3, అక్టోబర్ 2015, శనివారం

కవి సమ్మేళనము అంతర్వేది.17.10.15, 18.10.15

పండిత పరిచయం. 3.10.2015  కవి సమ్మేళనము   అంతర్వేది 17.10.15, 18.10.15

  ఈ రోజు చిత్ర కవితా విశారదుడైన చింతా రామ  క్రిష్ణారావు  గారిని కలిశాను.ఆయన  సరళ స్వభావి. మాడుగుల నాగఫణి శర్మగారి దిల్లి అవధానంలొ కలిశాము. చక్కనిసాహిత్యసుధను పంచుకొన్నాము.మరలఈ రోజు దానిని నెమరువేసుకొన్నాము. అలాగే పోచిరాజుసుబ్బారావు గారు కూడా  పిలవగానే వచ్హారు. ముగ్గురము కలసి అంతర్వేది లో జరిగే కవి సమ్మేళనానికి కవితలు వ్రాసి పంపుతున్నాము. కలసి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాము.  ఏ ఆటంకము లేకుండా జరిగితే మహదానందము.  ఈ కవితలు ప్రపంచ సాహితీ పుటల్లో ఉండిపోతాయి.


               

16, సెప్టెంబర్ 2015, బుధవారం

వినాయక చవితి శుభాకాంక్షలు.

    విఘ్న దేవునికి .విన్నపము ,  శుభాకాంక్షలు .

    విఘ్నంబు లెన్ని గల్గిన
    దఘ్నంబు జేసి రయమున దయతో గాచున్
    విఘ్నాధి పతిన్ , భక్తుల
    నిఘ్నున్ గోరుదు శ్రేయము నే నందరకున్  .
 వినాయక చతుర్థి శుభాకాంక్షాలు/ 17.09. 15. 

31, ఆగస్టు 2015, సోమవారం

చింతా రామ కృష్ణా రావు సహోదరునకు ముందుగ అభినన్దనలు

చింతా రామ కృష్ణా రావు  సహోదరునకు ముందుగ అభినన్దనలు. ( తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా )
29..08. 2015 
కమ్మని పద్యమాలికలు కాంచన గర్భుని రాణి పాదమున్ 
చెన్నగు రీతులన్నిలిపి  చిత్తము రంజిల నాలపిమ్పగాన్ 
మన్నన నొందినట్టి కడు మాన్యుడ వీవయ రామ కృష్ణ రో 
ఎన్నగ పూర్వపుణ్య మది యెట్లు స్తుతిమ్పగ సాధ్యమయ్యెడున్. 

అమ్మను గొల్చు భాగ్యమును హ్లాదము గూర్పగ నందినావ హో 
తమ్ముడ రామ కృష్ణ కడు తన్మయ మొందితి మన్మ నోమ్బుదిన్ 
సొమ్ములుగాగ పద్దెముల సోయగముల్ పరి కల్పనంబు తో 
వమ్ములు గావు సేవలటు వాణికి జేసిన సత్ఫలంబులౌ 

29, ఆగస్టు 2015, శనివారం

ఆంద్ర భాషామ తల్లికి కట్టాలి రక్షా బంధనం . 29.08.2015

 ఆంద్ర భాషామ తల్లికి కట్టాలి రక్షా బంధనం . 29.08.2015
కీ. శే . గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతి సందర్భముగ
  శ్రావణ పున్నమికే  రక్షా బంధనం చేసుకోవటం ఒక సంప్రదాయం గ వస్తున్నది .సొదరీ సోదరులు పరస్పరం రక్షణ కోరుతూ  చేతికి కట్టే సూత్రమే ,యిది. ప్రేమ మనిషిని మనీషిగా చేస్తుంది . దానిని పెంచి, పంచాలి. అలాగే మాతృ భాషామతల్లికి కూడా మనమందరం  రక్షా బంధన చేయవలసిన దుస్తితి వచ్చింది . ఋణం తీర్చుకోవాలంటే కట్టక తప్పదు. అంటే ఏదో అద్భుతం చేయనవసరం లేదు . వీలైనంత తెలుగులో మాట్లాడితే చాలు  సంతోషిస్తుంది మన ఆంద్ర మాత.
      తెలుగు మాటలు నాలుగు పలుకు గలను
      తెలుగు స్వారస్య మెంతైనా తెలుప గలను
      తెలుగు తనమును భావాల నిలుప గలను
      తెలుగు  కవి వారసుండనై వెలుగ గలను.
      అమ్మ నీపాద పద్మంబు నహరహంబు
      కొలుచు చున్దును సదమల కూర్మి తోడ
      ఆంద్ర భాషామ తల్లికి హారతిచ్చి ,  
     రక్ష బంధన గూర్తును రమ్య గరిమ .    అని అంటీ చాలు మన భాషామతల్లి పొంగి పొతున్ది.
     

