27, మార్చి 2020, శుక్రవారం

(కరోన) కొఱగాని మమతలు...స్పందన.

               కొఱగాని మమతలేల?
1. పలకరింపులె యీనాడు బంధు తతిని
    పులకరింపగ జేయు సమ్మోదమలర
    బలము ధైర్యంబు చేకూర్చి భద్రమిమ్ము
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
2. స్నేహమున్నను నేగ నిషిద్ధమాయె
    ఇంటి గడపను ద్రొక్కగ నేమిముప్పొ? 
    దూరముననుండి క్షేమంబు గోరుమయ్య!
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
3. సెల్లు వాడుదు రింటింట చిన్న పెద్ద
    సొల్లు వాగుడు వాగక సున్నితముగ
    తాత బామ్మల క్షేమాల తరచి యడుగు
   సమయమునకిల కొఱగాని మమతలేల? 
4. రక్త సంబంధమున్నట్టి వ్యక్తులెపుడు
    బాధ్యతాయుత బంధాల వఱలవలయు
    వారి జన్మలె ధన్యంబు వసుధయందు
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
5. ఉత్తరంబులు వ్రాసెడి యూసులేదు
    సెల్లువాడుచు సరదాగ బిల్లుగట్ట
    వాడుకయ్యెను నద్దాని వాడుకొనుమ
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
6. ప్రేమ చూపించి నేర్పించు పిల్లలకును
    ఆవు వెంటనె నడచునా యనుగుదూడ
    సంఘ జీవిగ నీవిచ్చు సంపదదియె
   సమయమునకిల కొఱగాని మమతలేల? 
7. మ్రొక్కుబడికైన వృద్ధుల మ్రొక్కుమయ్య
    మునులు నేర్పిన  సద్ధర్మ పుణ్యకర్మ
    నేటి యీ "కరోన"కు మందేనాటికైన.
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
8. ప్రేమ లేకున్న జీవులు ప్రేతలగగును
    మమత సమతలె ప్రాణికి మధురస్మృతులు
    బ్రతికియున్నంత కాలము ప్రమదమిడుమ
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
9. ముచ్చటైనట్టి ప్రాణంబు బుద్బుదంబు
    బుడగ పగిలిన పిమ్మట పుడమిగలియు
    ప్రేమ పంచుచు పెంచుచు సేమమఱయు
    సమయమునకిల కొఱగాని మమతలేల? 
10. మనిషి జన్మంబు దుర్లభ మనగ నెఱుగు
      మెన్ని జన్మల పుణ్యమో యేమొగాని 
      సార్ధకంబుగ జీవించు సారయశుడ! 

   


   

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...