శ్రీరస్తు! శ్రీ గురుభ్యో నమః . శుభమస్తు!
నామము: " బుఱ్ఱ కథ నాజరు చరితము."
రచయిత : పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
ఫోన్. నం. 9866675770.
బుఱ్ఱకథ నాజరు చరితము . కథా సంగ్రహము .
వర్షాధారిత ప్రాంతమగు "గుంటూరు" జిల్లాలోని "పొన్నెకల్లు" గ్రామములో అన్ని కులములతో బాటు దూదేకుల మహమ్మదీయకులమునకు జెందిన "షేక్ మస్తాన్",అతని అన్న "నాజర్" కుటుంబములుండెడివి. మస్తాను చెక్కభజన, నాజర్ షెహనాయి కళాకారులు. నాజర్ గొప్ప కళాకారుడిగా సుప్రసిద్ధుడు. దురదృష్టవశాత్తు ఒక కుమారుడు కలిగిన తదుపరి నాజరు మరణించెను. ఆ సమయముననే 5.02.1920 న మస్తాన్ కు కుమారుడు కలిగెను. తన అన్నగారంత గొప్ప కళాకారుడు కావలెనని కుమారునకు "నాజర్ వలి" అని పేరుపెట్టిరి. మస్తాన్ కుటుంబమంతయు కూలికి వెళ్ళినగాని జరుగుబాటులేనిస్థితి. వారు కుమారుని ఐదవ సంవత్సరమున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బంపిరి. నాజర్ చిన్న నాటినుండి సమయస్ఫూర్తిగను, ఆశువుగను పాటలల్లి మధురముగ పాడెడువాడు. పాఠశాలలో చిన్నచిన్న నాటకములలో వేషములు వేసెడువాడు. ఇతని పెదనాన్న వారసత్వముగా వచ్చిన స్వరజ్ఞానమును, అభినయకౌశలమును ఇతని ''కనకధార''నాటక పాత్ర ద్వారా గమనించినహార్మోనియముకళాకారుడు"ఖాదర్ఖాన్"సంగీతమునేర్పించుటకు"తెనాలి"దగ్గఱ"పెదరావూరు"లోని"బాలరత్నసభ"లోచేర్పించెను. 2సంవత్సరముల తదుపరి ఖాదర్ ఖాన్, నాజరును సంగీతవిద్యలో పైస్థాయి కొఱకు "నరసరావుపేట"లో "మురుగుళ్ల సీతారామయ్య" గారి దగ్గఱ చేర్పించెను.
సీతారామయ్యగారు నాజర్ కు సంగీతము మాత్రమే నేర్పుచు భోజనసదుపాయములకువేశ్యావీధులలోవారములనుచేయించెను.అచటనేర్చినసంగీతపరిజ్ఞానమే"పద్మశ్రీ"పురస్కారముపొందుటకు,"బుఱ్ఱకథాపితామహుడగుటకు, వాగ్గేయకారుడగుటకు" తగు స్థాయిని కల్పించినది.
"నరసరావుపేట" నుండి పొన్నెకల్లు వచ్చిన తరువాత తండ్రి మరణము వలన కుటుంబ బాధ్యతలు నెరవేర్చుటకు కూలిపని,దర్జీపనిచేసెడివాడు. చెల్లిపెళ్ళికి తనకునాటక, పాటలపోటీలలో వచ్చిన మొత్తము బంగారు, వెండి బహుమతులనమ్మెను. దర్జీపని చేయుచు దర్జాగా పాటలుపాడుచుండగా చూచిన "కొమ్మినేనిబసవయ్యగారి" సహాయముతో సంగీతోపాధ్యాయునిగా మారెను. ఆయనచే సంగీతపుఓనమాలు, సరిగమలు కుటుంబమంతయు నేర్చుకొనినది. బసవయ్యగారి కుమారుడే చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగములు చేసి స్వరచక్రవర్తిగా, సంగీత దర్శకునిగా వెలిగిన "చక్రవర్తి." ఆ సమయములోనే కమ్యూనిస్టు వారు తమ సిద్ధాంతముల ప్రచారముకొరకు ప్రజానాట్యమండలి స్థాపించి పాటలపోటీ పెట్టి గాయకులను ఎంచి, శిక్షణ నిచ్చి రు. 32లు నెలసరి జీతమిచ్చి పోషించిరి. సమాజ చైతన్యము కొఱకు బుఱ్ఱకథ నేర్పిరి. నాజరు జన్మతః కళాకారుడు కనుక గొప్పప్రజ్ఞ సంపాదించెను. బాగుగా కథలు చెప్పుచున్న సమయములో ప్రభుత్వము కమ్యూనిస్ట్పార్టీని, నాజరు బుఱ్ఱకథలను నిషేధించినది. పోలీసులు దాడులు చేయుట వలన కొంతకాలము జైలుజీవితము గడపెను. మొదటి భార్య అనారోగ్యము కారణముగా ద్వితీయ వివాహము చేసికొనెను. దురదృష్టవశాత్తు నిండుగర్భిణి యయిన రెండవభార్య బావిలోపడి మరణించెను. తృతీయ వివాహముగా తన మరదలిని చేసికొనగ ఆమెకు ఐదుగురు కుమార్తెలు, యిద్దరు కుమారులు కలిగిరి.
