29, జూన్ 2016, బుధవారం

పాఠశాల పూర్వ విద్యార్థుల సన్మానాలు. . 25.06.2016.సన్మానము. పూర్వవిద్యార్థులు,30.12.22..


            ధూళిపూడి పాఠశాల శతవసంతం

 1. ఉల్లముపల్లవించును మహోజ్జ్వల కీర్తికి మారురూపుగా
       చెల్లిన ధూళిపూడి దరిజేరగ వచ్చుచు నుంటినన్న యా
       సల్లలితానుభూతి ఘన  శారద దివ్యమనోజ్ఞ దీవనల్
       వెల్లువ కావలెన్నచట వేడిన నే పసివానికేనియున్.
            2. తపన దీర్చి దిద్ది తనయంత వానిగా
                శిష్య తతిని సతము చెలిమితోడ
                తనను మించిపోవ తన్మయత్వముజెంది
                పరవశించువాడె పరమ గురువు.
3.  తలచు కొనిరి నాటి తమతమ గురువులన్
      శిష్యకోటి యమల చిత్తములను
      అట్టి వారి జూచి యానందమొందితి
      మృదుల ప్రేమ విరియ హృదయమంత.
          4.  పాట పాడి రచట పరవశమందుచు
               కవితలల్లినారు ఘనత జూపి
               మాటలాడినారు మాన్యతదీపింప
               శిష్య గణము నాడు చేతులెత్తి.
5.  దూరము గల్గియుండినను దుష్కర కర్మలు చుట్టుముట్టినన్
       తీరము జేరుకోరికను తీరికజేసుక ధూళిపూడికిన్
       నారిని చేతగొంచు ఘన నవ్యవిలాస  వికాసులై మనో
       హారిత నేగుదెంచిన మహా దృఢ చిత్తుల సంస్తుతింతునే.
          6.  బాపయార్యు ఘనత బాగుగ బొగడుచు
               ప్రణతులిడిరి వారి ఋణముదీర
               కీర్తి శేషుడైన మూర్తియాతడనుచు
               సంస్తుతించిరంత సౌమ్యులగుచు.
 7.  మొదలి,పొక్కునూరి,ముచ్చట పోపూరి
      దూపుగుంట వారి ప్రాపకంబు
      ఎదురు లేని సుకవి ఎక్కటి వారలన్
      స్మరణజేసిరచట సాధుగరిమ.
           8.  మానెపల్లివారి మహిత ప్రబోధనల్
                తెలుగు వెలుగుజూపు ధిషణమణిని
                తలచినారలచట తనువెల్లపొంగంగ
                శిష్యులెల్ల జేరి చివరివరకు.
9.  నాడు వేసిన  ఘనుల పునాదిరాళ్లె
     నేడు మాకవి అద్దాల మేడలయ్యె
     నాటి వారల దీవనల్ మేటి సిరుల
     భోగభాగ్యాల నలరించి పుష్టిగూర్చె.

ప్రియమైన పూర్వ విద్యార్థులకు  
      ఆశీః పద్యసుమాలు.

    "హాయిగా నవ్వటం భోగం, నవ్వించటం యోగం, నవ్వలేక పోవటం రోగం"
     కనుక తాను నవ్వుతు నవ్వులపాలుగాక,ఎవరిని కానీయక, జీవితలక్ష్యాన్ని
     ఎలా శోధించి సాధించాలో మాకు నేర్పిన మార్గదర్శకులైన గురువర్యులకు
     శతధా సహస్రధా మనఃపూర్వక ప్రణామములు.. ఇదివారి బానర్. 

      సీ:  ఇంతటి చోద్యంబు నెవ్వారు చేయంగ
                            వినలేదు కనలేదు వేదికలను
             ఇంతటి ప్రేమయా? యీఛాత్రులకునెల్ల
                        "అమ్మభాష" యనిన నాదరంబు
             ఇంతటి గారవ మింత పీయూషమ్ము
                   "తెలుగు"నందని మీరు తెలిసివలచి,
             కొంతలో కొంతగ కొమ్మ పల్కులరాణి
                            పాదారవిందాల పట్టుమమ్ము
  తే.గీ: "భాగ్యనగరా"న మాకు సౌభాగ్యమలర
           పూర్వ విద్యార్థులెల్లరపూర్వముగ 
           సూత్ర బంధిత కుసుమాల శోభపగిది
           చేరి సత్కరించిరిట ఆశీస్సులివియె.1.

  తే.గీ: ఎంత యెదిగిన నొదుగుటే యింగితమని
          ఇట్టి పరమార్ధ మెరుగుచు పట్టుదలను
          మూలములనెల్ల మరువని మూర్తులగుచు
          మీరలుండుట సంతసమిడును మాకు.2.

