10, ఏప్రిల్ 2020, శుక్రవారం

భారతీయ ఆధ్యాత్మిక శక్తి....స్పందన

                   భారతీయ ఆధ్యాత్మిక శక్తి.
     సీ: ఆధ్యాత్మ సాధనన్నాత్మ విశ్వాసాన
                   మునులకు గల్గెగా మూడుకనులు
          భారతీయతలోని పావిత్ర్యముంజేసి
                   గ్రహమండలంబనుగ్రహము జూపు
         యోగసిద్ధినిబొంది యోగాగ్నిలో గాలి
                    యోగులై తపియించు త్యాగులున్న
          సద్యోగ నిష్ఠచే శక్తులసాధించి
                     ప్రార్ధించిగగనాన పయనమైన
         సద్భక్తి విజ్ఞాన శారదా సత్కృపన్
                      పదునాల్గు లోకాల పాదమిడిన
          పుణ్యకర్ముల చెంత పుట్టవే వైరసుల్
                          పుట్టిన వెంటనే గిట్టునయ్య
          ఈ " కరోనా" వంటి వెన్నైన వైరసుల్
                         మనధ్యాన శక్తిచే మట్టిగలియు
          దైవయోగంబుగా ధ్యాన మబ్బు కతన
                         దుర్నిరీక్ష్యముగాదె దుష్టులకును
  తే.గీ: పరమపావిత్ర్య స్థలమిది భరతభూమి
           నమ్మి చెడిపోయి దుఃఖించు నరుడులేడు
          ఆత్మ విశ్వాసమొక్కటె యాయుధమ్ము
          దాని వలననె సర్వంబు తరలివచ్చు.

7, ఏప్రిల్ 2020, మంగళవారం

రామాయణ మహామాలా ..స్పందన

                రామాయణ మహామాలా స్పందన.
 
     కం. గణపతి యనంతకృష్ణుడు   

                               గుణయుత పట్వర్ధనుండు గురువులుకాగా 

                               గుణముల ప్రోవౌ రామా                                     

           యణ ఘట్టమొకటి రచింప హ్లాదముగాదే! 

      ఉ:వ్రాసితి యుద్ధ కాండమున వాలిసునందను రాయబారిగా

          జేసి రఘూత్తముండలఘు శ్రేయముగోరుచు రావణాధిపున్    

         భూసుతజానకిన్ సుగుణపూత చరిత్రనుబంపుమన్న,నా

         వాసిగలట్టి ఘట్టమును వైనముగా నవ పద్యసంఖ్య గా.

5, ఏప్రిల్ 2020, ఆదివారం

స్పందన .. ఆశా ఫలం

           ఆశా ఫలం  .    స్పందన .. ఆశా ఫలం
సీ . పావని యాశయే పరమార్ధమై నిల్చి
                  జానకి రోదించు  స్థానమరసె
   రాముని యాశయే రావణు వధియించి
                 రమణి సీతను జేర రహిని నొప్పె
 ఆ జటాయువు పక్షి యాశయే సఫలమై
                 వార్తను నందించి వాసిగాంచె
సన్మునివర్యుల సాధు పుంగవులందు
                 కలిగిన యాశయే కన్నుగవకు
తే. గీ . పండు వెన్నెల లగుచును పరమ ధర్మ
         మర్మమెల్లను రాముని మార్గమయ్యె
         జగతి జీవులు సంబర చకితులగుచు
        జన్మ సార్థక్యమందిరి చక్కగాను

   పద్యాలతోరణం...24.05.2920. పై చిత్రానికి.(రాధాకృష్ణులు)
     నా పూరణ: పొన్నెకంటి.

   ఉ: ఓమహనీయ!నీదు సుమనోహర రూపము,వాగ్విలాసముల్
        ప్రేమదలిర్పజేయుటలు,పెన్నిధివై దరిజేర్చు నెయ్యముల్,
        కోమలమందహాసములు, కూరిమిబెంచెడి వేణునాదముల్,
        నామది దోచివేసినవి నవ్యకళావిభవా!రమాధవా!

