పి.యస్.యన్. పద్యాలు.
వృద్ధాప్యం - కష్ట సుఖాలు.
1. ఉ . కన్నులచూపు మందమయి కాయము శక్తివిహీనమై చనన్
దన్నును గోరుచున్న తలిదండ్రులు నిత్యపు జీవనంబునన్
వెన్నును గాచి యుండక నవీన విదేశపు డాలరొక్కటే
యున్నతమంచునెంచి సుతులుద్ధతి చాటుట గారవంబొకో !
2. తే.గీ . చిన్నతనమున కొడుకుల జేయిపట్టి
జగతి బ్రతుకంగ దగినట్టి జ్ఞానమిడిన
. నాన్న మోమున చిరునవ్వు చిన్నవోయె
కన్ననేరంబు నిరతంబు కలచుచుండె.
3. తే. గీ . పుత్ర జననంబు స్వర్గంపు మూలమనుచు
తలచు తలిదండ్రులకు పరితాప మిళిత
జీవితంబెల్ల భారమైపోవుచుండ
ధర్మదూరుడు తనయుండు దరికిరాడు.
4. కం . వృద్ధాప్యంబున బిడ్డలు
శ్రద్ధాసక్తిన్ విశేష సౌఖ్యం బీయ
. న్నిద్ధాత్రి వారి మీరిన
సిద్ధాత్ముల జూడగలమె శ్రీరఘురామా !
5. సీ . మీరటులొంటరై మితిమీరుకష్టాల
పడవద్దురమ్మంచు పజ్జజేర్చి
ఆస్థులనమ్మించి అనునయ మొప్పార
నేజూతుమిమ్మంచు నియతిబల్కి
సిరులెల్ల తనచెంత జేరినవెంటనే
శరణాలయంబున జక్కఁజేర్చి
అమెరికా మున్నగు నన్యదేశాలకు
కులుకుచు పరుగిడు కొడుకులున్న
తే. గీ . తల్లి దండ్రుల దుర్గతుల్ తలపనేల
మానసికమైన క్షోభకు మారు పేరు
కష్ట నష్టాల కడలికి కాపువారు
కలలు చెదిరిన దీనులు కన్నవారు
6. ఉ. వేయికి నొక్కరిద్దరటు వేరుగ పుత్రులు కల్గవచ్చులే
స్థాయికిమించు యోచనలు సల్పక తల్లినితండ్రిసద్గురున్
పాయక ప్రేమ జూచుచును భక్తివిశేష సమాదరంబుచే
తోయజనాభు సత్కృపను తోరముగా నిల బొందు సన్మతుల్
జె.జె.యస్.పద్యాలు.
జె.జె.యస్. పద్యాలు.
1.చదువ వ్రాయనేర్పి సన్మార్గమున్జూపి
సంఘమందు మెలగు సరళిదెల్పి
జ్ఞాననేత్రమొసగి కాపాడుచుండెడి
విద్యనేర్చు నతడు విజ్ఞుడగును.
2. చదువె విద్యావినయముల సాధకంబు
గురులె దైవాలు చదువులగుడులె బడులు
నీతినియమాలు నేర్వంగ నెలవులగుచు
కామితమ్ములుదీర్చు సర్కారు బడులు.
3. పల్లెప్రాంతమునుండి బడిజేరువారికై
బస్సుసౌకర్యముల్ లెస్సగూర్చు
తరతమభావాలు దరిజేరనీయక
ఏకరూపమయిన వేషమొసగు
చదువులు నేర్వంగ చక్కగా పుస్తకాల్
ఉచితమ్ముగానిచ్చు నుచితరీతి
మధ్యాహ్నవేళలన్ మరలిపోనీయక
పౌష్టికాహారాన తుష్టిగూర్చు
ఇట్టి బహుళార్ధదములందు బట్టువిడక
చదివి సంస్కారయుతులౌచు సాగిపొండు
తాతతండ్రులు చదివిన తావు విడచి
పుట్టగొడుగులవలె నేడు పుట్టుచున్న
వివిధ సంస్థలజేరంగ వెఱ్ఱితనము
చేరరారండు! మీరు సర్కారు బడుల.
4. ప్రభుత నడిపెడి సర్కారు బడులజదువ
బడయనగు సీటు గురుకుల పాఠశాల
యందు,వాస్తవంబిదిగాన ఆదినుండి
చేరరారండు!మీరు సర్కారు బడుల.
5. చక్కగనాడుకోదగ విశాల మనోహర ప్రాంగణమ్మునన్
రొక్కము కోరకుండగ పురోగతిజూపెడి విద్యబొందగా
చక్కని బోధనాపటిమ జాటు సుశిక్షితదేశికాళితో
పెక్కుగనిల్చె నీ ప్రభుత విద్యల నేర్వుడు పాఠశాలలన్
వృద్ధాప్యం - కష్ట సుఖాలు.
