువు16


త్యాగగుణమె పరమ ధర్మతత్త్వంబంచు

చరితలన్ని జెప్పు సౌమ్యమూర్తి

కనులముందు నిల్చు కారణజన్ముండు......వదలకయ్యగురువు17


తాను నమ్మినట్టి తర్క వేదాంతాలు

పూర్ణమహిత మనుచు మోదమలర

చాటిచెప్పునట్టి శాస్త్రాలపుట్టరా........వదలకయ్యగురువు18


లలితకళలు నరుని లాలిత్యముంబెంచు

ఫలితమదియొ గొప్ప వరమెయనుచు

వాని నాచరించు వర్ధిష్ణువాతడు........వదలకయ్యగురువు19


శిలను చెక్కి చెక్కి శిల్పంబుగామార్చు

నమరశిల్పి జక్కనార్యుపగిది

శిష్యుల హృదయాల జెక్కుచక్కని శిల్పి.....వదలకయ్యగురువు20

ఆదిగురువు శివుడు హ్లాదానమైమర్చి

నాట్యమాడుచుండ నాటి ఘోష

పరమ వేదమయ్యె పావనభారతిన్.......వదలకయ్యగురువు21


వేదనాద మదియె విస్తృత రూపమై

ధన్యు వ్యాసహృదిని ధరణినిలువ

మహిత గురువు పగిది మాన్యత్వమందెరా.....వదలకయ్యగురువు22


అంధకార సూచి ఆ"గు"కారంబగు

తన్నిరోధమది"రు" తనరుచుండు

అక్షరద్వయమది యజ్ఞాననాశంబు......వదలకయ్యగురువు23


తల్లివోలె ప్రేమ తనియజేయుచునుండు

తండ్రిపగిది కరుణ దారిజూపు

గురువు జ్ఞానియగుట గోప్యమున్ విప్పురా.....వదలకయ్యగురువు24


పాఠశాలె తనకు పావిత్ర్య బంధమ్ము

బాలబాలికాళి బంధుగణము

వారివృద్ధి తనకు వైకుంఠమనునురా.....వదలకయ్యగురువు25


తనదు సౌఖ్యమెపుడు తలపులోనుండదు

పరులసేవ యనిన బరుగులెత్తు

స్వార్ధచింతలేని సౌహార్దశీలిరా.......వదలకయ్యగురువు26


ధనము నాశజూప తలవంచడాతండు

పసిడి కాన్కలీయ పట్టువడడు

సతము మనము జూడ  స్వార్ధరాహిత్యమే....వదలకయ్యగురువు27


పాఠ్యవిషయములకె ప్రాధాన్యమీయక

సంఘసేవ కరుణ స్వచ్ఛగుణము

ముఖ్య మంచుదెల్పు పూర్ణ విజ్ఞానిరా........వదలకయ్యగురువు28


శిష్యుడెందమందు చెరగనిదైవమై

స్థిరత నిల్చుమహిని క్షేమకరుడు

గురువునకును నెవరు సరిరారు ధరలోన.....వదలకయ్యగురువు29


శిష్యుచెంతకేగి శిరమును నిమురుచు

కష్టకాలమందు కలసియుండు

మానవోత్తముండు మామంచి గురువురా....వదలకయ్యగురువు30.*

తల్లిదండ్రి మురిసి తనువుప్రసాదింప
గురువు కరుణ జూపి, కొదువలేని
జ్ఞానభిక్ష నిడుచు కలలు నిజముచేయు.....వదలకయ్యగురువు31

తల్లిదండ్రులొసగు ధనమది కరుగును
బంధుగణములిచ్చు పసిడితరుగు
కరుణ గురువులిడెడు జ్ఞానంబునిత్యమౌ.....వదలకయ్యగురువు32

మంత్రికైన ముఖ్యమంత్రికైననుగాని
వైద్యునకును కళలవేత్తకైన
చిన్నతనమునుండి శిష్యత్వమే దిక్కు......వదలకయ్యగురువు33

ఆదిశంకరార్యు డార్షధర్మంబును
కలియుగాన నిల్పె కరుణతోడ
వారివారసుండె వసుధ సద్గురువయ్యె........వదలకయ్యగురువు34

మౌనముద్ర నుండు మహితతేజోరాశి
అత్రిసూతి పరమహంసయైన
దత్త వారసుండు ధన్యుండు గురువురా....వదలకయ్యగురువు35

లౌకికంబు పారలౌకికంబనురెండు
పద్ధతుల గురువులు బరగుచుంద్రు
పారలౌకికమున పరమాత్ముడొక్కడే......వదలకయ్యగురువు36

బ్రహ్మ విష్ణు భవులు బాహ్యరూపములందు
వేరుగ కనిపించు వేరుగాదు
వీరి శక్తులెల్ల తేరిచూడ గురువె.......వదలకయ్యగురువు37.