 మ:యమునాతీరవిహారమందు సుమనోహ్లాదంబుగా నిత్యమున్
      సమయంబెల్లనుబుచ్చవచ్చునని విశ్వాసంబునంబిల్చుచున్
      కమలాక్షా!యిటు మోసమేలనుచు నక్కాంతామణీరాధయే
      కుమిలెంగృష్ణునిజేయితాకగనె సంక్షోభిల్లెఖేదమ్మునన్.
   
 చం:కలుములరేడ!నిన్గనగ కౌగలిజేరగ మానసంబునన్
       తలపులు రేగుచుండుగద తాపసయోగిగణాలకైననున్
       వలపులురేపి రాధనిటు వంతలుబెట్టగ నీకుబాడియే?
       కిలకిలనవ్వుచున్ సరస కేళిని దేల్చగరార !మోహనా!

      వరదలో కుట్టుమిషను కొనిపోవు తాతపై పద్యం.

    వరదుని నమ్మికూర్చొనక వాంఛిత కార్యముపూర్తిజేయగన్
    వరదలలోన సైతమటు వైనము కుత్తుకబంటి నీటిలో
    చరచర కుట్టుయంత్రమును సాహసివై భుజపీఠి మోయుచున్
    బరబర సాగుచున్న విసువాసముగల్గిన తాత! మ్రొక్కెదన్.

 స్వాతంత్య్ర మెక్కడ?

       సీ॥ స్వాతంత్ర్య మెక్కడ? చచ్చెను గూండాల
                      దౌర్జన్య చేష్టల దర్పమందు
      స్వేచ్ఛాదు లెయ్యెడ? చితికిపోయెనుగదా
                       శ్రీమదోన్మత్తుల చేష్టలందు
      మంచితనంబేడ? మాయమయ్యెంగదా
                       నరరూపమృగముల నటనలందు
      సప్తతి వర్షాలు చక్కగ నిండిన
                        మార్పుసుంతయు లేదు మనుజులందు
      భరత జాతికి పట్టిన దురిత తతిని
      ద్రోహచింతన గల్గిన దుర్వినీత
      కూళసంఘంబులనుమార్చి కూర్చ శాంతి
      మరల రావయ్య తాతయ్య మాన్యచరిత!
స్పందన: ఆషాఢ మాసం నవదంపతులు. 
వచ్చె నాషాఢమాసంబు వగలుజూపి
ప్రేమవిలువలు దెలియని పిచ్చికోతి
క్రొత్తకాపురమందున గుబులుబెంచ
మాసమంతయు కేవలమూసులేను. 

స్పందన: రావణునకు మారీచుని బోధ.
  వినుము లంకేశ! రాముని వింటిశరము
 వెంటనంటును నసువులు వీడువరకు
 సీత చెఱపట్టు యోచన చేటుదెచ్చు
 మానిన దురూహ నికనైన మనగగలము.

  స్పందన: విద్యార్థి...విద్యార్తికి...భేదము.
  గురువు పట్టుల ప్రేమయు గుఱినిగల్గి
  యార్తి విద్యయందున్న విద్యార్తియగును
  తాను విద్యయే కోర విద్యార్థియగును
  యశమునందు విద్యార్తి, విద్యార్ధికన్న.





   
    

4, ఏప్రిల్ 2020, శనివారం

స్పందన. స్వీకార్..కరోనా...

  (స్వీకార్ ) కరో"నా"భావన.
  సీ: కరచాలనంబులు కౌగిటి బంధముల్
                       స్థావరంబుగ నేను సంచరింతు
       పాదాలు గడుగని పరమపాపిష్టుల
                       పాదపంకమె నా పట్టుగొమ్మ
       శుచియు శుభ్రతలెల్ల సోదిగా భావించు
                      మానవాధముడెపో నాకుహితుడు
        ఎంత నేర్చినగాని నేమాచరించని
                       మూర్ఖతముడె నాకు ముద్దుగూర్చు
 తే.గీ: భారతాచార సంపన్న భవ్యగుణుల
          వసుధ ననుగెల్వ జూచెడు వైద్య తతిని
          ఉద్యమించెడు సాహస పద్యకవుల
         శత్రుగణముగ భావింతు సంతతంబు.
 సీ: వందనంబదె మందు వదలిపోవగ నేను
                            చేసి బ్రతుకుడో విశిష్టులార!
       దూరమై మెలగుటె తొలగింపగా నన్ను
                      ఆచరింపుడిపుడె యార్యులార!
        ఆచార సంపద లంతంబు నన్జేయు
                     సంస్కృతి నమ్ముడో సరసులార!
        వంటింటి దినుసులె వైద్యంబు నాకగు
                       పాటించి చూపుడో  ప్రాజ్ఞులార!
  తే.గీ: శిక్షణాత్మక సద్ధర్మ శీలురగుచు
           నిర్మలంబైన మనముల నిష్టతోడ
           జీవనంబులు గడిపెడు త్రోవనున్న
           మిమ్ము జేరగ నాకడ దమ్ములేదు..

