18, డిసెంబర్ 2019, బుధవారం

నలురాణీ!నమస్తుభ్యం. నలు...గోదారి. అభిషేకం. బెంగళూరు.

రంగుపువ్వులగూర్చి స్పందన.

       రంగురంగుల హంగులు రహిని నిలిపి
       సప్తవర్ణాలశోభలు సంతరించి
       పృథ్వి కన్నుల పంటగా సృష్టి కర్త
       సుమపుజాతులు సృజియించె నమితప్రేమ.

        తపస్సు లోనన్న పార్వతి గూర్చి స్పందన.

        తలపు లెన్నియొ వచ్చుచు తొలగుచుండు
        శ్వాసపై ధ్యాసను నిల్పుచు స్తబ్దురీతి
        మౌనముద్రను పాటించు మనసునిమ్ము
        పరమకల్యాణి మాయమ్మ వరముగాను.

               శతక రచన.. స్పందన.
        ముందుపుట్టలేదు మోదంపుయోచన
        నీవు ప్రోత్సహింప నెరుపగలను
        శతకరచన మనకసాధ్యంబెమిత్రమ!
        జయములీను"రాము చలువవలన."

         నరునిభావములకు నారాయణుడలరి
         చిత్తమందుదూరి చేయిత్రిప్పు
         కలము మనదెకాని కల్పనలతనివి
         శతకరచన యదియె సాగిపోవు.

     ఆశావాదం చేయించే అద్భుతాలు.

సీ: ఆశయె విమలసదాశయ బీజము
                   చక్కనియోచన సల్పుచున్న
    ఆశయె సారరసాంచిత క్రొన్నన
                   చిత్తశుద్ధిగలిగి చేయుచున్న
    ఆశయె భూరిశాఖావృత సంపత్తి
                   కార్యసాధనమున కదలుచున్న
    ఆశయె పుష్పఫలాశ్రిత సుమధువు
                    పట్టుసడలకుండ ప్రతినబూన
     భావి సత్కార్య విజయాల తావియాశ
     సగటు మనిషికి జీవన ప్రగతి యగుచు
     నిశిత శోధన కనువగు నేర్పునిచ్చి
     జీవనంబును సరిదిద్దు చిద్విలాసి.

      ప్రజ.పద్యం.ఫలితాలు.నా స్పందన.12.10.2013.

     రేపే కావ్యపు ఫలములు
     ఏపేరిటికెయ్యదుండి ఇచ్చునొ ముదముల్
     నీపాదపద్మమంటిన
     ఏపద్యముగద్యమైన నెత్తావెశివా!

    కలిత నవరస సద్భావ కైతలనుచు
    వ్రాసిపంపితి పదములనేసినేసి
    ఏదియేమైన పండిత నిర్ణయాన
    ఫలితములగని మోదాన పరవశింతు

     అమ్మా వాణీ! నీదయ
     కమ్మని కవితా ప్రసూన గంధములెల్లన్
     ఇమ్మహి నాచే వెల్వడి
     సమ్మానంబుల నొందితి సరసుల మధ్యన్.

     శుక్రవారమందు శోభాయమానమున్
     కోరులక్ష్మి. తనదు కోర్కెదీర
     అటుల కనిన యింట అమ్మయె దయతోన
     తిష్ఠవేసియుండు తిరుగులేక.

     కష్టసుఖముల కడలిని క్రాగుచుండి
     పరుల శ్రేయమ్మె సతతంబు పథమనంగ
     సాగి జగతికి సంతృప్తి సల్పుచున్న
     కర్మ యోగీశ మరువను కలనునైన

      ఫేస్ బుక్ లో.వృక్షము.ఛాయ..పై స్పందన.

