కార్యసిద్ధి.
"మనసు ఆలోచనల పుట్ట, భావాల గుట్ట, నిలకడలేని పాపపుణ్యాల
మిట్ట". ఆలోచనలు మానవుని పురోభివృద్ధికి, తిరోగమనానికి నూటికి
నూరుపాళ్లు దోహదం చేస్తాయి. ఎవరి ఆలోచన(మంచి,చెడ్డ) స్పష్టమైన
లక్ష్యం కలిగియుండి తత్సాధన కొఱకు నిరంతరతపస్సు చేస్తుంటుందో, నెరవేరినట్లు కలలు కంటుందో ఆ కల కొంచెమాలస్యంగా నైనా తప్పక సిద్ధిస్తుంది. ఇది తథ్యం తథ్యం తథ్యం అని నా అంతరాత్మ చెబుతున్నది.
విషయాలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఆథ్యాత్మికం కావచ్చు,
లౌకికం కావచ్చు. నాకు చదరంగం వచ్చీరాని రోజులలో తెనాలి పుస్తకాల
షాపులో (షుమారు 1972సం.లో) ఆరుద్రగారు వ్రాసిన "చదరంగం" అనే
పుస్తకం కొనాలనే కోరిక ఉండేది. పుస్తకం ఖరీదు రు.50లు. కోరిక బలంగా
ఉన్నా ఆర్ధిక బలహీనత. కాని కోరికను చావనీయక తపనపడటం వలన
అది నా పెద్ద బావమరదికొడుకుల వలన నెరవేరింది. పెద్దవాడు గంగరాజు
సుధాకర్, రెండవవాడు మురళీకృష్ణ. పెద్దవాడికే నేను చదరంగం ఎలా
ఆడాలో నేర్పించాను. క్రమేణ వాడు కొంత కృషితో అభివృద్ధి చెంది,
తమ్మునకు నేర్పాడు. ఇద్దరు నిరంతర అద్వితీయ కృషితో చదరంగ
నిపుణులు, శిక్షకులుగా మారారు. ఒకనాటి వారి సలహా సంప్రదింపులతో
(విజయవాడ చదరంగంసంస్థ సహకారంతో) నేను పనిచేస్తున్న "ధూళిపూడి"
తడవర్తిబాపయ్యఉన్నత పాఠశాలలో కొందరు విద్యార్థులకు చదరంగంపై
ఆసక్తి కలిగించి, తగిన పద్ధతిలో శిక్షణనిచ్చి పోటీలు నిర్వహించి విజేతలకు చదరంగం బోర్డు, బలగాలను, ఆరుద్రగారి పుస్తకాలను బహుమతులుగా అందరికి పంచాము. మరి నా స్థిరసంకల్పమే ఆలస్యంగానయినా ఫలితాన్ని
ఇచ్చింది. ఇది సత్యం. ఆనాటి ఆనందం అనిర్వచనీయం.
శ్రీమద్వాల్మీకి రామాయణమును ఆంధ్రానువాదం చేయాలనే తపన.
కవియైన ప్రతి ఒక్కరికి తప్పక ఈ కోరిక ఉండి తీరుతుంది. నేను పెద్ద కవిని
కాకున్నను నాకు కలిగింది. కాని నా దగ్గర రామాయణ మూలగ్రంథాలు లేవు.
ఎలాగా?అని తీవ్రాలోచనలోఉండగా మహామహోపాథ్యాయులు, శతావధాని,
అపర సరస్వతీ మూర్తులుకలియుగవాల్మీకి యైన "కీ.శే తాడేపల్లి రాఘవ
నారాయణ శాస్త్రివర్యుల మనుమడు, బహు గ్రంథకర్త నాకత్యంత ప్రియతమ
మిత్రుడైన తూములూరి దక్షిణామూర్తి శాస్త్రి మాయింటికి వచ్చారు తన పనిమీద అసంకల్పితంగా. నా కోరిక తెలియపరచాను. వెంటనే వెంట
తీసికొని వెళ్ళి నాకు శ్రీమద్వాల్మీకి రామాయణం వ్యాఖ్యాసహితమైన 7కాండలుగల మూడు గ్రంథములనిచ్చి నిర్విఘ్నంగా రచన చేయుమని అభినందన పూర్వకంగా చెప్పారు. చక్కగా నా సహాధ్యాయుని సహాలతో,
నా శ్రీమతి సహకారంతో చిన్నపాటి కృషితో "సూర్య శ్రీరామం"పేర వచన
రచన సాగుచున్నది. "శ్రేయాంశి బహువిఘ్నాని" అని ఒక మహాకవి యనినట్లు నాకు యాక్సిడెంట్, తుంటివిరిగి, బంతిగిన్నెలో బంతి పగిలిపోయి హాస్పిటల్ పాలు. అనువాదం యుద్ధకాండ దగ్గరే ఆగిపోయింది. "రామాయణం సంపూర్ణం
కాకుండా నన్ను తీసికొని వెళ్ళవద్దు రామా! " అను నా ప్రార్ధనా పూర్వక సంకల్పం ఫలించింది. శ్రీరామ కృపతో వేదప్రకాశ్ గారి ద్వారా ఆంజనేయుని
గద వంటి స్టీలు రాడ్ వేయించుకొని ఒక్క 10రోజులలో యుద్ధకాండ
రచనకు సిద్ధమై కడ వఱకు అనగా 7 కాండములను తెనిగించే భాగ్యాన్ని పొందాను. నేను నా శ్రీమతి తెలుగు టైపు చేసి దానిని పి.డి.యఫ్. రూపంలో ఉంచాము. ఇది నా దృఢ సంకల్పం కాదు. వజ్ర సంకల్పం. అందుకే నెరవేరిందని నా ప్రగాఢ విశ్వాసం. ఇంకను అది గ్రంథరూపం సంతరించుకోలేదు. బహుశః త్వరలో కావచ్చు.
