20, ఆగస్టు 2020, గురువారం

బాలు ఆరోగ్యం..20.8.2020

 బాలు ఆరోగ్యం కోలుకోవాలని కోరుతు...శార్దూలం.


     ఎన్నోపాటల బాడినాడు శ్రుతిలో నెంతెంతమాధుర్యమున్

     విన్నాణంబును జూపినాడు కళలో వేవేలదేశంబులన్

     అన్నా!కోవిడు కోరజిక్కె నిపుడీ యస్పీమహామాన్యుడే

     కన్నా!కావగరార వాని రయమున్ కారుణ్యభద్రాత్మకా!


     సంగీతంబది వృత్తిగా బ్రతుకుచున్ సాహిత్యముంగొల్చుచున్

     బంగారంబగు బాలసుభ్రమణికిన్ వైరస్సువ్యాపించె నో 

     మంగానాథ మహోదయా! శుభగుణా! మమ్మాదుకోరావయా

     శృంగంబందున నుండె కా చుమికనో శ్రీలొల్కు భద్రాత్మకా!

     

16, ఆగస్టు 2020, ఆదివారం

స్వాతంత్ర్య దినోత్సవం. 20.

 అందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

                           15.08.2021


       భరతమాతనుగూర్చి పాడంగ నాగొంతు

                                  గంభీరమైతోచి గర్వమగును

       భరతవీరుల త్యాగ వైభవంబులజాట

                         బులకించి నాగుండె మోదమగును

       భారతి గర్భాన ప్రభవించ నాజన్మ

                        తరియించె ననగను తలపులగును

       భారత సంస్కృతిం బరదేశములయందు 

                                  శ్రేష్ఠత జాటంగ నిష్ఠయగును

       అట్టి భరతాంబ శృంఖలల్ హర్షమొదవ

       తెగిన పుణ్యదినంబిది తేజమలర

       త్యాగధనులకు శిరమునతంబుజేసి

       జెండ పండుగ జరుపగ రండు రండు! 

       మూడు రంగుల జెండాకు మ్రొక్కుదాము

         తూలనాడెడు ద్రోహుల త్రొక్కుదాము

        నేను భారతీయుడనంచు నిక్కుదాము.

         అమ్మ భరతాంబ పూజించు హక్కుమనది.


6, ఆగస్టు 2020, గురువారం

దత్త విషయాలు-అయోధ్య రామయ్య.వగైరాలు.

                  దత్తవిషయము.. అయోధ్యరామయ్య..
         

   సీ.  కోదండరామయ్య కోర్కెలు దీరంగ
                              సంపదలిచ్చుచు సాకుగాత!
        కౌసల్యరామయ్య ఘనమైన కరుణచే
                        భక్తులహృదయాల వరలుగాత!
        జానకిరామయ్య జయరామ భద్రుడై
                          శ్రేష్ఠ విశ్వంభరన్  జేయుగాత!
        పట్టాభిరామయ్య ప్రభువుల డెందాల
                               నిర్మల భావాలనెరపుగాత!
            రామభక్తుల కలలన్ని రమ్యగరిమ
            సత్యమైయయోధ్యనగర సౌరుబెరుగ
            పుణ్యఫలముగ లభియించె భూమిపూజ
            చరిత మరువంగ లేనట్టి సమయమిదియ.

దత్తవిషయము...పుస్తకం.
               
             సీ: అక్షరంబులపూల హారంబదేమన్న
                  పురుషోత్తమునిజూపు పుస్తకంబు
            అజ్ఞానతిమిర సంహరణంబదేమన్న
                    ముద్దులొల్కెడురవి పుస్తకంబు
            గురువుల మించిన గురువెవ్వరన్నను
                     పూజితంబైనట్టి పుస్తకంబు
           మస్తకంబునకెప్డు మధురభోజనమన్న
                    పుష్టితుష్టినిగూర్చు పుస్తకంబు
           రత్నవైడూర్యాలు రాజ్యాలకన్నను
                      పూజితమ్మైనది పుస్తకంబు
           చిన్నల పెద్దల చింతదీర్చునదన్న
                       ముఖ్యంబు వారికి పుస్తకంబు
           చదువరి కైనను చక్రవర్తికి నైన
                       భూరితెల్వినినిచ్చు పుస్తకంబు
           "కోశముగలవాని కోవిదుడౌవాని
                    ముంగిట ముత్యంబు పుస్తకంబు
            హస్త భూషణ మైనది పుస్తకంబు
            పూర్ణ విజ్ఞాన సింథువు పుస్తకంబు
            మోదసమ్మోద భరితంబు పుస్తకంబు
            పుచ్చుకొన బాలసారెను పుస్తకంబు.

