14, జులై 2019, ఆదివారం

ఉన్న దానిలోనే దానం.

ఉన్నదానిలోనే అన్నదానం.

       సూళ్ళూరుపేటకు షుమారు 60కి.మీ దూరంలో"మల్లాం" గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీవల్లీ,దేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ప్రాచీనమైనది. అందు మనోహర శిల్పసౌందర్యం చూపరులను కట్టి పడేస్తుంది.
       ఆలయనిర్వహణాధికారులు భక్తులు దైవదర్శనం చేసుకొనేసమయంలోనే "అయ్యా అందరు స్వామివారి ప్రసాదం తీసుకొనివెళ్ళండి" అని చెప్పటం వారి అన్నదానవ్రతానికి నిదర్శనం. ప్రస్తుతం అన్నదానం మంగళ,ఆదివారాలలో జరుగుతుంది. దాతలు అధికంగా విరాళాలిస్తూ ఉంటే ప్రతిరోజు అన్నదానం నిరతాన్న దానంగా మారుతుంది.

     స్వర్ణ దానంబు లిచ్చును స్వర్గ సుఖము
     వస్త్ర దానంబు ప్రఖ్యాతి వరలజేయు
     భూమిదానంబు వలనను పొందుయశము
     అన్నదానంబు సర్వంబు నమరజేయు.

 మంగళ,ఆదివారాలలో భక్తులు షుమారు200మందివస్తారు. ఆరోజును దృష్టిలో పెట్టుకొని అన్నదాతలు తగిన ద్రవ్యం చెల్లిస్తారు. అన్నము, ఇతరపదార్థములన్నీ సిద్ధమై భక్తులు క్యూలో నిల్చినను వెంటనే భోజనము వడ్డించరు. ఆరోజునకు ద్రవ్యముదానమిచ్చిన దంపతులువచ్చి అన్నమున్న గిన్నెకు (అన్నపూర్ణాదేవికి )హారతిచ్చి అగరువత్తులు వెలిగించి ధ్యానించి వారు ప్రారంభించిన తదుపరే క్యూ లోని వారికి పెడతారు. సాధారణంగా ఈరోజుల్లో ఇలాంటి స్థలాలలో తిని అన్నదానానికి ద్రవ్యం ఇవ్వనివారెవ్వరు ఉండుటలేదు. కారణం "మనం తినే అన్నం ఎవరో ఇచ్చినదే"అనే స్పృహ తప్పక ఉంటుంది. "అన్నం పరబ్రహ్మ స్వరూపం" ఒక్క పదార్థం కూడ వృథాచేయకూడదు. తింటేమనం తినాలి లేకుంటే పేదలకు పంచాలి. మనం తినటానికి తక్కువ ప్రాథాన్యమిచ్చి పేదలు తినటానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

           దాన గుణమది యుత్కృష్ట ధర్మమెపుడు
           మనము తిన్నది యెంతైన మట్టిపాలు
           పరులకిడునది శక్తి మై భక్తి తోడ
           నధికతరమైన ఫలితంబునందజేయు.

మనమీనాడు ఏదేవాలయానికి వెళ్ళినా అన్నదానం జరుగుతున్నది. అది నిరంతరాయంగా జరగటానికి మనం చేతనయినంత సాయం చేద్దామా? కాదనెందుకంటారు మరి చేయికలపండి...

మాలకొండయ్య గారి ఆత్మీయత.

అనుబంధం,ఆత్మీయత.

