24, డిసెంబర్ 2018, సోమవారం

ఊహలు నిజాలైతే.

ఊహలు నిజాలైతే....

   మానవుని మస్తిష్కం నిరంతరం గత మధురక్షణాలను, చేదు జ్ఞాపకాలను నెమరువేసికొనుటే కాక, ప్రస్తుత పరిస్థితుల్లో మంచిచెడుల విశ్లేషణ చేస్తు ఉంటుంది. ఇంతేకాక మానవునకు భగవంతుడిచ్చిన గొప్పవరం ఊహాశక్తి. భావి జీవితాన్ని గురించి ఆలోచిస్తు ఉంటుంది. ఇది అందరికి సమానంగా ఉండదు. కారణం సత్త్వ,రజస్తమోగుణాలకు అనుగుణంగా హెచ్చుతగ్గులుంటాయని నా భావన. సత్త్వగుణం సాధారణంగా భక్తి, సేవాసక్తి, సాత్త్వికలక్షణాల వలన ఊహలకన్న యథార్థాలకే పెద్దపీట వేస్తుంది. వారూహించే విషయాలే నిజాలౌతాయి. రజోగుణం కొంచెం ఆవేశపూరితంగా ఉంటుంది కనుక ఊహలస్థాయి ఎక్కువగా ఉంటుందని భావించవచ్చు. నిజాల స్థాయి తక్కువే. రజోగుణంలో నిజాలస్థాయి ఉండకపోవచ్చు.
   ఊహలు మహాత్ముల పట్ల నిజమౌతాయనుటకు చాలా నిదర్శనాలున్నాయి. ఉదాహరణకు : 1.కాళిదాసకృత అభిజ్ఞాన శాకున్తలమ్ లో,  శకుంతలను జూచిన దుష్యంతుడు శకుంతలను ప్రేమించి, ఆమె చెలికత్తెలను ఈమె తలిదండ్రుల వివరాలడుగగా , ఈమె కణ్వమహర్షి కుమార్తెయని వారు చెప్పగా దానినంగీకరించక , ఆమె బ్రాహ్మణేతర  కన్యయని తెలిపి వివరాలు  సంపూర్ణంగా సేకరించగా  కణ్వుని పెంపుడు కూతురని, తలిదండ్రులు మేనకా విశ్వామిత్రు లని తెలుస్తుంది. 2. నానృషిః కురుతే కావ్యం, ఋషికానివాడు కవి కాలేడని అంటారు.  వాల్మీకి మహర్షి ఊహాజనిత కథే శ్రీమద్రామాయణం. మహర్షి ఊహే నిజం అయినది. 3. ఊహలు నిజాలయే విషయంలో నేను నా తండ్రిని  ఆదర్శంగా తీసికొంటాను. వ్యక్తి, కుటిల స్వచ్ఛతల విశ్లేషణానుభవం లో ఎన్నో విషయాలు నాకు ఋజువైనాయి. ఆయన ఋషి తుల్యుడు.
    సంఘంలో మానవ రక్త సంబంధాలనేకములున్నాయి. భార్యాభర్తలు, తల్లీ పిల్లలు, అక్కాచెల్లెండ్రు, అన్నదమ్ములు. మానసిక సంబంధబంధితులు  ప్రేయసీ ప్రియులు. కూతురు,కోడలు, కొడుకు, అల్లుడు.
  కూతురి ని కోడలులా, కోడలిని కూతురిగా , కొడుకును అల్లుడు గా, అల్లుని కొడుకుగా ఊహిస్తే....అలా ఊహించలేము. ఎందుకంటే ఎవరి స్థానం వారిదే.
కూతురి,కొడుకు పట్ల రక్తసంబంధపు చనువు జన్మతః ఉంటుంది. అది కోడలిపట్ల, అల్లుని పట్ల మనం ఏర్పాటు చేసుకోవాలి. అల్లుని సంబోధించునపుడు , ఏమండీ అంటాం కాని, ఏరా!అనము. కొడుకును ఏమండీ అనకూడదు. కూతురిని ఏమే అమ్మా!అంటాం. కోడలిని ఏమే అనే స్వతంత్రత ఉంటుందా ?
ఏనాటికి ఉండదుగాక ఉండదు. వేలమందిలో ఏఒకరో  ఉంటారేమే అలా అంగీకరించేవారు. మనమనసులలో పాతుకుబోయిన నిజాలు. ఇక పల్లెటూరి సామెతలకొస్తే....అవి జీవనయాత్రా సత్యాలు. : కూతురి వంటింట్లోకి నిబంధనలు లేకుండా చనువుగా వెళ్ళేవాడు తండ్రి. కోడలి ఇంట హాల్లో బిక్కముఖం వేసుకొని కూర్చునేవాడు మామగారు. (ఇలా అందరి విషయాలలో ఉండటం, ఉండకపోవటం వారివారి అదృష్టాలనుబట్టి ఉంటుంది.) కూతురు వచ్చి నాన్నా! అంటూ తండ్రి ప్రక్కన కూర్చుటుంది..మేనకోడలు కూడ మామయ్యా!అంటు దగ్గర జేరుతుంది.  మరి కోడలు మామయ్యగారూ !అని దూరంగా ఉండి మాట్లాడుతుంది ఎంతో అవసరమైతేనే.  వీలైనంత వరకు విషయాలన్నీ భర్త ద్వారానే చెప్పిస్తుంది.   ఊహల విషయానికి వస్తే .....మామగారిని తండ్రిగా, అత్తగారిని తల్లిగా ఊహించటంలో ఒక ఇబ్బంది ఉంటే అమలు పరచటంలో మరొక ఇబ్బంది ఉంది. నిష్కల్మషత్వ ప్రేమానురాగాలు, మమకారాలు, నిస్వార్ధం మానవకుటుంబ సభ్యులందరిలో  ఉంటే ఎలా ఊహించుకొన్నా ఏ ఇబ్బందులు, ఆటంకాలు రావు.
   మనం ద్విపాద పశువులస్థాయి దాటిన విజ్ఞాన ధనులం.  విజ్ఞాన హీన పశువులు సంఘటితంగా, ప్రేమానురాగాలతో  ఉండి ఎంతో పరాక్రమశాలియైన సింహాన్ని సైతం చంపుతున్నాయి. మన జీవనపరిస్థితులు, పరదేశ  సంస్కృతులు, స్వాతంత్ర్యాలు సంఘటితంగా ఉండనీయటంలేదు కుటుంబాలను. అందువలననే ఉమ్మడి కుటుంబాల ఊహే పగటికల అవుతున్నది.
    మానవ జీవనయానంలో ఒకరిపై మరొకరికి బంధంవేసేది నిర్మల ప్రేమ, అనురాగం, నిస్స్వార్థం. ఇవి పెరిగితే అన్నీ చక్కబడతాయి. అలా చక్కబడాలని తెల్లవారుజామున ఊహిద్దాం. ఆసమయంలోనైతేనే తథాస్తుదేవతలు దీవిస్తారు! శుభంభూయాత్! 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...