ప్రపంచ మాతృ భాషా దినోత్సవం , 21.02. 2015
తుర్క యామ్జాల్ లోని జ్ఞానోదయా విద్యా నికేతన్ , వార్షికోత్సవము సందర్భముగా వ్రాసి చదివిన పద్యాలు .
తెలు(గు వాడు
1. సీ . తిక్కన్న కవితలో తియ్యని మధుధార
తనివిదీరని భంగి త్రావుచుండ
పోతన్న భక్తిలో పూర్ణ త్వమున్బొన్ది
సతతంబు హరి సేవ సల్పుచుండ
పొన్నగంటి వారి చెన్నైన తెను(గులో
అచ్చ తెను(గు కావ్య మలరుచుండ
శ్రీనాధు సీసాల శేషంబు నుంచక
గుట గుట త్రాగంగ కోరుచుండ
తే . గీ. తెల్గు వానికి లోటేమి తెల్పుమయ్య
తిక్కనార్యుని, శ్రీనాధు తీరులన్ని
పొన్నగంటితో కలగల్పి పొదివి పొదివి
ముద్దు మురిపాల తెలు(గున మురియగలరు.
సీ. గళ మెత్తి, కలమెత్తి గంభీర భావాలు
పదిమంది నెదిరించి పల్కువాడు!
నమ్మిన సత్యంబు నవనిదులిచ్చినా
వదలని ధీరుండు వజ్ర సముడు!
ధర్మ పాలనమందు దారిద్ర్యమొచ్చినా
హ్లాదాన జీవంబు నందువాడు!
తే.గీ. వాడి గల్గిన పలుకుల వరలువాడు
ఒంటి పోరుకు నెదురొడ్డి ఓర్చువాడు
మిన్ను మన్నును లీలగా మెదపువాడు
తెలుపవలెనా! యింకను తెలు(గు వాని! .
తెగీ. దేశ దేశములందున ధిషణ జూపి
తనదియైనట్టి శైలిన తనరుచుండి
తెలు(గు వెలుగులు విశ్వాన తేట పరచి
కీర్తి కాంతను చేబట్టు మూర్తి యితడు! .