2, ఏప్రిల్ 2019, మంగళవారం

జెజెయస్. కార్మిక సంక్షేమం

కార్మిక సంక్షేమం.jjs.

 1.  రెక్కలు నమ్ముకొంటివి నిరీక్షణసేయక స్వీయవృత్తులే
      డొక్కలునింపునంటివిపుడొక్కడు నిన్దరిజేరబూని, యీ
      చిక్కులచిక్కుటేలయని చేతలనొల్లక వట్టిచేతులన్
      దిక్కులుచూపుచుండ కడు దీనుడవైతివిగాదె కార్మికా!

 2.  నీవు లేనట్టి రంగంబు నెఱుగలేము
      నిత్య చైతన్యజీవిగ నిన్నునెంతు
      కష్టజీవులుపడు కడగండ్లు తొలగు
      కాలమేరాదొ యీ కలికాలమందు.

 3. చెమట చిందించి సీమలన్ సిరులు నింప
      నల్ల బంగారు గనులందు తెల్లవార్లు
      కర్మసిద్ధాంతమును నమ్మి కాలుకదుపు
      కార్మికా! నీదు సంక్షేమ కార్యమేది?

  4. ఎన్ని పనులైన సాగు నీవున్న చోటె
      కులము మతములనెంచని కోవిదుండ!
      ధర్మ సంచారి వౌచును ధరణియందు
      సర్వహిత కాంక్షివగుటకు సాక్ష్యమేల?

 5.  వసతిగోరగ ముందుండు పనినిజేయ
      భుక్తిగూర్పగ నిరతంబు పొలమునందు
      రాజ్యపాలన సాగ సారథి యతండె
      కార్మికుడులేక యొనగూడు కార్యమేది?

        స్వీయ రచన. "భాషాప్రవీణ." జొన్నలగడ్డ జయరామ శర్మ.
                                                           యం.ఏ. తెలుగు.
                                                           భాగ్యనగరం.
            ( వీరు నా సాహితీ మిత్రులు.) పొన్నెకంటి.
జె.జె.యస్.       తొలకరి చినుకులు.రైతు తలపులు.

             1. సాయమెవరిని కోరని సైరికుండ!
                 కానికాలాన కడగండ్లు కలుగుచుండు
                 కష్టసుఖములు నీచోచ్చగతులు గలవు
                 రైతుబ్రతుకున మార్పులు రాకపోవు
 2. చుక్కలదారి నుండి యిక చూపు మరల్పుము మానవాళికిన్
     దిక్కగు నీవిటుల్ సతము దీనతనుండగ జూడలేము  నీ
     మ్రొక్కిన మ్రొక్కులందనిసి మోదముగూర్పగ వానదేవుడే
     గ్రక్కున సాగివచ్చె కలకాలము నిల్చునె నీదు కష్టముల్ ?
 3. అండ దైవమెయంచు మండుటెండను సైచి
                             మడినంత చెమ్మటం దడిపినావు
      మెరకపల్లమ్ములన్ మఱి మఱి పరికించి
                               సమతలమొనర్చుచు సాగినావు
       నాగేటిచాలునన్ నైపుణ్యమొప్పార
                                చక్కనౌ వరుసలన్ సల్పినావు
        పంటకాల్వలదీసి పెంటపోగులజిమ్మి
                               దుక్కిదున్నంగ ముందుండినావు
        కూడు గూడును గుడ్డను కూర్మినొసగు
        అన్నదాతవు నీకన్న నెన్నదగిన
         దైవమెవరన్న లోకాన ? తలప నీవె
         సిరులు పంచెడు నిత్య కృషీవలుడవు.
 4. తొలకరి చిన్కులంగనుచు తొయ్యలి చయ్యన నాథుజేరి వ్యా
      కులపడనేల నాథ!మన కోరికలెల్ల ఫలింపజేయగా
      తొలకరియేగుదెంచె ఘన తోయదముల్ వినువీధి సాగెడున్
      పొలమున బంటవోలె ననుభూతినిబొందెద మాతృమూర్తినై.
 5. సరసననున్న భార్యగని సంతసమందుచు రైతుబల్కె యీ
      కురిసెడి వానకుంబొలము కోరికమీరగ పంటపండ నీ
      తరుణమునందునే ఋణముదప్పక దీరిచి వేడ్కతోడ కా
      పురమునకంపగా నగును పుత్రికలన్ మఱి అత్త యిండ్లకున్.

                                     జొన్నలగడ్డ జయరామ శర్మ.

 
       

కన్నె బంగారు విలాపం

కన్నెబంగారు విలాపం.

భారత దేశమన్బరగు పావన ధార్మిక క్షేత్రమందు నో
నారిగబుట్టుటంగనగ నాదగు పూర్వకృతంపుపాపమో!
వారిజనేత్రుడౌ హరి యవారిత శాపము నీనుటోజుమీ
క్రూరమృగంబులై తిరుగు కూళలు గొందఱు చంపజూచెడున్.

పుట్టకముందెచూచి మము పూజకునోచని పూవుకైవడి
న్నెట్టివిచక్షణల్సలుప నేరక గొందఱు మాతృమూర్తులే
గిట్టగజేయుచుండుటలు, కీచకరూపులకమ్మజూపుటల్
మెట్టిన ఇంటకాల్చుటలు, మీరెను మాతలరాతలై యిటన్.

