ప్రేమ స్వరూప,స్వభావాలు.
వింత గొల్పు ప్రేమ విశ్వాన దాగెలే
బంధనమ్ము వేయ బహుముఖాల
తల్లి, చెల్లి, భార్య తన బంధువర్గంబు
మురిసి తనిసి విరియు మోహ వశత!.. 1.
జీవి ప్రాణ మెచట జీరాడు బంధమున్
ఉద్భవించ నచట నుండు ప్రేమ
ప్రేమ లేని ప్రాణి ప్రియమేల బొందురా?
సత్య మిదియ నలువ చక్ర మందు..... .2.
ఎప్పు డెక్క డెచట నేర్పడు టన్నది
ఎఱుగ రాని దదియె మఱు లనంగ
శ్రేయమునకు మరియు చిక్కుల దిక్కుకై
పుట్టు చుండు నయ్య! పుఱ్ఱె లందు......3.
మాతృ ప్రేమ లోన మానిత త్యాగంబు
భార్య మమత లోన బహుళ రుచులు
చెల్లి, అన్న, వదినె చిత్రంపు ప్రేమలో
రాగ భావ తాళ రక్తు లుండు..... ..... .4.
చావు పుట్టుకలకు సరియైన హేతువు
తనువు మీద నుండు తగని ప్రేమ
దాని మీద కన్న దైవంబు పైనున్న
పుణ్య చయము పెరిగి మోక్షమబ్బు.... 5.
అరయ ప్రేమ యనగ నక్షరంబులు రెండు
అట్టి దాని శక్తి యణువు మించు
మనిషి జంతు జాల మవనిని సంతస
మొంద ప్రేమ వలయు పూర్ణ గతిన... .6.
స్వార్థ మెక్కువైన సమయును ప్రేమయే
ప్రేమ లేని జీవి ప్రేత సమము
నిల్ప వలయు దాని నిజ హృది యందున
దైవ మగుట కొఱకు తపము జేసి... .. .7.
గ్రుడ్డి ప్రేమ యెపుడు కూడదు మనిషికి
చేటు దెచ్చు సర్వ శ్రేష్ఠుకైన
కౌరవాగ్రజుండు గాంధారి మనముల
నిట్టి ప్రేమ యుంట నిహము చెడిరి.... .. .8.
కంట జూత మన్న కనరాదు చిత్రమై
గుండె గూడు లోన కుదురు కొనును
చేష్ట లందు మోము చిర్నవ్వు లందున
స్పష్టమగును దాని సహజగుణము...... .9.
పేద ప్రజల పట్ల ప్రేమాదరంబుల
చూపు వారికె మధుసూదనుండు
శ్రేయ మిచ్చి సతము సిరులను బెంచును
తెలిసి మసలుమయ్య తెలివి గలిగి....... 10.
సిరులు పంచ తరుగు చిత్రంబు కాదది
ఆస్తి పాస్తు లెల్ల యణగిపోవు
ప్రేమ పంచుకొనగ పెరుగును మిత్రమా
కన్న సత్య మదియె కరుణ వినుమ...... 11.
కసిరి విసిరి చెప్ప కాదందు రెవరైన
ప్రేమ తోడ జెప్ప ప్రియము గల్గు
మంచి బెంచ గల్గు మహిమాన్వితంబది
పాటి సేయుమయ్య ప్రాజ్ఞతముడ!..... 12.
ప్రేమ లేని పొందు ప్రియపత్నిదైనను
సార హీన మౌచు నేర మగును
ప్రియము పల్లవింప ప్రేమ సార్ధకమగు
తెలసి సాగుమయ్య తెలివిగలిగి...... ... 13.
కాకి నేర్పే పాఠాలు.(ఫేస్ బుక్) 7.07.19.
కాకిగోలటంచు కన్నెఱ్ఱయేలయా, ప్రేమమీర జాతి పిల్చుటదియ
మనిషికేది యిట్టి మహనీయ భావంబు?, కఠిన స్వార్ధపరుడు కనగనరుడె.1.
నోరులేని కాకి యోరామచంద్రుడా, కావుకావుమనుచు కరుణబిలుచు
నమ్మకంబులేని నరుగతిజూడంగ, కావుమనగలేడు కమలనాభు. 2.
కాకి సంఘజీవి కనబడు సత్యంబు, సంఘమందె బలము సర్వముండు
ననుచు దెల్పు మానవాధములకునెల్ల, వాయసంబె ఘనము వసుధయందు.3.