కొంత కాలమునకు కమ్యూనిస్టు పార్టీపై , నాజర్ బుఱ్ఱకథల పై నిషేధమెత్తివేసిరి . అప్పటినుండి మరల కథలు చెప్పుచు కొత్తకథలు వ్రాసిరి. బెంగాల్చరిత్ర, పలనాటియుద్ధము, అల్లూరిసీతారామరాజు, బొబ్బిలియుద్ధము మొదలగునవి స్వీయరచనలు. అగ్గిరాముడు, నిలువుదోపిడి, మున్నగు చిత్రాలలో నటించిరి. మహానటులు బళ్లారిరాఘవ, గోవిందరాజుల సుబ్బారావు, నందమూరి తారకరామారావు, భానుమతి వంటి వారి ప్రశంసలందుకొనిరి. "భీమవరము"లో పెక్కురు పండితుల,సంగీతవేత్తల సమక్షములో గండపెండేరసన్మానము, ''బుఱ్ఱకథాపితామహ'' బిరుదము, ఢిల్లీలో "పద్మశ్రీ" వంటి సత్కారము పొందిరి. వంతలు తరచుగా మారుచున్న కారణముగా భార్యను , చిన్న కుమారుని వంతలుగా పెట్టుకొని కథలుచెప్పిరి. వీరిని గురించి పరిశోధనావ్యాసము వ్రాయుటకు "శ్రీ అంగడాల వెంకటరమణమూర్తిగారు" స్వయముగా నాజరు గారిని కలసికొని జీవితచరిత్రను, అనుభవాలను సేకరించిరి.
జీవిత చరమాంకములోను మంచములో కూర్చొని " జాతి జీవితం - కళా పరిణామం " అను గ్రంథమును తన కుమార్తెచేత వ్రాయించుచు దానిని నిర్దుష్టము జేయుచు 11-02-1997 అర్ధరాత్రి 12 గంటలకు స్వర్గస్తులైరి. నాజరుమహాశయుని కంఠవీణాతంత్రులు మూగబోయినవి. స్వరము సరస్వతీ పాదమంజీర సవ్వడులలో లీనమైనది. యుగకర్తగా వెలసిన నాజరు మృతజీవుడు.
ఆశ్వాసముల సంఖ్య. 5.
ఃః విషయ సూచిక ఃః
ఃః ప్రథమాశ్వాసము ఃః
1. నాయక( నాజరు ) వర్ణనము.
2. మస్తాన్, నాజరుల కుటుంబ పరిస్థితులు.
3. సూర్యాస్తమయ వర్ణనము.
4. నాజరు జననము.
5.బాల్యము - విద్యాభ్యాసము.
6. నాటక ప్రదర్శనము - ఖాదర్ ఖాన్ చేయూత.
ఃః ద్వితీయాశ్వాసము ఃః
1. బాలరత్న సభలో సంగీత విద్యాభ్యాసము.
2. రేపల్లెలో నాటక ప్రదర్శనము.
3. మురుగుళ్ళ వారి శిష్యరికము.
4. వారములు చేసికొని విద్యనభ్యసించుట.
5. పొన్నుకల్లు (బంగారు కొండ)వర్ణన, ఘనత.
6.విద్యాభ్యాసానంతరము పొన్నెకల్లు జేరుట.
7. కూలి పనులకు వెళ్ళుట, దర్జీగా పని చేయుట.
