1. నేటి అంశం "బమ్మెరపోతనామాత్యుడు".
సీ: శ్రీరామదర్శన సిద్ధినిబొందిన
పుణ్యాత్ముడైనట్టి భూరిగుణుడు
వాణికన్నీటిని వారించి కావ్యమ్ము
రామునకిడినట్టి రమ్యగుణుడు
భాగవతంబున ప్రత్యక్షరంబును
భక్తిని నింపిన భవ్యగుణుడు
సహజకవియనెడు చక్కని బిరుదంబు
పొందిన రసరమ్య పుణ్యగుణుడు
ఆ. వె. బమ్మెరాన్వయుండు బహుపూర్వ పుణ్యుండు
పోతనాఖ్యుడైన భూసురుండు
భరతసత్కవిమణి భాగ్యంపువారాశి
సాటిలేని విమల సారయశుడు.
... తేటగీతిలో పోతనగారు.
తన్మయత్వాన శ్రీరాము తత్త్వమంత
భారతీయుల హృదయాల భద్రపఱచె
భాగవతమను పేరను భవ్యచరిత
పుణ్యచరితుండు భక్తుడా పోతరాజు...1
హలము బలమున పండించె నైహికంబు
కలము చేతను సృజియించె కవనఫలము
రెంట జాలిన పోతన మింటికెదిగి
రామ రసమును బంచెను రసనతనియ.2
నవ్య మధువున భావాలు నానబెట్టి
భక్తిరసమును బూయుచు పద్యరచన
చేయకుండిన యంతటి చిద్విలాస
పూర్ణ సాహిత్య మొదవునె పోతనార్య?.3.
2. గురజాడ.
సీ: సాంఘిక శ్రేయమ్ము సమకూర్చవలెనంచు
పాటుబడినయట్టి పండితుండు
గ్రాంథికవాదులౌ కవులను మెప్పించి
ప్రజలభాషను బెంచు పండితుండు
హేతువాదిగ మారి హిమవన్నగమ్ముగా
భావాలు పంచిన పండితుండు
"కవిశేఖరుండన్న" కమ్మని బిరుదమ్ము
భద్రమై వెలుగొందు పండితుండు
తే.గీ: వేసె సాహిత్య రంగాన భిన్నమైన
నడుగు లెన్నెన్నొ వీరుడై హ్లాదమొదవ
వారి జాడలె మనకెప్డు దారిజూపు
భావి సంస్కారపూర్ణత్వ పరిధిపంచు.
3. కవికోకిల" జాషువా గారి జయంతి .సం.గా...
తే. గీ . కులము మతనెడు క్రుళ్ళును కూల్చివేయ
అక్షరాయుధంబునుబట్టి యనవరతము
సాహితీరణ రంగాన సాగి ప్రజల
డెందముల్గెల్చిన సుకవీ! వందనములు.
తే.జీ . రాజు సుకవుల చావు బేరీజు వేసి
సుకవి ఘనుడంచు బల్కిన సూరివీవు
ప్రజల గుండెల నిండెడు భావచయము
నీదు సొంతము జాషువా! నిజమునిజము
4. అంశం..గాంధీజీ....
ఉ . ఆయుధమింతలేక పరమాద్భుత శాంతి కి మారురూపమై
గాయము రక్తపాతములు కర్కశఖడ్గవిహారశూన్యమై
దాయగునింగిలీసుప్రభుతన్హడలంగను నెట్లుజేసితో
ఓయి మహాత్మ! జాతిపిత! యున్నత భారతమాతబిడ్డరో!
5. పొట్టి శ్రీరాములు...ఆంధ్ర రాష్ట్రావతరణ:
ఆ.వె. కలసిరాష్ట్రమున్న కష్టాలకడలంచు
పొట్టివంశజుండు పోరిపోరి
ఆంధ్రులకును స్వేచ్ఛ నందించు యజ్ఞాన
తనువు సమిధజేసె త్యాగమూర్తి.
ఆదర్శ నేత...
తాను చేయు పనుల ధర్మంబు తప్పని
స్వార్ధమెఱుగనట్టి సజ్జనుండు
లలితహృదయుడైన లాల్బహదూర్వంటి
నేత దొరకగలడె నెమకిచూడ!
వాగ్గేయకారుడు... త్యాగరాజు.
సరళ సంగీత సాహిత్య సార కీర్త
నాళి రచియించి రాగాలనాలపించి
యయ్యె వాగ్గేయకారుడు త్యాగరాజు.
పూర్వజన్మంపు పుణ్యంబు ప్రోదిగాగ.
కీ.శే. మాజీ ప్రధాని,పదునారు భాషల పుంభావ సరస్వతి,
తెలగాణ మాగాణపు కల్పవృక్షము పాములపర్తి
నరసింహారావు గారి శతజయంతి సందర్భముగా
"అక్షరాంజలులు." 28.6.2020.
1.సీ: అంబుధి జేరిన యార్ధిక రంగమున్
కమఠమై కాచిన కైటభారి
ఆర్ధికమంత్రి గా స్వార్ధరహితమైన
పాలన నెఱపిన పరమశివుడు
సంభాషణలయందు చాతుర్యమందున
కిటుకుల నెఱిగిన కృష్ణుడతడు
జ్ఞానమూర్తి యగుచు నైపుణిన్గడియించి
వాసిగాంచిన యట్టి వాణిభర్త
తే.గీ: మూడుమూర్తుల "నరసింహమూర్తి"యతడు
స్ఫూర్తి దాతగ వెల్గె సత్కీర్తిబొంది
చెక్కుచెదరని నిక్కమౌ యుక్కుమనిషి
నిత్య సంస్తుత్యుడైన మనీషియతడు.
