20, డిసెంబర్ 2019, శుక్రవారం

భక్తి..సమస్యాపూరణము

సమస్య.
   శంకరుడుమకొరకు పారిజాతముదెచ్చెన్.
         
   అంకితమగు!ప్రేమనిడెను
   శంకరుడుమకొరకు,పారిజాతముదెచ్చెన్
   కింకరుడగుచును వెన్నుడు
   శంకదియేల పతులకది సమ్మోదంబే.
            సమస్య.
     యమునకుదప్పదెన్నడు హుతాశనకీలలబూడిదైచెడున్.
       
 సమయము వమ్ముసేయక సుసాధన శ్రీహరిపాదపద్మముల్
 విమల మనమ్ములన్నిలిపి వేదనిరూపితరీతి,స్వర్ణపున్
 సుమముల బూజచేసినను శోధనజేయ నశాశ్వతంపు,"కా
 యము"నకు దప్పదెప్పుడు హుతాశనకీలలబూడిదైచెడున్.
        సమస్య.
   తలకుచెవులె యుండవు విచిత్రంబుగాదె!
         
   నాడు వామనమూర్తియై వేడ బలిని
   మంత్రి వర్యుండు వారించి మాయయనిన
   "తలకు చెవులె యుండవు విచిత్రంబుగాదె"
   యనగ మూడడుగులిడె నవ్యాజప్రేమ.

      సు..ప్ర..భా..తం.    పాదాదిన ఒక్కొక్క అక్షరం ఉండునట్లు, సూర్యోదయ వర్ణన.5.11.19.(న్యస్తాక్షరి)
   సుజన వందిత భాసుర సుందరాంగ
   ప్రకృతి మురిపించు దినకర!భాస్కరుండ!
   భాగ్యదాయిగ దీపించు పరమపురుష!
   తండ్రివై ప్రాగ్దిశనుజీల్చి తరలి రమ్ము.

 రకార రహిత శ్రీ రామ స్తుతి

సీతా ప్రియతమ నాయక
మాతాపిత సఖుడవీవ మమ్మేలగదే
పూతాత్ముడ నిను గొలిచెద
చేతమ్ముల మార్చుమయ్య చిన్మయ తేజా .

         పద్యాలతోరణం...17.05.2020.నాపూరణ: మీపొన్నెకంటి.
 సమస్య: రాతికికళ్ళుగిర్రుమనె రాలెతనూలత భస్మశేషమై.

       చేతజవైరి నిశ్చలత చిత్తరువై తపమాచరించగా
       మాతకు మేలటంచు కుసుమాస్త్రప్రయోగమొనర్చ,దానవా
       రాతికి కళ్ళుగిర్రుమనె, రాలెతనూలత భస్మశేషమై
       చేతజుకున్ భయంకర విచేతన దుఃఖప్రపూర్ణమైచనెన్.
     
       పద్యాలతోరణం. 19.05.2020. నాపూరణ,పొన్నెకంటి.
    సమస్య: పతినిన్ దూషించె సీత ప్రాజ్ఞులు మెచ్చన్.

   కం: మితిమీరు గర్వ బలమున
         క్షితిలో వరవిక్రముండు శ్రీరామాఖ్యున్
         మతిజెడి పలికెడు లంకా
         పతినిన్ దూషించె సీత ప్రాజ్ఞులు మెచ్చన్.

     పద్యాలతోరణం.. పరమశివుని చిత్రానికి నాభావన.
      18.05.2020. మీపొన్నెకంటి.

  శిరమునగంగ,హస్తమున చీకిన పుర్రెయు,కంటిమంటలున్
  గరళపుకంఠమున్ విమలకాంతులనింపెడు చంద్రరేఖయున్
  హరువగు నాగభూషలును,వ్యాఘ్రపుచర్మవిలాసియౌ మహా
  పురహరు దర్శనం బయిన మోక్షపథంబది గాదెయేరికిన్ ?

          ఫణీంద్రగారు..చక్కని మీ పరమశివుని చిత్రమునుజూచి
         నాస్పందన...మీపొన్నెకంటి.
        కింకరులగాఢభక్తికి
        నంకితమైయుండివరము లార్ద్రతనిడెడా
        శంకరుడోముతమనలను
        పంకజముఖిపార్వతమ్మ పజ్జనునిలువన్.

