1. మంగళ గౌరికి మంగళ హారతి.
మంగళమనరే మాధవుసోదరి, మాయాభేదిని మంత్రనిధే
నీ పాదాంజలి నిష్ఠను సలుప, సర్వపాపములు సమసిపోవును..మంగళ..
భవ్య నామము భక్తిని దలచ, భవబంధములే సమసిపోవును
సతతము కరుణతో సాకుము తల్లీ!, సాగిలి మ్రొక్కెద సారసాక్షిరో! ..మంగళ..
భవుని దేహమున సగమై నిలచి భవ్య తేజమై వెలిగెడు తల్లీ
మూడు జగముల మోదము నింపగ. కన్న తల్లిగా కాచెడు గౌరీ!..మంగళమనరే.
మంగళగౌరిగ మహిళలందరు మనసున నిలిపే మాన్యరూపిణీ
మాంగల్యంబుల రక్ష సేయుమ! మాతృప్రేమను మాపై జూపుమ!..మంగళ మనరే.
2. శ్రీమహాలక్ష్మి కి మంగళహారతి.
మంగళం జయమంగళం, శ్రీమహాలక్ష్మి కి శుభ మంగళం
చంద్రసోదరి శౌరి రాణీ, కమలవాసిని కమలనేత్రా!
క్షీరసాగర కన్యకా, మమ క్షేమ దాయక భావుకా...మంగళం.
దీనజన పరిపోషకా, దేవతాఖిల సంసేవితా...
పేదసాదల పెన్నిధీ, ఘనప్రేమ భాసురధీనిధీ..మంగళం.
భక్తగణ చింతామణీ, భవము డుల్చెడు భానిధీ.
శివము సుఖముల ప్రేమ తత్త్వపు సకలభాగ్యద శ్రీనిధీ...మంగళం.
సారసాక్షులు సభక్తికముగ శ్రావణమాసపు శుక్రవారమున
నిను సేవింపగ సర్వసంపదలు నిరతము గల్గును...మంగళం..
3. గణపతి కి మంగళహారతి.
అంబాసుతునకు లంబోదరునకు మంగళమనరే మానినులారా!
ఆదిపూజ్యుడై యఖిలజగముల హర్షమునింపే యమలమూర్తికి
విశ్వమునందలి విఘ్నములన్నీ వేడిన డుల్చే విఘ్నరాజుకి. "అంబా"
తల్లిపార్వతి ముఖపద్మంబును వికసనజేసే విష్ణునేత్రునకు
నెమలివాహనుని నేర్పున గెల్వబుద్ధిబలమునుజూపినవానికి."అంబా"
గరిక పూజకె ఘనమనితలచి వరములనిచ్చే వక్రతుండునకు
కుడుములుండ్రాళ్ళు కోరిభుజించి ముదమునుజెందే మోదక ప్రియునకు.
అంబాసుతునకు...