శ్రీరామ శతకము....
**కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!**మకుటంతో
శ్రీరామ శతకము...పొన్నెకంటి.
1.శ్రీకరంబైన శ్రీరాము, చిత్తమందు
సరసభక్తిని గొల్చుచు సంతసింతు
ధరణి నీసేవ సంసార తరణి మాకు
కరుణజూడుమ శ్రీరామ పరమపురుష!
2.రామనామంబె మదినిండ రమ్యమనుచు
పానమునుజేతు చేయింతు పరులచేత
మూర్తిగొన్నట్టి ధర్మైక మోహనాంగ
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
3.భువిని నీజన్మ మాకిల పుణ్యఫలము
రాక్షసాంతక సాకేత రామచంద్ర!
దుష్టసంహార!మధ్వరీ!దురితదూర!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
4.తండ్రియానతి తలదాల్చ ధర్మమనుచు
చేసి చూపితివార్య! నీచేవ దనర
నీకు నీవెగా సాటిల నీలవర్ణ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
5.తల్లినోదార్చి ధర్మంపు దారి జూపి
తండ్రి మాట శిరముదాల్చి తరలినావు
సీతయును లక్ష్మణునితోడ చింతలేక
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
6.ఘనత నీలోన గ్రహియించి కౌశికుండు
యాగరక్షణజేయ మర్యాద తోడ
తోడుకొనిపోయి యడవుల తోడుపొందె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
7.అన్నదమ్ముల యనురాగమవనియందు
చూచి మీలోన పొంగెద సుందరాంగ!
మాకు నిడుమయ్య సద్భావ మమతలెపుడు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
8.వనములోనను నీదివ్య పాదమూన
మునులుకష్టాలు దొలగి పుణ్యులైరి
శిష్టరక్షక!నీకెప్డు చేతునతులు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
9.తాటకను జంప సత్వర ధర్మమనగ
గురువునాజ్ఞను బాటించు తెరువుజూపు
ఉత్తమోత్తమ శిష్య!రఘూత్తముండ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
10.వల్కలంబుల ధరియించి వనములందు
విల్లు పట్టిన లోకైక వీరవరుడ!
ఆర్త రక్షణె కర్తవ్య మనగదలతు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
11.లక్ష్మణస్వామి తనకున్న లక్ష్యమందు
కంటకంబుల దొలగించి కదలుచుండ
ముద్దుతమ్ముని జూచుచు మురియుచుండు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
12.హంసతూలికా తల్పాన నతివతోడ
అంతిపురమున శయనించు నాశ వదలి
తాతయాజ్ఞను పాటించు ధన్యతముడ
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
13.సంతసించిరి నీవటు సాగ వనికి
కైక, కౌశిక మునులెల్ల కచ్చితముగ
వసుధ నిన్నెఱిగినవారు వారెగనుక
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
14.కనగ నినుబాసయోధ్యయె వనముగాదె?
నీవు దిరుగ వనమయోధ్య నిజముతండ్రి
స్వామి నీవున్న దేశమే స్వర్గమగును
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
15.వనముపులకించినీరాక వరమెయనుచు
పుష్పసంశోభితమ్మయి మోదమందె
సర్వమున నీవె నీలోనె సర్వముండు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
16.రాక్షసాళికి గుండెలు రాలిపోవ
నీదు రూపంబు కనిపించు నిశ్చయముగ
రావణాంతక! కోసల రామచంద్ర!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
17.రక్షకుడవైన నీకెప్డు లక్ష్మణుండు
రక్షగనునుండు చోద్యమ్ము రామచంద్ర!
నటనజూపి, చేయింతువు నలిననేత్ర!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
18.పరమయోగులు, శాపాల బడినవారు
చక్కనైనట్టి దర్శన స్పర్శలబ్బి
మోక్షమార్గంబు నందిరి పుణ్యపురుష!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
19.కూర్మి బహువిధ వంటల గుహుడు బంప
లలిత పదముల బల్కి తిరస్కరించి
కందమూలు దినినట్టి చందురుండ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
20.నవల చేయుదువేమొ నా నావ యనుచు
పాదధూళిని కడుగంగ వరముపొంది
గుహుడు కడిగెను గంగతో కూర్మిదనర
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
21.జనన మరణాల భయమది సమసిపోవు
వార్ధకపు భీతి నరులను వదలి చనును
నీదు చరితంబు పఠియింప నిర్మలాత్మ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
22.కల్పవృక్షంబు సేవింప కలుగుఫలము
రామనామంబు జపియింప రమ్యమగును
మునుల పలుకులు నిజములై మోక్షమిడును
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
23.గౌతముని భార్య శిలవోలె కాననుండ
పాదస్పర్శకు మారెను పడతిగాను
శాపములుబాప నినుమించు చతురులెవరు?
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
24.పరశురాముని కోర్కెమై ప్రజ్ఞజూపి
విష్ణుధనువును వంచిన వేదవేద్య!
నీవె విష్ణువు విష్ణువే నీవుగావె?
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
25. దైవికములను బాటింప ధర్మమనుచు
రాజ్యపాలన వీడిన రాఘవేంద్ర!
సాటి యెవరయ్య నీకిల సహనమందు?
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
26.కైక ద్రోహంబు జేసిన కనలకుండ
తల్లిప్రేమను జూపిన ధర్మమూర్తి
రాగమయ భావనారూప రమ్యగుణుడ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
27.తల్లి కౌసల్య దీవనల్ తలనుదాల్చి
పాదపద్మాల ప్రణమిల్లి ప్రణతులిడుచు.
మాతృప్రేమను బంచిన మహితయశుడ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
28.వనములకు వత్తు నేనన్న జనని గాంచి
భర్తృసేవయె భాగ్యంబు భార్యకెపుడు
వలదు వలదన్న సద్గుణ వారసుండ!
కరుణ జూడుమ శ్రీరామ. పరమపురుష!
29.భర్తృసేవలె ముఖ్యంబు భార్యకనుచు
పడతిసీతయె యనుమతి వడసె నాడు
ధర్మబద్ధపు బల్కుల దనియుసామి
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
30.కానలకునేగు తరుణాన కాన్కలెన్నొ
భూరిదానాల పేరున భూసురులకు
ధనము గోవుల నొసగిన త్యాగధనుడ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
31.పౌరులెల్లరు నీవెంట పరుగులిడగ
సహనగుణమున వారించి సాగివనికి
ప్రియము నయమును జూపిన ప్రేమమూర్తి!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
32.లక్ష్మణుడు పర్ణశాలను లక్షణముగ
చిత్రకూటాన నిర్మింప శ్రేయమనుచు
సోదరుని మెచ్చు పరమాత్మ!సుగుణశీల!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
33.గారవృక్షంబు నీడన కాంతసీత
తోడ, ననుగు తమ్మునితోడ,గూడియున్న
సకల జగదీశ! మాధవ!సారసాక్ష!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
34.చిత్రకూటంపు పరిసర చిత్రములను
సాధ్విసీతకు జూపింప సంతసమున
ఉవిద భావించె వనము నయోధ్యయనగ
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
35.ప్రబల సేనతో భరతుడు వనికిరాగ
రణమునకె వచ్చె వారన్న లక్ష్మణుగని
ప్రేమభావంబు దెలిపిన విజ్ఞతముడ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
36.అమ్మ కైకకు నెయ్యవి హ్లాదమగునొ
మరువకుండుమ వాని సుమంత్ర! యనుట
నీదు సంస్కారవంతపు నెమ్మిగాదె!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
37.సత్యమే రాము బలమని చాటినాడు
కౌశికుండు నాటి సభను, కనులయెదుట
నట్టి పలుకులు నిజమయ్యె నమలచరిత!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
38.పాలనములోని మెళుకువల్ భరతునకును
చెప్పి యాశీస్సులందించు స్నిగ్ధహృదయ
నిండు ప్రేమను జూ పింప నీకె చెల్లు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
39.భరతు కోరికమేరకు పాదుకలను
పాలనముజేయ నిచ్చిన ప్రాజ్ఞతముడ!
భ్రాతృ ప్రేమకు నీవెగా పరమసాక్షి
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
40.సేవలందించు వారల చిన్నచూపు
చూడవలదంచు ప్రియమైన సోదరునకు
చెప్పిపంపిన సద్గుణ! క్షేమకరుడ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
41.మునులకండదండగ నుండి మోదమిడగ
దండకారణ్యమున నీవు తపసివోలె
చేరినావయ్య రాజస చిత్తమలర
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
42.వేద మంత్రాల ఘోష పావిత్ర్యమంది
దండకారణ్యమంతయు ధన్యమగుట
బ్రహ్మలోకంబుగా మారె భానువంశ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
43.మునులు మిముగాంచి వివశులై మురిసిపోయి
రెప్పవేయుట మరచి వారిహమునందె
యనిమిషులెయైరి నిజము మహాత్మ!నాడు.
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
44. శశి నిశిని మ్రింగి వెల్గుల జల్లినట్లు
రామచంద్రుడ!నీవును రక్కసులను
జీల్చి మునుల చీకట్లను జిదిమినావు.
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
45. ఆ విరాధుండు సీతమ్మ నాక్రమింప
నాగ్రహంబున నాతని యంసములను
నరికి శాపంబు వాపిన నలిననేత్ర!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
46."వల్కలంబులు దాల్చియు పగయెలేని
రక్కసులజంప బాడియె రామచంద్ర!"
యనిన సీతకు "బ్రతినయె" యన్న ధీర!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
47.కామపరవశ శూర్పణఖ మిముజూచి
పరవశించి కోర్కె దెలుప వలదటంచు
ధర్మబోధనుజేయు సద్ధర్మమూర్తి!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
48.క్రూర ఖరదూషణాదుల గూల్చివైచి
మునుల సంతోషపెట్టుట ముఖ్యమనెడు
శిష్టజనులను గాచు విశిష్టమూర్తి!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
49.ఉర్వి నానాటి స్థితులెల్ల నూహజేసి
తనకు విజయంబు వచ్చుట తథ్యమనుచు
శకునములజూచి చెప్పెడు శాస్త్రవేత్త!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
50.నియమబద్ధపు మనుగడ నేర్పుమీర
చేసి చూపించు నీదివ్య చిత్తమెన్న
శక్యమేరికి నగునయ్య శ్యామలాంగ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
51. రేడు లంకేశు నాజ్ఞ మారీచుడపుడు
స్వర్ణమృగముగ మారెను సాయమిడగ
మరణమూహించె నీచేతి శరము చేత
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
52. సీత హరియించు యోచన చేటుదెచ్చు
రాజ! నీకు నాకును మన లంకకనుచు
చెప్పు మారీచు నేరీతి జేసినావొ?
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
53. లలన సీతమ్మ యందాల రాశియగుట
మీరు సద్ధర్మ లోకైక వీరులగుట
శూర్పణఖకు రావణున కసూయపుట్టె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
54. సాయమొనరింపకున్నను చత్తువన్న
రావణునిచే మరణము నిరాకరించి
నీదు బాణాగ్ని కెరయౌట మోదమనియె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
55. మంచి చెప్పిన మారీచు మాటవినక
మూర్ఖ లంకేశుడప్పుడు మునిగమారి
సీత గీత దాటించి విజేతయయ్యె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
56. పంచవటిలోని సీతకు భద్రమిడగ
లక్ష్మణుని బెట్టితివి నీవు రఘుకులేంద్ర!
మైదుగాండ్రైన రాక్షస మాయలెఱిగి
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
57. వింత మృగమైన మారీచు వేటకొఱకు
పరుగులెత్తితివౌర! నీవెఱుక గలిగి
కర్మఫలమును జూపింప కర్తవగుచు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
58. గీతగీసెను లక్ష్మన్న సీతకొఱకు
గేస్తు ధర్మమ్ము పాటింప గీతదాటె
ఇదియె యదనంచు వచ్చె లంకేశుడపుడు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
59. ధర్మచింతనాకలిత సీతమ్మ తల్లి
కర్మబంధాన జిక్కెను కాలవశత!
దాని నిజమని చాటగ దగిలె వలను
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
60. సీత చెఱపట్టదలచిన ఘాతకుండు
నీశు భక్తుడెయైన లంకేశు డపుడు
వామహస్తాన కేశాల బట్టిమెలిచి
దక్షిణపు హస్తమున గాళ్ళు తనువు బట్టె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
61.మానవాంగన కైవడి చాన సీత
లక్ష్మణుని వేడె శ్రీరాము రక్షకొఱకు
వినని మరదిని నిందించె వివిధ గతుల
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
62.పడతి కోపాన కఱకుగా పలుకనిమ్ము
వదలి వచ్చుట నీకెట్లు పాడియనుచు
ననుగు దమ్ముని గోపించు నమరవంద్య!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
63.గిరులు, తరులార!నదులార! ధరణిజాత
కానవచ్చుట లేదిట; కరుణతోడ
మీరు జూచిన దెల్పుడీ మేలుమరువ
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
64.సర్వ దేవతలార!నా సాధ్వి సీత
నాకు దక్కకున్నను పదునాల్గు లోక
ములను దహియింతు ననుశూర!కలతవిడుమ
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
65.మాత జాడను దెల్పుచు మరణమంద
నా జటాయువున్ ప్రేమమై యగ్నిగాల్చి
మోక్షమిచ్చిన ప్రభువును మ్రొక్కుదెపుడు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
66.ఆ "కబంధుడు"దరిజేర నంసములను
నరికి దహనముంజేయగ పరమప్రీతి
గెలుపు సూచకమనెను "సుగ్రీవ"మైత్రి
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
67.జ్ఞాని యా "కబంధుని"మాట మానితమని
ప్రేమజూపించి చేయ కపీశమైత్రి
జయము చేకూరె మీకట శౌర్యధనుడ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
68.భావి మార్గమ్ము సూచించి భద్రమనియె
నా "కబంధుడు" జ్ఞానియై మీకునపుడు
కీశ శ్రేష్ఠుండు గలసె "సుగ్రీవు"డనగ
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
69.స్వామి! తనకడకేతెంచ శబరి తనిసి
దివ్య దర్శన మంచును తీపితీపి
కందమూలాల నర్పించె గాంక్షదీర
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
70.దివ్యదర్శన మాత్రాన దివికినేగె
"శబరి"నామాఖ్య సద్భక్త సాధువనిత
పూర్వజన్మల పుణ్యాన పొందెఫలము
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
71. మృగము లిచ్చిన గుర్తుల మెల్పువలన..(మెల్పు..నడిపించు)
దక్షిణ దిశకు నీవేగ తత్ క్షణమున
అమ్మ నగలమూటను గననయ్యె నచట
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
72. రాక్షసాధముడైనట్టి రావణుండు
దొంగిలించగ సీతను దుష్టుడనుచు
చీల్చి చెండాడు ప్రతినను జేసినావు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
73. విరహవేదన సీతను వెదకుచుండ
యతిగ కనిపించి డాసెను హనుమనాడు
క్లిష్ట దశలోన నున్న సుగ్రీవునకును
మేలు గల్పింతునని వరమిచ్చినావు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
74. హనుమ భుజములపై నెక్కి హాయిగాను
రాజు సుగ్రీవు జేరిన రఘుకులేశ!