23, ఆగస్టు 2015, ఆదివారం

అమ్మ పిలిచింది భయం లేదు రారా యని. 23.08.2015.



                         అమ్మ పిలిచింది భయం లేదు రారా యని.
                           23.08.2015.

నేనే స్వయముగా కారు నడుపుకొంటూ వెళ్లి బెంగుళూరు లోని వైష్ణవీ మాతని దర్శించుకోవాలని నాకు ఉబలాటం . వెళ్ల లేనేమో నని భయం. నిత్యం భయానికి, ధైర్యానికి మధ్య .పోరాటం జరుగుతూనే ఉంటుంది .ఏది ఎక్కువ శాతం ఉంటే అదే జరుగుతున్ది. మన భయమేమిటంటే , అపజయం పొందుతామేమో అని ..అపజయము, విజయము అమ్మ స్తన్యం త్రాగే టప్పటి నుండే మొదలు. అమ్మ ఆశీస్సులే విజయానికి మూలమ్.అపజాలే విజయాలకు సోపానాలు . అందుకే ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. అమ్మ వైష్ణవి ని కొంచెం ధైర్యం ప్రసాదించమని అడిగాను, ఆమెని దర్శిం చుకోవటాని కే. ధైర్యం యిచ్చింది అమ్మని దర్శించి క్షేమం గా వచ్చాను.
                ధైర్య మన్నది సతతంబు కార్య విజయ ,
                హేతు వగునోయి మిత్రమ సేతు లంఘ
                నంబు నవలీల గావించె హనుమ నాడు .
                పిరికి తనమును మదినుండి పెరుక వలయు .

4, ఆగస్టు 2015, మంగళవారం

అబ్దుల్ కలామ్.

                                               అనన్వయ అబ్దుల్ కలామ్.
అనన్వయము నూరు అలంకారములలో నొకటి. అన్వయము  అంటే సాదృశ్యము, పోలిక, ఒక వ్యక్తి గాని, వస్తువు గాని , వేరొక దానిలా ఉంటే ఆ యిద్దరు వ్యక్తులనో, వస్తువులనో పోల్చవచ్చు . ఆ మనీషిని గురించి పోలిక చెప్పాలంటే ఎక్కడా దొరకక పొతే వారిని అనన్వయ వ్యక్తులుగా చెప్పవచ్చు. సాగరం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే  ఇలానే సమాధానం చెబుతారు. అందుకే సాహితీ వేత్తలు, సాగరః సాగరోపమా  అన్నారు రామ  రావణ యోర్యుద్ధం రామ రావణ వత్. అటువంటి పోలిక లేనందు వలన అలా అన్నారు.
            ఆ కోవకు చెందిన ఒక మహోన్నత వ్యక్తి , జాతి రత్నం రాలిపోయింది భారతావనినే కాక సర్వ ప్రపంచాన్ని కన్నీటి లో ముంచి. అనిర్వచనీయ ప్రతిభాశాలి , సుగుణ శీలి , సమున్నత మానవీయ సత్కార్యాచరణ సుమములను , యువకుల హృదయ మధు వనంలో పూయించు తోట మాలి. నింగి దురాన్ని చెరిపి, మనం శాస్త్ర విజ్ఞానం తో దానిని సులువుగా తొంగి చూడవచ్చునని నిరూపించిన సాంకేతిక శాస్త్ర విజ్ఞాని , కీర్తి శేషులు అబ్దుల్ కలాం  గారు.
            ఆలోచన, ఆచరణ , ఆత్మీయత, ఆరాధనా భావం, అంకిత భావం, అందరిని అలరించే అమృత హృదయం , సేవాతత్వం, బంధు ప్రీతి , మా తృ ప్రేమ , భ్రా  తృ ప్రేమ , చిరు నవ్వు చెరగని మోము , పని చేయుటలో ఆనందాన్ని అనుభవించటం , యెంత ఎదిగిన ఒదిగి ఉండటం , ధనార్జన పట్ల నిరాదరణ , విజ్ఞాన ధనార్జన పట్ల మిక్కిలి ఆసక్తి, ఇటువంటి కోట్ల గుణములు రాసి పోస్తే ఒక అబ్దుల్ కలామ్.
   