   ఒంటరినన్నభావనయె యోనరుడా యిసుమంతయేనియున్
   కంటికికానరాదెపుడు కమ్మనిపండ్లకునాలవాలమై
   యుంటను సర్వజీవులకు నూర్జితసేవలజేయుచుండుటన్
   మింటిప్రమాణమైయెదిగి మించిన పచ్చదనంబు పంచుటన్.
                              సౌందర్యమంటె ఇది.
  సౌందర్యభరితాలు స్వామి కన్నులుజూడ
                    జగముల కాపాడు జనకుడగుట
  సౌందర్యభరితాలు స్వామి పాదంబులు
                      పతితోద్ధరణులకు భవ్యుడగుట
  సౌందర్యభరితాలు స్వామి హస్తంబులు
                     వరములగురియించు వరదుడగుట
  సౌందర్యభరితాలు స్వామి పల్కులు జూడ
                      అమృతపు సోనలై యలరుకతన
  సౌందర్యభరితాలు స్వామి నవ్వులు జూడ
                      మురిపాల పువ్వులై విరియుకతన
  సౌందర్యభరితాలు స్వామి చేష్టలు జూడ
                      ధర్మంబు కాపాడు తపనవలన
  సౌందర్యభరితాలు స్వామి పుట్టుకలెల్ల
                       భక్తుల రక్షించు బాధ్యుడగుట
  సౌందర్యభరితాలు స్వామి కల్పనలెల్ల
                        సృష్టించి చేపట్టు చేవవలన
    పూర్ణ సౌందర్యమూర్తి  సమ్మోహనుండు
    శ్రీ హరి యొకడె చూడంగ చిత్తమందు
    ధ్యాన మగ్నులు కారండి ధన్యులార!
    అసలు సౌందర్యమన్నను నతనియంశ.

     సీ: పక్షుల కిలకిలల్ పసిపాప నవ్వులు
                         పాడిపంటలసౌరు పల్లెటూళ్ళు
          శిల్పాలు చిత్రాలు చిన్నారి నడకలు
                          కొండలు గుట్టలు కోనలెల్ల
         పచ్చని వృక్షాలు పరువంపు కన్నెలు
                          ప్రకృతియందాలు పాఱునదులు
         అందమై కనిపించి ఆనందమిచ్చుగా
                          మానవాళికెపుడు మనసులోన
 తే.గీ: శాశ్వతంబులు గావవి సంతతంబు
          భ్రమనుగల్పించి యూరించి బాధపెట్టు
          ఒక్క పరమాత్మ భావనన్నొడిసిపట్ట
          అందెయగుపించు సౌందర్యమద్భుతముగ.
    ప్రజ-పద్య స్పర్థ లో బహుమతి గురించి నా భావన.

     బహుమతిలేదు నాకనెడు బాధయొకింతయు కానరాదులే
     మహి ప్రజ-పద్య సభ్యులు సుమాన్యుల మధ్యన చోటుదక్కుటే
     బహుమతి యంచునెంచితిని భాసుర వాణి సమాదరంబునన్
     ఇహపరసౌఖ్యమబ్బును మహేశునిదివ్యకృపారసంబునన్.

      ముఖపుస్తకమున ప్రజపద్య సభ్యునిగా జేరి
      వారి సూచనమేరకు " బుఱ్ఱకథాపితామహ" నాజర్ జీవిత
      చరిత్ర "కావ్యముగా వ్రాయుట.

        ఫేసుబుక్కునందు ప్రియమారపద్యముల్
        వ్రాయుకొఱకునేను వరుసకలిపి
        కవియునంచుజేరి కావ్యంబు సల్పితిన్
        "నాజరాఖ్యుకథను నవ్యరీతి".

   నేర్చితి నేను పండితులనేకుల శైలిని నర్ధభేదముల్
   కూర్చితి శబ్దజాలముల కోమల భావయలంకృతంబుగా
   తీర్చితి భాషతీరునటు తేనియలొల్కగ ముద్దుగూర్పగా
   మార్చిరి ఫేసుబుక్కునగల మాన్యులమేయలు జ్ఞాన వృద్ధులై.

           ( హెల్మెట్)శిరస్త్రాణము.రక్షణ.

   శిరమున హెల్మెటు దాల్చక
   శిరమంతయు వ్రయ్యలౌచు శివైక్యమగున్
   వరశీర్షకవచమున్నను
   పరలోకముజేరుకన్న పాపముగలదే?

       వాహన నూతనచోదక!
       అహమున  గోరకు నరబలి హంతకుడగుచున్
       సహనము తెల్విని జూపుచు
       విహరింపుమ ప్రజల పట్ల విజ్ఞుడవగుచున్.