27, మార్చి 2020, శుక్రవారం

(కరోన) కొఱగాని మమతలు...స్పందన.

               కొఱగాని మమతలేల?
1. పలకరింపులె యీనాడు బంధు తతిని
    పులకరింపగ జేయు సమ్మోదమలర
    బలము ధైర్యంబు చేకూర్చి భద్రమిమ్ము
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
2. స్నేహమున్నను నేగ నిషిద్ధమాయె
    ఇంటి గడపను ద్రొక్కగ నేమిముప్పొ? 
    దూరముననుండి క్షేమంబు గోరుమయ్య!
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
3. సెల్లు వాడుదు రింటింట చిన్న పెద్ద
    సొల్లు వాగుడు వాగక సున్నితముగ
    తాత బామ్మల క్షేమాల తరచి యడుగు
   సమయమునకిల కొఱగాని మమతలేల? 
4. రక్త సంబంధమున్నట్టి వ్యక్తులెపుడు
    బాధ్యతాయుత బంధాల వఱలవలయు
    వారి జన్మలె ధన్యంబు వసుధయందు
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
5. ఉత్తరంబులు వ్రాసెడి యూసులేదు
    సెల్లువాడుచు సరదాగ బిల్లుగట్ట
    వాడుకయ్యెను నద్దాని వాడుకొనుమ
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
6. ప్రేమ చూపించి నేర్పించు పిల్లలకును
    ఆవు వెంటనె నడచునా యనుగుదూడ
    సంఘ జీవిగ నీవిచ్చు సంపదదియె
   సమయమునకిల కొఱగాని మమతలేల? 
7. మ్రొక్కుబడికైన వృద్ధుల మ్రొక్కుమయ్య
    మునులు నేర్పిన  సద్ధర్మ పుణ్యకర్మ
    నేటి యీ "కరోన"కు మందేనాటికైన.
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
8. ప్రేమ లేకున్న జీవులు ప్రేతలగగును
    మమత సమతలె ప్రాణికి మధురస్మృతులు
    బ్రతికియున్నంత కాలము ప్రమదమిడుమ
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
9. ముచ్చటైనట్టి ప్రాణంబు బుద్బుదంబు
    బుడగ పగిలిన పిమ్మట పుడమిగలియు
    ప్రేమ పంచుచు పెంచుచు సేమమఱయు
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
10. మనిషి జన్మంబు దుర్లభ మనగ నెఱుగు
      మెన్ని జన్మల పుణ్యమో యేమొగాని 
      సార్ధకంబుగ జీవించు సారయశుడ! 

   


   

17, మార్చి 2020, మంగళవారం

సుమాకాంక్ష

ఉ: చిత్రముదీయు పెట్టెగొని చేరితినాదగు చిన్నితోటకున్
     పత్రములన్ని యూగుచును పచ్చదనంబున స్వచ్చభావనన్
     ఆత్రముజూపుచుంబిలచి హాయిగ మమ్ము ప్రభాతవేళలోన్
     నేత్రములెల్లపర్వముగ నేస్తమ!చిత్రముదీయుమంచనెన్.

ఉ: తక్కువ కాలమే మనగ ధాత రచించెను ఫాలమందునన్
     మక్కువమీర కొందరటు మాధవుపాదములందు జేర్చెగా
     ఎక్కువ మంది యింతులిల యెంతయు కర్కశభావప్రపూర్ణలై
     టక్కునద్రుంతురే కటకటా!మము దాచు త్వదీయపేటికన్.