" ఈశ్వరో అభిషేక ప్రియః, విష్ణో రలంకార ప్రియః,భాస్కరో నమస్కార
ప్రియః, బ్రాహ్మణో బహుజన ప్రియః (భోజన ప్రియః కాదు)అందుకే నేను
కాశీ ప్రయాణానికి ముందు "గంగాజలంతో నిత్యం శివునకభిషేకం చేస్తే
ఎంత బాగుంటుంది? "అని ఆలోచన కలిగి, నా చేతులతో ప్రతిరోజు
అభిషేకం ఎలాగు చేయటం సాధ్యంకాదు. మార్గాంతరం ఉన్నదా? అని ఆలోచిస్తూ ఉండగా కొన్ని వీడియోలు యూ ట్యూబ్ లో చూచాను. మీకు
ముందుగనే తెలిపాను "దేనిని గురించి నిరంతరం తపనగా ఆలోచిస్తామో
అదే తపస్సు అవుతుంది. వాల్మీకి రామాయణంలో వివిధ రకాల తపస్సులు
వివరింప బడ్డాయి. నిరంతర ధ్యాన మననాదులు కూడ తపస్సేనట.
ఒక చిన్న విద్యుత్ పంపింగ్ మిషను సహాయంతో పైనుండి గంగాజలం
పడునట్లు, దాని క్రింద శివలింగం ఉండునట్లు చేస్తే గంగాజలంతో నిరంతర నిత్య ఈశ్వరాభిషేకేచ్ఛ నెరవేరుతుంది. శంకరుడు భక్త వశంకరుడు.
బోళాశంకరుడు. నిర్మల నిశ్చల భక్తితో ఎలా పూజించినా ఆ పూజలను
అమితానందంతో స్వీకరించి ఆశీర్వదిస్తాడనేది మహర్షులు, కవులు చెప్పిన
మాటే. ధూర్జటి కవి " ఎవరైతే ఇన్ని నీళ్ళు పోసి, ఒక్క మారేడు దళమును
తెలిసి కాని తెలియక కాని వేస్తారో, వారికి పరమేశ్వరుడు ఇంట కట్టి వేసిన కామధేనువు"అంటాడు. పూజకు భక్తి ముఖ్యం కాని ఆడంబరాలు కాదుకదా? అందుకే నేను కూడ విద్యుత్ పంపు సహాయంతో శివయ్యకు అభిషేకం జరిగే ప్రయత్నం చేశాను. చేతిలో డబ్బు ఉన్నా తగిన సమయం లేక ఇప్పటి వరకు
ఆలస్యమై ఈనాటికి ఈ చిన్న కోరిక నెరవేరింది. ఈ సోది, సుత్తి మీ కెందుకు చెబుతున్నానంటే కొన్ని సమయాలలో కోరికలు డబ్బులు లేక ఆలస్యంగా నెరవేరుతవి. మరి కొన్ని సమయాలలో తగిన దృఢ సంకల్పం లేక , మరల
దృఢత్వం సంతరించుకొన్నాక నెరవేరుతవి.
"మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, నిరాడంబర జీవి, అబ్దుల్ కలామ్ గారు
ఒక మాట చెప్పారు. దానిని మనందరం పాటిస్తే వారిలాగా మనం కూడ
లక్ష్యసాధనా పరులము కావచ్చు." ఇంతకు ఆయన చెప్పినదేమిటి? నీ
లక్ష్యాన్నినిరంతరం కలగనమన్నాడు. నీవు పడే తపనే స్థిరమై తపస్సుగా
మారి లక్ష్యనిర్దేశ మార్గాలను చూపుతుంది. ఈవిషయం గురించే అనేకుల అనుభవసారాలను ఉట్టంకిస్తూ ఒక ఆంగ్ల కవయిత్రి (The Secrect, By Rhonda Byrne) పుస్తకం వ్రాసింది. అది ప్రతిఒక్కరు ఒక్కసారైనా చదివి
తీరవలసిన పుస్తకము. తెలుగు భాషలో కూడ ఉన్నది. నేను చదివి ప్రభావితుడినైనాను.