28, డిసెంబర్ 2019, శనివారం

సాంఘిక ..సమస్యాపూరణలు

దానముజేసిన కలుగును దారుణ బాధల్.
        కం .  ఊనిక  శుద్ధపురక్తము
                హానినిఋగలిగించదెప్పుడారోగ్యమిడున్    
                కానక చెడు రక్తమునిల
               దానముజేసిన గలుగును దారుణ బాధల్.


     సమస్య : మాటలేరాని మగువయే పాటబాడె.
                     
   తే.గీ .  మీటుచుండెను వీణియ మించుప్రతిభ
             మాటలేరాని మగువయే- పాటబాడె
            గాత్రమాధుర్యమున్నట్టి కమలచరణి
            సభనుశోభించెనిర్వరు విభవమొప్ప.


    సమస్య.  పగలోమున్గినవారి పాపచయముల్ భస్మంబులౌనెప్పుడున్.

మ .  పగలంబెంచుచు మానవత్వగుణముల్ భంగంబుగాజూచుచున్
        రగులన్ వర్ణపుభేదముల్ జనులలో రాద్ధాంతముల్బెంచుచున్
        వగపేమాత్రములేని కూళమదిలో భాస్వన్మహద్భక్తి నిం
       పగ, లోమున్గినవారి పాపచయముల్  భస్మంబులౌనెప్పుడున్.


సమస్య:  పూలవలన జెడెను పుష్పవనము.   
               గంధమిళితమయ్యె కమ్మని యాగాలి     
               పూలవలన, జెడెను పుష్పవనము
              దుష్టకీటకాళి తోరంపుదాడిచే
             మాలి!రమ్ము దాని మాన్పివేయ.


   యం.వి.పట్వర్ధన్ గారిచ్చిన సరదా సమస్య.

    సమస్య. డురుడురు డుర్రుడుర్రు డురుడుర్డురు డుర్డురుడుర్రు డుర్రుడుర్
       
 చం: వరముగ వచ్చుపద్యముల వైభవమొప్పగ వ్రాసినింపి సం
        బరముగ,బంగరుంచెరగు వస్త్రములంధరియించి వేగమై
        తిరమగు భావనన్ బయలుదేరితి వాహనశబ్దమిట్లనన్

   సమస్య .   ఇపుడు ఖంగున నూపురమేలమ్రోగెలల
    ఉత్పలంలో నాపూరణ.

 ఉ . హేలగ సర్వభూషలవి హేమమెయైనను తీసివేయగా
       జాలముచేయవద్దనుచు జాముకు జాముకు నేను
      బేల!పరాకుజూపితివి బిత్తరచూపుల వల్లెయంటివే?
      కాలిదితీసిన"న్నిపుడు ఖంగున నూపురమేలమ్రోగ


 సమస్య:కలహమ్ములు గల్గు భువిని కాంతల వలనన్.
                          నా పూరణలు.క
        లలనల మనములు చిత్రమె
        కలనైననునూహసేయ కాదేరికినిన్
        బలువిధ చరితల నరసిన
        కలహమ్ములు గల్గు భువిని కాంతలవలనన్.1

        అల పౌరాణిక చరితల
        నిల జానపదాలనెల్ల నిగ్గునుదేల్చన్
        విలయమ్ము దెచ్చి పెట్టెడు
        కలహమ్ములు గల్గు భువిని కాంతల వలనన్.2

        తలపగ పెండ్లికి ముందర
        లలనలు కడుప్రేమజూపు లౌక్యముతోడన్
        తలపున స్వార్ధము జేరగ
        కలహమ్ములు గల్గు భువిని కాంతల వలనన్.3

       సమస్య: దానముజేసిన కలుగును దారుణ బాధల్.
   
      మేనికి శుద్ధపురక్తము
      హానినిగలిగించదెప్పుడారోగ్యమిడున్
      కానక చెడు రక్తమునిల
      దానముజేసిన గలుగును దారుణ బాధల్.

      సమస్య:అవధానంబట రాణ్మహేంద్రవరమందయ్యో                భయంబయ్యెడిన్.

 నవభావాన్విత వాక్చమత్కృతులు,సుజ్ఞానంపువేదాంతముల్
 కవనంబందున ముంచితేల్చు రసవత్కావ్యంపునిర్మాతలౌ
 కవిలోకంబది కాలుమోపగలదా కాసింతచోటైన నా
 కవధానంబట రాణ్మహేంద్రవరమందయ్యో భయంబయ్యెడిన్.

         సమస్య:  ఉండి లేనిదొకటె యున్నదేమొ.
   
     రాజకీయమందు రవరవల్జేయుచు
     పదవినందసతము పరుగులిడును
     సేవజేయుచింత చిత్తాననొకకొంత
     ఉండి లేనిదొకటె యున్నదేమొ.

       సమస్య: ప్రసవించును బావ యింక పదిదినఃములలో.
       నా పూరణ:  (ఒక బావమరది బావతో)
   అసమానప్రజ్ఞ గల్గిన
   వసివాడనిశశినిబోలు వర్ధిష్ణువునిన్
   మిసమిసలాడెడు నీసతి
   ప్రసవించును బావ యింక పదిదినములలో.

   పాలు.4 పాదాలు. అన్యార్ధాలలో...
   సురభి స్రవియించు "పాల"వి సురుచిరంబు
   త్రావ పా"పాలు" హరియించి ధైర్యమిడును
   మా సురభి భావరూ"పాలు"మానసాన
   నవనవోన్మష శి "ల్పాల"నవ్యశోభ!.

సమస్య: శ్రీకరముల్ సుధీజనవశీకరముల్ గద బూతుమాటలే.

   తేకువతోడ గెల్చి మనతీరునుమార్చెద నంచుబల్కు నా
   సోకులమారినాయకుడు సూక్ష్మవివేక విహీనతన్ సభన్
   వ్యాకుల చిత్తుడై చదువు వ్రాసిన పంక్తులె భీకరమ్ముగా
   శ్రీకరముల్ సుధీజనవశీకరముల్ గద బూతుమాటలే.

   సమస్య: లారీ రమ్మన్న అతడు రయమున వచ్చెన్.
             
               నారీ హంతక నీచులు
               వీరికి నురిశిక్ష నిడెను విజ్ఞత జడ్జే
               రారా అమలును జేయ -త
               లారీ! రమ్మన్న అతడు రయమున వచ్చెన్.

   సమస్య: అచ్చతెలుంగుపద్యమున నాంగ్లపదంబులె
     శోభగూర్చుగా.
     
    విచ్చిన మల్లెమాలవలె వేదికలన్కవిరాజు కైవడిన్
    మెచ్చిన మాతృదీవనల మెల్పున నందమువిందొనర్చెకడున్
    అచ్చతెలుంగుపద్యమున, నాంగ్లపదంబులె శోభగూర్చుగా
    వచ్చిన చిత్ర సీమకవిపండితమిత్రుల పాటలందునన్.
 
   సమస్య: కోడలివైపువాడనని కోపమునాపయి జూపబోకుమా

   కూడుకు గుడ్డకెయ్యెడల కొంచెములోటును కానకున్న-మా
   వాడు కవీంద్రుడంచు సరివారలు నిత్యము సత్సభాస్థలిన్
   వేడుకమీరగా ఘనత విద్యకె గారవముంచిరెల్లరున్
    కోడలివైపువాడనని కోపమునాపయి జూపబోకు"మా"!

   పద్యాలతోరణం..సమస్య.
  పనికిమాలిన వాడెపో ప్రాజ్ఞుడగును.
 వేట జీవనమైనట్టి విల్లుకాడు
 పాపభారము వహియింప భార్యనడుగ
 పోషణంబది నిరతంబు పురుషులదన
  పనికిమాలిన వాడెపో ప్రాజ్ఞుడగును.

    దత్తపది. కని , కనక , చని , చనక.
 దైవనిహతుల"కని" దయసుంతయునులేకఋ
 "కనక"యున్న యటుల కదలువాని
 "చని" సమీపమునకు సాయమీయనివాడు
 "చనక" పోవుటదియ చక్కనగును.

 
   సమస్య..కారమె సర్వ జనులకు కమనీయమురా.
         తారణనుజేయు దైవము
         శ్రీరాముడెపో తలంచ చిత్తము నందున్
         లేరా పూజకు నాసం
         స్కారమె సర్వ జనులకు కమనీయమురా.
      సమస్య: ఆలస్యము వలన నమృతమాయెను విషమున్.
                     నా పూరణ..
              నేలను పదునది యుండగ
              మేలగు బీజంబు జొనుప మించును ఫలముల్
              కాలము నెఱుగని స్థితిగతి
              ఆలస్యము వలన నమృతమాయెను విషమున్.
     
                పద్యాలతోరణం.. నేటి సమస్య:
             పనికిమాలిన వాడెపో ప్రాజ్ఞుడగును.
   
   తే.గీ: వేటజీవనమైనట్టి విల్లుకాడు
             పాపభారంబు వహియింప భార్య నడుగ
             పోషణంబది నిరతంబు పురుషునిదనఋ
             పనికిమాలిన వాడపో ప్రాజ్ఞుడగును.

            దత్తపది: కని, కనక, చని, చనక.
         
    ఆ.వె. దైవనిహతుల"కని" దయసుంతయునులేక
             "కనక"యున్నయట్లు కదలువాడు
             "చని"సమీపమునకు సాయమీయనివాడు
             "చనక"పోవుటె మేలు చక్కగాను.

                  శంకరాభరణము. సమస్య:
                కన్నవారిని తల్లియే కాటికంపె.

        గ్రుడ్లుపెట్టిన పెనుబాము ఘోరమైన
         క్షుత్తు సైపలేక తినెను గుటుకుమనుచు
         ప్రకృతి తత్త్వ మయ్యెనుగదా పాములకును
        కన్నవారిని తల్లియే కాటికంపె.

                   శంకరాభరణం. వారి సమస్య.
         స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీ బెండ్లాడన్.
 
     కం. చేకుర ధర్మపథంబులు
           వ్యాకులములు సమసిపోవ వైద్యంబిదియే
           తేకువమీరగ చిచ్ఛా
            స్త్రీ!కడు ధన్యతను గనుము స్త్రీ బెండ్లాడన్.

      పద్యాలతోరణం వారి న్యస్తాక్షరి.
  1పా.1వ అక్షరం..తో., 2వ పా.2వ అక్షరం..ర., 3వ పా. 3వ
   అక్షరం.ణ., 4వ పా. 4వ అక్షరం.ము..(కురుక్షేత్ర సంగ్రామం)
                     పూరణ....మీ పొన్నెకంటి.
"తో"రపు విల్లుతో ఘన మదోద్ధత కౌరవసేన మించ-న
 వ్వా"ర"ణయూధమున్నిలిపి వంతులవారిగ జంపుకొందరున్
 మార"ణ"హోమమున్జరుప మాయలుపన్నిరి వ్యూహకర్తలున్
 ఈరణ "మూ"హసేయపరమేశ్వర! కృష్ణుడె హేతుభూతమౌ.

    అమరనాథుని దర్శనం... నా అనుభూతి.

 అమరనాథునిగంటి నాత్మీయ భక్తుల
             మీనంపునేత్రాల మెరపులందు
 అమరనాథునివింటి నద్భుతస్వరములన్
             భంభంభోలెయనడు భజనలందు
 అమరనాథుని దరహాసచంద్రికలను
              నింపుకొంటినిహృది నిండుదనుక
  శ్రీహిమాలయమున చిత్తంబు భవుపాద
              పద్మాలకర్పించి ప్రణతులిడితిౠఖ
     ఎన్ని జన్మల పుణ్యమో యెఱుగలేము
     శివుని ఆజ్ఞగ భావించి చేరవచ్చి
     పారమార్థక చింతనంబరవశించి
     ఈశునాశీస్సులందితి రాశులెగయ.
                      పద్యాలతోరణం... దత్తపది.
             కల,కల,కల,కల,..స్వప్నార్ధం కాకుండ.
                             నా పూరణ:
    "కల"వను నమ్మకాన నిను గౌతుకమొప్పగ మానసంపు సం
    "కల"నము జేసి నీ చరణ గమ్యము, తాత్త్విక జీవనమ్మునున్
    "కల"వరపాటు లేక యిల కావ్యము వ్రాయగబూనుకొంటి నే
    "కల"తలు లేక భావముల కమ్మని శైలిని గూర్చుమో "శివా"!

                                 పద్యాలతోరణం..
          సమస్య: ముని ముష్టికి కీచకుండు పుడమిని గరచెన్.
   కం: కనులకు గామము కప్పగ
         మనమున నుప్పొంగు ప్రేమ మానిని కృష్ణన్
         అనునయముగ జేరన్, భీ
         ముని, ముష్టికి కీచకుండు పుడమిని గరచెన్.

   
పద్యాలతోరణం. సమస్య:
                 "నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష."

       తే.గీ: అనుకరింపగ కంఠంబు హ్లాదమంది
                యెచట నేర్చితో ప్రియశిష్య!యిట్టివిద్య
                చెప్పుమన్న బల్కెను నును సిగ్గుతోడ
                "నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!"

                పద్యాలతోరణం... నేటి దత్తపది..
         కనగ, శనగ, వినగ ,మునగ..భారతార్ధం...
             
             ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని తో....
   ఈ"శ!నగ"ధరా! సతము మమ్మేలు కృష్ణ!
   "కనగ"నీ విశ్వరూపంబు కనులనిమ్ము
   దేహ"మునగ"ల్గు బాధలు తీరిపోయి
   "వినగ"గోరుదు నీదివ్య విమలచరిత!,

    పద్యాలతోరణం.... దత్తపది..
   నిషిద్ధాక్షరములు... భ,ర,త,ము...భారతదేశ వైభవము.
     
    దైవయోచనగల్గిన దాసులున్న
    పావన ఋషిపుంగవులసంవాసియైన
    సకలధీనిధి గణ గుణ సంపదున్న
    హిందుదేశంపు సంస్కృతి యెందుగలదు?

     పద్యాలతోరణం... న్యస్తాక్షరి.  2.05.2020.
     1.వ.పాదం.10.వ. అ....."భా".
     2.వ.పాదం.  2.వ. అ....." ర" .
     3.వ.పాదం. 11.వ.అ....." త".
     4.వ.పాదం.   9.వ.అ....."ము".
     ఉత్ప లమాల....రామాయణార్ధములో పూరించాలి.
      (భరతుడు శ్రీరామునితో)
 ఉ: భారము రాజ్యపాలన స"భా"సదులంగనుసైగజేయగ
      న్నే"ర"గలేని సోదరుడ నీభరతుండ, నిజానువర్తుడన్
      శ్రీరఘురామ రమ్ము! ప్రజ చే"త"ము రంజిల శాంతమూర్తివై
      కోరిక దీర్చి కాచుమ"ము" కోసలవాస,ప్రభూ!దయామయా!

