13, జనవరి 2020, సోమవారం

దత్తపది.

దత్తపది....
పద్యము..గద్యము.. మద్యము..హృద్యము.

   పద్యము ఛందోభరితము
   గద్యము సుసమాసపూర్ణ గౌరవమొప్పున్
   హృద్యమనవద్యమౌచును
   మద్యముతోసామ్యమౌను మత్తిలహృదికిన్.

    నా పద్య రచన.....
       ఆ.వె. పద్యరచనకేను ప్రారంభముంజేయ          
                నెనరు శబ్దచయము నెమక వలయు          
                భావగర్భపదము పరిపరిపరికించి                 
                పూర్తిజేయవలయు ముద్దుగూర్ప.

  "తలకుమించిన భారమ్ము" ధరనుగలదు
  సామెతగ సాహితీసుధా సాగరాన
  తలయె భారమై శకటాన తరలజేయు
  టనెడు కలియుగ చిత్రంబు కనగవినగ.

                నా రామమయ భావన..స్పందన.
  ఆ.వె: చెట్టులోన జూడ చిన్మయ మూర్తిగా
            కొమ్మకొమ్మలందు కూర్మి వెలిగి
            మొగ్గలెల్ల మారు మోదాన ఫలములై
            రామనామ రుచియె రసన కెగయు.ఖ
         
     [08/05 7:59 pm] జె జె. యస్: 
        ~~~~~~~
పదము పదమున కవియొక్క భావనలను
కంటి ముందట చూపె నీ  గానసరళి
తెలుగు కవితల నున్నట్టి తీయదనము
కలము గళముల నింపుగా మిళితమయ్యె .
[08/05 8:47 pm] suryanarayana rao ponneka: 
భావస్వారస్యమున్నట్టి పదములెంచి
 రసముచిప్పిలురీతిని వ్రాయుచున్న
 నీదు పద్యాలపరిమళ మెట్టిదన్న
  వేల మల్లెలొకసారె విచ్చినట్లు.
 
       ఈనాటి నాదత్తపది పూరణపై..

     ఆంగ్లపదములగూర్ప నాయాస పడితి
     భావమందిన పొసగవు పదములన్ని
     పదము కుదిరిన స్వారస్య మదనుతప్పు
     ఎట్లొ కూర్చితి గణములనీశుకరుణ.
[08/05 8:49 pm] suryanarayana rao ponneka: 
వేలమల్లెలు గుంపుగా విచ్చినట్లు.

   పద్యాలతోరణం... దత్తపది..రామాయణార్ధం.
    సాక్షి., ఈనాడు., జ్యోతి., ప్రభ..
           రావణునితో విభీషణుడు పలుకు సందర్భము:

     తే.గీ: సరళమౌ యోచనను మన"స్సాక్షి"తోడ
              జేయ,"జ్యోతి"ర్మయీ సీత చెరనుబట్ట
             లంక"కీనాటి"నుండియే "ప్రభ"లుతగ్గి
             పెద్ద ముప్పగు ననియె విభీషణుండు.

       పద్యాలతోరణం..16.05.2020. దత్తపది.
        వరి,రాగి,కంది,నూగు..అన్యార్ధములో..
        జాతీయ సమైక్యత...
       నూత్న సౌధాలనూయల"నూగు" రేడు
       రహిని జెడినట్టి వట్టి బై"రాగి"యైన
       ఎండ కెండుచు "కంది"న పండురైతు
       మమత "వరి"వస్యజెందు సమైక్యముంట.

   పద్యాల తోరణం. దత్తపది . వరి , కంది, రాగి, నూరు .
  అన్యార్ధాల లో .16.05.2020.
చం. చదువరి ఔచు నీవెపుడు చక్కని జాతి సమైక్య వృద్ధి నిన్
      పదుగురి కంది యీయగను పాయము సల్పుము చేతనుండవై
      విదురుని రూపమంది ఘన విజ్ఞత జూపుము రాగిల న్ సదా
      సదమల భారతాంబ యల చయ్యన నూగునుయేల హేలగా 

పద్యాలతోరణం. దత్తపది.కుక్క,నక్క,మొక్క,వక్క.
        అన్యార్ధములో.

        భరతదేశ"మొక్క"టెయిల భద్రమనుము
        అస్త్ర శస్త్రాల నెల"వక్క"డనుము ధీర!
        కుటిల భావాల నచ్చట "కుక్క"రనుము
        "నక్క"బోకుమ హర్యక్ష!నయముజెప్ప.

       
   

     పద్యాలతోరణం.. దత్తపది. కలము,హలము,పొలము,జలము.
       25.05.2020.   

  "కలము"ల సాహితీభువిని కమ్మనిసేద్యము చేసిసత్ఫలం
  బుల గవిరాజుగా నిడు నపూర్వయశోవిభవాభిరాముడై
  "పొలము"లు పండగా "జలము"ముచ్చట నింపిప్రభాతవేళలో
  "హలము"న దున్ని కర్షకు డహాయన తిండినిబెట్టు స్రష్టయై.
  ఇలపయినిర్వురిర్వరె మహీపతులౌను స్వరాజ్యమందునన్.

   విలువగు శబ్దబీజముల విస్తృతి నాటగ సాహితీభువిన్
  "కలము"ల దున్ని సత్కవులు కావ్యఫలంబుల నిత్తురెప్పుడున్
  "పొలము"లనిండుగా"జలము"పొంగగ మేలిమివిత్తనంబులున్
  "హలము"ను జేతపట్టి మనకన్నము బెట్టుదురీ కృషీవలుల్
   తలపగ సేద్యమందుకడు ధన్యులుపూజ్యులు భారతాంబకున్.

     "పొలము" "హలము" "జలము"లున్న కలలుపండి
     పంట నట్టింట  నిండంగ భాగ్యమబ్బు
     "కలము" మేధస్సు తోడైన కావ్యకన్య
     నడచి వచ్చును సాహితీనందనాన.

      నగ, వగ, పగ, మగ ..భారతార్ధం..1.06.2020.
        ( కృష్ణ...శ్రీకృష్ణునితో)నా పూరణ: మీపొన్నెకంటి.

       "వగ"లం గూర్చుచు నవ్విరి
       "పగ"యే లక్ష్యం బుగాగ పన్నిరి వలలన్
       "నగ"ధర!"మగ"టిమి జూపుచు
        తెగటార్చుము కౌరవులను ధీచతురతతోన్.
   
     పద్యాలతోరణం..7.06.2020.
    హరి,హరి,హరి,హరి,...అన్యార్ధములో... భారతార్ధం..
 
   కం: "హరి"సుతుని దానమడుగగ
         "హరి"కిచ్చెను కుండలముల నాత్మీయతతో
         "హరి"నటు జేరడునరుడని
         "హరి"కేతనమెత్తిరంత నద్భుతరీతిన్.

