భద్రాచల యాత్ర.
హైదరాబాద్ నుండి మణుగూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 8.01.2018న,రా.11.30కు మా బావగారు శేషగిరిరావు గారు, చెల్లి ఉదయ, ఇందిర,నేను బయలదేరి ఉ.7.30కి మణుగూరు చేరాము. 9.01.18న స్టేషన్ నుండి బయలుదేరి అల్పాహారం తరువాత ఆటోలో "మల్లూరు" " హేమాచల నృసింహస్వామి" దర్శనానికి వెళ్ళాము. (మణుగూరునుండి మల్లూరు 50.కి.మీ.మల్లూరు వెళ్ళేటప్పుడు వీలుచేసుకొని అరటి,జామ మొ.లగు పండ్లు తీసికొని వెళితే వానరాల ఆకలి కొంతవరకు తీర్చవచ్చును)అచట ఆర్చికి కుడివైపున మెట్ల ప్రక్కన కొద్ది దూరంలో స్వయం భవునిగా వెలసిన హనుమ గుడి చెంత కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలు చేయడానికి (స్వల్పరుసుముతో)చక్కని ఏర్పాట్లు చేశారు. ఎంతో అభినందనీయులు. అచటికి వచ్చే నీరు పరమ పవిత్రము, స్వచ్ఛము, అవ్యక్త మూలికాసంస్పర్శిత రోగ నిర్మూలనము,అమృతతుల్యము,సమతులోష్ణము,సజీవగంగావతరణము. ఆ స్నానానంతరము మనజన్మ పునీతమైన అనుభూతి కలుగుతుంది. నేను కూడ అచట స్నానం చేయగలగటం మహద్భాగ్యమే. అక్కడనుండి షుమారు 50సోపానాలు (మెట్లు)దాటితే నరసింహ దర్శనం లభిస్తుంది. స్వామి స్వయం భువుగా చెబుతారు.
ఈ స్వామిని దర్శించిన మహమ్మదీయ చక్రవర్తి కొండ, ఆలయము అర్థచంద్రాకృతిలో ఉండుటవలన తమదైవ చిహ్నమని భావించి భక్తి తో కొంత బంగారాన్ని కానుకగా సమర్పించారట. తదుపరి ఆబంగారమును అమ్మి వచ్చిన ధనమును బ్యాంకు లో వేసి వచ్చే వడ్డీ తో అర్చకులు మొ.లగు వారు మనుగడ సాగిస్తున్నారట. ఆ కారణముననే ఆ స్వామి"హేమాచల నృసింహస్వామి" పిలవబడుతున్నాడట. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఏమిటంటే స్వామికి కంఠం క్రింద భాగమంతా శిల కాక మానవశరీరంలాగా ఉంటుంది. నొక్కి చూస్తే చర్మం లోనికి వెళ్ళి కొద్దిసేపటి పూర్వపుస్థితికి వస్తుంది. పూర్వం త్రవ్వకాల కారణంగా స్వామి నాభి(బొడ్డు)దగ్గర గాయం యేర్పడి అచట రక్తము కారుచున్న కారణంగా అచట చందనం ఉంచుతారు. స్వామి నిజరూపదర్శనం శుక్ర,శని,ఆదివారాలు (మ.12.వరకు) ఉంటుంది. స్వామి వారి నాభిదగ్గర ఉండే చందనాన్ని పాలలో కలుపుకొని త్రాగితే పెండ్లి కాని వారికి వివాహము, సంతాన హీనులకు సంతానము తప్పక కలుగుతుందను నమ్మకం ఇటీవలి కాలంలో ఎక్కువమందికి కలుగుతున్నది. ఈవిషయాన్ని ఫలితం పొందినవారివలన, ఆటోలవారివలన కూడ వినటం జరిగింది. నమ్మకం,ఆత్మ విశ్వాసం ఎన్ని సమస్యలనైనా తీర్చగలవు.ఎంత ఉన్నతినైనా కలిగించగలవు.
9వతేది మధ్యాహ్నం మణుగూరునుండి బయల్దేరి 2.30.లకు భద్రాచలం లోని "అంబా అన్నసత్రం"లో భోజనంచేసి దగ్గరున్న గదిలో విశ్రాంతి తీసికొని ఆటోలో బయల్దేరి "జటాయువు గుడి,(జటాయువు కాలు తెగిపడినచోటు)(సమీప పొలంలో రెక్క తెగిపడినదని సమాచారం) దుమ్ముగూడెంగ్రామదేవత, సీతారాములపర్ణశాల"(భద్రాచలంనుండి 30.కి.మీ.)చూచి వచ్చాము.
10వ తేది. ఉ.8.00లకు మేము భద్రాచల రామదర్శనం చేసుకొని, శేషగిరిరావు గారి దంపతులు చేయించుకొనిన కల్యాణమును కనులారా చూచుకొని, అన్నసత్రములో రామప్రసాదమును స్వీకరించి విశ్రాంతి తరువాత గోదావరి స్నానం ముగించి గదికి చేరాము. సాయంత్రం7.గం. లకు బస్సు లో కొత్తగూడెం చేరి అచట సికింద్రాబాద్ మణుగూరు ఎక్స్ప్రెస్ లో రాత్రి.10.45కి ఎక్కి 11వ తేది ఉ.6.గం.లకు ఇండ్లకు చేరాము.
కం.హేమాచల నరసింహుని
నేమానవుడేనిభక్తి నీమముతోడన్
సేమంబుగోరిమ్రొక్కిన
కామంబులుదీరితాను కాంచునుసుఖముల్.
కం. మల్లూరు నారసింహుని
యుల్లంబునవెల్లువెత్తు యుత్సాహమునన్
కల్లా కపటములెరుగక
చల్లంగనుమ్రొక్కినాము సౌమ్యతదనరన్.
కం.ప్రాతఃస్మరణముజేయుచు
పూతాత్ములభంగిభద్రు ముంగిటవాలన్
సీతారాముల కరుణయె
చేతంబులురంజిలంగ చేరెను మాకున్.