23, మార్చి 2024, శనివారం

శ్రీరామ తత్త్వం.

 శ్రీరామ తత్త్వం.

శరణు గోరిన బద్ధ శత్రువునైనను

               కాపాడి తీరెడు ఘనుడెవండు?

ధర్మంబె జెప్పుచున్ దానవి పాటించి

             ఆదర్శమూర్తియై యలరెనెవడు?

పితృవాక్పాలనన్ ప్రియమారపాటించి

      తండ్రి మాటనుగాచు తనయుడెవడు?

స్త్రీ జాతి నెల్లరన్ శ్రీ మాతృ మూర్తిగా

            భావించి ప్రేమించు భవ్యుడెవడు?

కష్టసు ఖాలెల్ల కాలప్రభావమన్

            సూక్ష్మంబు నెఱిగిన శూరుడెవడు?

మునిమానసంబుల ముద్దుగా నెలకొని

                  పద్మస్థితుండైన ప్రభువెవండు?

ఆగ్రహించినవేళ నఖిల లోకంబుల

             నంతంబు గావించు నార్యుడెవడు?

స్నేహాంతరంగుడై చిరుకాన్క కౌగిలిన్

                        చిరజీవి కిచ్చిన శ్రేష్ఠుడెవడు?

పూర్ణచంద్రుపగిది పున్నమి వెన్నెలల్

మోముపైన జిలుకు మోహనుండు

రాముడొకడె సూ ప రాక్రమవిక్రమ

సూర్యవంశభవుడు సుందరుండు.

పెండ్లి ఆశీస్సులు

 కల్యాణ వాణి...అనూరాధ కుమార్తె.

వధువు:చి.ల.సౌ.ఉజ్జ్వల. వరుడు:చి.వినయ్మణికంఠ రాజా.

సుముహూర్తము: ది.24.03.2024. ఉ.8.03.ని.లకు.

వధూవరులారా!

శ్రీ రఘురాము సత్కృపను శేముషినందుడు మీరలిర్వురున్

సారవిశేష సంసరణ సౌఖ్యములందనివార నందుచున్

కూరిమిబెంచుకొంచు సుమకోమల భావ సమాశ్రయంబునన్

భూరి మహోజ్జ్వల స్థితియె భూషణమైచెలగంగ వంశమున్.1.

      "వినయమణికంఠు"డెందాన విజయకేత

       నంబెగురవేయు"ముజ్జ్వల!" నవ్యరీతి

       భావి సంసార జీవిత పథమదంత

       మూడుపూలారు కాయలై మోదమలరు.2.

పచ్చని మండపాన కడుపావన వేదవిశేష ఘోషలో

నచ్చిన "రాజు"నీ మెడను నాణెపుసూత్రము గట్టుచుండగా

హెచ్చిన రాగభావముల హేలగ పండితదీవనాళిలో

మెచ్చగ బంధువర్గమిట మీరలుసాగుడు జీవనమ్మునన్.3.

         రెండు వంశాల కీర్తులు పండునటుల

         మూడు ముడులున్న బంధాన ముచ్చటలర

         నాల్గు వేదాల సాక్షిగా నవ్యశోభ

         పంచప్రాణాల నొక్కటై పరగుడయ్య!.4

వంశ వృక్షంబు చిగురించి వైభవముగ

ఫలములీయగ మీరలు తలచినటుల

పూర్ణ సంసారజీవిక మోదమగుచు

శతవసంతాలు భద్రాన సాగగలరు.5.

 వధువు.                                             వరుడు

    చి.ల.సౌ. సాయిహర్షిణి.            చి. యశ్వంత్ భరద్వాజ్. 
     ముహూర్తము. ది.22.02.2023.(బుధవారం) 
     రాత్రి గం. 3.21.ని.లకు. తెల్లవారితే గురువారం. 

               శ్రీలకు నాలవాలమగు చిన్మయు శ్రీరఘు రామువేడినన్
               వేలకు వేలపున్నెములు వేగ లభించి మనోహరంబగున్
               జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
               వ్రాలుమ "సాయిహర్షిణి " సభర్తృక వై సుఖభోగలబ్ధికై.1.

        యాబలూరి వంశ అనురాగవల్లికి
        కొమ్మమూరివంశ కొమరునకును
        బంధనమ్ముగూర్చె వాణీధవుండట
        సప్తపదులు వేయ సౌఖ్యమలర.2.

        క్షీర నీరాల పగిదిని చెలువమీర
        శబ్దమర్ధాల పోలిక సారమలర
        మీరలిరువురు ఒక్కటై మించుప్రేమ
        వంశ సత్కీర్తి నిల్పుడు వైభవముగ. 3. 

        వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
        దీవనాదులు ఫలియించి దివ్యఫలము
        సంతురూపాన బొందుడో సౌమ్యులార!
        వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.4.

        గౌతమసగోత్ర సంజాత ఘనచరిత్ర!
        భర్తృ వంశంపు శాఖలు పల్లవింప
        అరుగుచుండెను డెందంబు హ్లాదమొదవ.
        చేరి యాశీర్వ దింపుడో శిష్ఠులార!5.

         ధార్మికంబైన జీవన తత్త్వమెపుడు 
         భావి సౌభాగ్యదమ్మను భావమలర
         మీకు సతతంబు సంఘాన మేలుకలుగు
         రాము పరివార సత్కృపా రశ్మివలన.6. 
  
         పచ్చ పచ్చని యక్షతల్ పైనబడగ
         వెచ్చ వెచ్చని యుచ్ఛ్వాస వెలువరించు
         మచ్చెకంటికి వరునకు మాధవుండు
         రక్షగూర్చుత యిల ననురాగమలర. 7. 
      
            వరుడు.                                                  వధువు
    చి. గంగరాజు శ్రీకాంతు.                   చి.ల.సౌ.సాయిసుధ.
       ముహూర్తము.6.12.19.(శుక్రవారం)ఉ.10.10.లకు.

        శ్రీలకు నాలవాలమగు చిత్తము శ్రీరఘు రామువేడినన్
        వేలకు వేలపాపములు వేగ నశించు స్మరించుమాత్రనన్
        జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
        వ్రాలుడు దంపతుల్ సతము భవ్యసుఖార్ధులరైచరింపగన్.
               "సాయిసుధ"తోడ ననురాగ సరళిమెలగి
                జీవితాంతము "శ్రీకాంత!"చెలిమిమీర
                భోగభాగ్యాలదేలెడు యోగమంద
                గోరెద సతము శ్రీరాముకూర్మిదయను.
       క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
       మేళవింపు "సుధానాథ!"మేలుజరుగు
       ధర్మదాంపత్యజీవన మర్మమెల్ల
       కన్నులెదుటనె కన్పడు క్రమముగాను.
                 వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
                 దీవనాదులు ఫలియించి దివ్యఫలము
                 సంతురూపాన బొందుడో సౌమ్యులార!
                 వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.
       గంగరాజు వంశ ఘనమైన కీర్తిని
       నిల్పుమయ్య నీవు నేర్పుమీర
       తల్లి దండ్రులిలను తపియింత్రు దానికై
       తీర్చుమోయి దాని తీయగాను.
       

                                         నూతి పాణి కుమార్తె.                                      
           వధువు.                       ముహూర్తము:                     వరుడు
     చి.ల.సౌ.రాజావేదవతి. ది.9.12.2020.ఉ.10.01.చి.అనంతకృష్ణతేజ. 
               శ్రీలకు నాలవాలమగు చిన్మయు శ్రీరఘు రామువేడినన్
               వేలకు వేలపాపములు వేగ నశించు స్మరించుమాత్రనన్
               జాలము సేయకన్ కరుణ చక్కగజూపెడు దైవసన్నిధిన్
               వ్రాలుడు దంపతుల్ సతము భవ్యసుఖార్ధులరై చరింపగన్.1.
     "వేదవతి"జూపు విస్తృత ప్రేమవలన
     "కృష్ణతేజమ!" యనురాగ వృష్టిదడిసి
      భోగభాగ్యాలదేలగ యోగమంద
      గోరెద సతము శ్రీరాముకూర్మిదనర.2.
                క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
               "వేదవతికృష్ణతేజ"లు విస్మయముగ
               ధర్మదాంపత్యజీవన మర్మమెరిగి
               కలుపుకొనినను సంఘాన ఖ్యాతి పెరుగు.3.
       వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
       దీవనాదులు ఫలియించి దివ్యఫలము
       సంతురూపాన బొందుడో సౌమ్యులార!
       వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.4.
                త్యాగ సంభావ్య సౌశీల్య ధర్మమంత
                వేదవతిగను నీచెంత వెలుగు చుండె
                కంటి వెల్గుగ ఇరువంశ కాంక్షలన్ని
                తీర్చి చూపించుమోయమ్మ! తేజమలర.5.
           

చిరంజీవి హర్షిణి, వెంకటసత్యసాయి ప్రదీప్ లకు
                      వైవాహిక శుభ  ఆశీరక్షతలు
                             
            సుముహూర్తం.ది.4.11.2018.రా.3.58.లకు.
          వేదిక:    ఆర్యవైశ్య కల్యాణ మండపము.       అద్దంకి.