     
పద్యాలతోరణం... సమస్య..నా పూరణ: పొన్నెకంటి.
   కరణము వద్దుమాకనెడు కాలమువచ్చె నదేమి చోద్యమో

   హరహర! వాయువేగమున హైకులనల్లగ నుత్సహించుచున్
   తిరమగు సంపదన్ మరచి ధీయుతులెల్లరు గౌరవించెడా
   వరమగు పాణినిన్ మరియు వంద్యుడు చిన్నయ సూరిగారి,వ్యా
   కరణము వద్దుమాకనెడు కాలము వచ్చె నదేమి చోద్యమో
   
         చిత్రానికి పద్యం..
    కరము పట్టుకొంటి కన్నయ్య విడువను
    నీవె దిక్కునాకు నీరజాక్ష
    ఇహము పరమునందు నింకేమివలదురా
    జన్మధన్యమైన జాణనేనె.

      అరయగ మంత్రి వర్యులకు నాతెలుగన్నచెమర్చిపోవుగా
      భరమయిపోయివత్తులవి బాగుగసాగవు సత్సభన్సదా
      తిరగవు సంధిసూత్రములు తీయని వైనను కష్టమౌను .వ్యా
      కరణము వద్దుమాకనెడు కమ్మని పల్కులె కర్ణపేయమౌ.

      పద్యాలతోరణం... నిషిద్ధాక్షరములు... స,వ,ర,ణ....
      వాణీ స్తుతి....5.05.2020.
                నా పూరణ:
   తే.గీ: నాల్క పైనుండి యనిశము నాట్యమాడు
            తల్లి! కాపాడు మమ్ముల దయనుగాంచి
           నీదు కృపతోనె జగమెల్ల నియతి పల్క
           గల్గునోయమ్మ కచ్ఛపీ గానలోల!

       పద్యాలతోరణం.. నేటి సమస్య.
  శా: మీసంబుల్మెలివైచి నిల్చె నెదుటన్ మీనాక్షియోహోయనన్.
        (నాయకురాలు నాగమ్మ. బ్రహ్మనాయునితో)మీపొన్నెకంటి.

        రోసంబన్నది*పల్లెనాటి*బరి ధర్మోదంతముల్జూడకే
        వేసంబైనను వేయగాదగుదు నో వీరాగ్ర నంజూచితే!
        దోసంబే దియు లే దనున్గుటిలయుద్ధోన్మాది నాగమ్మయే
        మీసంబుల్మెలివైచి నిల్చె నెదుటన్ మీనాక్షియోహోయనన్.

   
             పద్యాలతోరణం. 9.05.2020.
  సమస్య: కంటికి పెట్టు కాటుకను కామినిపెట్టెను కాలిగోళ్ళకున్.
      (పరదేశమునకేగి ఆశ్చర్యపరచు నిమిత్తము భార్యకు
       సమాచారమియ్యక భర్త వచ్చిన సందర్భము)

       ఒంటరి జీవితంబుననునోపని దీనత మ్రగ్గుచున్సదా
       కంటను నీటిబొట్టులను కంటనె యొత్తుక సాగుచుండగా
       తుంటరియైనభర్త కడు దూరమునుండిగృహంబుజేరుటన్
       కంటికిపెట్టు కాటుకను కామినిపెట్టెను కాలిగోళ్ళకున్.

       (శ్రీరాముడు అరణ్యవాసము ముగించుకొని అయోధ్యకు
         వచ్చుచున్న సందర్భమున ఆపురమందలి ఒక స్త్రీ
         ఆనందములోని తొట్రుపాటు)
     
       మింటినిమంటినిన్సకలమేకముజేయసమర్ధుడౌచునా
       తుంటరులైనదానవుల దున్ముచు మౌనులగాచినట్టి,ము
       క్కంటిధనుర్విభంగకుడు క్రమ్మరివచ్చెడుసంబరంబునన్
       కంటికిపెట్టు కాటుకను కామినిపెట్టెను కాలిగోళ్ళకున్.

     
పద్యాలతోరణం..దత్తపది..11.05.2020.
        వంగ,కాకర,బీర,దోస...అన్యార్థంలో...పూరణ.
         నా పూరణ: మీపొన్నెకంటి.
     
         మకరముల"కాక ర"మ్మని మదినినెరిగి
        "దోస"మొనరించి సరసున దూకినాడ
         జీవితం"బీర"ణమునందె ఛిద్రమవక
         నన్నుగా"వంగ" శ్రీహరే నాకుదిక్కు

       పద్యాలతోరణం..దత్తపది....8.05.2020.
      టుడే..టుమారో..ఎవరు..నెవరు..
          నా పూరణ:  మీపొన్నెకంటి.

   మీ"టుడే"రోజు తప్పక మేటివీణ
   మీ"టుమారో"గ్య భాగ్యాలు మించిపోవ
   సాటి "యెవరి"ల నీకగున్ సరసగాన
   మందు చూడగా "నెవరు"మాముందులేరు.

      పద్యాలతోరణం... దత్తపది..సీతాస్వయంవరం
      చంపకమాల....నా పూరణ..12.05.20.
       1.వ.పా.1వ.అక్షరం.."క"
       2.వ.పా.2వ.అక్షరం.."మ"
       3.వ.పా.3వ.అక్షరం.."ల"
       4.వ.పా.4వ.అక్షరం.."ము"
  చం: "క"మలదళాయతాక్షి ధరకానుక,సీతస్వయంవరార్ధమై
         అ"మ"లినతేజుడై జనకుడంచితరీతి సభాంతరాళమున్
         భ్రమ"ల"నుదీర్చి యీధనువు భంగముజేసినవాడె ప్రేముడిన్
         గమన"ము"శ్రేయమై తనకు కౌతుకమొప్పెడు భర్తయంచనెన్.

    పద్యాలతోరణం...13.05.2020. 
   సమస్య: కారమెభూషణమ్ముగద కాంతలకున్మగవారికిన్ధరన్.

          భారతపుణ్యభూమిసరి భక్త తపోధన వేదమూర్తులున్
          శూరులుశాస్త్రవేత్తలును శుభ్రవినీతులు ధర్మతేజులున్
          భూరివివేకశీలురకు పొల్పుగఖ్యాతికిహేతువౌ- సుసం
          స్కారమె భూషణమ్ముగద!కాంతలకున్మగవారికిన్ధరన్.
మాలకొండయ్య గారిచ్చిన సమస్యలు..పూరణలు.

 సమస్య:మామిడి కొమ్మకున్విరిసె మల్లెలురోహిణియందువిందుగా

     మామయు మర్దియున్వెడలె మామిడి తోటకునీరునింపగా
     గోముగవారిజూచుటకు కోమలియచ్చటికేగి లీలగా
     ధీమతియౌచు కుందములద్రెంపుచు కొమ్మలపైకివేయగా.

      గోముగబెంచుచుంటినల కుందప్రసూనపు తీవజాతులన్
      నీమముదప్పిపోయియవి నిండుగమ్రానులవిస్తరింపగా
      నామనిరాకతో విరులు హాయిగవిచ్చెను గున్నమావిపై
      మామిడి కొమ్మకున్విరిసె మల్లెలు రోహిణియందువిందుగా.
   
       సమస్య: గుండ్రాతికికాళ్ళువచ్చి గునగుననడిచెన్.
            కొండ్రాళ్ళు ప్రేల్చు ఘటనన
            గుండ్రంగారంధ్రమేసి కూరగ మందున్
            బండ్రాయివోలె నుండక
            గుండ్రాతికి కాళ్ళువచ్చి గునగున నడిచెన్. 
 
      పద్యాలతోరణం... సమస్య.  నాపూరణ. మీపొన్నెకంటి.

    సమస్య: తనకోపమె తనకురక్ష దయ శత్రువగున్.

                  కనగా నెవ్వరు శత్రువు?
                  వినయంబేమియొసంగును? విజ్ఞతలేన
                  ట్టి నయము దయయేమియగున్?
                  తనకోపమె,తనకురక్ష, దయశత్రువగున్.

    పద్యాలతోరణం.. పై చిత్రమునకు (ఆవు ఒడిలో పులి)
     నా స్పందన..మీపొన్నెకంటి..22.05.2020.

  మునులున్ సిద్ధులు యోగులెల్లరును సమ్మోదంబులింపారగా
  మనముల్కల్మషదూరమై కరుణ సన్మార్గంబటంచున్సదా
  దినముల్గడ్పిన భారతావనిని సందేహంబులేలన్సఖా
  ఘనమౌ ధేనువు గుండెకద్దుకొనె వ్యాఘ్రంబున్ మహోత్సాహియై.

పద్యాలతోరణం...23.05.2920. నా పూరణ: పొన్నెకంటి.
   సమస్య: మొక్కలునాటగావలయు భూమిని జెట్లనుగొట్టగావలెన్.

     అక్కజమౌ సుగంధభరితాత్మ సుఖావహ జీవితాలకై
     మొక్కలు నాటగావలయుభూమిని౼జెట్లనుగొట్టగావలెన్
     నిక్కపు రక్కసుల్పగిది నీల్గుచునుండెడి కంటకావళిన్
     తక్కువ జేయుటే పరమధర్మ ముమానవశ్రేయమెప్పుడున్.

     చక్కనిప్రాణవాయువులు చల్లనిజీవనమందగోరినన్
     మొక్కలునాటగావలయు భూమిని, చెట్లనుగొట్టగావలెన్
     దిక్కదిలేకమాడినవి తీక్ష్ణహలాహల దుష్టచేష్టలం
     జిక్కి విశాఖయందు సరిజీవము వాసినవానినన్నిటిన్.

పద్యాలతోరణం.. నేటి సమస్య: 26.05.2020.
సమస్య:కన్నులులేనిపూరుషుడు కాంచితరించెను విశ్వరూపమున్
           
       మన్ననజూపి కావుమిక మాధవ! పాపములన్నిసైచి నే
       నెన్నడు చేయదుష్కృతము నీపదపద్మములంటిపల్కుదున్
       క్రన్నన దృష్టి నీయుమని కౌరవనాధుడు వేడినంతనే
       కన్నులులేని పూరుషుడు కాంచితరించెను విశ్వరూపమున్.
పద్యాలతోరణం...29.05.2020.
         నా పూరణ: మీపొన్నెకంటి.

   సమస్య: కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ.
                అందమె బంగారమ్ములు
                సందడులే జేయుగాని శాశ్వత మగునే?
                సుందర గుణములు స్ధిరమని
                కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

  పద్యాలతోరణం..3.06.2020.నా పూరణలు..మీపొన్నెకంటి.
ఋకఋ
      సమస్య: పగకల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్.

     కం.  పగయడగించుట శుభమౌ
            పగలవి బెరుగంగ సతము పతనంబెయగున్
            ఎగసెడు పగసెగలన్నా
            ర్పగ-కల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్.

      కం. పగలనక రేయి యనకను
            నిగమాగమ సారములను నిత్యము నిష్ఠన్
            తగువిధ మార్గంబుల నే
            ర్పగ.,కల్గినవాడె సౌఖ్యవంతుడు జగతిన్.

      పద్యాలతోరణం.6.06.2020..సమస్య:నాపూరణ. మీపొన్నెకంటి
  శా: విద్యన్ నే  ర్చినవా డె శుంఠ యగునీ పృధ్వీత లమ్మున్ గ నన్.

   విద్యల్వేద రహస్య సూత్రచయముల్ వేవేల బోధించుచున్
   సద్యస్స్ఫూర్తిని  పారలౌకిక మహైశ్వర్యమ్ములంగూర్చుగా
   హృద్యంబెంతయుకాని లౌకికమునే జృంభించు భావాలతో.
   విద్యన్ నేర్చినవాడె శుంఠయగు నీ పృధ్వీతలమ్మున్ గనన్.

        సమస్య: పంజరమున కుంజరమ్ము బంధింపబడెన్.
     రంజుగ వ్యూహము లల్లుచు
     భంజింపగనొకరి నొకరు భటుడును రాజున్
     రంజన చెడి చిక్క నృపతి
     పంజరమున కుంజరమ్ము బంధింపబడెన్.

   

 సమస్య:
    కోవిద శబ్దమే భువినిగోల్పడె గౌరవమెంత చిత్రమో.

    కోవిదుడందు రెంతయును కూర్మిని పండితు నెల్లెడన్భువిన్
    "కోవిడు" వ్యాధి విశ్వమున గ్రుమ్ముచునున్నది వింతరూపమై
    ధీ విల సత్ప్రపూర్ణ కవిధీరుని మాన్యత మాయదెన్నడున్.
   "కోవిద"శబ్ద  మేభువిని గోల్పడె? గౌరవమెంత చిత్రమో?.
సమస్య: నన్నయ్యకు పోతన కృతినంకిత మిచ్చెన్.

        అన్నియు తానే యగు నా
        పన్నుడు జగదేకపతియు పంకజనాభున్
        చెన్నగు భక్తిని లక్ష్మణు
        నన్నయ్యకు పోతన కృతినంకితమిచ్చెన్.1.

        వెన్నుడు దశరథసుతుడై
        క్రన్నన భూలోకజనుల కాంక్షలుదీర్చన్
        చెన్నుగ రాగా, లక్ష్మణు
        నన్నయ్యకు పోతన కృతినంకితమిచ్చెన్.2.

        నన్నయ పోతన లిరువురు
        చెన్నారెడు నవ్యకవులు శ్రేయఃకాముల్
        నిన్ననె  పండిత సభలో
        నన్నయ్యకు పోతన కృతినంకితమిచ్చెన్.3. 
సమస్య: చెప్పులు చేత బట్టుకొని శీఘ్రముగా పరుగెత్తె  నెండలో .
      1. ఉ : గొప్ప రధోత్సవాన గుమి గూడిరి భక్తులు దర్శనార్ధమై
               అప్పురి నబ్జ నాభుడు విహారం జేయుచునుందా నత్తఱిన్
              చెప్పులతోడ వెలువడిన శ్రీ నరసింహము భక్తి భావనన్
             చెప్పులు చేత బట్టుకొని  శీఘ్రముగా పరుగెత్తె నెండలో .
  2. ఉ :  ముప్పును దప్పఁగాఁ సరిగా మోమును మూసెడు సాధనంబునుం
            దప్పక బెట్టుకోవలయు దాని ధరించక నొక్కడేగుచో
           నాపురి రక్షణాధిపతి  జూచుచు వెంబడించగా
           చెప్పులు చేతబట్టుకొని శీఘ్రముగా పరుగెత్తె నెండలో
సమస్య:
       తెలుగింగ్లీషున నేర్చుటే సులభమౌ తేజఃప్రపంచమ్మునన్.