                                దత్తపది...
           రంగ,రంగ,రంగ,రంగ,..ఛందం యథేచ్ఛగా..గంగావర్ణన.

            కోర్కె దీ "రంగ" గంగను కోరినంత
            తాను పా"రంగ" సెలవిచ్చె ధరణిమీద
            ఈశు జే"రంగ" ముందుగా నిచ్ఛజూపి
            పిదప నాగలోకముజేరె భీకరముగ

             అంత"రంగ"ము నందున హాయిగాను
             నిన్ను దలచిన జే"రంగ" నిశ్చయంబు
             నాకలోకంబు, పా"రంగ"నౌదలంత
             గంగ! యెంత పున్నెమొ "రంగ"!ఘనముగాదె?
         
           చతు"రంగ" క్రీడ యందున
           మితిమీరిన నా తు"రంగ" మేన్గునుజంపెన్
           అతిభీకర"రంగ"మునను
           వెతలవి దీ"రంగ" మంత్రి విజ్ఞతలేవో?
       
           చైనా,చైనా,చైనా, చైనా... అన్యార్ధములో.. దేశపరిస్థితి.
     
         మంచై నాతో నుండుమ!( మంచి+ఐ)
         మంచై నామనము సతము మాన్యతగూర్చున్(మంచు+ఐ)
         కంచై, నాతను వుండు,వి(కంచె+ఐ)
         పంచై, నా పాటసాగు భారతసీమన్.(విపంచి+ఐ)

         
   విజ్ఞానము, వివేకము, విచక్షణ, పాండిత్యము, నిజార్ధం.స్వేచ్ఛాఛందం.

    వలయు "విజ్ఞాన"మెంతయో వాదమునకు
    వ్యూహ మల్ల "విచక్షణ" దోహదమ్ము
    దేహి కాత్మ "వివేకమె"ధిషణబెంచు
    మానవులకెల్ల "పాండిత్య"మవసరంబు

          కారు,వ్యాను,లారి,బోటు. అన్యార్ధములో...ఇతిహాసం.

           నీదు భ"వ్యాను" రక్తితో నిఖిలజగము
           పరమ"కారు"ణ్యమందును పద్మనాభ!
           ప్రముఖ దైత్యకు"లారి"! మురారి! నీవె
           గతియ, "బోటు"ల ద్రుంచుమో గరుడగమన!
           (బోటులు..ధూర్తులు)

      సతి,పతి,గతి,మతి...స్వేచ్ఛా ఛందము.
         

         "మతి"మంతమైన గుణవతి
         "సతి"యైచనినంత"పతి"కి స్వర్గమ్మౌ-స
         "ద్గతు"లిలగల్గును కీర్తియు
         నతులిత సౌఖ్యంబు గూర్చి యాదర్శంబౌ.

          
           తల,వల,కల,బల..దత్తపది...భారతప్రశస్తి.

       "వల"సిన నీతిశాస్త్రములు వైదికవాజ్ఞ్మయధర్మసూక్ష్మముల్
     "బల"ములు రాజ్యకాంక్షలునుపన్నినవ్యూహపులోతుపాతులున్
       "తల"పులచాకచక్యములు తత్త్వవిచారణ శోధనాంశముల్
      "కల"గలిసెన్ మహా భరత గాథను వ్యాసమునీంద్రుపుణ్యమున్.

     జామ,మామిడి, పనస,కమల...అన్యార్ధములో.ఇతిహాసం,
   
         మా"మిడిమిడి"విజ్ఞానంబు మాపు రామ!
         నీప ద"కమల"యుగళినే నిశ్చలముగ
         వేద"పనస"ల పఠియించి మోదమలర
         లలిత విం"జామ"రల్వీచు లక్ష్మణుండ!

     ఇల,కల,వల,తల,.కరోనా..అంశం..
     
        ఇలలో నెవ్వరెరుంగని
        కలలో నూహింపరాని కారోనక్రిముల్
        తలక్రిందుజేసి జగతిని
        వలలోబంధించివైచె వంతలుబెట్టన్.

        రామ,రామ,రామ,రామ.అన్యార్ధము.దత్తపది.భారతార్ధము..

       రామ" కృష్ణ”కు కౌరవరాలుగాయి ....(స్త్రీ )
       పగను నిర్వి"రామం"బుగ వల్వలూడ్వ ...(ఎడతెగని)
       రమ్య సారము వీడిన "రామ"కాగ...(మీనభేదము)
       కృష్ణు డా"రామ"మిడెనంత కీడుదొలచి.
      (ఆరామము=సంతోషము)

         పాలు,పెరుగు,మీగడ,వెన్న...ఇతిహాసార్ధంలో ..
                       ఛందం..ఐచ్ఛికం.
      (ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుని పలుకులు )

        "పెరుగు" చున్నట్టి పా"పాలు" కరుగజేయ
        "మీగడ"ప ముందు నిల్చితి మేలుకొరకు
        మామ! ఇకనైన నీ"వెన్న"మంచిత్రోవ
        కీడు జరుగదిర్వురకని కృష్ణుడనియె.

       గుడి,గోపురం, ప్రదక్షిణం, పూజ. రాక్షసుల వర్ణన.
         

         " గోపురమ్ము " పైన కోపాన గ్రుమ్ముచు
          "గుడి"ని హరిని గూడ  కూలద్రోసి
          తనకు భక్తి మయి  "ప్రదక్షిణ" పూర్వక
          "పూజ" గోరె ఖరుడు మునులనాడు.

         దత్తపది:  క్షీర,నీర,తీర,ధీర...శ్రీకృష్ణ పరంగా...
                
    యమునా "తీర"వి హార గోకులపు దాహార్తిం దొలంగింపగా
    కమనీ యంబగు "నీర"మిచ్చునది. నక్కాళీయుడేజేరి యే
    గమనంబించుకలేని "క్షీర"దములన్ క్రౌర్యాన భక్షింపగా
    కమలాక్షుండటు "ధీరు"డై వరలి తత్కంఠంబు దున్మాడెగా.

       పార,కూర,తార,మేర...దత్తపదాలను రామాయణార్ధంలో..
       (వాలి మరణానంతరము తార రోదన.)
     
      "మేర" మీరు నధర్మంబ"పార"మైన
      కీడు చే"కూర" జేసెను కీశనాథ!
      "తార"పల్కులు వినవైతి దర్పమెసగ
      నాదు జీవితమంతయు నరకమయ్యె.

           రిన్, డెట్,నిర్మ,ఘడి..భారతార్ధము లో.  
            రాయబారి గా వచ్చిన కృష్ణుని కట్టివేయు
            ఆలోచనలో దుర్యోధనుడు.
        