   తెలగాణార్టిసి స్ట్రైకులు
   కలవరమునుబెట్టి జనుల కంటకమాయెన్
   మెలికలు బెట్టిన ప్రభుతయె
   మలివిజయము మాదటంచు మంద్రతబలికెన్.

     మద్యముద్రావుచున్ సతము మాంసపుభక్షణజేసి క్రొవ్వి, యో
     యుద్యమరీతిగా మనుచు నూహకునందని కర్కశత్వమే
     విద్యగనెంచువంచకుల వేగమె శీర్షము ద్రుంచివైచి, నై
     వేద్యముబెట్టగావలయు వేడుకమీరగ నంబసన్నిధిన్.

     మద్యమె ప్రోత్సహించును నమానుష క్రూరవికారకర్మలన్
     మద్యము ద్రావినన్ నరుని మాన్యతసర్వము మాసిపోయి యే
     విద్యయు వంటబట్టక వివేకవిచక్షణలెల్ల దూరమౌ
     సేద్యములేనిబీడువలె చిత్తముమొత్తము కంటకంబగున్.

      కన్నెలమానభంగమును క్రౌర్యమనస్కతనాచరించు నీ
      వెన్నును విర్వగావలయు వేగమెముక్కలుజేసివీధులం
      సున్నపుచారలంబలెవసుంధర నింపుచు హోయనన్ వలెన్
      దున్నకుమారురూపియగు దుష్టుడ!నీచుడ!రాక్షసాంశుడా!

                              సరస్వతీ స్తుతి.
     
       కమ్మనిపద్యపుష్పచయ గాఢనిగూఢవిశేష గంధసా
       రమ్మును వాక్సుధారసము రంజిల పండితవేదికాళినన్
       నెమ్మిని జేరుభాగ్యమది నీదయగాదటె యమ్మవాణిరో
       ఇమ్మహి వేడడే ఘన మహేంద్రుడెయైనను నీపదమ్ములన్.
     
     గోతము ప్యాంటునకు నా స్పందన.

        క్రొత్తదనమును కాంక్షించు కుఱ్ఱకారు
        ఇట్టి వస్త్రాల ధరియించు నిచ్ఛజూపు
        చిరుగులుండిన మరికొంత శ్రేష్టమనును
        పిచ్చిముదిరిన సర్వంబు ప్రేమమయమె.

           సురభి పద్యమునకు స్పందన.         

      ఎలుక దూరినంత  యెన్నెన్ని ముప్పులో
      తెలిసి తెలిసి మీరు తెలుపుటన్న
      సురభి వారి సరస సుందరభావాలు
      తేటతెల్లమాయె తెలుగు కవికి.

                   నలువరాణీ! నమస్తుభ్యం.

సీ. స్వరములో వరముగా సరిగమలలరించు
                              రాగప్రసారాల రాణియెవరు?
     సాహితీవనములో సరసరమ్యత్వాన
                   చిలుకయై పలికెడు చెలువయెవరు?
      శిల్పాలజీవంబు చిద్విలాసతనుంచు
                     ఉలిరూపమైనట్టి యువిదయెవరు?
       కుంచెయంచుననుండి కోట్లాది చిత్రాలు
                    కనులవిందొనరించు కాంతయెవరు?
      నృత్యభంగిమలోన నిటలేక్షు భావముల్
                        నవ్యరీతులజూపు నారియెవరు?
         తే.గీ. ఎవరు తానని సందియమేలనోయి
                  సర్వకళలకు గాణాచి సద్గుణాంబ
                  వేదవేదాంతవిలసిత వింతశక్తి
                  నాదు జిహ్వాగ్రవర్తిని నలువరాణి.
                         
         కీ.శే.గొల్లపూడి మారుతీరావుగారికి అశ్రుతాంజలులు.

        ఎల్లలు లేని ఖ్యాతిని మమేకముగానటియించి చూపుచున్
        మల్లెలవంటి భావములు మంచినిబెంచెడు సాహితీరుచుల్
        కొల్లలుగావెలార్చితివి కూర్మిని గొల్లలపూడివంశపుం
        దల్లజ! హాస్యభాషిత సుధామయ నాటక చక్రవర్తిరో.
             