       కొన్ని అనుబంధాలు ఈ జన్మవి కావేమో అనిపిస్తాయి. అంతగా వారు ఏకమౌతారు. ఆత్మీయత అంటే "తననుతానెంత ప్రేమిస్తాడో ఎదుటివానిని కూడ అంతే ప్రేమగా చూడటం." ఈ రెండు కలగలిసి సనాతన సంప్రదాయ గౌరవమర్యాదలకు ఆలవాలమై, సాహితీ ధురంధరుడై, జ్ఞానవయోవృద్ధుడై, విద్యాదానశీలుడై, నా దక్కిన శమంతకమణే శ్రీ ద్రోణాదుల మాలకొండయ్య గారు. (81సం.లు)
       2013వ సంవత్సరములో " భువనేశ్వర్, కాశీ యాత్రలో సహ యాత్రికుడు. సహజంగా సద్గుణశోభితుడు . అలాంటి వ్యక్తి కనబడగనే ఉప్పొంగిపోతాడు, మమేకమై కష్టసుఖాలలో పాలుపంచుకోవాలనుకుంటాడు. తాను సాహితీప్రియుడు కనుక కవిపండితులనభిమానిస్తాడు. ఆనాడు "కాశీయాత్రావిశేషాలను" నేను వ్రాసి గ్రంథస్థం చేయటాని ముఖ్యకారకుడాయనే. ఏమి మాట్లాడినా చివరకు "మాష్టారూ! దానిని ప్రింట్ చేయించుటకు ముందుగా కొంత డబ్బు ఇవ్వమంటారా?" అని అడిగేవారు. తాను పొందిన ఆనందాన్ని అందరకు పంచాలని ఆయన తపన. ఆధ్యాత్మికత భావనలు నిరంతరం సమాజశ్రేయస్సునే కాంక్షిస్తు ఉంటాయి. కనీసం పది రోజులకొకసారైనా నాకు ఫోన్ చేసి "ఎలా ఉన్నారు మీరు, మేడం గారు?"అని మనసారా పలకరించడం ఆయన మంచి మనసునకు నిదర్శనం.  మనస్సు నిరంతరం మాధవపాదాక్రాంతమై యుంటుంది.  భాగవతంలో పోతనగారు  

 "  మందారమకరంద మాధుర్యమునదేలు               
              మధుపంబువోవునే మదనములకు
  నిర్మల మందాకినీవీచికలదూగు
               రాయంచచనునే తరంగిణులకు
..........................
    అంబుజోదర దివ్యపాదారవింద
    చింతనామృతపానవిశేష మత్త
    చిత్తమేరీతినతరంబు జేరనేర్చు
    వినుతగుణశీలమాటలువేయునేల......అంటారు.

           అట్టి గుణశీలుని 24.01.2018 న కలుసుకునే అవకాశం దొరికింది. వారి స్వగ్రామమైన కావలి సమీపంలోని " ఎడ్లూరిపాడు" వెళ్ళాము. మా ఆనందానికవధులు లేవు. మాకు బ్రహ్మ రథం పట్టారు. ఆయన సహజంగా రామభక్తుడు. ఇల్లంతా రామమయం. నా ఆరాధ్యదైవం రాముడే. నేను తెనుగు జేసిన " సూర్యశ్రీరామం" తన డాక్టరు గారిచే గ్రంథముగా తయారుచేయించి తెప్పించుకొని మరీ చదివారు. భోజనాలకుముందు కాసేపు పద్యపఠనం. సాహితీసమరాంగణ సార్వభౌముని "ఆముక్తమాల్యద"నుండి. విష్ణుచిత్తుని అతిథి సేవాఘట్టం. "నాస్తి శాకబహుళా". ఎంతమధురమనోహర ఘట్టం. "అభ్యాగతః స్వయం విష్ణుః" మాలకొండయ్యగారి దృష్టిలో నేను విష్ణువును. భోజనానంతరం మాదంపతులకు, నా సోదరుడు కాళీజగన్నాథ్ కు బట్టలు పెట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
          మన జీవితంలో ఎందరో కలుస్తారు. వారందరు ఆత్మీయులు కాలేరు. ఆరాధ్యులు కాలేరు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

   తే.గీ.జీవితంబున వెలిగెడి చెలిమికలిమి
          సర్వ సౌభాగ్య భోగముల్ సంతరించు
          స్నేహదీపంబు వెలిగింప చిత్తమందు
          హ్లాదమిచ్చును నిలువెల్ల హాయి గూర్చు.