              కృష్ణు"డెట్లై" న మనలను కించపఱచు
              నీలవర్ణుడు కాడెప్డు "నిర్మ"లుండు
              కాన నీహ"రిన్"ద్రాళ్ళతో గట్టివేయ
              పరమ దు"ర్ఘడి" యలగును పాండవులకు.

         విరులు,కురులు,గిరులు ,సిరులు....భారతార్ధము లో..
          పొన్నెకంటి సూర్యనారాయణ రావు.   
         "విరుల సిరులవి" వనమున విస్తరింప
         ప్రేమ భావాలు చిగురింప భీముజూచి
         కేలుబట్ట హిడింబయె "గిరుల" సాక్షి
         "కురులు" సవరించి కలిసెనక్కుంతిసుతుని.

       తామర,కుంద,పొగడ,కుముద....అన్యార్ధాలలో...స్వేచ్ఛా ఛందం.
    ( కుచేలుడు కృష్ణుని తో పలికిన పలుకులు)
      
      నన్ను  "పొగడ"కయుండుట నా"కుముద"మ
      గున్ ము"కుంద!" "తామర"యగ కోవిదులగు
      ఒక గురువుచెంత జదివిన నొక్కటగుట
      జరుగదనె కుచేలుండంత చక్రితోడ.

                      తరము,వరము,సరము,నరము.ఇతిహాసార్ధం.
                 
       ( విభీషణుడు రావణుని తో పల్కు .సం.)
    "వరము"లున్న కావరమున వైరమూన
     నీ"తరమె" గెల్వ శ్రీరాము నిర్మలాత్ము
     వా"నరము"లెల్ల వారధి వరుసగట్టె
     అవ"సరము" సంధి యిపుడామహాత్ముతోడ.

      "వరము"లు గాగ రామకథ భారత భాగవతాదిగ్రంథముల్
      "సరము"ల రాశులై వెలసె సంస్కృత మందుననాంధ్రమందునన్
      తర"తరము"ల్తరింపగను ధార్మికవర్తనులై చరింపగన్ౠౠ
      నర"నరము"ల్విశుద్ధమయి నైతికవిల్వలు వృద్ధిచెందుగా.

        సాయము,గాయము,న్యాయము,ధ్యేయము..నేటిదేశస్థితి.
                           ఇతిహాసార్ధం.
      (రామరాజ్యములో శునకము రామునకు విన్నపము)
 
      "గాయము"జేసె నాశిరము క్రౌర్యముగానొక భిక్షుకుండిలన్
      "న్యాయము"గోర రాముసభ నాకుప్రవేశము నిమ్మటంచునున్
      "సాయము"వేడె లక్ష్మణుని సౌమ్యత దుఃఖితసారమేయమే
      "ధ్యేయము" రామరాజ్యము సుధీనిలయంబని చాటిచెప్పుటే.

             అండము,ఖండము,దండము,గండము. ఇతిహాసార్ధం...
        

        అండములన్నియున్బగిలి హాయిగ నాగులు జేరె కద్రువన్
        ఖండముజేసెనా వినత క్రమ్మర పుత్రునిగాంచుకోరికన్
        గండము దప్పివెల్వడిన కామిత పుత్రుడనూరుడంతటన్
        దండమునీనె దాస్యమును తల్లికి నీగతి నుండకుండగన్.

        తీపి,పులుపు,కారము, చేదు. అన్యార్ధంలో.

               " పులుపు" కనులకు నెగదట్టి మూర్ఖుపగిది
               నేన హం"కారము''నదూగి నియతిలేక
               "తీపి" నెయ్యుల సైతము మాపియుంటి
                శ్రీనివాసుడ కరుణించి "చేదు"కొనుమ.

            నక్రము,వక్రము,చక్రము,తక్రము...ఇతిహాసార్ధం..
  
        వక్రమునైన బుద్ధి నది వంకను కాపునుగాచి చూచెడా
       నక్రము నీటజేరిన ఘనంబగు నేనుగు జంపజూడగా
       చక్రముబంపి కాచెనట చక్రి మహత్తర భక్తదాసుడై
       తక్రములెల్లబాపి తను ధర్మము నిల్పెను కామితార్ధుడై.
        (తక్రము=అరిష్టము)

       పట్టు,పట్టు, పట్టు, పట్టు. రామాయణార్ధంలో.. ఉత్పలమాల.
      (మారీచుడు...రావణాసురునితో పలుకు సం.)
     

     పట్టునుబట్టితీవిపుడు బంగరులేడిగ మారుమంచునన్
     పట్టునువీడు రాఘవుని బాణపు దెబ్బది ప్రాణఘాతమౌ
     పట్టుట రాముభార్యనటు భావిని లంకకు చేటుదెచ్చుగా
     పట్టుదలల్శుభంబులకు పాదులుగావలె రావణాధిపా!

     అందము,కందము,మందము,బృందము.లతో..

     మందము గల్గిన యూహల
     బృందము సంతోషమంది భేషనిపొగడన్
     కందమువ్రాసిన సత్కవి
     యందముగా యశమునందు నద్భుతరీతిన్.

          వన,తన,ధన,మన...వనసంరక్షణ.

     "తన" రక్తబంధమైనను
     "ధన" మున్ననెగాని రక్ష దలపరుమదిలో
     "వన" మునుబెంచగ సతమది
     "మన" లను కాపాడుచుండు మానితరీతిన్.

     "తన" తనువు చీల్చి కాల్చిన
     "మన" పై కసిలేక దయయు మాన్యతతోడన్
     "ధన" మిచ్చి యాదు కొనునా
     "వన" ముల కాపాడువాడె వందిత నరుడౌ.

      లాయరు,మేయరు,గోయరు,సీయరు...రామాయణార్ధంలో...
    రాక్షస సబలా యరుగుము రాముకడకు
    జాల"మేయ, రు" చిరగతి జగతిసుతకు
    ప్రేయ"సీ! యరు" దైనది ప్రేమనిడుదు
    స్వామి వరమిది"గో! యరు" సమ్మెయనియె.
    రాముడంతట మారీచు రహినిద్రుంచి.
పంపు ,హంపు ,డంపు , లంపు.  అన్యార్ధం. ఇతిహాస పరంగా.
      

      "పంపు" రావణ!సీతను భర్తకడకు
      నీదు మో"హంపు"తలపుల చేదువదలి
      క్షయమ "డంపు"మ నీకిది సాధ్యమనుచు
      వేడె తమ్ముడు  కా"లంపు"విలువదెలిసి. 

     లంచి ,బెంచి , పంచి , రెంచి. రామాయణార్ధంలో..పూరణ.
        

