4, సెప్టెంబర్ 2024, బుధవారం

పాఠాలు..గుణపాఠాలు.

  పాఠాలు..గుణపాఠాలు.

                       నెల్లూరు ప్రయాణం. ది.30.08.2024.(శుక్రవారం)

         పాఠాలు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా గుణపాఠాలు నేర్వాలి. లేకుంటే ప్రకృతే మనకు నేర్పుతుంది. పాఠాలు నేర్వకపోతే గురువు కోప్పడతాడే గాని ఆగ్రహించడు. కాని ప్రకృతి అలాకాదు. గుణపాఠాలు నేర్చుకోకుంటే తీవ్రంగా ఆగ్రహించి హతమారుస్తుంది. సమయస్ఫూర్తి,  ముందు జాగ్రత్త యీ రెండు ప్రతి విషయంలోను ముఖ్యపాత్ర వహిస్తాయి, ముఖ్యంగా ప్రయాణాలలో.  ఒకచెంప వర్షాకాలం, ఆపై వాతావరణశాఖ భారీ నుండి అతిభారీ వర్షాలు కురువవచ్చునని, ఆ వర్షాలు కూడ ఐదురోజులుండవచ్చునని ప్రకటించింది. మనకు సహజంగా వాతావరణశాఖ అంటే చాల చులకనభావం, చిన్నచూపు ఉన్నది. వారు భారీ వర్షాలని చెబితే తుంపర కూడ పడదని గొడుగు కూడ తీసికొని వెళ్లము. ఎన్నోసార్లు తడిసి ముప్పందుమై వస్తాము. కాని గుణపాఠం నేర్చుకోము. ఇక నా విషయానికి వస్తే వాతావరణశాఖ మాటలను దృష్టిలోనుంచుకొని చలికిబ్బంది లేకుండ హడావుడిగా ‘‘హుడీ’’ వేసుకున్నానేగాని, గొడుగు గాని రైన్ కోటుగాని తీసుకోలేదు మందబుద్ధితో. ఏదైనా అవసరంగాని కష్టంగాని మనకు చెప్పి వస్తుందా? మన అమాయకత్వం, బుద్ధి హీనత కాకుంటే. 

   సికింద్రాబాద్ నుండి సింహపురి ఎక్స్ ప్రెస్ లో నెల్లూరికి 30.08.24  రాత్రి గం.11.లకు బయల్దేరవలసిన బండి 30నిమిషాలు లేటుగా బయల్దేరి నెల్లూరికి ఉ. 9.గం.లకు చేరింది. అచటి మా ప్రోగ్రాం సజావుగనే సాగింది. 31.08.24 న సంతోషంగా మరల సింహపురి నుండి సికింద్రాబాద్ కు సాయంత్రం 7గం.లకు బయల్దేరాము. అప్పటికి ఏ రకమైన భీకరవర్షం లేదు. అందువలన రైళ్లు రాకపోకల నిలుపుదల , ఎక్కువ లేటు లేదు. మేము 

( నేను( సూర్యనారాయణ రావు), నా భార్య, మా వదినగారు , ఆమె గారి కోడలు, మనుమరాలు ) ప్రయాణీకులము. సుమారు రాత్రి గం. 9.లకు టిఫెన్ , మందుల సేవనము తరువాత నిద్రలోనికి జారాము. బండి తనకన్న ముందు వెళ్లవలసిన బండ్లకు బుద్ధిగా  దారి విడుస్తు, నిదానంగా  నిండు గర్భిణిలా ఆగుతు సాగుతున్నది. ఈ బండి ది. 1.09.24న ఉదయం. గం. 5.30.లకు సికింద్రాబాద్ చేరవలసిన షెడ్యూలు. కాని వరుణదేవుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విశ్వరూపం చూపించింది. మహబూబాబాద్ లో అత్యధిక వర్షపాతం 49 సెంటీమీటర్లు కురిసి మేము ముందుకేగ వలసిన కె.సముద్రం బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అయిందనే వార్త ముందుగా చేరి అచటనే ట్రైన్ నిలిపివేశారు. ఆగని వర్షం, నిరంతరాయంగా మేఘాలకు చిల్లులు పడినట్లు , మేము చక్కగా ముఖం కడుక్కొని టిఫిన్ వస్తే తిని టాబ్లెట్సు వేసుకుందామని ఎదురు చూస్తున్నాము. ఎవ్వరు అలాంటివి తేలేదు. కొందరు ఆ వానలోనే ఒకటిన్నర కిలోమీటరు దూరంలో గల  షాపులో బ్రడ్, బిస్కట్సు, అరటి పండ్లు ,వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. భారీ వర్షం, గొడుగు లేదు. ట్రైన్ కు ప్లాట్ ఫారం కు మధ్య ఖాళీ. ఎక్కి దిగాలి.  అప్పడు తెలిసింది గొడుగు, రైన్ కోటు విలువ. తెచ్చుకోనందుకు నాకు నేను సిగ్గుపడుతు , చెంపలు వేసుకున్నాను. నా భార్య ధైర్యంగా 