 మ: విలువౌ భాషగ నాంధ్రముంగఱచి సద్విద్యా వివేకంబులన్.
       బలురంగంబుల ఖ్యాతినందగను నప్రాచ్యంపు దేశంబునన్
       నెలవైయుండిన వారి సంతునకు నో నిశ్చింత మార్గమ్మునాన్
       తెలుగింగ్లీషున నేర్చుటే సులభమౌ తేజఃప్రపంచమ్మునన్.
సమస్య:  చరణములవి రెండుబోవ సంబరపడియెన్.
       
          తిరుగుట త్రాగుట రెండును
          నరయంగా దుర్గుణాలు నరసయకుండెన్.
          పరిశీలింపగ నా దు
          శ్చరణములవి రెండు బోవ సంబరపడియెన్.

     
       సమస్య:
       పలలము వండె పక్వముగ పారుడు భామినికోరినంతనే.

       తిలలవి శ్రేష్ఠమై చనును దేహమునన్పరిపుష్టిగూర్చి తా
       విలువలుబెంచు వైరసుల వృక్కవిభేదన మంచుదెల్పగా
       దెలివిగ నాధునిన్ సరళ తీయగ వేడెను వంటజేయగన్.
       పలలము వండె పక్వముగ పాఱుడు భామిని కోరినంతనే.

       (వృక్కము.హృదయము ., పలలము..నూవుపిండి.)

      సమస్య: మోడి నీదెబ్బ పగవాని మాడుపగిలె.

       వాడి వేడియు ప్రౌఢిమ తోడనుండు
       నీదు చతురత చైనాను నేలగలపె.
       వారియాప్పులు సర్వంబు పాతిపెట్ట.
       మోడి నీదెబ్బ పగవాని మాడుపగిలె.

          రాజనీతిగ వ్యూహాల రాటుదేల
          భరతవీరుల త్యాగాలబలముజూప
          చైన యుత్పత్తులన్నిటి సాగనంప
          మోడి నీదెబ్బ పగవాని మాడుపగిలె.

     సమస్య:పగవారికి సుతుడుగలుగ పడతియు మురిసెన్.
     
            వగచగ సంతతిలేమికి
            నగజకు సలహాలనిచ్చి నళినాక్షివెసన్.
            తగినట్టిమందులవి చె
            ప్పగ, వారికి సుతుడు గలుగ పడతియు మురిసెన్.

       
         సమస్య: వేల్పు కోరడెపుడు విరుల పూజ.

                 జ్ఞాన వంతుడగుచు చైతన్యమూర్తియై
                 పేదసాదలనిన ప్రేమగల్గి
                 భక్తియుక్తుడైన పరిపరి మెచ్చును
                 వేల్పుకోరడెపుడు విరులపూజ.

         సమస్య: భామినిగూడభామినికిబాలుడుపుట్టె నదేమివింతయో.

  ఏమని చెప్పగావలయునెంతని శాస్త్రము సంస్తుతించెదన్
  కోమలి మార్చగానగును కోరపుమీసముగల్గువానిగా
  రామయె రాముడై తగిన రత్నముబోలిన భార్యజేర, నా
  భామినిగూడభామినికిబాలుడుపుట్టె నదేమివింతయో.

    సమస్య: రామునితండ్రి భీష్ముడని వ్రాసెను పోతన భారతమ్మునన్.

   కోమలి మాటచే సుతుని ఘోరవనాళికి నంపెనెవ్వరో?
   "భీమ"పదంబు వ్రాయుమని "ప్రేమ"కుజెప్పిన నేమివ్రాసెనో?
    "రాము"ని సోదరుం డనగ "రాగిణి" యేమని చెప్పెతత్తరన్?
    రామునితండ్రి-భీష్ముడని వ్రాసెను- పోతన భారతమ్మునన్.

       ఇంతలునింతలయ్యె నవియింతలు నింతలునయ్యెనెంతలో.

   చింతలుదీర గౌరికటు చేరగ తొమ్మిది మాసముల్ సఖా
   చెంతనెయున్న శ్రీమహిత చిన్మయ దీపిత వైద్యశాలలో
   నెంతయు వింతగొల్పపదునెన్మిదిమందికి జన్మనీయగా
   నింతలునింతలయ్యె నవియింతలు నింతలునయ్యెనంతలో.

     సమస్య: విజయశాంతి కై ప్రాణాలు విడుతు నేను.
   
         చిత్రసీమ నే సాహసపాత్రలైన
         చేయగల్గిన నెరజాణ సివ్వగియన
         విజయయనుచు కలవరించు విష్ణువనియె
         "విజయశాంతి కై ప్రాణాలు విడుతు నేను".
         (విష్ణునామక యువకుడు)

         గురుమౌఢ్యంబునబెండ్లిసేయ సుఖముంగూర్చున్సుతప్రాప్తియున్
           
  అరయన్దైవము రాసులున్మరియు పంచాంగంపు గణ్యంబులున్ 
  సరదాకైనను నమ్మరాదనెడు విశ్వాసంపు శాస్త్రజ్ఞుడే
  స్థిరమౌ యోచనజేసి తా సుతకు సంక్షేమంబటంచున్భళా!
  గురుమౌఢ్యంబునబెండ్లిసేయసుఖముంగూర్చున్సుతప్రాప్తియున్.
       సమస్య: వేదము దుఃఖప్రదమ్ము విజ్ఞులకైనన్.

        మోదము గూర్చెడి మిత్రుడు
        కాదనకంజేయు నెట్టి కార్యంబైనన్
        వాదమె కలిగినచో ని
        ర్వేదము దుఃఖప్రదమ్ము విజ్ఞలకైనన్.

       సమస్య....
   బిరుదులు పొందువారె కడు విజ్ఞులు సత్కవులౌ తెనుంగునన్.
   
   సరసత నుత్తమోత్తమ రసాంచిత భావవిశేష ప్రౌఢిమల్
   వరమగుపద్యధారలును వాసిని బెంచునలంకృతుల్ విభా
   సుర పదగుంభముల్ సుకవి శూరుల మెప్పుల సత్సభాళినిన్
   బిరుదులు పొందువారె కడు విజ్ఞులు సత్కవులౌ తెనుంగునన్.

        సమస్య: కలము చేటుదెచ్చును హితకరముగాదు.

        భక్తి భావంబు ప్రజలకు పంచలేని
        సంఘసేవను సతతంబు సలుపలేని
        కవనమున్న నిష్ఫలమగు గాన-నట్టి
        కలము చేటుదెచ్చును హితకరముగాదు.

     దత్తాంశము...శ్రావణ పౌర్ణమి. నా స్పందన.
         పొన్నెకంటి సూర్యనారాయణ రావు.ౠ

       శ్రావణపూర్ణిమన్ జందెము మార్చగ
                            గాయత్రి కరుణయే కలుగునంచు
       ఆధ్యాత్మవిదులెల్ల నత్యంతభక్తిచే
                             నాచరించుటదిమహాద్భుతంబు
       రక్షణ బంధనన్  రహిసోదరాళిచే
                           చేతికి ధరియించ శ్రేయమంచు
        ప్రేమాను రాగాల ప్రియమారబంధాల
                           మొలకెత్త జేసెడు ముగుదలున్న
        భారతావని సర్వత్ర సారయుతము
        ప్రాచ్య సంస్కృతి కియ్యది పట్టుగొమ్మ
        పర్వములతోడ హ్లాదాన వరలుగడ్డ
        సర్వమతముల మేళన సాధు భూమి.   

             సమస్య: బడులుమూయ చదువు భంగమగునె?
          బడులు తెరిచినంత ప్రాకు రోగంబని
          గాలిలోన చదువు వీలటంచు
          సంస్థలన్ని కలసి సాగించపాఠాలు
          బడులుమూయ చదువు భంగమగునె?.1.

         లక్ష్య శుద్ధి గలిగి లక్షణవైఖరిన్
         చదువకోర్కెయున్న చాలగలవు
         పాఠ్యవిషయములకు ప్రసరణసాధనల్
         బడులుమూయ చదువు భంగమగునె?.2.
    
          సెల్లు టాబు టీవి సిస్టంబులందున
          వీడియోలలోన వివిధ గతుల
          చదువు నేర్పుచుండ సాంకేతికంబుగ.
          బడులు మూయ చదువు భంగమగునె?.3. 

         సమస్య: కరిని మకరిని మ్రింగెను హరిహరిహరి.
           కరిని వనములో నొకరోజు కరకరమని
           మకరినింకొక రోజున మాయజేసి
           రెండు జీవాల ప్రాణాలు పిండివైచి
           కరిని మకరిని మ్రింగెను హరి హరిహరి.!
            
            పిల్ల లాటకు శర్కర పిండితోడ
            అందమౌ బొమ్మలంజేసి "హరి"కినీయ
            చిందులేయుచు నాటాడి చివరిఘడియ
            కరిని మకరిని మ్రింగెను "హరి" హరిహరి.!

            చిత్రకారుడు గీసిన చిత్రములను
            చెక్కపెట్టెను భద్రంబు జేసిపెట్ట
            పుస్తకాలను మేసెడు పురుగొకండు
            కరిని మకరిని మ్రింగెను హరిహరిహరి.

           సమస్య: కారము తియ్యనైనదన కాదనుపండితులెవ్వరిచ్చటన్.
              
       మారుని పుష్పబాణములమాంతముగా మది రెచ్చగొట్టగా
       నోరగజూచి చిర్నగవు నొక్కట ప్రేయసి పట్టబోవగా
       కూరిమిగల్గియుంగుసుమ గోమలి కొంటెతనాన సల్పు-ఛీ
       త్కారము తియ్యనైనదన కాదను పండితులెవ్వరిచ్చటన్.

        జలజల రాలెనశ్రులు ప్రజల్ సుఖశాంతుల దేలియాడగన్.


       కలకలమాయెగా నవని కానని రుగ్మత యావరించుటన్
       పలువిధ రీతులంగలసి ప్రజ్ఞను భారత శాస్త్రవేత్తలే
       బలమగు వాక్సినేషను శభాషన గన్గొన వారికన్నులన్
       జలజలరాలె నశ్రువులు ప్రజల్ సుఖశాంతుల దేలియాడగన్.

          వరమును రాక్షసుండొసగె వారిజనాభుడు సంతసింపగన
 
   అరయగ రాజ్యసంపద మహాద్భుత రీతినిగల్గియుండియున్
   ధరపయి రాజులెందరు యథార్ధముగాకొని పోయిరత్తరిన్?
   కరమగు ఖ్యాతి గల్గునని గామితమొప్పగ దానబుద్ధితో
   వరమును రాక్షసుండొసగె వారిజనాభుడు సంతసింపగన్.

           సమస్య: త్రాగుడంచును బల్కిరి తప్పుకొనగ.
   
        సర్వరోగాల మూలాలు జలుబు దగ్గు
        వాత పిత్తాలటంచును వైద్యులెల్ల
        నిమ్మ నారింజ రసముల నియతితోడ
        త్రాగుడంచును బల్కిరి తప్పుకొనగ.
         
         సారహీనంపు సంసార సాగరంబు
         నధిగమింపగ గావలె నావయొకటి
         రామనామామృతంబదె రమ్యగరిమ
         త్రాగుడంచును బల్కిరి తప్పుకొనగ.

          జ్ఞాన విజ్ఞాన మూర్తిగ గ్రాలగోర
          సరస వాగ్వైభవంబది జాటగోర
          మహితసద్గుణ జాలాన మనగగోర
          సరస సత్కవి కావ్యాల సారమెల్ల
          త్రాగుడంచును బల్కిరి తప్పుకొనగ.

              రణమేధాత్రిని మైత్రిబెంచును హితార్ధంబున్ బ్రసాదించెడిన్

    గణనీయంబగు ద్వేషభావముల సంస్కారంబులన్ద్రుంచుచున్
    గుణశీలుండగు రాజశేఖరుని సంకోచంబు లేకుండగన్
    రణముంజేయగ పిల్చుకన్న పరమార్ధంబౌ ప్రశాంతాత్మతో
    రణమే ధాత్రిని మైత్రిబెంచును హితార్ధంబున్ ప్రసాదించెడిన్.

సమస్య :చీమలుబట్టె చంద్రునకు చిత్రవిచిత్రముగాదు మిత్రమా.
    తామటు తోక వాసుకిని దానవులందరు శీర్షపాణులై
    యేమరుపాటులేక తరియించగ క్షీరసముద్రమంతయున్
    శ్రీమహిమాన్వితంపుసుధ చెల్వగు చంద్రుడునుద్భవింపగా
    చీమలుబట్టె చంద్రునకు చిత్రవిచిత్రము గాదు మిత్రమా.

       నాపై యుద్ధమటన్న మేలయిన విన్యాసంబగున్ సోదరా.
 
      (అర్జునుడు .. కర్ణునితో పలుకు సం...)

శా : పైపై డాబులు కట్టిపెట్టి విశిఖావాల్లభ్య ముంజూపుమా
      నాపాలంబడితీవు నేడు మతిహీనా! కర్ణ! దుర్భాగ్యుడా!
      పాపాలం తగజే సినావు గద గోప్యంబేమి లేకుండగన్
      నాపై యుద్ధమటన్న మేలయిన విన్యాసంబగున్ సోదరా!

      (ఒక పండితుడు మరొక పండితునితో)
     నీ పద్యంబులు తేనెవాకలయి రానీ! మోదమానంబులై
     తాపంబెంతయు దీరిపోవునటు సద్ధర్మార్ధ కామంబులన్
     రూపంబెత్తిన కావ్యచర్చలను కర్పూరంపు సౌగంధ్యతన్
     నాపై యుద్ధమటన్న మేలయిన విన్యాసంబగున్ సోదరా.

         లసమస్య: 
         దారను శ్రద్ధతో గొలువ తప్పకదీరును కోర్కె లన్నియున్.

