24, ఏప్రిల్ 2020, శుక్రవారం

కవితా రీతులు

సభాయైనమ:

కొందరు పలుకుల రవ్వలు
కొందరు గువ్వలు పదముల కువకువలాడన్
కొందరు కవితల దివ్వెలు
కొందరు మువ్వలు కవనపు కూర్పునజాణల్..

కొందరు దోరపు సిగ్గులు
కొందరు మీసములుదువ్వు కొంటెతనంబుల్
కొందరు కోమలి నవ్వులు
కొందరు కోరిన సరసపు కొప్పున మల్లెల్..

కొందరు వీణాతంత్రులు
కొందరు నాదస్వరములు, కొందరు తాళాల్
కొందరు మద్దెల దరువులు
కొందరు గంటలు చదువుల కోవెలలందున్..

కొందరు దిగ్గజములు, యిం
కొందరు సింగపుకొదమలు, కొందరు చిరుతల్,
కొందరు కవనాశ్వంబులు,
కొందరు మణులున్న ఫణులు, కొదవదిలేకన్..

కొందరు జలపాతంబులు,
కొందరు చిరుగాలితెరలు, కొందరు జల్లుల్,
కొందరు వాగులువంకలు,
కొందరు భాషాబ్ధిఁబుట్టు క్రొంగెరటంబుల్..

కొందరు నాటిన విత్తులు,
కొందరు పదపల్లవములు, క్రొవ్విరులిటనిం
కొందరు మాగిన ఫలములు
కొందరు వ్యాకరణక్షేత్ర కోవిదులిందున్..

కొందరు అర్థాబ్జభవులు,
కొందరు సత్యంపు భావ కువలేశయులున్,
కొందరు శబ్దేందుధరులు,
కొందరు శతకోటి సూర్య గోపీఠంబుల్..

కొందరు మంత్రాక్షరములు,
కొందరిపలుకెంతొసొంపు కోమలమందున్,
కొందరి తలపులు తేనెలు,
కొందరి చిరునగవెచాలు కోటిశుభమ్ముల్..

అందరికందరె యిచ్చట,
సందడిసేయుదమురండి! సాహిత్యసభన్,
ముందుకు సాగుదమింకను,
వందనశతములనిడెదను వాణికి మీకున్..

🙏🙏🙏

న్యస్తాక్షరి.. పద్యాలతోరణం.

పద్యాలతోరణం వారి న్యస్తాక్షరి.
  1పా.1వ అక్షరం..తో., 2వ పా.2వ అక్షరం..ర., 3వ పా. 3వ
   అక్షరం.ణ., 4వ పా. 4వ అక్షరం.ము..(కురుక్షేత్ర సంగ్రామం)
                     పూరణ....మీ పొన్నెకంటి.

 "తో"రపు విల్లుతో ఘన మదోద్ధత కౌరవసేన మించ-న
 వ్వా"ర"ణయూధమున్నిలిపి వంతులవారిగ జంపుకొందరున్
 మార"ణ"హోమమున్జరుప మాయలుపన్నిరి వ్యూహకర్తలున్
 ఈరణ "మూ"హసేయపరమేశ్వర! కృష్ణుడె హేతుభూతమౌ.

    పద్యాలతోరణం... దత్తపది..సీతాస్వయంవరం
      చంపకమాల....నా పూరణ..మీపొన్నెకంటి.12.05.20.
       1.వ.పా.1వ.అక్షరం.."క"
       2.వ.పా.2వ.అక్షరం.."మ"
       3.వ.పా.3వ.అక్షరం.."ల"
       4.వ.పా.4వ.అక్షరం.."ము"
  చం: "క"మలదళాయతాక్షి ధరకానుక,సీతస్వయంవరార్ధమై
         అ"మ"లినతేజుడై జనకుడంచితరీతి సభాంతరాళమున్
         భ్రమ"ల"నుదీర్చి యీధనువు భంగముజేసినవాడె ప్రేముడిన్
         గమన"ము"శ్రేయమై తనకు కౌతుకమొప్పెడు భర్తయంచనెన్.

    పద్యాలతోరణం..5.06.2020.   న్యస్తాక్షరి. 
     క,చ,ట,త,ప..ఒక్కొక్క అక్షరం పాదాదిన ఉండునట్లు
     తెలుగు భాషా సౌందర్యము..మీపొన్నెకంటి.

    "క"రము మనోహరంబయిన కంజదళాక్షుని చూపులోయనన్
    "చ"రణపు శైలిగల్గినది, సౌరభముల్విరజిమ్ము పూలతో
    "ట"రహి పదంబులన్నియును డంబముతగ్గని రిక్కలౌచునున్
    "త"రములనుండివెల్గి యవధాన శతంబుల దేశదేశముల్
    "ప"రుగులువెట్టె నా తెలుగు భాషనుమించిన భాషలేదిలన్!

           మీయభిమానపు హారము
           వేయుట తగుపల్కులమ్మ వీణియకెపుడున్
           పాయని కూరిమితో నా
           ప్యాయత చూపింపమీరు పరవశమౌదున్.

          1.పా.   1.వ.అ....ప.
     2.పా.   2.వ.అ....వ.
     3.పా.   3.వ.అ....న.
     4.పా.   4.వ.అ....ము.
    న్యస్తాక్షరి...  చంపకమాల...రైతు గురించి.
        పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
 చం:"ప"వనపుస్పర్శచే మొయిలు ప్రబ్బినమోదపుపుల్కరింతల
       న్న"వ"నికి దాహమార్చి కడుహ్లాదముగూర్చగ రైతుసోదరుల్
       జవ"న"ముబెంచి దుక్కులను చక్కగ దున్నగ మూరుతంబుకై
       నవక"ము"తో గుణించు వర నైష్ఠికు శాస్త్రినిజేరిరంతయున్.