8. నాజరునకు పితృ వియోగము.
9. బహుమతులమ్మి చెల్లి పెండ్లి చేయుట.
10. కొమ్మినేని బసవయ్యగారి పరిచయ భాగ్యము.
ఃఃతృతీయాశ్వాసముఃః
1. నాజరు కుటుంబ పోషణము.
2. సంగీతోపాధ్యాయునిగా బాధ్యతలు.
3. నాజరు వివాహము.
4. భారతీయ ధార్మిక వైవాహిక జీవనము.
5. గ్రామస్థులకు నాటకములు నేర్పుట.
6. తుళ్ళూరులో పాటల పోటీ - విజయము.
7. ప్రప్రథమముగా ఈమనిలో బుఱ్ఱకథ.
8. నాస్తికత్వ ప్రభావము.
9. నాజరు ఆర్య సమాజము నవలంబించుట.
10. నాజరు ప్రథాన కథకుడగుట.
ఃఃచతుర్ధాశ్వాసము ఃః
1. నాజరు దళము రాష్ట్రపరిధి కి ఎన్నికగుట.
2. నాజరు "మాభూమి"కి ప్రథమ బహుమతి.
3. నాజరు ద్వితీయ వివాహము చేసికొనుట.
4. నాజరు కవిగా మారుట.
5. "బెంగాలు" వరదలను గురించి బుఱ్ఱకథ వ్రాయుట.
6. నాజరును "పుచ్చలపల్లి సుందరయ్య"మెచ్చుకొనుట.
7. గూడవల్లి రామబ్రహ్మము గారి పరిచయము.
8. నాజరును "ఆంధ్ర అమర్ షేక్"గా పొగడుట.
9. కమ్యునిష్టులను, నాజరు బుఱ్ఱకథలను నిషేధించుట.
10. నాజరునకు మోతడక ఆసామి చే చెంపదెబ్బ.
11. ఆసామి క్షమాపణ.
12. నాజరు రెండవ భార్య మరణించుట.
13. నాజరు కొండలలోదాగుట.
14. ఒక కాంగ్రెస్ కార్యకర్త భీకర శపధము.
15. నాజరును విడుదల చేయుట.
ఃఃపంచమాశ్వాసము ఃః
1. కమ్యూనిస్టులపై, నాజరు బుఱ్ఱకథలపై నిషేధము.
2. నాజరు పల్నాటికథను బుఱ్ఱకథగ వ్రాయుట.
3. నాజరు బుఱ్ఱకథకు ప్రాచుర్యము పెరుగుట.
4.ఆకాశవాణిలో నాజరు బుఱ్ఱకథ.
5. నాజరు చిత్రరంగ ప్రవేశము.
6. నాజరునకు వెన్నుపోటు పొడిచిన వంత.
7. నాజరునకు భార్య ప్రోత్సాహము.
8. నాజరును కలికితురాయి, బుఱ్ఱకథా సామ్రాట్.
9. వర్షర్తు వర్ణన.
10. గృహ నిర్మాణము.
11. నాజరు బొబ్బిలి కథ వ్రాయుట.
12. పూలరథముపై ఊరేగింపు, గండపెండేరము, బుఱ్ఱకథా పితామహ.
13. నాజరునకు పద్మశ్రీ.
14. బాపూజీ, తండ్రి బుఱ్ఱకథావారసత్వము నిలుపుట.
15. నాజరు గ్రంథరచన.
16. పొన్నెకల్లు లో నాజరు శిలా విగ్రహము.
ఇష్టదేవతా స్తుతి
ఉ: శ్రీహరి కోడలా! సుజన సేవిత ! వేద విహార రూపిణీ !