       మంచి దా"రెంచి" వర్తించు మాన్యవిభుడు
       రాము సతిపట్టగ హృది క"లంచి"పోవు
       నిల పరసతిగోర నశుభం"బెంచి" చూడ
       భామ నీపట్ల తెగిన వి"పంచి" యగున
       నియె విభీషణు డన్నతో నిర్ణయముగ....1
        పంచిన తరుగని గాథ, త
       లంచిన మోక్షంబునిచ్చు రామునిచరితం
       బెంచి చదువుకొనుమా! పో
       రెంచిన రావణు గతి,విధి రీతులుదెలియున్....2.
     
   కలము ,జలము ,బలము ,తలము.....కవి.కవిత్వ సంబంధం.
      

      "కలము"ను గదల్చు సత్కవి
      "బలమ"గు భావంబులెల్ల పరుగులుదీయన్
      "జలమ"యి చిప్పిల కవితలు...(అమృతము)
      "తలమే"పొగడంగవాని ధాతకునైనన్.(తరము రూపాంతరము)
    మదరు ,లెదరు ,వెదరు ,నెదరు.  అన్యార్ధం , ఇతిహాస పరంగా.
          (కృష్ణుడు...కీచకునితో పలుకు సందర్భము)
          

          పూ"నెదరె" కృష్ణ హింసింప? బుద్ధిలేక
          దారి తప్పు తులువ కా"మదరు"లు మీవి
          తరచి చూడ మీ పాపా"లెదరు"ల నిండ
          కృష్ణుడనె యధ"మదరు"ల   కీచకుగని. 
     
    దత్తపది.   ఏరా ,పోరా , రారా‌ ,లేరా.  దేశభక్తి సందేశం. 
     
         ఏరా! మౌనముదాల్తువు
         పోరా!యరిగణము జీల్చి పోటునుదెల్పన్
         లేరా!భారత పుత్రుడ!
         రారా!మనపరువు నిల్ప రాజితసుగుణా! 
సమస్య :శుకము , పికము , బకము , కుకము. నచ్చిన అంశంపై వర్ణన.
            శుకముల బోల్చుచుందురిల సుందరమౌ పసివారి పల్కులన్
            పికముల పంచమంబులను బ్రేమగ విందురు గానమూర్తులన్
            బకముల వోలెనందురిల వంకరచూపుల మౌనివర్యులన్
            కుకముల జంటజూపెదరు కోమలమౌ స్తనయుగ్మమెప్పడున్.
      మదన.సదన.వదన.రదన...ముగురమ్మలలో ఒకరినిగూర్చి. 
       మదనుని త్యాగఫలంబుగ
       వదనంబున మౌనముద్ర వదలిన భవు స
       త్సదనమున వెల్గు చుండు ద్వి
       రదనముఖుమాతను గొలుతు రాజితభక్తిన్.
       శారద! నన్నుగావుమ! సుసార విశేషకవిత్వ సంపదన్
       శ్రీరమ!పద్మజా!మదన సేవిత కల్ములరాణి బ్రోవవే
       మారవిరోధి హృత్సదన మంగళదేవత భద్రమీయవే
       కోరెద కొల్వగా సతము కూరిమి మీవదనాబ్జముల్సదా
     అందము ,కందము ,మందము ,డెందము. సమాజమునకు
                  సందేశము.
         డెందము తృప్తింజెందగ
         మందముగాసంఘసేవ మానకజేయన్ 
         అందము గొల్పును నరునకు
         పొందును మాకందమట్లు పూర్ణఫలంబుల్.
        
మఱ్ఱి ,వెఱ్ఱి , కుఱ్ఱ , నెఱ్ఱె. నేటి కవిత్వం పై పూరణ.
        కఱ్ఱి రూపాన శోభించు కుఱ్ఱడొకడు
        మఱ్ఱి నీడకు పశువుల మరలజేసి
       వెఱ్ఱి ముదిరి కైతలజెప్పె నెఱ్ఱెపైన
       నేటి కొందరి కియ్యది నిక్కమగును. 
        మఱ్ఱియూడల ఛందస్సు మానివేసి
        వెఱ్ఱి భావాల కావ్యాలు నెఱ్ఱె యనుచు
        కుఱ్ఱ కుంకలవోలెను కొందరకట
        తెనుగు కవితల వెలయింత్రు ధీరగరిమ.

   వాడు ,వాడు ,వాడు ,వాడు....భారతార్ధంలో ఉత్పలమాల.
    { వాడు=దూషించు.,శ్రమపడు.,ఎండిపోవు.,ఉపయోగించు. }
     వాడుచు దుస్ససేనుడల వక్ర మనస్కత క్రూరచిత్తుడై       (దూషించుచు)
     వాడిన మోముబెట్టుటకు,  వల్వలు కృష్ణకు దీయలేమికిన్.   (ఎండిన)
     వాడెడు ధర్మజాదుల నపారదయారస వీక్షణంబులన్     ( శ్రమపడు)
     వాడెడు మేటిధీరుడగు వంద్యుడు కృష్ణుడు నన్నుగాచుతన్.(ఉపయోగించు
     తాపసులందరుం బరమ ధన్యత జెందగ జూచువాడు త
     ద్గోపిక లందరుం గలసి కూడగ నెప్పుడు నాడువాడు సం
     దీపిత బర్హిపింఛమును ధీరత శీర్షము దాల్చువాడు నా
     ప్రాపున నుండువాడు ఖగ వాహను డెప్పుడు నన్నుగాచుతన్.
మందు ,విందు ,సందు ,పొందు.  భాగవతార్ధము. 
      "విందు"భోజన సదృశము విష్ణుకథలు
      మానిపించును రుగ్మతల్ "మందు"పగిది
      సారవంతంపు భక్తి ప"సందు"గూర్చి
      "పొందు"నర్హత గల్గించు ముక్తిపథము.
      వీనుల "వింద"గున్ సతము ప్రేమపఠింపగ విష్ణుగాథలన్
      మానవ రుగ్మతల్దొలచి మాన్యత గూర్చు ప"సందు" "మందు"గా
      దీనత బ్రోవుమంచు పరి వేదన జేయగ "బొందు"గూర్చుచున్
      దానె సమస్తమై వరలు తామరసాక్షుడు కృష్ణుగొల్చెదన్.
కలువ;చెలువ; విలువ; చలువ.   దైవస్తుతి....వృత్తం. 
      చలువలగట్టుపై నిలచి సాంద్రదయార్ద్ర విశేషమూర్తియై
      చెలువగు చంద్రఖండమును శీర్షమునన్ధరియించి సొంపుమై
      కలువల బోలుకన్నుల సగంబుగ దేహముతోడనున్న నీ
      విలువలు స్తోత్రముల్సలుపు విజ్ఞుల భక్తుల గావుమో భవా! 
      రాగి‌ ,కంది ,వరి ,తిల. అన్యార్ధంలో శివస్తుతి.
       శంక రా! గిరిజాధవ! సర్పభూష!
       భూతి లభియింప జేసెడు పుణ్యపురుష!
       కంది పోవగ నామేను కంబుకంఠ!
       నీదు వరివస్య చేతునన్నేలు సామి!

