పర్యావరణ రక్షణ కో మొక్క నాటుదాం... శీర్షిక. 20.6.24.
సీ:
ప్రాణవాయువులీని ప్రగతికి తనువిచ్చి
భద్రంబుగూర్చు నా పాదపాలు
మట్టిబుట్టిన చెట్లు మన సంపదకు మెట్లు
కోట్ల కొలది నాటకుండుటెట్లు?
ఉద్యాన వనముల న్నుత్సాహమింపార
నెలకొల్పుదామింక నెయ్యమలర
పర్యావరణ రక్ష పాలన కొఱకునై
నాణెంపు మొక్కలు నాటుదాము
తే.గీ:
పారమార్థిక సౌభాగ్య ఫలములిచ్చి
జీవగఱ్ఱగ నున్నట్టి చెట్లు నాటి
తీర్చుకొందము ఋణమును తెలివితోడ
నడుగువేయుడు జనులార హర్షమొదవ.
సీ:
నీమది యెఱుగని నిర్మల త్యాగంబు
వృక్షంబులెఱుగురా వెఱ్ఱి వాడ!
నీమది యెఱుగని నిర్మల రాగంబు
చిగురు జొంపాలలో చిందుచుండు
నీమది యెఱుగని నిశ్చల ధీరత
లాఘవంబుగ బ్రాకు లతలగలదు
నీమది యెఱుగని నిష్కామ కర్మమే
ఉద్భిజంబులనుండె నున్నతముగ
తే.గీ:
జ్ఞానివైనట్టి మానవా! కల్పవృక్ష
రూపభేదాలె యియ్యవి లోకమందు
కూల్చబోకుమ దయమాలి క్రూరబుద్ధి
నాటి పోషింప కల్గును నవ్యశోభ.
మిద్దె తోట.
గృహపు శోభలనారోగ్య శ్రీలకొఱకు
పూలమొక్కలు కూరలు పొందికగను
సాగుజేసిరి పూర్వులు సాంద్రరీతి
అద్ది మిద్దెతోటయి నేడు ముద్దుగూర్చె.
సూర్యనారాయణాఖ్యుని సూనుడైన
అరుణ కిరణు వి శాల సాహాయమొసగ
మిద్దె తోటను బెంచెను మీరుప్రేమ
మిత్రబృందంబు సతతంబు మెచ్చుకొనగ.
హాని లేనట్టి యెరువుల నందుకొనుచు
ప్రాణికోటికి నాయువు పంచుచున్న
సతత హరితంపు వృక్షాల సాగుజేయ
సంఘ సేవకు మార్గమ్ము సజ్జనుండ!
శ్రీనివాసరావు స్థిరమైన చిత్తాన
మిద్దె తోట సిరుల మిత్రతతికి
పంచి పెంపుజేసి పరిఢవిల్లెను నేడు
దాని నందుకొనుచు తనిసె జనులు.
మిద్దెతోట వలన మించును సత్కీర్తి
మిద్దెతోట పెంచు మిత్రతతిని
మిద్దెతోట యిచ్చు మెరుగైన శాంతిని
కూర్చుమయ్యమీదు కోర్కెలలర!
ఫేసుబుక్కునందు ప్రియమార వాట్సపు
గ్రూపులందు నీవు కుదురుకొనిన
పంచుకొనగ వీలు బహువిధ సందియాల్
తీరు సందియములు మారు స్థితులు.
కొందరు వృక్షశాస్త్రమున కొందరు మేలగు జీవశాస్త్రమున్
కొందరు పృధ్విమూలముల కోరినరీతిని జెప్పువారలున్
కొందరు కీటకాంత విష కోణ సుమార్గ విచారశీలురున్
అందరు అందరే యిచట హాయిగ గూడిన శైరికాగ్రణుల్.
ప్రతిమిద్దె తోటయై భాసించి శ్వాసించ
ప్రాణవాయుస్థాయి పదిలమగును
ప్రతిమిద్దె తోటయై రంగుల హంగులై
హరివిల్లు తలదన్ని విరియవలయు
ప్రతిమిద్దె తోటయై భద్రాత్మకంబునై
ఆయురారోగ్యతల్ అమరవలయు
ప్రతిమిద్దె తోటయై పరదేశ దేశాల
భారతీయతలెల్ల పండవలయు
మాతృ దేశంపు కేతన మాన్యతలను
సతత హరితంపు విలువల సారతరము
మిద్దె తోటలె లక్ష్యమై మిన్నుముట్టి
భరత మాతకు జేజేలు పలుకవలెను
రవి శశిల పుట్టినరోజు 8.5.83..(22)
రవియు శశియును తమకాంతు లవనినింప
కవల లైపుట్టిరీపొన్నె కంటిలోన
వర్ణన: అకాలవర్షాలు..రైతుకష్టాలు.
దుక్కులు దున్నితిన్ మిగుల తుష్టిని గల్గిన విత్తనంబులన్
మక్కువతోడవిత్త ప్రియ మాధురి మాదగు క్షేత్రమందునన్
చక్కనిపంటపండినది శాపము వోలె నకాలవర్షముల్
దుక్కులు దుక్కులైకురియ తోయజనాభుడ!దిక్కునీవెగా!
గాజులు సూత్రముల్ మరియు కంటెను బ్యాంకున నుంచినేర్పుగా
సాజపు వడ్డితో రుణము చాలియు చాలకయున్న దెచ్చితిన్
రాజనముల్ విశేషముగ రాలునటంచును నాశజెందితిన్
భోజనదూరమై బ్రతుకు బూడిదజేసెనకాల వర్షమే.
వేసవికాలపు వర్ణన...
ఎండలుమండు కాలమున నెక్కడజూచిన పానశాలలే
మెండుగ దర్శనంబిడును మేలు రసాల ఫలంబులెన్నియో
దండిగ తాటిముంజలును తట్టలనిండుగ మల్లెపూవులున్
పండుగశోభ గూర్చు నిల పల్లెలు పట్టణ మారుమూలలన్.
వర్ణన: గ్రీష్మంలో వర్షం...
గ్రీష్మతాపంబు పగలంత కీలలెగయ
కరుణజూచిన వరుణుడు కదలె భువికి
మెల్లమెల్లని చినుకులై చల్లగాలి
యుల్లమలరించె నాశ్చర్యమల్లుకొనగ..
వేసవి వరదలు. వర్ణన.
వాయు కాలుష్యముంజేయ వచ్చె మొయిలు
క్రొత్తదౌ "నికో లింబసు" కూర్పుతోడ
పడగ జడివాన మారెగా వరదరీతి
వేసవైనను వరదలు వింతగాదు.