   తే.గీ: మరువలేనట్టి ప్రేమను మాన్యతలను
           "శిష్యగణమె"ల్ల మోదాన చేరి యిచట
           పంచినారలు బుధులెల్ల పరవశింప
            నాయురారోగ్య భాగ్యాల నలరుడయ్య!3.

   ఆ.వె: తల్లి పాలు ద్రావ తరియించు జన్మంబు
            మాతృ భాష పలుక మమతలొలుకు
            నన్న విషయమెరిగి ఆంధ్రభోజుడు నాడు
            తెలుగు లెస్స యనియె ధీరుడగుచు.4.

      కం: వదలక మమతలు మీరలు
            పదిలముగా నుండుడయ్య పరమార్ధమదే
            సదమల భావ పూర్ణపు
            నెదలోపలె నీశుడుండు నెయ్యుడెయగుచున్.

    భాగ్యనగరం.            శుభాశీస్సులతో
    మల్కాజిగిరి      విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు
    30.10.22.   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.

1975-బాచ్ పూర్వ విద్యార్థుల సన్మానం.

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః1గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః11.గురువు అను పదమే సంతత సన్మానార్షమైనది. అటువంటి గురుదీవనలను కోరుకొనుట సచ్ఛిష్యులందరకు సహజమే. ఆ కోరిక బలవత్తరమైననాడు తానే పరదేశములో నున్నా స్వదేశములోనున్నా మధువునుగ్రోలు మధుపము పద్మములను ఆశ్రయించు విధముగా, శిష్యమధుపములు గురు పాదపద్మముల నాశ్రయించుట ప్రకృతి సహజమే. అటువంటి మధురఘట్టమే నగరం మండల పరిధిలోని తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాలలో 1975-76సంవత్సరాలలో 10వ తరగతి చదువుకొనిన విద్యార్థినీ విద్యార్థులకు తమ గురువులను సన్మానించుకోవాలను సంకల్పము కలిగినది. 
         ధూళిపూడి గ్రామమనగనే అందరి హృదయాలలో మెదిలేది గ్రామదేవత తాళ్ళమ్మ తల్లి, శతవసంత శోభలు సంతరించుకొన్న మహాలక్ష్మమ్మ తల్లి, మహామహోపాథ్యాయుల పాదస్పర్శతో గళ మాధుర్యంతో విజ్ఞాన దీప్తులతో నిరంతర వాణీచరణ కింకిణీనాదములతో సుశోభితమైన తడవర్తి బాపయార్యుని పాఠశాల. అందువలన ముందుగా పూర్వవిద్యార్థులు ప్రశస్తమైన తాళ్ళమ్మ తల్లికి కొబ్బరికాయలు హారతి సమర్పించి  డప్పు వాద్యాలతో తమ ఉపాధ్యాయులను పాఠశాల వరకు ఊరేగింపుగా తీసికొనివెళ్ళి, తాళ్ళమ్మ తల్లికి ప్రదక్షిణలు గావించుట ఒక ప్రత్యేకత గా చేశారు. తదుపరి వారి రెండవ ప్రత్యేకత గజమాలలతో సత్కరించుట. సన్మానితుల బరువు షుమారు 50 కిలోలైతే గజమాల బరువు 150 కిలోలు ఉంటుంది. పూర్వవిద్యార్థులు మా శక్తి నెరిగిన పరేంగితావగాహులు కనుక మాపై అధిక భారము మోపకుండ వారు 90%మోసి మమ్ములను ఆనందపరిచారు. గజమాలను చూచి గజగజ వణకిన మాకు వారు భుజంకాయటం వలన సన్మానంచేయించుకొనే ధైర్యం కొండంత కలిగింది. పూర్వవిద్యార్థులకు మాకు వయసులో  భేదం షుమారు 15,16సంవత్సరాలే. మాకాశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే "మాష్టారు మీరు మాకంటే ఎంగ్ గా కనబడుతున్నారు. మీ రహస్యం ఏమిటండి?"అని అడగటం.  దానికి మాసమాధానం "ఏమీలేదోయ్!మీ అందరి శక్తి మాలో విద్యుత్తులాగా ప్రవహిస్తున్నది."అని సమాధానం. అందరిలో నవ్వులపువ్వులు. తరువాత యథావిధిగా సన్మాన కార్యక్రమాలు, అందరి వ్యక్తిగత పరిచయాలు, భోజనానంతరం మా పద్యగద్య ఆశీస్సులు సాగాయి. కార్యక్రమం విజయవంతం అయినది. పుత్రాదిచ్ఛేత్ పరాజయం. అలాగే శిష్యాదిచ్ఛేత్ పరాజయం. మా పిల్లలు మాకన్న ఉన్నతస్థాయి పొందారు. వారందరి మాటలు వింటున్న మా ఆనందానికి అవధులు లేవు. ఇలాంటి గౌరవాలు మాకు శ్రీవాణీ పదపద్మరజోలేశము వలననే దక్కినవి. అమ్మకు జేజే,చదువులమ్మకు జేజే. మాకు ససన్మానం చేసిన మా పూర్వవిద్యార్థులందరికి (వచ్చినవారికి రానివారికి), పాఠశాల లో కార్యక్రమాలు జరుపుకొనుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు, ఆశీశ్శతములు. శుభంభూయాత్!...
బాపయార్యుని సంకల్ప బలము వలన
త్యాగధనులైన విజ్ఞుల ధర్మమహిమ
వాణి యిచ్చోట కొలువుండ వరమునిచ్చె
అక్షరజ్ఞాన యజ్ఞంబు నమలుజరుప. 1.