            వాణిపుత్రుడై నిరతంబు వరలగలడు.
            స్వర్గమేగిన సౌఖ్యంబె సాగుచుండు.
            పుణ్య మతులౌచు పొత్తాల పూజసల్పు
            వారికియ్యవె వేవేల వందనములు.

            అందరికి ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.
            పుస్తకంబు మనకు పూర్వపుణ్యఫలమ్ము
            హస్త మందు వెలిగి  యార్తిబాపు
            మేథకు పదనిచ్చు మేలైన మందురా
            జీవితమ్ము మార్చు చెలిమికాడు. 


            దత్తవిషయము.. గురువు..5.7.2020.
              
             సీ: నాతల్లి గర్భాన నన్నుంచ నాన్నయే
                       నాకు రూపమిడిన నలువ గురువు
              నవమాసములు మోసి భవబంధముల్గల్పి
                        యవనిని జూపిన యమ్మ గురువు
              తనరూపమంచును తాదాత్మ్యమొందుచు
                          నడతనేర్పినయట్టి నాన్న గురువు
              అజ్ఞానతిమిరాన విజ్ఞాన దీపమై
                          వెల్గులుపంచిన వేత్త గురువు
              ఛేదించినంగాని చిగురించి నవ్వెడు
                           వృక్షంబె నాకెప్డు పెద్ద గురువు
               కాలనిర్ణేతగా క్రమమైన మార్గమున్
                     రహిజూపి వెల్గెడు రవియు గురువు
               పంచమస్వరమున పలురాగముల్బాడు
                             కోయిల సైతము గురువు నాకు
               ఇదియది యననేల హృదిగల జీవాలు
                            సర్వంబు గురువులే శంకయేల?
                                     
               ఆ.వె:లఘువుల దరిజేర్చి లాలించి ప్రేమించి
               జ్ఞానభిక్షపెట్టు జగతి  గురువు
               ఆదిశంకరుండు హైందవజాతికి
               పరమగురువు సతము ప్రాంజలింతు.

దత్త విషయము... తోకముడిచిన చైనా...

        "ధోవలు"నీతికి "చైనా"
         త్రోవలు వెదుకంగజూచి తోకనుముడిచెన్
         పావన భారతభూమిని
         కావగ సింగంబులెన్నొ కాపుగనుంటన్.
పద్యము-మద్యము...

    పద్యపుసారమున్ సతము పానముజేసిన జ్ఞానవృద్ధియౌ
    మద్యముద్రావినన్ తెలివి మైకముగ్రమ్ముచు మందమైచనున్
    పద్యము హృద్యమై వెలుగ పండిత పామరులెల్ల మెత్తు రా
    మద్యము నాహహాయనెడు మందులు కొందరె చూడగానగున్
    పద్యము వ్రాసినన్ మరియు పాడిన మోదమునందురందరున్
    మద్యముద్రావినన్ తనకు మాత్రమె సౌఖ్యపు భ్రాంతిగల్గుగా
    పద్యము మానసాంబుధికి పర్వమె పూర్ణ శశాంక జ్యోత్స్నలన్
    మద్యము సర్వనాశకరమైచని దుర్భర దుఃఖహేతువౌ
    పద్యము మద్యముల్ నరుని బానిసజేయును సారముండుటన్
    మద్యము మాని పద్యరస మానుడు భావిసుఖంబులందగన్.

   బిరుదులపై మోజు.

 పండితులు మెచ్చి సత్సభన్ పండితునకు 
 ప్రేమ నిచ్చెడు నామంబు బిరుదమండ్రు.
 కవుల డెందాలు మురిపించు కవితలేని
 పిన్న కవులకు నేలొకో బిరుదుమోజు?.

వాల్మీకి గురించి....

  మరమర శబ్దమే పరమ మంత్రమువోలె విరాజమానమై
  చరచర మానసాంబుధిని చక్కని కోసలరాజవంశమే
  కరము విశేషభావముల కావ్యము రూపమునందె ఖ్యాతిమై 
  యరయగ రామనామమున కంకితమయ్యె మునీంద్రడాదటన్.
నేటి ప్రసారమాధ్యములు. 