అగ్నిసాక్షిగ మిత్రత్వ మమరుకతన
వాలి బరిమార్తు నంటివి భయమునుడిపి
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
75. వణకి పోవుచు కపిరాజు వాలి బలము
జెప్పి యభయముంగోరె తా శిరము వంచి
మాత జాడను గనగ సమ్మతిని దెలుప
సంతసంబాయె నిర్వురి పంతములకు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
76. కాలిగోటను దుందుభి కాయమెత్తి
చిమ్మినావట సుగ్రీవు నెమ్మికొఱకు
సప్త సాలమ్ములను గొట్టి శరముతోడ
సాటి యెవ్వరు లేరంచు చాటినావు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
77. వాలి సుగ్రీవులిర్వురి పోరులోన
వాలి వదనంబు సుగ్రీవు వదనమేదొ
వేరు కనలేక వాలిని విడిచినావు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
78. వాలి రూపంబు గుర్తించ మాలనొకటి
నీదు మిత్రుని గళమున నిల్పియపుడు
చెట్టు చాటుగ వాలిని జీల్చివైచి
మాట నిల్పుకొన్నట్టి సుమతివి నీవు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
79. వాలి ప్రశ్నింప తగినట్టి వరుసలోన
కారణంబులు చూపిన ఘనుడవీవు
ధర్మదూరుల కియ్యదె దారియనుచు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
80. తనను సైతము జంపగ తారకోర
కీశనాథు చావునకు సుగ్రీవు డడల
వారి నోదార్చి సంతృప్తి పఱచినావు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
81. సీత కోరగ నీదివ్య పూతచరిత
హనుమ చెప్పగ నాతల్లి హ్లాదమందె
స్వచ్ఛమైనట్టి ప్రేమకు సాక్షిమీరు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
82. అవనిజను జూడ నేగెడు హనుమకపుడు
"రామముద్రిక"నిడినట్టి రఘుకులేశ!
మేలిమైనట్టి గురుతౌచు మేలుజేసె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
83. ముదిత సీతను తనదైన భుజముపైన
నెక్కు మనినట్టి హనుమకు చక్కనైన
పరమ పావిత్య్ర ధర్మాల బల్కినట్టి
లోకమాతకు బతివైన శోకనాశ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
84. అమ్మ యున్నట్టి యునికిని హనుమజెప్ప
నీదు మనమొకటియె కాదు నిఖిల జగతి
సంతసించెను పరమాత్మ! సారసాక్ష!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
85. అతివ "చూడామణిని"నాడు హనుమకిడుచు
నీవు రాకున్న ప్రాణాలు నిలువవనెడు
తల్లి కష్టమ్ము నెఱిగిన ధర్మమూర్తి!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
86. "కాక"నామక దనుజుండు కఠినరీతి
మాంసముంగోరి సీతను హింసపెట్ట
"బ్రహ్మ" నామకాస్త్రంబును వదలినట్టి
యస్త్ర శస్త్ర విశారద! యసురహంత!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
87.చండ "కాకాసురుండ"టు సాంద్రతరపు
టస్త్రమును దప్పుకొనలేక అంజలించి
శరణువేడగ కాచిన శౌర్యమూర్తి!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
88.దనుజునే కోరుమంటివి తగిన శిక్ష
‘‘దక్షిణపు నేత్రము’’ను కాకి తాకుమనియె
అమిత వేగాన దొల్చె బ్రహ్మాస్త్రమపుడు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
89.నిన్ను సేవించు కోరికిన్ నిండు జీవి
తమును పణముంచె సౌమిత్రి తనకుదాను
అన్నదమ్ముల వాత్సల్య మన్న మీదె!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
90. చంపదగినట్టి శత్రువు శరణువేడ
దయను జూపుచు గాచెడు ధార్మికుండ!
నిన్ను బోలిన దైవంబు నెన్న; కనము
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
91. వారధిని దాటి సీతమ్మ వైనమరసి
హర్షమిడినట్టి సద్భక్త హనుమకపుడు
కౌగిలింతను ప్రియమార కాన్కపగిది
నిచ్చి యానందపఱచిన సచ్చరిత్ర!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
92. లెంకలందరు పోరుకై లంకజేర
పథము నీయని యుదధికి భయముగొల్ప
బ్రహ్మ నామకాస్త్రంబును వదలినావు
భీతిజెందిన సంద్రము వేడుకొనగ
రక్ష కల్పించినాడవు శిక్ష మాని
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
93. ఐదు దినముల వ్యవధిలో నమరజేసె
"నలుడు"వారధి నత్యంత తెలివిగాను
రామ సేనయె ముదమున లంకజేరె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
94. ప్రథమ చర్యగ "నంగదు"బంపినావు
రాయబారంబు నెఱపగ లంకకపుడు
రాజధర్మంబు నీసొత్తు రఘుకులేశ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
95. ఈప్సితము మీర నీకు మహేంద్రుడపుడు
పంపె తేరును మాతలిన్ భద్రమఱసి
నీదు శక్తికి నిల్వ ప్రమాదమంచు
తలచి రావణుని రథమా వలకునేగె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
96. చింతపడునట్టి సమయాన జేరబిలచి
ముని"యగస్త్యుడు"బోధించె మోదమలర
భక్తి "నాదిత్యహృదయమా"శక్తి వలన
జయము చేకూరె నాడటు జానకీశ!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
97. తఱుగుచుండిన రావణు తలలు మఱల
మొలచుచుండగ నిరతంబు కలతజెంద
నీవు నేర్చిన "బ్రహ్మాస్త్ర"మిపుడు వాడు
మనుచు బలికెను "మాతలి"దనుజహారి!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
98. "మాతలి"పలుకులకు నీవు మన్ననిడుచు
"బ్రహ్మ"నామకాస్త్రంబును వదలిపెట్ట
ధర్మ ఘాతకు దశకంఠు తలలు దఱుగ
విజయమందెను ధర్మంబు వేదవేద్య!
సంతసించిరి లోకాల సజ్జనాళి
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
99.సుగుణ మణి "విభీషణుడు" తా సోదరునకు
దహన సంస్కారములనెల్ల సహనమునను
నీదు మాటకై చేసెను నియతితోడ
పేగు బంధమ్ము తెగిపోయి మూగవోయె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
100. రాజుగ "విభీషణుంజేసె లక్ష్మణుండు
అన్నమాటను జెల్లించి మన్ననిడుచు
ముదముజెందెను లోకాలుభూరిగరిమ
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
101. వేదవతిని పల్లకిలో "విభీషణుండు"
పంప, కాలి నడకన దా బరవశించి
నిన్ను జేరెను ముదమార సన్నుతాంగ!
సీతదర్శన భాగ్యంబు చేతమలరె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
102. నీవు కఠినంపు బల్కుల నిందవేయ
"సీత సాధ్వియే గాక పునీత" యనుచు
నగ్నిదేవుండు దెల్ప మహానుభావ!
స్వీకరించితివానాడు శ్రేయమనుచు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
103.ధరణిజను నిన్ను దీవించె "దశరథుండు"
స్వర్గముననుండి వచ్చి తా సంబరాన
సంతసంబును బొందిరి సాధుజనులు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
104. పుష్పకంబున మీరటు పుణ్య భరతు
జేర పాదుకల దొడిగి హారతిచ్చి
కోసలాధిపు జేసెను కోరి నిన్ను
నీదు పట్టాభిషేకంబు మోదమాయె
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
105. మంగళంబనిరి మునులు, మంగళమనె
సర్వ దేవతలు, శుభమస్తనిరి ఋషులు
రాముడగు నీవు విష్ణువై; రమణి సాధ్వి
సీత లక్ష్మియై హరిపురి చేరినంత!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
106. మనసు పరవశమందగ మధురచరిత
రచనజేసితి నీపైన రాగముంచి
ఆరుకాండము లందలి తీరులెఱిగి
పూర్తిజేసితి లక్ష్యమ్ము బుధులు మెచ్చ
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
107. కరుణజూపించి నన్నిట గాచుకతన
నీదు నామంబు స్మరియించి నిర్మలాత్మ!
నూరు పైబడు పద్యాల నూహజేసి
పాదపద్మాల చెంతను బఱచినాను
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
108. శతకముననున్న సద్భావ సరళి యెల్ల
రామ ప్రేరితమై చనె రమ్యమలర
దొసగులున్నను నాయవి కసరవలదు
సూచనలనిడ శ్రద్ధగ జూచుకొందు
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
109. రాగమును జూపి "శ్రీ జయరామశర్మ"
శతకమందలి దొసగుల సౌమ్యదృష్టి
శిష్టమొనరించె సతము విశిష్ట రీతి
ధన్యవాదాలు మిత్రమా! మాన్యచరిత!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
110. పొన్నెకంటి వంశ బుధుడు "పూర్ణచంద్ర
శేఖరు సుతుడ! జ్ఞానాన జిన్నవాడ!
"సూర్యనారాయణాఖ్యుండ!"సుజనహితుడ!
ఆశిషంబుల నాశింతు నాప్తులార!
కరుణ జూడుమ శ్రీరామ పరమపురుష!
111. శ్రేయమంచును సతము నాశీస్సులిడెడు
పితృదేవుల కంకితం బిత్తు నేను
పరమపురుషుని శతకంబు శరణుగోరి
భావి జీవితమంతయు తావిగలుగ!
మంగళం మహత్....ది.19.06.2021.
హితబోధ శతకము.
మానభంగ మాప మారిన చట్టముల్
మదిని మార్చలేవు మహిషులకును
చిన్నపెద్దలనక స్త్రీ జాతిహింసించు
కుటిలజనుల నెపుడు కూడబోకు1.
అధికమైనచొరవ నాత్మీయతల్జూపి
పసరుమొగ్గబోలు పాపల నిల
మోసగించి చంపి మోదమ్మునందెడు
కుటిలజనుల నెపుడు కూడబోకు 2.
చదువులున్నగాని సంస్కారమదిలేక
స్త్రీల హింసజేసి చెరుపునొకడు
అక్షరంబులేక యజ్ఞానియౌనొండు
కుటిల జనుల నెపుడు కూడబోకు 3.
ఆడదైనచాలు నది గార్ధభంబైన
చెరచ హితముగల్గు చిత్తకార్తె
కుక్కల వలె నరులు కొందరుందురకట
కుటిల జనుల నెపుడు కూడబోకు 4.
చెనటి పనులుజేసి చేసినకర్మలం
దప్పుకొనగజూచు తక్షణంబు
గోవు ముఖముగలుగు గోముఖవ్యాఘ్రాలు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 5.
కామబుద్ధితోడ కండ్లున్నగ్రుడ్డియై
పెరల కాంత పొందు దొరకజూచు
పాపులుదయమందె భరతభూభారమై
కుటిలజనుల నెపుడు కూడ బోకు 6.
భరతభూమి యందు భాగవతోత్తముల్
జాతిరత్నములుగ జననమంద
కొందరిచటి వారె క్రూరులుగామారె
కుటిలజనుల నెపుడు కూడ బోకు 7.
క్రొత్తవారి నమ్మకూడదనిరి నాడు,
దగ్గరైనబంధు తతులనైన
నేడు నమ్మి చనిన నేరుగ నరకమే
కుటిలజనుల నెపుడు కూడ బోకు 8.
ప్రాణములను దీయ పరమేశునకెచెల్లు
ధరణి నరునకెట్లు ధర్మమగును?
గతుల దప్పుచుండె గర్వాన కొందరు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 9.
తల్లితోడ సమము తనయ యైననుగాని
తనయ పొందు గోరు త్రాస్టులుండి
కామపిచ్చి హెచ్చి కనులమైకము గ్రమ్ము
కుటిలజనుల నెపుడు కూడ బోకు 10.
కామగుణము మదిని కల్గుట సాజమ్ము
మానవులకు మరియు జంతు తతికి
అదియె ముఖ్యమనెడి యడవి పందుల బోలు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 11.
మునులు కొందరపుడు మూర్ఖపుయోచనన్
కామ పీడితులుగ రామచేరె
ఇంద్రుడంతటి ఘనుడింద్రియ లోలుడై
గౌతమముని శాపఘాతమందె
కుటిలజనుల నెపుడు కూడ బోకు 12.
ధర్మజు గెలిచి పర దారను చెరబట్ట
మాయజూదమాడి మామతోడ
కౌరవాగ్రజుండు కష్టాలపాలయ్యె.
కుటిలజనుల నెపుడు కూడ బోకు 13.
ధర్మబద్ధమైన దాంపత్య జీవిక
సారవంతమగుచు సౌఖ్యమిచ్చు
అట్లుగాక నిరత మాలిని నేడ్పించు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 14.
స్త్రీని జూచినంత చిత్తంబు వికలమై
వెఱ్ఱివేషములను వేయుచుండు
నీచుజేర నీకు నిందలె కాన్కలౌ
కుటిలజనుల నెపుడు కూడ బోకు 15.
కీచకాధముండు నీచమనస్కతన్
ద్రుపదరాజపుత్రి ద్రోవది గని
మోహమందు మునిగె మోరకుగా మారి
కుటిలజనుల నెపుడు కూడ బోకు 16.
కౌరవ సభయందు కర్ణుడపుడు, సైగ
తోడ బిల్చి నవ్వె ద్రుపదసుతని
షష్ఠమ పతినౌదు సరదాగ నీకంచు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 17.
విద్యనేర్వ నా రవిజుడు విద్యార్థియై
గురువు చెంత కులము మరుగుపరచె
మోసపూర్ణ గుణము ముప్పును దెచ్చురా
కుటిలజనుల నెపుడు కూడ బోకు 18.
లక్కయింటి నపుడు లక్ష్యంబుగా జేసి
పాండుసుతులకెల్ల పన్నెవలను
కాల్చజూచె రాజు కరుణసుంతయులేక
కుటిలజనుల నెపుడు కూడ బోకు 19.