ప్రియశిష్యులారా! మీ గురించి నాయూహ.

బెంచిపై సంచితో బేజారు మోముతో
                 నున్నట్టి మీరూపె యూహగాని
గడ్డాలు మీసాలు ఘన దేహ మార్పులన్
                   గుర్తుపట్టగ గల్గు స్ఫూర్తి లేదు
సూక్తులు సత్కథల్ శ్లోకాలభావాలు
                   తలలూచి విన్నట్టి తలపెగాని
సంఘ శ్రేయస్సుకై సాంద్ర మనస్కులై
             యుండిరో తొలగిరో యూసులేదు
  కలసికొంటిమి మనమంత గర్వపడగ
  వెలువరింపుడు మీదైన వివరములను
  జ్ఞానవిజ్ఞాన పర్వాల కలలపంట
  సత్కుటుంబ సద్విజయ సంచారములను.2. 

మీ సంస్కారం.....

సంకల్ప సిద్ధితో సన్మానమనుచును 
             గురువులగాంచుట గొప్పవరము
అక్షరజ్ఞానంబు నందినచోటనే 
     అందరు కుదురుట యమితముదము
ధనసంపదాళితో ధన్యత్వమెంచక
               గురుదీవనల్ కోర కోటి ఫలము
ప్రేమైక జీవులై ప్రియగురు పాదాల 
        అంజలించుట యది అమరఫలము
  ఎన్ని జన్మల పున్నెమో యేమొగాని
  మాకు దక్కిరి యిటువంటి మాన్య శిష్య
  కోటి ధూళిపూడి న మేము కోరకుండ
  బాపయార్యుని దీవనల్ పరిఢవిల్ల. 3. 

మేము నాటిన విత్తనాలీనాడు వటవృక్షములైనవి.

కొందఱు వైద్యులై మరియు కొందఱు వెజ్జులు శాస్త్రవేత్తలై 
కొందఱు సాఫ్టువేరు యుగ కోవిదులై యజమానులైరహో!
కొందఱు రాజకీయమును కోరిరి ధౌతపురీ నివాసులై. 
అందఱు అందఱే మరియు నందఱు అందఱు అందరందఱే.4. 

ఇలాగే అందరం కలసి....

మధురమధురమైన మహనీయ క్షణముల
తనివిదీర గడపి తన్మయముగ
భావి జీవితంబు బంగారుమయముగా
చేసికొందమయ్య స్థిరముగాను.5. 
     13.03.2023.

1989 బాచ్..కి ఆశీః పద్యాలు. 30.04.23.

గురుదర్శన సద్భాగ్యము
పరమాత్మను గాంచురీతి భద్రంబిడదే?
గురువాక్యశ్రవణంబది
నిరతము శిరసా వహింప నిఖిలము జయమౌ.

గురువును జూడగోరుటదె గొప్పగు భాగ్యము శిష్యకోటికిన్
నిరతము జ్ఞాన సంపదను నేర్పుగ పొంది సులక్షణాత్ములౌ
వర నిజ శిష్యులంగనుటవాంఛిత మోదము మాకు నెప్పుడున్
తరగని ప్రేమభావనల ధన్యత జెందుడు వాణి సత్కృపన్.

ధాన్య సంపత్తి తిండిచే శూన్యమగును
స్వర్ణ సంపత్తి కాలాన చౌకయగును
శిష్య సంపత్తి సత్కీర్తి శిఖరమగును
అట్టి సంపదె మాకు మహార్ణవంబు.

జ్ఞాన వృద్ధితోడ కర్తవ్యదీక్షను
చేసి మీరు మేరు శిఖరము వలె
కీర్తిగాంచుడయ్య కృష్ణయ్య కరుణచే
భుక్తి ముక్తి తోడ భోగమబ్బు.

మేము నాటిన బీజాలు మేలిమగుట
పసిడి పంటలు పండెను బాగుగాను
భావి జీవిత మంతయు తావులొలుకు
జ్ఞాన వృద్ధుల దీవనన్ సాగుడయ్య.









           
           
           

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...