           భూరికృపావలోకనను పోడిమిమీరగ నెల్లజీవులన్
           కూరిమిబ్రోచుచుండి నవకోమల హాసవిలాసభావముల్
           వారిహృదంతరాళమున వైళముగూర్చు మహేశు భక్త మం
           దారను శ్రద్ధతో గొలువ తప్పకదీరును కోర్కె లన్నియున్.

        దారయె మాతృదేవియయి తాలిమిజూపుచు బుజ్జగించెడున్
        దారయమాత్యు రూపమున దప్పగజేయును కార్యసిద్ధులన్
        దారయె ధర్మకామముల తన్మయమందగ జేయు కావునన్
        దారను శ్రద్ధతో గొలువ తప్పకదీరును కోర్కెలన్నియున్.  

.సమస్య: 
         దారను శ్రద్ధతో గొలువ తప్పకదీరును కోర్కె లన్నియున్.

           భూరికృపావలోకనను పోడిమిమీరగ నెల్లజీవులన్
           కూరిమిబ్రోచుచుండి నవకోమల హాసవిలాసభావముల్
           వారిహృదంతరాళమున వైళముగూర్చు మహేశు భక్త మం
           దారను శ్రద్ధతో గొలువ తప్పకదీరును కోర్కె లన్నియున్.

        దారయె మాతృదేవియయి తాలిమిజూపుచు బుజ్జగించెడున్
        దారయమాత్యు రూపమున దప్పగజేయును కార్యసిద్ధులన్
        దారయె ధర్మకామముల తన్మయమందగ జేయు కావునన్
        దారను శ్రద్ధతో గొలువ తప్పకదీరును కోర్కెలన్నియున్.  

        సమస్య:
     వెన్నునుజూపువాడె కడు వీరుడు నుగ్రరణాంతరమ్మునన్.
    
    మన్ననలేక రంగమున మౌనముగాజరియించునెవ్వడో? 
    ఎన్న పరాక్రమాన్వితమృగేంద్రునికైవడి నెవ్వరుందురో?
    భిన్నమహోగ్రరూపములు పీనుగుపెంటలవెచ్చటుండునో?
    వెన్నునుజూపువాడె.,కడు వీరుడు., నుగ్రరణాంతరమ్మునన్.

       సమస్య: అమ్మకునీకు భాగ్యమది ఆనిధి పెన్నిధి నీకుసోదరా.
    
        నమ్మకమైనమాటయును నైపుణిగల్గిన కార్యదక్షతన్
        నెమ్మది భక్తిభావనయు నిశ్చలసంతత ధ్యానముద్రయున్
        కమ్మని బంధుప్రీతియును ఖ్యాతిని బెంచెడు దేశభక్తినీ
        వమ్మకునీకు భాగ్యమది ఆనిధి పెన్నిధి నీకుసోదరా.

          పగలు నిసియయ్యె నిసియేమొ పగలునయ్యె.
       
           పొట్టకూటికి నమెరికా పోయియచట
           ఊపిరాడని బాధ్యత నురుకుచుండి
           భరతభూమికి వచ్చిన పార్థుకిచట
           పగలు నిసియయ్యె నిసియేమొ పగలునయ్యె.

         సమస్య: సంధ్యావందనమాచరింపవలెగా సాంద్రక్షపార్ధంబునన్
    
శా. వింధ్యాద్రిన్సరితూగుగౌరవముతో విజ్ఞాన తేజస్వియై
      సంధ్యారాగము నాలపించి ముదమున్ సౌజన్యమున్నింపుచున్
      సంధ్యావందనమాచరించు పతికిన్ స్వారస్యమింపారగా
      సంధ్యా!వందనమాచరింప వలెగా సాంద్రక్షపార్ధంబునన్. 

     సమస్య: పువ్వుల గౌగిలించుకొని పున్నమి వేళ వసంతుడేడ్చెలే.
    
    మువ్వలసవ్వడుల్ మొరయ మోహనమౌ కనుచూపుతూపులన్
    క్రొవ్వలపుల్ విలాసముగ కోర్కెలు రేపు మనోజ్ఞరూప యా
    జవ్వని రాకగోరి సరసాలనె యూహలయందు నిల్పుచున్
    పువ్వుల గౌగిలించుకొని పున్నమివేళ వసంతుడేడ్చెలే.

        
         శా: స్వీయక్షౌరము తప్పదిప్పుడు సఖా పృధ్వీస్ధలంబందునన్.
    
       హేయంబైనకరోనవచ్చివిధులే హీనాతిహీనంబయెన్
      మాయామేయపుకాలమైనదిపుడే మౌనాన నిందింతునేన్
      శ్రేయంబంచు దలంచి గాంధి యెపుడో చేసెంగదా పూనికన్.
      స్వీయక్షౌరము తప్పదిప్పుడు సఖా పృధ్వీస్ధలంబందునన్.

     సమస్య: విష్ణుమూర్తి కొడుకు కృష్ణమూర్తి.
      
      చిత్రరాజములను చిత్రించు మేధావి
      భక్తి పరవశించి పాడుఘనుడు
      నాటకంబులందు నాట్యవధాని, యీ 
      విష్ణుమూర్తి కొడుకు కృష్ణమూర్తి.

     శాస్త్రశాలయందు చక్కనిశోధనన్
     రేయిబవలు గడపి సాయికృపను
     మందుకనుగొనెనుగ మారి"కరోనా"కు
     విష్ణుమూర్తి కొడుకు కృష్ణ మూర్తి.

         సమస్య:  సంతోషంబునొసంగజాలదు గదా స్వాపత్యమేనాటికిన్
 
     ఎంతోప్రేమగ బెంచి మంచి చెడులాత్మీయంపు నెయ్యంబులన్
     శాంతంబున్గ్రమశిక్షణాది గుణముల్ సద్గ్రంథసారంబిడన్
     చింతించందగువర్తనాన కడు దుశ్శీలాత్ములై సాగగా
     సంతోషంబునొసంగజాలదు గదా స్వాపత్య మేనాటికిన్.

     సమస్య: సురభిళమ్ముల నిప్పుల సుకవికురియు.
                     
      సంఘసేవకు లయిన సజ్జనుల యెడల
       సంఘ విద్రోహు లయిన దుర్జనుల పట్ల
       రెండు భావాలు క్రమముగ రెచ్చియుంట
       సురభిళమ్ముల నిప్పుల సుకవికురియు
   
      
సమస్య: శీలముగల్గువారలకు శీఘ్రము శాస్తిని జేయగావలెన్.

      బాలల పాపపుణ్యముల వాసనసైత మెఱుంగనట్టి౼యా
      పూలనుబోలు కన్నెలను మోహ వికార మృగాలకైవడిన్
      గాలమువైచి లాగి కడు కర్కశరీతి సుఖంబునందు౼దు
      శ్శీలము గల్గువారలకు శీఘ్రము శాస్తిని జేయగావలెన్.

     కాలమధర్మమార్గమున కర్కశ రక్కసిభావపూర్ణమై
      బాలలుబేలలంచు పరిపంథులు మాటునదాగి రెచ్చినన్
      బేలలగాము మేమనుచు భీషణ దుర్గశతాంశమౌచు-దు
      శ్శీలము గల్గువారలకు శీఘ్రము శాస్తిని జేయగావలెన్.
సమస్య: పాడువాడె? మనలను కాపాడువాడు?
         మీ  పొన్నెకంటి..

         నీరు,నిప్పును,గాలియు,నింగి,భూమి
         పంచభూతాల మనకిడి పెంచునట్టి
         కరుణరసఝరి, తేజస్వి గౌరివిభుడు
         పాడువాడె? మనలను కాపాడువాడు.

         సర్వశాస్త్రసారయుతుండు, సౌమ్యశీలి
         బుధజననుతుండు, పరమాత్మ బోలుగురుడు
         నిత్యవిద్యార్ధి సదమల నియమవర్తి
         పాడువాడె? మనలను కాపాడువాడు.

          ఎంతసంగీత సాహిత్య సృష్టి కర్త
          యైన గాత్ర మాధుర్యమున్ గానవలెను
          మంచి గాత్రము లేకున్న మనసులోనె 
          పాడువాడె, మనలను కాపాడువాడు.

సమస్య:    భాగ్య నగరాన బయనింప పడవ వలసె.
          దారులన్నియు నుగ్ర గోదారులయ్యె
         కారు నడుపుట మిక్కిలి కష్టమయ్యె
         పనులు సమకూర్చుకొనుటకు పద్ధతిదియె
         భాగ్య నగరాన పయనింప పడవవలసె.

      సమస్య :తమ్ములజూచిరాఘవుడు తద్దయుగ్రుంగెను నెమ్మనంబునన్...
   క్రమ్మిన జానకీవిరహ ఘాతహృదంతర భావనమ్ములన్
   నెమ్మిని వీడలేక తన నెచ్చెలి నెయ్యపు వృక్షరాజముల్
   కొమ్మలరెమ్మలన్ మరియు కోమలమై కనువిందుసేయు, కెం
   దమ్ములజూచి, రాఘవుడు తద్దయు గ్రుంగెను నెమ్మనంబునన్.

        సమస్య : లావుతొలంగిపోవగనె లాభములబ్బెనగణ్యరీతులన్.
    జీవనయానమే సతము శ్రేయవిదూరము భారమౌను స
    ద్భావన జూపరే హితులు భార్యయుపుత్రులు సోదరాదులున్
    లావు తొలంగజేయు "నవలామణి వైద్యపుశాల"యందునన్
    లావుతొలంగిపోవగనె లాభములబ్బెనగణ్యరీతులన్.

       సమస్య: మందున్ సేవింపగలుగు మన్నన యిలలో.
   అందము శ్రేయము మోక్షము
   విందగు రఘురామునామ వేదామృతమే
   మందగు. మానవుడాహా
   మందున్ సేవింప, గలుగు మన్నన యిలలో.
    నాగుపాముతో సెల్ఫీ... చిత్రానికి పద్యం.
    ప్రాణభయములేదు పన్నగమైనను
    సింగమైన నల్ల చిఱుతయైన
    గ్రుడ్డినాగరికత కోమచ్చుతునుకౌను
    మార్చుకొనుమ దారి మందబుద్ధి!
సమస్య:   కాళీదుష్టులబ్రోచుమమ్మ యికలోకక్షేమముంగోరుచున్.
        
        ఏలీలన్ దయలేక సుంతయునుదుశ్చేష్టాప్రమత్తుండునై
        బాలన్బేలను రాక్షసాధమువలెన్ బంధించి వేధించు, దు
        శ్శీలున్నీదు కరాళఖడ్గ బలిమిన్ చెండాడి శిక్షింపవే
        కాళీ!దుష్టుల - బ్రోచుమమ్మ యిక లోకక్షేమముంగోరుచున్.
సమస్య: మూడు ముందున పదమూడు వెనుక. 
      సప్తగిరులరేని సౌందర్యసేవకై
      విరులమాల యందు విధిగగూర్ప
      కలువ తులసిదళపు క్రమమునుజూడగా
      మూడు ముందున పదమూడు వెనుక. 

     బాలబాలికలకు వరుససంఖ్యలు నేర్ప
     అయ్యవారు తెలిపె హర్షమొదవ
     నేర్చుకొనెడు రీతి నిశ్చయమిదియనె
     మూడు ముందున పదమూడు వెనుక.

    సమస్య: గర్వోన్మత్త కవీశ్వరుల్ జగతిలో ఖ్యాతిన్ సమార్జింతురే?
   
    గర్వంబన్నది సత్కవీంద్రు నెదలో గారాదు దుర్వారమై
    సర్వంబయ్యది విఘ్నమౌచు నిలలో సౌఖ్యంబులంద్రుంచుగా
    శర్వాణీకృప భూరిగొంటిననుచున్ శాంతంబు వర్జించు., నా 
    గర్వోన్మత్త కవీశ్వరుల్  జగతిలో ఖ్యాతిన్ సమార్జింతురే?

  సమస్య: దుర్మతిరాజుగాగ సిరితో తులదూగును రాజ్యమింపుగన్.
               ధర్మము, న్యాయముంగరుణ తాత్త్విక చింతన ప్రేమభావనల్
               మర్మముమాయలేవియును మాటలుచేతలయందు లేకయే
               నిర్మలమైన రేని కడు నేర్పగుపాలన సౌఖ్యమీను - నే
               దుర్మతి రాజుగాగ సిరితో తులదూగును రాజ్యమింపుగన్.?
సమస్య: నెలకనిపింపదాయె ఘననీల శరీరుని దర్శనమ్మునన్.
              కలువలకన్నులున్ మరియు కంజవికాసపు నెమ్మొగమ్మునన్
              తలపయి కేకికన్ను వరదాభయహస్తము మందహాసమున్
              గళమునమౌక్తికాసరము కౌస్తుభకాంతులె కానియెచ్చటన్
              నెల కనిపింపదాయె ఘననీలశరీరుని దర్శనమ్మునన్.
సమస్య: దరహాసమ్ములు మోవిపై మెరయగా దారిద్ర్యమే చేకురున్.
              ధరనెవ్వారి గృహంబునన్ సతతమున్ ధర్మేతరంబైన చో
              కరమొప్పన్ సిరిసోదరీమణియెతా కాలూని నిశ్చింతగా
             పరమానందముతోడ వచ్చి సుఖముల్ భగ్నంబుగావించు,నా
             దరహాసమ్ములు మోవిపై మెరయగా దారిద్ర్యమే చేకురున్.
సమస్య‌: కొండముచ్చుకు నెత్తిపై కొమ్ము మొలిచె.
             కొండముచ్చును కోతిని రెండుదెచ్చి
             ఆటలాడించి బ్రతికెడు నంకమయ్య
             మెచ్చుకొనగను ముచ్చును మేలటంచు
            కొండముచ్చుకు నెత్తిపై కొమ్ము మొలిచె.
సమస్య : జంతువుతో సమానమనసాగె నరుండు వివేకవంతుడై.
              చింతనజేసియేది కడు శ్రేష్ఠమటంచును నన్నివిద్యలన్
              పంతముతోడనేర్చి సరి వారలులేరెట నాకటంచునున్
              వింతగ విర్రవీగుచును పిచ్చిగ కామవి కారియై చనన్
              జంతువుతో సమానమనసాగె నరుండు వివేకవంతుడై.     
  సమస్య: సంతానమ్మునుగాంచి మోదముగొనెన్ సన్న్యాసి సంతుష్టుడై.
                సంతానార్ధము వేదనంబడెడు నా సచ్ఛీలుడౌరాజుకున్
               గొంతంగొంతగ సంతసంబిడగ బల్  కూర్మిన్ వశిష్ఠుండు తా
               చింతల్దీర్చెడు యజ్ఞమున్సలుపగా చిన్నారి రామాదులన్
               సంతానమ్మునుగాంచి మోదముగొనెన్ సన్న్యాసి సంతుష్టుడై.
సమస్య: మీసాలున్న కవిత్వముల్ వెలుగు నున్మేషప్రభాసమ్ములై.
               దోసంబింతయులేని భవ్య గుణ సందోహంపువారాశియై
               ధీసారంపువిరాజమాన రచనే దేదీప్యమానమ్ముగా
               కాసారమ్మున పద్మమై నిలుచు విఖ్యాతమ్ముగా నెన్న.,సా
               మీ! సాలున్న కవిత్వముల్ వెలుగు నున్మేషప్రభాసమ్ములై. 
              (సాలు=పద్ధతి)
   సమస్య: ముక్కును వండి తినిపించ ముదమే కలిగెన్.  
               చక్కగ బెరిగెన్నానప
               అక్కజముగముక్కువోలె నానందముగన్
               మక్కువ మీరగ తరుగుచు
               ముక్కును వండి తినిపించ ముదమే కలిగెన్.
               చక్కనిగాజుల చేతుల
                మక్కువతో ప్రేమ రుచులు మరి కలగలుపన్
                పెక్కుగ నాకర్షించగ 
                ముక్కును , వండి తినిపించ ముదమే కలిగెన్.
  సమస్య: కమలము విచ్చగా భరతఖండము మెచ్చె భళీభళీయనన్.
               అమలిన ప్రేమభావనల హత్తుకొనంగను కష్టకాలమున్
               సుమధుర హాసముంబ్రజలు సున్నితరీతిని మీటనొక్కగా
               ఘుమఘుమలాడు గంధముల కోర్కెలుదీర్చగ **దుబ్బకందునన్** 
               కమలము విచ్చగా భరతఖండము మెచ్చె భళీభళీయనన్.
 సమస్య: ఎలుకనుబెంచ పిల్లి భయమేల? గృహంబున బాలు భద్రమౌ. 
              కలుగుల లోతులందిరిగి కాపునుగాయుచు చోరవర్తియై
              మెలగెడు జంతువే యెలుక; మెల్పున నెట్టుల బెంచగానగున్?
              తలచ నసాధ్యమయ్యదియ, దానిని సాధ్యముజేసి చూపి-యా
              యెలుకనుబెంచ, పిల్లి భయమేల? గృహంబున బాలు భద్రమౌ.
        