ప్రకృతి లోన నిశిత పరిశీలనంబున
జీవుల గతులెల్ల చిత్రమగును
వాని జీవనవిధి వరలె గురువుగాను......వదలకయ్యగురువు38

చీమమోయు బరువు సీమనేదాటుచు
రెండుపదుల రెట్లు మెండు శక్తి
అదియె మనకు నెప్పుడాదర్శమౌనుగా.....వదలకయ్యగురువు39

తేనెటీగ పొదుపు తీయనౌ మదుపును
శ్రమయు త్యాగగుణము సంఘటితము
వర్తనాన జూపి వరలెను గురువుగా.........వదలకయ్యగురువు40

వదలనట్టిపట్టు పనివడినేర్పును
నుర్విలోనజీవి ఉడుమనంగ
కార్యసాధనకది ఘనమైనగురువుగా...వదలకయ్యగురువు41*

నంది పట్టుదలను నైతికవిల్వలన్
ఈశుతత్త్వము పరమేశు కరుణ
గుర్తుజేయు మనకు గురువుగా సతతంబు....వదలకయ్యగురువు42

రామసేతు వపుడు రాముని సేవకై
నలుడు కట్టె నాడు నయముగాను
కార్యశూరుడౌచు కనిపించు గురువుగా.....వదలకయ్యగురువు43

సాలెపురుగు స్వీయ శ్రమనంత కరిద్రుంచ
మరల నల్లె భవుని శిరముపైన 
పట్టుదలను నేర్పి పనివడి గురువాయె.....వదలకయ్యగురువు44.

ఎదుగుదలను జాటు నెత్తైనశిఖరంబు
గురుపదంబునందు గుణమునందు
సద్గుణనిధి సారసాక్షుని రూపమే......      వదకయ్య గురువు45*

కరము నుండి నాగు శిరమును దూరంగ
భవుని కొఱకు దాని బలిగనిచ్చె
భక్తితత్త్వమునను భాసిలె గురువుగా.....వదలకయ్యగురువు46

వృక్ష జాతి మనకు వేవేల రీతుల
పాఠములను జెప్పె పచ్చి నిజము
గురువు స్ధానమందు గొప్పగనిల్చెగా ......వదలకయ్యగురువు47

సర్వజీవులకును శ్వాసకు మూలమై 
ప్రాణవాయువు నిడు వసుమతిజము
యోగగురువు పగిది నుత్సాహమింపార....వదలకయ్యగురువు48*

కడలి యలల జూచి కార్యశూరత్వంబు
నేర్వవలయు సతము నిష్ఠతోడ
నాచరించి చూపు నార్యుండె గురువగు....వదలకయ్యగురువు49

గునపములను దింపు క్రూరాత్ముకైనను
పరమకరుణతోడ ఫలితమిచ్చు
పుడమి గురువనంగ మోదంబుగల్గదా....వదలకయ్యగురువు50*

పాత్ర ననుసరించి పరిణామముంజెందు
లౌకికంబు జూపు లక్షణంబు
నేర్పె,  జలము మనకు నిర్మల గురువౌను....వదలకయ్యగురువు51

అగ్ని శక్తిజూడ నసమానమై తోచు
జలధిని బడబాగ్ని కలచివైచు
కానరాని ప్రతిభ గౌరవ గురువుదే....          వదలకయ్యగురువు52

గాలి వలన సతము క్రమమైనరీతిగా
ప్రాణి యనుభవించి బ్రతుకుచుండు
శ్వాసజీవమైన  చక్కని గురువయ్యె........  వదలకయ్యగురువు53

నభము శూన్యమైన నక్షత్రదీప్తంబు
సర్వముండి తాను గర్వపడదు
జ్ఞానధనుడు సతము గౌరవ గురువౌను.....వదలకయ్యగురువు54