                నటనమన్న నీకు నల్లేరుపైబండి
                రచన జేసిచూప రసమయంబె
                హాస్య భాషణమగు నాస్యంబుదెరువగా
                గొల్లపూడి వంశతల్లజుండ!

                తనువుచాలించి వీడిన ధర్మమూర్తి
                పుడమి జేసిన శ్రీవాణి పూజవలన
                ఆత్మ శాంతించి శ్రీపథమందగలవు
                గొల్లపూడి రొ మీకివే కోటినతులు.
   
            సురభి పద్యమునకు స్పందన

     కుండతత్త్వంబు గ్రహియింపకుండలేను
     కుండ భావంబు చెప్పంగనుండలేను
     కుండ పద్యంబు స్తుతియించకుండలేను
     కుండ తనువను స్వాభావికుండ!నేను.

    రాజమండ్రి వెళ్ళుటకై (ప్రజ-పద్యం సభ.19.01.2020) సంబరం.స్పందన.
     
   సీ: భారతాంధ్రీకృత భవ్యదేశంబౌచు
                     మోదంబుగూర్చెడు పుణ్యభూమి
        తిరుపతి కవులుగా దేశవాసింగన్న
                       పుంభావవాణుల పుణ్యభూమి
        గౌతమినామాన కణముకణము నింపి
                      ముచ్చటగూర్చెడు పుణ్యభూమి
        సంగీతసాహిత్య సౌహిత్యముల్ పంచ
                    ముఖ్య భూమికగు నపూర్వభూమి
        కాటను దొరవారి కరుణామృతంబుచే
                      నన్నపూర్ణాలయమైనభూమి
 తే.గీ:   పరమపావన గౌతమి పారుభూమి
            సంఘసంస్కర్త లున్నట్టి సాధుభూమి
            వివిధ పుణ్యక్షేత్రములున్న వేదభూమి
            నడుగుమోపెడు భాగ్యంబు కడిదిగలిగె.

      19.01.2020 రాజమండ్రిలో చదువవలసిన గోదావరిపద్యాలు.

  సీ. పరవళ్ల గోదారి పద్యమై ప్రవహించె
                    నన్నయ కావ్యమున్ నవ్యశోభ
        రాజస గోదారి రాజనరేంద్రుని
                     పాలనన్ సర్వత్ర ప్రతిఫలించె
        గంభీర గోదారి కందుకూరి ఘనుని
                      సంస్కర్త రూపాన చాటిచెప్పె
         నురుగుల గోదారి నూత్న పరీమళ
                       విరిబాల నవ్వుల వెన్నెలయ్యె
 తే.గీ: వేదఘోషను నింపెడు విజ్ఞులలర
          సారసంగీతసాహిత్య సరసులైన
          నెల్ల జనులకు నుల్లంబు పల్లవింప
          నందగించెడు గోదారి వందనములు.1.

  సీ : యాసబాసలయందు హాస్యంపు శైలిలో
                       తూ.గో,ప.గో.జిలు త్రుళ్ళిపడును
        పాడిపంటలతోడ పచ్చనై స్వచ్ఛమై
                        తూ.గో .ప.గో.జిలు తోచు సిరుల
        స్నేహభావమ్ములన్ చిందించి యందించు
                      తూ.గో.ప.గో.జిలు ధుర్యతములు
        రామయ్య సంస్తుతిన్ రమ్యంపు భావాల
                       తూ.గో.ప.గో.జిలు దొరలనందు
    తే.గీ: తల్లి గోదారి చరణాల నల్లియున్న
             ప్రాంతమంతయు నాధ్యాత్మ భరితమగుచు
             కోరకుండనె సద్భక్తి కూర్మినిచ్చి
             నరుని నారాయణుని జేయు నతులునీకు.2.

    జె.జె.యస్. గోదావరి పద్యాలు.

    రాజమండ్రి వెళ్ళుటకై (ప్రజ-పద్యం సభ) సంబరం.స్పందన.
    సీ: అవధాన విద్యకు నాదిపునాదిగా
                     తూగోపగోజీలు తుష్టిగూర్చె
         వ్యంగ్య భాషణలందు యాసబాసలతోడ
                      తూగోపగోజీల తూచలేము
          పాడిపంటలతోడ పచ్చనౌ ప్రకృతిన్
                       తూగోపగోజీలు తూగు సిరుల
          స్నేహభావమ్ములన్ చిందించి యలరించు.       
                        తూగోపగోజీల దోస్తి భేషు
     తే.గీ: తల్లి గోదారి నడయాడు తావులన్ని
              తీర్ధ సుక్షేత్రముల పురుషార్ధదములు
              రెండు జిల్లాల వారలుద్దండులనగ
              సాక్ష్యమౌను ఈ సాహిత్య సభయె నిజము.1.

