నన్ను ప్రభావితము చేసిన మా నాన్నగారి అనుభవపూర్వక అమూల్యామృత వాక్కులు.
1. సమయపాలన.....ఇది చేయకుంటే మనిషిలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆ లోపం చేస్తున్న పనుల మీద చేయబోయే పనుల మీద పడుతుంది. వ్యక్తి గత విలువ ఉండదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరాదని చెప్పారు.
2. పెద్దలను గౌరవించుట. .... దీనివలన సాటివారిలో సాటిలేని గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. తద్ద్వారా మనకసాధ్యమైన పనులు నెరవేరతాయి.
3. నిజం చెప్పటం....ఇది అత్యంత కఠినమైన నియమం. చివరకు ధర్మరాజుకు కూడ అపప్రధ తెప్పించినది కూడా ఇదేకదా. అందరు ఇదే చెబుతారు. కాని పాటించేవారు? గో రక్షణ, స్త్రీ పురుష మాన ప్రాణ రక్షణలందు బొంక వచ్చునని మహర్షులు పలికారు. ఆవిషయంలో నాన్నగారిని అనుసరిస్తాను. 4. నిశిత పరిశీలన..... ఏవిషయమునైనా పరికించి చూడటం కాకుండా పరిశీలించి చూడటం. ఇదే ఎక్కువగా విజ్ఞానాన్ని సంపాదించిపెడుతుందని , బుద్ధి పెరుగుతుందని చెప్పేవారు.పరిశీలనలో ఎదుటివారి మనోభావాలను కూడ తెలిసికొనవచ్చును. ఇదే ఆంగ్లేయులు చెప్పే "ఫేస్ రీడింగ్". ఆయన ఒకనాటి అనుభవాన్ని కూడ(ఒక మోసకారిని పసిగట్టిన విషయం) నాతో పంచుకున్నారు.
5.చిరునవ్వు....... ఏదైన ప్రత్యేక మైన బాధలో ఉంటే తప్ప ఏనాడు ముఖంలో చిరునవ్వు చెరగనీయవద్దు. అందరు అలా ఉండేలా ప్రయత్నం చెయ్యి.
చిరునవ్వు అందరిని ఆకర్షిస్తుంది. అలరిస్తుంది. బంధువులను, స్నేహితులను
చిరు నవ్వుతో పలకరింతమని చెప్పేవారు.
6. ఎదుటివారి మనసు గాయపడకుండ మాట్లాడుట......
ఇది చాలా అవసరమైనది. నిత్యజీవితంలో ప్రతిక్షణం ఎదుర్కోవలసిన సమస్య. ఆనందంగా మనం ఉంటూ ఎదుటివారు కూడ అలా ఉండేటట్లుగా చూడటం. ఇది మన ఆయువును పెంచుతుంది.
7. అతి సర్వత్ర కూడదు... ఏవిషయంలోనైన అతిగా ప్రవర్తించే వారిని నమ్మరాదని చెప్పేవారు. ప్రేమైనా, ద్వేషమైనా అతి పనికిరాదు.
8. నలుగురితో మంచి..... అందరితోను ఎల్లవేళల మంచిగానే ఉండాలి. మరీ అది అసాధ్యమైతే కనీసం నలుగురితోనైనా మంచిగా ఉండాలి. చివరి మజిలీకి వారే అవసరమౌతారు.
9. నమ్మకం.... క్రొత్తవారిపట్ల నమ్మకం నిశిత పరిశీలనతోనే ఉండాలి. గ్రుడ్డి నమ్మకం పనికిరాదు. స్వభావాన్ని అంతో ఇంతో అంచనా వేసి దానిని బట్టి నమ్మాలి. మెరిసేదంతా బంగారం కాదనేవారు.
మా నాన్నగారు(సూర్యనారాయణ) నాకు చెప్పగా వాటినే నేను నీకు చెబుతున్నాను.అన్నారు. నేను కూడ ఆ నవ రత్నాలనే అక్షరం తేడా లేకుండా నా కుమారునకు చెబుతున్నాను. నేను వాటిని తు.చ. తప్పక పాటిస్తున్నాను.
తాతగారికి, నాన్నగారికి కృతజ్ఞతాంజలులు.