క్రోధ గుణము మదిని కుంచించి కుంచించి
వ్యాధి పాలుజేసి వ్యధను బెంచు
పరుల నిందతోడ పాపాత్ముగామారు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 20.
కోపమున్నయెడల కూరిమి కష్టంబు
చెలిమికెపుడు వలయు చిత్తశుద్ధి
శ్రీలు కలుగజేయు చిరునవ్వు లేనట్టి
కుటిలజనుల నెపుడు కూడ బోకు 21.
కోట్లు కూడబెట్టి కోపిష్టి యైనచో
గారవించ రెవరు ఘనముగాను
శాంతమొకటె నీకు సంతోష హేతువు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 22.
తామసంబు హెచ్చ తనవారె దూరమౌ
మంచిమాట పెంచు మమత సమత
జీవనంబు సతము జేగీయమానంబు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 23.
సత్వగుణముబెరుగు శాకాహారంబున
మాంసభోజనంబు మదముబెంచు
జీవహింసజేసి జీవింప ధర్మమా!
కుటిలజనుల నెపుడు కూడ బోకు 24.
కరుణ ప్రేమ వలయు కైవల్య సిద్ధికై
వాని పెంచుమయ్య వాసిగలుగ
సాధు దండనమ్ము సకలారిష్టంబగు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 25.
నిగ్రహంబు మదిని నెనరును గల్పించు
ఆగ్రహంబు మదికి హానికరము
పరుషవాక్యములను పలుకకునెప్పుడు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 26.
నీవు నిందపడిన నిందించకెవరిని
నిజము తెలియు పిదప నేరమగును
చెడుగుకైన నెపుడు చేటునుజేయకు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 27.
కోపమధికమైన ఘోరంబులేతప్ప
సత్ప్రయోజనములు జరుగబోవు
మదిని శాంతపరచు మార్గంబుచూడుము
కుటిలజనుల నెపుడు కూడ బోకు 28.
తగని కోపమెల్ల తన శత్రువందురు
సహన మంత్రమెల్ల శాంతి గూర్చు
శత్రుబాధ కన్న సంక్లిష్టమేదిరా
కుటిలజనుల నెపుడు కూడ బోకు 29.
పిసినిగొట్టు గుణము ప్రేమకు దూరమై
స్వార్ధపరత పెరిగి సంఘమందు
గౌరవంబు తరుగు ఘనకీర్తి నశియించు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 30.
లోభమెక్కువైన లోకంబు నిందించు
పదుగురెపుడు బల్కు బాధ కలుగ
అట్టి గుణములేక ఆదర్శుడవు కమ్ము
కుటిలజనుల నెపుడు కూడ బోకు 31.
మనము తిన్నదెల్ల మట్టిపాలౌనురా
ప్రేమ పరుల కిడిన పెరుగు యశము
యశము శాశ్వతంపు హ్లాదంబు నిచ్చురా
కుటిలజనుల నెపుడు కూడ బోకు 32.
పొరుగు మేలు జూచి మోదంబు జెందిన
నీకు మేలు గలుగు నిక్కమదియ
ఈసు జెంద నీకు హృదయంబు చెడునురా
కుటిలజనుల నెపుడు కూడ బోకు 33.
ప్రజల సుఖము కోరి పాలననందింప
నెన్నుకొందురయ్య నేతల నిల
వారియాశలన్ని వమ్ముకానీకుమా!
కుటిలజనుల నెపుడు కూడ బోకు 34.
ఎదగవలయునెప్పుడేరీతినైనను
ధర్మబద్ధమైన దారినడచి
పరుల జెఱచు బుద్ధి పాపాలపుట్టరా!
కుటిలజనుల నెపుడు కూడ బోకు 35.
సంఘజీవనంబు సంతోషమిచ్చును
ఒంటరైన నీకు కంటనీరె
సజ్జనుండవగుచు సాయమ్మునందించు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 36.
గౌరవంబు దక్కు కష్టార్జి తంబైన
ఊరకూర కేది యూడిపడదు
తగిన స్ధాయిలేక దర్పంబుచూపకు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 37.
ఆయుధంబులున్న హ్లాదమ్ముగూర్పవు
ద్రోహబుద్ధి కవియ దోహదాలు
ప్రేమ మనసునిండ ప్రియభావనల్గల్గు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 38.
రావణుండు నిత్య రమణీ విలాసుడై
చెఱనుబట్టె స్త్రీల సిగ్గులేక
పరుల స్త్రీల నట్లు బాధింప పాపంబు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 39.
ఎంత చదువు చదివి యెన్ని నేర్చినగాని
పరుల నిందసేయ పాపమగును
మంచి చెడులనెల్ల మరిమరి పరికించు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 40.
ధనము కొఱకు నీవు తప్పుడు సాక్ష్యంబు
చెప్పవలదు సభల చేటుదెచ్చు
ముద్రపడును కటిక క్షుద్రుడవంచును
కుటిలజనుల నెపుడు కూడ బోకు 41.
మతములెన్నియున్న సతమతమవబోకు
మతములన్ని దెల్పు మానవతనె
నీకు నచ్చనిదని నిందలు వేయకు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 42.
మతము మారవలదు మాననీయుడవైన
సతము వెదకు దాన సారములను
ధనము కొఱకు దారి తప్పుట తప్పురా!
కుటిలజనుల నెపుడు కూడ బోకు 43.
మాట చెల్లుబాటు మాన్యత గల్గించు
మాటమార్చకెపుడు చేటుదెచ్చు
మాట శాశ్వతంబు మానిసికాదురా!
కుటిలజనుల నెపుడు కూడ బోకు 44.
చెట్లుకూల్చివేయ చేటౌను జాతికి
దొంగచాటు గాను దుంగనఱకు
దుష్టయోచనలను తొలగించుకొనుమురా!
కుటిలజనుల నెపుడు కూడ బోకు 45.
అమ్మపాలుద్రావి రొమ్ముగ్రుద్దినయట్లు;
ప్రాణవాయువొసగు పాదపాల
కూల్చబోకుమయ్య క్రుళ్ళిన మనసుతో
కుటిలజనుల నెపుడు కూడ బోకు 46.
తనువు చీల్చియిచ్చు తినపండ్లనిచ్చురా!
నీడనిచ్చి తరువు నిద్రబుచ్చు
అట్టిదాని యుసురు నంతమొందింపకు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 47.
ఆకు కొమ్మ రెమ్మ లద్భుత పుష్పాలు
వేరు కాండములును వివిధగతుల
మందు వోలె నిచ్చు మ్రానుల గూల్చెడు
కుటిలజనుల నెపుడు కూడ బోకు 48.
కాగితాలు చేయు ఘనమైన సంస్థ కు
నొక్క సమిధయైన నుద్భిజంబు
దాని త్యాగమెంచ తరమెయా బ్రహ్మకు?
కుటిలజనుల నెపుడు కూడ బోకు 49.
1. " మధుర భావ తరంగాలు " శతకం
మకుటము :- " మధుర భావ తరంగాలు " ఆంధ్ర సాహితీ లోకంలో శతకమున కొక ప్రత్యేక స్థానం ఉన్నది. శతకము నూరు గాని నూట ఎనిమిది గాని పద్యాలతో ఒక మకుటం కలిగి విషయ భావపూర్ణమై సందేశాత్మకమో, లేక భక్తి కి ఆలంబమో, లేదా ఇతర సమాజ పరమైన విషయమో అయితే అది సమాజానికెంతో ఉపయుక్తంగా ఉండి అనేకానేక విషయములను ముచ్చటిస్తూ, సందేశాత్మకముగ తెలుగు పై అభిమానము, ప్రేమ పెంచుటకొరకు చేసిన ప్రయత్నమే ఈ " తెలుగు వాడ " శతకము. ఇంతకు ముందు ఈ ప్రయత్నం చేసి మార్గదర్శకులైన మహానుభావులెందరో కలరు." ఎందరో మహానుభావులు అందరికి వందనములు". ఇది ఆంధ్ర భాషాభి మానులైన వారు తమ బాలబాలికలకు సులభతరముగ చెప్పుకొనుటకు అనువైన శైలిలో వ్రాయబడినది. దీనిని సద్వినియోగ పరచుకొన గలరని ఆశించుచున్నాను.
ప్రార్ధన :- నాలుకమీద నిల్చి కడు నాట్యము జేయుచు పద్య భావముల్
వేలకు వేలనిచ్చి శర వేగమె బాలల భావి కాంక్షలన్
మేలుగ దీర్పుమంచు వరమిచ్చిన వాణి పదారవిన్దమున్
ఫాలము వంచి మ్రొక్కెదను పాయని భక్తిని జీవితాన్తమున్ .
శ్రీకరమయి నరుల చిత్తంబులలరించు
సూక్తి నిధిని మనము సూక్ష్మ బుద్ధి
ననుభవింప దేశమభ్యుదయంబందు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ!
తెలుగు పలుకు పలుక తేనె లొలుకుచుండు
తెలుగు పాట పాడ తీయనగును
మాతృ భాష కన్న మకరందమేదిరా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 1.
మాతృభాష మాధ్యమంబుగ పఠియింప
స్తన్యమానినట్లు తనియ గలము
లాతిభాష నేర్వ పోతపాలేగదా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 2.
తల్లిపాలు లేని తనయుని జీవంబు
రుగ్మతలకు నెలవు రూఢి ధరణి
మాతృభాష మనకు మధురామృతంబురా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 3.
అన్య భాష నేర్వ యపరాధమన లేదు
సర్వ భాషలెన్న సార యుతము
మనసు హత్తుకొన్న మాతృ భాషయె మిన్న
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 4.
తెలుగు ఘనత దెల్పె ధీరుండు రాయలు
"దేశ భాషలందు తెలుగు లెస్స "
తెలుగు పలుకుబడియె తీయని యనుభూతి .
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 5.
తెలుగు జాతి మనది తేడాలు లేవురా
బాసలన్ని నేర్చి ప్రజ్ఞ జూపు
సంస్కృతంబు తల్లి సర్వ భాషలకును
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 6.
మాతృ సేవకన్న మహిని గొప్పది లేదు
పితరు సేవ మించి ప్రియము లేదు
గురుని సేవ మించు వరమది లేదురా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 7.
ధనము లేని లోటు దాతలు తీర్తురు
గుణము లేని లోటు గురువు తీర్చు
తల్లి లోటు దీర్ప ధాతకు శక్యమా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 8.
అమ్మ మాట తలచ నెమ్మది పులకించు
అమ్మ యొడిని జేర హాయి గొల్పు
అమ్మ సృష్టి యెంత అపురూపమైనదో
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 9.
దేహ బాధ కలుగ దీనత్వముంజూపి
వ్యధను చెంద నరుడు పల్కు"నమ్మ "
యనుచు నామె యెవ్వరపర దైవంబురా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 10.
తల్లిదండ్రుల కృప తాబొంది జయమందె
అన్న కన్న మున్ను హస్తిముఖుడు
పెద్ద వారి సేవ పెన్నిధి గూర్చురా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 11.
డబ్బు లేని వాడు డాంబికు డెట్లౌను
విద్య లేని వాడు విజ్ఞుడెట్లు
తల్లి లేనివాడు తానెట్లు ముదమందు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 12.
తల్లి దండ్రి యెడల తనువుండు దనుకను
ప్రేమ పంచవలెను ప్రియముతోడ
జన్మ ఋణము దీరి జాతకమది మారు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 13.
విద్యలన్ని నేర్పి విజ్ఞత కల్గించు
గురుని పాదరజము శిరము దాల్చ
నంతకన్న ఫలము నవనిని లేదురా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 14.
నిదుర లేచి యెవడు నిష్ఠాంతరంగుడై
గురుని నామ జపము కూర్మి సలుపు
నట్టి వాడు పొందు నఖిల సౌఖ్యమ్ములు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 15.
శిష్యకోటి మతుల చీకట్లు దొలగించి
దివ్య బోధనలను దీప్తు లిచ్చి
ధిషణ జూపు గురువు దేవుని రూపురా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 16.
బాల బాలికాళి బహువిధ శిలలౌను
నూహలెల్ల గురుల యులులు సుమ్ము
ఉన్నత గురు కృషియె యుత్తమ శిల్పాలు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 17.
దైవ దర్శనంబు దయతోడ చేయించి
ముక్తి త్రోవజూపు పుణ్యమూర్తి
గురువు పేర మనకు గోచరించునుగాదె
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 18.
ఎరుక కులజుడైన నేకలవ్యుండు-తా
గురుని దైవమట్లు కూర్మి నమ్మి
విశ్వమందు కరము విఖ్యాతి నార్జించె
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 19.
మైనమట్లు కరగి మహితకాంతుల నీను
గురుని త్యాగ గుణము మరువకోయి
అనుసరించి వాని కానందమీయరా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 20.
తండ్రి పగిది నిన్ను దండించు నొకమారు
తల్లివోలె ప్రేమ తనుపుచుండు
విద్య నేర్పు గురుని వింత వేషాలురా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 21.
సర్వ ప్రాణి కోటి సర్వేశ్వరాధీన
మవని లోన నిదియ అసలు నిజము
నిత్య దైవసేవ నీకెపుడు శ్రేయమౌ
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 22.
దైవశక్తి మించు ధనమది ధర నాస్తి
ఆత్మబలము మించు నాస్తి లేదు
దైవభక్తి కలుగ ధన్యంబు జీవిక
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 23.
శాస్త్రమెంత దెలిసి సర్వంబు తానన్న
దైవబలమె గెలిచె ధరణి యందు
వరమె దాని నంద నరులకు యోచింప
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 24.
పేద సాదలనిన ప్రేమను జూపించి
కరుణ తోడ వారి కాచుటదియ
దైవసేవ యండ్రు ధార్మికు లెల్లరు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 25.
పూవు లెన్ని యున్న పూజ యదొక్కటే
మతము లెన్ని యున్న మంఛి యొకటె
భక్తి యొకటె మనదు భావాలు వేరైన
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 26.
దైవభక్తి వలన తా గెల్చె ప్రహ్లాదు
డసురుడైన తండ్రి నడ్డు కొనుచు
విజయ సాధనంబు విమల భక్తియె సుమ్ము
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 27.
సత్య భాషణమ్ము సర్వులు మెచ్చంగ
పల్కుమయ్య ప్రాణ భయము లేదు
రక్ష సేయ దాని రక్షించు నిన్నెప్డు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 28.
