నూతి రాజగోపాల కృష్ణమూర్తి. ఉపనయన ఆశీస్సులు. 13.04.25.
ఓంకారమ్మను శబ్దము
ఝంకారము సేయవలయు సతతము మదిలో
హుంకారములెల్ల తొలగి
సంకాశమ్మగును నీకు శౌరి పదమ్ముల్.1
.ద్విజుడవైతివి గాయత్రిదేవి కరుణ
నూతి రాజగోపాలుడా! నూత్నముగను
అమ్మపాదాలు సేవింప నహరహమ్ము
వేదవేదాంత భావాలు విదితమగును. 2.
గాయత్రి మంత్రరాజము
ప్రాయంబున నేర్చుకొనిన ప్రజ్ఞలు పెరుగున్
శ్రేయంబు కోరి వచ్చును
‘‘ఓయీ గోపాలకృష్ణ ఉత్తమ వటువా! 3.
దైవ బలమును మించిన ధనములేదు
ధర్మ నిష్టను మించిన తపములేదు
మాతృసేవను మించిన మతములేదు
మరువబోకుమ" గోపాల!"మహిత తేజ!.4.
ఉపనయన మను క్రతువు మహోన్నతంబు
జ్ఞానసాధన కది జైత్రయాత్ర
భారతీయార్ష ధర్మంబు సారతరము
చేవను యశము నిచ్చెడి జీవగఱ్ఱ.5.
చిరంజీవి నాగవేంకట సాయి శ్రీకేయూర్ శర్మకు
శుభాశీస్సులు. ది. 28.03.2024. ఉ. గం.8.20.లకు.
ఓంకారమ్మను శబ్దము
ఝంకారము సేయవలయు సతతము మదిలో
హుంకారములెల్ల తొలగి
సంకాశమ్మగును నీకు శౌరి పదమ్ముల్.1.
ద్విజుడవైతివి గాయత్రిదేవి కరుణ
"సాయి వేంకట కేయూర శర్మవర్య!
అమ్మ పాదాలు వదలకు ననవరతము
వేదవేదాంతభావాలు విదితమగును.2.
నంబూరి వంశ ద్విజుడవు
కంబుగ్రీవుని కరుణను ఖ్యాతిని గనుమా!
సంబరమందగ సర్వులు
అంబరమును నందుమయ్య అతులిత ప్రజ్ఞన్.3.
గాయత్రి మంత్రరాజము
ప్రాయంబున నేర్చుకొనిన ప్రజ్ఞలు పెరుగున్
శ్రేయంబు కోరి వచ్చును
ఓయీ కేయూర వటుడ! సాయికుమారా!.4.
తల్లిదండ్రులు తాతలు తనివిజెంద
జ్ఞాన సముపార్జనంబును సలుపుమయ్య
దాని మించిన సంపదల్ ధరణిలేవు
ఓయి!కేయూర!వినుమయ్య సాయితేజ!.5.
చిరంజీవి నాగ శ్రీకర అద్వైత్ ఉపనయన
సంస్కార మహోత్సవ సం.న అక్షరాక్షతలు (డి.ఆర్.కె.మనుమడు)
సుముహూర్తము: 03.04.2024. బుధవారం ఉ: గం.7.44. ని.లకు.
శ్రీల గురియించు చిన్మయ చేతనంబు
నాల్గువేదాల వారాశి నలువరాణి
నిత్య శుభములె వరముగ నిలచునటుల
బ్రోచుగావుత! "శ్రీకరు" ముదముతోడ.
"దుగ్గిరాల"వంశ తోషణకర్తయౌ
"శ్రీకరుండు" వటుడు చిన్నవాని
"వేదమాత"సతము విజ్ఞానదీప్తులన్
మేధకందజేసి మేలుగూర్చు!
మహిత గాయత్రి మంత్రంపు మర్మమెరిగి
నిత్యసాధన జేయుమ!నీమమలర
సకల విజ్ఞాన శాస్త్రాల సారమబ్బి
"శ్రీకరాద్వైత" శుభములు చెలిమిజేయు.
చిరంజీవి అన్నాప్రగడ ఆస్తీక్ అభిరామ్ శర్మ
ఉపనయన సంస్కార మహోత్సవ శు.స.న
శుభాశీస్సులు.
సుముహూర్తము: ది. 12.04.2024.శుక్రవారం
ఉ. 9.29. ని.లకు.
వేదవేదాంత విద్యలు విశదపఱచి
జ్ఞాన నేత్రమ్ము దెరిపించు జనని నీకు
నిత్య పారాయణమ్మున నిన్ను మెచ్చి
కాచుగావుత!"అభిరామ! కరుణతోడ.1.
గాయత్రి మంత్ర విలువలు
ప్రాయంబున నేర్చుకొన్న బహువిధ విద్యల్
శ్రేయంబుగూర్ప నబ్బును
ఓయీ!చిరజీవి పౌత్ర! ఉన్నతవంశా!.2.
భరతభూమిన జననంబు పరమవరము
అందు విప్రుని జన్మంబు పొందుటన్న
ఎన్ని జన్మల పున్నెమో యెరుగలేము
దాని సార్ధక్యమొందించు ధర్మనిరతి.3.
దైవ బలమును మించిన ధనములేదు
ధర్మ నిష్టను మించిన తపములేదు
మాతృసేవను మించిన మతములేదు
మరువబోకుమ" ఆస్తీక!"మాన్య వటుడ!.4.
వంశ గౌరవమంతయు వసుధయందు
తానె సృష్టించుకోవలె తనివిదీర
దాని మూలంబె ధర్మంబు, తప్పవలదు.
"ఆస్తికాభిరామ!"వటుడ! అమలహృదయ!.5.