**గోల్డెన్ టెంపుల్ గూర్చి.**
శిక్కులదేవాలయమది
అక్కజమౌస్వర్ణమయము హ్లాదముగూర్చెన్.
మిక్కుటమౌఆజ్యమిళిత
చక్కని పసదనముదొరికెసంతసమొప్పన్.
శిక్కులపవిత్ర గ్రంథము
నిక్కపుభక్తిన్జదువుగ నేనటుగంటిన్భఘృ
అక్కడి సద్గురువర్యుల
అక్కరుణామూర్తులకివె అంజలులార్యా!
ధైర్య సాహసాలు తమసొంతమనురీతి
చిన్నపెద్ధవృద్ధ చేతులందు
ఛురికలుండెమనకు చోద్యమలర.
భరతమాత పుత్ర భవ్యచరిత!
** కురుక్షేత్రం గురించి.**
గీతాచార్యుని నిలయము
ప్రాతః స్మరణీయమైన ప్రాంతమునంతా
చూతము రారండిబుధులు
చేతమ్మున భక్తినింపి క్షేత్రమ్మునకున్.
** వైష్ణవీదేవిని గూర్చి.**
దర్శన భాగ్యమిచ్చెనిట తాత్త్వికరూపిణి వైష్ణవీసతే
దర్శితనేత్రముల్ మిగుల ధన్యతనందె పవిత్రమై పున
ర్దర్శనమెప్పుడో యనెడు ధార్మికజీవుల మస్తకంబులన్
స్పర్శను జేయుచున్ కరము సంతసమిచ్చె కృపాంతరంగయై.
అమ్మనుజూడగాదలచి ఆర్తుడనై విలపించుచుండ,రా
రమ్మని సద్దయన్ బిలచి రమ్యకపర్దిని వైష్ణవమ్మయే
తెమ్మనె నాదుబృందమును తెల్విగకొండకు ప్రాణనాధునిన్
అమ్మకుమాటయిచ్చిజవనాశ్వమురూపముదాల్చె శంభుడే.
రాజు నామానబరగెడు రమ్య హయపు
శిక్షకుడుహమీదనువాడు చెలిమితోడ
చతుర భాషణాచణుడౌచు సాగివచ్చి
అమ్మ పాదాలజేర్చెను హ్లాదమొప్ప.
తాతపేరున బెరిగిన జాతకుండ
సూర్యనారాయణాఖ్యుండ సూరిబ్రువుడ
వారినామంపుఫలమేమొ తేరిచూడ
అశ్వమెక్కెడి యదృష్టమవనికలిగె.
భైరవరాక్షసుండు నను భర్తగచేకొనుమంచుకాళికన్
ఘోరతరంబుగాగ కడు కూళత నీచత వెంబడింపగా
ధీరత రౌద్రరూపమున దిక్కులు సర్వము పిక్కటిల్లగా
పోరునుసల్పి వానినటు ముచ్చటజేర్చెను కాలుచెంతకున్.
తప్పు క్షమియింపగల్గిన తరుణిజూచి
అమ్మ !నాకిటప్రాముఖ్యమమరునట్లు
వరము నీయుమ కరుణను వాంఛదీర
యనుచు గోరగ భైరవుననుమతించె.
నిన్ను గాంచిన పిదపనే నిశ్చయముగ
ముక్తి నందును భక్తాళి మోదమలర
అనుచు వరమిచ్చె ప్రేమతో వైష్ణవమ్మ
అమ్మతనమును రూపించె నాదిశక్తి.
**వైష్ణవోదేవి పాట**
వైష్ణవిమాత వైభవచరిత వరములనీవమ్మా!
నీపద సన్నిధి జేరినవారిని నెమ్మదిజూడమ్మా!
మూడు మూర్తుల మోహనరూపివి లక్ష్మీ వాణీ కాళికవు.