సత్య మొదవు నీకు సన్మార్గ వర్తనల్
భావి జీవితంబు భద్ర పరుప
వీడ బోకు దాని విలువ చెప్పగ లేము
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 29.
సత్య సంధుడిలను నిత్యమ్ము జీవించు
ప్రజల నాల్క లందు పచ్చి నిజము
సత్య మొకటె స్థిరము చంపగా చావదు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 30.
సత్య వాక్కు చేత చంద్ర మతీశుడు
భూరి కష్టములను పొందె నవని
తుదకు సత్య జయమె తోషణ మిచ్చెరా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 31.
పలుకు పలికి మనము పాటింప దగునురా !
పలికి చేయకునికి పలుచనగును
సాధ్య మైన మాట చక్కగ పలకరా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 32.
సత్య జీవనాన సంఘాన మహితుడౌ
సత్య భాషణాన సరసు డగును
సత్య మొకటె చూడ శాశ్వత మౌనురా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 33.
సత్య వాక్కు సర్వ సద్గుణాలయమండ్రు
సత్య వాది పొందు సతము యశము
సత్య గుణ యుతుండు సర్వేశ్వరుండగు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 34.
గ్రంథ మనిన వాణి కమనీయ రూపంబు
దాని జదువ సతము ధైర్య మిచ్చు
శ్రేష్ఠమైన ప్రగతి చేకూర్చు ధరలోన
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 35.
పుస్తకాల పురుగు పూర్వ జన్మమునందు
శాస్త్ర వేత్త యనగ సాహసిన్తు
అట్టి స్ఫూర్తి నంది యనుకరింపుము దాని
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 36.
పుస్తకంబు నీకు పూర్ణ విజ్ఞత నిచ్చు
అగును భూషణంబు హస్త మునకు
మంచి పదును పెట్టు మస్తక శస్త్రంబు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 37.
పేద ధనికులనెడు భేదాలు లేకయే
జ్ఞాన ధనము పంచు కవులు సతము
కవుల కల్పనంబె కమ్మని కావ్యాలు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 38.
గ్రంథ మంత నీవు కలియ త్రిప్పగలేవు
ముందు మాట చదువు ముద్దులొలుక
సారమంత కలదు చక్కగ నద్దాన
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 39.
నిత్య పటన మందు నిండైన జ్ఞానంబు
కలుగు చుండి నీకు ఘనత బెంచు
యశము గూర్చు విద్య హ్లాదంబుగూర్చురా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 40.
నీతి నియమములను నీదైన వర్తనల్
చిన్న నాడె నేర్చి శ్రేయ మందు
మంచి నరున కవియె మణి భూషణంబులు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 41.
మాట లందు తీపి మనసున చేదైన
మంచి కాదు మనకు మచ్చదెచ్చు
మచ్చ లేని వాడె మాన్య తముండురా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 42.
దుష్ట బుద్ధి వలన దు : ఖంబు ప్రాప్తించు
శిస్టు డగుట వలన సిరులు కలుగు
కష్ట సుఖము లన్న కల్పించు కొన్నవే
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 43.
నడక చేతగాక తడబడ సాజమ్ము
నడత చేత గాక చెడుట చేటు
నరున కెపుడు మంచి నడతయే యశమిచ్చు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 44.
నీతి లేని ప్రాణి నిజముగ పశువౌను
పశువు కాక నీవు ప్రజ్ఞ గల్గి
మనుమ మనిషి వోలె మరి మరి యోచించి
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 45.
సార వంతమైన సజ్జన స్నేహంబు
భూరి యశపు శ్రీల పుష్టి గూర్ప
భావి జీవితంబు బంగారు నీకగున్
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 46.
నేటి సంఘ మందు పాటి లేశము లేదు
దుష్టు లైన వారి దురుసు పెరిగె
సజ్జనాళి గూడి సంస్కరిమ్పుము నీవు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 47.
సరళ హృదయ ముండి సరసత మాటాడి
సాటి వారికెపుడు సహకరించు
సజ్జనుం డొకండె సాక్షాత్తు దైవంబు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 48.
సారసాక్షు కృష్ణు సాంగత్య మహిమ చే
శ్రీలు కల్గె కద కుచేలు కపుడ
మంచివారి చెలిమి మంగళ ప్రదమురా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 49.
సుమపు చెలిమి వలన సూత్రంబు రాణించు
సూత్ర ధారణాన శోభనందు
సూత్రబంధమైన సుస్థిర మౌనుగా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 50.
రాగి పైడి జేరి రత్నాల హారాన
విలువ తక్కువైన వెలుగలేదె
మంచివారి చెలిమి మన్నన దెచ్చురా.
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 51.
కష్ట సుఖములందు కలసిన భావాల
మెలగి యుండువారె మిత్రులన
కష్ట మందు నీవు కాలదన్నకు మైత్రి
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 52.
చంద్ర కిరణమట్లు సజ్జన స్నేహంబు
శోభ గూర్చి సతము సుఖము లిచ్చు
మరణమందు గూడ మరువకుమద్దాని
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 53.
రామరాజ్య మనిన రాజ్యంబు రాజ్యంబు
భోజ్యమగును నదియె భువిని జూడ
అంతరాత్మ నడుగ నాదర్శ మయ్యదే
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 54 .
నిన్నుచూచి పరులు నీతి నీమమ్ముగా
ననుకరించి నపుడె యగును నీదు
జన్మ సార్థకంబు జననికి పేరురా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 55.
మంచి చరిత కలుగు మహనీయు లెందరో
పుట్టినారు భరత భూమియందు
అట్టివారె మనకు నాదర్శ మూర్తులౌ
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 56.
పాఠశాలలోన ప్రథముడై నిల్చుచు
గురు ననుగ్రహంబు గూర్మిబొంద
నట్టివాడె సంతతాదర్శ విద్యార్థి
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 57.
అనుసరించుటన్న నవమాన పడబోకు
మంచి త్రోవ జూపు మహితు చరిత
ననుకరించు వాడె యసమాన ధీరుడౌ
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 58.
మంచి మాటలాడి మనసులు లోగొన్న
శిరమువంచి కరము గారవించు
సకల జనులు నీకు సాగిలిమ్రొక్కురా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 59.
సమయ పాలనంబు సజ్జనస్తుత్యంబు
బాల్యమందు దీని భద్రపఱుప
భావి జీవితంబు బంగరుబాటరా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 60.
క్షణము కణము నీవు క్షయము నొందింపక
చదువుసందె సిరులు సంతరించు
కాలచక్రమందు కనలేము గతమును
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 61.
నిత్యజీవనాన నియమనిష్ఠలు లేక
జీవితంబు గడుప చేటుదెచ్చు
బాల్యమందె సమయపాలన జేయరా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 62.
గాంధితాత వంటి ఘననేతలెందరో
కాలమహిమ దెలిసి జ్ఞానులైరి
కరగిపోవ క్షణము మరలిరాదేనాడు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 63.
మతము లెన్ని యున్న మానవత్వమొకటె
కులము లెన్ని యున్న గుణములొకటె
మానవతయు గుణము మహి నేర్వవలెనురా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 64.
కులము మతములన్న కుమ్ములాటలు మాని
సామరస్య దిశను సాగిపొమ్ము
దేశవృద్ధికదియె దీటైన మార్గమ్ము
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 65.
కృష్ణరాయ విభుడు విష్ణుభక్తుండైన
శైవ కవుల ప్రేమ సత్కరించె
భువనవిజయ సభను మోదంబు దీపింప
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 66.
బహుళ మతములున్న భారత దేశమ్ము
వెల్గుచుండె నేడు వివిధ గతుల
మతము కన్న మేలు మమతానురాగముల్
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 67.
నీదు మతమునెంత నిర్మల భక్తితో
గొప్పచెప్పుకొనిన ముప్పులేదు
పరుల మతమునెపుడు పనిబడి దూఱకు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 68.
ఎట్టి కార్యమైన నెదిరించి సాధించి
విజయలక్ష్మి గొనెడు విజ్ఞునెదను
నలమి యుండుగాదె నాత్మవిశ్వాసంబు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 69.
ధైర్యసాహసాలు తనకున్న ధన మంచు
ముందుకేగు వాడె పొందు ఫలము
అట్టి గుండెదిటవె ఆత్మవిశ్వాసంబు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 70.
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 71.
దేశసేవయనెడు స్థిరమైన బుద్ధితో
మనెడువాడె మహిని ; మానవుండు
మంచిమనసుతోడ మరిముందుకేగరా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 72.
తల్లిదండ్రు లనెడి దైవాల నిలపైన
తనదు దేశమనిన తా జూపు ప్రేమను
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 73.
గాంధిజీల వంటి ఘనమైన నేతల,
విశ్వకవిని బోలు విమల మతుల,
చరిత నేర్వ వలయు చైతన్య దీప్తికై
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 74.
తల్లి జన్మ నిచ్చు ధారుణి కైవడి
తండ్రి ధనము నిచ్చు దర్ప మెలర
దేశ మాత నీకు దీప్తిని నిచ్చురా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 75.
చిన్న పువ్వు కోరు చిత్రంపు కోరికన్
భరతమాత పాద పద్మములను
తనదు జన్మ పరమ ధన్యత్వమందగా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 76.
విద్య నేర్పి పంపు విద్యాలయంబులు
జన్మ నిచ్చి పెంచు జనని ప్రేమ
మరచి పోవు వాడు మానవ మాత్రుడా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 77.
దేశభక్తి కన్నదీటై న భావన
స్వామి భక్తి కన్న సద్గుణంబు
మహిని తరచి చూడ మరి కాన రాదురా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 78.
జీవ నదులు ప్రాణి జీవన దాతలై
జాలు వారు చుండు జగతి లోన
పరుల బ్రతుకె తమకు పరమార్థ మంచును
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 79.
ఇలను బుట్టి నట్టి ఫల వృక్ష సంపద
ఫలము లిచ్చి ప్రజకు బ్రతుకు జూపు
కుటజ జాతి పరుల కొరకె చేయురా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 80.
క్షీరమిచ్చి మనకు క్షేమంబు చేకూర్చు
సాధు గోగణముల సన్నుతించు
పరుల మేలుగోర పరమార్ధమయ్యదే
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 81.
మదరు తెరిస యనెడు మానిని తా వచ్చి
కుల మతాల క్రుళ్ళు కూల్చి వైచి
భారతీయులకును బహుళ సేవల జేసె
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 82.
రంతిదేవుడనెడు రారాజు పూర్వంబు
అన్న పానములను అతిధికిడెను
పరుల కొఱకె తాను బ్రతికెను సత్యంబు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 83.
జ్ఞాన ధనము మించు ఘనమైన సంపద
విశ్వమందు లేదు వెదకి చూడ
బాల్య మందె దాని బాగుగ పొందరా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 84.
జ్ఞాన ధనము లవియె కల్పించు విఖ్యాతి
నరుని జీవితంబు పరిడ విల్లు
బుద్ధి బలము తోడ పొందుమా వానిని
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 85.
జ్ఞానధనము నీయ కలుగు వృద్ధి
కనులుతెరచి నీవు కనుమోయి సత్యంబు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 86.
జ్ఞానమునకు నెలవు గ్రన్థాలయమ్ములు
గ్రంథమనగ వెల్గు జ్ఞాన దీప్తి
గ్రంథ పటన మొసగు గంభీర జ్ఞానంబు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 87.
ఒక్క నిమిషమైన నోర్పును గోల్పోక
ప్రగతి నందుకొన్న పట్టుదలను
భావి కాలమంత బంగరు బాటరా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 88.
ఎంత శక్తి యున్న నెదిరింప కుండుటే
సాధు తత్త్వమదియె శాంత గుణము
కలహమున్నచోట కన్నీరె మిగులురా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 89.
కావ్య నాయకుండు కైమోడ్పు లందును
నాయకత్వమునకు నాన్దియే యయ్యది
శాంత వీర సహిత సౌమ్యు డగుట
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 90.
శాంత భాషణంబు చవటల మాటగా
దుష్టులంద్రు జ్ఞాన దూరులగుట
చేవ కలుగు వాడె చింతింప శాంతుండు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 91.
- కృద్దుడైన వాడు కోటి విద్యలు నేర్వ
ఫలము శూన్య మౌను విలువ లేదు
శాంతు చెంత విద్య సన్నుతి గాన్చురా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 92.
శాంత గుణము నేడు సంఘాన మృగ్యంబు
కాన నగును మనకు కధల యందు
నీవు నేర్చిన దాని నిలుపు మిమ్మహినిరా !
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 93.
కష్ట సుఖము లిచ్చు ఘనమైన యనుభూతి
జీవితంబు నందు జీవికెపుడు
కష్ట సహనమందు కలుగురా సత్కీర్తి!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 94.
కష్ట పెట్టి మనల క్రౌర్యాన పాలించె
తెల్లవాడు నాడు తెలివి జూపి
కష్ట సహనమన్దె కల్గె నా స్వేచ్చయే
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 95.
కష్టమెల్ల నోర్చి కాంత ద్రౌపది తోడ
దాగె విరటు చెంత ధర్మజుండు
కాల మెప్పుడొకరి కాలి యందియ కాదు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 96.
తండ్రి యాజ్ఞ దీర్ప తా బోయి నడవికి
రాముడంత వాడె రహిని వీడి
కష్టమైన దాని నిష్టంబు గా జేసె
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 97.
నూరు తప్పిదాల నొనరింప చైద్యుండు
నల్లనయ్య కాచె నయము జూపి
దైవ మైన వాడె దానిని పాటించె
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 98.
చిన్న తనమునుండి చేసిన కష్టంబు
పెద్ద తనములోన పెన్నిధి యగు
కష్టపడిన వాని నిష్టపడును లచ్చి
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 99.
కష్టపడిన వాని కాయంబు దృఢ మౌను
అనుభవంబు పెరిగి హ్లాదమిచ్చు
కష్టపడిన వాడె ఖ్యాతిని గాంచెరా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 100.
కష్టసుఖము లనెడు కావడి కుండలు
ఇష్టమున్న లేక నెదురు వచ్చు
స్వాగతింపు మోయి సాహసంబున నీవు
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 101.
ధర్మ నిరతి లేని దైవ భక్తియె వమ్ము
శాస్త్ర మెరుగలేని చదువు దుమ్ము
సూక్ష్మ బుద్ధి తోడ చూచి యోచించరా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 102.
శాస్త్ర వృద్ధి జరిగి చందమామ ను కూడ
పలుకరించినాము పజ్జ జేరి
చందమామ నరున కందిన పండురా
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 103.