వివిధములైన సంగతుల  విస్మయముంగలిగించు పత్రికల్
శ్రవణము దర్శనంబులను చక్కగగూర్చెడు యంత్రరాజముల్
నవరస గీతముల్వినగ నవ్య సుగీతప్రసారసాధనాల్
దివమును రాత్రులున్ నరుల దేహపుభాగముగాగ సెల్లులున్






29, జులై 2020, బుధవారం

రావి కొండలరావు. అక్షరాంజలి.

కీ.శే.రావి కొండలరావు గారికి..అక్షరాంజలి.
                              29.7.20.

 
      సీ: శ్రీకాకుళం బున చిఱుదివ్వెగా బుట్టి
                           వివిధ రంగములందు వెల్గులీనె
           నటుడును రచయితై నవరసంబులు పంచి
                      "నంది" బహుమతిని నందుకొనియె
          కథలను సృజియించి కళలపూర్ణుండౌచు
                                 ప్రజ్ఞను జూపించి పరిఢవిల్లె
          హాస్యరసంబును నలవోక చిలికించి
                       ప్రజలమన్నన బొందె ప్రాజ్ఞుడగుచు
   ఆ.వె: బహుముఖీనమైన పాండిత్య శోభచే
             చిత్రరంగమందు పాత్రలన్ని
             జీవముట్టిపడగ చిత్రించి చూపించు
             నమర రావి కక్షరాంజలిదియె.
             

4, జులై 2020, శనివారం

పర్యావరణ రక్షణ . మిద్దె తోట. వర్ణన..

     పర్యావరణ రక్షణ కో మొక్క నాటుదాం... శీర్షిక. 20.6.24.

సీ:
ప్రాణవాయువులీని ప్రగతికి తనువిచ్చి
            భద్రంబుగూర్చు నా పాదపాలు
మట్టిబుట్టిన చెట్లు మన సంపదకు మెట్లు
           కోట్ల కొలది నాటకుండుటెట్లు?
ఉద్యాన వనముల న్నుత్సాహమింపార
           నెలకొల్పుదామింక నెయ్యమలర
పర్యావరణ రక్ష పాలన కొఱకునై
           నాణెంపు మొక్కలు నాటుదాము
తే.గీ:
పారమార్థిక సౌభాగ్య ఫలములిచ్చి
జీవగఱ్ఱగ నున్నట్టి చెట్లు నాటి
తీర్చుకొందము ఋణమును తెలివితోడ
నడుగువేయుడు జనులార హర్షమొదవ.
సీ:
నీమది యెఱుగని నిర్మల త్యాగంబు
     వృక్షంబులెఱుగురా వెఱ్ఱి వాడ!
నీమది యెఱుగని నిర్మల రాగంబు
     చిగురు జొంపాలలో చిందుచుండు
నీమది యెఱుగని నిశ్చల ధీరత
       లాఘవంబుగ బ్రాకు లతలగలదు
నీమది యెఱుగని నిష్కామ కర్మమే
     ఉద్భిజంబులనుండె నున్నతముగ
తే.గీ:
జ్ఞానివైనట్టి మానవా! కల్పవృక్ష
రూపభేదాలె యియ్యవి లోకమందు
కూల్చబోకుమ దయమాలి క్రూరబుద్ధి
నాటి పోషింప కల్గును నవ్యశోభ.

మిద్దె తోట.

గృహపు శోభలనారోగ్య శ్రీలకొఱకు
పూలమొక్కలు కూరలు పొందికగను
సాగుజేసిరి పూర్వులు సాంద్రరీతి
అద్ది మిద్దెతోటయి నేడు ముద్దుగూర్చె.

సూర్యనారాయణాఖ్యుని సూనుడైన
అరుణ కిరణు వి శాల సాహాయమొసగ
మిద్దె తోటను బెంచెను మీరుప్రేమ
మిత్రబృందంబు సతతంబు మెచ్చుకొనగ.

హాని లేనట్టి యెరువుల నందుకొనుచు
ప్రాణికోటికి నాయువు పంచుచున్న
సతత హరితంపు వృక్షాల సాగుజేయ
సంఘ సేవకు మార్గమ్ము సజ్జనుండ!

శ్రీనివాసరావు స్థిరమైన చిత్తాన
మిద్దె తోట సిరుల మిత్రతతికి
పంచి పెంపుజేసి పరిఢవిల్లెను నేడు
దాని నందుకొనుచు తనిసె జనులు.

మిద్దెతోట వలన మించును సత్కీర్తి
మిద్దెతోట పెంచు మిత్రతతిని
మిద్దెతోట యిచ్చు మెరుగైన శాంతిని
కూర్చుమయ్యమీదు కోర్కెలలర!