ఎదుటనున్న గాని ఎదుట లేకనుగాని
జ్ఞానమిచ్చువాడు ఘనగురుండు
ఉత్తముండు ధర మహోన్నతుండు కనగ.....వదలకయ్యగురువు55

ఏకలవ్యు డొకడహీన సమాసక్తి
శస్త్రవిద్య నేర్చె స్వయముగాను
మనసునందె ద్రోణు మరిమరి పూజించి.....వదలకయ్యగురువు56

గురువు గొప్పదనము కులమందు లేదురా
శిష్యహృదయసీమ చేర; పొందు
కులము మతములన్ని గొప్పకు మాత్రమే....వదలకయ్యగురువు57

తండ్రి తనయుగోరు తనుమించు వానిగా
గురువు శిష్యు గోరు గొప్పగాను
స్వార్థ బుద్ధిలేని సౌమనస్యుడతండు..........వదలకయ్యగురువు58

ముక్తిగోరు నరుడు ముందు సద్గువును 
నెంచుకొనగవలయు నిచ్ఛతోడ
ఆత్మతత్త్వమంత నాతడే చూపురా.........వదలకయ్యగురువు59

గురునిచెంత నేర్వ గొప్ప విద్యేయగు
గురువు లేని విద్య గ్రుడ్డివిద్య
జీవితాన గురువు శ్రీరామ రక్షరా...........వదలకయ్యగురువు60*

అక్షరంబునేర్ప శిక్షణాలయమందు
కఠినమైనగుణము కనగజేయు
గురువు మనసునందు కోపంబు నటనరా....వదలకయ్యగురువు61

అక్షరాలలోని అంతరార్ధములన్ని
విప్పిచెప్పు గురువు  వేదవేత్త
శిష్యవత్సలుండు శ్రేయోభిలాషిరా......     వదలకయ్యగురువు62

లక్షలెన్ని యిచ్చి లౌక్యంబుజూపినా
గురుని కరుణ నీకు కుదురబోదు
భక్తి భావమొకటె భవ్యమంత్రమ్మురా........వదలకయ్యగురువు63

శిష్యవత్సలునిగ క్షేమంకరునిగాగ
మార్గదర్శకత్వ మౌనియనగ
భిన్న వేషధారి భేషైన నటుడురా...........వదలకయ్యగురువు64

మైనమట్లు కరగి మమత సమతలంచు 
కరుణనింపుకొన్న కాంతిరేఖ
దివ్య సాధుభావ దీప్తుండు గురువురా...........వదలకయ్యగురువు65

చిత్తమందు ప్రేమ చిగురించు రీతిగా
విత్తనంబునాటు విబుధుడైన 
కర్షకుండు గురువు హర్షాంతరంగుండు.......వదలకయ్యగురువు66

చేతి వ్రాత మరియు చిత్తంబుమార్చుచు
చిన్ని గుండె లందు చిగురుదొడుగ
జ్ఞానభిక్ష నిడెడు సౌమ్యుండు గురువురా........వదలకయ్యగురువు67

భావిజీవితంబు బంగరుబాటగా
చూడవలదటంచు సూక్తులిడుచు
ముందుచూపు నేర్పు మునిరూపు గురువురా....వదలకయ్యగురువు68

కాలచక్రమందు కరిగినక్షణములు
రావురావటంచు రక్తిదనర
శక్తి కొలదిజెప్పు శాస్తయె గురువురా........వదలకయ్యగురువు69

మహిత లక్ష్యములనె మరిమరి కోరుచు
కలలు గనుచు నీవు కాంచుమనుచు
లక్ష్యసిద్ధిజూపు లౌక్యండు గురువురా........వదలకయ్యగురువు70*

ఈసడించి పలికి యిందీవరాక్షుండు
గురుని శాపమొందె ఘోరముగను
కన్నుగానకెపుడు కలహింపబోకురా......వదలకయ్యగురువు71

గురుని మోసగించి కుపితుని జేయకు
కర్ణుడట్లుజేసి కఠినశాప
మందె; విద్యమరచి యవమానితుండయ్యె.......వదలకయ్యగురువు72

అర్జునుండు పొందె నద్వితీయపుటస్త్ర
విద్యలన్ని భక్తి వినయగరిమ
గురువుద్రోణుమదిని  కోర్కెల దీర్చెను....వదలకయ్యగురువు73

