20, ఏప్రిల్ 2020, సోమవారం

అట్లకాడ...స్పందన.

😁  అట్లకాడ  😁

మ॥
పెనమందట్లు,చపాతి,రొట్టెలను  ప్రావీణ్యమ్ముతో వేయగా,
గననా మూకుడు లోన శాకమును జాగ్రత్తన్ వెసన్ గల్పగా,
తనసంతానపుటల్లరిన్ నిలుప వాతల్ పెట్టగా జూచునా
వనితాలోకకరాబ్జమందు చెలగేవా!అట్లకాడా భలే!

ఉ॥
"మైసురుపాకు"కోయుటకు మాయురె చక్కని సాధనమ్మువై
వేసిన కూరముక్కలను వేపగబాణలియందు పొయ్యిపై
వాసిగవంటయింటనె నివాసమునుండెడి యట్లకాడ నీ
ఊసులులేనిదే గడవదొక్కదినంబును స్త్రీలకిండ్లలో!

ఉ॥
మెట్టిన యింటిలోనణగి మెల్గుచునుండెడి స్త్రీలనెత్తిపై
మొట్టుచునుండ భర్తలును, పూర్తిగనోర్మి నశించినంతనే
చట్టుననాయుధమ్మువయి చయ్యన లేచుచు స్త్రీలనెల్ల నా
రొట్టెలకర్రతో కలిసి రుద్రమదేవిగ మార్చుచుందువే!

కం॥
ఇంతులు కోపముబూనుచు
పంతముతో భర్తలపని పట్టెడివేళన్
వింతగచక్కిలిగింతల
కాంతాకరవాలమగుదు "కార్టూను"లలో!

సీ॥
పెనము,మూకుడుకెల్ల పేర్మికాడ వగుచు
నలరారుచుందువే యట్లకాడ
"వాత"వైద్యమొసగు బహుళోపకారివై
యలరారుచుందువె యట్లకాడ!
బెణుకులెన్నియొ బాపు పెద్దదిక్కువగుచు
నలరారుచుందువె యట్లకాడ!
దిష్టితీసెడువేళ దివ్యసాధనమౌచు
నలరారుచుందువే యట్లకాడ!

ఆ.వె॥
వంటయింటిలోన వర్ధిల్లు వాటిలో
ముఖ్యవస్తువులను ముందునిలిచి
చేతిసాయమగుచు చెలరేగుచుందువే
అతివతోడునీడ యట్లకాడ!
😁🙏😁🙏😁🙏😁🙏😁🙏😁
రచన:
ఎస్ సాయిప్రసాద్
9440470774

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...