కాకి ముందులేచి కాలమ్ముసూచించి, నిద్రమత్తు డుల్చు నేర్పుమీర
చురుకుదనము లేక స్త్యుత్యుడకావంచు, మానవునకు దెల్పె మహితగతిని.4.
కాకిపొదగదగిన గారాబుగ్రుడ్లనున్, క్రిందపడగద్రోచి నందెఫలము
కోకిలమ్మతనదు కుహనత్వముంజూపె, కాకి లేనినాడు కోకిలేది? 5.
శ్రావ్యమైనగొంతు చక్కని రూపంబు, లేకయున్ననేమి కాకికెపుడు
కంటనొక్కముద్ద కనబడ్డచాలుగా, బందుగులనుబిల్చు విందుసేయ.6.
పగను వదిలితేనే శుభం.(ఫేస్ బుక్.8.07.19)
పగను పెంచుటన్న పామునుబెంచుటే, వేచియుండు నదియ వేటుకొఱకు
విషము పగయు రెండు వేర్వేరు కాదయా, దూరముంచుమయ్య దుష్టగుణము.1.
శుభముగోరువాడు చూడడు పగవంక, మంచిమాటలాడి మసలజూచు
నిప్పువంటి పగను నీలోన దాచకు, దూరముంచుమయ్య దుష్టగుణము.2.
కోపమున్న నదియ కొంతయుసహ్యంబు, దాని వలన కలుగు తామసంబు
మారరాదుపగగ మనసునందెప్పుడు, దూరముంచుమయ్య దుష్టగుణము.3.
బీపి షుగరు స్థాయి భీకరరీతిలో, పగలు రేయి యనక రగులజేయు
పగను నీవు విడువ భద్రంబుజీవంబు, దూరముంచుమయ్య దుష్టగుణము.4.
పగలు జంపకున్న పగలె మనలజంపు, క్రూరమైన పగను కోరవద్దు
సంఘజీవనాన శాంతియె నీహద్దు, దూరముంచుమయ్య దుష్టగుణము.5.
పగను జంపురీతి పగయది కాదులే, శాంతగుణమె దాని సాధనంబు
గాంధితాతకిదియె ఘనమైన తత్త్వంబు, దూరముంచుమయ్య దుష్టగుణము.6.
పగను రగులకుండ పాండవాగ్రజుడప్డు, శాంతి మంత్రముననె సాగెసతము
అందుకాతడయ్యె నాదర్శ మూర్తిగా, దూరముంచుమయ్య దుష్టగుణము.7.
మదిని పగనుబెంచ మాన్యత్వముంబోవు, ప్రియముజూపి మిగుల ప్రేమబంచ
జగతియందు సతము జయమది నీదెరా, దూరముంచుమయ్య దుష్టగుణము.8.
స్వచ్ఛమానసాన సన్మార్గముల్దోచు, దీర్ఘకోపమందు దిగులెమిగులు
సంతసంబెనీకు సద్గుణోపాసనౌ, దూరముంచుమయ్య దుష్టగుణము.9.
పరమహంస లెల్ల పరమాత్ముసన్నిధి, చేరుమార్గమొకటె చిత్తమనిరి
దానినుంచదగును ధర్మంపుమాటున, దూరముంచుమయ్య దుష్టగుణము.10.
మీ పొన్నెకంటి.🙏
బెంగుళూరు. ప్రజపద్యం. సం.గా.
కస్తూరి కన్నడన్ కమనీయ గంథముల్
రాస్తాల ప్రసరించు రమ్యభూమి
చెట్లనీడలలోన శీతలవాయువుల్ు
మెల్లగ వీచెడు మేటిభూమి
పరభాషలకు గూడ బాగైన విలువలన్
సమకూర్చి కాపాడు సాధుభూమి
రాయల పాలనన్ రససాహితీతతుల్
పురుడుపోసికొనిన పుణ్యభూమి
పెద్ద గణపయ్య నెలవైన బెంగుళూరు
రంగు రంగులహర్మ్యాల బెంగుళూరు
వింత వాతావరణముల బెంగుళూరు
పచ్చదనమున కమనీయ ప్రాంగణమ్ము.
సాహిత్య ప్రయోజనం.(10.07.19)
హితవు బోధపఱచి హేయగుణముబాపి
ఉన్నతునిగ మార్చి యుదధివంటి
జ్ఞాన మిచ్చి సతము నాణెంపునడతల
ఘనుని జేయ గలదె కావ్యమనగ.1.