       సమస్య :  పూజకు బుష్పముల్గొనిన పుణ్యము దక్కదు నిశ్చయంబుగన్.
          పూజకు మూలమే మనసు; పుష్కల సేవలు భక్తితత్త్వముల్
          రాజిత స్వర్ణపుష్పములు రంగులహంగులు డాంబికంబులున్
          మోజుగజేయుటేయగును ముచ్చట కున్ వర భక్తి లేనిచో
          పూజకు బుష్పముల్గొనిన పుణ్యము దక్కదు నిశ్చయంబుగన్.

    సమస్య: గీతను నమ్మ పుణ్యమగు గీతను నమ్ముట పాపమేయగున్.
             గీతన రెండుభావములు కృష్ణడు చెప్పిన సారమొక్కటౌ
             సీతసహోదరౌ వనిత చిన్నది  రెండవ గీతనాబడున్.
             చేతము రంజిలన్ వెలుగు జిమ్ము పవిత్రపు మోక్షమార్గమౌ
             గీతను నమ్మ పుణ్యమగు; గీతను నమ్ముట పాపమేయగున్.

     సమస్య:  ఉప్పు కారాలు తినకున్న ముప్పు వచ్చు.
              షడ్రసయుత భోజనమది  సారతరము
              సాంఘికంబైన జీవికి సహజమదియ
              తప్పక దినము కూరల తగినరీతి
              నుప్పు కారాలు తినకున్న ముప్పువచ్చు.
              ఉప్పు కారాలు తిన్నచో ముప్పటంచు
              వదలి పెరిగిన  దానయ్య వరుడుగాగ
              వధువతని విషయమెరిగి  వదలెవాని
              ఉప్పు కారాలు తినకున్న ముప్పువచ్చు.
        సమస్య: దానము సేయువారలకు తప్పవు నారక బాధలాపయిన్.
      దానము సేయగావలయు ధర్మవిచారిత భక్తకోటికిన్
     దానము సేయగావలయు దైన్య పరిస్ధితినున్నవారికిన్
     మానము గౌరవంబులను మట్టున బెట్టెడు నీచజాతికిన్
     దానము సేయువారలకు తప్పవు నారక బాధలాపయిన్
        సమస్య: శునకమ్మున్ స్మరియించువారలకు హెచ్చున్ భోగభాగ్యమ్ములున్
   కనగా వేదవితర్కమున్ భువిని శ్రీకాంతుండు సర్వంబనన్
   శునకంబాది సమస్త జీవులను సంశోభాత్మ విస్తారుడై
   మనినాడంచును భావనల్సలుపు నేమాన్యున్విచారించినన్
   శునకమ్మున్ స్మరియించువారలకు హెచ్చున్ భోగభాగ్యమ్ములున్.
సమస్య: ఆలముసేయువారలకు నందరు మిత్రులు శత్రువుల్ గదా. 
        కాలవశంబునంగలుగు క్రౌర్య దయాగుణ రాగమోహముల్
       మేలగు శాంతిదాంతులవి మేదినిపాలన జేయరేనికిన్
       పాలునుబంచుకొందు"నని"పౌరుషమొప్పగ సత్యసంధులై 
       ఆలముసేయువారలకు నందరు మిత్రులు శత్రవుల్ గదా.
  సమస్య‌: బహుళపక్ష శీత భానుపగిది. 
                     ఎన్నికలలవేళ నెన్నొ కలలు రేగి
                     విజయ మందినట్లు విర్రవీగి
                     నిజము దెలిసి మంత్రి నీరునుగారెగా
                     బహుళపక్ష శీత భానుపగిది.
     సమస్య: జనముల నిందసేయగ ప్రశంసలనందును మానవుడిలన్.
           వనములనాక్రమించి నిజ భక్తుని వోలె నటించుచున్సదా
           కనకము కాంతలన్విడువ కైవశమౌనులె మోక్షమంచునున్
           వెనుకను నీచకార్యముల విస్తృతిజేసెడు దొంగబాబలన్
           జనముల నిందసేయగ ప్రశంసలనందును మానవుడిలన్.
       సమస్య: శంకరుజంపె రాఘవుడు సాధ్విని సీతనుగాచుకొంటకై. 
        జంకును గొంకు లేకయును సాధుజనంబుల హింసజేయుచున్
        శంకలు లేక తాపసుల సాధ్వుల భక్తుల జంపివేయుచున్
        లంకను దైత్యసంతతికి రాజుగ వెల్గెడువాని, వంశనా
        శంకరుజంపె రాఘవుడు సాధ్విని సీతను గాచుకొంటకై.
 సమస్య: తృప్తింబొందిననాడె జీవితము సందీపించుగొంగ్రొత్తగా.
         ప్రాప్తంబెంతయొ నంతెయంచు మదిలో భావించి జీవింపగా
         నాప్తుల్బాంధవులెల్లమెచ్చు నలసౌహార్ద్రుండు  దైవంబనున్
         లుప్తంబేమియు కాదటంచు మధురాలోకాత్ములై ధన్యులై
         తృప్తింబొందిననాడె జీవితము సందీపించుగొంగ్రొత్తగా. 
   సమస్య: ధర్మము తప్పువారలకు దక్కునులే కలి నన్నిసౌఖ్యముల్.
        కర్మము, ధర్మమన్పదము కానగరాదు నిఘంటువందునన్
        మర్మము మాయలుంగలిగి మంచిని మోమున బుల్మియుండుదు
        ష్కర్ములు నేతలుం బరమ సాధువుగా నటియించువారికిన్
        ధర్మము తప్పువారలకు దక్కునులే కలి నన్నిసౌఖ్యముల్.
  
       సమస్య: వృద్ధుడైన జనకుండు సదా పసిబాలుడేయగున్.
      అమలిన ప్రేమభావనల నంచితగౌరవ భక్తితత్త్వముల్
      ప్రమదము వెల్లువై విరియ భవ్యవికాసమనఃప్రవృత్తితోన్
      క్రమమగు యోచనన్సలిపి క్రన్నన జేరుచు తల్లితోననెం
      గొమరుడు; "వృద్ధుడైన జనకుండు సదా పసిబాలుడేయగున్."
సమస్య:  మాటలు రావు భావములు మానసవీధినిగ్రమ్మ మబ్బులై.
     పాటలగంధి హాసమది ప్రబ్బిన ప్రేమకు హేతువయ్యె నా
     కాటుకకండ్ల చూపులవి కౌగిలి సేతకు మూలమయ్యె నా
     హాటకగర్భు శిల్పమది యద్భుత దివ్యమనోంబురాశి గాన్
   సమస్య: మశకగళముజొచ్చె మత్తగజము.
       నరుడు జేరె నాడు నాట్యంబు నేర్పంగ
       నాబృహన్నలయన నామమెసగ
       విరటుకొల్వునందు వింతకాలమహిమ
       మశక గళము జొచ్చె మత్తగజము.
                  
సమస్య: భావములేనిభాష ప్రతిభన్ ప్రకటించుట సత్యమేగదా.
       భావరసాత్మకంబగుచు పట్టునుజూపుసమాససంధులున్
       తావులజిమ్ము శ్లేషలును స్ధాయిని బెంచు నలంకృతుల్ మహా
       కోవిదులెల్లచూచి మది కూరిమిమెచ్చుట సాజమౌను., దు
       ర్భావము లేని భాష, ప్రతిభన్ ప్రకటించుట సత్యమే గదా. 

సమస్య: కాకి గూడున జనియించె కలరవంబు.
     చండమార్కుల శిష్యులు చదువుచుంద్రు
     ఆహిరణ్యకశిపుని నామాంతరములు
     ప్రేమ  ప్రహ్లాదుడొక్కడె పిల్చెహరిని
     కాకి గూడున జనియించె కలరవంబు.
     అక్షరములేదు సాహితీ శిక్షలేదు
     గీత సంగీత ఛాయల గేముకాదు
     రమ్యమైనట్టి రాగాలు రమ్య యనగ
     కాకి గూడున జనియించె కలరవంబు.
 
సమస్య:  మండువేసవిన్ గురిసెను మంచుధార.
     ఎండిపోయెను నేడ్పులన్గుండెలెన్నొ
     ఆ కరోనా మహమ్మారి యాగ్రహింప
     మందువచ్చిన శుభవార్త  మనకు దెలియ
     మండువేసవిన్ గురిసెను మంచుధార.
     ఈ తెలంగాణ ప్రభుత పరేంగితావ
    గాహనిసుమంత లేమికిన్ గనలిరంత
    జీత భత్యాల పెంపును జేతుమన్న
    మండువేసవిన్ గురిసెను మంచుధార.

      సమస్య: స్వర్ణవిభూషలేల సహజమ్మగు సుందరివీవు భామినీ
      స్వర్ణమథక్కరించదగు చక్కని మోమును నీలిముంగురుల్
       కర్ణములెంచగా మదికి గాంచును రమ్యమనోహరంబులై
       నిర్ణయమున్ ముదంబుగను నేనుగ జేసితి భర్తనై యికన్
       " స్వర్ణవిభూషలేల సహజమ్మగు సుందరివీవు భామినీ"

        ఆంగ్లవత్సరాది మనకుగాదియయ్యె.
          జనవరి యొకటి ఆంగ్లవత్సరపు మొదలు
          చైత్ర శుద్ధపాడ్యమి నాడు జరుగుగాది
          యెపుడు యుగగతుల్ వక్రించి యిటుల మారి
          ఆంగ్లవత్సరాది మనకుగాదియయ్యె.
   
      సమస్య: నకు మోదమందుచు సమర్పణజేసె కృతజ్ఞతాంజలుల
     క్రమముగ మోముచందములు కౌగిలిగోరెడు యౌవనంబులు
     న్నమలిన సిగ్గుదొంతరలు హాసవిలాస మనోవికారముల్
     సుమదళ సౌకుమార్యములు సుందరిజేరగ జృంభణాన.,ప్రా
     యమునకు మోదమందుచు సమర్పణజేసె కృతజ్ఞతాంజలుల్.
సమస్య:   దేహములేనిరాజునకు తెల్వినెరుంగని మంత్రియుండెడిన్.
     స్నేహయు నీరజల్ నిశితచిత్తము లుంగల మన్మరాండ్రు శ్రీ
     శ్రీహరిరావుతాతనల చెప్పగ గోరిరి సత్కథాంశముల్
      ఓహొయటంచు సంబరము నుత్సుకతల్ గలబోసి పల్కెగా
     "దేహములేనిరాజునకు తెల్వినెరుంగని మంత్రియుండెడిన్."
    సమస్య: కంటిని కంటిపాపనని కాంతుడుసెప్పగ కాంతనవ్వెడిన్
       జంటగజేసిముద్దుగను జానకిరాములె మీరటంచు వె
       న్వెంటనె మంచిలగ్నమని వేడుకదీరగ శోభనానికై
       గెంటగ తన్మయంబునను కేవలసైగల జూచి భార్యతో
       కంటిని కంటిపాపనని కాంతుడుసెప్పగ కాంతనవ్వెడిన్.
సమస్య: యమునకు మోదమందుచు సమర్పణజేసె కృతజ్ఞతాంజలుల్.
     క్రమముగ మోముచందములు కౌగిలిగోరెడు యౌవనంబులున్
     అమలిన సిగ్గుదొంతరలు హాసవిలాస మనోవికారముల్
     సుమదళ సౌకుమార్యములు సుందరిజేరగ జృంభణాన.,ప్రా
     యమునకు మోదమందుచు సమర్పణజేసె కృతజ్ఞతాంజలుల్.
సమస్య : చర్యకు దుశ్చర్యగాదె? చక్కగనమరన్.
    పర్యవసానము నెంచక
    ధుర్యులుగా నెఱిగి మనల దుందుడుకొప్పన్
    క్రూరత చైనీయాధమ
    చర్యకు దుశ్చర్యగాదె?చక్కగనమరన్.
సమస్య‌: స్నేహము చేటుదెచ్చు మరి చింతలు హెచ్చు నశించు శాంతియున్. 
     స్నేహితుడన్న సద్గుణ సు శీలుడు ప్రేమమయుండునౌచు సం
    దేహము సుంతలేక తన దృష్టికి దోచిన దుష్టకార్యముల్
    మోహమనస్కుడై నిలుపు  పూజ్యుడు గావలె ద్రోహచింతనా
    స్నేహము చేటుదెచ్చు మరి చింతలు హెచ్చు నశియించు శాంతియున్.
   సమస్య : శీలము ,గాలము ,కాలము ,మూలము. సామాజికాంశము.ఉత్పలమాల.
    కాలము వమ్ము సేయకను క్రన్నన సాంఘిక ధర్మదృష్టి - స
    చ్ఛీలము తోడసేవలను జేయ సమున్నత రాజధర్మమౌ
    గాలమువేసి యోటరుల కన్నులగప్పుచు నోట్లుదండుచున్
    మూలము గద్దెనెక్కుటకు బుట్టెడు బుద్ధి వినాశహేతువౌ.
    సమస్య : వైరిని స్తుతియించగలుగు వాంఛితఫలముల్. 
     వైరమదిచేటు దెచ్చును
     గౌరవ భంగమ్ము కలిగి కయ్యముబెరుగున్
     దారుణము నాపు మార్గమె
     వైరిని స్తుతియించగలుగు వాంఛితఫలముల్. 
    సమస్య: బంగరు పూలుబూచినవి భారతదేశమునందు వింతగా. 
    హంగుగ భారతాంబ వనమందున త్యాగము భక్తి తత్త్వముల్
    పొంగెడు దేశభక్తియును ముచ్చటగూర్చు పరాక్రమంబులే
    రంగుల తీవలై పెరిగి రమ్యత కన్నుల పండువోయనన్
    బంగరుపూలు బూచినవి భారతదేశమునందున్. 
 