      న్యస్తాక్షరి
        1 - 3 తం., 2 - 2. ద., 3 - 14. నా. 4. - 5 న. 
                     శివపార్వతులు - మత్తేభం.
  
  విది"తం"బౌనటె? నీదు తత్త్వమిక నావిజ్ఞాన లేశంబుచే
  స"ద"యా!యీశ్వర!పాహిపాహి శివ!విశ్వాత్మా!మహేశా!విభో!
  నదియౌ గంగను జూటమున్ మలచి నీ "నా"ట్యంబునంబార్వతిం
  బదిలంబౌ"న"టులుంచినావుగదరా పజ్జన్ మనోభీష్టతన్.

1వపా1వ అ.."అ"..2వపా2వ అ.."రు"..3వపా3వ అ.."ణ"
     4వపా4వ అ.."ము"....సూర్యుని గూర్చి, చంపకమాల.
    
   "అ"రయగ తూర్పుకొండల మహాద్భుత రోచులనింపివైచుచున్
    క"రు"ణదలిర్ప జీవులకు కామిత దాయగు కర్మసాక్షి., యా
    చర"ణ"విహీనుడౌ రథపుసారథి యైనయనూరు సాయమున్
    ధరకు "ము"దంబొనర్పగను దా జనుదెంచును ధర్మమూర్తియై.

    "అ"రయ సుమంగళీముఖమహాద్భుత కుంకుమ రేఖయోయనన్
    మ"రు"నటు దగ్ధమున్సలుప మారిన నీశు త్రినేత్రమోయనన్
    కరు"ణ" కపీశభావమున కమ్మని ఖాద్య ఫలంబునాబడున్
    మెరసి "ము"దమ్ము,భ్రాంతినిడు మిత్రుని వేడెద నెల్లవేళలన్.

 స.ర.స్వ.తీ. యతిస్ధానంలో నాలుగు పాదాలలో ఉండాలి.

       ఆ.వె. సర్వవేదరాశి! సహజసుందరగాత్రి
       రమ్య వాణి!నాదు రసన నిలచి!
       సాధుజనులుమెచ్చు స్వరదానముంజేసి
       తేట తెలుగు పలుకు తీరునిమ్మ!
    1.పా.10వ అక్షరం.(ప.) 2.పా.4వ అక్షరం.(ప.) 3.పా.13వ అక్షరం (ప.)      4.పా.16వ అక్షరం (.ప.) శ్రీహరి వర్ణన. ఉత్పలమాల.
   
    భారము నీదెయన్ననిక పద్మ విలోచన! రాక్షసాంతకా!
    ఘోరపు పన్నగంబు తన కోరలు చాచుచు చంపజూచినన్
    తారణజేయుచుందువల తప్పక పన్నగశాయి! శ్రీహరీ!
    కూరుతు పుష్పమాలికల కోరికమీరగ పక్షివాహనా!
న్యస్తాక్షరి. ఆటవెలది..యతిస్థానాలలో; చం, ద, మా, మ. సూర్యస్తుతి.
   శరణు శరణు మిత్ర చంపకుమమ్ముల
   తగినవేడి తోడ దయనుజూపు
   మహితతేజమంత మాపయి జూపగ
   మనగగలమె మేము మహినిక్షణము.
న్యస్తాక్షరి: రా,జ,ధా,ని,  అక్షరాలు పాదాదిన...తేటగీతి..రామాయణం. 
      రామ దర్శనభాగ్యమ్మె రంజకమ్ము
      జన్మ జన్మాల పాపాలు సమసిపోవు
      ధార్మికంబైన జీవన మర్మమెఱిగి
      నిశ్చలాత్మకుడై చను  నిజము నరుడు.
న్యస్తాక్షరి: సీ.తా.రా.మ. యతిస్ధానాలలో రామాయణం..ఆటవెలది. 

శివధనుస్సు విరచి సీతనుగ్రహియించి
తపము గాచనెంచి తాటక యను
రక్కసిం దునిమెను రాజసాన ఘనుడు
మాన్య రాఘవుండు మహితగుణుడు.
న్యస్తాక్షరి:  స.సే.మి.రా.  ఆటవెలది..రామాయణార్ధం.
సకలసుఖముల త్యజియించి సాధుగుణుడు
సేమమును గూర్చి మునులకు చింతదీర్ప
మిథిల రాట్సుత వాదము మెచ్చుకొనుచు
రాఘవుండేగె వనికి విరాగియగుచు.
న్యస్తాక్షరి: పం.చా.న.నం...పాదాదిని...నరసింహస్వామి వర్ణన.
పండు జన్మ  నీదు పాదమానినయంత
చారు నారసింహ!సాధువినుత!
నన్ను బ్రోవుమయ్య! నాగ శయన! శ్రీయ
నంత రూప! దివ్య! నతులొనర్తు.

పండ్లు కోర పండ్లు పదునైన నఖములున్
చారు నేత్రయుగము శార్ఞ్గయుతము
నరుడు హరియు గలసి నరసింగమాయెన
నంత తేజుడపుడు వింతజూప.
సం.గీ.త.ము. పాదాదిన ఒక్కొక్క అక్షరం ఉంచి సంగీతం గూర్చి 
సంబరంబౌను మదికెప్డు శ్రావ్యమగుచు
గీతభేదాలు జావళీల్ కీర్తనాళి
తన్మయత్వాన వినిన వైద్యంబెయగును
ముద్దుగోపాల! గోపికా మోహనాంగ! 






     


పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...