పదవులకు మనిషి వలన గౌరవం రావటం , తేవటం కొందరి వలననే జరుగుతుంది . రాష్ట్ర పతి పదవికి అందాన్ని , హుందా తనాన్ని , తెచ్చిన మహనీయులలో అబ్దుల్ కలాం ఒకరు .
         సమాజంలో ఏ క్రొత్త మార్పు రావాలన్నా , అది తప్పక బాలలనుంది, యువకుల నుండి వస్తుందని నమ్మి వారిని నిరంతరం , తన మృదు మధుర భావ గంగా జాలం తో తడిపి వారి మనసులను , ఆలోచనలను , పరమ పవిత్రం జేసి ఆచరణ వైపు అడుగులు వేయించిన స్పూర్తి దాత అబ్దుల్ కలామ్.

        సాగర తీరం లో జన్మించి    విద్యా విజ్ఞాన సాగరం మధించి, అందు అమృతాన్ని సాధించి , దానిలో రామ ఈశ్వర తత్వాన్ని రంగరించి, రస రమ్యం చేసి , ఆ అమృతాన్ని సర్వ ప్రపంచానికి పంచి న మోహనాకారుడు కలాం ;దైవం ఎక్కడో లేడని, పసి హృదయాలలో , వారి బోసి నవ్వులలో , ఉన్నాడని నమ్మిన మానవతావాది , మా  నవతా వాది, కలాం . హిందూ మతమైన , మహమ్మదీయ మతమైన , మరే మతమైన , సర్వ జన సమ్మత మైనదే మతమని నమ్మి మానవ శ్రేయస్సుకు  మకుటాయమానం గా నిల్చిన మానవతావాది కలాం. తన దేశం ఆధ్యాత్మికం గానే కాకుండా , వైజ్ఞానికంగా కుడా , హిమోన్నత శిఖరాలను , దేశాంతరాలను దాటాలని , కలలు కని, ఆ కలలను సాకారం చేసి , పృథ్వి , అగ్ని, వంటి క్షిపణుల ద్వారా , నిరూపించిన స్రష్ట కలామ్.
        మనం కలలు కనటం గురించి చెబుతూ  ఒక ఉన్నత లక్ష్యాన్ని కలగా కని, దానిని  నిజం చేసుకోవటానికి , అహోరాత్రులు కృషి చేయుమని, కలలు కల్లలు కాకుండా ,నిజాలు కావాలనే తపస్సు , చేయుమని తపన బడ్డాడు కలాం . త్యాగానికి మరో రూపు ఆయన . ఇన్ని సుగుణాల కలబోత , కలనేత, కలల నేత , మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు కాక మరెవరు ఉంటారు చెప్పన్ది. మనం వారి ఆశయాలకు రూపు దిద్దుదాం .
    కలలు కనుమన్న మాన్యుండు ఘను డె వండు
     నింగి దూరియు కనిపించు భ్రుంగి ఎవడు
    భారత రత్నంబు నాబడు భవ్యు డె వడు
    అతడె అబ్దుల్ కలాము విఖ్యాత యశుడు.  
    జలధి మించిన విజ్ఞాన శాస్త్రమున్న
       వినయము చిరునవ్వు వెలయు వేత్తయగుచు
        బాలబాలుర హృదయాల పరమగురువు
       ఆకలామును మించిన యమరుడెవడు?