నిత్య జీవితాన నెఱ ప్రయోగమ్ముల
క్రొత్త వస్తువు కనుగొన్న వాడె
సంతసంబు గూర్చు శాస్త్రజ్ఞు డౌను
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 104.
సూక్ష్మ బుద్ధి తోడ చూచు ట తోడనే
పండు క్రింద బడిన ఫణితి నెరిగె
న్యూ టననెడు ఘనుడు నూత్న భావంబుచే
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 105.
గుండు సూది నుండి గొప్ప బాంబు వరకు
మాన వాళి కెపుడు మంచి చేయు
అంత కన్నమనకు నదృష్ట ముండునా!
తెలిసి మెలగుమోయి తెలుగు వాడ 106.
కాశీ విశ్వేశ శతకము.
డుంఢి గణపతి ప్రార్థన.
కాశి విశ్వేశు గూర్చిన ఘన చరిత్ర
అన్నపూర్ణమ్మ గౌరమ్మ అమలకథలు
వ్రాయు సంకల్పమందిన పర్వమందు
ముందు ‘‘డుంఢి గణపతి’’కి మ్రొక్కులిడెద.
(భావము. కాశీ విశ్వేశ్వరుని గొప్ప చరిత్ర, అన్నపూర్ణమ్మ అమల కథలు వ్రాయు శుభదినమున ముందుగా డుంఢి గణపతికి మ్రొక్కులిడెదను. )
ఆది దేవుడు విష్ణుడాయజుడె యైన
కార్య సాఫల్యముంగల్గు కరుణకొఱకు
భక్తి ‘‘డుంఢి గణపతి’’ని శక్తికొలది
పూజ సేతురు జ్ఞానులై ముదముతోడ.
(భావము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ను వారి పనులు విజయవంతమగుటకు డుంఢిగణపతి కరుణకొఱకు జ్ఞానులు శక్తి కొలది సంతోషముతోపూజ చేయుదురు.)
మున్ను గణపతింబూజింప వెన్నుగాచి
విఘ్నతతులెల్ల డుల్చును, వింతగాను
సర్వశుభములు విజయాలు సహజమనుచు
వచ్చి చేరును మనయింట వరుసగట్టి..
(భావము. మొదటగా డుంఢి గణపతిని పూజించిన వెన్నుగాచి విఘ్నములు పోగొట్టును. శుభములు విజయాలు మన యింట తమంత తాముగా వచ్చి చేరును.)
మకుటము. కాశికావాస! పాహిమాం! కామదహన..8.06.23.
1.పావనంబైన కాశికా పట్టణాన!
జీవనంబది సుకృతము జీవికిలను
అట్టి భాగ్యమ్ము మాకిడు మమరవినుత
కాశికావాస ! పాహిమాం! కామదహన!
(భావము. ఏ జీవికైనా పవిత్రమైన కాశీలో జన్మించుట, జీవించుట గొప్ప పుణ్యము. అట్టి భాగ్యము మాకిమ్ము. నిత్యము దేవతలచే స్తుతింపబడువాడా! కాశీ విశ్వేశ! నన్ను రక్షింపుము)
2.జనన మరణాలు మాకిల చక్రమగుచు
తిరుగుచుండును కర్మలు తరుగవెపుడు
కర్మ బంధాలు తెగటార్చి కావుమీశ!..... కాశి..
(భావము. మానవజీవితము జనన మరణాల చక్రములో తిరుగుచుండును. కర్మబంధాలు తరుగవు. అట్టి బంధాలను తెంపి మమ్ములను రక్షింపుము)
3.తెలిసి కొన్నింటి మరికొన్ని తెలియకేను
పాప కర్మలు జేసితి పరమపురుష!
వాని నన్నింటి వేవేగ పరిహరించు.... కాశి..
(భావము. ఓ పరమ పురుషా! తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపాలు చేసితిని. వాటినన్నిటిని తొలగించి కాపాడుము.)
4.భూతి నిచ్చెడు సర్వజ్ఞ! భూతనాథ!
అఘము డుల్చెడు సర్వేశ! ఆర్తినాశ!
అహరహమ్మును మముగావుమాశుతోష!. కాశి.
(భావము. ఓ భూతనాథా!నీవు సర్వ సంపదలిచ్చువాడవు. పాపములు పొగొట్టువాడవు. నిరతము మమ్ము కాపాడుము)
5.నాదు డెందంబు గుడిజేసి నమకచమక
సుస్వరంబుల నుతియింతు సుందరేశ!
నిత్య మభిషేచనంబుల నిష్ఠగొల్తు.... కాశి.
(భావము. నా హృదయమే గుడిగాజేసి నమక చమక స్తోత్రములతో అభిషేకములతో నిష్ఠతో కొలిచెదను. విశ్వేశా నన్ను రక్షింపుము.)
6.వేదములు వ్రాసి విజ్ఞాన వేత్తయైన
వ్యాసుడలనాడు గర్వించ భంగపఱచి
సహన గుణమును నేర్పిన సాంబమూర్తి!... కాశి.
(భావము. విజ్ఞాన వేత్తయైన వ్యాసుడలనాడు గర్వించ గర్వభంగముజేసి సహనగుణమును నేర్పిన కాశీవాస!మమ్ము రక్షింపుము)
7. ఒక్క మారేడు, సరిగంగ చుక్కతప్ప
భోగములతోడి సేవలు యోగగతులు
కోరవెన్నడు భూతేశ! మారహంత!... కాశి.
(భావము. ఒక్క మారేడు దళము, గంగనీరు తప్ప వేరు భోగములను కోరని భూతేశ!మమ్ము కాపాడుము.)
8.భక్త సులభుడవౌచు నే వరమునైన
రక్కసులకేని ముదమార నక్కజముగ
నిచ్చి యాశీస్సులందింతు వీశ్వరయ్య!...... కాశి.
(భావము. రాక్షసులకు కూడ సంతోషముతో వరములిచ్చు భక్తసులభా! మమ్ము కాపాడుము)
9.సర్వసేనాధిపత్యంపు సమరమందు
న్యాయ నిర్ణాయకత్వంపు నయముజూపి
మాత పితరుల సేవయే మాన్యమనిన........కాశి.
(భావము. దేవతలలో సర్వ సేనాధిపత్యము ఎవరికివ్వవలెను? అనుదానిని నిర్ధారణచేయు వేళ మాతాపితరుల సేవ చేసిన వారే అర్హులని చెప్పకనే చెప్పి ఆ పదవి గణపతికే ప్రసాదించినావు. ఈశా! మమ్ము రక్షింపుము.)
10.నిన్ను ధ్యానించు రాముండు, నిర్మలాత్మ,
నీవు రాముని మనమున నిల్పుకొందు
వదియె ‘‘ శివరామ తత్త్వమౌ’’ ఆదిదేవ!....కాశి.
(భావము. నీవు రాముని, రాముడు నిన్ను ధ్యానము చేసికొందురు. ఒకరిపై మరొకరికి అమితమైన భక్తి . అదే శివరామ తత్త్వము. ఈశా! మమ్ము కాపాడుము.)
11.ద్వాదశాఖ్యాత లింగాల వరుసలోన
వాసిగాంచిన పురమది కాశి యనగ
ముక్తి నిలయము జీవికపూర్వ వరము. ....కాశి.
(భావము. ద్వాదశ జ్యోతిర్లింగములలో అతి ముఖ్యమైనది , ముక్తి నిలయము, జీవికి కాశీ నివాసము అపూర్వ వరము. శివా! మమ్ము కాపాడుము)
12.శైవ సంస్కృతి కారాధ్య స్థలము కాశి
ఆలయంబిట నిల్పె ‘‘నహల్యబాయి’’
పూర్వజన్మల పుణ్యంపు ప్రోదిగాగ...........కాశి.
(భావము. శైవసంస్కృతికి ఆరాధ్యస్థలమైన కాశీవిశ్వనాథాలయమును ఆమెపూర్వజన్మ పుణ్యమనగా ‘‘అహల్యాబాయి’’ కట్టించినది. పరమేశా! మమ్ము కాపాడుము.)
13.అంతు లేనట్టి లింగమై యవతరించి
మూలమెరుగు పరీక్షను శూలపాణి!
విష్ణువున కజునకు నీయ విఫలమందె. కాశి.
(భావము. పరమేశా! నీవు అంతులేని లింగమై భూమ్యాకాశాలను ఆవరించి మూలమును కనుగొనుమని బ్రహ్మకు విష్ణువుకు పరీక్ష పెట్టగా బ్రహ్మ విఫలమాయెను. ఈశా! మమ్ము కాపాడుము.)
14.అంతు లేనట్టి శివలింగ మంతు దెలియ
నీరజాక్షుండు కనలేని నిజము బలికె
బ్రహ్మ మాత్ర మసత్యమ్ము బలికినాడు. కాశి.
(భావము. పరమశివుని మూలమెఱుంగు విషయమున కష్టమని నిజము చెప్పి విష్ణవు స్తుతింపబడినాడు. అసత్యము పలికి బ్రహ్మ శాపము పాలయ్యెను. ఈశా! మమ్ము కాపాడుము.)
15.దాన కోపించి బ్రహ్మకు తలను నరికి
పూజకర్హత నీవింక పొందవనియె
మురళినాథుండు పూజలు పొందుచుండె. కాశి.
(భావము. బ్రహ్మ అసత్యము పలికినందులకు తలనరికి ‘‘ నీకు పూజార్హత లేదు. గుడులుండవు’’అని తెల్పితివి. ( కనుకనే బ్రహ్మ ఇపుడు చతుర్ముఖుడు) స్తుతింపబడిన విష్ణువునకు యథావిథిగా పూజలు జరుగునని తెల్పితివి. ఈశా! కాపాడుము.)
16.వారణాశికి ప్రభువైన వామదేవ!
పంచ యోజన పరిధికి పాలకుండ!
ఆర్త రక్షక! దురితారి! యాదిదేవ!... కాశీ.
(భావము. నీవు వారణాసికి , పంచయోజన పరిధి( 10 మైళ్లు పరిధిలో మరణించిన వారికి మోక్షమిచ్చువాడు) పాలకుడవు..శివా ! మమ్ము కాపాడుము)
17.గోవులాగ్రహింపవు, గ్రద్దగుంపులేదు
శవము శివమౌను, చెడ్డ వాసనయురాదు
ఇద్ది నీ మహిమో పరమేశ! ఈశ!.. కాశి.
(భావము. కాశీయందు గోవులు పొడవవు. గ్రద్డల గుంపులుండవు. శవము కూడ శివమౌతుంది. శవము వాసన రాదు. ఇదే ఇచటి మహిమ. శివా ! మమ్ము కాపాడుము)
18.పుష్పముల్ సుగంధములీవు, ముక్తిజెందు
పంచ యోజన వాసుల ప్రాణితతికి
చెవికి తారక మంత్రంబు చేరు కతన. కాశి.
(భావము. పుష్పములకు సువాసనలుండవు. ఇచట మరణించిన వారికి తారక మంత్రోపదేశము చేసెదవు. శివా ! మమ్ము కాపాడుము)
19.‘‘ దాతరు కవురు’’ ఆలయ పూత కొఱకు
స్వర్ణమందించె బారువు వాసి గలుగ
నీదు ప్రేరణే కతమౌను నీలకంఠ! ... కాశి.
(భావము. ఓ నీలకంఠా! నా ప్రేరణతోనే ‘‘ దాతరు కౌరు’’అను నతడు ఆలయమునకు బంగారు పూత పూయుటకు ఒక బారువు బంగారమునిచ్చెను. శివా ! మమ్ము కాపాడుము)
20.‘‘ రఘుజి భోంస్లె ’’ యన్ భక్తుండు రజితమిడెను
‘‘ రాణ’’ యనువాడు నంది విగ్రహము నిచ్చె
భక్తి తత్త్వంబు త్యాగంబు పరమవరము... కాశి.
(భావము. భక్తి తత్త్వముతో ‘‘రఘుజి భోంస్లె’’ అను భక్తుడు వెండిని, ‘‘రాణ’’యను భక్తుడు నంది విగ్రహమునిచ్చెను. ఈ త్యాగ గుణము నీ మహిమే కదా. శివా ! మమ్ము కాపాడుము)
21.కాశిలోపల శవమైన కాయమునకు
దక్షిణపు వైపు కర్ణంబు తరచిజూడ
పైకి మాత్రమె యుండునన్ వాసిగలదు. కాశి.
(భావము. కాశీలో మరమణించిన వారి కుడి చెవి పైకి ఉండునని లోక ప్రసిద్ధి. ఇదియును నీ మహిమే. శివా ! మమ్ము కాపాడుము)
22.‘‘ రామకృష్ణ పరమహంస ’’ రక్తిదనర
జీవి చెవిలోన రామంబు జేర్చుశివుని
కంటి నేనంచు బల్కెను ఘనముగాను. కాశి.
(భావము. కాశీలో మరణించిన వారి చెవిలో శివుడు తారక మంత్రముపదేశించుచుండగా నేను స్వయముగా చూచితినని రామకృష్ణ పరమహంస చెప్పిరి. శివా ! మమ్ము కాపాడుము)
23.జీవి కాశిని సద్భక్తి చేరినంత
చిత్రగుప్తుని లెక్కలు చెరిగిపోయి
కాలభైరవు పరమయి హేలవీగు. కాశి.
(భావము. కాశీ పట్టణమును చేరగనే వారికి సంబంధించిన పాపపుణ్యముల జాబితా చెరిగిపోయి తెల్లని కాగితముగా కాలభైరవుని చెంతకు చేరును. ఇదియును నీ మహిమే. శివా ! మమ్ము కాపాడుము)
24.కాశిలోపల జేయు దుష్కార్యములను
పుణ్యకార్యాలు ద్విగుణంపు గుణ్యమగును
అన్య మనమున నైనను అఘములేక
శంభు పాదాలు పట్టుట సౌఖ్యదమ్ము. కాశి.
(భావము. కాశీ పట్టణమునజేయు పాప పుణ్యములు రెండు రెట్ల ఫలితమిచ్చును. పుణ్యకార్యములే గాని తెలియక కూడ పాపములను తలపెట్టరాదు.. శివా ! మమ్ము కాపాడుము)
25.పాప పరిహారమును జేయు భర్గు డిచట
అన్న పానీయముల జూచు నన్నపూర్ణ
కన్న ప్రేమను జూపించి కాచు గౌరి. .. కాశి.