ఫేసుబుక్కునందు ప్రియమార  వాట్సపు
గ్రూపులందు నీవు కుదురుకొనిన
పంచుకొనగ వీలు బహువిధ సందియాల్
తీరు సందియములు మారు స్థితులు. 

కొందరు వృక్షశాస్త్రమున కొందరు మేలగు జీవశాస్త్రమున్
కొందరు పృధ్విమూలముల కోరినరీతిని జెప్పువారలున్
కొందరు కీటకాంత విష కోణ సుమార్గ విచారశీలురున్
అందరు అందరే యిచట హాయిగ గూడిన శైరికాగ్రణుల్.

ప్రతిమిద్దె తోటయై భాసించి శ్వాసించ
                 ప్రాణవాయుస్థాయి పదిలమగును
ప్రతిమిద్దె తోటయై రంగుల హంగులై
                 హరివిల్లు తలదన్ని విరియవలయు
ప్రతిమిద్దె తోటయై భద్రాత్మకంబునై
                 ఆయురారోగ్యతల్ అమరవలయు
ప్రతిమిద్దె తోటయై పరదేశ దేశాల
                  భారతీయతలెల్ల పండవలయు
మాతృ దేశంపు కేతన మాన్యతలను
సతత హరితంపు విలువల సారతరము
మిద్దె తోటలె లక్ష్యమై మిన్నుముట్టి
భరత మాతకు జేజేలు పలుకవలెను
రవి శశిల పుట్టినరోజు 8.5.83..(22)
రవియు శశియును తమకాంతు లవనినింప
కవల లైపుట్టిరీపొన్నె కంటిలోన

                    వర్ణన: అకాలవర్షాలు..రైతుకష్టాలు. 

    దుక్కులు దున్నితిన్ మిగుల తుష్టిని గల్గిన విత్తనంబులన్
    మక్కువతోడవిత్త ప్రియ మాధురి మాదగు క్షేత్రమందునన్
    చక్కనిపంటపండినది శాపము వోలె నకాలవర్షముల్
    దుక్కులు దుక్కులైకురియ తోయజనాభుడ!దిక్కునీవెగా! 
    గాజులు సూత్రముల్ మరియు కంటెను బ్యాంకున నుంచినేర్పుగా
    సాజపు వడ్డితో రుణము చాలియు చాలకయున్న దెచ్చితిన్
    రాజనముల్ విశేషముగ రాలునటంచును నాశజెందితిన్
    భోజనదూరమై బ్రతుకు బూడిదజేసెనకాల వర్షమే.

    వేసవికాలపు వర్ణన...

    ఎండలుమండు కాలమున నెక్కడజూచిన పానశాలలే
    మెండుగ దర్శనంబిడును మేలు రసాల ఫలంబులెన్నియో
    దండిగ తాటిముంజలును తట్టలనిండుగ మల్లెపూవులున్
    పండుగశోభ గూర్చు నిల పల్లెలు పట్టణ మారుమూలలన్.

    

  

వర్ణన: గ్రీష్మంలో వర్షం...

గ్రీష్మతాపంబు పగలంత కీలలెగయ
కరుణజూచిన వరుణుడు కదలె భువికి
మెల్లమెల్లని చినుకులై చల్లగాలి
యుల్లమలరించె నాశ్చర్యమల్లుకొనగ..


వేసవి వరదలు. వర్ణన. 

వాయు కాలుష్యముంజేయ వచ్చె మొయిలు
క్రొత్తదౌ "నికో లింబసు" కూర్పుతోడ
పడగ జడివాన మారెగా వరదరీతి
వేసవైనను వరదలు వింతగాదు. 






    


3, జులై 2020, శుక్రవారం

మేరికపూడి..కల్నల్ స్మృత్యంజలులు.

మేరికపూడి సీతాపతిరావు నకు నా స్మృత్యంజలి.
        పొన్నెకంటి సూర్యనారాయణ రావు. 2.07.2020.