6, జూన్ 2015, శనివారం

కృషితో నాస్తి.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం.   నిరంతరం కృషి చేసే వారికి ఏనాడు దరిద్రము ఉండదు. తపో ధనులకు పాపముండదు.
                 కృషి అనే పదానికి , వ్యవ సాయము,  పని , ప్రయత్నం  అని అర్ధాలు న్నవి . వ్యవ సాయం చేసే , వ్యవసాయ దారునకు , నెల్లపుడు ఏదో ఒక పని ఉంటుంది .దాని వలన అతనికి ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ఆదాయం ఉంటుంది .ఆదాయం ఉన్నప్పుడు దరిద్రానికి తావులేదు . అలానే తపస్సు చేసే తాపసికి పాపముండదు .                నిరంతరం కృషి చేయటం వలన ( ఏపని లో మనకు నైపుణ్యం కావాలో దానిని ) ఆ పనిలో ప్రత్యక నైపుణ్యం వస్తుంది . దీనినే ఆంగ్లం లో  వర్క్ యక్స్పీరియన్స్ అంటారు . పని అనుభవం  లేకుంటే , ప్రతి పని లోను మనం రాణించ లేము . మన మనసు చాల విచిత్రమైనది. పాపం దానిని ఎలా అలవాటు చేస్తే అలా పని చేస్తుంది .ఈ సమయానికే మనం అన్నం తినాలని నిర్ణ యించుకొంటే , మన మనసు ఆ సమయానికే ఆకలి కలిగించేటట్లు ఆజ్ఞలు జారి చేస్తుంది . . అలానే ఒక వాహనం నడపాలంటే దానిని ప్రతి రోజు ఉపయోగించి తీరాల్సిన్దె. కన్నులు , చేతులు , కాళ్ళు , అప్రయత్నంగా వాటి పని అవి నైపుణ్యంగా చేసికోనేవరకు వదలకూడదు .
                                                        పని .పొరపాట్లు
             పని చేస్తేనే మనం ఏ పోరపాటు చేశామో , ఎక్కడ చేసామో తెలుస్తున్ది.  పని చేయక పొతే మనకు పొరపాటు ఏమిటో తెలియదు. అయితే తెలివి గల వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే , చేసిన పొరపాటే మరల చేయ కుండుట అంటే క్రొత్తవి చేయమని కాదు. తినగా తినగా వేము తియ్యనుండు . అనగా యెంత కష్టమైన పని అయినా సులువు అవుతుంది  ఏపని అయిన సాధనము చేతనే సులభ సాధ్యమౌతుంది . ఇది నిత్య సత్యమ్.
         

5, మే 2015, మంగళవారం

కలలు నిజమవుతాయా . 5.05 2015.

                                కలలు నిజమవుతాయా . 5.05  2015. 

   నా అనుభవం అవుతాయనే రుజువు చేసింది. నాకు కలిగిన అను భవాన్ని బట్టి చూస్తె ముఖ్యంగా తెల్లవారు జామున 4.,5. గంటల మధ్యన వచ్చిన ప్రతి కల , 99% నిజముగా అవుతున్ది. ఈ విషయం రుజువు చేసుకొని చూచాను . ఇదే  విషయం రామాయణం  కుడా  చెబుతున్నది. దాని రుజువే త్రిజటా స్వప్నము . లంక నాశన మయినట్లు , తనకు తెల్ల వారు జామున కల వచ్చిందని తోటి రాక్షసులకు చెబుతుంది . ఇలానే దశరధుడు మరణించిన తరువాత భరతుడు అయోధ్యకు రాబోయేముందు తనకు తండ్రిని గురించి అమంగ ళ కరమైన కల వచ్చిందని చెబుతాడు .. కాని  చిత్ర మేమిటంటే దానిని మనం పూర్తిగా నిరోధించలేము . దుస్స్వప్న నివారణ కొరకు వెంటనే లేచి భగవన్నామం చేసుకొంటూ కాళ్ళు చేతులు  కడుగుకొని మరల నిద్రిమ్చాలి . అప్పుడు కొంత ప్రమాదం తప్పుతుంది . 

4, మే 2015, సోమవారం

సుసర్ల భవానీ ప్రసాద్, వేమవరపు లలిత షష్టి పూర్తి పద్యాలు.


  చిరంజీవి సుసర్ల భవానీ ప్రసాద్ షష్టి పూర్తి  ఉత్సవ సందర్బముగా                                         ఆశీస్సులు . 10.. 05 . 2015.



22, ఏప్రిల్ 2015, బుధవారం

త్రాగి త్రాగించాలి.