వెఱ్ఱివాడు పూర్ణ వేదాంతియౌజుమీ
చవటకూడ చదువ సద్గురువగు
గ్రంథపఠన వలన జ్ఞానంబు పెరుగురా
అక్షరంబె మనకు రక్షయగును.2.
మధుర మధురమైన మహనీయభావనల్
ఏర్చికూర్చి వ్రాసి యింపుగాను
సంఘహితవుగోరి సాహిత్యకారులై
కీర్తిగాంచె కవులు స్ఫూర్తి దనర.3.
మహిత ధర్మమార్గ సహితుడౌపురుషుండు
సంఘమందు మిగుల సద్గుణుండు
అట్టి గుణములెల్ల యంతరంగంబుండ
కావ్యపఠనమయ్య కారణంబు.4.
విభవమెంతయున్న విజ్ఞాని కానిచో
గౌరవంబులేదు ఘనతరాదు
సరస సాహితీ రసాస్వాదవిదుడెపో
చక్రవర్తి మించు చక్రవర్తి.5.
సంఘజీవనంబు సారస్వతములేక
సారహీనమగును జనులకెపుడు
మంచిచెడ్డలందు మరిమరియోచింప
నమల జ్ఞానధనమె యవసరంబు.5.
మనసుపరవశింప మహితవిజ్ఞతపెంచ
సారవంతమైన చదువులెగద
మూలకారణంబు ముద్దుగనూహింప
రాజుకైనగాని రజకుకైన.6.
సాగె సుమధుర భావంపు సంపదాళి
అక్షరార్చిత మౌచును ననువుగాను
ఫేసుబుక్కున జరిగెడు రేసులోన.
" సరసమయ్యెను సాహిత్య సౌరభమ్ము."😀😀😀
దేశాభివృద్ధిలో నా పాత్ర.(11.07.19)
దేశసేవయన్న దేహముప్పొంగును
నేరికైన గాని నిశ్చయముగ
ధర్మపరుడనగుచు ధార్మికజీవికన్
నడచుకొనుటయదియె నాదుపాత్ర.1.
గ్రామసీమలెల్ల ఘనముగానెదుగుటే
క్రాంతి,వృద్ధియనెను గాంధిజీయె
వారి కలలు పండ వైభవంబుగ సాగి
నడచుకొనుట యదియె నాదుపాత్ర.2.
కవితనాయుధముగ కమ్మని సాహితిన్
మనముపులకరింప మహితగతిని
మార్చివేసి జనుల మనుగడ దెల్పుచు
నడచుకొనుట యదియె నాదుపాత్ర.3.
స్వార్థపరత సతము చంపును వృద్ధిని
దేశప్రగతికదియ నాశనమ్ము
త్యాగబుద్ధి కలుగు తత్వంబు నెలకొల్పి
నడచుకొనుట యదియె నాదుపాత్ర.4.
దేశవృద్ధి కొఱకు ధీరత్వమున్నట్టి
యువత శక్తి యుక్తు లవసరంబు
అట్టిస్ఫూర్తి బెంచి యంతరంగములందు
నడచుకొనుట యదియె నాదుపాత్ర.5.
పొదుపుచేయుచున్న పూర్ణఫలముగల్గు
అందుముఖ్యమౌను నర్ధమెపుడు
సర్వ గౌరవాలు సంపదందెయనుచు
నడచుకొనుటయదియె నాదుపాత్ర.6.
దేశభక్తి యొకటె దివ్యంపువృద్ధిని
కలుగజేయు ననిన కల్లగాదు
యువతమనమనందు నుత్తేజముంబెంచి
నడచుకొనుప యదయె నాదుపాత్ర.7.
సమస్య: కవియొకడు కానరాడు కర్నాటమునన్.
నా ప్రయత్నము. పొన్నెకంటి.
నవరసభావాలంకృత
కవనంబదెవారి సొత్తు కమనీయముగా
అవిరళ సాహతి నెఱుగని
కవియొక్కడు కానరాడు కర్నాటమునన్.
కవన వనమంత కస్తురి
నవసౌగంధ్యమ్ములెల్ల నాణ్యతజూపున్
నవరస విహీన జడుడౌ
కవియొకడును కానరాడు కర్నాటమునన్.
మీ పొన్నెకంటి.