20, అక్టోబర్ 2020, మంగళవారం

నవరాత్రులలో... గాయత్రీ దేవి.

                      1.  గాయత్రీ దేవిగా ఈనాడు దుర్గాదేవి.. స్తుతి.

        శా:  కారుణ్యామృత చింతనావృత విధిన్ గాయత్రి చిద్రూపివై

             సారాసారవిచార మంత్ర నిధివై సౌందర్యవారాశివై

             ఘోరాజ్ఞానపుటంధకార జగతిన్ కూర్మిన్విదారించుచున్

             శ్రీరంజిల్లెడు వెల్గులిమ్ము సతమున్ క్షేమంకరీ!యీశ్వరీ!

               2. శరన్నవరాత్రుల లో.  దుర్గామాత, అన్నపూర్ణ గా...

    శా: ఆహారంబును జీవకోటి కిడి యాహ్లాదంబు గల్పించుచున్

         మోహాంధత్వముబారద్రోలి కరుణన్ ముద్దార దీపించునా

         సౌహార్దాది మహోన్నతంపు గుణియౌ శాకంబరీదేవి సు

        స్నేహానందవరాన్నపూర్ణ మనలన్ చిద్రూపియై కాచుతన్. 

               3. వాణిగా ..దుర్గాదేవి.   శ్రీవాణ్యై నమః

తే.గీ: పలుకుపలుకున మధువులు చిలుకజేయ

        జ్ఞానశక్తియు విజ్ఞాన శక్తులీన 

        వేదశాస్త్రాల సారాలు వెలికిదీయ

        వాణి కరుణించి నా జిహ్వ వరలుగాత!

శా: భావావేశ విలాస సంపదలు సంప్రాప్తంబులై యుండుటల్

     ప్రావీణ్యంబున సత్కళావిజయముల్ పండించి మెప్పించుటల్

     తావుల్జిమ్మెడు కావ్యసంపుటులు సద్ధర్మార్ధ వేదాంతముల్

     నీవాల్లభ్యముగాదె వాణి! జగతిన్నేజ్ఞానికైనన్ సదా!


శరన్నవరాత్రుల లో దుర్గాదేవి.

     దుర్గాదేవ్యై నమః....స్తవము.మీపొన్నెకంటి

  భర్గుని వామభాగమయి భవ్యసురార్చిత కల్పవల్లివై

  నిర్గుణ నిర్మలాత్మ కమనీయరసాంచిత స్వాదుమూర్తివై

  దుర్గగ"నింద్రకీలమున దుస్తరపాపవిదూరశక్తివై

  మార్గవివేచనన్ సలిపి మమ్ములగావుమ! తల్లిశాంభవీ!

             4.  దుర్గాదేవి లలితా త్రిపుర సుందరిగా....

 చం  లలిత మనోజ్ఞభావనలు లాలిత సత్కవితావిభూతులన్

       కలరవ గాత్రమాధురులు కమ్మని కావ్యవివేచనారుచుల్

       సలలిత భక్తి తత్త్వములు చక్కని గ్రంథవిలాసబంధముల్

       వెలయగజేయ శక్తినిడ వేడెద శ్రీలలితాంబనెప్పుడున్.

             5.  దుర్గాదేవి మహాలక్ష్మి గా...

 ఉ . పాలసముద్రరాజ సుతవై సురకోటి సుపూజితాత్మవై

     శ్రీలకునాలవాలమయి చెన్నలరారెడు విష్ణుపత్నివై

     హేలగచిద్విలాసత మహీతలమేలు కృపాంబురాశి! మా

     పాలిట మాతృవత్సలత భాసురరీతిని జూపుగావుతన్.!

స,తీ,దే,వి. ఆటవెలదిలో.. లక్ష్మీ దేవి స్తుతి. 

సరసిజాక్షి!కమల!సౌందర్యవారాశి

తీర్చు మమ్మ వెతలు తిరముగాను

దేవి! నీదు కరుణ దేదీప్యమానంబు

విష్ణు హృన్నివాసి! వేలనతులు.


నవమి రోజు..సిద్ధధాత్రి రూపం.,మహిషాసుర మర్దిని.

   అమ్మకు వందనములతో..మీపొన్నెకంటి.


  సిద్ధ ధాత్రిగ నీరూపు శ్రీలగూర్చు

  నవమి రోజున నీదివ్య జవముజూపి

  దుష్టసంహారివైనావు తోయజాక్షి

  రాజరాజేశ్వరీ!మాకు రక్షనిమ్ము!


  మహిష రూపాన మత్తిల్లి మగువయనెడు

  చుల్కనైనట్టి భావాన సుందరాంగి

  శాంభవిని గోర రణమున సమయజేసె

  అట్టి విజయ దుర్గాదేవి నాశ్రయింతు.


అందరికి విజయదశమి శుభాకాంక్షలు.

 సీ: నవవిధరూపాల నవ్యాంతరంగాల 

            మహిషునిజంపిన మాత!వీవు!

     పదునాల్గులోకాలు భయముననిండగ

           రక్షగల్పించిన రమణివీవు!

    లలితలావణ్య విలాసినే కాదంచు

             స్త్రీశక్తి జూపిన చెండివీవు!

    దుష్టుల దునుమాడి శిష్టుల గాపాడి

             తోషంబుగూర్చిన దుర్గవీవు!

    విజయదశమిన ఘనమైన విజయమంది

    ధర్మ వర్తనె విజయంపు మర్మమనెడు

    సూక్తి చాటిన లోకైక శోభనాంగి!

    అమ్మ నీకివె హారతులందుకొనుమ!




పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...