వాహనమైన హంసగుణ వారసు జేయుమ నన్ను నిచ్చలున్
దేహము మానసంబులను దిన్నగ జూడు కృపావలోకనన్
సాహసినై చరించెదను జక్కగ నీ పదమంటి యుంటచే - 1
ఉ : నాలుకవేదిక న్నిలిచి నాట్యముజేయుచు రమ్యభావముల్
వేలకువేలనిచ్చి శరవేగమె పద్య ప్రబంధరాజమున్
మేలుగ గూర్చుమంచు వరమిచ్చిన వాణి పదాలజంటపై
ఫాలమునుంచి మ్రొక్కెదను పాయని భక్తిని జీవితాంతమున్ - 2
ఉ : దివ్య మనోహరంబయి సుదీపితవాఙ్మయ పూర్ఱసారమై
నవ్య పదాంచితంబయి మనంబుల హత్తుకొనంగజాలు-మేల్
కావ్య మశేష ధీవరుల కంఠము లందున మారుమ్రోగగా
భవ్య రసజ్ఞ రూపయయి పల్కగ జేయుమ రాగభారతీ ! - 3
ఉ : ధర్మమె మారురూపమయి ధర్మమె నిత్యము సాధనమ్ముగా
కర్మల నాచరింప ఘన కంటకదూషిత కాననంబుల
న్నిర్మలచిత్తుడై దిరిగి నీతివిదూరుల నేలగూల్చి- యా
మర్మము విప్పిజెప్పు పరమాత్ముని శ్రీరఘురాము గొల్చెదన్ - 4
ఉ : లంకను జేరనీయనని లంకిణి భీకర క్రూరవృత్తిమై
బింకముతోడ దేహమటు బెంచుచు దూకుచు మ్రింగబోవ - ని
శ్శంకత సూక్ష్మరూపియయి చక్కగ నాస్యము లోనికేగి - యా
వంకనె వచ్చినట్టి ఘన వానరవీరు నమస్కరించెదన్ - 5
ఉ : బావిని నీవుగా వెలసి భక్త జనాళి హృదంతరమ్ములన్
దావుల నింపినావుగద! ధన్యత గూర్చుచు కాణిపాకము
న్బ్రోవర శ్రీగణాధిపుడ ! మోదకహస్తుడ ! విఘ్నవారణా !
భావన జేతు నిన్సతము పార్వతి పుత్రుడ ! యేకదంతుడా - 6
ఉ : శ్రీపురవాసియై బరఁగి చిన్మయ రూపగ కీర్తినందియున్
బాపురె భక్తకోటికిల బంగరుతల్లిగ భద్రవల్లిగా
ప్రాపున జేరినన్ మరియు పాయనిగూర్మిని చింతజేసిన
న్బాపములెల్ల ద్రుంచి నిరపాయము గూర్చెడి లక్ష్మిగొల్చెదన్ - 7
పూర్వకవి స్తుతి
కం : రామాయణంబు వ్రాసిన
శ్రీమంతుడు భక్తవరుడు శ్రీవాల్మీకిన్
ప్రేమాదరములు పొంగగ
నా మానస మందిరాన నయముగ గొల్తున్ - 8
ఉ : రాజమహేంద్రపట్టణము రంజిలు రీతిని సంచరించి - వి
భ్రాజిత పాండితీ గరిమ భారతమాంధ్రి రచించెనౌర ! సం
పూజిత "నన్నయార్యు" మది మ్రొక్కుదు కోరుదు నాశిషంబులన్
జాజులు విచ్చినట్లు విరజాజులు పూచినయట్లు నెమ్మదిన్ - 9
ఆ.వె : తెలుగు పలుకుబడిని తేనెలు గురియించి
పాత్ర పోషణమున ప్రజ్ఞ జూపి
నాటకీయశిల్ప నవ్యతజూపిన
"తిక్కయజ్వ"కవి నుతింతు నేను -10
ఉ : భారత శేషముం దనదు భాగ్యముగా బరిపూర్తిజేసి - మేల్
వారసుడయ్యె "నెఱ్ఱన" నవారిత ధీరత పండితాళికిన్
భూరి యశంబుగన్న కవిపూజ్యుడు పుణ్యుడు ధన్యుడాతడే
చేరి నమస్కరింతుకడు శ్రేయము గూర్పగ నండనుండఁగన్ - 11
కం: భాగవత పుణ్య గాథను
రాగ సుధాభరిత దివ్య రసములతోడన్
సాగగ జేసిన "పోతన