      భాషణమాడెనా సరసభావము చిప్పిలి బంధమైచనున్
      దూషణ జేయుచున్ పరులతూలడు మేరికపూడి నాముడున్
      వేషమునన్సదా పరమవిజ్ఞతజూపెడు నాదుమిత్రు నే
      దోషము కాటువేసినదొ దూరమెయాయెను శాశ్వతంబుగన్.
  సీ : సంస్కృత భారత సారంబుగ్రహియించి
                        పంచిపెట్టిన యట్టి పండితుండు
      ఆంగ్లభాషనగల యద్వితీయప్రభల్
                        భావాన్సు జర్నల్ను బాగచదివి
      ఆధ్యాత్మిక విషయికానందమందుచు
                     మాధుర్యధుర్యుడౌ మౌనియతడు
      మితభాషణంబున స్మితవదనంబునన్
                    చణుకులు విసిరెడు జాణయతడు
 ఆ.వె:మిగుల సన్నిహితుడు మేరికపూడి శు
         భచరితుండు పరమపావనుండు
         సుగతి జెందుగాత! సుశ్లోకునకునేను
         నంజలింతు సతము నంతరాత్మ.

కల్నల్ సంతోషబాబుకు బాష్పాంజలి.
 చైనా దుశ్చర్యలపై మన వీరసైనికులకు, జాతికి స్ఫూర్తితో
          పద్యాల సమర్పణ...17.06.2020.
             చోక్షము=సమర్ధము,పరిశుద్ధము, మనోజ్ఞము.తీక్ష్ణము

         సీ:  కల్నలు సంతోషు కనరాడు మనకింక
                            తారయై గగనాన జేరెనతడు
               శరభమై చెలరేగి చైనాను చీల్చిన
                       సంతోషునాత్మకు శాంతియగుత!
               సిగ్గునెగ్గునులేక చీవాట్లు దినుచున్న
                           చైనాను చెప్పుల చఱచవలయు
               వీరసైనికులార! లేరుమీ సరిసాటి
                          చూపుడో శౌర్యంబు చోక్షముగను
               శాంతంబె వీరమై  సహనంబె క్రోధమై
                          భరతవీరుల శక్తి పడగవిప్ప
               చైనాకు నిరతంబు స్వప్నంబునందున
                       ఫూత్కార శబ్దముల్మ్రోగవలయు
               భారతావనిముట్ట ప్రాణాంతకంబంచు
                        కలతనిదురనైన తలపవలయు
               అరివీర శిరముల నవలీల ద్రుంచిన
                        బోస్భగత్సింగుల  భూమిమనది
          ఆ.వె. ధైర్యసాహసాలు ధర్మ శాంతంబులు
                   భరతమాత సొత్తు తరచిచూడ
                   శాంతికాముకులను సమరానదింపిన
                   సర్వనాశనంబె శత్రువులకు.













 గీతాచార్యునిగా సుప్రసిద్ధులైన బాపుగారికి అస్రుతాంజలి   ఘటిస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను. బొమ్మలు చేసే బ్రహ్మ తను కొంత సేపు అపుడపుడు విశ్రాంతి తీసుకోవచ్చని రమ్మన్నాడో , లేక స్నేహ బంధం వలన ఒంటరిగా స్వర్గంలో తోచక రమణ గారు రమ్మన్నారో  మాటలు తక్కువ , చేతలెక్కువ కలవాడు కనుక ఎవరి మాట మన్నిన్చాడో  .
 మనకు విషాదం మిగిల్చి వారికి ఆనందం పంచారు.  31.08.14.న  (దివంగతులు )     .


26, జూన్ 2020, శుక్రవారం

చిత్రానికి స్పందన.(కృష్ణస్వామి.)

                   చిత్రానికి భావన.
   సీ.. భూదేవిస్పర్శ చే మోదమానసుడయి
                   ఆది వరాహరూపమరె నిచట.
          కౌమోదకీ గద ఘన సుదర్శనమది
                    పాంచజన్యంబులు పాణులమరె
          పాతాళమందలి పన్నగంబుల జంట
                     పాదమ్ములందున వరలె చూడ
          ఛత్రంబు శిరముపై చక్కగనుండెను
                      నెండతగులకుండ మెండుగాను.
   తే.గీ: ప్రభలు విరజిమ్ము సర్వమ్ము ప్రముఖ శిల్ప
            కళను చూచినంతనె మన కనులు చెదరు
            విష్ణుమూర్తి యె యీరూపు వెలసెననగ
            చెక్కె మేధావి రాతిని చేవదనర.ఫ

                గోవులపై బాలగోపాలుడు.
     సీ: దక్షిణ హస్తాన తనకిష్టమౌ లడ్డు
                   వామహస్తమునందు వరలెగోవు
          పాదాబ్జముల చెంత పరమ హంసయొకండు
                     మోమున కస్తూరి మోదమలర
          పీతాంబరంబును ప్రియమార ధరియించి
                      చిలిపి చూపుల నొప్పు చిన్ని కృష్ణ
          కంఠాన మౌక్తిక కమనీయ హారాన
                ముద్దుగొల్పుచునుండు మోహనుండు

    ఆ.వె:  శిరము పైన నుండి చిరునవ్వు తోడను
             నీదు నాదు హృదిని నిండినాడు
             మోక్షదాయి యతడు మోకరిల్లు సతము
             దుష్టపాప చయము తొలగిపోవు.