(భావము. కాశీ విశ్వేశుడు పాపములను పోగొట్టును.అన్నపూర్ణ ఆకలి దీర్చును. గౌరి కన్న ప్రేమను చూపించును. శివా ! మమ్ము కాపాడుము)
26.తండ్రి దక్షుడు పార్వతిన్ దలచకున్న
మనసు నిలువక చని యవమానపడిన
భార్య కై మహోగ్రుడవైన పార్వతీశ!.. కాశి.
(భావము. పార్వతీదేవి పిలువని పేరంటముగా తన తండ్రి చేయు యజ్ఞము (దక్షయజ్ఞము) నకు వెళ్లి పరాభవింప బడెను. దానిని సహించలేని నీవు మహోగ్రుడవైతివి. శివా ! మమ్ము కాపాడుము)
27.లోక కల్యాణమునకునై సాకులేక
గరళమంతయు మ్రింగిన ఘనుడవీవు
అంబ మాంగల్య బలమును నరసినట్టి. కాశి.
(భావము. లోక కల్యాణమునకై పాల సముద్రమున పుట్టిన కాలకూట విషమును కంఠమున దాచినావు. గౌరి మాంగల్య బలమెంతటిదో గదా!. శివా ! మమ్ము కాపాడుము)
28.కంఠమందున గరళంబు కదలకుండ
ఉంచి లోకాల రక్షించు నున్నతుండ
సర్వమంగళ హృదయేశ! శంకరుండ!.. కాశి.
(భావము. పార్వతీశా! నీవెల్లప్పుడు కంఠమునందే విషముంచి లోకాలను రక్షించెదవు. శివా ! మమ్ము కాపాడుము)
29.అర్ధ ముకుళిత నేత్రాల అందమొదవు
తపము సేతువు సతతంబు తన్మయుండ
ఏమి యాశింతువయ్య? నిష్కామి వగుచు. కాశి.
(భావము. నీవు నిరంతరము సగముమూసిన కన్నులతో యోగివై తన్మయత్వముతో తపము చేయుదువు. నీవు కోర్కెలు లేని వాడవు కదా. శివా ! మమ్ము కాపాడుము)
30.మనసు చాంచల్య మందగ ‘‘మారు’’జంపి
కారణముదెల్ప ‘‘రతి’’కిని కరుణజూపి
భూత పతివైన నీకిల మ్రొక్కులిడుదు. కాశి.
(భావము.మన్మధబాణమునకు నీ మనసు చెదరగా దానికి కారణమైన ఆతని చంపితివి. ఆతని భార్య రతీదేవి భర్త ప్రాణములు కాపాడుమని కోరగా రక్షించితివి. శివా ! మమ్ము కాపాడుము)
31.ఆ భగీరధు ప్రార్ధనలాదరించి
శిరముపై సుర గంగను జేర్చుకొనిన
పరమ పావన మూర్తి శ్రీ పార్వతీశ!.. కాశి.
(భావము. భగీరథుడు గంగను భూమికి తెచ్చు ప్రయత్నములో నిన్ను ప్రార్థించగ సంతోషముతో తలపై ధరించితివి. నీవు గొప్ప కరుణామూర్తివి. శివా ! మమ్ము కాపాడుము)
32.నీదు నాట్య విన్యాసాల నియతి వలన
ఢమరుకధ్వను లయిఉణులమరమగుచు
సంస్కృతంబున మూలమై శాస్త్రమయ్యె. కాశి.
(భావము. నటేశా! నీవు నాట్యము చేయువేళ ఢమరుకము నుండి ‘‘అయిఉణ్ , అరులుక్’’ అను నాదములు పుట్టినవి. అవి హిందువుల వ్యాకరణ సంస్కృత సూత్రములకు మూలమయ్యెను. శివా ! మమ్ము కాపాడుము)
33.అర్ధనారీశు తత్త్వంబు హర్షణీయ
మౌచు ప్రేమకు స్థానమై యందగించు
నంచు చూపించును మహేశ! యమరవినుత! కాశి
(భావము. స్వామీ ! నీవు పార్వతి చెరి సగమై అర్ధనారీశు తత్త్వమే గొప్పయని , ప్రేమకు అదే మూలమని చాటితివి. శివా ! మమ్ము కాపాడుము)
34.‘‘అన్న’’మనునది ‘‘మాయ’’గా హరుడు పలుక
అట్టి మాటకు కోపించి యంబ వెడలె
కాశి జనులెల్ల క్షుద్బాధ కంపమంద. కాశి.
(భావము. నీవు పార్వతి మాట్లాడుకొను సమయమున ‘‘ అన్నమనునది ఒక మాయ’’ అని నీవు పలుక పార్వతి కోపించి కాశీ వదలి వెళ్లిపోయినది. కాశీవాసులు అన్నములేక అల్లాడుచుండుట గమనించి దయతో అమ్మ అన్నపూర్ణమ్మగా వచ్చినది. .శివా ! మమ్ము కాపాడుము)
35.అన్నపూర్ణమ్మ చెంతకు నాదరాన
నేగు నిత్యంబు భిక్షకై ఈశ్వరుండు
భక్త వరదుండు కాశికా వాసుడతడు. కాశి.
(భావము. నీవుసైతము ఆనాటినుండి అన్నపూర్ణ వడ్డనతోనే భోజనము చేయుచుంటివి.శివా ! మమ్ము కాపాడుము)
36.రాత్రివేళ గంగమ్మ హారతిని జూడ
జన్మ జన్మల పాపాలు సమసిపోయి
సార్ధకంబగు పుట్టుక జగతి లోన. కాశి.
(భావము. కాశీలో గంగాహారతి దర్శనము జన్మ జన్మల పాపములను పోగొడుతుంది. జన్మ సఫలమౌతుంది.శివా ! మమ్ము కాపాడుము)
37.దీపకాంతులు జ్ఞాన ప్రతీకలగును
మౌఢ్య దుర్భావ తిమిరాలు మాసిపోవు
జ్ఞాన మార్గంబె ముక్తి సోపానమగును. కాశి.
(భావము. గంగానదికి సమర్పించు దీపకాంతులు జ్ఞానానికి ప్రతీకలు. అజ్ఞానమను చీకటిని పారద్రోలును. జ్ఞానమే ముక్తికి హేతువు. శివా ! మమ్ము కాపాడుము)
38.మంగళాదేవి ఇచ్చోట మాన్యమూర్తి
సర్వ మంగళ రూపంబు శక్తిరూపి
కామితంబులు దీర్చెడు కల్పవల్లి! కాశి.
(భావము. ఇచట గల మంగళాదేవి శక్తి స్వరూపిణి . కోర్కెలను దీర్చు కల్పవల్లి. శివా ! మమ్ము కాపాడుము)
39.‘‘బిందుమాధవు ’’డిచ్చట ప్రేమమూర్తి
శ్రేష్ఠ మణికర్ణికా కుండ సృష్టి కర్త
సర్వ దేవతా వందిత చక్రవర్తి. కాశి
(భావము. శ్రేష్టమైన మణికర్ణికా సృష్టికర్త ‘‘బిందుమాధవుడు’’ప్రేమమూర్తి. సమస్త దేవతలచే స్తుతింపబడువాడు. శివా ! మమ్ము కాపాడుము)
40.శక్తి పీఠాన శోభిల్లు శర్వురాణి
కాశిలో విశాలాక్షియై వాసిగాంచె
ద్వివిధ శిల్పాల తేజమై స్థిరముగాను. కాశి.
(భావము. శక్తి పీఠాలలో నొకటిగా వెలుగొందు విశాలాక్షి రెండు శిల్పాలుగా నుండును. ఒకటిస్వయంభువు.రెండవది ఆదిశంకరులు స్థాపించినది. శివా ! మమ్ము కాపాడుము)
41.సకల లోకాల జీవులు సౌఖ్యమంద
మాన్య కారుణ్య మూర్తియై మమతపంచ
రాగపూర్ణ విశాలాక్షి రక్షయయ్యె. కాశి.
(భావము. సకలలోకాల ప్రాణులకు సుఖభోగములనిచ్చు మాతయే విశాలాక్షి. ఆమెదయామయి. శివా! మమ్ము కాపాడుము)
42.కాశిలో నవరాత్రి సత్కార్యచరణ
జన్మరాహిత్య హేతువై చనును యనిన
ఇచటనే పుట్టి పోయిన నెంత ఫలమొ?. కాశి.
(భావము. కాశీలో నీపై సంపూర్ణమైన భక్తితో నవ రాత్రులుండిన మోక్షము కలుగునందురు.. మరి అచటనే పుట్టి మరణించిన ఎంత ఫలము కలుగునో కదా!. శివా! మమ్ము కాపాడుము)
43.భావి కాలాన ప్రళయముల్ ప్రజ్వలింప
నాశమై తీరు సర్వంబు కాశి తప్ప
దాని ప్రాశస్త్య మట్టిది ధరణియందు. కాశి.
(భావము. భావికాలములో ప్రళయము వచ్చి ప్రపంచమంతయు మునిగిపోయినను కాశీ మాత్రము మునిగిపోదు. నీ మహిమ ఎంత గొప్పదో కదా!. శివా! మమ్ము కాపాడుము)
44.నదుల లోపల నత్యంత నతులనందు
నదియె గంగమ్మ ప్రత్యేక నడకతోడ
ఉత్తరమునకు బయనించు నురకలెత్తి. కాశి,
(భావము. నదులన్నిటిలో అతిపవిత్రమైనది గంగానది. అది ఒక ప్రత్యేకతతో ఉరకలెత్తుచు ఉత్తరవాహినియై ప్రవహించును. శివా! మమ్ము కాపాడుము)
45.శివుని జూటాన సుడులతో చిక్కుకొన్న
గొప్ప పావిత్ర్య మందుచు మెప్పువడసె
పాప హారిణి యను పేరు ప్రథితమయ్యె. కాశి.
(భావము. శివుని జటాజూటములో నిరంతరము సుడులు తిరుగు గంగయెంతో పవిత్రత గలిగి కలుషహారిణిగా పేరు గాంచెను. శివా! మమ్ము కాపాడుము)
46.నాడు నేడని లేకయే కాడుకాలు
సర్వకాలము లందును,శవము వెంట
శవము ‘‘మణికర్ణికా’’ ఘాటు, శివమెయచట. కాశి.
(భావము. కాశీ ఘాట్ లలో ఈరోజు ఆరోజు అని లేక ఇరువదినాలుగు గంటలు , మూడువందల అరువది యైదు రోజులు చితి మంటలు వెలుగుచునే యుండును. మణికర్ణికా ఘాట్ నందు మరీ ప్రత్యేకము. శివా! మమ్ము కాపాడుము)
47.శ్వాస ఉన్నంత కాలము శంభు పాద
సేవ, దాన ధర్మాంచిత చింతనంబు
కలిగియుండుట శ్రేయంబు కలియుగాన. కాశి.
(భావము. జీవి శ్వాస యున్నంత కాలము శంభు పాదముల సేవించుట , ధర్మవర్తనము కలిగియుండుట శ్రేయస్కరము. శివా!మమ్ము కాపాడుము)
48.మాత వారాహి రక్షణన్ మాన్య కాశి
వాసులెల్లరు ధన్యులై వాసిగనిరి
అట్టి భూమిని జన్మింప నమిత వరము. కాశి.
(భావము. వారాహిమాత రక్షణమున కాశి యున్నది. అచటివారు ధన్యలు. అచట పుట్టుట పూర్వజన్మ సుకృతము. శివా!మమ్ము కాపాడుము)
49.సత్య ధర్మాల కొఱకునై సతినిసుతుని
రాజ్య భోగాలు త్యజియించు రమ్యగుణుడు
సూర్య వంశ హరిశ్చంద్ర శూరుడొకడె కాశి.
(భావము. సత్య ధర్మాల కొఱకు సమస్తము కోల్పో యిన సూర్యవంశశ్రేష్ఠుడు సత్య హరిశ్చంద్రుడు నిరంతరము స్మరణీయుడు. శివా!మమ్ము కాపాడుము)
50.కాశి గంగను రామేశు కడకుదెచ్చి
శివున కభిషేక మొనరించి చిత్తమలర
అచటి యిసుకను గంగలో నార్షమంత్ర
పూతముగ గల్ప యాత్ర సంపూర్ణమగును. కాశి.
(భావము. కాశీలోని గంగను తీసికొని వెళ్లి రామేశ్వరమున శివునకు అభిషేకము చేయుట, రామేశ్వర సముద్రము నందలి ఇసుకను దెచ్చి శాస్త్రోక్తముగా కాశీ గంగలో కలుపుట తీర్ధయాత్రా సంపూర్ణముగా తలతురు. శివా!మమ్ము కాపాడుము)
51.సంస్కృతంబున చర్చల సారమంద
పరమ పండితు లున్నట్టి వారణాశి
యందె తేల్తురు నిగ్గును నమిత నిష్ఠ. కాశి.
(భావము. సంస్కృత వ్యాకరణ చర్చలలో నిగ్గు తేల్చుటకు కాశీ పండితులనే ఎంచుకొందురు. కాశీ పండితుల పాండిత్యము ప్రపంచ ప్రఖ్యాతము. శివా!మమ్ము కాపాడుము)
52.కాశి సంస్కృత పీఠమ్ము వాసిగాంచె
సర్వ విద్యలు బోధించు శారదాంబ
మారు రూపంబు లిచ్చట మసలుకతన. కాశి.
(భావము. కాశీ సంస్కృత పీఠము గొప్ప ప్రసిద్ధి నందినది. అందుగల పండితులందరు అపర శారదామూర్తులే. శివా!మమ్ము కాపాడుము)
53.శంకరాచార్య రూపివై సారహీన
సంసరణమే యిదంచును సంస్కృతమున
అపుడు "నహి నహి రక్షతి"యంటివీవు. కాశి
(భావము. శివా నీవు ఆది శంకరుని రూపాన జన్మించి సంసారము సారహీనమని అందులో పడి కొట్టుకొనుట అవివేకమని చెప్పుచు గొప్ప శాస్త్రములెన్ని చదివినను చివరకు రక్షించునది ఆత్మజ్ఞానమే . అది లేనివారిని ఎవరుని రక్షింపరని తెలిపినావు. శివా!మమ్ము కాపాడుము) .
