14, జనవరి 2018, ఆదివారం

సంక్రాంతి శోభ. అనుబంధాలు, కవితాభారతికి పద్యాలు.

గోదాకల్యాణ మహోత్సవము. గుంటూరులో మా తమ్ముని ఇంట్లో  కొడుకులు,కోడళ్ళు, మనుమలు ,మనుమరాళ్ళతో సంక్రాంతి సంబరాలకు శ్రీకారం. బంధుత్వాలు బలపడేటందుకు  ముఖ్య కారణం అనురాగం, ఆప్యాయతలు. కలసినప్పుడు చిరునవ్వు తో నోరారా పలుకరించుకోవడం. అవి పెరగటానికి ఒక్కసారైనా అందరు కలసి కష్టసుఖాలు పంచుకుంటు ఆత్మీయతలను పెంచుకుంటు పంచుకుంటేనే ఆనందం దక్కుతుంది. అందునా మనం తెలుగు వారం కనుక తెలుగు పండుగలను సంప్రదాయబద్ధంగా చేసుకుంటే భావితరాల మన పిల్లలకు మార్గదర్శకులమౌతాము. ప్రతి భారతీయ సంప్రదాయం వెనుక మన సంస్కృతి రహస్యం దాగిఉంది.
    భోగి....నువ్వులనూనెతో, నలుగుపిండితో స్నానం పాపహరం, ఆరోగ్యప్రదం. భోగిమంటలో పాతవస్తువులను కాల్చటం స్వచ్ఛ భారత్ అయితే పాత పాతకపు ఆలోచనలను కాల్చి నిర్మల ప్రేమమయ భావనా సంపదను ఉత్తరాయణ పుణ్యకాలంలో పంచుకోవడం పరమ వరముగా భావించవలసిన స్వచ్ఛభక్తి భారత్.
 ఈరోజు తో ధనుర్మాసం పూర్తి అయి 30పాసురములసేవతో మధుర భక్తి తో  శ్రీకృష్ణుని జేరిన ఆండాళ్ తల్లి పరమపూజ్యురాలు. అందు వలననే గోదాదేవి కల్యాణం చేస్తే మన జీవితాలు మంగళప్రదమౌతాయనే ఆ కల్యాణం చేస్తారు. ఆ కల్యాణం చేస్తు మా తమ్ముని కుటుంబం ధన్యమైనది.
  సూర్యడు మకరరాశిలో ప్రవేశం వలన ...మకరసంక్రాంతి.
      భూమినుండి సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరానికి జరుగుతు పోతు ఉన్న కారణంగా సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం. ఎంత పుణ్యకాలమంటే "ఉత్తరాయణం వచ్చింది ఉరిపెట్టుకొని చావండి" అనే నానుడి వచ్చింది. అంటే అర్థం అందరిని చావమనికాదు. అంతప్రశస్తమైనదని అర్థం చేసుకోవాలి. పూర్వీకుల చమత్కారాలు కూడ ఆథ్యాత్మిక పరంగా ఉండేవి.
   భూమాత కరుణ వలన రైతులకు చక్కని పంటలు ఇంటికి వచ్చి ఆ ఇల్లు, కళకళలాడుతూ ఉంటుంది. మన దేశంలో రైతుకి సిరిసంపదలు వస్తే అందరికి వచ్చినట్లే. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు "జై జవాన్ జై కిసాన్"అన్నారు.
ప్రతి తెలుగిల్లు కూతుళ్ళు అల్లుళ్ళతో, కొడుకు కోడళ్ళతో , మనమలు మనుమరాళ్ళతో ఆ ఇల్లు కిటకిటలాడుతు ఆనందం పొంగిపొరలుతుంది.
    బొమ్మలకొలువు ప్రత్యేకత సంతరించుకుని ముత్తైదువుల ఆశీస్సులతో  చిన్నపిల్లలు భోగిపండ్లు కొంచెంగోలచేస్తు పోయించుకుంటారు. దానితో వారిపైగల దృష్టి దోషం తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు.
    మూడవరోజు కనుమ..  మనకు పంటలను ప్రసాదించే బసవన్నల దగ్గరనుండి ప్రతి జంతువు పక్షిజాతులు మనకు ఆరాధ్యాలే..అందువలననే ఆరోజు పశువులనలంకరించి ఆరాధిస్తారు. ఇందులో ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉంటాడనే ఆథ్యాత్మికత దాగిఉంది.
             అందరికి శుభాకాంక్షలు. మన సంప్రదాయాలను కాపాడుకుందాం..
భోగిశుభాకాంక్షలు. 
  సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రమణము.  సంక్రాంతి
  నుండే ఉత్తరాయణ పుణ్యకాలం. ఇది 3రోజుల పండుగ. మొదటిరోజు భోగి,రెండవ రోజు మకరసంక్రాంతి,మూడవరోజు కనుము. భోగిపండుగ
ఎలాచేసుకుంటారు....ఉదయాన్నే లేచి భోగిమంటలు వేయడం, ముగ్గుల్లో గొబ్బెమ్మలం పెట్టడం, సాయంకాలం పిల్లలకు భోగిపళ్ళు పోయడం. భోగి కుండలు అమర్చుకోవడం. ఇలా ఎన్నో రకరకాలు చేసుకుంటాం. ఇవే విషయాలు చిన్న కవితలో చూద్దాం. 