       

          పై చిత్రానికి నా స్పందన.( వానరము ...సింగము )
         కఱ్ఱయొకటె కలదు బుర్రలేదెక్కడ
         నిదురపోవు హరిని కదుపనేల?
         కానిపనులు నిన్ను కష్టాలపాల్జేయు
         వద్దు మాటవినుమ వానరంబ!..1.

       నీదుబలముతెలిసి నేర్పునమెలగుమ
         సాహసంబు వలదు శక్తిమించి
         నిద్రపోవుహరిని నీవేల కొట్టెదు
         కోతిపనులు సతము కొంపముంచు...2.

         వానరంబు నీవు వన్యమునకురేడు
         సింగమదియ నిన్ను చీల్చివేయు
         కోతిపనులవేల?కుదురుగనుండక
         హరిని జేరగలవు హరినిగొట్ట...      3.

       శివునిపై సంపూర్ణ చంద్రబింబము.

         పూర్ణచంద్రుండు శిరముపై పూవుకాగ
         లీల మౌనముద్రితుడయి హేలనుండ
         జగతి నోంకారశబ్దంబె శరణమనగ
         నాసనాశీనుడైయున్న నాత్మభవుని

         మసనమే నివాసంబుగ మసలువాని
         తరలివచ్చిన గంగను దాచినట్టి
         శక్తి హృదయ సంవర్తు నాసక్తితోడ
         గొల్తు భూతిప్రసాదంబు కొఱకు నేను.

            పై చిత్రమునకు..నా భావన.
         
         ఎన్నిమారులు చెప్పను కన్ననీకు
         బువ్వతినుమని హాయిగా బొజ్జనిండ
         స్వచ్ఛ గోక్షీర శర్కర సారమిదియ
         మాత గోరుముద్ద లెపుడు మధురతరము.

            సైకిల్.. బామ్మ..చిత్రానికి నా స్పందన.

    సీ:  పదులారు నిండియు పచ్చికమోపుతో
                           సైకిలు నడిపించు జాణయీమె
         భూమిని నమ్ముచు మోదానకృషిసల్పి
                   ముక్కారు పండించుముదితయీమె
         కండ్లకు నొకజోడు కాళ్ళకు సరిజోడు
                                చీరసోకదిలేని నారియీమె
         ఒంటరయ్యును మహోన్నత మూర్తియై తానె
                     యాదర్శముంజూపు నతివయీమె
   ఆ.వె: పచ్చగడ్డిమోపు పరమాద్భుతంబుగ
            వాహనంబు పైన సాహసాన
            నుంచి నడపు బామ్మ యుండునాయెచటైన
            భరతసీమగాక తరచిచూడ.

      సమస్య....
   బిరుదులు పొందువారె కడు విజ్ఞులు సత్కవులౌ తెనుంగునన్.
   
   సరసత నుత్తమోత్తమ రసాంచిత భావవిశేష ప్రౌఢిమల్
   వరమగుపద్యధారలును వాసిని బెంచునలంకృతుల్ విభా
   సుర పదగుంభముల్ సుకవి శూరుల మెప్పుల సత్సభాళినిన్
   బిరుదులు పొందువారె కడు విజ్ఞులు సత్కవులౌ తెనుంగునన్.

              రైతు చిత్రం....స్పందన..
          
           పారను చేతబట్టుకొని పైరుల నిత్యము సాగుచేసి-యొ
           ప్పారెడు త్యాగజీవివయి పంటల నెప్పుడుపండజేయు-సం
           స్కారపు ధన్యమూర్తి! భువి చక్కని భోజన మెక్కడోయి-శ్రీ
           కారము దుక్కిదున్నకయు కల్పులు దీయక మిన్నకుండినన్.

      రైతు.. బండి..చిత్రమునకు స్పందన.
             ధాన్య లక్ష్మియు గృహలక్ష్మి దర్పమెలర
             బండి నెక్కిరి సతతంబు భద్రమనుచు
             పంట నింటికి జేరిచి ప్రాభవముగ
             రహిని గల్గింతు ననియెను రైతుబిడ్డ.