54.కటిక దారిద్ర్యమందున కాంతయోర్తు
ఆమలక దానమీయగ నార్తిజెంది
‘‘ కనకధారా స్తవమ్ము’’న గాచినావు. కాశి
(భావము. ఆదిశంకరుల రూపముననున్న నీకు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఎండిపోయిన ఉసిరికాయను దానమీయగా నీవు జాలిపడి కనకధారా స్తవముతో లక్ష్మీదేవిని స్తుతించి యామెకు గొప్ప సంపదలను కూర్చినావు. శివా!మమ్ము కాపాడుము) .
55.అమ్మ పూజకై స్నానంబు నాచరింప
ప్రేమ నాపగ నింటికి బిల్చినావు
అమ్మ కష్టంబు గ్రహియించు నాదిపురుష! కాశి.
(భావము. నీ తల్లిగారు నదికి స్నానానికి వెళ్లలేని స్ధితిలో నదినే యింటికి రప్పించినావు. అమ్మ కష్టమును గ్రహించిన దయామయా! శివా!మమ్ము కాపాడుము)
56.సంతస మరమోడ్పు కనుల చింతలేక
చిన్ని నవ్వులు చిందించు చిద్విలాస
భాసమానత నుండు నీ భావమేమి? కాశి.
(భావము. ఏ చింతయు లేక అరమోడ్పు కన్నులతో చిరునవ్వు చిందించెదవు. . ఆ చిరునవ్వు లోని భావమేమి? శివా!మమ్ము కాపాడుము)
57.మనసుతో జూచి ప్రాణుల మంచి చెడులు
తీర్చుచుందువు తీరుగా ధిషణతోడ
మౌన ముద్రను దాల్చిన మాననీయ! కాశి.
(భావము. మౌన ముద్రను దాల్చిన మాననీయా!ప్రాణుల మనోభావములను గ్రహించి వారికి తగిన వరములను ఇచ్చెదవు. శివా!మమ్ము కాపాడుము)
58.బూది స్నానాలు, భుజగాల భూషణాలు
నొసటి మంటల తిలకాలు నుఱగలెగయు
గంగ పొంగుల నీ రూపు గౌరినాథ!
పొగడ నేపాటి వాడ! నే పొన్నెకంటి. కాశి.
(భావము. విభూతి స్నానాలు, పాముల ఆభరణాలు, నొసటనున్న మంటల తిలకాలు, తలపై నురగలు గ్రక్కు గంగమ్మ, గౌరీనాథా! ఎంత అందగాడివో!నే పొన్నెకంటి ని నిన్నేమి పొగడగలను?)
59.పార్వతీ దేవి తపియించి భక్తి తడిసి
నిన్నె కోరెను వరునిగా నీలకంఠ!
ఏమి మాయను పన్నితో ఈశ్వరయ్య! కాశి.
(భావము. పార్వతీదేవి నీకై ఘోరతపము చేసినది. ఏమి మాయను పన్నితివో! మమ్ము కాపాడుము.)
60.వరుడు నచ్చగ కావలె వైభవాలు
అందచందాలు, వంశంపు టధిక స్థితులు
బంధు బలగాలు, ప్రేమ సంబంధములును
అమ్మ కేలాగు నచ్చితో అసలు నిజము
చెప్పు మయ్యరో భువనేశ! చిద్విలాస! కాశి
(భావము.వధువునకు,వరుడునచ్చవలెనన్న సిరిసంపదలు,అందాలు,వంశగౌరవము,బంధువర్గము,ప్రేమలు కావాలి. ఇవి ఏవియు లేని నీవెలా అమ్మకు నచ్చావో అసలు నిజము చెప్పుము. మమ్ము కాపాడుము. )
61.అవతరించె నల్దిశలను నాది శక్తి
శక్తి పీఠాల పేరున శస్తినంది
వారణాశిన్ ‘‘ విశాలగ’’ వాసిగాంచె. కాశి
(భావము. ఆదిశక్తి నల్దిశల శక్తిపీఠాల పేరున వెలసినది. అందులో నొకటి వారణాసిలో విశాలాక్షి గా వెలసినది. శివా!మమ్మ కాపాడుము..)
62.దక్షిణంబున బహుళాక్షి, తనరె పశ్చి
మమున మీనాక్షి, కంచి కామాక్షి యనగ
భక్తులంగావ ప్రభవించె శక్తి తాను. కాశి
(భావము. దక్షిణ దిక్కున బహుళాక్షిగా, పశ్చిమమున మీనాక్షి గా, కంచికామాక్షిగా భక్తులను కాచుటకై వెలసెను. శివా!మమ్మ కాపాడుము)
63.ఆది శక్తియె సతతంబు హర్షదాయి
ఆది శక్తియె జీవికి నమిత శక్తి
ఆది శక్తియె ముక్తికి వేదికగును. కాశి
(భావము. మనకు ఎల్లప్పుడు సంతోషమును,శక్తిని,ముక్తిని ఇచ్చునది ఆదిశక్తియే. శివా!మమ్ము కాపాడుము.)
64.స్వయముగా విశాలాక్షియె వరలె నిచట
ప్రథమముగ, శంకరాచార్య వర్యుడామె
నమిత భక్తిని నిల్పెను హర్షమొదవ
రెండు రూపాలు దర్శింప పండువగును. కాశి
(భావము. కాశీలో శక్తిపీఠముగా మొదట విశాలాక్షి వెలసినది. తదుపరి ఆదిశంకరులు రెండవ శిల్పమును ప్రతిష్ఠ చేసెను. ఇద్దరు మాతలను దర్శించు భాగ్యము మనకు కలిగెను. శివా!మమ్ము కాపాడుము.)
65.కాశికా పురి రక్షింప కదలి రేయి
తెల్ల వారకె ‘‘ వారాహి’’ తిరిగి వచ్చు
భక్త తతి నుండి పూజల బడయు కొఱకు. కాశి
(భావము. కాశీని రక్షించుటకై వారాహి అమ్మవారు రాత్రి వేళ వెళ్ళి మరల పూజలకొరకు తెల్లవారుజామున వచ్చును. శివా!మమ్ము కాపాడుము.)
66.కోరగ వసిష్ఠ సన్ముని భూరి కరుణ
వెలసె ‘‘ కేదార ఘాటు‘‘న విశ్వనాథు
డవని ‘‘ కేదార లింగమై ’’యద్భుతముగ. కాశి.
(భావము. వశిష్ఠ మహర్షి కోరిక మేరకు విశ్వనాథుని అపార కరుణ వలన కేదార ఘాటున కేదార లింగమై వెలసినది. శివా!మమ్ము కాపాడుము.)
67.సప్త రుషులకు మారుగా స్వామిచెంత
అచట నుందురు భక్తిమై యయ్యవార్లు
సప్త సంఖ్య హారతు లీయ సర్వ శుభము. కాశి
(భావము. విశ్వేశ్వరుని చెంత అభిషేకము చేయుటకు అయ్యవార్లు ఏడుగురు కలసి సప్తరుషి హారతి పేరున సప్త హారతి నిత్తురు. పరమేశా మమ్ము కాపాడుము.)
68.సకల లోక నాయకుని సంస్పర్శనంబు
దర్శనంబున నర జన్మ ధన్యమగును
అందు కాశి వాసుని స్పర్శనంద శుభము. కాశి
(భావము. లోకనాయకుని భక్తులు తాకుట ఎంతో అదృష్టముగా భావింతురు. అందునా కాశీ విశ్వేశుని దర్శించుట భక్తితో తాకుట పూర్వజన్మ సుకృతము.పరమేశా మమ్ము కాపాడుము.)
69.పరమ భక్తుల , మౌనుల, మహిత వరుల
దర్శనముజేయ పుణ్యంబు తనరుచుండు
ఈశు పాదాలు స్పృశియింప నెంత ఫలమొ?. కాశి
(భావము. పరమ భక్తుల గొప్పవారి దర్శనము చేయుట వలన పుణ్యము వచ్చును.. మరి కాశీ విశ్వనాథుని స్పర్శ వలన వచ్చు పుణ్యము అనూహ్యము..పరమేశా మమ్ము కాపాడుము.)
70.‘‘ బిందుమాధవు’’ నిర్మించె భృగువు మౌని
గంగ, యమున, సరస్వతీ, సంగమమున
ధూపపాపయు, కిరణను నాపగలిట
పంచగంగ ఘాటుగ నిల్చె నంచితముగ. కాశి
(భావము. భృగు మహర్షి బిందుమాధవమును నిర్మించెను. అది గంగాయమున సరస్వతీ ధూపపాపయు, కిరణ అను పంచ నదుల సంగమమై పంచగంగ యైనది. పరమేశా మమ్ము కాపాడుము.)
71.గవ్వలమ్మ రెండవ పేరు కౌడిదేవి
శివుని చెల్లిగ ప్రఖ్యాతి చెందె నీమె
ఐదు గవ్వలామెకు భక్తి నందజేయ
సరిగ మనకౌను నొకటి ప్రసాదముగ. కాశి
(భావము. గవ్వలమ్మ రెండవ పేరు కౌడీదేవి. ఈమె శివుని సోదరిగ ప్రఖ్యాతి చెందినది. ఈమెకు ఐదు గవ్వలు భక్తితో సమర్పించిన అచటి అయ్యవారు మనకు ప్రసాదముగ ఒక గవ్వను ఇచ్చెదరు. పరమేశా మమ్ము కాపాడుము.)
72.కౌడిమాత దర్శనమది కాకయున్న
యాత్ర సఫలము కాదని యనెను భవుడు
కాన భక్తులు భక్తిమై కనగ వలయు. కాశి
(భావము. గౌడీమాత దర్శనము కాకయున్న యాత్ర సఫలము కాదనుచు శివుడు పలికెను. కావున భక్తులు తప్పక ఆ మాతను దర్శించుకొనవలెను. పరమేశా మమ్ము కాపాడుము.)
73.భరత దేశాన నదులెన్ని పారుచున్న
తూర్పు పడమర దిక్కులై దుముకుచుండు
కాశి మున్నగు ప్రాంతాల గంగ యొకటె
ఉత్తరపు వాహినిగ పారు ఉరకలెత్తి. కాశి
(భావము. భారతదేశాన పారుచున్న నదులన్నియు తూర్పునుండి పడమరకు పారుచుండును. కాశి మున్నగు ప్రాంతాలో గంగ మాత్రమే ఉత్తరపు వాహియై పారుచుండును. పరమేశా మమ్ము కాపాడుము.)
74.శివుని వాసంబు ఉత్తర శిఖరమగుట
గంగ పొంగును ఉత్తర గామి యగుచు
భర్తృపాదాలు కడుగంగ భక్తితోడ. కాశి
(భావము. పరమ శివుడు ఉత్తరశిఖరమైన హిమాలయములలో నుండుట వలన గంగ పొంగుచు, భర్త పాదముులు తాకుటకై ఉత్తరగామి యైనది. పరమేశా మమ్ము కాపాడుము.)
75.శూలి శూలాగ్రమందున శోభనంది
పంచగంగలు వరుణాశి ప్రముఖనదులు
కలసియుండిన క్షేత్రమే కాశియగును. కాశి
(భావము. శూలి యొక్క శూలాగ్రముతో శోభనందుచు పంచగంగలు, వరుణ అశి ప్రముఖ నదుల కలయికచే ఆ ప్రాంతము కాశీ క్షేత్రముగా ప్రశిద్ధిగాంచినది. పరమేశా మమ్ము కాపాడుము.)
76.చిన్ని బాలుడు క్రీడగా చేతితోడ
లీల భూమి త్రవ్విన నందు లింగముండు
పాలకేడ్వ నా శబ్దంబు పరమ శివము. కాశి
(భావము. కాశీ లోని ప్రతి అణువున ఏ పసిబాలుడైన ఆట కొరకు నేలను త్రవ్వగా అచటి శివలింగము ప్రత్యక్షమగును. ఆకలితో పాలకేడ్చిన ఆ శబ్దము శంఖనాదమై పరమ శివమగును. పరమేశా మమ్ము కాపాడుము.)
77.శివ మయంబును, కాశి కేశవము గూడ
కేశవుండును పరమ సర్వేశుడొకడె
భేద భావాలు మతత్త్వ ఖేదమేల?
భక్తి యొక్కటె చాలు నెవ్వారికైన. కాశి.
(భావము. కాశీ క్షేత్రము కేవలము శివమయమే కాక కేశవమయము కూడ. వారికే లేని భేద భావాలు మనకేల? భక్తి ఒకటే ముక్తి మార్గము. పరమేశా మమ్ము కాపాడుము.)
78.మహ్మదీయ ప్రభువులు దుర్మదముతోడ
కొందరేనాటి నుండియో క్రోధమునను
పగనుబట్టిన త్రాచులై పజ్జనుండి
కాటువేసిరి సిరితూగు కాశినపుడు. కాశి
(భావము. ఆనాటి మహమ్మదీయ ప్రభువులు దుర్మదముతో క్రోధముతో పగబట్టి న త్రాచుల వలె కాశీని కాటువేసిరి. పరమేశా మమ్ము కాపాడుము.)
79.కాశివాసులు తినినట్టి గరళమంత
దివ్య సుధయౌచు వారికి దీప్తినిచ్చె.
నిత్య సరిగంగ స్నానాలు నియతిజేసి
గరళకంఠుని దర్శింప క్రమముతోడ. కాశి
(భావము. కాశీవాసులు అనుదినము గంగలో స్నానమాడి విశ్వేశ్వరుని దర్శింప వారు తినిన గరళమంతయు పరమ అమృతముగా మారినది. పరమేశా మమ్ము కాపాడుము.)
80.భక్తి లేని మనుజుల దుర్భావనాళి
శివము లేనట్టి కాయాల శిరముగాదె?
భక్తి ముక్తికి సన్మార్గ పధము సుమ్ము. కాశి
(భావము. పరమేశా నీపై భక్తి లేనట్టి మనుషుల స్థితి శివము లేనట్టి శిరమే కదా! భక్తి ముక్తికి సరైన త్రోవ. పరమేశా మమ్ము కాపాడుము.)
81.దండపాణికి తోడుగా నుండు రెండు
శక్తులే ‘‘విభ్రమంబును, సంభ్రమంబు’’
విభ్రమము గూర్చి దుష్టుల వెడలగొట్టు
లేదు కాశి నుండగ రాత లేదటంచు. కాశి
(భావము. కాశీలో దండపాణికి సహాయకులుగా ‘‘విభ్రమము, సంభ్రమము అను రెండు శక్తులుండును. అవి దుష్ట భావాలు కల మానవులను అచట ఉండనీయవు. పరమేశా మమ్ము కాపాడుము.)