    తే.గీ.మాలకొండయ్య నెయ్యంబు మరువలేను
           ఉన్నతంబైన సుగుణమహోన్నతుండు
           పుస్తకంబుల పారాడు పురుగనంగ
           సార్థకంబౌను సామెత చక్కగాను.

    

నేలపట్టు...పక్షులు.

నేలపట్టు. ప్రకృతి నాస్వాదిస్తు కొన్ని చిత్రాలు. ఇతర దేశాలనుండి పక్షులు ఇచటి చెరువు దగ్గరకు వలసవస్తుండేవట. ఇది ఒకరైతు పొలమట. దీనిని ఆనాడు బ్రటీషువారు గమనించి ఆభూమిని ప్రభుత్వం స్వాధీన పరచుకొని వాటి అభివృద్ధికి మరికొన్ని వనరులు కలిగించినదట. అవి ఈప్రాంతానికి వచ్చి చక్కని అనువైన ఆహారాన్ని పొంది సంతానాభివృద్ది చేసుకుని సంతాన సమేతంగా స్వస్థానాలకు చేరుతాయట. ఇచట వాటిని మరింత దగ్గరగా చూచేందుకు "బైనాక్లర్స్" ఇస్తారు. దానిద్వారా ఆ పక్షులను చూస్తే వాటి కూనలతో సహా కనిపించి మైమరపిస్తాయి. మనం ఎన్ని చిత్రాలు తీసినా అసంతృప్తే. మామూలు కెమెరా తో తీసిన చిత్రాలు కొంతకాలానికి కనుమరుగౌతాయి. మన కన్నులనే కెమేరాతో తీసినవి మనం బ్రతికి ఉన్నంతవరకు ఉంటాయి. మధురానుభూతిని కలిగిస్తుంటాయి.

 ప్రకృతి జీవుల కెయ్యడ ప్రాణమగును,   
 ప్రేమ పెంచుచు పంచుచు ప్రియముగూర్చి,                                           
 మధురభావాల నిలయమై మానవాళి,  
 మనసుదోచును సతతంబు మాన్యమగును.

 కరుణరస నిర్భర నరుని
 పరమహృదయమెయ్యెడ గన భాసుర మౌగా
 పరమాత్మ తుల్యమగుచును
 ధరవెల్గును శాశ్వతముగ ధన్యంబగుచున్.

చెట్టు చేమలు ఖేచర జీవతతిని
కావవలయును సతతంబు కరుణతోడ
 మహిత సద్గుణశోభిత మనుజుడెపుడు
పరమపూజిత దైవాంశ వరదుడగును.

రామాయణం కుడ్య చిత్రాలు

ధర్మవరం.రామాయణ కుడ్యచిత్రాలు.

 ది.26.02.2018. యశ్వంత్ పూర్ నుండి కాచిగూడ యక్స్ ప్రెస్ లో ప్రయాణం. అది బయల్దేరవలసిన సమయానికన్నా(మధ్యాహ్నం2.30,) 1గం. ముందే స్టేషన్ కు చేరాము. రైలు బయల్దేరగా స్టేషన్ లు వరుసగా వెనుకకు వెళ్ళిపోతున్నాయి మాకు వీడ్కోలు పల్కుతు. క్రాసింగ్ కారణం కాబోలు ధర్మవరంలో రైలు ఎక్కువసేపు ఆగింది. చూపులు పరిసరాలను నిశితంగా వెదుకసాగాయి. ఆశ్చర్యంగా కొన్ని కుడ్యచిత్రాలు దూరంగా కనబడ్డాయి. మరి మనం పరిశీలించకుండ ఉండగలమా? గుడ్లుపెద్దవి చేసి చూస్తే గుట్టు బయటపడింది అది రామాయణమని. ఇక మనసు పులకించి కోతిగంతులు వేస్తు ఛందోశాఖలనాశ్రయించి చిత్రభావాలను , చరితమూలపురుషులను నెమరువేసుకొంటు మధురఫల రసాల నాస్వాదించింది. వాటిఫలితమే ఈ పద్యాలు. మీకు కూడ.