నేను  తడిసినా పరవాలేదు. ఏది యేమైనా కొన్ని బిస్కట్ పాకెట్స్, వాటర్ బాటిల్స్, తేవాలని నిర్ణయించుకొని బయల్దేరి వెళ్లి తెచ్చింది. అవి తిని టాబ్లెట్స్ వేసుకున్నాము.  అప్పుడనిపించింది. ప్రయాణాలలో , అందునా వర్షకాలంలో తప్పక అందరికి  గొడుగు       ( చిన్నది) లేక రైన్ కోటు ఉండాలని. టాబ్లెట్ల సేవనం తరువాత వేరొక విధంగా, ఏదైనా ప్రయాణ సౌకర్యం ఉన్నదేమోనని ఆలోచించాము. అంతట వాగులు , వంకలు పొంగి, రోడ్ మార్గం కూడ బ్లాక్ అయింది. ఆ ఆలోచన విరమించుకున్నాము. మా బంధువులు మమ్ములను గూర్చి కంగారు పడకుండా వాట్సాప్ లో మెసేజ్ లు పెడుతు వారికి ధైర్యం కలిగించాము. షుమారు గం. 11. ల నుండి పరిస్థితులను తెలిసికొనిన సహాయ , సేవా సంఘాలు ఆహారపు పొట్లాలు, బిస్కెట్ పాకెట్సు, ఉప్మాలు, వాటర్ బాటిల్స్, కావలసినన్ని పంచారు. ఇవి తిన్నన్ని తిని కొంత ముందుజాగ్రత్తగా సాయంకాలానికి దాచుకొన్నాము వేడి వేడి పులిహోర పొట్లాలు . మధ్యాహ్నం సుమారు గం. 1 కి శుభ సమాచారం వచ్చింది. బండిని వెనుకకు మళ్లించి తీసికొని వెళ్లి ఎంత సమయానికైని సికింద్రాబాద్ లో దించుతామని. అలా బయల్దేరిన బండి మరల తరువాత స్టేషన్ లో ఆగింది. ఇంకా కొందరు భోజనం చేయలేదని వారు కూడ చేయటానికి ఆపామన్నారు. స్వచ్ఛంద సంస్ధ వారు పెద్ద పెద్ద డేగిశాలతో బిర్యానీ, అన్నం సాంబారు తెచ్చి పెట్టారు. ప్రయాణీకులు వాటిని ఊదిపారేశారు. అదే సమయానికి ఆ స్టేషన్ కి మద్రాసు..బీదరు బండి వచ్చింది, రెండు బండ్ల ప్రయాణీకులు. ఇక చెప్పేదేముంది. కోలాహలమే. ఆ స్టేషన్ ఒక అన్నదాన సత్రంగా భాసించింది. అందరు ‘‘ అన్నదాత సుఖీభవ!’’ అని వారిని దీవించారు. అన్నం పంచుచున్న వారి కన్నులలో ఆనందం వర్ణనాతీతం. ఏది యేమైనా ప్రతి వ్యక్తి సమయం వచ్చినప్పుడన్నా మానవత్వం చూపాలి. తీసుకొనే దానికన్న ఇవ్వటంలోని ఆనందాన్ని అనుభవించాలి. ఎంత సంపాదించినా పిడికెడు మెతుకులు మ్రింగగలడేగాని , ఎవడును మెరుగు బంగారము మ్రింగబోడు. ధన పిశాచమావహించిన కొందఱు మూర్ఖుల కీ విషయం ఎందుకు తెలియదో ఆ భగవంతునకే తెలియాలి. ‘‘ దాన గుణపు గుండె దైవ నిలయమ్మురా, విశ్వనరుడ నీవు వినుము సుంత.’’

   అలా వెనుకకు మరలి ప్రయాణించుచున్న సింహపురి ఎక్స్ ప్రెస్ ది. 2.09.24 ఉ. 5.30. లకు సికింద్రాబాద్ చేరి మాటనిలబెట్టుకుంది. ప్రకృతిని కాపాడుకుంటే అది మనలను కాపాడుతుంది. దానిని నాశనంచేస్తే మనలను సర్వనాశనం చేస్తుంది.  మన చెత్త మనసులను శభ్రం చేసుకొని చెత్తా చెదారాలను నిర్దిష్టమైన ప్రదేశాలలోనే వేసి మానవతను చాటుదాం. ప్రకృతిని ప్రేమించుదాం, కొంచెం ముందుచూపుతో మసలుదాం. నా భావాలు మీకు నచ్చితే సంతోషంగా పాలు పంచుకోండి. ‘‘ సర్వే జనాః సుఖినో భవన్తు!’’

 మల్కాజిగిరి,                  పొన్నెకంటి సూర్యనారాయణరావు. 

భాగ్యనగరం                              9866675770, 6300985169.   

                                                      


పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...