   సమస్య. చదువులు వృధయనిరి బుధులు సర్వజ్ఞులతోన్. 
                  
                  ఎద నెఱుగని  గుణ గణములు 
                  సదమల నిగముల దెలుపని సాహిత్యంబుల్ 
                 ముదముగ పితరుల గొలువని 
                 చదువులు వృధ  మనిరి బుధులు సర్వజ్ఞులతోన్. 
    సమస్య: మీకిదె స్వాగతమ్మనుచు మేకులు బల్కినవన్నదాతకున్.
    
       సాకులు జెప్పుచుం బరమ శాంతిని గోరెడు వారికైవడిన్
       చీకును చింతలేక నిజశీలము జూపని కేంద్రనాయకుల్
       మేకులె యైరి; వారు  శ్రుతిమించిన ప్రేమ నటించుచున్ సఖా!
       మీకిదె స్వాగతమ్మనుచు మేకులు బల్కిన వన్న దాతకున్.

       సమస్య: మించె పెట్రోలు వేగంబు మెట్రొకన్న.
      
       మంచి పాలనయంచును వంచనమున
       పేదలకుపెద్ద గుదిబండ వేయుచుండె
       ప్రభుత పెట్రోలు ధరపెంచి విభవమంద
       మించె పెట్రోలు వేగంబు మెట్రొకన్న.
      రామ,సీమ,భామ,కామ...ఇతిహాసపరంగా..
     
      చేయ"రా!మ"నసున శ్రీరాము సంస్తుతుల్
     "భామ"తివగుచుండి భజన నెఱపు
      ప్రేయ"సీమ" ధురిమ మాయయే యగునోయి
     "కామ"నలు నశింప కలుగు సుఖము.

 సమస్య: కలహమ్ములు గల్గు భువిని కాంతల వలనన్.
                           
        లలనల మనములు చిత్రమె
        కలనైననునూహసేయ కాదేరికినిన్
        బలువిధ చరితల నరసిన
        కలహమ్ములు గల్గు భువిని కాంతలవలనన్.1

        అల పౌరాణిక చరితల
        నిల జానపదాలనెల్ల నిగ్గునుదేల్చన్
        విలయమ్ము దెచ్చి పెట్టెడు
        కలహమ్ములు గల్గు భువిని కాంతల వలనన్.2

        తలపగ పెండ్లికి ముందర
        లలనలు కడుప్రేమజూపు లౌక్యముతోడన్
        తలపున స్వార్ధము జేరగ
        కలహమ్ములు గల్గు భువిని కాంతల వలనన్.3
సమస్య: శత్రువులును పోటీదార్లు జయమిడుదురు.
                
     శత్రువనువాడు సములను సైపలేక
     చుల్కనగ బల్కు వారల శుంఠలనుచు
     నట్టి మాటలె కల్గించి పట్టుదలను
     శత్రువులును పోటీదార్లు జయమిడుదురు.

    సమస్య: గడియారమువంకజూచి గడగడవడకెన్.
   
    నడకే మార్గము రవికట
    బడికేగుచు విద్యనేర్చి ప్రగతినిబొందన్
    గడియారమాగ, తెలియక
    గడియారము వంకజూచి గడగడవడకెన్.

రణమున్ జేసినవాడె సత్కవియగున్ ప్రాజ్ఞుల్ ప్రశంసింపగన్ .
        
        గుణ సంభాసిత భావనిర్భరమగున్ గొంగ్రొత్త పద్యాలకున్
        గణుతింపందగు పాండితీగరిమకున్ గంభీరవాగ్ధాటికిన్
        వినయంబొప్పెడు ధారణాపటిమకున్ వీణాధరే, మూలకా
        రణమున్ జేసినవాడె సత్కవియగున్ ప్రాజ్ఞుల్ ప్రశంసింపగన్.

సమస్య: కారము నివ్వగ పతికిని కలిమియు హెచ్చున్.
     
     దూరపుటుద్యోగంబును
     కోరిన జీతంబురాని గోపాలునకున్
     గౌరియె తెలివిగ తనసహ
     కారము నివ్వగ పతికిని కలిమియు హెచ్చున్.

సమస్య: రణమున్ జేసినవాడె సత్కవియగున్ ప్రాజ్ఞుల్ ప్రశంసింపగన్ .
        
        గుణ సంభాసిత భావనిర్భరమగున్ గొంగ్రొత్త పద్యాలకున్
        గణుతింపందగు పాండితీగరిమకున్ గంభీరవాగ్ధాటికిన్
        వినయంబొప్పెడు ధారణాపటిమకున్ వీణాధరిన్, మూలకా
        రణమున్ జేసినవాడె సత్కవియగున్ ప్రాజ్ఞుల్ ప్రశంసింపగన్.

సమస్య: వ్యసనము మంచిదే యగును స్వాస్థ్యమునీయ ధనంబుగూర్చగన్.
  విసువును జెందకే సతము వేదహితంబగు ధర్మమార్గముల్
  రసన విశేషకాంక్షలకు లాలనతోడుత స్వస్తిజెప్పుటల్
  మసకను భస్త్రికాదులును మౌనము ధ్యానసుయోగరీతులన్
  వ్యసనము మంచిదే యగును స్వాస్థ్యమునీయ ధనంబుగూర్చగన్.

  సమస్య: పులుపునుగోరు మూర్తమది పొందితినంచు లతాంగి పొంగెగా
  గలగల నవ్వి త్రుళ్ళు నల కన్నెకు పెండిలి యొక్కభాగ్యమౌ
  కలకలలాడు కాపురపు కమ్మని కోరిక బోసినవ్వులే
  నలినదళాక్షికా ఫలము నమ్మినదైవబలమ్ము చేతనే
  పులుపునుగోరు మూర్తమది పొందితినంచు లతాంగి పొంగెగా.

మాలకొండయ్య గారిచ్చిన సమస్యలు..పూరణలు.

 సమస్య:మామిడి కొమ్మకున్విరిసె మల్లెలురోహిణియందువిందుగా

     మామయు మర్దియున్వెడలె మామిడి తోటకునీరునింపగా
     గోముగవారిజూచుటకు కోమలియచ్చటికేగి లీలగా
     ధీమతియౌచు కుందములద్రెంపుచు కొమ్మలపైకివేయగా.

      గోముగబెంచుచుంటినల కుందప్రసూనపు తీవజాతులన్
      నీమముదప్పిపోయియవి నిండుగమ్రానులవిస్తరింపగా
      నామనిరాకతో విరులు హాయిగవిచ్చెను గున్నమావిపై
      మామిడి కొమ్మకున్విరిసె మల్లెలు రోహిణియందువిందుగా.
   
       సమస్య: గుండ్రాతికికాళ్ళువచ్చి గునగుననడిచెన్.
            కొండ్రాళ్ళు ప్రేల్చు ఘటనన
            గుండ్రంగారంధ్రమేసి కూరగ మందున్
            బండ్రాయివోలె నుండక
            గుండ్రాతికి కాళ్ళువచ్చి గునగున నడిచెన్.   
సమస్య: వ్యసనము మంచిదే యగును స్వాస్థ్యమునీయ ధనంబుగూర్చగన్.
  విసువును జెందకే సతము వేదహితంబగు ధర్మమార్గముల్
  రసన విశేషకాంక్షలకు లాలనతోడుత స్వస్తిజెప్పుటల్
  మసకను భస్త్రికాదులును మౌనము ధ్యానసుయోగరీతులన్
  వ్యసనము మంచిదే యగును స్వాస్థ్యమునీయ ధనంబుగూర్చగన్.

  సమస్య: పులుపునుగోరు మూర్తమది పొందితినంచు లతాంగి పొంగెగా
  గలగల నవ్వి త్రుళ్ళు నల కన్నెకు పెండిలి యొక్కభాగ్యమౌ
  కలకలలాడు కాపురపు కమ్మని కోరిక బోసినవ్వులే
  నలినదళాక్షికా ఫలము నమ్మినదైవబలమ్ము చేతనే
  పులుపునుగోరు మూర్తమది పొందితినంచు లతాంగి పొంగెగా.


సమస్య: శిశిరము గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే.
   వశమును దప్పి కష్టములు వంతులు గాగ ప్రియంబుతోడుతన్
   విశదముగాని రీతులను వేదనకున్గురిజేయుచుండగన్
   దశలవి మారుచుండుననె దార "సుశీల"ను జూచి"సూరి"యే
   శిశిరము గాంచి యెందులకు చింత వసంతము రాకపోవునే.
సమస్య: తనయను కట్టబెట్టె మతితప్పిన వానికిదండ్రి  యిచ్ఛమై.
అనయము రోగులన్ మరలనద్భుతరీతిని బాగుచేతునం
చు "నయన" చిన్ననాడె కడు చోద్యము మీరగ వైద్యవృత్తినిన్
ఘనముగ నభ్యసించి తగు గౌరవమొప్ప కృతార్ధ యౌటచే
తనయను కట్టబెట్టె మతితప్పిన వానికిదండ్రి  యిచ్ఛమై.
సమస్య: సతిమునుంగగ పతిపొందె సంతసమును.
    అతిథి రాకను హర్షించు ననుదినంబు
    అన్నదానము జేయు నాపన్నులకును
    ఇట్టి సంస్కారవంతమౌ యీప్సితముల
    సతి మునుంగగపతిపొందె సంతసమును. 

    చదువు లేనట్టి పిల్లల సాదరమున
    సౌమ్యమౌరీతి చదివించి చక్కగాను
    జ్ఞానమూర్తుల గావించు కార్యమందు
    సతి మునుంగగ పతిపొందె సంతసమును.

సమస్య: మనమున మల్లెలై విరిసె మంజులభావములెన్నొ ప్రేమికా.
కన యమునాతటిన్ వన నికాయమునందున బల్కరింతలున్
వనమున సంచరించుతఱి ప్రాయపుగుల్కుల కౌగిలింతలు
న్ననయము స్పర్శగోరుటలు హా!యదుభూషణ! దెంతమాయయో!
మనమున మల్లెలై విరిసె మంజులభావములెన్నొ ప్రేమికా.
సమస్య: కోవిడు సూదిమందిడిన ఘోరములేవియు రావు సోదరా!
     తావక జీవితమ్ములను ధార్మిక వర్తనజేయ శ్రేయమౌ
     ఆవరమీయ కన్గొనిరి హైందవ శోధన శాఖపండితుల్.
     కావగ సూదిమందునిల; కంజదళాక్షు కృపా విలోకనన్
     కోవిడు సూదిమందిడిన ఘోరములేవియు రావు సోదరా!
సమస్య : వాలము కరవాలమయ్యె వాయుసుతునకున్.
  మేలౌ సింహాసనమును
  వాలముతోగూర్చుకొన్న వానరుగనగన్
  కూలెన్ రావణు గర్వము
  వాలము కరవాలమయ్యె వాయుసుతునకున్. 
సమస్య : బోడి తలకటు మోకాలి ముడినిపెట్టె.
        సాక్ష్యమీయగ వచ్చిన చానయొకతె
        ధర్మమూర్తిని జూచిన తరుణమందు
        వణకిపోవుచు తడబడి వాస్తవమని
        బోడితలకటు మోకాలి ముడినిబెట్టె.
పడువాడే శుభములొందు బ్రతుకున వినరో.
   
     కడుమహనీయపు ధర్మము
     నెడపక పాటించుచుండి యెంతయు నిష్టన్
     చెడు తలపుల వడి గని భయ
     పడు, వాడే శుభములొందు బ్రతుకున వినరో!

కాలద్రోసెడు వారె లోకాన హితులు.
      
      చిన్నతనమున నుండియు స్నేహమనెడు
      మధురబంధాన మెలగుచు మనసుదెలిసి
      ప్రాణమిత్రునిపై యపవాదులన్ని
      కాలద్రోసెడు వారె లోకాన హితులు.

తల్పము వడ్డించె తుదిని దధ్యోదనమున్.
     
      కల్పన జేసిన శాకము
      లల్పము గానీయకుండ రమణుడు మెక్కెన్
      మెల్పుగ మురిపెము లలరగ
      తల్పము; వడ్డించె తుదిని దధ్యోదనమున్.
      (తల్పము=భార్య)..
కావ్యమెట్లు వ్రాయు కవి జగతిని
     
     సంఘజీవి నరుడు జన్మజన్మలనుండి
     మంచి చెడులనెల్ల మననజేసి
     కష్టసుఖము లవియె కవితాత్మకానిదే
     కావ్యమెట్లు వ్రాయు కవి జగతిని?
సమస్య: ములగచెట్టుపైకెక్కించె మోహనాంగి.
    తనకు నున్నట్టి పనులన్ని తప్పకుండ
    చేసి పెట్టంగ బావను సిగ్గులొలక
    మనసుబంగరు మాటలు మధువులనుచు
    ములగచెట్టుపైకెక్కించె మోహనాంగి.