    తే.గీ.  ధర్మ వరమును రైలులో దాటుచుండ
              రామసత్కధా పరిపూర్ణ రమ్య కుడ్య
              చిత్రజాలంబు జూచితి చేష్టలుడిగి.
              ధన్యమైనవి కన్నులు తలపులపుడు.

  ఉ. ధర్మమె మారురూపమయి ధర్మమె నిత్యము సాధనంబుగా
       కర్మలనాచరింప ఘన కంటకదూషిత కాననంబులన్
       నిర్మల చిత్తుడైదిరిగి నీతివిదూరుల నేలగూల్చి ఆ
       మర్మము విప్పిజెప్పు పరమాత్ముని శ్రీరఘురాముజూచితిన్.

  ఉ. లంకను జేరనీయనని లంఖిణి భీషణ క్రూరరక్కసై
       బింకముతోడదేహమటు పెంచుచుదూకుచు మ్రింగబోవ ని
       శ్శంకత సూక్ష్మరూపియయి చక్కగ నాస్యములోనికేగి ఆ
       వంకనె వచ్చినట్టిఘనవానర ముఖ్యుని నేనుగాంచితిన్.
   
  తే.గీ. రాముచెంతనె సీతయు రమ్యగుణుడు
          లక్ష్మణుండట భాసిల్లె లక్షణముగ
          ధర్మ వరజన పుణ్యంపు మర్మమేమొ
          నిర్మలంబౌచు సత్కీర్తి నింగినంటె.
       
   తే.గీ.ధర్మబద్ధంపు మనుగడ ధైర్యమిచ్చు
           అర్థ మెక్కువయగుట యనర్ధమగును
           కామమనునది భార్యతో క్షేమమగును
           మూడుత్రోవలు నరునకు మోక్షమిడును.

                శ్రీరామకటాక్షసిద్ధిరస్తు!
 ఇలా అణువణువు రామమయం కావాలని ఆశిస్తు....
                                       మీ "సూర్యశ్రీరామం" (పొన్నెకంటి)
         

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి.

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి


 1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!విఘ్నవారణా!

     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

 2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.


 వందే గణనాయకమ్.


1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!


2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....


3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....


4. మాతపితలను సేవించు మార్గమొకటె

    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....


5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

    పూజలందుచు భక్తుల మోదమలర

    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...


6. గరికపూజకె ముదమంది దురితములను

    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...


7. మోదకంబుల నర్పింప మోదమంది

    వెనుకముందులుజూడక మనుజులకును

    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...


8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

    వినయశీలంబె సర్వత్ర విజయమంచు

    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...


9. సర్వ గణనాయకత్వంపు సాధనాన

    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...


10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!
                                 ##

సమస్యా పూరణలు


        
       
       
     
                        
 
      కీ.శే. అటల్ బిహారి వాజ్ పేయి గారికి అశ్రునీరాజనాలు.

      అటలు బీహారి సత్కవి యమరుడయ్యె,
      ఇంద్ర సభలోన కవులెల్ల మంద్రమైన,
      భార విహ్వల హృదయాల పజ్జజేర,
      స్వాగతించిరి సురలెల్ల సభకు నిపుడు.

      సురభిగారికవిత శోభాయమానంబు
      లలిత మధురశబ్ద లాలితంబు
      గళము కలముమించు గమకాలశైలిలో
     అష్టవిధములైన ఆశ యాల.

    తిన్న కుడుములు చాలింక మిన్నకుండు
    మరలి రమ్మిటు నావెంట మంచుకొండ
    నరుల విఘ్నాలు తొలగించి నయముగాను
    వత్తునోయమ్మ గిరిజమ్మ వదలుమ్మ!