జయప్రద , జయసుధ , జయచిత్ర , జయలత. ధనుర్మాస వైభవము. 
          "జయసుధ"లనీను పావిత్ర్య సమయమిదియ
           చక్కని "జయప్రద"మగునా సార సాక్షు
            సేవజేయగ "జయలత!" క్షేమమగును
            శ్రీధనుర్మాసమున "జయచిత్ర"!రమ్ము.!
          "జయసుధా"రమ్ము గోవిందు సారసాక్షు
           సేవ జేయగ "జయచిత్ర!" క్షేమమలర
           కలత లన్నియు తొలగి "జయలత"లు విరిసి
           ధర "ధనుర్మాసము "జయప్రద"మ్మె యగును
భారము , దారము , కారము , సారము. విషయము , ఛందము 
         ఐచ్ఛికము.
      సారము గల్గుసత్కృతుల చక్కని చిక్కని వాక్సుధా రసో
      దారము నీవుజూపగను ధన్యత గల్గును ప్రేమమై సుసం
      స్కారము వృద్ధిజెంది పలు సౌఖ్యములబ్బును సాటివారిలోన్
      భారముగాదు జీవితము బంగరు బాటగు నెల్లవేళలన్.

చిటచిట , పటపట , కటకట , బొటబొట...భారతం. చంపకం. 
    భీముడు ద్రౌపదితో..
    కటకట!ద్రౌపదీ!పరమక్రౌర్యత దుష్టుడు దుస్ససేనుడే
    పటపటలాగె వల్వలు సభాంతరమందు మదోద్ధురుండునై 
    చిటచిటలాడబోకుమని చెప్పెను భీముడుదగ్రతేజుడై
    బొటబొట కారు నీ కనుల భూరిజలంబులె వారిమృత్యువౌ.
           సందు ,పొందు ,మందు , విందు. అన్యార్ధంలో..
          మందుడు పసందు గాకను
          విందొనరింపన్ మనోజ్ఞ వేదిక పై రూ
          పొందించునె సత్కళలను?
          అందము చిందించు కృష్ణుడాతడుదక్కన్ !
 
చింత,వేప, రావి, మద్ది...అన్యార్ధాలలో శ్రీకృష్ణ స్తుతి. 
      చేర రావే!పరాత్పరా!చింత సేతు
     మదిని మద్దిశా సూచివి మహితగతివి
     రా !వినిర్మల సద్గుణ! రక్షసేయ
     భక్తమందార యదుకుల వంశతేజ!

   కోపము,తాపము ,శాపము ,పాపము. ఐచ్ఛిక ఛందస్సు , విషయము.
     కోపము కాల్చుచున్నరుని కూల్చు మహోన్నతమార్గభేదియై
    తాపము గ్రుంగజేయుగద ధార్మిక భావవిశేషవైఖరిన్.
    పాపము జన్మజన్మలకు బాయని శత్రువు కావునన్సఖా
    శాపము నొందరాని మధుసారపు జీవిక నందగావలెన్.
       కోపము వచ్చును గిట్టక
       పాపము పెంపొందు క్రూర భావమువలనన్
       తాపము బోవును ముదమున
       శాపము నశియింపజేయు శక్తులనెల్లన్. 

    దత్తపది: భాష ,భూష , దోష ,వేష. భారతీయతా వైశిష్ట్యం. స్వేచ్ఛాఛందము.
    వేషము పంచెకట్టు ఘన వేదపుసారము మార్గదర్శమై
    దోషము సుంతలేని వరధుర్యులు వీరులు త్యాగశీలురున్
    భాషణ భూషితుల్ పరమ భక్తులు పండిత సత్కవీశులే
    భూషలు భారతాంబకిల మోదముగూర్చుచు ఖ్యాతిబెంచెడున్..
   దత్తపది : వరము ,వరము ,వరము ,వరము...ఐచ్ఛిక   
   ఛందము. భగవద్విషయము.
   వరములు కరముగ గలవని
   పరవనితల కావరమున పట్టెడు లంకా
   పురవిభుని నడచె నరుడు బ

  క్రొత్త , అత్త , చెత్త , దుత్త ..కుటుంబ పరముగా . 

  క్రొత్త కోడలిదిట్ట నా కోమలాంగి 
  యత్తపైనున్న కోపంబు దుత్తమీద 
  జూపి హెచ్చరికను బంపె చూడుమనుచు 
  చెత్త కోపాల కీడు ముంచెత్తు గాదె . 

 చెత్త జగడాలు సతము యోచింపకుండ 
 క్రొత్త కోడలు తన వంశ కోడలనుచు 
 నత్త వర్తింప ప్రేమగా హ్లాద మొదవు 
 దుగ్ధమది వెళ్లి విరియును దుత్తనిండి . 

బడి, గుడి, తడి, మడి . పోరంబోకు పరిస్థితి . వర్ణించాలి. 

బడిలో గ్రామముగ జదువఁడు 
గుడి చుట్టును దిరుగుచుండు కుంచితబుద్ధిన్ 
మడిబట్ట తాకుచుండును 
తడియారాక తిండి దినును దబ్బరగాడై . 
కాంతి ,క్రాంతి ,శాంతి, దాంతి. రామాయణార్ధము. ఛందమైచ్ఛికం.
    (మండోదరి రావణునితో..)

   దాంతిని లెక్కసేయకను ధన్యత పెక్కు వరాలనంది-బల్
   క్రాంతిని దెచ్చి లంకనిల గౌరవ మొప్పగ నేలినాడవే!
   శాంతివిదూరమౌ; ధరణిజన్ గొనివచ్చుట హింసబెట్టుటన్
   కాంతి నశించు పాపమున; కాదనబోకుమ రామువేడుమా!

   అన్న, అక్క, అమ్మ, అయ్య..అన్యార్ధాలలో.పద్యాల తోరణ వర్ణన.
       
      "అన్న"మయ్యలు కొందరై యాలపించ
      "అమ్మ"ణిమయప ద్యములతోరమ్ము వెలసె
      "నక్క"జంబంది సురభి హృదంతరమున
      "అయ్య"మకు నమస్కృతులనె నంజలించి. 

  అన్నము, సున్నము, భిన్నము, ఖిన్నము...భారతీయ సంస్కృతి. 
   
    అన్నము దిన్న వెన్క నిక  హాయిగ భారత సంప్రదాయపున్ 
    సున్నములాకు వక్కలను సుందర కీరము బోలు రూపమున్
    భిన్నముగా హరించి కడు బిగ్గరగా పరి హాసమంచనన్
    ఖిన్నమనస్కులైరచట ఖేదమదొక్కటె తక్కువో యనన్.