             "నిర్మలు"నగరు కళలకు నిలయమెపుడు
             వడ్ల బస్తాలు మూటికి నెడ్లబండి
             కట్టి సాగించు సతితోన కౌలురైతు
             ముందు పగ్గాలు పట్టుచు మోదమలర.

              స్వర్ణ పుష్పాలజెక్కెడు సౌరుగల్గు
              హస్తకళలకు ప్రాభవమంతరింప
              బ్రతుకు దెరువులు వేరుగ వెతుకలేక
              "నిర్మలు"కళల రాజు కన్నీరుగార్చె.

       పై చిత్రమునకు నా స్పందన.(పడవపై తండ్రి,కొడుకు)
       గంగపుత్రుల జీవన గతులుజూడ
       వనము బోటులు చేపల వలలతోనె
       సాగుచుండును నెప్డు సంసారమందు
       మీనసంపదె వారికి మేలుగూర్చు.

          పైచిత్రానికి పద్యరూపం ..
              చిత్రమునకు నా భావన.
             ఏన్గు ముఖంబును నెంచక్క నతికించి
                         బ్రతికించియుంటను పరమతేజ!
              నీరజములనిన నీరములన నీకు 
                        నానందమొదవును నాఖువాహ!
             నాకేమొ భయమయ్య నామీద చల్లకు
                         తొండంబు పూరించి స్థూలదేహ!
              చిన్నవాడనునేను చేతులు జోడింతు
                        విడిచిపెట్టుమునన్ను విఘ్నరాజ!  
              పెద్దవాడవీవు ప్రియమైన యన్నవు
              నాదు మాట వినుము నయముగాను
              నాన్నకిష్టమయ్య నవ్యాభిషేకాలు
              చేసికొందమనఘ!చిత్తమలర.   

                     మామ..కరణం శేషగిరి రావు.

సీ :   అమ్మ సృష్టివి నీవు - అయ్య పోలిక , గజ 
              ముఖ చర్మములు మీకు ముద్దుగొలుపు
       అయ్య తేజము నేను - అమ్మ పోలిక, శక్తి 
                         అయ్యది,యరుదగునమ్మ దీప్తి ;
       ఆడుచున్నాము పెద్దమ్మ యొడిని జేరి 
                        కడుచిత్రమౌ గాదె కననిది మరి !
       ఆఖువాహనమును నద్భుత "శక్తి"యు 
                         నాకులఁ దేలగా నందమదియు 
తే.గీ : నెమలిపై నేను విహరింప నెమలి కన్ను
          నీదు తలనెక్కి కూర్చుండె నెయ్యమునను
          మన కుటుంబము ౙూచి యీ మానవులును
          బ్రతుక గలిగిన భూమియే స్వర్గమగును..!

        వినాయకుని వీడ్కోలు..స్పందన.

       కనగ నెచటైన నాన్లైను క్లాసులుండు
       వీడియోలనె పాఠాల వీక్షణంబు 
       నేను వత్తును తాతయ్య నీదువెంట
       స్నేహమయ్యెను హాయిగా చిన్నియెలుక.

              పై చిత్రమునకు నాస్పందన.
  
          కాడి కవ్వము కదురులు కలసిమెలసి
          పల్లెలందున సిరులను పంచెనాడు
          నేటి జీవన సరళిని నెమకి చూడ..,
          అర్ధమెరుగక నవియెల్ల వ్యర్ధమనును.

              పై చిత్రమునకు ..(ఆవుదూడ...స్వరూపానంద)నాస్పందన.

        వత్సమా! యిర్వురమొకటె వసుధయందు
        పూర్వజన్మాన నేనును ముగ్ధమోహ
        నాకృతిన్ గోవునైతి మహాత్ము కరుణ.
        "ఆత్మ వత్సర్వ భూతాని" యనెడురీతి
         హత్తుకొందును నామది హ్లాదమంద.
            
        నీకు వలయును క్షీరంబు నిన్ననేడు
        నాకువలయును లలితాంబ నవ్యభవ్య
        దివ్య కరుణరసాంచిత దీవనలును
        మాతృ కృపచేత మనకెప్డు మన్ననగును.

   సింహమపై వెళ్ళు పార్వతి,  చిత్రమునకు నా స్పందన...