కన్నవారికన్న మిన్నగా జూచును
మనసునిండ ప్రేమ మమతపండ
విశ్వమెల్ల గెల్చు విద్యనేర్పు గురుండు.......వదలకయ్యగురువు74

పారితోషికంబు పనిలేదు నాకని 
పట్టుదలకె గురువు పరవశించి
అక్షరంబు నేర్పు నల్పసంతోషిరా.......వదలకయ్యగురువు75

పాఠములనెకాక పరిపరి విధముల 
అనుభవాలసార మందజేయు
సాంద్రయశుడు గురుడు సాగిలిమ్రొక్కుమా ..వదలకయ్యగురువు76

కష్టమన్న జాలు కరుణాంతరంగుడై
పేదవారికెపుడు పెన్నిధియగు
సంఘసేవకుండు సాక్షాత్తు గురువురా.......వదలకయ్యగురువు77

బ్రహ్మ పగిది నూత్న పథమును సృష్టించు
విష్ణువు వలె దాని విపులపరచు
శివునిరీతి దొసగు చిదుముచుండు గురువు..వదలకయ్యగురువు78

చిక్కుప్రశ్నలెన్ని చిన్నారి వేసినన్
తృప్తిపరచు మదికి తీయగాను
జ్ఞాని ప్రశ్నవేయ జ్ఞానియై వర్తించు........వదలకయ్యగురువు79

విద్య నేర్పు ననువు వేర్వేరు విధముల
పాఠశాల గదిని వాడుకొనెడి
సున్నితత్త్వమున్నశోధకుడుగురువు.....వదలకయ్యగురువు80.*

పాదరసము వంటి ప్రతిభను సతతంబు
దాచుకొనక గురువు తపసివోలె
ప్రేమనంత పంచు ప్రియశిష్యపాళికే.........వదలకయ్యగురువు81

శిష్యగణము గలసి శ్రీగురుభక్తిమై
సర్వెపల్లిరథము సంతసాన
లాగి పరవశించె యోగంబుతమదిగా......వదలకయ్యగురువు82

కాళికాంబపాద కమలార్చనావిధిన్
రామకృష్ణ గురుడు రహినివెలిగి
నవ్యతేజమిడెను భవ్యనరేంద్రకున్...........వదలకయ్యగురువు83

రాగదూరుడైన రామకృష్ణునిజూచి
పిచ్చి వాడెయనిరి పచ్చిగాను
పరమహంసగురువు భావివిజ్ఞానిరా..........వదలకయ్యగురువు84

పుణ్యజలముజేయు బురదనీటినిగూడ
చిల్లగింజదాని చెడునువిరచి
అట్టితత్త్వమెప్పుడాచార్యునకునుండు.........వదలకయ్యగురువు85

కల్మషంబులున్న కటికనీటినిగూడ
పటిక మార్చివేయు స్వచ్ఛముగను
పటికవంటివాడె పరమ గురుండురా!.............వదలకయ్యగురువు86

చిత్తమెపుడు తనదు శిష్యునిపైనుంచి
తలచిన వెనువెంట పలుకువాడు
తలపు తలపునందు తానైనతండ్రిరా...........వదలకయ్యగురువు87

శిష్యుడెప్పుడైన చీకాకుజెందుచు
గురుని నిందసేయు గుఱ్ఱుగాను
కనలిన తన శిష్యు కౌగిలిజేర్చురా..................వదలకయ్యగురువు88

ఇనుమువంటిశిష్యు డెక్కడున్ననుగాని
కర్షణంబుజేసి కౌగిలించు
శుద్ధసత్త్వగురువు సూదంటురాయిరా..............వదలకయ్యగురువు89

డాంబికంబులేదు డాబునులేదులే
ధిషణ యొక్కటున్న తృప్తిపడును
ధిషణగల్గు గురువు దీపస్వరూపుండు.............వదలకయ్యగురువు90*

శ్రుతియె మహిత గురుడు శుద్ధ సంస్కృతి నిల్ప
భరతదేశమందు పండితులకు
పరమపూజ్యమదియె పాటించు జ్ఞానివై..వదలకయ్యగురువు91

గ్రహ సమూహమునకు రవియె రాజైనట్లు
కాలగతిని శిష్యగణమునకును 
క్రాంతిదాత గురుడు ఘనమైనశక్తిరా...వదలకయ్యగురువు92  

