1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే
సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా
భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ, సం
పూజిత దివ్యభవ్యమయి మోదముగూర్చె జగద్థితంబుగన్.
2. శేముషి మీరె భారతము సింహపురిన్ కవి తిక్కయజ్వచే
నా మహిమాన్వితంపు పదునైదు సుపర్వపు పాత్రలన్నియున్
ఆమని వేళ కేకి గణమద్భుత నాట్య విశేష వైఖరిన్
కోమలమై చనెన్ తెనుగు కోర్కెలు పండగ వాడవాడలన్.
3. నన్నయ మార్గమున్ సరస నాటకరీతుల తిక్కనార్యునిన్
చెన్నుగ నొక్కరీతి గని శ్రీ హరివంశపు సాహితీ సుధల్
పన్నుగ శేషభారతము భావ రసాంచిత నూత్న వైఖరిన్
మన్నన శంభుదాస వరమై మన తెల్గది వెల్గె దివ్యమై.
4. పోతన భక్తి తత్త్వమున పుస్తకపాణి ముఖావలోకియై
‘‘మాతరొ! బాష్పముల్ వలదు, మన్నన గూర్తు కవిత్వకన్నెకున్
చేతము రంజిలన్ వినుమ! చిన్మయ రూపిణి! ’’యంచు బల్కెగా
బ్రాతిగ నిచ్చె గౌరవము పచ్చని తెన్గుకు శాశ్వతంబుగన్
ఆతరిసార్వభౌముని మహత్తర సీసవిలాసదీధితుల్.
5. రాయల కాలమున్ కవులు రమ్యరసాంచిత కావ్యజాలముల్
వ్రాయగ తెల్గు భారతికి వజ్రకిరీటము వచ్చి చేరుటన్
పాయని సంతసంబునను పౌరులు పద్యపరీమళంబులన్
హాయిగ బీల్చి సద్యశము నందుచు వెల్గెను విశ్వశాంతికై.
సూర్యశ్రీ
(పొన్నెకంటి సూర్యనారాయణ రావు.)
మల్కాజిగిరి. ఫోన్. 9866675770.
భాగ్యనగరం.