  సీ: అగ్రభాగమునందు నాఖువాహనుడుండ
                     కార్తికేయుడువెన్క కదలుచుండ
       కేకి కొమ్మపయిన క్రిందమూషికరాజు
                      ఘూకంబునొకవైపు కొలువుదీర
       కమలవాసిని చేత కమలంబు పైకెత్త
                   హంసవాహిని వీణ హాయిమ్రోయ
        కనులవిందగుచుండ కైలాస గిరివైపు
                    కురులు విరబోసి కూరుచుండి
   తే.గీ:  సింహవాహిని జగదంబ చిద్విలాసి
            భువనములనేలు ముక్కంటి ముద్దుగుమ్మ
            సాగుచుండెను వనమున సంతసాన
            మనల రక్షించు నిరతంబు మమతతోడ.!

    చిన్ని పాప, చేట...చిత్రమునకు నా భావన..

     చెరుగ బియ్యము కొన్నిటి చిట్టితల్లి
     చిత్రము సగము మిగిలెను చేటయందు
      పనిని జేసెడు యత్నంబు భావినీకు
      యశము గూర్చును సతతంబు హ్లాదమిచ్చు.

   పై శ్రీకృష్ణ చిత్రమునకు నా ఉత్పలమాల.

        ఒక్కరి లాస్యమంత్రము మరొక్కరి హాస్యము కొంటెచేష్టలున్
        టక్కరిచూపులన్వలల ఠక్కునలాగెడు గోపికామణుల్
        అక్కజమొందురీతి యమునమ్మయె మోదవినోదమందగా
       చిక్కెను చిక్కెనో యనగ చిన్మయరూపుడు దక్కెవారికిన్.

 పై చిలిపి వలపు చిత్రానికి నా స్పందన.

        మల్లె పూలతోడ మరులనుగొల్పుచు
        పెదవి పంటనొక్కి ప్రేమజూపి
        చిలిపి వలపు విసిర, చెంతచేరకయున్నె
        షండుడైనగాని సంతసాన!

 పై శ్రీకృష్ణ చిత్రమునకు నా ఉత్పలమాల.

        ఒక్కరి లాస్యమంత్రము మరొక్కరి హాస్యము కొంటెచేష్టలున్
        టక్కరిచూపులన్వలల ఠక్కునలాగెడు గోపికామణుల్
        అక్కజమొందురీతి యమునమ్మయె మోదవినోదమందగా
       చిక్కెను చిక్కెనో యనగ చిన్మయరూపుడు దక్కెవారికిన్.
చిత్రమునకు స్పందన.
  చిలిపి చూపుల చిన్నది చీరగట్టి
  బుట్టనిండుగ మల్లియ పూలునింపి
  ఎదురు చూపుల మున్గిన దెవరికొఱకొ?
  కన్నెమనమును దోచిన కాముడెవడొ?
సమస్య: తద్దినమ్మన శుభమని తరుణి మురిసె. 
పెండ్లి యైనట్టి క్రొత్తల ప్రేమతోడి
సరసవచనాల ఘటనల చనవుతోడ
గుర్తుచేయుచు నవ్వుచు భర్తపలుక
తద్దినమ్మన; శుభమని తరుణి మురిసె. 

కృష్ణ స్వామి స్ గ్రామ చిత్రానికి స్పందన.
సీసము 
తల్లారమందున తనలేత కిరణాల 
         కబురులాడగవచ్చు కర్మసాక్షి 
పచ్చదనములిల పరచుచు గ్రామాన 
         నుత్సాహమందించునుద్భిజాళి 
ఎటువైపుజూచిన నెఱ్ఱని మట్టితో 
         కనువిందు గలిగించు కాలిబాట 
ఆలయంబులిచటహ్లాదంబు జేకూర్చ 
         ఆధ్యాత్మ శోభల నందగించె 

తేటగీతి 
ప్రకృతి సౌందర్య మిచ్చోట పరిఢవిల్ల 
మీదు కుంచియ కదలాడె మించు గరిమ 
కృష్ణసామిరో ! మనసున తృష్ణదీర 
దెంత పొగడిన చిత్రంబు ధీవిశాలి ! 

---✍--పొన్నెకంటి సూర్యనారాయణరావు .

        తేది -- 10 -- 12 --- 2017


 

        

            


     

బోసుదంపతులకు ఆశీస్సులు. 6.05.2026.

 జీ.బోసు గారి 49వ వత్సర వివాహ మహోత్సవము.           శీర్షిక.. మూడుముళ్ళు. సీ. జీవితమంతయున్ కష్టసుఖాలలో        ముంచితేల్చుచునుండు మూడుముళ్ళు  ...