  త్రాగి త్రాగించాలి . పలికి పలికించాలి .( సూర్య శ్రీరామమ్ )

 'పిబరే రామ రసమ్:"   అన్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి  వారు .వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం వ్రాసి దానిని అమృత కలశం గా చేసి అపురూపంగా అందరికి అందకుండా చేశారు.ఆ అమృతం ఆస్వాదిమ్చాలంటే సంస్కృత పాండిత్యం కావాలి మరి ఆ భాష రాని వారి స్థితి ఏమిటి . అమృతం వారికి అవసరం లేదా . దీనికి సమాధానంగా ఎందరో మహానుభావులు తెలుగులో పద్య, గద్య, చంపు , కీర్తన , అను అనేక రీతులలో మకరందాన్ని వారనుభవించి సామాన్యులకును అనుభవింప జేశారు . అమృతం ఎవరు  త్రాగితే ఆ రుచి వారికే తెలుస్తుంది . అందుకే నేను ముందు త్రాగి , నా శిష్యులచే , సాహితీ మిత్రులచే , హితులచే , సన్నిహితులచే  రామామృతం త్రాగిమ్చాలని , ఆశించాను . అమృత భాండమును వంచి కొన్ని బిందువులను త్రాగి , జీర్ణించుకొని , తెలుగు పలుకులలో , కొంత తేట పరచి , పంచి , ఆనందించాలనే నా తపన . తిక్కన గారు  " మధుర పదార్ధాన్ని , ఒంటరిగా తినరాదు, త్రాగరాదు. అడవులలో ఒంటరిగా నడువరాడు " అని చెప్పారు . అందుకే నేను మహర్షి పదములను , పాదములను  ఆశ్రయించి , అనుకరించి , అనుసరించి , నా జన్మ ధన్యమగునట్లు చేసుకొంటున్నాను . అందుకు కరదీపికలుగా  , మాన్యులు , డా, యం. కృష్ణమాచార్యులు గారు, డా. గోలి వెంకట రామయ్య గారు వ్రాసిన అనువాద గ్రంధము ఉన్నది  . వారికి నా కృతఙ్ఞతలు . వారి ఆశీస్సులతో కొన్ని తెలుగు పలుకులు పలికి , మాతృభాషాభిమానాన్ని చాటుకుందామని అనుకొంటున్నాను .  " బాణోచ్చిస్టం  జగత్ సర్వమ్ " అన్నారు పెద్దలు . ఈ రామ రసాన్ని (క్లాసులలో ) గ్లాసులలో పోసి అందరికి అందించాలని నా కోరిక.
   తొలి తెలుగు తొక్కు పలుకులను నాచే ముందుగ పలికించిన నా తలిదండ్రులకు  ఈ గ్రంధమును అంకితము చేయుచున్నాను . తరువాత నా పలుకులను సాహితీ ములుకులుగా ,, తీర్చి దిద్దిన ప్రతి ఒక్క గురుదేవునకు సాష్టాంగనమస్కారములు చేయుచున్నాను .
                        బుధజన విధేయుడు . పొన్నెకంటి .

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

ప్రపంచ మాతృ భాషా దినోత్సవం , 21.02. 2015




ప్రపంచ మాతృ భాషా దినోత్సవం , 21.02. 2015
తుర్క యామ్జాల్ లోని  జ్ఞానోదయా విద్యా నికేతన్ , వార్షికోత్సవము సందర్భముగా  వ్రాసి చదివిన పద్యాలు . 
                                                              తెలు(గు వాడు 
1. సీ . తిక్కన్న కవితలో తియ్యని మధుధార 
                                తనివిదీరని భంగి త్రావుచుండ
          పోతన్న భక్తిలో పూర్ణ త్వమున్బొన్ది 
                                   సతతంబు హరి సేవ సల్పుచుండ
           పొన్నగంటి వారి చెన్నైన తెను(గులో 
                                     అచ్చ తెను(గు కావ్య మలరుచుండ
          శ్రీనాధు సీసాల శేషంబు నుంచక 
                                    గుట గుట త్రాగంగ కోరుచుండ 
     తే . గీ. తెల్గు వానికి లోటేమి తెల్పుమయ్య 
               తిక్కనార్యుని, శ్రీనాధు తీరులన్ని 
               పొన్నగంటితో కలగల్పి పొదివి పొదివి 
               ముద్దు మురిపాల తెలు(గున మురియగలరు. 
సీ.  గళ మెత్తి, కలమెత్తి గంభీర భావాలు 
                          పదిమంది నెదిరించి పల్కువాడు!
     నమ్మిన సత్యంబు నవనిదులిచ్చినా 
                          వదలని ధీరుండు వజ్ర సముడు!
      ధర్మ పాలనమందు దారిద్ర్యమొచ్చినా 
                          హ్లాదాన జీవంబు నందువాడు! 
తే.గీ. వాడి గల్గిన పలుకుల వరలువాడు 
        ఒంటి పోరుకు నెదురొడ్డి ఓర్చువాడు 
        మిన్ను మన్నును లీలగా మెదపువాడు 
       తెలుపవలెనా! యింకను తెలు(గు వాని! . 
తెగీ.  దేశ దేశములందున ధిషణ జూపి 
        తనదియైనట్టి శైలిన తనరుచుండి 
        తెలు(గు వెలుగులు  విశ్వాన తేట పరచి 
        కీర్తి కాంతను చేబట్టు మూర్తి యితడు! .    