ఉ: నేనటు నెహ్రు కోటుపయి నిత్యము నవ్వుచునున్నదాన, నే
     మానవుడైన నన్గనక మానడు మాన్యతనిచ్చుట సాజమేగదా!
     కాన మహాశయా!యిటకు క్రమ్మర వచ్చి వివేకశాలివై
     పూనుము తీయ చిత్రమనె ముందుగ నెర్రగులాబి బాలయే.

ఉ: పచ్చని వర్ణముంగలిగి పండుగశోభలగూర్చుచుందునే
     ముచ్చటదీర నందరిసి మోదమునందెదరెందరెందరో
    సచ్చరితా!ననుం గడు విశాల మనంబున బొమ్మదీయవే
    మచ్చరమంద, సాటి కుసుమంబనె పచ్చ గులాబిబాలయే.

తే.గీ: నెమలి పింఛము మించిన నెనరు గల్గు
        చిత్రశోభిత  చిత్రంపు చిన్నిమొక్క
        పిల్చె తీయగ చిత్రంబు ప్రేమమీర
        బంధనమ్మును జేసితి భద్రముగను.

  కం: కనకాంరంబునేనని
        వినయంబుగ బల్కి యడిగె విశ్వాసంబున్
        అనయము నవ్వుచునుండగ
        మననీయుమ నన్ను చిత్రమందున నొకచో.

 తే.గీ: బటనురోజాను నేనంచు భయమువీడి
         పలికె సుకుమార దరహాస ప్రభలువెలుగ
         శోభగూర్చెడు చిత్రంబు సూరివర్య!
         తీయుమెంతయు పుణ్యంపు తెరవు దొరకు.
     

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

డా. ప్రతాప దీక్షితులవారిపై స్పందన

శ్రీశ్రీశ్రీ ఆదిశంకర ప్రతిరూపులు డా॥ ప్రతాప దక్షిణామూర్తి దీక్షితుల
          వారి పాదపద్మములకు "అక్షర నీరాజనములు"
             
ఉ: సత్య శివాత్మకంబయిన చక్కనిమోమది స్ఫూర్తిమంతమై
      నిత్యము భారతీయ ఘన నిర్మల వేద సునాద మోదమై
      ప్రత్యణువందు మీ సరళ రమ్య సుశోభిత భాషణమ్ములే
      స్తుత్య పథమ్ములై వెలుగు"సుందరదీక్షిత వర్య"మేదినిన్.
చం: అడగిన నార్షసంపదను హైందవతత్త్వ వివేచనంబులన్
       నడచెడు శంకరార్యువలె నాణెముగా విశదీకరించుచున్
       పుడమిని జ్ఞానశూన్యుల సుబుద్ధి నిబద్ధులజేయు తేజమై
      యడుగులు వేయుచున్న పరమాత్మ!నమస్సులు స్వీకరింపుమా
ఉ: వేదము,విద్య,వైద్యములు విస్తృతరూపమునంద శక్తిమై
      పేదలు భాగ్యవంతులను భేదమొకించుకలేక విజ్ఞులై
      మోదమునందగా దగిన పూర్ణవికాస మనోజ్ఞ క్షేత్రముల్
      పాదుగజేసినారుగద!వందనముల్గొనుడార్య సద్గురూ!
ఉ: వేదమె యాత్మయై పరగ,పీల్చెడు వాయువు ధర్మరూపమై
      నాదవినోదియై సకల నైష్టిక జీవుల ప్రేరకంబుగా
      మోదమునందు మీ పరమపూజ్య విశేష విలాస దీధితుల్
     హ్లాదముగూర్చు సంతతము హాటకగర్భునిరాణి యంశజా!
చం: నడకనె శక్తి పీఠములు జ్ఞానవిరాజిత మోక్షగాములై
       తడయక నూటయెన్మిదిని దర్శనమందిన దీక్షితాగ్రణీ!
       కడు విభవంబు మీకమరె కన్నులపండువెయయ్యె నిండుగా
       తడిసితిరమ్మ సత్కృపను ధన్యులు మీరలు భక్తశేఖరా!
       ది.19.02.2020                      సభక్తి సమర్పణ:

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...