      పద్యాలతోరణం... న్యస్తాక్షరి. శివస్తుతి. ఐచ్ఛిక ఛందం.
      1.పా.  1.వ.అ...."క"
      2.పా.  2.వ.అ...."మ"
      3.పా.  3.వ.అ...."ల"
      4.పా.  4.వ.అ...."ము"

       నా పూరణము...మీపొన్నెకంటి.

      కం: "క"మనీయ నీలకంధర!
             అ"మ"లిన కరుణాంతరంగ హరహరశంభో!
             సమ"లం"కృత చంద్రధరా!
             అమర"ము"నీంద్రాది వినుత! యంజలులివిగో!

    కొమ్మలలో రాముడు...మీపొన్నెకంటి.

              కొమ్మలందు జూడ కోదండరాముడు
              చిగురులందు జూడ చిన్మయుండు
              పువ్వు పువ్వునందు పుణ్యాత్మడొక్కడె
              రామమయము జగము రమ్యతరము.
              ప,వ,న,జ.  నిషేధం.. ఆంజనేయస్తుతి.

     
             సమస్య:  జామాతయె కోడలాయె జగములు మెచ్చన్.

     ధీమంతుడు శ్రీరాముడు
     ప్రేమాదరముల హరువిలు విర్వన్వేదిన్
     లేమా! దశరధు నకు-భూ
     జా - మాతయె కోడలాయె జగములు మెచ్చన్.

         స,త,ప,ర..నిషేధాక్షరాలు..వేంకటేశ స్తుతి

      కలియుగంబున జనులకు కనులనిండ
      నిండియుండిన దైవంబు నీవనందు.
      ఏడుకొండలవాడన నేమియనుచు
      నభయమిచ్చుచు కాచునా యయ్యవీవు.

       ఏడుకొండలనాయకా! యిమ్మునాకు
       నిన్నుగాంచగ భాగ్యమ్ము నిగమనిలయ!
       మూడునామాల దైవమా! మోక్ష దాయి!
       జగము లెల్లను నీచేతి చలువనుండు.

     సూర్యస్తుతి.

         సుజన వందిత భాసుర సుందరాంగ!
         ప్రకృతి మురిపించు దినకర!భాస్కరుండ!
         భాగ్యదాయిగ దీపించు పరమపురుష!
         తండ్రివై ప్రాగ్దిశనుజీల్చి తరలి రమ్ము.

          పాపపుణ్యములను పరికించి చూచుచు
          గగనమెల్ల నిండు కర్మసాక్షి!
          సర్వజీవరాశి చైతన్యమందగ
          శక్తి నొసగు నీకు శరణుశరణు!

          సమస్య: గుణరహితుడు జనులకిలను గూర్చును హితమున్.
   కం:  కణకణము నందు దైవము.
          గుణములు లేవని కలవని ఘోషించు శ్రుతుల్
          గుణగణ సంసేవితుడగు
          గుణరహితుడు జనుల కిలను గూర్చును హితమున్.

        సమస్య: అవినీతిని గాచుగాత!యగజా సుతుడే.
        స్తవనీయ వృత్తి జేరియు
        నవవిధ మార్గాలచెఱచు నయవంచకులా
        యవకట భావాల్వినుడ.  (అవకట..చెడ్డ)
        య్యవి-నీతిని గాచుగాత!యగజా సుతుడే.

                    శా:  సీతారాములు కొల్వుదీరిరట కాశీక్షేత్రమందున్ భళా.
                
            ప్రీతిన్మారుతి డెందమందునెవరా విఖ్యాతులౌదంపతుల్?
            రాతల్మారగ నేమిజేసిరట మున్ రాజేంద్రులౌపాండవుల్? 
            భూతేశుండగు శంకరుండెచటతా మోక్షంబు నిచ్చున్సదా? 
            సీతారాములు - కొల్వుదీరిరట - కాశీక్షేత్రమందున్ భళా.

          సమస్య: మందున్ సేవింప గలుగు మాన్యత యిలలో.
    కం: అందము శ్రేయము మోక్షము
          విందగు రఘురామునామ వేదామృతమున్
          పొందిన సంజీవని, నా
          మందున్ సేవింపగలుగు మాన్యత యిలలో.
  
   సకలోర్విన్ కవితావితాన రచనల్ సాహిత్యహింసల్ గదా.    