1. ఉ . కన్నులచూపు మందమయి కాయము శక్తివిహీనమై చనన్
దన్నును గోరుచున్న తలిదండ్రులు నిత్యపు జీవనంబునన్
వెన్నును గాచి యుండక నవీన విదేశపు డాలరొక్కటే
యున్నతమంచునెంచి సుతులుద్ధతి చాటుట గారవంబొకో !
2. తే.గీ . చిన్నతనమున కొడుకుల జేయిపట్టి
జగతి బ్రతుకంగ దగినట్టి జ్ఞానమిడిన
. నాన్న మోమున చిరునవ్వు చిన్నవోయె
కన్ననేరంబు నిరతంబు కలచుచుండె.
3. తే. గీ . పుత్ర జననంబు స్వర్గంపు మూలమనుచు
తలచు తలిదండ్రులకు పరితాప మిళిత
జీవితంబెల్ల భారమైపోవుచుండ
ధర్మదూరుడు తనయుండు దరికిరాడు.
4. కం . వృద్ధాప్యంబున బిడ్డలు
శ్రద్ధాసక్తిన్ విశేష సౌఖ్యం బీయ
. న్నిద్ధాత్రి వారి మీరిన
సిద్ధాత్ముల జూడగలమె శ్రీరఘురామా !
5. సీ . మీరటులొంటరై మితిమీరుకష్టాల
పడవద్దురమ్మంచు పజ్జజేర్చి
ఆస్థులనమ్మించి అనునయ మొప్పార
నేజూతుమిమ్మంచు నియతిబల్కి
సిరులెల్ల తనచెంత జేరినవెంటనే
శరణాలయంబున జక్కఁజేర్చి
అమెరికా మున్నగు నన్యదేశాలకు
కులుకుచు పరుగిడు కొడుకులున్న
తే. గీ . తల్లి దండ్రుల దుర్గతుల్ తలపనేల
మానసికమైన క్షోభకు మారు పేరు
కష్ట నష్టాల కడలికి కాపువారు
కలలు చెదిరిన దీనులు కన్నవారు
6. ఉ. వేయికి నొక్కరిద్దరటు వేరుగ పుత్రులు కల్గవచ్చులే
స్థాయికిమించు యోచనలు సల్పక తల్లినితండ్రిసద్గురున్
పాయక ప్రేమ జూచుచును భక్తివిశేష సమాదరంబుచే
తోయజనాభు సత్కృపను తోరముగా నిల బొందు సన్మతుల్
జె.జె.యస్.పద్యాలు.
జె.జె.యస్. పద్యాలు.
1.చదువ వ్రాయనేర్పి సన్మార్గమున్జూపి
సంఘమందు మెలగు సరళిదెల్పి
జ్ఞాననేత్రమొసగి కాపాడుచుండెడి
విద్యనేర్చు నతడు విజ్ఞుడగును.
2. చదువె విద్యావినయముల సాధకంబు
గురులె దైవాలు చదువులగుడులె బడులు
నీతినియమాలు నేర్వంగ నెలవులగుచు
కామితమ్ములుదీర్చు సర్కారు బడులు.
3. పల్లెప్రాంతమునుండి బడిజేరువారికై
బస్సుసౌకర్యముల్ లెస్సగూర్చు
తరతమభావాలు దరిజేరనీయక
ఏకరూపమయిన వేషమొసగు
చదువులు నేర్వంగ చక్కగా పుస్తకాల్
ఉచితమ్ముగానిచ్చు నుచితరీతి
మధ్యాహ్నవేళలన్ మరలిపోనీయక
పౌష్టికాహారాన తుష్టిగూర్చు
ఇట్టి బహుళార్ధదములందు బట్టువిడక
చదివి సంస్కారయుతులౌచు సాగిపొండు
తాతతండ్రులు చదివిన తావు విడచి
పుట్టగొడుగులవలె నేడు పుట్టుచున్న
వివిధ సంస్థలజేరంగ వెఱ్ఱితనము
చేరరారండు! మీరు సర్కారు బడుల.
4. ప్రభుత నడిపెడి సర్కారు బడులజదువ
బడయనగు సీటు గురుకుల పాఠశాల
యందు,వాస్తవంబిదిగాన ఆదినుండి
చేరరారండు!మీరు సర్కారు బడుల.
5. చక్కగనాడుకోదగ విశాల మనోహర ప్రాంగణమ్మునన్
రొక్కము కోరకుండగ పురోగతిజూపెడి విద్యబొందగా
చక్కని బోధనాపటిమ జాటు సుశిక్షితదేశికాళితో
పెక్కుగనిల్చె నీ ప్రభుత విద్యల నేర్వుడు పాఠశాలలన్