30, జనవరి 2018, మంగళవారం

సురుటువల్లి. 27.01.2018.

సూళ్లూరుపేట నుండి పుత్తూరు వెళ్ళే మార్గంలో గల "సురుటుపల్లి" లో  ఈ "పల్లికోటేశ్వర స్వామి" వేంచేసియున్నారు. ఇచటి అమ్మవారు " మరగతాంబ" (పార్వతీదేవి) . పాలసముద్ర మథనానంతరం ముందుగా హాలాహలం పుట్టింది. దాని వలన పదునాలుగు లోకాలకు ప్రాణ ప్రమాదమని దేవదానవులు భయపడుచుండ ప్రేమస్వరూపిణి,మాతృమూర్తి అయిన  "జగదంబ" ఈ గరళమును ఉండగాజేసి తినుడని పతిని కోరినది. భార్య ప్రేమతో కోరిన ఏ భర్త కాదనును? (అది ఎటువంటి కోరికైనను). పవిత్రప్రేమకు అంతటి మహత్తర శక్తి కలదు. ఈ స్థితికి దశరథ  శ్రీ రామాదులును లొంగినవారే. స్త్రీలు స్వార్థపరులై అడిగే కోరికలనే తీర్చగల భర్తలు లోక కల్యాణము కొరకు తీర్చకుందురా? భగవంతుడే అట్లయిన అల్పమానవుల సంగతి చెప్పనేల?  పరమశివుడు హాలాహలమును రేగుపండంత పరిమాణముజేసి కంఠమున దాచి (లోకరక్షణార్థం) "గరళకంఠుడు"గా ప్రసిద్థిగాంచెను. ఆ భుక్తాయాసముతో ఈ తావున  అమ్మవారి యొడిలో కొంతసమయము  విశ్రాంతి తీసికొని మహదానందము చెందినాడట." పరోపకారార్థమిదం శరీరం" అనుదానిని ప్రత్యక్షంగా చేసి చూపారు పరమాత్మ. ఈ సందర్భంలో నే "సహజకవి పోతన్నగారు" భాగవతంలో                " మ్రింగుమనె సర్వమంగళ , మంగళ సూత్రమ్మునెంత మది నమ్మినదో "అంటారు. ఆత్మ విశ్వాసం ఎంతగొప్పదో దీని ద్వారా తెలిపారు.
          ఇచటి శివుని దర్శించుటకు సురలోకమంత తరలి రావటం చేత "సురలపల్లి" గా ఉండి కాలక్రమేణ "సురుటుపల్లి" అయిందట. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడట. అచట ఆయనతో వచ్చిన లవకుశుల పాదముద్రికలు కానవస్తాయి. కాని ఆనాటికి వారి పాదాలు అంత చిన్నవి కావేమో అనిపిస్తుంది. వాల్మీకి మహర్షి కూడ అచట దర్శనమిస్తారు.

సురలనాదరించి శోభాయమానుడై, 
సురుటుపల్లిలోన సుందరుండు,
నగజ యొడిని నుండి నయనాలు ముకుళించి
ఆత్మతృప్తుడాయె అంబ మెచ్చ.

         మనం పురాణాలు పాతచింతకాయ, చాదస్తం అని భావించక సమ సమాజానికి అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలి.    శుభంభూయాత్!

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...