యోగికి" జెల్లింతు నతుల నున్నతభక్తిన్ - 12
గురుస్తుతి
ఆ.వె : బాల్యమందు తనదు బడిలోన జేర్పించి
ఓనమాలు నాకు నొడిని నేర్పి
పెద్దజేసినట్టి పెన్నిధి రూపమౌ
"కొండ కృష్ణమూర్తి" గొల్తునెపుడు - 13
తే.గీ : ఆంధ్రవ్యాసు ‘‘ననంతరామా’’ ఖ్య గురుని
శ్రేష్ఠు శ్రీవత్సగోత్రు సుశీలు సౌమ్య
కావ్యవారాశి నీదిన ఘనుని మదిని
దలఁతు నాదు పుట్టుక చరితార్థమంద - 14
ఆ.వె : మందహాసముననె వందల భావాలు
పొందుపఱచి సభల విందుజేయు
ప్రథితు "బేతవోలు" బ్రార్ధింతు మదిలోన
మరువలేను నేను మాన్యచరితు - 15
మిత్ర ప్రోత్సాహము
సీ : ఎవ్వాడు పందొమ్మిదేండ్లకు నొజ్జయై
సంస్థలో శిష్యుల సానబట్టె
ఎవ్వాడు రూపాన నెంతలే యనిపించి
కావ్యరంగమునందు గలముబట్టె
ఎవ్వాడు కీర్తిని నెవ్వేళ బొందుచు
స్థానిక హృదయాల స్థానమందె
ఎవ్వాడు వినయంబు నేనాడు విడువక
పెద్దలదృష్ఠిలో బెద్దయయ్యె
ఎవ్వాడు శతకంబు నిట్టె వ్రాసియు చూపె
పద్యతోరణమున ప్రతిన బట్టి
తే.గీ: అట్టి "జయరామ శర్మ"యే యాదరాన
"సూర్యనారాయణా !"నీవె సుకృతివగుచు
కావ్యరచనకు బూనుము ఖ్యాతిగలుగు
నంచుబలికెను గూర్మితో నన్ను జేరి - 16
కం: మిత్రుని కోర్కెనుదీర్పగ
నాత్రముగా బూనుకొంటి నంచిత రీతిన్
చిత్ర విచిత్రపుగవితల
శ్రోత్రములకు విందుగూర్ప సురుచిర ఫణితిన్ -17
కృతిపతి స్వప్నదర్శనము
18:వ: నవరసభావానుబంధబంధురంబుగా నొక్కప్రబంధంబు నిర్మింపందలంచి, డోలాయమానమానసుండనై మహాప్రబంధంబునకుం దగిన పుణ్యశ్లోకుండును, సర్వకళాకోవిదుండును, ధీశాలియును, మహోదాత్తుండెవరొకో యని మథనపడుచున్న సమయంబున నా పితృదేవులు పొన్నెకంటి పూర్ణచంద్రశేఖర వరప్రసాదరావు పూజ్యపాదులు స్వప్నంబు నందు గానుపించి ప్రేమానురాగ పురస్సరపుత్రగాత్రపరిష్వంగంబు గావించి "నాయనా!నీవువంశవిఖ్యాతినిబెంచ సంస్కృతాంధ్రమ్ములు నేర్చిన సూరివి. మా తండ్రిగారయిన "సూర్యనారాయణ" నామాంకితుడవు. సుగుణశీలివి. ప్రబంధరచనా, పఠనాసక్తుండవు. పొన్నెకంటి వంశ బుధమండలిమండితుండవు. మన గ్రామవాసియై బుఱ్ఱకథాపితామహునిగ,నవయుగవాగ్గేయకారుండుగ, నవసమాజచైతన్యకారకుండుగ,మహోద్దండపండితమండలిచేమన్ననలంది,గండపెండేర ఘనసత్కారంబు లంబొంది,ప్రభుత్వముత్కృష్ఠకళాకారులకిచ్చు"పద్మశ్రీ" బిరుదాంచితుండై వాసిగాంచిన "షేక్ నాజర్" చరిత్రను ప్రబంధంబుగా వ్రాసి నాకంకితమిమ్మని కోరగా అమందానంద కందళిత హృదయారవిందుడనై జనకుని యాదేశము సిద్ధింపజేయ సంసిద్ధుండనై వారి చరణారవిందములకుం బ్రణమిల్లి ప్రబంధ రచనకు శ్రీ కారంబు జుట్టబోవుచున్నాడను.