     భోగిమంటలు వేసుకుందాం, భోగి పండగ చేసుకుందాం!

     పనికిరాని చెత్తనంతా, పాత మాస్కుల కుప్పనంతా
     పెరుగుతున్న క్రూరక్రిములను, పెచ్చరిల్లే వేరియంట్లను!!భోగిమంటలు!!
     మంగళ స్నానాల్ మంచిగ చేసి, క్రొత్త బట్టలు ధారణచేసి
     గుమ్మడిపూల  గొబ్బిదేవతల పూజలు చేస్తు ముందుకు పోదాం
     స్వాగతమిద్దాం సరదా భోగికి, సందడిచేద్దాం రారండోయ్ రారండోయ్!!భోగి!!
     రేగు పండ్లతో  దిష్టినితీస్తు తోయజాక్షులు
     దీవనలిత్తురు.!భోగిమంటలు
      పెద్దలు పిన్నలై దీవనలందిరి ఆనందంతో...
     భోగి కుండల మోహనకాంతులు పూర్ణకుంభపు పుణ్యరాసులై
     జీవన విధిలో సుఖములీనగా...భోగిమంటలు!!

                        మకర సంక్రాంతి.

  ఈరోజే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన మకర సంక్రాంతి. 
   విశేషాలు కవితలో

   రైతు ఆశల పంట ఫలములు, ఇంట నిండుగ నిండగా
   గుండె నిండిన సంబరాలె, గుర్తులై చిరునవ్వులు చిందగా
   వచ్చిన మార్పే వరాల పండగ, సంబరాల సంక్రాంతి
   గోమయపు ముద్దలే గోపికలై విరియగా, కన్నెలు పూజించు 
                                          క్రాంతి సంక్రాంతి.
   క్రొత్త అల్లుళ్ళు,నవ వధువులేకమై,ఇంటింట చేసెడు ఆనందహేల
   సూర్యున కిష్టమౌ క్రొత్తబియ్యపు పొంగళ్ళు, అమృతమధురిమలలీల
   బంధుగణముల బహుముఖపాండిత్య,చమత్కారాల గోల
   హరిదాసు గానాల ఆనంద భక్తితో పరవశమమందుచు
    ధాన్యాల దానాల ధర్మంపు భావాలు.
    బొమ్మల కొలువున అమ్మల ఆశలు,పిల్లలకెంతో ప్రేమదీవనలు
    భోగిపళ్ళతో లోగిళ్ళన్నీ, ముద్దుగుమ్మల సంబరాలతో
    ఆనందాలే హరివిల్లై నిండుగ నిండే పండగ సంక్రాంతి.

     మరి కనుమ నాడో!!

     పశువుల పూజకు ప్రాధాన్యంగా, త్యాగజీవులకు నిస్స్వార్ధంగా
     మనస్ఫూర్తిగా గౌరవమిచ్చే, సంప్రదాయపు పండుగ కనుమ
     గంగిరెద్దుల ఘన విన్యాసాలు, తెలుపును మనకు క్రమశిక్షణను
     దారము ఆధారంగా నింగికి యెగసే పతంగులన్నీ
     తెలుపును మనకు లక్ష్యసాధనను
     కోడిపందెముల సంప్రదాయములు,తెలుపును మనదౌ పౌరుషాగ్నిని
     కనుమా!కనుమను క్రాంతి దాతగా, మనుమా భావి సుఖప్రదాతగా!!

