19, జనవరి 2018, శుక్రవారం

కోటప్పకొండ.

త్రికూటేశ్వరస్వామి దర్శనం.










గుంటూరు జిల్లా నరసరావుపేట కు 17కి.మీ.దూరములోనున్న కోటప్పకొండ అనబడే పుణ్య క్షేత్రం లోని త్రికూటేశ్వరస్వామి దర్శనం అమోఘజ్ఞానసాధనా మార్గం.ఈ పవిత్ర శైవక్షేత్రమే త్రికూటాచలం. అనగా మూడుకొండలసమాహారం. శివాలయం షుమారు 600అడుగుల ఎత్తు, కొండ షుమారు 1587అడుగుల ఎత్తు ఉంటాయట. స్థలపురాణము ననుసరించి దక్షయజ్ఞానంతరము పరమశివుడు పార్వతీసతీ వియోగతప్తుడై ఒక కొండమీద తపస్సుచేశాడట. ఇది గమనించిన బ్రహ్మాదిదేవతలు తమకును జ్ఞాన సంపదను ప్రసాదించమని కోరగా మీరెల్లరును ఇచటకేవచ్చి జ్ఞానం పొందుడని అన్నాడట. అదే ఆనందంగా భావించి బ్రహ్మ , విష్ణువు ఇతరదేవతలతోగూడి త్రికూటాచలం చేరి జ్ఞానం పొందారట. ఒక కొండపై విష్ణువు మరొక కొండపై శివుడు ఉండుటచే శిఖరములందు శివలింగములు వెలిశాయి. మూడవ కొండపై బ్రహ్మదేవుని ప్రార్థనపై శివలింగం వెలసినదట. గొల్లభామ అనే భక్తురాలి గుడి స్వామి వారి గుడికి కొద్దిదూరంలోనే ఉంది.
షుమారు 20 సంవత్సరాల క్రితం వరకు భక్తులు  చాలా గొప్పగా ప్రభలను తయారుచేసి  శివరాత్రికి  శివనామస్మరణ తో తయారుచేసిన ఆ ప్రభలను      4 లేక 6 జతల బహువిధాలంకృతమైన ఎడ్లచే ,కొన్ని ప్రభలకు కొంగ్రొత్త గిత్తలను, మరి కొన్నిటికి గొర్రెలను కట్టి   కొండచేరువకు చేరి "చేదుకో కోటయ్య మమ్మాదుకో కోటయ్య" అంటు అలవోకగా   300మెట్లెక్కి దైవదర్శనం చేసుకొనేవారు. ఆనాటి ప్రభలలో "పూసకూర్పు ప్రభ"(పూసలతోఅలంకరణ చేసినది) ప్రసిద్ధిచెందినది. కాలక్రమేణ ప్రతి గ్రామానికి కరెంట్ వచ్చిన కారణంగా పెద్దప్రభలకు ఆటంకం ఏర్పడి ప్రభలు మాత్రమే చిన్నవైనాయి కాని భక్తి స్థాయి పెద్దగానే  ఉంది. మరల మాట్లాడితే రెండింతలు పెరిగిందనే అనాలి.
నా చిన్ననాటి మరపురాని మధురానుభవాలు.
దాదాపు 1960 వ సం.నుండి 1964 సం.వరకు మా నాన్నగారు నన్ను కోటప్పకొండకు తీసికొని వచ్చేవారు. స్వామికి గుడిలో కొబ్బరికాయ కొట్టి దండంపెట్టడం ఒక సవాల్ అయ్యేది. బలవంతులు (భక్తిలోకాదు) మాత్రమే కొట్టగలిగేవారు. ఆనాడాపనిని చేసి చాలా గొప్పగా భావించేవాడిని. నాన్నగారు సున్నితమైన,పండిన, ఆథ్యాత్మిక శైలిలో "వద్దులేవయ్యా ఆ శివుడు లోపలే కాదు బయట గోడలో కూడ ఉన్నాడు. అక్కడ కొట్టు" అన్నారు. నన్ను మానాన్నగారెప్పుడు "ఏరా" అని సంబోధించగా నేను వినలేదు. ఆ నాటికి నాలో భక్తి కన్నా శక్తే ఎక్కువగా ఉండేది. కనుక సవాలునెదుర్కొనటానికే సిద్ధపడేవాడిని. ఆ విషయం ఇప్పుడు అర్ధమైనది. 
తే.గీ.గర్భ గుడిలోన వెలుపల గాలి లోన,
నీటిలోపల రాతిలో నింగిలోన 
      చెట్టుచేమలు పలువిధ జీవులందు 
              గుట్టుగానుండు మహదేవగురువరుండు.
తే.గీ. ఉన్న భావన గల్గిన నుండునతడు 
                సున్న యనువానికాతడు శూన్యుడెపుడు
     కలడు లేడను వాదంబు కంఠశోష
       తనదు సద్గుణసంపదే దైవమగును.

చెప్పక పోవడమేలా ? శివరాత్రి కి జాతరలో తిరిగితిరిగి మరుసటిరోజు  బడి, ట్యూషను ఎగగొట్టేవాణ్ణి. ఇక తెలిసిన విషయమే. ఆనాలుగు అక్షతలు మాష్టార్ల వంతు, ఆతిట్లకు అశ్రునయనపూరిత మౌనం నావంతు. గురువులు శిష్యుల భావిజీవితాన్ని ఆలోచిస్తారు. లఘువులు గురువుల కాఠిన్యాన్ని ద్వేషిస్తారు అజ్ఞానాంధకారంలో.

ఈనాటికి ఆనాటికి ఎంతతేడానో దేవాలయ అభివృద్ధిలో మన మనసులలో... కోటప్పకొండను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంచి కృషి జరుగుతున్నది.  సరోవరాలు, బోట్ షికార్లు, పిల్లలకు ఆహ్లాదకర విహారాలు తయారవుతున్నాయి. ముందుముందు మిక్కిలి సుప్రసిద్ధ పర్యాటక క్షేత్రస్థాయినందుకోగలదు.
శివరాత్రి పర్వదినాలలో తప్ప కొండపైన భోజన వసతి లేదని చెప్పారు. చక్కని రోడ్లు వేయటంవలన భక్తులకు మరింత సౌకర్యం పెరిగింది. కొండపైన కూడ నిరంతర అన్నదానం (కూర,చారు,మజ్జిగ) ఉంటే భోంచేసిన భక్తులు తిరిగి విరాళాలు ఇవ్వటం వలన వృద్ధిచెందుతుంది. ఏదో ఒక సారి ఆ ప్రాంతం వెళ్ళినపుడు తప్పనిసరిగ కోటయ్యను చూచివద్దాము. 
శుభంభూయాత్!



పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...