సీ: కాలడిగ్రామాన ఘనకీర్తి వెలయింప
ప్రభవించి తిరిగిన భర్గుడతడు
ఉసిరిక దానంబు నువిదచే బొందుటం
గుందిన సదయార్ద్ర గుణయుతుండు
శ్రీలక్ష్మి ప్రార్ధింప చెలువార కనకధా
రాస్తవమొనరించు లక్షణుండు
అద్వైతమున్నిల్ప యన్నిమతంబుల
వారినెదిర్చిన భవ్యుడతడు
ఆ.వె: ధర్మ రక్షణంబె ధర్మంబు మనకంచు
దారి చూపిన జడదారియతడు
భరతమాతబిడ్డ పావనచరితుండు
శంకరార్యు మదిని సన్నుతింతు!
తే.గీ: భౌద్ధ మతమది యలమెను భారతాన
గురువు లెందరో వాదాల నెరపుచుండ
మొండి ఘటముల మార్చ ప్రచండులైన
శంకరాచార్య గొల్తు సచ్ఛాస్త్రధుర్యు!