బుద్ధి గురువు పగిది పుట్టించుయోచనల్
మనసు దానిత్రోవ మసలుకొనును
ఆత్మశుద్ధి గల్గు నయ్యదె గొప్పదౌ......వదలకయ్యగురువు93

ఆర్ధశాస్త్ర నిపుణుడాత్మీయ గురువైన
శ్రీలుగురిసి మురియు శిష్యులెల్ల
కామధేనువింట కాలూనినట్లెగా..........వదలకయ్యగురువు94

మూడుకన్నులున్న ముక్కంటి కాదులే
నాల్గుమోములున్న నలువకాదు
వేయిశిరములున్న విష్ణుతల్పంబురా....వదలకయ్యగురువు95

కావ్యపరిమళాలు కమ్మగవీచినన్
రససమన్వయంబు రక్తిగొన్న
ఖ్యాతిదెచ్చుదాని కావ్యాత్మ గురువుగా..వదలకయ్యగురువు96

పాలునీరు వేరుపరచంగ శక్తిని
హంస కలిగియుండు నవనియందు
మరలనట్టి ప్రతిభ గురునకే కలదోయి.....వదలకయ్యగురువు97

కలిమహత్తుచేత మలినమ్ము గాకుండ 
ప్రజలగాచుచుండు  పరమ గురువు
పూజ్యపాదుడతడు పుణ్యాలరాశిరా....వదలకయ్యగురువు98

శోకసంద్రమందు సోలినశిష్యుల
గుండెధైర్యమింత  కూడగట్టు
కోటగోడపగిది గురువు రక్షణనిచ్చు.. వదలకయ్యగురువు99

సహనగుణముజూడ సరితూగు గురువుగ
ధర్మజుండు దాని తప్పలేదు
కష్టమెంతయైన కౌరవసభలోన....వదలకయ్యగురువు100*

కన్నుదోయి లోని కమనీయమైనట్టి
కాంతిరేఖ గురువు కనగనిజము
కాంతిలేని కనులు  కడుదుర్భరంబురా........ వదలకయ్య గురువు.101

కన్నులెఱ్ఱజేసి క్రౌర్యంబుజూపుచు
ఆ "కరోన" మనల నావహింప
వైద్యులెల్లమనకు వరదాయిగురువులే............వదలకయ్యగురువు102

అంతరిక్షశాస్త్రమాపోశనముబట్టి
రాష్ట్రపతిగజేసి రాణకెక్కె
అమరగురుడు ప్రియతమాబ్దుల్కలాముండు..వదలకయ్యగురువు103

నీ కుశాగ్రబుద్ధి నిర్మలాత్మ నియతి
గురుకటాక్ష భిక్ష మరువబోకు
జన్మజన్మలకును జాగృతి గురువురా............వదలకయ్యగురువు104

మోక్ష సాధనకిల సాక్షియే గురువయి
నీదు మతిని నిల్పు నిశ్చలగతి
నీకె నిన్నుజూపి నివ్వెరపరచురా...............వదలకయ్యగురువు105

నూరు మార్గములను తీరుగ జూపించు
దివ్యతేజకలిత భవ్యగురువు
నవ్యభావయుతుడు నవనవోన్మేషుండు........వదలకయ్యగురువు106

కన్నుదోయి కరుణ కలిగియుండెడువాడు
గుండెనిండ ప్రేమ కురియువాడు
స్వార్ధరహితజీవి స్వాభిమానుండురా..........వదలకయ్యగురువు107

నీదుగుండెగుడిని నిర్మలాత్ముగురువు
నీరజాక్షుపగిది నిల్పుకొనుము
సద్యశంబు సిరులు సౌఖ్యాలుదక్కులే...........వదలకయ్యగురువు108

ఆర్యభట్టు భారతావనియందున
శూన్యమునకు తగిన మాన్యతనిడి
విశ్వమందువెల్గె విఖ్యాత గురువుగా............వదలకయ్య గురువు.109

కంప్యుటరున ముఖ్య గణనంపుకేంద్రమై
శూన్యమొకటి వెల్గె సుందరముగ
అది గురువయి  దానికంతరాత్మగమారె......వదలకయ్య గురువు110

వివిధ దేశములకు విజ్ఞానదాతలౌ
జ్ఞానవిదులగన్న కర్మభూమి
నాటిగొప్పగురువు నాగార్జునుండెగా........    వదలకయ్య గురువు 111