వంశ వృక్షంబు నిలుపగ వసుధలోన
కొడుకె తగినట్టివాడని  కూర్మితోడ
తల్లిదండ్రులు భావింప ధర్మమగునె?
మేల్మి సంతాన క్షేత్రాలు మేముకాదె?

మోక్షము నిచ్చువాడనుచు,పూర్ణశశాంకుడటంచునెంచి,స
ల్లక్షణ లక్షితుండనుచు, లాలనజేతురు పుత్రమోహముం
గక్షనుగట్టిమమ్ము నరకమ్మున ద్రోతురదేమిపాపమో
శిక్షలు లేవుగా తమకు శీర్షముదీయుటతప్ప వేరుగన్.

ఓయి పురుషుడ!నీకెప్డు దోయిలొగ్గి
వందనంబుల నర్పింతు వసుధయందు
కన్నెబంగారు రక్షించి కాచిచూడు
వెల్గులీనును జగతికి వివిధగతుల.

రవీంద్రుని భావాలకాంధ్రానువాదం.

గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలకు ఆంధ్రానువాదం.

తే.గీ. దయయు ప్రేమైక గంథముల్ తనివిదీర
         నింటనింపిన బోనేల నీశు దరికి?
         పూజసేయంగ వేవేల పూలతోడ
         భక్తి తత్త్వంబునెఱిగిన ప్రాజ్ఞులకును.
భావము.. ఓ మానవా!దయ, ప్రేమ అనే సుగంధాలను నీ యింటిలో

తే.గీ. మనసునందలి గర్వంబు మచ్చరంపు
         చీకటుల ద్రుంచ యత్నంబు సేయవలయు
         కాంతివంతము నీకది క్రాంతిగూర్చు.
         దీపముంచగబోనేల దివ్యుకడకు ?

తే.గీ. శిరము వంచగ నేటికి శివుని గుడికి
         తోడివారికి వినయాన తోడునిలచి
         తప్పు జరిగిన నిలువెల్ల తాపమంది
         పూర్ణమైనట్టి జ్ఞానివై ముందుకేగు.

తే.గీ. పూనుకొనగను పేదల పుష్టికొఱకు
         యత్నముంజేయ దళితుల హాయిగోరి
         యువత ప్రగతికి సతతంబు నూతమీయ
         గుడికిబోనేల మానవా మడులుగట్టి?

తే.గీ. నీదు కాఠిన్య వచనాల బాధజెంది
         కుములువారిని దరిజేరి కూర్మిదనర
         క్షమనువేడుము సరియగు క్షణమునందు.
         వేడనేలకో శివుని నీ గోడుదెలిపి?

హేవళంబి కాహ్వానం.

  హేవళంబి నామ సంవత్సర ఉగాది ఆహ్వానం. శుభాకాంక్షలు.

   వద్దన్నా కద్దన్నా వదలక వెంటాడేది, తన బలం చూపేది
   ఇతరుల బలహీనతలను సున్నితంగా  తఱచి చెప్పేది
    కవులకైతే కలం, మిగిలిన వారికైతే  కాలం!!
            ఈ రోజునుండి సంవత్సరం దాకా నీపేరు "హేవళంబి"
    చైత్రం నుండి చిత్ర విచిత్రాలు సౌగంధికాలు మొదలై
    నవ ప్రభావిత మావి చివురుల చాటున కోయిలలై
    అర్థవికసిత నవలావణ్య అధరామృతమాను షట్పదములై
    ఊహలకు ఱెక్కలు తొడిగి ఉదయభానుని తాకగలవైన
     భావపరంపరలను భద్రపఱచుకొన్న  సుకవులై...
     కుంచెకు కొంచెం ప్రాణం, మరి కొంచెం త్రాణం అద్ది
     ప్రతి గీతకు గీతంత విలువనిస్తు, రంగుల ప్రపంచాన్ని చ్చే
                      చిత్రకారులై .
     వెలసిందెవరో కాదు. నీవే...
              వేములో చేదును సృజించి, వేయేండ్ల జీవితమిచ్చినా
              క్రొత్త బెల్లంలో తీపి నింపి, భార్యగా పోలిక నిచ్చినా
              ఉప్పులోసముద్రాన్ని, సముద్రంలో ఉప్పు నింపినా
              కారం లో మమకారం కలిపి, కాపురాలు చేయించినా
      మావి పులుపులో , మానవ జీవన చిగురుదొంతరలు దాచినా
              వగరులో కొంచెం పొగరు కలిపి భారతీయునిగా చూపినా
          అదెవరో కాదు. నీవే....
           సహజంగా సామాన్యులు పొగడ్తలకు లొంగుతారు
            నీవీ జాతికి చెందవని తెలుసు, కాని మేమాశాజీవులం.
          గతాన్ని మరచి , వర్తమానాన్ని అనుభవిస్తు , భావి
           జీవితానికి ఎఱ్ఱ తివాచీ పరచే తెల్లని మనసున్న నల్లవాళ్లం.
      హేవళంబీ!
       మేము తెలిసీ తెలియక చేసిన ప్రకృతి విరుద్ధాలను మన్నించి
       వాతావరణ కాలుష్య ఘాతుకాలకు వార్నింగ్ తో వదలి
       మా జీవితాలను ఆధ్యాత్మిక, సాంఘిక, మానవీయతల పట్ల
        మరలించి, ప్రతి ఒక్కరి జీవితం సార్థకం, ఆనందమయం చేయాలని  మనసారా కోరుతు...
                                        పొన్నెకంటి సూర్యనారాయణ రావు.




పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...