: కృతిపతి వంశావతార వర్ణన, ప్రశంస :
సీ : పొన్నెకల్లనియెడి పున్నెంపు గ్రామంబు
గుంటూరు జిల్లాను గొప్పజేసె
ఆంగ్లేయ పాలనన్నౌదల దాల్చని
చురుకైన ధీయుత శూరులున్న
నల్లరేగడి నేల నాణెంపు భూమిలో
పంటలేయవి యైన ఫలములీన
సత్కళామూర్తులు సాహితీ స్ఫూర్తులు
సత్కవులచ్చోట జననమొంద
తే .గీ : సిరుల నిలయమౌ నద్దాని చేవజూచి
స్పర్థ యున్నను తమకది వ్యర్థ మనుచు
సాటి గ్రామాలు తలవంచి సాగిపోయె
నిజము గ్రహియింపజాలిన నేస్తులగుట .
సీ : కరిణీకమన్ వృత్తి గౌరవమింపార
సాగించుచుండెడు సాధుమతులు
బేహారముంజేసి ప్రియమార నార్జించు
బిడియంపు వైశ్యుల వింతగతులు
వ్యవసాయ మొక్కటే వారి జీవనమని
కష్టించి పండించు కర్షకాళి
రుగ్మతల్ వచ్చినన్ రోజుకూలికినేగు
నిరుపేద వర్గాల నిమ్నగతులం
తే. గీ : గాంచగలమయ్య యప్పొన్నెకల్లు నగరి
బ్రాహ్మణోత్తమ, బేహార వర్గములను
కూర్మి రెడ్లను, పింజారి కులమువారి
వృత్తి ధర్మంబె దైవమై వెలుగువారి . - 19.
ఆ.వె : సిరులు యశము గల్గు "శ్రీవత్స" గోత్రజుల్
పొన్నెకల్లు లోన మిన్నలైరి
వారి యింటిపేరు వాసిగ మారెను
"పొన్నెకంటి" యనగ బుడమియందు .- 20.
ఆ.వె : పొన్నెకంటివంశ పూర్ణాబ్ధి చంద్రుండు
"రామసామి" వెలసి రాణకెక్కె
సుతులు వెలుగు జూచె "సూర్యనారాయణ,
రామనాథమనగ రాగమతులు .- 21.
తే.గీ : "సూర్యనారాయణాఖ్యు"ని సుతులిరువురు
"మాధవుండును పూర్ణయ్య" మనిరి కూర్మి
పూర్ణచంద్రుని యిల్లాలు పుణ్యవతిగ
వఱలె " ననసూయ"పేరిట వసుధయందు .- 22.
తే.గీ: పుణ్య దంపతులిరువురు మోదమొంద
"నరసవిలి సూర్యదేవుని" వరమువలన
"సూర్యనారాయణాఖ్యుండు" సూనుడాయె
"సూరి" పేరున సజ్జన స్తుత్యుడాయె .- 23.
ధుర్యుండాతం"డరుణుడు"
కం : "సూర్యేందిర"లకు బంటగ
కార్యజ్ఞుండైన సుతుడు క్రన్నన బుట్టెన్
మర్యాదాంచిత యశుండు మాన్యుండతడే .- 24.
తే.గీ. సూర్యనారాయణ సుకవి సోదరుండు
"పాండురంగ విఠలుడను " పరమ లౌకి
కుండు గ్రామకరణముగ గొలువుఁ జేసి
కోర్కెమీరగ విశ్రాంతి గొనుచునుండె .- 25.
కం : "కైలాస"నామధేయుడు
లాలితముగ బుత్రుడయ్యె "లక్ష్మీపతికిన్"
ఆలంబమనగ నిల్చెను
కాలోచితమైనరీతి గారవమొప్పన్ . - 26.
షష్ఠ్యంతములు
కం : శ్రీమంతుడైన వానికి
రామార్పిత మానసునకు రాజిత మతికిన్
ధీమంత వినయశీలికి
ప్రేమాస్పద పూర్ణరూప పితృదేవునకున్ .- 27.
కం : కాలోచిత సద్భాషికి
సాలోచన తత్పరునకు సజ్జననుతికిన్
శూలాయుధు నామంబున
లీలం జరియించు విస్ఫులింగంబునకున్ .- 28.
కం. అలిమేలుమంగసుతునకు
సలలితభావోన్నతుండు సంపూర్ణునకు
న్నిలలో ఖ్యాతిని గాంచిన
తెలుగును ప్రేమించునట్టి తేజోనిధికిన్.- 29.
కం : సునిశితునకు సుగుణ మణికి
జనతతి హృదయానువర్తి చాతుర్యునకున్
మనముల గెలిచిన వానికి
ఘన చరితను గలిగినట్టి గంభీరునకున్ .- 30.