త్యాగరాయ గాన సభ . బహుమతి ప్రదానోత్సవము
ఈ నాటి పద్యో త్సవము మధురానుభూతి కలిగించినది. పెద్దల సమక్షంలో సన్మానము. వ్రాసి కావ్యము ( బుర్రకథ నాజర్ చరిత్ర) లో రెండు పద్యాలు చదివే అవకాశము . కానీ సమయాభావం చేత ఒక పద్యము మాత్రమే చదివాను. అది మా యూరి బంగారు కొండ వర్ణన .
సీ . భీకర వాయువుల్ పెను మంటలొచ్చిన
నిశ్చలమై యుండు నిండుకొండ
తనను ముక్కలు జేసి దారులు పెట్టిన
నిబ్బరమై యుండు నియతికొండ
గుహలో వరదరాజు కొలువుండి యుండుట
నియమంబు తప్పని నిలువుకొండ
జడలమ్మ బావికి జారుడు గంగమ్మ
పులకింతలాకునెల్ల పొంగుకొండ
ఆ. వె. పొన్నెకంటి కొండ పొగరైన కొండగ
కోర మీసకట్టు కోరి దువ్వి
హితుల హత్తు కొనగ హేమాద్రియై నిల్చి
కూర్మి వరములీను కొండయిదియ. 1.
మస్తాన్ కుటుంబమండలి వ్యధను ( మస్తాను అన్న, ప్రఖ్యాత షెహనాయి కళాకారుడు , నాజర్ మరణించుట) జూచి బాధతో సూర్యుడు అస్తమించాడని భావించు సందర్భము.
సి . తన కాంతి రేఖలన్ ధరణి ప్రాణులకెల్ల
వెల్గుల బంచెడు వే వెలుంగు
చిరువేడి ప్రసరించి చేతనత్వము బెంచు
ప్రత్యక్ష దైవమౌ భానుడతడు
మధ్యాన్న బింబమై మరికొంత తైక్ష్ణ్యంపు
చేవ చూపించు రోచిష్ణుడతడు
తే. గీ . సృష్టి నియమంబు తలదాల్చి స్వేచ్చనుడిగి
తూర్పు కొండకు సరసరా దూరమగుచు
మౌన ముద్రను పాటించి మాన్యుడగుచు
పశ్చిమాద్రికి గతి నెంచి పాఱి పోయె .