   దత్తపది: కసరు,ముసరు,ఎసరు,విసరు.ఇతిహాసపరమైనది.
      
     "ముసరు" పాపాలు తొలగంగ, ముద్దు గుమ్మ
     సీత నారాము జేర్చుమ శ్రేయమగును
     "కసరు,విసరు"లు జూపిన "నెసరు"వచ్చు
     రావణా!లంక కనియెనారామ యపుడు.


     రామ,సీమ,భామ,కామ...ఇతిహాసపరంగా..
     మీపొన్నెకంటి.

     చేయ"రా!మ"నసున శ్రీరాము సంస్తుతుల్
     "భామ"తివగుచుండి భజన నెఱపు
     ప్రేయ"సీమ" ధురిమ మాయయే యగునోయి
     "కామ"నలు నశింప కలుగు సుఖము.
వన,వన,వన,వన...గజేంద్రమోక్షము. స్వేచ్ఛా ఛందము.
      
      వనమున జేరిన గజమును
      వనచరమదిబట్టె నిగిడి పంతముతోడన్
      వనమందులాగి ముంచగ
      వనజభవు పితను శరణనె ప్రాణముకొఱకై. 

      

  సమస్య: కారము నివ్వగ పతికిని కలిమియు హెచ్చున్.
     
     దూరపుటుద్యోగంబును
     కోరిన జీతంబురాని గోపాలునకున్
     గౌరియె తెలివిగ తనసహ
     కారము నివ్వగ పతికిని కలిమియు హెచ్చున్.
దత్తపది: గజ,గజ,గజ,గజ...గణేశస్తుతి. 

    గజముఖుడు పాలు ద్రావుచు 
    గజ కరమున తడుముచుండ కాళముబుసకున్
    గజగజమను గణనాథుడు
    నిజభక్తుల బ్రోచు గాత! నెమ్మిని సతమున్.

   గజమనగ నేను గందురు
   గజముఖ నామంబు చెల్లు గణపతి కెపుడున్
   గజచర్మధారి శివుడు; న
   గజకు ప్రియతమ తనయుండు కాచుత జగముల్.
   దత్తపది: దీప, తాప, కోప, పాప..బడుగుల జీవితాలు. 
   కోపతాపాల నెలవైన గుడిసెలందు
   పూట గడవదు తిండికి; ప్రొద్దుగ్రుంక
   చనును దీపమై వారింట చందమామ
   పాప సంఘమ్ము చరియించు పజ్జలందు.
   దత్తపది:  క్షణ క్షణ క్షణ క్షణ. పర్యావరణ రక్షణ.
   భక్షణ జేయసంతసము భాగ్యమునిచ్చు ఫలంబులన్నిటిన్
   లక్షణమైనరీతులను లక్షలువేలుగ వృక్షసంపదన్
   శిక్షణపొంది పెంచుమిక శ్రేయముగల్గును జాతికంతకున్
   రక్షణ జేయవానినల రక్షణనిచ్చు గృతజ్ఞతాంజలిన్.

   దత్తపది: వరము,కరము,ధరము,స్వరము...శ్రీకృష్ణ పరముగా..
   స్వరమును బెంచి యాదవులవాంఛిత రీతిని రాళ్ళవానకుం
   గరము భయార్తులై చనుచు కంజదళాక్షుని రక్షగోర, భూ
   ధరమును పైకినెత్తి తన ధర్మము జాటగ సంతసంబయెన్
   వరములు వేడ భక్తిమెయి భక్తుల బ్రోవడె ప్రాణదాతయై.


    దత్తపది: లంబు,జంబు,డుంబు,చెంబు. శ్రీకృష్ణ కుచేల మైత్రి.
    చిరుగు చే"లంబు" తోనుండి సిగ్గుబడెడు 
    నా కుచేలు బు"జంబు" న నమరియున్న
    మూటకు క"డుం బు"లకరించి మోహనుండు
    వెలయ కా"చెం బు"రుషార్ధ ఫలములిచ్చి
దత్తపది: పద్యము,గద్యము,వాద్యము,హృద్యము...తెలుగు వైభవము.
పద్యములందు ఛందసును భావ రసార్ద్ర పదార్ధగుంఫనల్
గద్యములందు శైలి నవకంబగు దీర్ఘసమాస దీధితుల్
వాద్యపు రాగమోయనగ వాసినిగాంచు తెలుంగు భాష-బల్
హృద్యమమోఘమియ్యది వశీకృతులన్నొనరించు శ్రోతలన్.
   దత్తపది :  అమ్మ, కమ్మ, రెమ్మ, తెమ్మ.. ఇతిహాసపరంగా..
   తెమ్మన జానకి విషయము
   అమ్మను హృదయాన దలచి నంజనసుతుడే
   కమ్మగ శింశుప రెమ్మల 
   దిమ్ముగ పఠియించె రాము ధీవరుచరితల్.

  దత్తపది: మర, మర, మర, మర..అన్యార్ధం... రామాయణము. 
  పా"మర"త్వాన వాల్మీకి వరలెనిట్లు
  రామ నామంబు వేరుగ రసనతోడ
  నే"మర"ని భంగి "మర"లక నియతిజూపి
  భవ్యుడై తా"మర"సనేత్రు వరమునందె.
దత్తపది: తేలు, మేలు, కూలు, పాలు..భారతీయ ధర్మము. 
        తేలుచుంటివి యితరుల తీరుమరగి
        కూలు నాధ్యాత్మ సంపద క్రుళ్ళిపోయి
        మేలుజేకూర్చ వేగమె మేలుకొనుము
        భరత పుత్రుడ! ధర్మంపు బాలుపంచు.
దత్తపది: హారి, గౌరి, పారి, శౌరి....ఇతిహాస పరంగా...
        భక్త హృద్విహారి భవుని ప్రార్ధనంబు
        జేయు నాశౌరి సతతంబు చిన్మయముగ
        పారి జాతాప హరణుని చేరికొల్చు
        కనుల ముకుళించి యాగౌరి కాంతుడంత.
వనిత, రమణి, చెలువ, ప్రమద...అన్యార్ధం... రామాయణం...
    
     ధీ"రమణి" రామచంద్రుడు 
     చీరెన్ స్నేహమ్ము సేయ "చెలువ"ము మీరన్
     వీరా! లే"వని త"లపులు
     హా!రావణుడంత  "ప్రమద"మందుచు బల్కెన్.
దాడి,పాడి,వేడి,మాడి...భారతఘట్టము.
     (కృష్ణుడు దుర్యోధనుని తో..) మీపొన్నెకంటి.

     దాడి తలపుల మానుమో ధార్తరాష్ట్ర!
     పాడిగాదది యెవ్వేళ; పరమధర్మ
     తత్పరునకు నై దూండ్లను తడయకిమ్ము
     మాడి పోవక ముందె నీ మానధనము. 