    సకలంబౌ నిగమార్ధవేది యెచటన్ సన్మానితుండౌసఖా?
    అకలంకంబగు నేవిగూర్చు మదికిన్ హ్లాదంబుపెంపారగా?
    వికటంబైనవి యేవిమానవలె నా విధ్వంస భావాత్మకుల్? 
    సకలోర్విన్; కవితావితాన రచనల్ ; సాహిత్యహింసల్ గదా.! 
    సమస్య : కలడు కలండనెడువాడు కలడోలేడో.
           కలడందురు వైద్యులలో
           కలడందురు రాజకీయ గణములయందున్
           ఇల నిస్స్వార్ధపరుడొకడు
           కలడు కలండనెడువాడు కలడో లేడో!

          సమస్య: పరమేశుండు వెలుంగుచుండుగద హృత్పద్మాసనాసీనుడై. 
          హరుడే నాదు మనోహరుండనుచు నూహాలోకముందేలుచున్
         పరనామంబును సైతముందలపకన్ భద్రాత్మయై పార్వతే
         స్ధిరసంకల్పము తోడ ఘోరతపముంజేయంగ తద్భాగ్యతన్
         పరమేశుండు వెలుంగుచుండుగద హృత్పద్మాసనాసీనుడై. 

        సమస్య .కరికి నతు లొనర్చె గజరిపువదె 
                       కరుణ గల్గినట్టి కైలాసగిరి రాణి   
                       వాహనంబునైతి వరముగాగ 
                       ననుచు వినయమొప్ప నాదరమతిని శాం
                       కరికి నతు లొనర్చె గజరిపువదె 

      దత్తపది. బిడ్డ ,కూన ,లేగ ,పాప . అన్యార్ధాలలో , రామాయణం . 
      
      దర్శనంబిడ్డ నిన్వినా ధరణి నాకు 
      లేరులే గణపయ్య వేరెవ్వరైన 
      పాప సంహార మా కూన మాపుమయ్య 
      విఘ్నముల బాపి  రక్షించు విష్ణు తేజ   

సమస్య: దారమునందు కనిపించె దత్తుండంతన్.
        భారమునీదేయంచును
        పారాయణజేయు దత్త భక్తునికపుడున్
        తీరగు నాశీస్సుల; మం
        దారమునందు కనిపించె దత్తుండంతన్.

అక్షరార్చన శాశ్వత మోక్షపథము.
     
      ప్రాణమేలేని గిరులకు వస్తుతతికి
      నక్షరంబుల యవసర మసలులేదు
      జ్ఞాన ధనుడైన కతమున మానవునకు
      అక్షరార్చన శాశ్వత మోక్షపథము.
  
           
హారతియేలనయ్య యిటులార్తిగ దేవుని బూజచేసినన్.
   
   నేరములేమి చేయకను నేరము లెంచక తోడివారిలోన్
   వేరుగ లేడు దైవమను  విజ్ఞతనందుచు నాత్మసాక్షిగా
   సారమతిన్మెలంగు గుణ సౌమ్యుడు పుణ్యుడు సాధుమూర్తికిన్
   హారతియేలనయ్య? యిటులార్తిగ దేవుని బూజచేసినన్.

హరుని గళమ్మునన్ కుసుమహారము వేసెను సత్యభామటన్ .
   
   నిరతము భక్తులం దరిసి నిష్ఠనువారి సుఖంబు జూచుచున్
   వరములనిచ్చి క్రూరులగు  వైరులగూల్చుచు రక్షసేయుచున్
   పరమ దయాళువై వెలుగు పంకజనాభుడు కృష్ణుడా మనో 
   హరుని;  గళమ్మునన్ కుసుమహారము వేసెను సత్యభామటన్ .

దత్తపది: మర,రవ, వల, లత.అన్యార్ధంలో...రామాయణము.
       అ"మర" వరులెల్ల కోరంగ హరియెవచ్చె
       తా"వలం"బాయె దశరథ ధరణిపతికి
       నె"లత" సీతయె శ్రీరాము నెమ్మిజేర
       పౌ"ర వ" రులెల్ల నాడిరి పరవశాన.

సమస్య: శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి. 
  రాము మోహించి వచ్చిన రక్కసెవరు?
  ఏమియంచును బొగడిరి రాముసతిని?
  రంభ నేమని స్తుతియింత్రు రహినిసతము?
  శూర్పణఖ-సాధ్వి-లోకైక సుందరాంగి. 