ముల్లోకంబుల భక్తుల బ్రోచెడు కరుణరసాంచిత పాలితవు.॥వై॥
అష్టలక్ష్మిగా నమ్మినవారిని అందలమిచ్చి కాచెదవు
నలువరాణిగా కొలిచినవారికి నాలుకపై నడయాడెదవు. ॥వై ॥
నామభేదముల నానారీతుల నెలకొనియున్న ఏకరూపివి
ఎక్కడక్కడచూపుము నాకని పలుకువారికి నిశ్శబ్ద శక్తివి. ॥వై॥
బహువిధ మణుల రత్నరాసులను భారీపూజలు చేసినగాని
శుద్ధభక్తికే పట్టముగట్టెడి సుందరమూర్తివి నీవమ్మా ॥వై॥
**అమరనాధుని అందాలు**
శ్రీ అమరనాథుని అందమునంతా చూతమురారండి
గుహలో వెలసిన మంచులింగమును తలచుచురారండి
కనులకు శిరమది కనబడకుండును
హిమసౌందర్యంబున దాగియుండును
కనులకు గంగయు కనబడకుండును
ప్రవాహరూపిగ పారుచుండును. ॥అమర॥
ఉమకై వెదుకగ నుండదచ్చట
ఉన్నది శంభుని కూతమిచ్చుచు
అగ్నినేత్రము కానరాదులే
ఆరెను ఎప్పడొ ఆచలికి ॥అమర॥
నాగాభరణము నామమాత్రమై
మంచుకణములో మాయమైనది
శూలము,ఢక్కా సృక్కిపోవుచు
సుందర హిమమున కరగిపోయెను ॥అమర॥
మంజీరంబది మౌనముద్రతో
మంచునపొంచెను మరిమరిమ్రోగక
బసవడు సైతము పరవసించుచు
కోటికష్టముల గోటద్రుంచుచు
రారమ్మంచును రంకెవేసెను. ॥అమర॥
అమరనాథుని యాత్రలో హ్లాదమొప్ప
పాలుపంచుక నిరతంబు పారమార్థి
కంబు నెయ్యంపు సమ్మతిన్ కలసినట్టి
మాన్యసోదరసోదరీమణులనుతింతు.
పెద్దల గారవించుచును ప్రేమవినిర్మిత మాతృభావనన్
ముద్దులుమూటగట్టి కడు మోదముగూర్చెడు పల్కుజిల్కుచున్
హద్దులుదాటనీని చిరు హాస్యము హాసము పంచుచున్సదా
నిద్దురదూరమున్సలుపు నిర్మలమూర్తుల కంజలింతునే.
అమరనాథుని యాత్రలో నాతో ప్రయాణం చేసిన వారి గురించి పాట.
ఓ....సోదర,సాదర భక్తశిఖామణులారా!
సరస సహృదయ సోదరీమణులారా!
వినరండీ యాత్రాఫలం, కనరండీ జ్ఞాన బలం.
అమరనాధుని అనుగ్రహముతో అంతా సుఖకరమైనది
అమ్మపార్వతి అనురాగం తో అంతా సుముఖమయైనది.
తీర్థయాత్రలో తీయని కష్టం త్రినేత్రుడిచ్చే వరమేలే
సార్థకంబులై జీవితంబులే సంపదాళితో వరలునులే
హిమాలయంబులు నదీనదంబులు
పచ్చని చెట్టు పశుపక్ష్యాదులును
శంభునిరూపం శాంభవి తేజం.
మానవజీవన గమ్యం మమతాసమతల రమ్యం
మానవత్వమే మాధవు సేవకు సోపానం
అమరనాధుని యాత్రకువెళ్ళే అన్నార్తులకిల అండగనుంటు
పంచభక్ష్యముల పంచేవారిని పరమాత్మే దయజూచునులే.
జై జవాన్!!!
మంచుకొండలలోన నించుక వెరువక
కావలికాయునా ఘనుడెవండు
తనవారినందరి త్యాగంబు జేయుచు
కొండగుహలలోన నుండునెవడు
శత్రువులకెప్పుడు శరభమై కనిపించి
నిద్దుర రానీని నెయ్యమెవడు
భరతమాతకునెప్డు బంగరు బిడ్డ గా
విఖ్యాతిగన్నట్టి వీరుడెవడు
ఎవడు ఎవడని ఇతరత్ర వెదుకవలదు
జైజవానని సత్కీర్తి శాస్త్రి వలన
పొంది యున్నట్టి యరుదైన ముద్దు బిడ్డ
భారతీయులపాలిటి ప్రాణదాత!!
అమరనాథుని దర్శనం... నా అనుభూతి.
అమరనాథునిగంటి ఆత్మీయ భక్తుల
మీనంపునేత్రాల మెరపులందు
అమరనాథునివింటి నద్భుతస్వరములన్
భంభంభోలెయనడు భజనలందు
అమరనాథుని దరహాసచంద్రికలను
నింపుకొంటినిహృది నిండుదనుక
శ్రీహిమాలయమున చిత్తంబు భవుపాద
పద్మాలకర్పించి ప్రణతులిడితి
ఎన్ని జన్మల పుణ్యమో ఎరుగలేము
శివుని ఆజ్ఞగ భావించి చేరవచ్చి
పారమార్థక చింతనన్ పరవశించి
ఈశునాశీస్సులందితి నిశ్చయముగ.