   సీ: పరవళ్ల గోదారి పద్యమై ప్రవహించి
                 నన్నయ్య కావ్యాన చెన్నుమీరె
         రమ్యమౌ గోదారి రాజరాజేంద్రుని
                   పాలనన్ సంస్తుతి పాత్రమయ్యె
         గంభీర గోదారి కందుకూరి కవీశు
                     సంస్కారక్షేత్రమై శ్లాఘ్యమయ్యె
         నురుగుల గోదారి నూరు నూరేళ్ళు గా
                        సస్యప్రదాయియై చాటె ప్రగతి
   తే.గీ: కన్నతల్లి ని గోదారి నెన్నుదిటుల
            వేదఘోషలు నినదించు విమలభూమి
            ఆంధ్రగీర్వాణ కవులకు నాటపట్టు
            సరససంగీత సాహిత్య గురుకులమ్ము.
             తీర్థరాజాల క్షేత్రాల దివ్యపథము
            అలవికానిది వర్ణింప నమరసీమె
             తల్లిగా గొనుమ నదీమతల్లి నతుల! 2.,

   పై శ్రీకృష్ణ చిత్రమునకు నా ఉత్పలమాల.
    ఒక్కరి లాస్యమంత్రము మరొక్కరి హాస్యము కొంటెచేష్టలున్
    టక్కరిచూపులన్వలల ఠక్కునలాగెడు గోపికామణుల్
    అక్కజమొందురీతి యమునమ్మయె మోదవినోదమందగా
    చిక్కెను చిక్కెనో యనగ చిన్మయరూపుడు దక్కెవారికిన్.
         
    అభిషేకం..ది.23.11.2020.కార్తిక సోమవారం. 
        బెంగళూరు.

        బిల్వ పత్రంబు నర్పింప విజయమిచ్చు
        భస్మమలదిన తనువెల్ల భాగ్యమిడును
        గంగ తడిపిన కైవల్య ఘనతనిడును
        తెలిసి చేసిన సేవలు తెలియకున్న
        ఫలితమిచ్చువాడు సతము భవుడొకండె.

పండుగ జేసికొండి జనుల్.

  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.
  కండలకావరంబునను కన్నులుగానక కామచారులై
  బండగడెందముల్మలచి పాపమునెంతయొ సల్పినట్టి,యా
  గుండెలులేని క్రూరులిక కూలిరి పాపఫలంబు పండగా
  పండగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.1.
 
  దండుగమారి జీవనము దారులదోపిడి కర్కశత్వమున్
  మెండుగ మద్యపానములు మీరిన హద్దుల లైంగికంబులున్
  ఖండనజేసిచూపగను క్రన్నన వచ్చెను "సజ్జనారిదే"
  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.2.

  రండిటు క్రూరకర్ములను రాక్షసనీచుల నుత్తరింపగా
  చండికబోలు శౌర్యమున చానలు!సాంఘిక రక్షణంబుకై
  దండనలేనిచోటునె యధర్మము బెర్గును విఱ్ఱవీగుచున్
  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.3.

  నిండుమనంబునన్నగుచు నిర్మల భావసమంచితమ్ముగన్
  అండనుగోరునావనిత నంతటిఘోరకిరాతకమ్ముగా
  మండగజేసినట్టి యల మాహిషులందరు మట్టిజేరెగా
  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.4.

  కొండొక మూర్ఖుడెవ్వడును క్రొవ్వి మదేభమురీతినున్నచో
  గండముతప్పదంచు మన గౌరవరక్షక శ్రేష్ఠులందరున్
  పిండముబెట్టినారిచట పేల్చిన గుండులసాక్షిజూపుచున్
  పండుగ జేసికొండికను భారతపౌరులు పుణ్యకాలమున్.5.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...