  దుర్గమమైన దుఃఖముల దున్ముచు భక్తుల బ్రోచిచూచెడా
  భర్గుని సాముదేహమగు భార్గవి,యంబ,శివాని,శాంభవీ
  దుర్గ,యపర్ణ,పార్వతిగ తోషిత నామములొప్పు మాతయే
  మార్గముజూపుగావుతను మానవజాతికి ముక్తిగాంచగన్.

  సీ. మహిషాసురునినేను మట్టుపెట్టితినంచు
                నీవన నమ్మితి   నీలవేణి
 చిక్షురాసురునల శీర్షము ద్రుంచితి
                నన్న ముదముగల్గె నంచయాన
 చామరదుష్టుని చంపివేసితినన్న
                ఆనందమొందితి నమలనేత్ర!
 భాష్కులరక్కసు భంజించితనుటచే
                భయముదీరితినమ్మ భర్గురాణి
 తే.గీ. చావలేదమ్మ వారలు చారునయన
 భరతమాతకు శోకంపు భారమవగ
 ఆడపడచుల మానంపు హారులనగ
 దిరుగుచుండిరి వారల తరుగుమమ్మ!

 తే.గీ.  అపర మహిషుల శూలాన హతముజేసి
 భారతావని గాపాడు భవవిమోచ!
 మానవత్వంబు కాపాడు మనసులీని
 మమ్ము కరుణను జూడుమ మమతతోడ.
 నీదు పాదములర్చింతు నీశురాణి!!

  సీ. విజయంబు సతతంబు వీక్షింపగోరిన
                   దశమిన కార్యంబు దలచవలయు
 జయమునే కోరెడు జనమెవ్వరైనను
                    దివ్యదశమి
 సద్యశమున్గోరు సజ్జనులెవరైన
                     దశమిరోజునునెంచి తరలవలయు
 సిరులను బొందగ శ్రేయంబు గాంక్షింప
                       శారద రాత్రుల చక్కనమ్మ
 దుర్గ సేవల సద్భక్తి దురిత మెడల
 సల్పుచుండిన నరులెల్ల సాధుగరిమ
 ఇలను సత్కీర్తినంది మహేంద్రుపగిది
 భోగభాగ్యాల సతతంబు పొందగలరు.
     
                     
సమస్య :   ఉద్ధతులమధ్య నిరుపేదనుండగలనె? 

       యుద్ధమనినను కలముమహోద్ధతిగను
       పద్ధతిగ పదవిన్యాస వైభవాల
       శతసహస్రావధానంపు చతురులున్న
       మధుర మంజుల గళమునమమత జాలు
       వార్చెడుసుగుణ మణులు గీర్వాణి రూపు
       దాల్చిన తరుణులున్నట్టి తావు,ప్రథిత
       సురభిళపుపద్యతోరణసూత్రమందు
       చిగురు టాకులు సులువుగ జేరగలవె?

 సమస్య :  పగలోమున్గినవారి పాపచయముల్ భస్మంబులౌనెప్పుడున్.

 పగలంబెంచుచు మానవత్వగుణముల్ భంగంబుగాజూచుచున్
 రగులన్ వర్ణపుభేదముల్ జనులలో రాద్ధాంతముల్బెంచుచున్
 వగపేమాత్రములేని కూళమదిలో భాస్వన్మహద్భక్తి నిం
 పగ, లోమున్గినవారి పాపచయముల్  భస్మంబులౌనెప్పుడున్.
గ.ణ.ప.తి....తేటగీతి....గణేశస్తుతి. 
గజముఖా! పార్వతీముఖకమల రవి!గు
ణవిలసద్భవ్య నాయకా! నాగభూష!
పరమ పావన విఘ్నేశ! పాహిపాహి!
తిరుగులేనట్టి పుణ్యాల సరగునిమ్ము.



         
   


పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...