సంక్రాంతి కవితాభారతి. 28.12.22.
సీ:  గృహముల ముంగిళ్ళ కేరింతసందళ్ళ
            మోహనాంగులు దీర్చు మ్రుగ్గులలర
      కపిల గోదుగ్ధముల్ కమ్మగ ద్రావుచు
            లీల గెంతులిడెడు లేగలలర
      పాడిపంటలునిండి పరవశంబందిన
             కర్షకునేత్రాల కాంతులలర
       హరిదాసు బృందాల " హారిలోహారం"చు
             భక్తి మీరినహోరు  రక్తిదనర
  తే.గీ: కోడిపందాల పౌరుషాల్ , కోడెగిత్త
          బండ లాగుళ్ళ సంబరాల్ పండుగనగ
          వచ్చె సంక్రాంతి మాలక్ష్మి వైభవాన
          భారతీయత పండిన పడతివోలె
          పిన్నపెద్దల డెందాల ప్రేమ నింప.

    భోగి శుభాకాంక్షలు.

  సీ:  పాడైన వస్తువుల్ పనికిమాలిన చెత్త
                    లోగిళ్ళ దహియింప భోగియనిరి
          కన్యకామణులెల్ల ఘనరంగవల్లుల
                     లోగిళ్ళ రచియింప భోగియనిరి
          పరుష సంభాషణల్ పాపచింతలెదల
                     లోగిళ్ళ గాల్చుట భోగియనిరి
          కుంకుళ్ళరసముతో కూర్మికేశాఘముల్
                      పోగొట్ట ఘనమైన భోగియనిరి
          గోమయపరికల్ప గొబ్బిళ్ళ సొబగులే
                       భూమినిండినవేళ భోగియనిరి
   తే.గీ:ఇట్టి భోగాల నందు మహేంద్రరూపి
          భారతీయుడొకండె సూ వేరులేడు
          సంప్రదాయంపు సంపదల్ సవ్యరీతి
          భద్రపరచిన మనకీర్తి భద్రమగును.

    సీ: ఉత్తరాయణమందు నుత్తమ కార్యాలు
                    పుణ్యమిచ్చుననిరి మునులునాడు
           మంచిగుమ్మడిపండు మహదాన మిచ్చిన
                    సత్ఫలంబులనిరి సకలమునులు
           పోయిన నరులకు  పుత్రతర్పణమున
                     నరకముండదనిరి నైష్ఠికాళి
           మకరసంక్రమణంబు మహనీయ కాలమై
                      పుణ్యప్రదమనిరి మునులునాడు
     ఆ.వె: మకరరాశియందు మాన్యుండు రవిజేర
              ఉత్తరాయణమయి చిత్తమలరు
              జీవనంబు మిగుల జేగీయమానమై
              శుభములందు నరుడు శోభనముగ.
     ఆ.వె. రేగి పండ్లు బోయ రేగిన జుత్తుతో 
              పాపలెల్ల విరియు పర్వ మిదియె 
              పాప దృష్టి తొలగి పదివేల కాలాలు 
              బ్రతుక గోరు క్రాంతి పధము లివియె.

                           కనుము.శుభాకాంక్షలు.
                             
            సీ:  భారతదేశాన పాడిపంటలసిరుల్
                     బసవదేవుని కృపను వరలుచుండు
            భారతీయుల జాతిపౌరుషంబును దెల్ప
                      కుక్కుటంబులబెంచు కూర్మిదెల్పు
             సర్వపాపవిదారి చల్లని గోమాతృ
                        సేవయె దెల్పును శ్రీపథమ్ము
              సకలజీవులప్రేమ సౌభాగ్యదమ్మని 
                         కరుణజూపుటె మన కనుము కనుమ
     తే.గీ: ప్రకృతి సర్వంబు ప్రేమైక భావనమున
              పరిఢవిల్లిన తోడగు పరమశివుడు
              విజయపథమిచ్చి కాచును నిజముగాను
              భారతీయత లోనున్న పారమిదియె.
                     




పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...