అక్క,అన్న, వదిన, మామ. మండోదరి రావణునకు చేసిన హితవు.
   
    "అక్క"మలపత్ర నేత్రను నవనిసుతను
    "మామ"కాభీష్టమునుమెచ్చి మహితబుద్ధి
    "నన్న"రవరునకర్పింప హానితొలగు
    కా"వ దిన"కర తేజుండు కరుణజూపు.
శివుని శిరస్సునందు శశి చిత్రముగా వెలిగ్రక్కె వేడిమిన్ .
 
   భవుడటు వెండికొండపయి భవ్యవిలాసము తాండవంబుగా
   భువనమనోహరంబయి ప్ర మోదిగ మారగ గాంగడోలికల్
   నవవిధ రీతులన్ జెలగి నట్టిటు లూగెడు తాడనంబుచే
   శివుని శిరస్సునందు శశి చిత్రముగా వెలిగ్రక్కె వేడిమిన్ .
కంద,వంద,పంద,మంద..అన్యార్ధం..రామాయణం.
"వంద"నము గొనుమ జానకి
"కంద"ళితమ్ములవి రాము కమ్మనిచరితల్
సుందర "మంద"స్మితముల
పొందగు చూ"పంద"జేయు మోహనుడతడే.
కొంటెతనంబు జూపుటన క్రొత్తది కాదది నీకుమాధవా!

తుంటరి బాలురంగలసి  ధూర్తునివోలెను నింటదూరి నా
కంటను జల్లికారమును కమ్మగ నేతులు పాలుమీగడల్
గొంటివి; యర్వకుండగను కోడలిమూతికి వెన్నబూసితో!
కొంటెతనంబు జూపుటన క్రొత్తది కాదుగ నీకుమాధవా!

మునికీ కాననవాసమందెటుల సమ్మోదమ్ము చేకూరునో.
భీముని గూర్చి కుంతి మనోభావము.

వినయం బన్నది యెంతయున్న తనలో వీరత్వమే మెండగున్
కనగా నయ్యది యడ్డువచ్చుగద నా కాంతారమందున్ సదా
తినగా భోజన భాజనాదులవి సంతృప్తిం గూర్చునో లేదొ- భీ
మునకీ కాననవాసమందెటుల సమ్మోదమ్ము చేకూరునో?
వర్ణన: లంకాదహనము...మత్తేభము.
కనగన్ సీతను వార్ధి దాటిన ఘనున్ కార్యార్ధినిన్ కీశునిన్
వనిలో బంధన జేసి రాజుకడకున్  వైనంబుగా జేర్చగా
ననుమానంబది లేక పుచ్ఛమునకా యంగారముంగూర్చుడో
యనగన్ బట్టలు జుట్టి కాల్చ నరె‌రే! హాహా రవాల్ లంకలోన్.
సమస్య: కన్నులుమూసికొన్నపుడె కాంతురు సత్యము నెల్లవారలున్
     కన్నది సత్యమంచు మరి కాననిదంత యసత్యమేయనన్
     పన్నుగ జీవితాన సమభావ వివర్జిత మోహితాత్ములై
     బన్నములీడ్చుకన్న సురవంద్యుని రాముని భక్తిదల్చుచున్
     గన్నులుమూసికొన్నపుడె కాంతురు సత్యము నెల్లవారలున్.
సమస్య : ముక్కునునోరుమూయగను మోక్షము గల్గు జనాళికిన్సఖా!
    మక్కువతోడ శ్రీహరిని మానసమందున జింతజేసి, పెం
    పెక్కిన భక్తిశ్రద్ధలను వృద్ధుల సేవలనాచరించుచున్
    నిక్కక పేదసాదలకు నీడగనుండి సుయోగ దీక్షచే
    ముక్కునునోరుమూయగను మోక్షము గల్గు జనాళికిన్సఖా!.
సమస్య : తినడట బాలకృష్ణుడు దధిన్ నవనీతము ముద్దుచేసినన్.
  తనదగు బృందముం గలిసి తన్మయమందుచు సద్దుసేయకన్
  కనబడకుండ కుండలను గ్రాగిన పాలను వెన్నమీగడల్
  పనివడి వీపు నిచ్చెనల బ్రాకుచు మెక్కునె గాని ప్రేమతో
  దినడట బాలకృష్ణుడు; దధిన్ నవనీతము ముద్దుజేసినన్.
గోమాత...తేటగీతి. 
   సర్వదేవతా నిలయంపు సాధువర్తి
   భారతీయుల హృదయాల భద్రశక్తి
   స్పర్శమాత్రాన బుణ్యంబు వఱలజేయు
   నట్టి గోమాత పొగడంగ నలవియగునె?
వర్ణన: కందంలో శ్రీమహావిష్ణువు.
    కమలనయన! కంసారీ!
    కమలాసనవందిత! వ్రజ కాంతానందా!
    కమలాకర సంపూజ్యా!
    కమలాలయ సంకాశా!కాంచనదేహా! 