రామునంతవాని రఘుకులశూరుగ
కనగజేసె నాడు కౌశికుండు
గుట్టుమట్లు తెల్పు గురుదేవుడాతండె........  వదలకయ్య గురువు 112

విక్రమార్క సభను విఖ్యాతి జెందిన
సుందరోపమాన సుకృతి యైన
కాళిదాసు మనకు కవికులగురువురా.........  వదలకయ్య గురువు 11౩

అంకెలాకసమున నసమాన చంద్రుడై
అవని వెల్గిన గణితావధాని
సకలజగతి గురుడు సంజీవరాయడే.......     వదలకయ్యగురువు 114
(లక్కోజు సంజీవరాయశర్మ.పుట్టంధుడు. కడప జిల్లా కల్లూరు.22.11. 1907.. 2.12.1997. ప్రపంచంలో 6 వేల గణితావధానాలు చేసిన 
ఏకైక వ్యక్తి.) 

బ్రహ్మగుప్తనామ భారతీయగణిత
శాస్త్రవేత్త మనకు సద్గురుండు
" పెల్"సమీకరణము పేర కీర్తి బడసె.....      వదలకయ్యగురువు.115
(గణితశాస్త్రంలో సమీకరణ సాధన..డయోఫాంటైన్ సమీకరణాలలో ఒక ప్రత్యేకమైన తరగతి. బ్రహ్మగుప్తుడు సా.శ.628.సమాస పద్ధతిని సాధించాడు.

చక్రవాళ మనెడు చక్కని పద్ధతిన్
గణితమందు జూపె ఘనుడు భాస్క
రుండు సారతర గురుండమల యశుండు..  వదలకయ్యగురువు116.
(భాస్కరాచార్యుడు.సా.శ.1150.చక్రవాళ పద్ధతిని సూచించారు.
ఆధునికకాలంలో  ఈ సమీకరణాల సాధనకు "సతతభిన్నవాదము"ను
వాడుతారు.)

బేతవోలు గురుని ప్రియతమ సూచనన్
ఆటవెలది పాదమందుకొనుచు
శతకమల్లినాను శక్త్యనుసారంబు............ వదలలేదు గురువు .117

అంకితంబు శతకమాచార్యవర్యుకున్
పాదపూజ ప్రథిత పండితునకు
నర్పణంబు మదిని ఆత్మీయగురువుకున్....వదలలేదు గురువు118.







12, సెప్టెంబర్ 2024, గురువారం

అన్యోన్యానురాగం

అన్యోన్యానురాగం 

వాసము పల్లెటూరు పరివారమొ కండును లేని యింటిలో 

మా ; సములెవ్వరంచు పరమాత్ముని నమ్మిన వృద్ధ దంపతుల్ 

గ్రాసము స్వీయ సత్కృషిగ గౌరవ మొప్ప కృషీవలత్వమున్ 

వాసి గలట్టి రీతి' ప్రియ వారణ శీర్షుని పర్వమందునఁన్ ... 

దాసిగ మారి నే పలు విధంబులఁ తీయని వంటకంబులన్ 

గాసులకోర్చి జేసితిని కమ్మని ప్రేమ ప్రపూర్ణ తత్త్వమున్ 

జేసితి నేతి  గారెలను చిన్మయ రూపు  నివేదనార్ధమై 

దోసిలిబట్టు మామ! కడు \తోషణ మందగ తిందువంచనెన్...

బోసిముఖంపు నవ్వులను పూర్తిగ నిండిన పంక హస్తముల్ 

భాసిలఁ జూప భార్య నిజ ప్రాణముగా తినిపించ నాతఁడున్ 

పూసెను రెండు చేతులను బుగ్గలపై తన నిండు ప్రేమతోన్ 

రాసులుగాగ పున్నెమనురాగము పొంగును జీవితమ్ములన్ ... 

హాసము నిత్య సౌఖ్యమయి హాయిని గూర్చును జన్మ జన్మలన్ 

భో! సఖులార! పంచుడిక మోహన రాగ విశేష సంపదల్ 

నాసిరకంపు యోచనలు నైతిక విల్వ ల ద్రుంచివేయు .. స 

న్యాసము కన్నసంసరణ న్యాయముగా సుఖ సాధకంబగున్   

 

 

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...