    సమస్య: రోగము దరిచేరెను భవరోగము మాన్పన్.
    భోగమొక రోగ మనగను
    రాగంబును బెంచుకొన్న రావణుడంతన్
    వేగమె సీతను దొంగిల
    రోగము దరిచేరెను భవరోగము మాన్పన్.

     వర్ణన: కాళిదాసు సాహిత్య సృజన.
    భోజుని డెందముంగనులుమూసి గ్రహించెడు సత్కవీంద్రుడై
    సాజముగల్గుపోలికల చక్కని సంస్కృత కావ్యరాజముల్
    తేజము దిక్కులం బఱపు ధీనిధి యయ్యెను కాళిదాసుడై
    రాజిత కీర్తికాంత ఘన రమ్య విలాస విశేషసంపదన్.

     సమస్య: మధురమైనదిదే యని మరలకోరె. 
     కన్నబిడ్డడు కమనీయ గళముతోడ
     తొక్కుబల్కుల "త్తత్తని" నొక్కిపలుక
     శ్రవణపేయమంచును సీత సంబరాన
     మధురమైనదిదే యని మరలకోరె. 

సమస్య: కాలు కదపకయుండు లోకాలు తిరుగు. 
   సున్నితంబయి సతతంబు చోద్యమైన
   యోచనలపుట్ట; రాగమ హోదధి యగు
   మానసంబది పరికింప మానవులకు
   కాలు కదపకయుండు లోకాలు తిరుగు. 

సమస్య: బయటకేగక యున్న సౌభాగ్య మబ్బు.
 తనువు చాలించు దుస్థితి తప్పుకొఱకు
 ముక్కు నోరుల మూయంగ మొత్తుకొనిన
 లెక్కలేనట్టి జనులకు లెక్కలేదు
 బయటకేగక యున్న సౌభాగ్య మబ్బు.
సమస్య: అక్షరమైనవ్రాయక కృతార్ధతనొందె నిదేమిచోద్యమో. 
    భక్షణజేయుచుండెను కృపారహితాత్మత పిన్నపెద్దలన్
    రాక్షసికోవిడంతటను రాగవిరాగ స్వభావహీనమై
    శిక్షణ గోరివచ్చుప్రియ  శిష్యుల రక్షణ జూచుటంజుమీ
    అక్షరమైనవ్రాయక కృతార్ధతనందె నిదేమిచోద్యమో. 

సమస్య:  పామును గనినంత కప్ప పకపకనవ్వెన్
    
    ఏమని చెప్పెద తీరును
    పామునకుం గోరలున్న భయమందరకున్
    ఏమియు బుసలేని నలిక
    పామును గనినంత కప్ప పకపకనవ్వెన్
సమస్య: ప్రసవింతురు బావగారు పదిరోజుల లో.
మీపొన్నెకంటి.( పరీక్షించిన డా.బావమరది, బావగారితో)
మసలుచు నుండిరి కుశలత
నిసుగులు చెల్లెండ్ర గర్భ నిలయమునందున్
వసివాడక మన గృహమునె
ప్రసవింతురు; బావగారు!పదిరోజులలో. 
సమస్య: తినుటకు వీలులేదనుచు తీర్చెను వంటలు షడ్రసంబులన్.
మనుమలు మన్మరాండ్రు తెర మాటున నానమయింటిలోపలన్
పనివడి సంతసమ్మొదవ వంటలు చక్కగ లక్కబుడ్లలో
మనములు దోచ చేసి కడు మానితరీతిని చిన్నదిట్లనెన్
"తినుటకు వీలులేదనుచు తీర్చెను వంటలు షడ్రసంబులన్."
సమస్య: తనయ ద్రౌపదియే సతి ధర్మజునకు. 
వీర విక్రమ విలుకాడు విజయుడంత
మత్స్యయంత్రమ్ము ఛేదించి మగువగెలిచె
అమ్మ యాజ్ఞ నైదుగురికి నమరె ద్రుపదు
తనయ ద్రౌపదియే సతి ధర్మజునకు. 
సమస్య: ఇంతులు చేయునట్టి పనులే మగవారికి నిత్యకృత్యముల్. 
అంత సమంబటంచును ధనార్జన మున్నగు నన్నికార్యముల్
పంతములేక సుహృదిని పాలుగజేకొన భావ్యమౌనుగా 
గాంతులు గూడ చేయవలె  కామితమొప్పగ కాపురంబున
న్నింతులు చేయునట్టి పనులే మగవారికి నిత్యకృత్యముల్. 
సమస్య: ఒకటియు రెండు మూడనగ నొప్పరు వారెవరెంత చెప్పినన్.
ప్రకటనలెన్నిజేసినను భద్రతనుండగ నెన్నిజెప్పినన్
వికటపు కోవిడున్ గుఱిచి వేయివి ధంబుల నొక్కిచెప్పగా
నకట!యి దేమిచోద్యము! మహాంధత మున్గిన మూర్ఖమానవుల్
ఒకటియు రెండు మూడనగ నొప్పరు వారెవరెంత చెప్పినన్.
సమస్య: యతులను ఖండించినట్టి యతినిస్మరింతున్.
యతులన శ్రేయోకాములు
మతిమంతులు భక్తయోగ మాన్యులుజూడన్
శ్రుతిమించిచెలగు కుహనా
యతులను ఖండించినట్టి యతినిస్మరింతున్.
సమస్య: ప్రాణాయామంబు మనకు భద్రతగూర్చున్.
 వీణాతంత్రులు మీటిన
 నాణెపు సంగీతమట్లునవజీవములం
 త్రాణము జేయుచు తనువున
 ప్రాణాయామంబుమనకు భద్రతగూర్చున్.
 ప్రాణాధారము వాయువు
 శోణవిశుద్ధికి పవనము సుశ్లోకంబౌ
 కోణములెన్నిటజూచిన
 ప్రాణాయామంబు మనకు భద్రత గూర్చున్.
సమస్య : శారదకౌముదీ రజని చల్లుచునున్నది విస్ఫులింగముల్.
ఆరయ పుష్పబాణు పరమాద్భుత శక్తికి లొంగినాడ, నే
ధీరుడనైన రావణుడ; దీనత వేడితి నీదుపొందుకై
చారువిశాలలోచన!కృశాంగి!మనోహరి! భూమిజా!మదిన్
శారదకౌముదీ రజని చల్లుచునున్నది విస్ఫులింగముల్.
సమస్య: కురిసెను వానజల్లు సుమకోమలి ఛీయని నిందజేయగా!
మురిసిరి ప్రేయసీప్రియులు ముద్దుగ పుష్పవనాంతరంబునన్
దరియగ సంబరంపడుచు తన్మయమందుచు కౌగిలింతలన్
గరమరుదైనరీతిని సుఖాంబుధి దేలుచు నుండ నత్తఱిన్
గురిసెను వానజల్లు సుమకోమలి ఛీయని నిందజేయగా!
సమస్య: కౌరవులన్న పాండవులు కాదని చెప్పుట సత్యమేకదా. 
  నూరగు సంఖ్యగల్గి తమనోటికిచేతికి ధర్మవర్తనల్
  దూరమటన్న భావనల దుష్కృతులన్ పచరించుచున్సదా
  క్రూర మదాంధులౌచు సుమకోమలి కృష్ణను దాకినట్టి యా
  కౌరవులన్న;  పాండవులు కాదని చెప్పుట సత్యమేకదా. 
 సమస్య: కుక్కలు నక్కలేన్గులును కోతులు పందులు వ్యాఘ్రసింహముల్.
 ఎక్కడనుండె దైవమత డెవ్విధినుండెనొ తెల్పుమన్న నా
 చక్కని బాలుడంతటను సాదరమొప్పగ నయ్యవారితో
 నక్కజమందు తాత్త్వికత నంతయు జూపుచు నామహేశుడే
 కుక్కలు నక్కలేన్గులును కోతులు పందులు వ్యాఘ్రసింహముల్
  చక్కని విద్య చిత్రకళ సాధనజేయుచునుండె దీక్షమై
  యక్కమలాక్షి రాధికయె నద్భుత రీతిని వ్రాసె చిత్రముల్
  పెక్కురు దైవముల్ మరియు పేర్మివనాంతర జంతుజాలముల్
  కుక్కలు నక్కలేన్గులును కోతులు పందులు వ్యాఘ్రసింహముల్.
సమస్య: గుడియే యఘములకు పెద్దకోట కనంగన్.
 మడిగా దేవుని పూజలు
 బడయగ భక్తి స్మరియింప పరమోన్నతమౌ
 కడునీచ గణములకు నిశి;
 గుడియే యఘములకు పెద్దకోట కనంగన్.
 గుడిలో నసభ్య నృత్యాల్
 మిడిమేలపు కుఱ్ఱకారు మ్లేచ్చులకృత్యాల్
 కుడియెడమ చీట్ల పేకలు
 గుడియే యఘములకు పెద్దకోట కనంగన్.

సమస్య: కంటి చుక్కలు గుండెను కదలజేసె. 
    ప్రాణవాయు సమృద్ధికి నాణెమైన
    నాటు మందిడు వైద్యుడానందమూర్తి
    చక్కనైనట్టి చుక్కల చక్కజేయ
    కంటి చుక్కలు గుండెను కదలజేసె. 
    కండ్లు చుక్కలజూచిన కలుగుహాయి
    చుక్కలు కనులయందున జూడకీడు
    నిశితముగ జూచి వైద్యుండు నిర్ణయింప
    కంటి చుక్కలు గుండెను కదలజేసె. 
  ప్రాచీన వైద్యం..ఛందం ఐచ్ఛికము.
  తిండి మితమది కానిచో తిన్నదంత
  యరిగి పోకుండ యుదరాన పెరుగు నొప్పి
  బామ్మ ప్రాచీన వైద్యమ్ము వాముఉప్పు
  నూరి సేవించ కలుగును భూరిగుణము.

సమస్య: కాకిని గాంచికేకియనుకాలమువచ్చె నిదేమిచిత్రమో!
    వ్యాకులపాటు గల్గెడిని వాస్తవముల్ గనినంత విద్యలో
    సోకులెగాని వీరికడ సూక్ష్మతరాంశపు పాండితీప్రభల్
    వాకొన శూన్యమయ్యెగద! వాసిగలట్టి ప్రసిద్ధులుండగా 
    కాకిని గాంచికేకియనుకాలమువచ్చె నిదేమిచిత్రమో!
సమస్య: నాశనమును గోరి కొలిచె నారాయణునిన్.
    కేశవ నామస్మరణము
    పాశములను ద్రుంచి మోక్ష ఫలముల నిచ్చున్
    ఆశగ  ప్రహ్లాదుడు భవ
    నాశమునుగోరి కొలిచె నారాయణునిన్.

    సమస్య: సిగరెట్టున్ సిగపట్లు రెండు పృథివిన్ చేకూర్చు శ్రేయంబులన్.
    సిగరెట్టొక్కటె చాలు నూపిరుల శుష్కింపంగ జేయంగనే
    సిగపట్లన్నను చెప్పనేమిటికి నేస్నేహంబులంగూల్చవా?
    మగకైనన్ మరియాడువారికిని సమ్మానార్హమాజూడ?నే
    సిగరెట్టున్ సిగపట్లు రెండు పృథివిన్ చేకూర్చు శ్రేయంబులన్.
సమస్య: బాణఘాతముల్ సుఖమిచ్చు పడతులకును. 
    మరులు రేకెత్త మనసది పరుగులిడగ
    తోడు కోరిన మనసైన రేడుదొరుక
    వాని సరససమ్మోహన వాక్కులనెడు
    బాణఘాతముల్ సుఖమిచ్చు పడతులకును. 
సమస్య: చోరుడగును నేత మనకు చోద్యంబేలా? 
  భారీ కాన్కలు రొక్కము
  తేరగ మనకందెనంచు తిన్నగ నోట్లన్
  గోరికవేసి జయమ్మిడ
  చోరుడగును నేత; మనకు చోద్యంబేలా? 

సమస్య: దశరథసూను బాణము వృథాయయిపోయె నిదేమిచిత్రమో.
    యశముగ లట్టి వీరులటు యాగము చేయుచు నశ్వమంపగా
    వశమయిపోయె నయ్యదియ వాంఛితముల్ సమకూరె మాకిటన్
    కుశుడన నేను తా లవుడు క్రోధము మానుమటన్న నా మహా
    దశరథసూను బాణము వృథాయయిపోయె నిదేమిచిత్రమో.
సమస్య: నీ యాలింగనమే మహౌషధము మాన్పించున్ మనస్తాపమున్.
మాయామేయ జగంబు లీల గనగా మాబోంట్లకున్ సాధ్యమే
నీ యాశీస్సులు భూరి సత్కృపలు మా నీమమ్ములన్ మార్చునే
యో యీశా! భవసాగరంబు దరియన్నుత్సాహముం జూపగన్
నీ యాలింగనమే మహౌషధము మాన్పించున్ మనస్తాపమున్.
సమస్య: టీవీలుండెను చూచిమెచ్చ మునివాటిన్ పూర్వకాలంబునన్.
భావంబుల్ స్తవనీయమై పరగ వా గ్వైచిత్ర్యమొప్పారగా
సేవల్ జేయుచు ముక్తిమార్గమున దా జింతించ సర్వేశుడే
బ్రోవంగన్;  వినయానవచ్చె  మునికిన్ పున్నెంపు  నేత్రంబులై 
టీవీలుండెను;  చూచిమెచ్చ మునివాటిన్ పూర్వకాలంబునన్.
సమస్య: కాకి తీయగా పాడె నుగాదిపూట. 
కోయిలమ్మల రాగాల  కూహుకుహుల
ననుసరించుచు సవరించి తనదుగళము
మెప్పు నందుచు సభలోన మీరిపోవ
కాకి తీయగా పాడె నుగాదిపూట. 