  1. సత్యముధర్మమున్ మరియు సౌమ్య దయార్ద్ర పునీతతత్త్వమే
      నిత్యముశ్రేయమిచ్చునను నీమములన్ గణియించి చెప్పుచున్
      భృత్యులమానసాంబుధిని ప్రీతిని గెల్చెడి"సాయినాథుడే"
      అత్యమలంపు మూర్తులగు"హర్షిణి, సాయిల"కాచుగావుతన్.
   
2.  పచ్చని మండపాన ఘన పండిత వేద స్వరాలఘోషలో
      మెచ్చిన బంధుమిత్రుల యమేయపు సాదర లాలనంబునన్
      స్వచ్ఛపు మానసాన కలశంబున నున్న సుగంగ కైవడిన్
      అచ్చపు ప్రేమపాత్రముగ "హర్షిణి"తోడుత వెల్గుమెప్పుడున్. 

           3.జీవితంబున పెనుమార్పుచేరెనిపుడు,
               వియ్యమనియెడు రూపానవింతగాక
               మమత నిండిన మనసులె మరులుగొల్ప
               వంశవృక్షంపు శాఖలే వరలుచుండు.

            4.అర్హతలతోడ నిర్వురియందు జూడ
               ఒక్కటయ్యెను భావాలు చక్కగాను
               మక్కువెయ్యెడ సతతంబు మరలనీక
               అక్కజంబగు సంతునునందుడయ్య!

            5.తల్లిదండ్రులచిత్తాలు తనివిదీర
               ప్రేమ పండించి నిండించి ప్రియముమీర
              "వే వసంతాలు" ముదమందు విందుతోడ
               మనుడు "పరమేశు దీవనన్" మహితకీర్తి.

                          మంజు కి నిశ్చయ తాంబూలాలు 
                                                              ఆశీస్సులు 
1. తేగీ.  నిశ్చయంబును పల్కిరి యెల్లవారు,అస్తుఅస్తంచు పల్కిరి అమృత ఝరిగ .       
             భావి జీవన సౌఖ్యాలు ప్రభలు నిండ , మనుమ మంజీర విభునితో మహిని నెపుదు. 

2. తే గీ . శుభము శుభమస్తు శుభమస్తు సురుచిరంబు, మంగళంబౌను మామక మానితులకు,
             భావి దాంపత్య సౌఖ్యంబు ఫలితమంది, శ్రీలు గురియును మంజీర చెలునికెపుడు. 
3.తే గీ.   కనులపండువు యగునట్లు కమలనాభు , కృపను మీరెప్దు వృద్ధియై కీర్తినంది,
             మించు సౌభాగ్య సిరులెల్ల మేదినంది, వారలు గావుత ఈ జంట వైభవముగ.  
                                                   పొన్నెకంటి సూర్యనారాయణ రావు . 
అమ్మా, లక్ష్మీ గాయత్రీ!

శ్రీరఘురాము సత్కృపను చిన్మయి భూమిజ రాగమాధురిన్
పేరిమిబంధమేర్పడుచు పెండిలికిన్ రహదారియైచనెన్
నేరుగ కీర్తికాంతుడగు నీ"కిరణున్" హృది జేరుమాయికన్
కోరినకోర్కులెల్ల యొనగూడి శుభంబులు నీకగున్ సదా.1.

ధర్మ బద్ధమైన దాంపత్యజీవిక
భారతీయులకిది పరమవరము
వంశగౌరవంబు వర్ధిల్ల చరియింప
శ్రీలు జేరుమీకు క్షేమమగును.2.

వేదమంత్రాలసారమ్ము విజ్ఞతముల
దీవనాదులు ఫలియించి దివ్యఫలము
సంతురూపాన బొందుడో సౌమ్యులార!
వంశవృక్షంపుచివురులు పరిఢవిల్ల.3.

క్షీరనీరమ్ము పగిదిని చిత్తములను
పదము లందున సద్భావ పథమునెంచి
ధర్మదాంపత్యజీవన మర్మమెరిగి
హాయి మనుడమ్మ సతతంబు రేయిపగలు.4.

తల్లిదండ్రులచిత్తాలు తనివిదీర
ప్రేమ పండించి నిండించి ప్రియముమీర
"వే వసంతాలు" ముదమందు విందుతోడ
మనుడు "పరమేశు దీవనన్" మహితకీర్తి.5.

 భాగ్యనగరం.                   శుభాశీస్సులతో...
 మల్కాజిగిరి.    పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
 9866675770. భాషాప్రవీణ, ఎం.ఏ., తెలుగు.




                                  

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...