సమస్య: భవమిక చాలుచాలనుట భావ్యముగాదిల నెంచిచూడగన్.
కవనము పూర్వజన్మకృత గంథమొ!వాణి విలాస లాస్యమో!
భువన మనోహరంపు పరిపూర్ణ వికాస విభాసమానమో!
నవవిధ భుక్తిమార్గదము, జ్ఞాన మహాంబుధి,యట్టిదాని-ప్రా
భవమిక చాలుచాలనుట భావ్యముగాదిల నెంచిచూడగన్.
సమస్య: పాములుపాటపాడుగద పాములవారు శిరస్సులూపగన్.
శ్యాముని గానమాధురికి స్పందనగా పశు పక్షి జాతులున్
గోముగ వానిపద్ధతుల కోరకబాడును కృష్ణతత్త్వమున్
తామును తక్కువేలయని తన్మయమంది ఫణంబులూపుచున్
బాములు పాటపాడుగద పాములవారు శిరస్సులూపగన్. 
వర్ణన: కాళీయుని భావన..
పరమ సుకుమార శ్రీకృష్ణ పాదస్పర్శ
గర్వఖర్వంబుజేయగ కంటి మహిమ
జన్మపావనమాయెను; జగతి సేమ
మరసి చనియెద సంద్రంబు హ్లాదమొదవ. 

సమస్య: రక్కసులెల్ల భక్తిగొని రాముని స్తోత్రము జేసినా‌హో. 
నిక్కము మోక్షమార్గమది  నిశ్చలభక్తినె లభ్యమంచు బల్
మక్కువమీర సద్గుణుని మాన్యతజూచుచు నాత్మవేద్యులై
పెక్కురు రాక్షసాంగనలు, ప్రీతి విభీషణు ప్రేమపాత్రులౌ
రక్కసులెల్ల భక్తిగ

లక్ష్మీ స్తుతి: 
   అందియ ఘల్లని మ్రోయగ
   కెందమ్ములపాదములను క్రీగన్నులతో
   సుందరి విష్ణుని రాణీ!
   అందము గానడుగుమోపు మమ్మా!  లక్ష్మీ!
   అమ్మా సంపద లీనెడు
   కొమ్మా!రమ్మా! స్థిరముగ కొలువైయుండన్
   ఇమ్మా శుభముల మాకున్
   సమ్మానింతుము శుభాంగి! శ్రావణలక్ష్మీ! 

సమస్య:  గణపతియనె ప్రహ్లాదుడు కనకకశిపు.
   గుణపతిని విష్ణుదేవుని యణువణువున
   భక్తి తోడ ప్రా ర్ధించక ప్రల్లదములు
   బల్కు నితడు విఘ్నములను వరములిచ్చు
   గణపతియనె ప్రహ్లాదుడు కనకకశిపు.
సమస్య: పాలే గరళముగమారె ప్రహ్లాదునెడన్.
     కాలంబులు దేవగణము
     లీలన్ నాపాలనమున లేశపుశక్తుల్
     ఏలా హరి గొప్పను,గ
     ప్పాలే గరళముగమారె ప్రహ్లాదునెడన్. 



సమస్య. .తున్దిలుని గని మన్మదుడ ని  తొయ్యలి మురిసెన్ .

     కం .  ఇందు నిభ కాన్తులీనుచు ,
             వందనముం జేయ గల్గు వరుసకు బావన్ ,
             సందడి సేయక కరమిడి
             తున్దిలుని కని మన్మదుడని  తొయ్యలి మురిసెన్. 






       


    

   
           
    .
      
 
       




     
     
   


పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...