శిరము, సరము, కరము, నరము...విషయము,ఛందము ఐచ్ఛికము.
   
   శిశిరమందున వనములు చిన్నవోయె
   వానరమ్ములు వెదకెను పండ్లకొఱకు
   శంకరమునయ్యె శివరాత్రి జాతరంత
   మాసరమ్మైన ప్రకృతికి మంగళమ్ము.
   (మాసరము=రుచిరము)
అనుమా, కనుమా, వినుమా, మనుమా...క్రియాపదాలుగా కాకుండా..
   ఛందము, విషయము ఐచ్ఛికము.
  
   (ఒక రాజకీయ నాయకుని పలుకులు)
   "అనుమా"నంబుల బెంచుచుండె నహహా యీనేతకాలమ్మునన్
   కనగన్ శం"కను మా'' యజేసి పటు ధిక్కారాత్మ నిందించు మీ
   కును క్షేమ"మ్మను మా"టదెల్పుటకుగా కూర్మిన్ బ్రవేశించితిన్
   "విను మా" ర్గంబున; నయ్యదే భవితకున్ వేగంబుగా శ్రేయమౌ.
దత్తపది: కరి,హరి,సిరి, గిరి...భాగవతార్ధం..స్వేచ్ఛా ఛందము. 
    "గిరి"జన ప్రాంతపు మడుగున
    "కరి"జేరగ మక రిబట్ట కావగవేడన్
    "సిరి"చేలమువీడక "హరి"
     పరుగున తావచ్చి కాచె భక్తుని ప్రేమన్.
దత్తపది: శిరము,కరము,పురము,వరము..పురాణేతిహాసపరంగా..
      వరముగ దక్కు జానకిల భర్గుని చాపము ద్రుంచివేయుటన్
      కరము పరాక్రమింపుడన క్రన్నన రాజులు నిష్ఫలంబుగాన్
      పురముననెల్లరున్ మురియ ముద్దులరాముడు విల్లు విర్వగా
      శిరములు వంచిరా నృపులు సీతయు సిగ్గిలె వింటిమ్రోతకున్.
తమ్ములు..4పాదాలలో ..కందము లేక చంపకము. 
    తమ్ములు వందమందయిన ధర్మనిబద్ధత న్యాయ శాంత చి
    త్తమ్ములు లేనివారలె స్వధర్మవిఘాతులె కామలోభ చే
    తమ్ములె ధార్తరాష్ట్ర మమతాంధతజిక్కిన బాణఘాత భూ
    తమ్ములె కౌరవాగ్రజుని దాటుచుబోవునె మృత్యుఘుంటికల్.

    తమ్ములు విరియును జలమున
    తమ్ములు ధర్మాన మెరయు ధర్మజ్ఞు సభన్
    తమ్ములు ధుర్యోధను చి
    త్తమ్ములు పరమాత్మ తెగడు దైత్యులు వారల్.

గలగల, మలమల, వలవల, వెలవెల...

గలగల పాఱు యేరులవి కమ్మని రావము జేయలేకనే
వెలవెల బోయె; భాస్కరుని వేడిమి మ్రింగుచు తాపమందుచున్
మలమలమాడిపోయినవి మ్రాకులుసైతము;  చుక్కలేకనే
వలవల కంటినీరచట వాగగుచుండెను జీవరాశికిన్ .

అన్నము చారు పులుసు కూర..అన్యార్ధాలలో. ఇతిహాస పరంగా..
శకుంతలను గాంచి దుష్యంతుడు...
   "చారు" తరమది నీమేను చంచలాక్షి
   వం"పులుసు"కుమా రమ్మయి వన్నెదెచ్చె
   ఓ శకుంతలా! సమ"కూర" యాశలన్ని
   నిలువు "మన్న ము" ఖము కంది జలజమాయె..
దండ,దండ,దండ,దండ...అన్యార్ధం..రామాయణం.
దండకాసురులకు దర్పంబునణగించి
దండ నేననియెడు ధర్మమూర్తి
దండధరుని గూడ ధర్మాన నడుపు కో
దండ రామ! నీకు దండమంటి.
దత్తపది: ఆకు, కొమ్మ, వేరు, చెట్టు..అన్యార్ధం. రామాయణం. 
(విభీషణుడు రావణునితో )మీపొన్నెకంటి.
"చెట్టు" త్రిమ్మరి లంకకు జేరెననగ
"వేరు" తలపులు సలుపక తీరుమార్చి
మహిత సీతమ్మ హింసింప మాను"కొమ్మ!"
"ఆకు"వలయాక్షి సాక్షాత్తు హరికి సతియ.
దత్తపది: కావి, తావి, మావి, రావి....అన్యార్ధంలో. భారతం.
  "కావి"వి వట్టిమాటలు వికారము గల్గెను కృష్ణ! నామదిన్
  "తావి"షపూర్ణ కీటకమధర్మువు తుచ్ఛుడు దుస్ససేనుడే
  "రా!వి"వరంబులేలయని రక్కసిబుద్ధిన వల్వలూడ్చెగా
  "మావి"ధి యిట్టులుండెగద మమ్ములగావుమ దీనబాంధవా!
  దత్తపది: నన,నును, నీనీ, నేనే..భారతం. ఛందం ఐచ్ఛికం.
  (శ్రీకృష్ణుడు పార్థునితో..)
  "నేనే" యాత్మను దేహిని
  "నీనీ" కర్మంపుచేత నియతము పార్థా!
   నన్నే మ"నన"ము జేయుము
   మా"నును" దుష్ఫలము కొంత మహిలో నీకున్.
దత్తపది: కారు, కూరు, కేరు, కోరు.పౌరాణిక పరంగా. 
    "కారు"కూతలు లంకేశ కట్టిపెట్టు!
    "కేరు"చుంటివి ననుజేర కీడుమూడు
    "కూరు"కొనిపోవు నీలంక కుధరమందు
    "కోరు"కొనబోకు రాముతో పోరునీవు
వాన..మూడు పర్యాయాలు. ఛందస్సు ఐచ్ఛికం. 
    