82.మూడు లోకాలలో వెల్గి ముచ్చటలర
మూడు కన్నులు గల్గి యపూర్వ యోగ
భిక్షను ప్రసాదించు నో భిక్షకుండ! కాశి
(భావము. మూడు కన్నులు కలిగి ముచ్చటగా మూడు లోకాలలో ప్రకాశించుచు నీవు భిక్షకుడవై మాకు యోగ భిక్షను ప్రసాదించెదవు. పరమేశా మమ్ము కాపాడుము.)
83.విష్ణు హృస్థ్తాన జనితము విమల శైవ
సంప్రదాయాన్విత పురము సకలలోక
దేవతా పద సంస్పర్శ దివ్య కాశి. కాశి
(భావము. కాశి విష్ణువు హృదయస్థానము. విమల శైవసంప్రదాయములకు నెలవు. సకల లోక దేవతా నిలయము. ఆ స్పర్శయే పరమ పావనము. పరమేశా మమ్ము కాపాడుము.)
84.ఈశ్వరుండొక నాడు నందీశు తోడ
నీ వెవరవన్న,తలవంచి నీవె నేను
నేనుగా లేనుగా అంత నీవె యనెను. కాశి
( భావము. ఈశ్వరుడొకనాడు నందితో ‘‘ నీవెవరవు? ’’అని ప్రశ్నింప ‘‘స్వామీ ! నీవే నేను . నేను ప్రత్యేకముగా లేను కదా. అంతయు నీవే’’ యనెను. పరమేశా మమ్ము కాపాడుము.)
85. నంది తాత్త్విక బుద్ఢి కానంద పడుచు
ఎచ్చటైన నుండు శివున కెదురుగాను
నీకె యర్హత కలదంచు నిర్ణయించె. కాశి
(భావము. శివుడు నంది తాత్త్విక బుద్ధికానందపడి ‘‘ నందీ నీవు ఎచటైనను ఎప్పుడైనను నాకెదురుగా నిలువగల అర్హత నీకే కలద’’ని పలికెను.పరమేశా మమ్ము కాపాడుము.)
86. నంది యద్వైత భావమే నరులుగూడ
ఆత్మ పరమాత్మ భావంపుటైక్యతలను
పాటి సేసిన నీశుండు పరవశించి
తాను సన్నిధి కల్పించి స్థానమిడును. కాశి
(భావము. ఓ పరమేశా! నంది అద్వైత భావమునే నరులు కూడ పాటించిన పరవశించి నీ కైలాసమున స్థానమిచ్చెదవు కదా! పరమేశా మమ్ము కాపాడుము.)
87. దక్షిణామూర్తి లక్ష్యంబు ధ్యాన ముద్ర
శాంతి సౌభాగ్యదంబైన సహన శక్తి
మౌనమొక్కటె మానవు మహితు జేయు. కాశి
(భావము. దక్షిణామూర్తి నిరంతరము ధ్యాన ముద్రలోనే యుండును. శాంతి సౌభాగ్యములను , సహనమును కలిగించునది మౌనమొక్కటే కదా! పరమేశా మమ్ము కాపాడుము.)
88.ధ్యాన మండపమున స్వామి తనరుచుండు
దక్షిణపు కుడ్యమందున ధ్యాని యగుచు
భక్తులెల్లరి మనములు పరవశింప. కాశి
(భావము. శ్రీ దక్షిణామూర్తి స్వామి ధ్యానమండపమున దక్షిణపు గోడలో ధ్యానిగా వెలసి భక్తుల కోర్కెలు తీర్చుచుండును. పరమేశా మమ్ము కాపాడుము.)
89. ‘‘ జైత్పురా హళే ’’ ప్రాంతాన సాలుకొక్క
మారు దర్శనంబిచ్చెడు మహిత మూర్తి
లీల ‘‘ కర్కోట నాగేశ లింగముండె. కాశి
(భావము. కాశీలో‘‘జైత్పురాహళే’’ ప్రాంతమున సాలుకొకసారి కనబడి భక్తుల కోర్కెలు దీర్చు ‘‘ కర్కోట నాగలింగమున్నది. పరమేశా మమ్ము కాపాడుము.)
90.నాగ పంచిమి రోజున భోగమగును
అచటి నాగేశు పూజులు హ్లాదమగును
శ్రద్ధ నిర్మించె వర పతంజలి మహర్షి. కాశి
(భావము. ఎంతో సంతోషముగా నాగ పంచమి రోజున నాగేశ్వరుని పూజలు చేయుదురు. ఈ నాగేశ్వరుని పతంజలి మహర్షి ప్రతిష్ఠించారు.. పరమేశా మమ్ము కాపాడుము.)
91.నాగకుండమునుండి పన్నగపు లోక
మునకు దారి కలదట, యపూర్వముగను
కాశి వైశిష్ఠ్యమంతయు కానగలమె? కాశి
(భావము. కాశీ లోని నాగకుండమునుండి నాగలోకమునకు దారి కలదని చెప్పుచుందురు. కాశీ గొప్పతనమును పొగడుట ఎవరి తరము కాదు. పరమేశా మమ్ము కాపాడుము.)
92.కాశి గంగలో స్నానాల ఘట్టమందు
ముందు మున్గిగియు సంకల్ప పుణ్య కర్మ
మాచమనమును జేయుచు నంజలించి. కాశి
(భావము. కాశీ గంగానదిలో స్నానము చేయుటకు ముందు ఏ ఘట్టమందైనను సంకల్పముచేసి తరువాత స్నానమాచరించుట సంప్రదాయము. పరమేశా మమ్ము కాపాడుము.)
93.పుణ్య నదులందు మునగక పూర్వమందె
స్నాన పానాలు పూర్తిగా సలుప వలయు
శుచియు శుభ్రత మనకెప్డు శోభగూర్చు. కాశి
(భావము. కాశీలోనే కాక ఏ పుణ్యనదిలో స్నానానికి ముందుగా శుచి కొరకు ఇంటి దగ్గర స్నానము చేయవలెను. పరమేశా మమ్ము కాపాడుము.)
94.దివ్యు లా ‘‘ మణికర్ణికన్’’ తీర్థమాడు
దు రట, అపరాహ్ణ వేళ సంతోషమొదవ
అందుచే నది ప్రఖ్యాతి నందుకొనియె. కాశి
(భావము. కాశీలోని గంగానదిలో మణికర్ణికా ఘాట్ నందు సరిగా మధ్యాహ్నము 12 గం. లకు దేవతలు స్నానములు చేయుదురట. ఆ సమయమున మనము స్నానము చేయుట మోక్షదాయకము. పరమేశా మమ్ము కాపాడుము.)
95.కలుష హారిణి గంగకు కనులపంట
గాగ హారతులిత్తురు గంటలేడు
నుండి, స్తోత్రముల్ పాడి వినోదమిడుచు. కాశి
(భావము. కాశీలో గంగాహారతి ప్రతి రోజు సాయంకాలమున 7 గం.లకు ప్రారంభమై అనేక స్తోత్రములతో కనులవిందుగా, వీనుల విందుగా నుండును. పరమేశా మమ్ము కాపాడుము.)
96.హారతుల్గాంచి భక్తి విహారులగుచు
ఘాటు లర్వది నాల్గును గాంచుకొఱకు
పడవ లందున విహరింత్రు భక్తజనులు. కాశి
(భావము. భక్త జనులు హారతులను చూచుచు పడవలలో మిగిలిన అరువది నాలుగు ఘాటులను ఆనందముతో చూతురు. పరమేశా మమ్ము కాపాడుము.)
97.గంగ కారతులిడునట్టి కాలమందె
వనిత లిడుదురు దీపాలు వరుసగట్టి
జ్ఞాన దీప్తులు తమకిల కలుగు కొఱకు. కాశి.
(భావము. గంగానదికి హారతులిచ్చు సమయమందే అచటనున్న స్త్రీలందరు కూడ హారతులనిత్తురు. అచట జ్ఞాన దీప్తులు కనులవిందొనరించును. పరమేశా మమ్ము కాపాడుము.)
98.నన్ను నా బంధు గణములన్ సన్నుతాంగ!
కరుణ నవరాత్రి దివసముల్ కాశిలోన
సుఖమునుండెడు రీతిని జూచుచుండి
నీదు దర్శనమిచ్చిన నీలకంఠ!
జన్మ జన్మల మరువను చంద్రభూష!. కాశి
(భావము. ఓ నీలకంఠా! నన్ను నా బంధుమిత్రులను నీ చెంత నవరాత్రలు సుఖముగా నుండునట్లు ఆశీర్వదించితివి. నీ కరుణను జన్మ జన్మలకు మరువను. పరమేశా మమ్ము కాపాడుము.)
99.అమ్మ అన్నపూర్ణమ్మ మా యనుగు తల్లి
జగము జీవుల క్షుత్తును సమయజేసి
సంతసంబును, సంతృప్తి, జ్ఞాన భిక్ష
నిడెడు కల్యాణి! మ్రొక్కెద నీప్సితముగ. కాశి
(భావము. మా ప్రియమైన తల్లి అన్నపూర్ణమ్మ ప్రపంచమందలి జీవరాసుల ఆకలితీర్చును. గౌరీదేవి జ్ఞాన భిక్షను పెట్టును.. పరమేశా మమ్ము కాపాడుము.)
100.శక్తి పీఠంపు స్థానమై సర్వమంగ
ళ యను పేరు సార్థకముగ లలితకలిత
పరమ కరుణాంత రంగవై వరలుచున్న
శ్రీ విశాలాక్షికి నతులు జేతు నెపుడు. కాశి.
(భావము. శక్తి పీఠపు స్ధానములో నున్న సర్వమంగళ పరమకరుణా మూర్తియై విశాలాక్షిగా ప్రసిద్ధిచెంది యున్నది. ఆమెకు నా నమస్సులు. పరమేశా మమ్ము కాపాడుము.)
101.కాశిలో నడుగులిడగ కరుణజూచి
తేటగీతుల నుతులను తేనెలొలుక
వ్రాయ నూతమిడు భవుని భక్త సులభు
పాదముల జేర్తు ‘‘ శతకంబు’’ భక్తిదనర. కాశి
(భావము. కాశీ లో అడుగుపెడుతుండగనే ఎంతో కరుణతో తేనెలొలుకు తేటగీతులను నేను వ్రాయుటకు శక్తినిచ్చిన భక్త సులభుడైన ఆ విశ్వేశ్వరునికి భక్తితో నీ శతకమును సమర్పింతును. పరమేశా మమ్ము కాపాడుము.)
102.అంకితంబిత్తు శతకంబు నంజలించి
స్తోత్రముల్ జేతు నిరతంబు శుభములీయ
మంగళారతులిత్తును మహితునకును. కాశి
(భావము. విశ్వేశ శతకమును స్తోత్రములు జేసి నమస్కరించుచు పరమేశ్వరునకు అంకితమిత్తును. పరమేశా మమ్ము కాపాడుము.)
103.వాసిగల్గిన కాశిలో వరములిచ్చి
నాదు మనమున ప్రేరణల్ పాదుకొల్పి
‘‘ కాశి విశ్వేశు శతకాన’’ కమ్మనైన
కథలు వ్రాయించుకొన్నట్టి జ్ఞానమూర్తి. కాశి
(భావము. పరమేశ్వరుడు కాశీలో నొక వరముగా నాకు ప్రేరణ కలిగించి ఆయన కమ్మనైన కథలను శతకముగా వ్రాయించుకొనినాడు. ఆయన జ్ఞానమూర్తి. పరమేశా మమ్ము కాపాడుము.)
104.ఎన్ని మారులు దర్శించి ,యెన్నిమార్లు
తాకి జోతలిడినగాని తగిన తృప్తి
కలుగదు, పరమ భక్తుల కన్నులకును
భక్తి పారవశ్యంబో? నీ ప్రణవ రూపొ?. కాశి
(భావము. ఓ విశ్వేశా నిన్ను ఎన్నిమారులు చూచినను, తాకి నమస్కరించినను తృప్తి తీరదు. దానికి కారణము భక్తుల పారవశ్యమా? లేక నా ప్రణవరూపమా? పరమేశా మమ్ము కాపాడుము.)
105.చూచినట్లుండవన్నియు చూతువెపుడు
వినినయట్లుండవన్నియు వినెదవెపుడు
సర్వ పాప పుణ్యాలకు సాక్షివీవె
నిన్ను మించిన నటులేరి? నిగమవినుత! కాశి
(భావము. పరమేశా నీవు చూచినట్టే యుండవు. కాని చూస్తావు. వినినట్టుండవు.. వింటావు. మా సర్వ పాప పుణ్యాలకు నీవే సాక్షివి. నిన్నుమించిన నటులు ఎచటను లేరు. పరమేశా మమ్ము కాపాడుము.)
106.పంచ క్రోశాల పరిథిని వాసముండి
భక్తి భావాల మనమది పండిపోయి
భర్గు నిరతంబు ధ్యానించు పావనుండు
కాలు మహిషుని గంటలు కనడు వినడు. కాశి
(భావము. ఈశా! కాశీలో పది మైళ్ల పరిధిలో నివసిస్తు నిరంతర భక్తి భావములతో నిన్ను ధ్యానించే భక్తులకు యమధర్మరాజు వాహనపు మెడలోని గంటల చప్పుడు వినపడదు. పరమేశా మమ్ము కాపాడుము.)
107.మాతృ గర్భాన జీవులు మనిన యట్లు
ఫలము లభియించునందురు పండితాళి
జీవనముజేయ కాశిలో చేరు భవుని. కాశి
(భావము. ఈశా! కాశీలో నవరాత్రులు భక్తితత్త్వముతోనున్న మాతృగర్భములో నవ మాసములున్న ఫలితముతో మరల జన్మ ఉండదని శాస్త్రములు చెప్పుచున్నవి. పరమేశా మమ్ము కాపాడుము.)
108.అన్నదానంపు సత్రాల నాదరాన
కాశిలో నుంచి భక్తుల కడుపునింపి
అన్నపూర్ణమ్మ హర్షించు ననవరతము. కాశి.
(భావము. ఈశా! కాశీలో అన్నపూర్ణమ్మ తృప్తిచెందునట్టుగా అనేక అన్నదాన సత్రములు వెలసినవి. వారికి అన్నపూర్ణ, గౌరీదేవుల ఆశీస్సులు లభించును.పరమేశా మమ్ము కాపాడుము.)
పరమేశ్వరార్పణమస్తు! మంగళమ్ మహత్!!