సమస్య:  అతిథుల పారద్రోల నహహాయని మెచ్చిరి బంధులెల్లరున్.
   జతల కొలంది గేహముల జావళి కీర్తనలాలపించుచు
   న్మతిచెడి పోవుభంగిమల మాన్యతలన్నియు మంటగల్పుచు
   న్వెతలనుగల్గజేయు బలు వింతగు దోమల బంధువర్గమ
   న్నతిథుల పారద్రోల నహహాయని మెచ్చిరి బంధులెల్లరున్.
సమస్య: కుండబ్రద్దలుగొట్టెను కోడలకట! 
 కట్న మేమియి వద్దని గతములోన
 నత్తతలయూపి వచియించి; యసలురంగు
 జూప కాళియై పతినొక చూపుజూచి
 **కుండబ్రద్దలు గొట్టెను కోడలకట!**
సమస్య: మద్యముగ్రోలనెల్లరకు మాంద్యమువోవును స్వాస్థ్యమబ్బెడిన్.
హృద్యములైన లీలలను హేలగ జూపుచు కొంటెచేష్టలన్
పద్యము లందునన్ జొనిపి పంకజనాభుని భక్తితత్త్వ నై
వేద్యపు సారమంతటిని ప్రీతిని మద్యముజేయ పోత, నా
మద్యము గ్రోల నెల్లరకు మాంద్యమువోవును స్వాస్థ్యమబ్బెడిన్.
సమస్య: తల్లిని జంపువాడు పినతల్లికి బెట్టునె పాయసాన్నముల్. 
పిల్లికి సైతమున్ దయను బిచ్చముబెట్టక స్వార్ధబుద్ధితో
కల్లలుబల్కుచున్ పరమ కర్కశుడౌచును భక్తిహీనుడై
చల్లని యుల్లమున్ గలుగు  సద్గుణశీలిని ప్రేమమూర్తియౌ
తల్లిని జంపువాడు పినతల్లికి బెట్టునె పాయసాన్నముల్. 

 సమస్య: భ్రమలో జనులుందురేలొ పరికింపంగా.
తమ ధనము లెక్కవేయుచు
తమ బంధువులెల్ల సతము ధైర్యమెయనుచున్
తమతెల్విగొప్ప జెప్పుచు
భ్రమలో జనులుందురేలొ పరికింపంగా.

తమజాతి నాయకుండని
తమకష్టములన్ని దీర్చు ధార్మికుడనుచున్
తమవోట్లువేసి సుఖపడు
భ్రమలో జనులుందురేలొ పరికింపంగా.
సమస్య: దయగలవారు నింద్యులుగదా ధర బూజ్యులనంగ నిర్ఘృణుల్.
ప్రియముగ మాటలాడి కడు పేదలబాధల దీర్ప జూచుచున్
భయమును బారద్రోలి తన బాధ్యతగా పరమార్ధబుద్ధితో
నయమును నమ్ముకొన్న ఘన నాయకులైన మహానుభావులౌ
దయగలవారు నింద్యులుగదా ధర బూజ్యులనంగ నిర్ఘృణుల్.
సమస్య: ఆటలనర్ధదాయకము లాడుట కీడగు నెల్లవారికిన్. 
మేటియశంబు గూర్చి తమ మేథకు శక్తుల వృద్ధిమేరకున్
సూటిగ వేగమిచ్చుచును శుభ్రమనస్కులు ప్రస్తుతింపగా
ధాటిగనాడు క్రీడలవి తప్పక గొప్పవి; యట్లుకాని యా
యాటలనర్ధదాయకము లాడుట కీడగు నెల్లవారికిన్. 

సమస్య: కుమతులసంగతిందిరుగ గోరును సద్గుణవంతుడెప్పుడున్.
అమలిన సంఘసేవకయి యన్యులడెందము లెల్లమార్చగన్
స్థిమిత మనస్కుడౌచు పరిశీలన గల్గిన తాత్త్వికుండునై
సమయము జూచుకొంచు కడు స్థైర్యముమీరగ సాహసంబునన్
గుమతుల సంగతిం దిరుగ గోరును సద్గుణవంతుడెప్పుడున్.

సమస్య: దారా రమ్మనిపిల్చె నొక్కసతి భర్తన్ ప్రేమపొంగారగా.
ధీరా!నీవటులేగినావు వరమై దేశంబు కాపాడగా
వీరత్వంబున నీకుసాటి కనగన్ వేరొండు లేరందునే
నీ రాకన్ విని నాదు కోర్కెలిల మిన్నేరై చనెన్; దీనమం
దారా! రమ్మని పిల్చె నొక్కసతి భర్తన్ ప్రేమ పొంగారగా. 

సమస్య: కాలమువచ్చి చిక్కినది గంతులు వేసెడి లేడిచూడగన్.
లీలగ రాజభోగముల లేశముకందక సేవలందుచున్
మేలగు సద్గుణంబులను మేదిని కీర్తి గడించియుండినా
శీలవతీలలామ పరిసేవిత కృష్ణ విరాటు జేరెగా!
కాలమువచ్చి చిక్కినది గంతులు వేసెడి లేడిచూడగన్.
సమస్య: రాజ్యమేలువాడు రాజు గాడు.
  రాజ్యమన్న మట్టి,రాళ్ళగుట్టలుకాదు
  ప్రజలు,భాష,మనసు, ప్రాభవాలు.
  కూర్మి వానినెఱుగకుండగ గ్రుడ్డిగ
  రాజ్యమేలువాడు రాజు గాడు.

సమస్య: చెలిమి కలిమిని కలనైన చిదుమరాదు.
   తలపు లొకటయి మమతల  గలసినపుడు
   మధుర మధురపు మధువులు మనసుదడుప
   ఇరువురొకటయి చెలిమిని సిరులుగురియ
   చెలిమి కలిమిని కలనైన చిదుమరాదు.

సమస్య: ప్రభువు బంటును సేవించి ప్రస్తుతిగనె. 
    కష్ట సుఖముల తననెప్డు కలవరించి
    స్వార్ధమెరుగని సద్భక్తి సాగుచుండు
    రామదాసును రాముడు రహినిగాచె
    ప్రభువు బంటును సేవించి ప్రస్తుతిగనె..
సమస్య: ప్రాణములేనివానికి వివాహముజేసిరి చూడరండహో.
    రాణియు,రమ్య,శోభలిట రమ్యముగా నొక చోటగూడి, పా
    రాణియుబూసి గంధముల రాయుచు ప్రేముడి చెక్కబొమ్మకున్
    నాణెమలంకరించి కడు నవ్వులురువ్వుచు పాటబాడుచున్.
    ప్రాణములేనివానికి వివాహముజేసిరి చూడరండహో.
సమస్య:  దుర్వినయంబునన్ మనసుదోచెడువారు హితైషులేకదా.
    సర్వముమామహేశుని ప్రసాదమటంచునహర్నిశల్ సభన్
    చర్వితచర్వణంబుగను చాటుచు రాజులు మత్తులున్ మహా
    గర్వితులంచుదెల్పు గతకాలపు సత్కవి రాజులెల్లరున్ 
    దుర్వినయంబునన్ మనసుదోచెడివారు హితైషులేకదా.

   సమస్య: చదువు కొన్న నిష్ఫలమగు సంఘమందు.
   చదువు సంస్కారములు రెండు చాలినంత
   కలుగజేయని చదువది కాదుచదువు
   అట్టిదానికి నాస్తుల నమ్ముకొనుచు
   చదువు కొన్న నిష్ఫలమగు సంఘమందు.

సమస్య: లేమి సుఖమిచ్చు సంపదల్ కీడొసంగు. 
    జీవనంబున సంపదల్ చేరవలయు
    నెక్కువైనను పెడదారి త్రొక్కునరుడు
    కన్ను మిన్నునుగానక కఠినుడగును
    లేమి సుఖమిచ్చు సంపదల్ కీడొసంగు. 
సమస్య: నిజమును జెప్పజూడకది నేరము ముప్పుకు మూలమౌనులే.
   ప్రజలను మభ్యపెట్టి కడు ప్రల్లదులౌచును మంత్రివర్యులే
   నిజములుదాచి డంబముల; నేర్పున దిర్గుచు స్కీములంచు తా
   భుజముల గొట్టుచుండ నిజమున్ గ్రహియించిన గాని యేరికి
  న్నిజమును జెప్పజూడకది నేరము ముప్పుకు మూలమౌనులే.
సమస్య: మధువు సైతము విషముగా మారుసుమ్మి!
   చెడుగుజేయగ యోచించు స్థిరముగాను
   మంచి పనిజేయ త్వరపడు మానితముగ
   ఆలసించిన నవకాశ మంతరించు
   మధువు సైతము విషముగా మారుసుమ్మి!
సమస్య : పరసంస్తుతి మేలుగూర్చు ప్రాజ్ఞులకెల్లన్.
    అరయగ విజ్ఞానంబును
    తిరమొప్పగ గూర్చుచుండి తేజమునిడెడా
    వరగుణ మాన్య గురుపరం
    పరసంస్తుతి మేలుగూర్చు ప్రాజ్ఞులకెల్లన్.
సమస్య: కలుపును దొలగించరాదు కర్షకులెపుడున్.
   బలిమిని గూర్చగ భూమికి
   నలచందలు పిల్లిపెసర లద్భుతమనుచున్
   తిలలను జల్లగ నా కల
   గలుపును దొలగించరాదు కర్షకులెపుడున్.
సమస్య: తొలగజేయు భద్రమలరజేయు. 
   ఇలను గుజ్జువేల్పు నిభవక్తృనిత్యమ్ము
   తలచుకొనగ మేలు కలుగజేయు
   కలను గనగరాని కష్టభారములన్ని
   తొలగజేయు భద్రమలరజేయు. 
సాంద్ర భారతీయ సంస్కృతులన్నియు
    విలువకలిగి మనదు విలువబెంచు
    నర్ధమెరిగివాని నాచరించగ కీడు
    తొలగజేయు భద్రమలరజేయు. 
గ్రంథపఠనమునను కలుగు విజ్ఞానంబు
     దేశకాలమాన స్థితులుదెలియు
     చెలిమికానివోలె చేరికష్టములెల్ల
     తొలగజేయు భద్రమలరజేయు. 
సమస్య: వంచనజేయువాడె కడు వందితుడై సుఖియించు నిచ్చలున్.
     మంచినటించుచున్ బరమ మానినులందరి సర్వదుఃఖముల్
     త్రుంచెద గోటనంచు పరితోషిత భక్తజనాళి ఘోషలన్
     సంచులనున్నమూలికలు సాదరమొప్ప విభూతులీనుచున్
     వంచనజేయువాడె కడు వందితుడై సుఖియించు నిచ్చలున్.
సమస్య: పద్దెము వ్రాయువారు కడు పామరులౌదురు గుంపులందునన్. 
   పద్దెము వ్రాయగోరిన ప్రభావముజూపుగణంబు ప్రాసలున్
   తద్దయు శైలి ఛందములు తారసిలున్ యతులంచు నడ్డమై
   యొద్దిక మీరగేయములమోఘపు నానిలు వ్రాయమేలగున్
   పద్దెము వ్రాయువారు కడు పామరులౌదురు గుంపులందునన్. 

     సమస్య: తామరతూడుదారమున దంతిని గట్టగవచ్చు సత్కవీ.
పామరుడైనగాని మరి పండితుడైననుగాని భక్తిమై
యేమరుపాటులేక గిరిజేశుని నిండుమనమ్మునన్ సదా
కామవిదూరుడై కొలువ ఖండితరీతిని నేనుబల్కెదన్.
"తామరతూడుదారమున దంతిని గట్టగవచ్చు సత్కవీ."
వేసవి వరదలు. వర్ణన. 
వాయు కాలుష్యముంజేయ వచ్చె మొయిలు
క్రొత్తదౌ "నికో లింబసు" కూర్పుతోడ
పడగ జడివాన మారెగా వరదరీతి
వేసవైనను వరదలు వింతగాదు. 
సమస్య: తద్దినమ్మన శుభమని తరుణి మురిసె. 
పెండ్లి యైనట్టి క్రొత్తల ప్రేమతోడి
సరసవచనాల ఘటనల చనవుతోడ
గుర్తుచేయుచు నవ్వుచు భర్తపలుక
తద్దినమ్మన; శుభమని తరుణి మురిసె. 
సమస్య: కావలివారు తెంపుకొని కాయల పిందెలనారగించరే. 
కావలినుండితెచ్చి యిరు కాపులమామిడియంటు శ్రద్ధచే
నా వనమందు బెంచగ ఘనంబుగమూడవయేటనే యహో
కావలెనన్న వానిపయి కాపునుగాయగ చూడవచ్చినా
కావలివారు తెంపుకొని కాయల పిందెలనారగించరే.

సమస్య: దండనలేనినాడెగద తగ్గును నేరములెంచిచూడగన్.
గుండెలు మండగా పరమక్రోధము తోడుత నేరగాళ్ళకున్
దండనగా శిరంబులట తప్పక ఖండనజేయ నాగవే
దండిగజర్గు నేరములు; తాత్త్విక దృష్టిని నెంచిచూచినన్
దండనలేనినాడెగద తగ్గును నేరములెంచిచూడగన్.

సమస్య : సరసులు మెచ్చరెచ్చటను సత్కవి కావ్యమదేమి చిత్రమో!
కరము మహాపకారములు క్రౌర్యపు చింతన లాగ్రహంబులున్
దురిత నిజాంతరంగములు దుర్గుణపూరిత భావజాలముల్
కరుణయొకించుకేనియును కానని దుర్ఘటనాళి జూచినన్
సరసులు మెచ్చరెచ్చటను సత్కవి! కావ్యమదేమి చిత్రమో!
నేటి ప్రసారమాధ్యములు. 
వివిధములైన సంగతుల  విస్మయముంగలిగించు పత్రికల్
శ్రవణము దర్శనంబులను చక్కగగూర్చెడు యంత్రరాజముల్
నవరస గీతముల్వినగ నవ్య సుగీతప్రసారసాధనాల్
దివమును రాత్రులున్ నరుల దేహపుభాగముగాగ సెల్లులున్

సమస్య: ముద్దిడె బుగ్గను సతి పతిముందరెవానిన్.
ముద్దుల మనుమని సాయిని
విద్దెల చురుకైన వాని విమలాసుతునిన్
హద్దులు మీరిన ప్రేమను
ముద్దిడె బుగ్గను సతి పతిముందరెవానిన్.

సమస్యాపూరణ  కొరకు  యిచ్చిన పాదమ్.       
  కీ కీ ,హిహిహీ, బెకబెక , కిచకిచ , భౌభౌ .29.06 .15
శ్లోకాలు నాకు క్రొత్తగు
మా కాలువ గట్ల వెంట మత్తిలి తిరుగన్
నా కీ రవములు క్రొత్తే
కీ కీ ,హిహిహీ, బెకబెక , కిచకిచ , భౌభౌ .

















   
   
  









 

    
      


 





    



  




    





      




 

   
  

    
        

        
         
           
   


     
   

    
 
   

        
          
     
           
        
       
           
        
     













     
   


       
         


 

   

    - 

     
   


 

       



    
       
     

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...