     వాన,వాన,వాన. ...మీపొన్నెకంటి.
    "వాన” వలయును ప్రజలకు వలదువరద
    "వాన"  రారాదు పిడుగుల భయముగొల్ప
     కర్షకునకు "వాన"లు దగు హర్షమొదవ
     వచ్చుటెంతయు మేలగు పచ్చినిజము!
మరొక వాన ప్రయత్నము.
     వనితయోర్తుక మేడపై వడియములను
     నెండమెండుగ నుండుట నెదనుదలచి
     యెండబెట్టగ గంటలోనేమి గతియొ
     వాన!వాన!వా నంచును పరుగులాయె!
దత్తపది: అందె బిందె కుందె పొందె. పల్లె పడుచు..చంపకమాల. 
    నెలతయొకర్తు బావి కడ నీటిని తోడగ "బిందె" తోడ నా
    లలనకు సాయమీయగను లక్ష్మియె "పొందె"శ్రమంబు; తానుగా 
    నలుపున "గుందె"; నాగమణి "యందె" ను సాయముజేయవేగమై
    గలగలనవ్విరందరును కాంతల చేతల జూచియంతటన్
   
     పొలమున నాటువేయుటకు బోయిన బావకు "బిందె" నీటినిన్
     తలపయి మోసికొంచు రహదారిన వచ్చుచునుండ"కుందె" గా
     నలసిన భార్య జేరుకొని "యందె" ను బిందెను "పొందె"సౌఖ్యమున్.
     వలపులు మోసులెత్తినవి వారల డెందములందు మెల్లగా. 
నన,నన,నన,నన....అన్యార్ధంలో...కృష్ణుని.
మీపొన్నెకంటి.
జనన మొందితి వట చెఱసాలలోన
మనన ముంజేయ గోపికల్ మాయజేసి
తనన తానన యాడించి తన్మయమున
మోక్ష మిడు రుచిరానన ముద్దుకృప్ణ! 


నన,నన,నన,నన....అన్యార్ధంలో...కృష్ణుని.
మీపొన్నెకంటి.
జనన మొందితి వట చెఱసాలలోన
మనన ముంజేయ గోపికల్ మాయజేసి
తనన తానన యాడించి తన్మయమున
మోక్ష మిడు రుచిరానన ముద్దుకృప్ణ! 

దత్తపది: కన్ను ముక్కు చెవి నోరు...అన్యార్ధం... రామాయణం. 
కన్నులను విప్పె సీతను గనగనెమలి
పూచె విరులన్ని హృదయాలు పులకరింప
సజల జలముక్కు శ్యామమై సందడింప
రాము మన్మనోరుచిరమ్ము రమ్యమాయె!.
దత్తపది: వనిత, రమణి, చెలువ, ప్రమద..స్వార్ధంలో..రామాయణం పరంగా.
    ప్రమద కైకమ్మ వరములన్ పంక్తిరథుడు
    రమణి సీతను హరియించి రావణుండు
    వనిత రుమ జెరపట్టియు వాలియపుడు
    చెలువ శక్తికి బలియైరి సిగ్గుమాలి.
దత్తపది: నది, మది, పది, గది...గురు శిష్య సంబంధము. 
జీవనదివోలె ప్రవహించు భావములను
గురువు మదినుండి గ్రహియించి కరువుదీర
మమత నేర్పిన గదినెప్డు మరువకుండ
శిష్యుడు పదికా లములున్న సిరులుగురియు.
ముల్లు మేకు చీల సూది....అన్యార్ధం..రామాయణపరంగా.
    కంఠముల్లుప్త మయ్యెను క్రమముగాను
    ప్రాణమేకుదురుండదు రావణునకు
    రామ ప్రాచీలసత్కీర్తి రహినిగాంచె
    దిశలు నిండెసూ దివిజంపు తేజమెల్ల
దత్తపది: అదుపు, పొదుపు, మదుపు, కుదుపు...ఆటవెలది ..స్వేచ్ఛా విషయం.
  అదుపునున్న యూహలందగించునుసుమ్ము
  మదుపు ధనము నరుని కుదుపుమాన్పు
  పొదుపు జేయ సతము ముదమునుగూర్చును
  వృద్ధి నిచ్చు మనకు ప్రియముబెంచు.

దత్తపది: ముల్లు, మేకు,చీల,సూది...నిజార్ధం..జాతీయోద్యమం. 
   ఏకు కైవడి చొరబడి మేకులైన
   తుచ్ఛులైనట్టి ఇంగ్లీషు దొరలతరుమ
   నుద్యమించెను జాతిమహోద్యమముగ
   ముల్లు, సూది,చీలలవలె ముందుకురికి.
దత్తపది: కంది,పెసర,సెనగ,మినుము. పార్వతీ కల్యాణం.
   కంబు కంఠుని స్పర్శతో కంది నగజ
   మేను, వెలసె నగవల్లన, మినుము పెసర
   రంగుల కదలాడు సర్పాలు రవళి సేయ
   గౌరి కల్యాణమాయెను ఘనముగాను.

దత్తపది : తట్ట,బుట్ట,చెట్ట,పట్ట. అన్యార్ధం...భారతార్ధంలో...
    "తట్ట" కృష్ణుని బంధించు దారియొకటి
    "పట్ట"రానంత ముదమందె పార్థివునకు
    జీవులం"బుట్ట"జేసెడు చిన్మయునకు
    "చెట్ట" గల్గునె? దుష్టుల చేష్టతోడ. 

లారి,వీలు,టైరు,టాపు...అన్యార్ధంలో.. రామావతార వర్ణన. 
   దానవకులారి రాముడు
   వానరులకు వీలుగలుగ వనములదిరిగెన్
   దీనుల చేటాపుటకై
   తానటమాటై రుసులకు దర్శనమిచ్చెన్.

దత్తపది: భద్ర, నిద్ర, ముద్ర, క్షుద్ర..నేటి సమాజంలో స్త్రీ పాత్ర.
క్షుద్ర కామాంధ పశువుల క్రుళ్ళబొడవ
ముద్రవేయుమ వానిదౌ మూపులందు
నిద్రమేల్కొని స్వయముగా నిలువుమమ్మ
భద్రకాళియె నినుబూన భరతనారి!
దత్తపది: అండ దండ బండ కుండ...సామాజికాంశము. 
బండబారిన గుండెల పశువువోలె
అండలేనట్టి యువిదల చెండుచున్న
నీచకామాంధులెచ్చోట నిలువకుండ
దండనముసేయుమో సఖా! తప్పకుండ. 
సమస్య: కావలివారు తెంపుకొని కాయల పిందెలనారగించరే. 
కావలినుండితెచ్చి యిరు కాపులమామిడియంటు శ్రద్ధచే
నా వనమందు బెంచగ ఘనంబుగమూడవయేటనే యహో
కావలెనన్న వానిపయి కాపునుగాయగ చూడవచ్చినా
కావలివారు తెంపుకొని కాయల పిందెలనారగించరే.

సమస్య: పాలే గరళముగమారె ప్రహ్లాదునెడన్.
     కాలంబులు దేవగణము
     లీలన్ నాపాలనమున లేశపుశక్తుల్
     ఏలా హరి గొప్పను,గ
     ప్పాలే గరళముగమారె ప్రహ్లాదునెడన్. 



















        
       









   


  
    
     
     



 

    
         




   


పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...