1. కంటిని వేంకటేశు ఘన కాంక్షలుదీరగ తన్మయత్వముం
గంటిని సప్తశైలముల కంజదళాక్షు మహోన్నతత్త్వముం
గంటిని శ్రీనివాసునల క్రన్ననభక్తులుజేరి మ్రొక్కగం
2. వింటిని వేయినామములు వీనులవిందుగ పర్వతాగ్రమున్
వింటిని దేవదేవుకడు వేడుకబాడెడు కీర్తనావళిన్
వింటిని సత్కథావళులు వేలకువేలుగ నెల్లవారిచేన్
వింటిని వేదమంత్రముల విశ్వవికాసుని దివ్యలీలలన్.
3. ధన్యములాయె చక్షువులు తామరసాక్షుని దర్శనంబునన్
ధన్యములాయె శ్రోత్రములుదంచితరీతిని కీర్తనాళిచేన్
ధన్యములాయె హస్తములు తత్పదసేవనుజేయుటన్సదా
ధన్యపు జీవితంబగును దైవ వినిర్మల నామచింతనన్.
వెల్లూరు శ్రీలక్ష్మీదేవి దర్శనమ్.
4. శ్రీహరి పాదపద్మముల చిర్నగవుల్మెరయంగ నొత్తుచుం
ఊహకునెన్నరానివిధమున్ తన భక్తజనాళికిన్ సదా
దాహముదీర్చునట్లుగను దానిలబంచును రత్నరాసులన్.
5. శ్రీపుర వాసియైబరగి చిన్మయ రూపిగ ఖ్యాతినందియున్
బాపురె భక్తకోటికిల బంగరు తల్లిగ భద్రవల్లిగా
ప్రాపునుజేరినన్మరియు పాయనిగూర్మిని జింతజేసినం
బాపములెల్లడుల్చి నిరపాయముగూర్చుదయాంతరంగయై.
6. అందిన నీదుపాదరజమా కమలాక్షుని హృన్మనోబ్జరా
గేందిర!సుందరీమణి! మదీయ శుభాంచిత పుణ్యశాలినై
బొందెదనమ్మ సౌఖ్యముల మోదముతోడుత విష్ణుపత్నిరో!
సందియమందనేలనిను చాలగగొల్చిన మోక్షమబ్బదే?
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి
7. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం
న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!మూషికాధిపా!
కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!
8. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్
కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్
స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా
నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!
9. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో
చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో
భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ
ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.
10. ఉంచితి నాదుభావనల నూహకు గల్గిన నంతమాత్రముం
గాంచనగర్భురాణి నను గ్రన్నన గాచి రసాంచితంబుగ
న్నంచితరీతిబల్కుమని నాజ్ఞయొసంగిన దానిమీరకం
బంచితి నార్యులార!యిక బ్రాజ్ఞతతో గుణదోషమెంచుడీ!