2.సీ: పంచెకట్టున వెల్గి పదునారు భాషల
నాపోశనన్బట్టు నాంధ్రుడెవడు
తెలగాణబిడ్డడై తేజంబుజూపి ప్రా
ధాన్యుడైనట్టి యా ధన్యుడెవడు
మోమున చిరునవ్వు మునిచంద్రుపగిదిని
భావాల విలసిల్లు భవ్యుడెవడు
వేదాంత సూక్ష్మాల విజ్ఞత జూపి వి
వేకియౌ విశ్రాంతవీరుడెవడు
ఆ.వె: నూరు వత్సరముల నారనితారయై
నింగి వెల్గు మహిత నియతమూర్తి
"పీవి" గాక వేరు పేరులబనియేల
పుణ్యభారతాంబ ముద్దుబిడ్డ.
3.ఆ.వె: నాగఫణి వరుండు నవ్యప్రధానినో
ప్రశ్నవేయుడనగ బదులువలికె
మౌన భాషణాన మహిత శక్తిని జూప
పద్యమల్లుమనియె హృద్యముగను
4.ఆ.వె: ప్రశ్నవేయుటందు ప్రజ్ఞను జూపిన
నారసింహు జూచి నాగఫణియె
విస్తుబోయి వారి విజ్ఞాన దీప్తికి
పద్యమల్లె మౌన భావమునకు.
5.ఆ.వె:ప్రశ్నలెన్నియిడిన ప్రాజ్ఞతజూపించి
నవ్యరీతి బల్కు భవ్యగుణుడు
"పీవి నారసింహు" ఠీవిని నుతియింప
నాదిశేషుతరమె!వాదమేల?
6.ఆ.వె: విమలకీర్తి గన్న వేదాంతియాతడు
కవులు మెచ్చుకొనెడి కవియతండు
సరసరాజనీతి చాణిక్యుడాతడు
స్వార్ధరహితుడైన సాధుగుణుడు.
పద్యాలతోరణం... దత్తవర్ణన: అల్లూరి సీతారామరాజు.
నా వర్ణన: మీపొన్నెకంటి.7.05.2020.
సీ: ఆంగ్లేయశునకాల యసువులు బాపంగ
చెలరేగి దుమికిన సింగమీవు
భారతావని కంట వరదయైపాఱిన
కన్నీరుదుడిచిన ఘనుడవీవు
స్వాతంత్ర్య సంగ్రామ సంఘాలు నడిపించి
మన్నెంపు పులివైన మనిషివీవు
"రూధర్ఫరుడు"నకు రోషంబు రుచిజూపి
యుద్ధంబు సల్పిన యోద్ధవీవు
తే.గీ: నీదు కన్నుల రేగిన నిప్పుకొలిమి
ఆరదేనాడు భారతవీరులందు
అందుకోవయ్య జోహార్ల నమరచరిత!
నీకు సాటిగ నెవరుంద్రు నీవెసాటి.
గానగంధర్వ...ఘంటసాల గారి వర్ధంతి సందర్భముగా.
(జననం) 1922.డిశంబర్.4.---1974 .పిబ్రవరి.11.
సీ: కరుణరసాన నీ గళముకంపమునొంద
కన్నీరుగార్చులే కఠినులైన
వీరరసంపు వైవిధ్య ముంజూపిన
కనులరాలునునగ్ని కణములెన్నొ
శృంగారభావనల్ చిందించి పాడంగ
చిత్తాన మొలకెత్తు చిలిపివలపు
హాస్యరసంబును నలవోకపలికింప
కడుపుబ్బ నవ్వుల కళలువిరియు
తే.గీ. ఓయి స్వరమాంత్రికుండ!మహోన్నతుండ!
ఘంటసాలగ సత్కీర్తి మింటవెలిగె
జాతి గర్వించె నీదగు జన్మ చేత
గానగంధర్వ! నీసరి కనగనీవె.
సీ: సంగీత శాస్త్రాన సామర్ధ్యమున్నట్టి
యున్నతోన్నతులున్న నుండుగాక
వాగ్గేయకారులై వైవిధ్య రీతులన్
చోద్యాలు చూపిన చూపుగాక
పసితనమాదిగా పాండిత్యముంజూపు
ఉద్దండులుండిన నుండుగాక
జంత్రగాత్రములందు జాణత్వముంజూపు
ఉత్తములుండిన నుండుగాక
సుధలుకురియించు త్వద్గళశోభలెన్న
హాసదరహాస సుప్రభా వేసమెన్న
దేశభక్తిని ప్రకటించు ధిషణజూడ
నీకు సాటివి నీవయ్య నిర్మలాత్మ!
కీ.శే. అటల్ బిహారి వాజ్ పేయి గారికి అశ్రునీరాజనాలు.
అటలు బీహారి సత్కవి యమరుడయ్యె,
ఇంద్ర సభలోన కవులెల్ల మంద్రమైన,
భార విహ్వల హృదయాల పజ్జజేర,
స్వాగతించిరి సురలెల్ల సభకు నిపుడు.