20, జనవరి 2015, మంగళవారం

బాల భావన శతకం. గురించి

బాల భావన  శతకం. గురించి                                                                                                             రామకృష్ణా రావు గారు జగమెరిగిన చిత్రకవి, విచిత్ర కవి. వారి భావనలు మధుర మనోహరాలు సుకుమారాలు , సమాజ చైతన్య స్పోరకాలు. వారు నన్ను సోదరునిగా భావించి తాను వ్రాసిన  బాల భావనలు అను శతకానికి అభిప్రాయం వ్రాయమనుట  చాలా సంతోషంగా ఉన్నది.. బాల బాలికలు మనకు అన్ని భావాలు  పైకి చెప్పరు కాని  చాల సున్నితం గ ఆలోచిస్తారు. రావు గారు వారిలో( పిల్లల్లో )  దూరి వారి  స్థాయిలో , శైలిలో చెప్పిన పద్యాలు ఆణి ముత్యాలు. నేటి సమాజానికి ఏది కావాలో అదే చెప్పారు. 4 వ పద్యంలో . ముద్దు చేసి మాకు హద్దులు నేర్పరు-----. హద్దు మీర మమ్ము గ్రుద్దుదురయ.--- హద్దు లెల్ల నేర్ప శ్రద్ధ గా నేర్వమా ----పెద్దలారజ్ఞాన వృద్దు లార . . అంటూ  ఆడుతూ పాడుతూ ఆట వెలదులలొ చెప్పారు . మొక్క అయి వంగనిది మ్రానై వంగునా అనే ప్రాచీన సూక్తి యిందులో దాగి ఉన్నది. ముద్దు హద్దు మీర రాదనే విషయం నిత్య సత్యం.    
           7 వ పద్యం లో .  పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి -----పలుకునటుల జేయ పలుక గలము ---పద్యమొక్కటైన పలుక నేర్ప రదేల.  అంటారు. నేటి భాషామతల్లి అందున తెలుగు భాష ఈ విషయం లో ఏటికి ఎదురీదుతున్నది. వీలయినంత వరకు పిల్లలకు తెలుగు పలుకుబడి బడి లోనే కాక యింటిలో కూడా నేర్పాలి. ముఖ్యంగా అమ్మే యీపని చేయాలి. ఆనాడే భారత మాతృ.హృదయం సంతోషిస్తుంది .అమ్మఒక శతకం చదివితే పిల్లలకు చెప్పినట్లే . ఎంత సమాజ స్పృహ . ఇది అందరికి రావాలని కవి గారి తపన. 
           9.వ పద్యం లో . మాకు నచ్చు విద్య మమ్మన్దుకొనీక------మీకు నచ్చుదాని మాకు పులుమ -----మాకు రాక పోవు మాదోషమా యిది . ------- నిజమే మనకు నచ్చిన పనిని చాల సులువు గ చేస్తాము . నచ్చని పని కేవలం పరుల కొరకే . ఈనాడు  చాల మంది విద్యార్ధులు పడుతున్న పట్లే యివి. వారికీ స్వేఛ్చ యివ్వాలని కవి సూచన బాలల పట్ల సద్భావన . 
          ఇలా ఎన్నో సుకుమార సుందర భావాలతో సమ సమాజ నిర్మాణానికి , దేశ సమైక్యతకు పునాది రాళ్ళు అయిన బాలలకు , మంచి సూచనలతో శతకం వ్రాసిన  రామ కృష్ణారావు గారు మిక్కిలి అభినంద నీయులు. 
                                           సారస్వత సహోదరుడు. పొన్నకంటి సూర్య నారాయణ రావు.  భాగ్యనగరం. .  

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...