17, మార్చి 2020, మంగళవారం

సుమాకాంక్ష

ఉ: చిత్రముదీయు పెట్టెగొని చేరితినాదగు చిన్నితోటకున్
     పత్రములన్ని యూగుచును పచ్చదనంబున స్వచ్చభావనన్
     ఆత్రముజూపుచుంబిలచి హాయిగ మమ్ము ప్రభాతవేళలోన్
     నేత్రములెల్లపర్వముగ నేస్తమ!చిత్రముదీయుమంచనెన్.

ఉ: తక్కువ కాలమే మనగ ధాత రచించెను ఫాలమందునన్
     మక్కువమీర కొందరటు మాధవుపాదములందు జేర్చెగా
     ఎక్కువ మంది యింతులిల యెంతయు కర్కశభావప్రపూర్ణలై
     టక్కునద్రుంతురే కటకటా!మము దాచు త్వదీయపేటికన్.

ఉ: నేనటు నెహ్రు కోటుపయి నిత్యము నవ్వుచునున్నదాన, నే
     మానవుడైన నన్గనక మానడు మాన్యతనిచ్చుట సాజమేగదా!
     కాన మహాశయా!యిటకు క్రమ్మర వచ్చి వివేకశాలివై
     పూనుము తీయ చిత్రమనె ముందుగ నెర్రగులాబి బాలయే.

ఉ: పచ్చని వర్ణముంగలిగి పండుగశోభలగూర్చుచుందునే
     ముచ్చటదీర నందరిసి మోదమునందెదరెందరెందరో
    సచ్చరితా!ననుం గడు విశాల మనంబున బొమ్మదీయవే
    మచ్చరమంద, సాటి కుసుమంబనె పచ్చ గులాబిబాలయే.

తే.గీ: నెమలి పింఛము మించిన నెనరు గల్గు
        చిత్రశోభిత  చిత్రంపు చిన్నిమొక్క
        పిల్చె తీయగ చిత్రంబు ప్రేమమీర
        బంధనమ్మును జేసితి భద్రముగను.

  కం: కనకాంరంబునేనని
        వినయంబుగ బల్కి యడిగె విశ్వాసంబున్
        అనయము నవ్వుచునుండగ
        మననీయుమ నన్ను చిత్రమందున నొకచో.

 తే.గీ: బటనురోజాను నేనంచు భయమువీడి
         పలికె సుకుమార దరహాస ప్రభలువెలుగ
         శోభగూర్చెడు చిత్రంబు సూరివర్య!
         తీయుమెంతయు పుణ్యంపు తెరవు దొరకు.
     

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...